Saturday 6 September 2014

వీక్షణం సాహితీ గవాక్షం - 24(Aug,10-2014)

వీక్షణం సాహితీ గవాక్షం - 24
 


   
ఈ నెల 'వీక్షణం' సమావేశం ఆగస్ట్ 10న ఫ్రీమాంట్ లోని వంశీ ప్రఖ్య గారి ఇంట్లో జరిగింది. ముఖ్య అతిథులు డా.గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు , డా. కాత్యాయనీ విద్మహే గారు. సభాధ్యక్షులు ప్రసిద్ధ రచయిత , సాంకేతిక పరిభాషా తెలుగు పదకోశ కర్త శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు . లక్ష్మీనారాయణ గారు ద్రవీడియన్ తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ వైస్ ఛాన్స్లర్ . ఆధునిక క్లాసిక్ గా పేరు పొందిన యస్ .ఎల్. భైరప్ప గారి కన్నడ నవల 'పూర్వ' ను తెలుగు లోకి అనువదించి 2004 లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య బోధనా రంగాలలో దీర్ఘ కాల విశిష్ట సేవలను అందించి, సమీక్షా సాహిత్యానికి కొత్త స్ఫూర్తిని ఆవిష్కరించిన విద్యావేత్త .
కాత్యాయనీ విద్మహే గారు జగమెరిగిన స్త్రీవాదమూర్తి. స్త్రీవాద సాహిత్య విమర్శనా రంగంలో అగ్రగామి. వీరి 'సాహిత్యాకాశంలో సగం' విమర్శనా గ్రంధానికి 2013 కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ప్రాంతీయ సాహిత్య చైతన్యాన్ని నిష్పక్షపాతంగా వెలుగులోకి తెచ్చిన తెలంగాణవాది.
వంశీ ప్రఖ్య గారి ఆత్మీయ వాక్కుల అనంతరం అధ్యక్షుల వారి ఆహ్వానం. ప్రతిష్టాత్మకమైన కేంద్రసాహిత్య అకాడెమీ సాహిత్యకారులు ఇద్దరూ ఇలా ఈ సమావేశాన్ని అలంకరించడం అరుదైన అదృష్టం అంటూ వారిని అధ్యక్షులు అభినందించడం హర్షదాయకం.
మొదట లక్ష్మీ నారాయణ గారు 'తెలుగు సాహిత్యం - తులనాత్మక విశ్లేషణ' అంశం పై ప్రసంగించారు. సాహిత్య పరిశోధన అంత తేలికగా నలిగేది కాదనీ, జవం జీవం ఉట్టిపడే సాహిత్య పరిశోధనకు సరైన న్యాయం జరగాలంటే శ్రమించాల్సి ఉంటుందనీ, సాహిత్యం ఎదిగినంతగా పరిశోధన వ్యవస్థ ఎదగలేదనీ, నిజానికి ఈనాటి సాహిత్య పరిశోధనా రంగం నాలుగు రోడ్ల కూడలిలో నిలిచి నిలదొక్కుకునే ప్రయత్నం
చేస్తున్నదనీ తెలిపారు!ఈనాటి జర్నలిస్టిక్ విస్తరిలో సాహిత్య పరశోధనా వ్యంజనం వ్యంజన ప్రాయంగానే మిగిలిపోతున్నదని వ్యంగీకరించారు. సిసలైన పరిశోధనకు అంతశ్శోధన ఆత్మసాధన అనివార్యమనీ, ఆ దిశగా పాఠ్య ప్రణాళికలో కొత్తగా రంగప్రవేశం చేసినదే శాస్త్రీయ పరిశోధనా క్రమవిధానం (Research Methodology) అని వాక్రుచ్చారు. సాహిత్య పరిశోధన గత మూడు తరాలలో స్థూలంగా మూడు విధాలుగా విస్తరించి
ఉందన్నారు. ఒకటి సాంత సమన్విత సంవిధానం -wholistic approach. ఇది 1930-1940 మధ్య కాలం లో కొనసాగింది. ఈ సాహిత్య విశ్లేషణా క్రమం లో సాహిత్యకారుని జీవిత విశేషాలను కూడా పొందుపరచడం ఉండేది. రెండవది నిర్మాణదశ -1960 తరువాతి కాలం నాటిది. ఇందులో భారతీయతను పుణికిపుచ్చుకున్న సరైన సాహిత్య విశ్లేషణా సామగ్రిని సమకూర్చుకొని పునర్నిర్మాణ ప్రక్రియాత్మకంగా చారిత్రిక సంశోధనతో ఆవిష్కరించడం (discovering History ), కాలానుగుణ అవగాహనా పరిధిలో వ్యాఖ్యాన రూపంగా (reinterpret) ప్రకాశమానం చేయడం ఉంటుంది. ఈ కోవకు చెందినదే బుచ్చిబాబు గారి 'చివరకు మిగిలేది' పై విద్మహే గారి విశ్లేషణ. ఇక మూడవది జనప్రియమైన సాహిత్యాన్ని ఆధునిక అభిరుచి మేరకు అందించడం-a popularised application of literature/ literary criticism. కిరణ్ ప్రభ గారి ఇలాంటి సాహితీసేవ సాహిత్య పరిశోధనా పరిధిలోకే వస్తుందని అభినందించారు. ఇంకా, లక్మీనారాయణ గారి ప్రసంగ ధారలో ప్రవహించిన భావజాలం ఇలా ఉంది. సాహిత్య పరిశోధనా ప్రధాన అంగాలు రెండు. ఒకటి సాహితీ విమర్శ- ఉపరితల వీక్షణం. రెండవది సాహితీ సమీక్ష- సమగ్ర దర్శనం. అంతస్సంబంధాలను పరిపుష్టం చేసి సాంఘిక అనుబంధపట్టిక గా (social data) పరివర్తనం చెందే సృజనశక్తి సాహిత్యానికి ఉన్నది. నిజానికి భాష ఒక సాంఘిక శాస్త్రం. సాహిత్యం ఒక చారిత్రిక సాంస్కృతిక రూపం;a social document. భాషా శాస్త్ర రీత్యా భాష మూడు విధాలు; భావోద్వేగ భాష, వాడుక భాష, వ్యవహార భాష. మానవ మేధకూ హృదయానికీ మధ్య నున్నఆకాశం(space) ను పరివర్తనానుకూల గుణాత్మక భావ ద్రవ్యంతో నింప గలిగే సామర్థ్యం కవిత్వానికి ఉంది. ఈ ప్రపంచం ఒక సాంఘిక శక్తి స్వరూపం. సారస అంబోధినిలో పరివర్తనా అభిముఖ (negative) భాషా తరంగాలు ఎగసిపడుతున్న కాలం ఇది.
లక్ష్మీనారాయణ గారి ప్రసంగం ఇలా స్వానుభవ సంగ్రహంగా సుగమ సాహిత్య ధారా సదృశంగా ప్రవహించి శ్రోతలను ఓలలాడించింది. ఇటీవల దివంగతులైన 'చేరా' కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక నిమిషం మౌనం పాటించడం జరిగింది.
తరువాత కాత్యాయనీ విద్మహే గారు 'తెలంగాణా నవల' పై విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు.
విశ్వనాథుని 'వేయిపడగలు' తో తన అధ్యయనం ప్రారంభమయిందని, బుచ్చిబాబు గారి 'చివరకు మిగిలేది 'తనకు బాగా నచ్చిన నవల అన్నారు. వారి ప్రసంగ ధార అత్యంత ఆసక్తిదాయకంగా ఇలా సాగింది. తెలుగు నవలా సాహిత్యం 'రంగరాజు' చారిత్రిక నవలతో ప్రారంభమయిందని, ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి 'మాలపల్లి' లాంటి నవలలతో సమాజంలోని వ్యక్తి తన సామాజిక రాజకీయ జీవన గమనాన్ని నిర్దేశించుకునే కొత్త శక్తిని
సమిష్టి నుండి పొందవచ్చునన్న అవగాహనకు నాంది పలికింది.తెలుగు సాహిత్య చరిత్ర ప్రాంతీయ చరిత్రలుగా శాఖోప శాఖలై ఉపకథనాలకు తెరతీసి దళిత సాహిత్యం స్త్రీవాదసాహిత్యం మైనారిటీ సాహిత్యం వంటి వైవిధ్యసాహిత్యాలుగా విస్తరిస్తూ వచ్చింది. కాని, తెలుగు సాహిత్య మహా చరిత్ర లో ప్రాంతీయ చారిత్రిక స్పృహ కొరవడుతూ వచ్చింది. కురుగంటి వారి 'నవ్యాంధ్ర సాహిత్య వీధులు ' లో తెలంగాణ సాహిత్య చరిత్ర ప్రతిబింబించ లేదు. ఈర్షా ఉద్వేగాల చులకన అభిప్రాయాల కారణంగా తెలుగు సంస్కృతిక పత్రికా రంగాలు తెలంగాణా ప్రాంతీయతను చిన్నచూపు చూడడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల లోంచే పుట్టుకొచ్చింది తెలంగాణ నవల. 1950 వరకు నవలలు లేవు. హనుమకొండ వాస్తవ్యులు శేషాద్రి రమణ కవులు తొలి తెలంగాణ చారిత్రిక నవలకు పునాదులు వేసారు. 1955 లో వట్టికోట ఆళ్వారు గారి 'ప్రజల మనిషి', 'గంగు' తెలంగాణా ప్రాంతీయ వైతాళిక నవలలు.1947 నాటి తెలంగాణా సాయుధ పోరాటం ఉద్యమరూప నవలగా ఎదిగింది. 1970 నాటికి విప్లవోద్యమం తెలుగు నవలగా కవిత్వంగా రూపురేఖలు సంతరించుకుంది. కవన శర్మకు ఇంజనీరింగ్ వ్యవస్థ నవలా వస్తువయింది. నవీన్ గారు విద్యా వ్యవస్థ మీద ధ్వజమెత్తి 1967 లో చైతన్య స్రవంతి శైలిలో 'అంపశయ్య' నవలను ఆవిష్కరించారు. 1970 తరువాత వచ్చిన నవలలో అల్లం రాజయ్య గారి 'కొలిమంటుకున్నది', 'అగ్నికణం' అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న మాండలికంలో సాగిన నవలలు. 1990 ప్రాంతంలో తెలంగాణ జీవన అస్తిత్వ ఉద్యమ రూపంలోంచి వచ్చినవి వృత్తిపరమైన నవలలు. నేర్ల శ్రీనివాస్ 'బతుకుతాడు' గౌడులకు, కాలువ మల్లయ్య'బతుకు' పద్మశాలీలకు, బి.ఎస్.రాములు ' బతుకు పోరు' బీడీ కార్మికులకు, జాతశ్రీ 'నల్ల వజ్రం' గని కార్మికులకు చెందిన నవలలు. తెలంగాణా వృత్తికారుల, కార్మికుల, శ్రామికుల, స్త్రీల బతుకు గాధలు ఈ నవలల ఇతివృత్తాలు. లోకేశ్వర్ గారి 'సలామ్ హైదరాబాద్ ' 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమ ప్రాతిపదికగా హైదరాబాద్ చరిత్ర సంస్కృతుల పాతకొత్తల మేళవింపుగా రూపుదిద్దుకున్న చక్కని నవల. ఇలా తెలంగాణ నవలా సాహిత్యం ప్రాంతీయ చైతన్యంగా వర్ధిల్లుతున్నది.

ప్రఖ్య గారు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా విద్మహే గారు "తెలంగాణా జీవనాన్ని, వాస్తవ సంఘర్షణలను ప్రతిబింబించే ఇతివృత్తం గల ఏ నవలైనా తెలంగాణా నవలగా భావించవచ్చు. కాని ప్రాంతీయులు స్వానుభవం తో రాసిన తెలంగాణ నవలా సాహిత్యం వాస్తవానికి చేరువలో ఉంటుందనటంలో సందేహం లేదు. నేనైతే ఖచ్చితంగా తెలంగాణా వాదినే " అంటూ వారు నిర్మొహమాటంగా చెప్పడం విశేషం .
స్వల్పాహార స్వల్ప విరామం తర్వాత కవిసమ్మేళనం. మొదట డా||గీత గారు "ఆత్మీయ ఆనవాలు" వినిపించారు. 'కవిత్వం చిరపరిచిత పదం కోసం, ఆత్మీయ స్వరం కోసం పలవరిస్తుంది' అంటూ సాగిన చక్కని వచన కవిత అందరినీ అలరించింది. రావి రంగారావు గారు అంతర్జాలంలో వస్తున్న గొప్ప కవితల గురించి ప్రస్తావించారు. పనసకర్ల, పట్వర్ధన్, క్రాంతి శ్రీనివాసరావు లాంటి వాళ్లు శివారెడ్డి స్థాయి కవిత్వం
రాస్తున్నారన్నారు. కవిసంగమం వంటి గ్రూప్ లున్న ఫేస్ బుక్ పై తనకున్న సదభిప్రాయాన్ని తెలియపరిచారు. వంశీ ప్రఖ్య గారిది 'వన్స్ మోర్ 'అనిపించుకున్న దీర్ఘకవిత. నాగరాజు రామస్వామి వినిపించిన కవితలు "వ్యర్థ వసంతాలు" ,"ఆకాశం చివర ఆకు పచ్చని ఆశ్చర్యం ". విద్మహే గారు తన మనుమడు అర్ణవ్ ను ఆనంద సంద్రాల కౌగిలిగా అభివర్ణించి వాత్సల్యాన్ని కవిత్వం గా మలిచారు.
కిరణ్ ప్రభ గారు నిర్వహించిన సాహిత్య క్విజ్ ఉత్సాహ భరితంగా హుషారుగా సాగింది.
శ్రీమతి కిరణ్, ఉమా వేమూరి, శారద, శ్రీ అక్కిరాజు రమాపతిరావు,వంశీ, లెనిన్, మహమ్మద్ ఇక్బాల్,మొ.న వారు ఈ సమావేశం లో పాల్గొన్నారు. సభ ఆద్యంతం రసవత్తరంగా సాగి అందరినీ ఆనంద పరిచింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
-నాగరాజు రామస్వామి

Saturday 2 August 2014

వీక్షణం సాహితీ గవాక్షం -23 (July13, 2014)

వీక్షణం సాహితీ గవాక్షం - 23


వీక్షణం 23 వ సాహితీ సమావేశం ఫ్రీ మౌంట్ లోని "సెకండ్ వర్క్ స్పేస్" ఆఫీసు ప్రాంగణం లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.

ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత డా|| కాత్యయనీ విద్మహే విచ్చేసారు.
శ్రీ తాటిపామల మృత్యుంజయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా కాత్యాయనీ విద్మహే "శత సంవత్సరాల కాళోజీ కవిత్వం" అనే అంశం మీద ప్రసంగించారు. ఈ సందర్భంగా కాళోజీ తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.

చిన్నతనం లో వరంగల్ లో తమ తొలి అడుగు కాళోజీ ఇంటిలోనే ప్రారంభమైందనీ, కాళోజీ ఎదురింటిలో ఉంటూ తనకు లభించిన కవిత్వాసక్తి గురించి అందరితో పంచుకున్నారు. అంతేగాక కాళోజీ కుమారుడితో కలిసి విద్యాభ్యాసం చేయడం, పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొనదం వంటివి గుర్తు చేసుకున్నారు. కాళోజీ కవిత్వ లక్షణాల్ని ఆయన మాటల్లోనే పేర్కొంటూ "అసమ్మతి, ధిక్కారం, నిరసన" ప్రధానమైనవని అన్నారు. ఈ
సందర్భంగా ఇతర రచయితలు, కవుల గురించి పేర్కొంటూ అసలు మొత్తం తెలంగాణా లోనే సామాజిక చైతన్యం, ఉద్యమ సంబంధం లేకుండా రచనలు చేసిన వారు లేరని పేర్కొన్నారు.

కాళోజీ జనాన్ని గురించే ఎప్పుడూ మాట్లాడేవారనీ, ఆయన "పలుకు బడుల భాష- బడి పలుకుల భాష" అనే పదాలు వాడేవారనీ పలుకు బడుల భాష అంటే యాసతో కూడుకున్న అసలు సిసలు భాష అనీ, బడి పలుకుల భాష అంటే పాఠ్యపుస్తకాల్లో అనుసరించిన గ్రాంధిక భాష అనీ, "విశ్వవిద్యాలయాలు పలుకు బడుల భాషకి గౌరవం తీసుకు వచ్చే స్థానానికి చేరాలని" అనే వారనీ అన్నారు. 


కాళోజీ జీవన వైవిధ్యాల్ని అర్థం చేసుకున్న వారు కాబట్టే వైరుధ్యాల్ని అర్థం చేసుకోగలిగారని అన్నారు.

1914 లో జన్మించిన కాళోజీ 1930 ల లో తెలంగాణాలో వందేమాతర ఉద్యమం లోనూ, ఆర్య సమాజ ఉద్యమం లోనూ ఫాలుపంచుకున్నారనీ అన్నారు. 1940 ల నాటికి ప్రభుత్వ అధికారాన్ని ధిక్కరిస్తూ, నైజాం వ్యతిరేక కవిత్వాన్ని రాసారు. "నాయకుడు కావాల్సిన వాడు అదృష్ట వశాత్తు కవి అయ్యాడనే" అని కాళోజీ గురించి దేవుల పల్లి రామానుజరావు గారి వ్యాఖ్యను గుర్తు చేసారు.

ఆయన కవిత్వం లో పౌరుడు అనే మాటని అధికంగా వాడేవారనీ, పౌరుడు కాని వాడిని పోరడు అన్నారని అన్నారు.

"ప్రజాస్వామ్యమే జీవితానికి రక్ష" అన్న ప్రజాస్వామ్యం పట్ల కాళోజీ గాఢ నమ్మకాన్ని గుర్తుచేసారు.

"ప్రజాకవి కాళోజీ " గా ఆయన ప్రజల నాలుకల మీద చిరకాలం నిలిచిపోయారని అన్నారు.

కాళోజీ కవిత్వ సమగ్రం "నా గొడవ" నించి కొన్ని కవితా ఖండికల్ని చదివి వినిపించారు.

"కన్నీటిలో ఎన్నెన్నో గలవు, కన్నీటిని గన కన్నులు కలవు", "చెమ్మగిలని కనులు బతుకు కమ్మదనము చాటలేవు, చెమ్మగిలని కనులు బతుకు కమ్మదనము చూడలేవు", "పుటక నీది, చావు నీది, బతుకంతా దేశానిది" అన్న పాదాలు కరతాళ ధ్వనులలో ముంచెత్తాయి.

కాళోజీ పేర్కొన్న ప్రభుత్వపు "అధికృత హింస"ని, ప్రజల పక్షపు "ప్రతి హింసని" గురించి వివరిస్తూ ఆయన కాళోజీ గొప్ప కథకుడన్న విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసనీ అన్నారు.

ఆయన కథల్ని సూక్ష్మంగా వివరించారు. ఈ కథల్లో భూతదయ, ఉద్యమ స్వభావం, రాజకీయాల పట్ల వ్యతిరేకత ద్యోతకమవుతున్నాయన్నారు. గొప్ప మానవతా మూర్తి కాబట్టే ప్రభుత్వం "పద్మ విభూషణ్" తో సత్కరించిందని పొగిడారు.

ఆ తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ఇక్బాల్, విజయ కర్రా, చల్లా శ్రీనివాస్ మొ.న వారు పాల్గొన్నారు.


ఆ తర్వాత "రాధిక సాహితీ అవార్డు" ప్రదానం రచయిత్రి రాధిక 2014 సం.రానికి గాను "కె.గీత" కు ప్రదానం చేసారు. రావు తల్లాప్రగడ గీత కవిత్వ నేపధ్యాన్ని, జీవన విశేషాల్ని చెబ్తూ "ఇన్స్పిరేషనల్ వ్యక్తిత్వం" అని కొనియాడారు. కె.గీత మాట్లాడుతూ వీక్షణం లో ఇటువంటి సన్మానం తనకు ఒక రోజు ఇలా జరుగుతుందని ఎన్నడూ కలలోనైనా అనుకోలేదని అన్నారు.


తేనీటి విరామం తర్వాట ప్రముఖ కవి శ్రీ రావి రంగారావు "మినీ కవిత" ను గురించి ఉపన్యసించారు. 1116 కవితలతో తెచ్చిన కవిత్వ సంకలనాన్ని గురించి వివరించారు. మినీకవిత ప్రత్యేక శిల్పానికి ప్రతిరూపమనీ, ఆగమన, నిగమన పద్ధతులు మినీ కవితల లక్షణాలనీ పేర్కొన్నారు. మినీకవిత ఒక ఉద్యమంగా, ప్రక్రియగా మారడం వెనుక ఉన్న ఆసక్తికర పరిణామాన్ని వివరించారు.

చిన్న వాక్యాలలో, ఆలోచనాత్మకంగా మలచడమే మినీకవిత అని తెలుపుతూ "మా హాస్పిటల్ ప్రత్యేకత- స్మశానం అటాచ్డ్", "కవి నూరుతున్న గోరింటాకు-పెట్టుకోండి మనసుకు- పండుతుంది బతుకు" మొ.లైన కవితల్ని వినిపించారు. మినీ కవితలో చెప్పాలనుకున్న భావం మనసులో పడి, మొలిచేదాకా ఉండాలన్నారు.

తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో ముందుగా ఉపాధ్యాయుల కృష్ణమూర్తి తమ కవిత్వ చమ్మకులను వినిపిస్తూ" కవితవం సరళంగా ఉండాలి- గరళంగా పనిచేయాలి" అన్నారు. "తెలుగు" భాష గొప్పదనాన్ని గురించి అంత్య ప్రాసలతో పసందైన కవిత్వాన్ని వినిపించారు. రావు తల్లాప్రగడ చక్కని ఆలాపనామృతాన్ని పంచుతూ "ఆ దేవుడు కూడా రాయైనా ఆ రాతికే పూజలు చేస్తాను, నీ గుండె కూడా రాయేలే మరి అందుకే పూవులు
ఇస్తాను"అ ని గజల్ ని వినిపించారు.

ఇక్బాల్ "వైవిధ్యం" అనే ఆధ్యాత్మిక కవితని వినిపిస్తూ "పుచ్చుకుని సంతోషిస్తుంది శరీరం, ఇచ్చుకుని సంతోషిస్తుంది ఆత్మ" అన్నారు.

కె.గీత "ఎల్లోస్టోన్" కవితని తన సహజ చిత్ర కవిత్వా ప్రతిభ ద్యోతకమయ్యే పదాలతో వినిపించారు.

అంతా ఎప్పుడూ ఎంతగానో ఎదురుచూసే అద్భుత కిరణ్ ప్రభా మంత్రం "సాహితీ క్విజ్" అందరినీ నవ్వులతో ముంచెత్తుతూ సరదాగా గడిచింది. కవిత్వాన్ని గురించి అడిగిన ప్రశ్నలు అందరినీ ఆలోచింపజేసాయి.

చివరాగా శ్రీ అక్కిరాజు రమాపతిరావు కాళోజీ తో తన అనుబంధాన్ని అందరికీ తెలియజేసారు. కాళోజీ "అత్యంత ఆర్ద్రమైన మనిషి, త్రిదస్యుడి వంటి వాడు" అని కొనియాడారు.

ఈ సభకు ఆంధ్ర లక్ష్మి, లత , నరేంద్ర, గాయత్రి, లెనిన్,కాంతి కరణ్, కరుణ కుమారి, వేంకటేశ్వర్లు, ప్రభావతి మొ.లైన వారు కూడా హాజరయ్యారు.
చివరగా కె.గీత "సెకండ్ వర్క్ స్పేస్" అధినేత "రమేష్ కొండా" గారికి ధన్యవాదాలు సమర్పించి సభను ముగించారు.
-
-డా|| కె.గీత

Friday 1 August 2014

వీక్షణం సాహితీ గవాక్షం -22 (Jun 8, 2014)

వీక్షణం సాహితీ గవాక్షం - 22
 రచన :  నాగరాజు రామస్వామి

     ఈ నెల బేఏరియా వీక్షణం సాహితీ సమావేశం ప్రసిద్ధ సాహిత్య అంతర్జాల పత్రిక 'కౌముది' సంపాదకులు, శ్రవణ మనోజ్ఞ మైన 'వీక్లీ ఆడియో' కార్యక్రమ నిర్వాహకులూ, 90 సాహిత్య సంచికలను, ఈ-పుస్తకాలను జయప్రదంగా అంతర్జాలం లో ఆవిష్కరించి సాహితీప్రియులను అబ్బుర పరచిన సాహితీ బంధువులు శ్రీ కిరణ్ ప్రభ గారి ఇంట్లో డబ్లిన్లో జరిగింది. వారి సతీమణి "ప్రశాంత కిరణ కౌముది" శ్రీమతి కాంతి గారు
 అందించిన చల్లని ఆతిథ్యం తో సమావేశం ప్రారంభమైంది. వరిష్ఠ సాహితీ మూర్తులు, బహుగ్రంధకర్త, moving encyclopedia  శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు అధ్యక్షులు.
      కిరణ్ ప్రభ గారి ఆత్మీయ స్వాగతం పిదప ఆంధ్రలక్ష్మి గారు 'సంగమం' కథ వినిపించారు.

 స్త్రీ మనోభావ సున్నితమైన ఇతివృత్తం. రఘు,రఘురాం అత్యంత సన్నిహితులైన మిత్రులు. కాన్సర్ పేషంట్ రఘు అవసాన ఘడియల్లో తన భార్య మైథిలి శేషజీవిత బాధ్యతను మిత్రునికి అప్పగిస్తాడు. స్వార్థరహితమైన సాన్నిహిత్యాన్ని అందిస్తుంటాడు మైథిలికి రఘు. ఎదిగిన మైథిలి పిల్లలు రఘురాం మైథిలి
 అన్నివిధాల ఒక్కటైపోతే బాగుండునని తలపోస్తుంటారు. బంధంలేని కలయిక ఒక నాటకం మాత్రమేనని వారి అభిప్రాయం. మైథిలి ఇతమిద్దమని నిర్వచించరాని ఒక  అసహాయ సందిగ్ధతలో ఊగిసలాడుతుంటుంది. నడివయసు జీవన ధర్మం, కాలానుగుణ పరిణామ ధర్మం, స్నేహ ధర్మం త్రివేణీ సంగమంగా ధర్మ సంకటంగా ఈ కథ కొనసాగుతుంది. ఆత్మీయ సంబంధాల భావ సంఘర్షణలతో సంఘటనలతో సరళమైన భాషలో సాఫీగా సాగిన శైలి. ద్వివేదుల
 విశాలాక్షి గారి అలనాటి కథ 'గ్రహణం విడిచింది' ని తలపిస్తున్నదీ కథ అని అధ్యక్షుల వారు అనడం విశేషం.
        
తరువాత డా||కె.గీత  "వాకిలి" పత్రికలో నెల నెలా వెలువడుతున్నధారావాహిక కథలలో ఈ నెల కథ 'లివ్ ఎ  లైఫ్' ను వినిపించారు. కథలో 'లెవ్' నడి వయసు దాటిన ఒక యూదు సంతతికి చెందిన వ్యక్తి. తొలుత నాజీల బారినుండి తప్పించుకొని రష్యా లో తలదాచుకున్న కుటుంబం వాళ్ళది. యూదుల భూతల స్వర్గమని భావించబడే  ఇస్రాయిల్లో కొన్నాళ్లు ఉండిపోయి లాటరీ పద్ధతి ద్వారా వీసా పొంది స్వేచ్చాప్రపంచమనబడే
 అమెరికాలో స్థిర పడిన  హుషారైన మనిషి. కథలో లెవ్ రంగప్రవేశం, గౌరీ, ప్రియలతో పరిచయం అంతా కాజ్వల్. సంఘటనల సమాహారం తో కాకుండా సంభాషణల ఒరవడిలో నడచిన కథ ఇది. 'స్కెచ్' లాంటి కథా ప్రక్రియ. సంభాషణలతో కథను నడపడం నవీన పధ్ధతి. కష్టమైనది. కాని రచయిత్రి ప్రతిభా వంతంగా నిర్వహించారు. చిన్న కథ అయినా "కథ అంటే సంఘటనల తోరణం మాత్రమే కాదని చెప్పే మంచి కథ". "ఎక్కడ జీవించినా అదుగో అలా (లెవ్
 లా )ఉత్సాహంగా జీవించాలి" అన్న భావనకు కల్పించబడిన కథారూపం. కథా గమనం లో మనకు అంది వచ్చిన అదనపు విషయ పరిజ్ఞానం రష్యా ,ఇస్రాయిల్,అమెరికా దేశాలలోని అరుదుగా ద్యోతకమయ్యే వాస్తవాల వెలుగు నీడలు.  గీత గారు స్వయంగా కవయిత్రి కావడం వల్ల కథా వచన రచనలో కవితాత్మకమైన వాక్యాలు అలవోకగా దొర్లాయి. ప్రణాళికా బద్దంగా కథా సంవిధానం కుదిరింది. ద్వాన్యాత్మకంగా కథా నాయకుణ్ణి గుర్తుకు
 తెచ్చే ఇతివృత్తోచిత శీర్షిక!
          పసందైన అల్పాహార స్వల్ప విరామం తరువాత కవిసమ్మేళన కార్యక్రమం. మొదట రావు తల్లాప్రగడ గారు శ్రావ్యంగా గొంతెత్తి పాడి వినిపించిన వారి గజల్ ఆనాటి కవిసమ్మేళనపు శుభారంభం. "వొకరికి మించిన వారొకరు, వొకరి నుంచే వేరొకరు, సగమును పిలిచిన సాంతము కాదా ,శాంతము లేదా లింగమా"అంటూ అర్ధనారీశ్వరతత్వాన్నిగజలుశైలిలోఆవిష్కరించడం అందరినీ ఆకర్షించింది.తరువాత నాగరాజు రామస్వామి
 వినిపించిన వచన కవిత 'విశ్వాంతరాళ స్వగతం'. ఒకింత ఆధ్యాత్మిక ఛాయలున్న ఖగోళశాస్త్ర సంబంధి. పిదప శంషాద్ మహ్మద్ గారు 'డాలర్ లైఫ్ 'అన్న తన స్వీయ కవితను, వారి తండ్రి గారైన దిలావర్ గారి 'నా కవితాత్మ' అన్న చక్కని కవితలను చదివి వినిపించారు.రూపుగొన్న ఉద్యమ ఊపిరులు, బాల్య జ్ఞాపకాల విరులు ఆ కవితల సిరులు.
 
చివరగా గీతగారు"పార్కులోపిల్లలు"కవితను వినిపించారు. అందాలసీతాకోకచిలుకలు, ఉత్సాహంగా గంతులేసే ఉడతపిల్లలు, చిరునవ్వుల వెన్నెల దీపాలు,ఉల్కాపాతాల కళ్ళు, పిల్లల కొత్త ప్రపంచాలు వారి కవితలో చెంగలించాయి.
                 సుమారు మూడు గంటలపాటు సాగిన సమావేశం మధ్యమధ్య  పలు సాహిత్యచర్చలు,
చాందోపనిషత్తు, పురుషసూక్తంవంటిఆధ్యాత్మికవిచారాలు, ఖగోళశాస్త్ర జిజ్ఞాసలు, సినారె, ఎల్లాప్రగడసుబ్బారావు, భోగరాజు, కవన శర్మ, కాకర్ల సుబ్బారావు, గరిమెళ్ళ సత్యనారాయణ లాంటి ఉద్దండుల జ్ఞాపకాలముచ్చట్లు!
       ఆఖరుగా కిరణ్ ప్రభ గారి సాహిత్య క్విజ్ రసవత్తరంగా సాగి ఆ సారస సాహిత్య సంధ్యకు చక్కని ముగింపు పలికింది. ఈ సమావేశంలో శివ చరణ్ గుండా, విజయ కర్రా, వేమూరి, ఉమా వేమూరి, లెనిన్, చుక్కా శ్రీనివాస్ మొ.న వారు కూడా పాల్గొన్నారు.
 
  - రచన : నాగరాజు రామస్వామి

http://www.koumudi.net/Monthly/2014/july/july_2014_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july14/veekshanam.html


వీక్షణం సాహితీ గవాక్షం -21 (May11, 2014)

వీక్షణం సాహితీ గవాక్షం - 21

 

 ఈనెల 'వీక్షణం' సమావేశం 11 వ తేదీన ఫ్రీమాంట్ లోని శంషాద్ గారి ఇంట్లో జరిగింది.అబ్దుల్లా మహ్మద్ గారు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. శంషాద్ దంపతుల అతిథి సత్కారం, అక్కిరాజు రమాపతి రావు గారి సభాసారథ్యం , చక్కని సాహిత్య వాతావరణంలో సభ సక్రమంగా కొనసాగింది.
మొదట శంషాద్ గారు తన తండ్రి గారైన దిలావర్ గారి జీవన విశేషాలను స్థూలంగా వివరించారు. ఇవీ వారి జీవన రేఖలు. డా|| దిలావర్ మహ్మద్ గారు ఖమ్మం జిల్లా లోని కమలాపురం గ్రామంలో జూన్ 1942 లో జన్మించారు. హైస్కూల్ జీవితం డోర్నకల్లో. శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో కాలేజి చదువులు. ఆచార్య చేకూరి రామారావు పర్యవేక్షణలో దాశరథి కృష్ణమాచార్యుల పై సాహిత్య పరిశోధన చేసి
దాక్టరేట్ పుచ్చుకున్నారు. దీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు.కొన్నాళ్ళు విరసం కు సేవలందించారు. ప్రస్తుతం స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి అన్నమాటే గాని అవిశ్రాంతంగా సాహిత్య సృజన చేస్తూనే వున్నారు. ఆలస్యంగా సాహితీ వ్యయసాయం ప్రారంభించినా అనతి కాలం లోనే కవితలు, కథలు, నవలలు, సమీక్షలు -ఇలా వివిధ సాహిత్య ప్రక్రియలలో ప్రావీణ్యం
సంపాదించుకున్నారు. ఆనాటి జయశ్రీ మొదలు ప్రసిద్ధ సాహిత్య పత్రిక భారతి లాంటి పత్రికలలో వారి రచనలు ప్రచురించబడ్డాయి. వెలుగు పూలు, జీవనతీరాలు కవితా సంకలనాలు. "గ్రౌండ్ జీరో" పేరు తెచ్చిన దీర్ఘ కవిత. ' మట్టిబొమ్మ' కథా సంకలనం. 'తానా' వారి సంచికలలో కుడా వారి కథలు అచ్చయ్యాయి. 'ప్రణయాంజలి'వారి పద్య కావ్యం. ' ప్రహ్లాద చరిత్ర' నన్నయ ఎర్రనల కావ్యాల నేపథ్యంలో పరిశీలించబడిన విశ్లేషణ గ్రంధం. ' కర్బల' వారి మరో విశిష్ట రచన. ప్రస్తుతం దిలావర్ గారు 'సమాంతర రేఖలు' నవల , 'ట్రైబల్ స్టోరీస్' కథలు రాస్తున్నారు.

శంషాద్ తన తండ్రి ఎదురుకున్న ఆర్ధిక ఇబ్బందులను, తమ కుగ్రామంలో కొరవడిన వైద్య సౌకర్యాలను ఆర్తీ ఆత్మీయతా నిండిన జ్ఞాపకాలుగా తలచుకున్నారు. తన తండ్రికి వాత్సల్య ప్రోత్సాహం అందిస్తూ వచ్చిన ఆవంత్ససోమసుందరం గారికి కృతజ్ఞతలు తెలిపారు.

డా||దిలావర్,కవి జాషువ,డా||కొలకలూరి ఇనాక్ ల జీవితాలలో అనేక పోలిక లున్నవని, ముందు ముందు వారిని గురించిన సమగ్ర చర్చ జరుపుకోవాల్సిన అవసరం ఉందని కిరణ్ ప్రభ గారు అనడం విశేషం.

ఆ తరువాత, త్రిభాషా పండితుడైన విద్వాంసులు పెద్దిపర్తి రాజారావు గారి కుమార్తె, ప్రసిద్ధ అవధాని పెద్దిపర్తి పద్మాకర్ గారి చెల్లి, శ్రీమతి ఆంధ్ర లక్ష్మి, తొలిసారి వీక్షణం కు విచ్చేసి తమ సాహితీ వ్యాసంగం గురించి తెలిపారు. విపుల,సృజన లాంటి పత్రికలలో వారి కథలు ప్రచురించ బడినవి. తన తొలి నవల 'బాంధవి' టి.టి.డి ప్రచురించిందని, రెండవ నవల 'తమసోమా జ్యోతిర్గమయ' ఈమధ్యే
ప్రచురించుకున్నానని తెలుపుతూ నవలను సభికులకు అందించారు. జన్మనిచ్చిన తల్లి ఋణం, బ్రతుకు ఆసరా అయిన భూమాత ఋణం తీర్చుకునే నేపథ్య భూమిక ఈ నవల ఇతివృత్తం.

పిదప నాగరాజు రామస్వామి చదివి వినిపించిన వ్యాసం సాహిత్య సంబంధి. వచన కవిత్వం, అనువాద వచన కవిత్వం, కథా సాహిత్యం తీరుతెన్నులను గుర్చిన వ్యాసం అది. నేటి యువతరం భాష పై శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత గురించి, వచన కవితా స్వరూపాన్ని నిర్దుష్టంగా రూపు కట్టించే దిశగా సాహితీ వేత్తలు కృషి చేయాలిన అవసరం గురించి, విదేశీయ సాహిత్యాన్ని అనువదించడం అగత్యమని, వచన
కవితాభివ్యక్తి కి భాషా గాఢత భావ నిగూఢత నిషిద్ధం కాదని, సంపూర్ణ సాహితీ దర్శనం కృషి తో కూడిన వ్యవసాయమేనని, పాఠకులు నిరంతర అధ్యయనం ద్వారా స్థాయిని పెంచుకోవాలని ఆ వ్యాస సారాంశం.

మహమ్మద్ ఇక్బాల్ గారు అరబ్బీ భాష సౌందర్య సామ్యాల ప్రసంగ పరంపరలో భాగంగా మరి కొంత సమాచారాన్ని అందించారు. అరబిక్ భాషలో 99 శాతం పదాలు మూడు ధాతువులు కలిగి ఉంటాయన్నారు. 'కతబ్' అనే పదం 'కితాబ్' గా, 'కబర్' 'కబుర్లు' గా, 'అల్జేబర్' 'ఆల్జెబ్రా' గా, 'కసర్' 'కొసరు' గా భారతీయ భాషలలోకి వచ్చిన అరబిక్ పదాలని తెలిపారు. అరబిక్ సంస్కృత భాషల వ్యాకరణ సంబంధాల సూత్రత గురించి వివరించారు.

ఆచార్య వి.యల్.యస్.భీమశంకరం గారు సభకు విచ్చేయడం ఒక ఆకర్షణ. వారు మాట్లాడుతూ కవిత్వ ప్రాప్తి దైవ దత్తమని, ఒక్క తెలుగు భాష లోనే వున్న పద్య ప్రక్రియ ముమ్మాటికీ చిరంజీవి అని సెలవిచ్చారు. యతి, ప్రాస, గణాదుల మూలంగా తెలుగు పద్య రచన సంస్కృత శ్లోక రచన కన్నా కష్టతరమయిందని తెలిపారు. కవిత్వం లో సహజాలంకార లక్షణ ఛందస్సులు రసిక రాజ విరాజమై అర్థసంపన్నమై మానస రాగమై శబ్దవర్ణ సువర్ణ విశిష్ట శిల్పాన్ని సంతరించి పెడుతాయని వాక్రుచ్చారు. హృదయానందాన్ని ప్రసాదించేదే కవిత్వమన్నారు. ఛందస్సులు లక్షల సంఖ్యలో ఉన్నాయని, ఆరు అక్షరాల గాయిత్రీ మంత్రానికి 256 ఛందస్సు లున్నవని వక్కాణించారు. రసస్రువు, శ్రీ దక్షారామ భీమేశ్వరోదాహరణ కావ్యం, "శ్రీ రామ! నీ నామ మేమి రుచిర!" ఇత్యాది స్వీయ రచనల పుస్తకాలను సభకు సమర్పించారు. రసస్రువు ఇదివరకు రాయని 56 ఛందస్సులను సంతరించుకున్న అపూర్వ పద్య గ్రంధం. భీమశంకరం గారు రసస్రువు నుండి ఒకటి రెండు పద్యాలను వినిపించారు.

ఆ పిదప కవి సమ్మేళనం. మొదట, శంషాద్ దిలావర్ గారు రాసిన 'రేష్మా!రేష్మా!' కవిత ను,'కిన్నెరసాని'స్వీయ కవితను వినిపించారు. డా||కె.గీత గారు చిరకాల మిత్రురాలిని చూసిన సంతోషాన్ని"చిన్నప్పటి స్నేహితురాల్ని చూసేక" కవితలో కవిత్వీకరించారు. ఈ కవితలో చిన్ననాటి తూనీగ రోజులు, కల్లాపి ముగ్గులు, ఇత్తడి జడగంటల శోభలు, చిక్కుడు పాల నెమిలీకల చిరు ప్రాయ ముచ్చట్లు లలితా మృదులంగా పారాడాయి. పిల్లలమర్రి కృష్ణకుమార్ గారు 'పాతుగాదికి కొత్తుగాదికి పొత్తుకుదరదు తమ్ముడా!'అంటూ పాత కొత్తల మేలు కలయికలతో పాట బాణీ లో పద్యాన్ని మేళవించి కదం తొక్కించారు. గంగా ప్రసాద్ "కుక్క" అనే ప్రతీకాత్మక కవిత వినిపించారు. నాగరాజు రామస్వామి చదివిన కవితలు 'రూఢ్యర్థాల అవల' & 'కృత్యాద్యవస్థ'. రాజు తదితరులు కూడా కవితలు చదివారు. శంషాద్ కూతురు రేష్మా 'అట జని కాంచె భూసురుడు 'మనుచరిత్ర లోని పద్యాన్ని శ్రావ్యంగా వినిపించింది.

చివరగా కిరణ్ ప్రభ గారు నిర్వహించిన క్విజ్ కార్యక్రమం హుషారుగా సాగి సభలో హుషారును పెంచింది. వచ్చే నెల సమావేశం కిరణ్ ప్రభ గారింట్లో డబ్లిన్ లో జరగనున్నట్లు ప్రకటించారు. మొత్తం పై ఆ సాయంత్రం సిసలైన సాహితీ సంధ్య గా రూపొందింది.
 
- రచన : నాగరాజు రామస్వామి

వీక్షణం సాహితీ గవాక్షం -20 (Apr13, 2014)

వీక్షణం సాహితీ గవాక్షం - 20

 

 వీక్షణం 20 వ సాహితీ సమావేశం ఫ్రీమౌంట్ లోని మహమ్మద్ ఇక్బాల్ గారింట్లో ఏప్రిల్ 13, రెండవ ఆదివారం మధ్యాహ్నం 3 గం. నుండి సాయంత్రం 6 గం. వరకు రసవత్తరంగా జరిగింది. ఈ సమావేశానికి శ్రీ ఇక్బాల్ స్వాగతం పలికి అధ్యక్షత వహించారు. ముందుగా ఈ సమావేశపు అతిధి ఉపన్యాసకులు శ్రీ ఉపాధ్యాయుల సూర్య నారాయణ మూర్తి గార్ని శ్రీ రాం వేమూరి సభకు పరిచయం చేశారు. తర్వాత ఉపన్యాసాన్ని ప్రారంభించిన సూర్య నారాయణ మూర్తి "కోనసీమ జాలరి పాటలు- ఒక పరిశీలన" గ్రంధ సమీక్ష చేశారు. ఈ పరిశోధనా గ్రంధాన్ని వారి తండ్రి గారు, డా|| ఉపాధ్యాయుల సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారు పరిశోధించి, రచించడం విశేషం. తమ తండ్రి గారి జీవిత విశేషాల్ని, గ్రంధ పరిశోధనా కృషిని తెలియజేస్తూ " 1930 లో తూ.గో.జిల్లా లో ఉపాధ్యాయుల సుబ్రహ్మణ్యేశ్వర శర్మ జన్మించారు. అమలాపురం ఎస్.కె.బి ఆర్ కాలేజీ లో ప్రొఫెసర్ గా 25 స.రాలు సేవలందించారు. నిత్యం గోదావరి దాటి కాలేజీకి వచ్చేటపుడు మత్స్యకారుల పాటలు ఆయనను విశేషంగా ఆకట్టుకోవడంతో రాత్రింబగళ్లు కృషి చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో అదే అంశం పై పీ.ఎహ్.డీ చేశారు. కోనసీమ లోని 18 మండలాళ్లో 175 పల్లెల్లోని జాలరుల పాటల్ని స్వయంగా రికార్డు చేసి వారి సంస్కృతిని, మౌఖిక సాహిత్యాన్ని భద్ర పరిచి, సుస్థిరత ను చేకూర్చారు. 1993 లో 63 స.రాల వయస్సులో తెలుగు విశ్వ విద్యాలయం నుంచి పీ.ఎచ్.డీ పట్టా పొందారు. తెలుగు విశ్వ విద్యాలయం ఈ గ్రంధానికి "తూమాటి దొణప్ప మెమోరియల్ స్వర్ణ పతకాన్ని " ప్రదానం చేసింది." అన్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే "జానపద సాహిత్యానికి వలపన్ని, ఒడ్డుకు ఈడ్చి, పరిశోధన రూపేణా రూపం కల్పించారు. ఈ గ్రంధాన్ని ప్రస్తుతం వారి మనుమలు డిజిటలైజ్ చేస్తున్నారు. సూర్య నారాయణ మూర్తి కొన్ని జానపద పాటలను స్వయంగా అత్యంత మాధుర్యంతో పాడి వినిపించారు. అందులో "పాలా వన్నెపు చాయ- పలువరుస చక్కని, పలుకవేమి తమ్ముడా- లక్ష్మణా చిన్ని ముద్దుల తమ్ముడా" అనే "లక్ష్మణ మూర్ఛ" పదాలు సభలోని వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

తర్వాత ఈ సమావేశంలో సుమతీ పద్యాల్ని, ఇంద్రగంటి రచించిన "తేనెల తెటల మాటలతో" గీతాన్ని అత్యంత శ్రావ్యంగా పదేళ్ల వరూధిని, ఇందు పాడి వినిపించారు. భాషా, సంగీత ప్రధాన "తెలుగు వికాసం" విద్యార్థులైన వీరు, తమ గురువు కె.గీత కు ధన్యవాదాలు సమర్పించారు.

తేనీటి విందు తర్వాత జరిగిన కవి సమ్మేళనం లో ముందుగా షంషాద్ "లేక్ తాహో" కవితను, వేణు ఆసూరి " చిన్ని గురువు " అనే కవితను, కె.గీత "ద్రవభాష" నుంచి "ఇస్త్రీ వాడు" కవితను వినిపించారు.

సమావేశానికి విచ్చేసిన మరొక ముఖ్య అతిధి "శ్రీ భీమ శంకరం" పద్య కవిత్వాన్ని వినిపించారు. సభకు ఈయనను పరిచయం చేస్తూ శ్రీ అక్కిరాజు రమాపతి రావు తన సహజ వాగ్ధాటితో సభలోని వారిని ఆకట్టుకున్నారు. ఈయన పద్య రామాయణం వంటివే గాక, అపరాధ పరిశోధక సాంఘిక పద్య కావ్యాన్ని రచించడం విశేషం. పద్య కవిత్వం లో చమక్కులను సొంతం చేసుకున్న లకార ప్రధానమైన పద్యాల్ని, ఉదాహరణ కావ్యం నుంచి రగడలను వినిపించారు. సందర్భోచితంగా ఉగాది పద్యాల్ని, శ్రీ రామ నవమి పద్యాల్ని వినిపించి అందరినీ అలరించారు.

ఇక్బాల్ చిలకమర్తి వారి "గణపతి" ని గురించి స్పందనోపన్యాసం చేసారు. వస్తువు ఆ కాలానికి సంబంధించిన దైనప్పటికీ ఇందులో ఒక వర్గపు జీవన విధానాన్నే చూపడం, పేదల జీవితాల్ని, అంగ వైకల్యాన్ని హాస్య స్ఫోరకంగా మల్చడం తనకు రుచించలేదన్నారు. దీనిపై చర్చా కార్యక్రమంలో వేణు ఆసూరి తదితరులు మంచి ఆలోచనాత్మకమైన చర్చ ను చేసారు.

చివరగా సంతోషకరంగా జరిగిన క్విజ్ కార్యక్రమాన్ని కిరణ్ ప్రభ తన సహజ ఛలోక్తులతో నిర్వహించారు. వచ్చే నెల సమావేశం మిల్పిటాస్ లోని షంషాద్ ఆతిధ్యంలో జరగనుందని తెల్పారు.

సభలోని వారంతా ఆ నాటి సమావేశానికి ఆతిధ్యం వహించిన ఇక్బాల్ దంపతులకు హర్ష ధ్వానాలతో అభినందనలు తెలిపారు.

ఈ సమావేశంలో తాటిపామల మృత్యుంజయుడు, శారద, కృష్ణ కుమార్, లెనిన్, కాంతి కిరణ్ తదితరులు కూడా పాల్గొన్నారు.
 
 

-డా|| కె.గీత
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may14/veekshanam.html 

వీక్షణం సాహితీ గవాక్షం -19 (Mar11, 2014)

వీక్షణం సాహితీ గవాక్షం - 19
(మాసం మాసం శ్రుత సాహిత్యం )

- రచన : నాగరాజు రామస్వామి

 మార్చ్ 9న సాహితీ గవాక్ష వీక్షణం మిల్పీటాస్ లోని అనిల్ రాయల్ గారి ఇంట్లోజరిగింది. అది ముమ్మాటికీ బే ఏరియా తెలుగు సాహితీ మిత్రుల సారస్వత ప్రభాస విభావరి!

సభ అనిల్ గారి కథతో ప్రారంభమయింది. ఆరోజు వీచిన గాలి ఒక కథావీచిక. అనిల్ వినిపించిన కథ 'శిక్ష' అతను అందించిన ఒక High Tea ! అతని మిత్రుడు శివ (యాజి) గారి 'పగడ మల్లెలు' ఒక కొత్త కథాసౌరభం! ఈ రెండు కథలూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితాలు. కథలు ఓహెన్రీ ని తలపించాయని శ్రోతలు అనడానికి కారణం వారి కథల కొసమెరుపులు, ఆసాంతం గుప్తాగుప్తంగా కథను నడిపించిన వారి కథన శిల్పం! చకితుడైన పాఠకునికి రెండవసారి చదువక తప్పని, వాక్యాల పొరలలో దాచబడిన ముడులను విప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కథలు కొత్తవి అనేకన్నా అవి కొత్త రకంగా చెప్పబడిన కథలు అనడం సబబు.

'శిక్ష' కథానాయకుడు బండరెడ్డి పన్నెండేళ్ళ బాలుడు. అతనిది అంత పిన్న వయస్సని కథాంతానికి గాని తెలియదు. వాడు ఒకటి రెండు సార్లు పోలీసులను బారి నుండి తప్పించుకున్న నేరస్తుడనే భావం మనలో ఏర్పడుతుంది. నేరస్తులను జైలుకు తరలిస్తున్న దృశ్యాలు, ఖాకీ దుస్తుల్లోని డ్రైవర్ కనపరుస్తున్న వైముఖ్య హావభావాలు, కథ పొడుగునా సాగిన అనుమానాస్పద నేపథ్యం ఆ భావాన్నే బలపరుస్తాయి. బండరెడ్డిని తీసుకెళ్తున్నబస్సు ఓ భవనం ముందు ఆగగానే అది జైలే అయివుంటుందని పాఠకహృదయం తొందర పడుతుంది. భవనం మీది భారీ హోర్డింగ్ మీద ఒక పేరుమోసిన కార్పోరేట్ స్కూల్ పేరూ, దాని కింద 'అంతర్జాతీయ కఠోర శిక్ష/ణ' అన్న వాక్యం ఉన్నదనడం కొసమెరుపు. బాలుని సున్నిత మైన మనోభావ ఆవిష్కరణే కథాంశమని, కార్పోరేట్ స్కూళ్లను కించపరచడం తన ఉద్దేశం కాదని రచయిత తర్వాత చెప్పుకొచ్చారు.

'పగడ మల్లెలు' శిల్ప పరంగా ఈ కోవకు చెందిన కథే. పూల రహస్యం తెలిసిన ఒక పడుపు స్త్రీ చెప్పుకున్న ఉదంతంలా సాగింది కథ. పాత్రలలో పంచ పాండవుల వ్యక్తిత్వాలు నిక్షిప్తపరచ బడి ఉన్నాయని రచయిత ఎత్తిచూపే దాకా తెలిసి రాని వ్యూహ రచన! ఒకటికి రెండు సార్లు( in-between- lines )చదివితే గాని కథాస్వరూపం మరింత విశదం కాదేమోనని నా వ్యక్తిగత అభిప్రాయం. కొత్త శైలీ శిల్ప నిర్మాణం లో నడచిన ఈ కథ సభికులను ఆకట్టుకుందనటం లో సందేహం లేదు.

తర్వాత 'సృజనరంజని' సంపాదకులు తాటిపామల మృత్యుంజయుడు గత సంచికలో వచ్చిన శిరీష ఈడ్పుగంటి గారి 'తెలుగు పత్రికలు: మహిళా సంపాదకులు' వ్యాసాన్ని విశదీకరిస్తూ, ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం దృష్ట్యా సందర్భోచితం అన్నారు. వారి వివరణాత్మక ప్రసంగ సారభూత విషయ సంగ్రహం ఇలా వుంది :
భారతదేశ తొలి పత్రిక 'దిగ్దర్శన్' 1818 లో ,'తెలుగు జర్నల్' 1831 లో, 'కర్నాటిక్ క్రానికల్'1832 లో, 'సత్యదూత' 1835 లో, 'వృత్తాంతి' 1838 లో వెలువడ్డాయి. ఈ పత్రికల సంపాదకులు పురుషులు. స్త్రీ ప్రాధాన్యం గా వచ్చిన పత్రికలు 'తెలుగు జనానా'(1893) , 'హిందూసుందరి' (1902). స్త్రీల పత్రికకు స్త్రీలే సంపాదకత్వం వహించిన తొలి తెలుగు పత్రిక 'హిందూసుందరి' సంపాదకులు రమాబాయమ్మ, శాంతాబాయమ్మ గార్లు. 'సావిత్రి'1910 లో, 'అనసూయ' 1914 లో, 'సౌందర్యవల్లి' 1918 లో, 'ఆంధ్ర లక్ష్మి'1921 లో, 'ఆంధ్ర మహిళ' 1943 లో, 'తెలుగు తల్లి' 1943 లో, 'తెలుగుదేశం' 1950 లో,'వనిత' 1956 లో, 'నూతన' 1978 లో,'స్త్రీ స్వేచ్చ' 1988 లో, 'లోహిత' 1989 లో, 'మాతృక' 1992 లో, 'ఆహ్వానం' 1993 లో, 'భూమిక' 1993 లో, 'చైతన్య మానవి' 2002 లో స్త్రీల సంపాదకత్వం లో వెలువడిన తెలుగు పత్రికలు. ఐతే,1977 లో ముప్పాళ రంగనాయకమ్మ(విరసం) సంపాదకత్వంలో వెలువడిన ' ప్రజా సాహితి', కొండవీటి సత్యవతి గారు రెండు దశాబ్దాల నించి నిర్వహిస్తున్న 'భూమిక', ఈనాటి ఇ పత్రిక 'విహంగ' ప్రశంసనీయమైన పత్రికల్లో ప్రముఖం గా గుర్తించ వలసినవిగా శ్రోతలు అభిప్రాయ పడ్డారు. ప్రసంగం ఇలా విషయసాంద్రం గా వివరణాత్మకంగా సాగింది.

తర్వాత, కవిసమ్మేళనం. మొదట నాగరాజు రామస్వామి ఒక వచన కవితను, శంషాద్ రెండు కవితలను, వేణు రెండు కవితలను వినిపించారు. డా||కె.గీత 'మా పెరటి నారింజ చెట్టు' వచన కవిత వినిపించారు. అమ్మచెట్టును అలుముకున్న తన అనుబంధాన్ని అభివర్ణిస్తూ చివరగా చెప్పిన కవితా వాక్యం 'మా నారింజ చెట్టుకు నేనే తల్లినయ్యాను'!
తరువాత డా.లెనిన్ గారు తన spiritual journey కి సంబంధించిన అశేష శేష ప్రశ్నల పరంపరను సభ ముందుంచారు.

ప్రతి సమావేశంలోనూ ఆఖరి అంశం క్విజ్ . విజ్ఞానప్రదమైన సాహిత్య ప్రశ్నావళి తో సభను వినోదాత్మకంగా మార్చే విద్య కిరణ్ ప్రభ గారిది ! ఊహించిన విధంగానే ఆసక్తిగా సాగి అందరినీ ఆనంద పరచిన క్విజ్ కార్యక్రమం తో ఆనాటి 'వీక్షణం' సాహిత్య సభ ముగిసింది.
 
- రచన : నాగరాజు రామస్వామి

వీక్షణం సాహితీ గవాక్షం -18 (Feb-9, 2014)

వీక్షణం సాహితీ గవాక్షం - 18

వీక్షణం 18 వ సాహితీ సమావేశం ఫ్రీ మౌంట్ లోని పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారింట్లో ఫిబ్రవరి 9 న జరిగింది.
వేమూరి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ అన్నమాచార్య కీర్తన "పూవు బోణుల కొలువే పుష్ప యాగం" గురించి ఆసక్తిదాయకమైన పరిశోధనా ప్రసంగం చేసారు. అన్నమయ్య కీర్తనలు భక్తి, శృంగారాలనే రెండు విధాలనీ, అందులో శృంగార కీర్తనలను అన్నమయ్య తనకు తానే గోపిక గా ఊహించుకుని రాసినవనీ అన్నారు. యజ్ఞం, యాగం అనే పదాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఉదాహరణ పూర్వకంగా వివరించారు. ప్రత్యేకించి ఈ కీర్తనలో యాగం అన్నమాట వాడడాన్ని గురించి చెప్తూ, ఈ కీర్తన వేంకటేశ్వరుణ్ణి కృష్ణుడిగా భావించి గోపికా వస్త్రాపహరణాన్ని గురించి రాసినదనీ అన్నారు. "పుష్ప యాగం" అన్న మాటని వాడడం వెనుక మనుషుల్లో ఉండే అహాన్ని, దానివల్ల కలిగే దుర్విచారాల్ని ఆహుతి చేయాలనేది అసలు తాత్పర్యం అని చెప్పారు. ఈ యాగం లో రగిల్చేది జ్ఞానాగ్నిని. ఇక వస్త్రాలనేవి అహానికి ప్రతీకలనీ వాటిని తొలగించడమే వస్త్రాపహరణంలోని తాత్వికార్థమనీ తెలియజేసారు. కీర్తన లోని పదాల్ని వివరిస్తూ అక్కడి స్త్రీల హృదయాలలో కలిగే పులకరింతలు, నవ్వులు, చివరగా బూటకపు తిట్లు అన్నీ పుష్పములనీ, పరిపూర్ణ అర్పణభావమే పుష్పయాగమనీ ముగించారు.
తర్వాట చిమటా శ్రీనివాస్ "వేటూరి పాటల్లో అలంకార వైభవం" గురించి ప్రసంగించారు. జయంతి చక్రవర్తి వేటూరి పాటల పై రాసిన పరిశోధనా గ్రంథం నుంచి సేకరించిన అంశాల్ని వివరించారు. ప్రసంగం లో ప్రతీ పాటకీ పల్లవినీ శ్రావ్యంగా పాడుతూ వివరించారు. వేటూరి పాటల్లో శబ్దాలంకారాలైన వృత్తి, లాట, అంత్యానుప్రాసలు, ముక్తపదగ్రస్తము, యమకాలంకారాల్ని సోదాహరణం గా వివరించారు. ఇక అర్థాలంకారాలైన ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష వంటివే గాక భ్రాంతిమతి, దృష్టాంతాలంకారాల వంటి అనేక అలంకారాల్ని సోదాహరణంగా, శ్రోతలకు వీనుల విందుగా వివరించారు.
చక్కని విందు తో కూడిన విరామం తర్వాత తెలుగులో అరబిక పదాల గురించిన ప్రసంగాల రెండో భాగంగా మహమ్మద్ ఇక్బాల్ కుర్చీ, కమీజు, తారీఖు, జల్సా వంటి పదాల ధాతు నిర్మాణాలు, వాడుక, అర్థ విపరిణామాల గురించి వివరించారు.

చివరగా కిరణ్ ప్రభ "ఆనందాబాయి జోషి" గురించి మాట్లాడుతూ 1880 లలో గొప్ప స్పూర్తి దాయక మహిళ అని చెప్పారు. యమునా బాయి ఆమె అసలు పేరనీ వివాహం తర్వాత ఆనందాబాయిగా మారిందనీ అన్నారు. భర్త గోపాలరావు గారి దగ్గరే ప్రాధమిక విద్యను అభ్యసించినా ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చి ఫిలడెల్ఫియాలో వైద్య విద్యను అభ్యసించిందనీ చెప్పారు. అప్పటికే కుమారుడు కలిగి మరణించినా వ్యక్తిగత సమస్యల్ని అధిగమించి సమాజానికి సేవ చెయ్యడం కోసం వైద్య విద్యాభిలాషి అయ్యిందనీ అన్నారు. అప్పటికాలంలో సముద్రాల్ని దాటి వెళ్లడం వెనుక సమాజ అభ్యంతరాల్ని ఆమె ఎదిరించిన తీరు, అమెరికా వెళ్లడం కోసం, వెళ్లిన తర్వాత స్వదేశ ధర్మాలు సక్రమంగా నెరవేర్చడం కోసం తపన పడ్డ విధానాన్ని కిరణ్ ప్రభ తన సహజ వాగ్ధాటితో శ్రోతలను కట్టిపడేసే విధంగా వివరించారు. 22 సం||రాల పిన్న వయసులో అనారోగ్యంతో ఆమె మరణించి ఉండకపోతే ప్రపంచానికి ఎంతో మేలు జరిగి ఉండేదని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ముగించారు.

పూర్తిగా మూడు గంటల సమయం హాయిగా ఉపన్యాసాలు వింటూ, అభిప్రాయాల్ని పంచుకుంటూ గడిపిన ఈ వీక్షణం సమావేశం ప్రత్యేకమైనదని అంతా సంతోషించారు. ఈ సమావేశానికి డా|| కె.గీత, ఉమా వేమూరి, లెనిన్, వంశీ ప్రఖ్యా మొ.న వారు కూడా హాజరయ్యారు..
-డా|| కె.గీత

వీక్షణం సాహితీ గవాక్షం -17 (Jan12, 2014)

ఈ నెల వీక్షణం సమావేశం జనవరి 12, ఆదివారం సాన్హోసే లోని రావు తల్లాప్రగడ గారి ఇంట్లో జరిగింది. సాహిత్యాభిలాషులు సౌహార్ద్ర వాతావరణంలో సమావేశం జరుపుకున్నారు.ఈ సమావేశానికి ముఖ్య ఆకర్షణ విశిష్ట అతిథి, ప్రముఖ స్రీవాద రచయిత్రి,కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.కాత్యాయినీ విద్మహే గారు.
శ్రీ రావు తల్లాప్రగడ గారు ''బడిలో ఏముందీ, దేవుని గుడిలో ఏముందీ'' అన్న సినీగీత చరణాలతో సభను ప్రారంభించారు. ''ఏ వేదంబు పాటించె లూత'' అంటూ ధూర్జటి పద్యాన్ని, ''భక్తి కారణమగుగాని చదువు కారణమగునే'' అనే మొల్ల రామాయణ అవతారికలోని ఉదాత్త పద్య పాదాలను గొంతెత్తి శ్రావ్యంగా ఆలపిస్తూ చక్కని సాహితీ వాతావరణానికి తెర తీసారు. విశిష్ట అతిథి శ్రీమతి కాత్యాయినీ విద్మహే గారిని క్లుప్తంగా పరిచయం చేస్తూ వారి జీవనానుభావాన్ని పంచవలసిందిగా కోరారు.
అందుకు విద్మహే గారు నిసర్గ మందహాసంతో ప్రశాంత వైదుష్య సంభాషణంగా తమ అనుభవ సారాన్ని సభకు అందించి అలరించారు. వేదిక మీది ఉపన్యాసాల లాగా కాకుండా సాహితీ సకుటుంబీకుల మధ్య సాగిన ముచ్చట్ల సమాహారంగా సభ ఆత్మీయంగా కొనసాగింది.
విద్మహే గారు క్లుప్తంగా తమ బాల్య జీవితం గురించి చెబుతూ తన తండ్రి కేతవరపు రామశాస్త్రి గారు స్వయంగా సాహిత్యవేత్త కావటం, తన చిన్ననాటి వాతావరణం సాహిత్యానుకూలంగా ఉండడం చక్కని నేపథ్యంగా అంది వచ్చిందన్నారు. వరంగల్ లోని తన విద్యాభ్యాసం రోజులలోనే స్త్రీవాద భావాలకు అంకురార్పణ జరిగిందని, వివక్షను ప్రశ్నించాలన్నపట్టుదల అప్పుడే మనసులో గట్టిగా నాటుకుందని చెప్పుకొచ్చారు. ఆనాటి ప్రాంతీయ సామాజిక జనజీవనాన్ని అనేక అసమానతలు, వివక్షలు , అణచివేతలు కుదిపివేసేవని, ప్రజలలో తిరుగుబాటు ధోరిణి, రాడికల్ వామపక్ష భావజాలం విస్తృతంగా ఉండేదని, అప్పుడే తానూ మార్క్సిజం వేపు మొగ్గుచుపానని తెలిపారు. అప్పుడే దళిత, రైతాంగ, కులతత్వ, గిరిజన, మైనారిటీ, తెలంగాణ ప్రాంతీయ అణచివేతలే కాక సమాజంలో పురుషాధిపత్యం బలంగా పాతుకొని పోయిన సత్యాన్ని గ్రహించడం జరిగిందని వాక్రుచ్చారు. అదే సమయంలో ఓల్గా, రంగనాయకమ్మ, కొండేపూడి నిర్మల వంటి రచయిత్రులు స్త్రీవాద దృక్పథం వేపుకు మొగ్గుచూపారని తెలిపారు. స్త్రీవాదం ఒక అస్థిత్వ స్వరూపంగా ఆవిర్భవించింది 1982 లోనని, ఆ ఏడే అంతర్జాతీయ మహిళా దశాబ్దిని పురస్కరించుకొని ప్రతి university లో women studies wing ప్రారంభించాలని దేశావ్యాప్త పిలుపు రావడంతో తాము కార్యాచరణకు పూనుకున్నామని, పాఠ్య syllabus లో స్త్రీవాద దృక్కోణంతో రచించబడిన రచనలను చేర్చే ప్రయత్నం జరిగిందని చెప్పుకొచ్చారు. University women cell workshop లలో group research నిర్వహించడం జరిగిందన్నారు.తానూ,సహోద్యోగులైన శోభ, జ్యోతీ రాణి తమ రచనలను స్త్రీవాద దృక్పథం లోనే రాయాలని గట్టిగా నిర్ణయించుకున్నామని తెలిపారు. రాసేది సాహిత్యమైనా, ఆర్ధిక శాస్త్ర విషయమైనా నియంత్రిత స్త్రీ అంతరంగాన్ని చీల్చుకొని పుట్టుకొచ్చే స్వేచ్ఛా భావాలను స్త్రీల దృష్టికోణం నుంచి నిర్భయంగా రాయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
శ్రీమతి విద్మహే గారి ప్రశాంత ప్రసంగం ఇంకా ఇలా సాగింది.

అనాదిగా మగవాళ్ళ ఆడవాళ్ళ ప్రపంచాలు వేరువేరుగా ఉంటూవచ్చాయి. స్త్రీకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కరువయింది. మొల్ల, గార్గి, మైత్రేయి లాంటి సాహిత్యాలకు కూడా ప్రాధాన్యత కొరవడింది. ప్రాచీన సాహిత్యం పురుషాహంకారానికి గురిఅయింది. స్త్రీ సాహిత్యం ప్రాశస్త్యం పొందలేక చరిత్ర కెక్కలేక పోయింది. అప్పట్లో స్తూలంగా సూచించబడిన 600 ప్రాచీన కవులలో కేవలం ఆరుగురు మాత్రం కవయిత్రులుండడం అందుకు నిదర్శనం. ప్రాచీన గ్రంధాలలో నిర్దేశిత గుణాత్మక విలువల ప్రస్తావనే ఉందిగాని స్త్రీ అంతర్గత హృదయం ఆవిష్కరించబడలేదు. ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకంలో స్త్రీల వివాహేతర సంభందాల మీదే ఎక్కువ చర్చ జరిగింది. పురాణేతిహాస స్త్రీ పాత్రల గురించి స్త్రీ దృక్పథాదర్శనంగా పరిశోధన జరుగలేదు. భరతుని నాట్య శాస్త్రం, అలంకార శాస్త్రాలు స్త్రీలు ఎలా మెలగుకోవాలనే చెప్పాయిగాని వారి అంతరంగ ఆకాంక్షల కనుగుణమైన భావాల అభివ్యక్తికి న్యాయం చేకూర్చలేదు. స్త్రీల సమగ్ర సాహితీ చరిత్ర ఈనాటికీ లేదు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ వంటి 200 మంది ప్రాచీన అర్వాచీన కవయిత్రుల నామసూచి తప్ప తాళ్ళపాక సుభద్ర మంజీర ద్విపద లాంటి కావ్యాలకు కూడా రావలసినంత గుర్తింపు రాలేకపోయింది. పురుషాధిక్య prejudiced attitude !
ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ ప్రశ్న తలెత్తుతుంది. ఎక్కడ ఆధిపత్యం ఉంటుందో అక్కడ ధిక్కారం పైకి లేస్తుంది. ధిక్కారం వాదంగా, ఘర్షణగా, ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. మగవాళ్ళ రచనలన్నీ 'నేను జ్ఞానిని, వినండి' అన్నట్లుంటాయి. ఆడవాళ్ళ రచనలు వినమ్రతను ప్రదర్శిస్తాయి. తరిగొండ వెంకమాంబ, రంగాజమ్మ లాంటి వారు సైతం 'మాకు వ్యాకరణం ఛందస్సు రాదు' అనే చెప్పుకున్నారు. బుచ్చిబాబు భార్య శివరాజు సుబ్బులక్ష్మి తన రచనల కన్నా తన భర్త గారి రచనల పైనే ఎక్కువ ఆసక్తి చూపేవారు. తరతరాలుగా వస్తున్న ఈ వినయ సంపదను అలనాటి రచయిత్రులు అనివార్య strategic silence గా అలవరచుకొని ఉంటారు.
సాహిత్యం గొప్ప విషయం.అది ధ్వనిప్రధానమయినది.స్ఫురింప చేసేది.స్త్రీ మాటలలో సహజసిద్ధ ధ్వని ఉంటుందని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేవారు. సాహిత్యం 'మహాప్రస్థానం 'తో ఆగిపోకుండా మరోప్రస్తానం కేసి ముందడుగు వేయాలి.
నిజానికి ప్రత్యేక వాదాలకు ఆందోళన చెందవలసిన పనిలేదు. వాదం మనకు లోచూపూను ప్రసాదించి మన అనుభవ ప్రపంచాన్ని విస్తరింప చేస్తుంది. సమాజంలో స్థిరపడి పోయిన అనర్థాల, వైరుధ్యాల వాస్తవాన్ని కళ్ళముందు ఉంచుతుంది. మనుషులను మనుషులుగా చూడటం, ప్రేమించడం నేర్పుతుంది.
సాహిత్య అకాడమీ బహుమతి తెచ్చిపెట్టిన 'సాహిత్యాకాశంలో సగం' గురించి మాట్లాడుతూ ఆ పుస్తకంలో ముఖ్యంగా కవిత్వం,కథల విశ్లేషణ ,methodology ,బండారు అచ్చమాంబ, వట్టికొండ విశాలాక్షి, రంగవల్లి లాంటి వాళ్ళపై వ్యాసాలూ ఉన్నాయని వివరించారు విద్మహే గారు.
ఇలా విద్మహే గారి ప్రసంగం ధారాళంగా, ప్రశాంతంగా, మందహాస భరితంగా సాగింది.
ప్రసంగం మధ్యలో మనుస్మృతి చర్చ, ఛందస్సు పై ఉప చర్చ, సభికుల ప్రశ్నల పరంపర-ఇలా ఉల్లాసంగా,ఆత్మీయంగా సాగింది వారి ప్రసంగం.
తర్వాత వేమూరి వెంకటేశ్వర్లు గారు university of California,Berkely తెలుగు విద్యాపీఠం గురించి ప్రస్తావిస్తూ ఆ తెలుగు విద్యాలయం కొనసాగాలంటే మరి కొంత విరాళసేకరణ అనివార్యమని ,అందరి సహకారం ఉంటే అమెరికాలో తొలి తెలుగు విశ్వవిద్యాలయం చిరంజీవి అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.
ఆ తరువాత కవిసమ్మేళనం. మొదట శ్రీమతి కె. గీత గారు 'అబ్బాయి ఇరవయ్యవ పుట్టిన రోజు 'వచన కవిత వినిపించారు. యుక్త వయస్సులో ప్రవేశించిన తన కొడుకులో తొలినాటి శైశవ బాల్య సౌకుమార్య మార్ధవాలను మాతృత్వ వాత్సల్యంగా కవితావేశంగా పునర్దర్శించుకున్నారు. పిదప నాగరాజు రామస్వామి 'కొత్తభయాలు'అనే వచన కవిత , రవీంద్ర గీతి అనువాద పద్యం వినిపించడం జరిగింది. ఆతరువాత శంషాద్ ఆంధ్రజ్యోతి లో ప్రచురించబడిన 'మందివ్వమ్మా'అనే వచన కవితను వినిపించి శ్రోతలను అలరించారు.
సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశం ఆద్యంతం ఆనందదాయకంగా నడచింది.
- రచన :  నాగరాజు రామస్వామి 
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb14/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2014/february/feb_2014_vyAsakoumudi_vikshanam.pdf


Thursday 2 January 2014

వీక్షణం సాహితీ గవాక్షం -16 (Dec 15, 2013)



 
 
వీక్షణం పదహారవ సాహితీ సమావేశం ప్లెసంటన్ లోని వేమూరి గారింట్లో జరిగింది. సభకు ఆహ్వానం పలుకుతూ వేమూరి పదహారు నెలలుగా నెలనెలా కొనసాగుతున్న ఈ సాహితీ గవాక్షం మొదటి సమావేశం వారింట్లోనే జరగడం తమకు గర్వ కారణం అన్నారు. సభకు అధ్యక్షత వహించిన యువ కవి శివచరణ్ గుండా ముందుగా బే ఏరియా ప్రముఖ కథా రచయిత, ఈ - మాట సంస్థాపకులు అయిన శ్రీ కె.వి. ఎస్. రామారావు గారిని ఆహ్వానించారు.
రామారావు ఈ - మాట తొలి దశ నుండి ఇంత వరకూ దాదాపు పదిహేనేళ్ల ప్రస్థానాన్ని సభలోని వారందరితో పంచుకున్నారు. ఆస్టిన్ లైబ్రరీ లో తెలుగు విభాగం లో ఒంటరి పాఠకుడిగా ఆలోచనలు ప్రారంభమైన కాలం నుండి మిత్రులు కనక ప్రసాద్, కొంపెల్ల భాస్కర్, లక్షణ్ ల తో స్నేహాన్ని , ‘ తెలుసా? ’ చాట్ గ్రూప్ ద్వారా ప్రారంభమైన పత్రికా చర్చ తరువాత ఇంటర్నెట్ పత్రికగా తొలి సంచిక వెలువడే వరకు పడిన శ్రమనంతా గుర్తుకు తెచ్చుకున్నారు. తొలి సంచిక లో టెక్నికల్ సమస్యల గురించి ప్రస్తావిస్తూ సరైన తెలుగు ఫాంట్ కూడా లేని దశలో రాత ప్రతి ని జిప్ ఫైల్సుగా పెట్టామన్నారు. మిత్రులు వేల్చేరు, వేలూరి, వేమూరి, జంపాల చౌదరి, పెమ్మరాజు వేణుగోపాల్ తదితరులు విశేషంగా పత్రికాభివృద్ధికి దోహదపడ్డారన్నారు. పేరొందిన వ్యాసాల్ని అందిస్తూ, మంచి ప్రజాదరణ పొందిన వెబ్ పత్రికగా తనకు ఈ - మాట సంతృప్తినిస్తూందన్నారు. ఇక స్వీయ రచనా నేపధ్యం, ప్రస్థానాన్ని గురించి చెప్తూ తొలి నాళ్ల నుంచీ ఒక ప్రవాసాంధ్రుడిగా ప్రవాస సమస్యల్ని కథలుగా మలచడం లోనే ఆసక్తి ఎక్కువ అన్నారు. అలా రాసిన మొదటి కథ ‘ అదృష్టవంతుడు ’ గురించి, తర్వాత రాసిన ‘ కూనిరాగం ’, స్టాక్ మార్కెట్ బూం గురించి రాసిన ‘ పందెం ఎలక ’ మొ.లైన కథల గురించి ప్రస్తావించారు. ఇక్కడి సమాజం లోని క్రైం లలో తెలీక ఇరుక్కున్న అమాయక భారతీయులను గురించి రాసిన మరిన్ని కథలను టూకీగా చెప్పారు. శ్రోతలు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఇక్కడి సమాజం లో పూర్తిగా భాగస్వాములు అయినప్పుడే ఇక్కడి సమస్యలు ఎవరైనా కథలుగా మలచగలరని అన్నారు. దాదాపు గంట పాటు సాగిన ప్రసంగాన్ని అంతా బహు ఆసక్తిదాయకంగా విని ఆనందించారు.

ఆ తర్వాత కథా పఠన కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఆకెళ్ల కృష్ణకుమారి ‘ లెట్ గో ’ కథను వినిపించారు. కొడుకునీ, కోడల్నీ తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం కాకుండా వారి భావాలకు విలువనిస్తూ, స్వేచ్ఛగా వారికీ బాధ్యతని పంచగలిగితే బావుంటుందన్న సున్నితమైన కుటుంబ కథని చిన్న చమక్కు వాక్యంతో చెప్పి కథను మెప్పించారు. "బాగా ఆలస్యంగా కథా రచన ప్రారంభించాను కనుక సరిగా కథలు రాయడం రాదని "భావించే ఆమె చక్కని తేలిక పాటి ప్రవాహంలాంటి రచనా శైలితో అందర్నీ ఆకట్టుకున్నారు.


తేనీటి విరామం తర్వాత వేమూరి బర్కిలీ విశ్వవిద్యాలయం లో తెలుగు విభాగం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతే ఏడేళ్ల నుంచీ జరిగిన అభివృద్ధి కుంటుబడుతుందని ఆవేదన వెలిబుచ్చారు. ఇతోధికంగా ప్రవసాంధ్రులు సహాయం చెయ్యమని, వివరాలకు తనను సంప్రదించమని సభాముఖంగా తెలియజేసారు. మంచి ముద్రణతో తయారైన "పెద్ద బాల శిక్ష" సరిక్రొత్త గ్రంధాన్ని విరాళం అందజేసిన వారికి ఉచితంగా కుమార్ కలగర గారు అందజేస్తారని పేర్కొన్నారు.

తర్వాత కిరణ్ ప్రభ "భండారు అచ్చమాంబ" జీవిత విశేషాల్ని, అందించిన సాహితీ సేవను వివరిస్తూ నిరక్షరాశ్యురాలిగా పసి వయస్సులో పరిణయం తర్వాత ఆమె నాగపూరు నివాసాన్ని, భర్త మాధవరావు, తమ్ముడు కొమర్రాజు లక్ష్మణ రావుల ప్రోత్సాహంతో విద్యాభ్యాస, రచనా వ్యాసంగాన్ని ప్రారంభించడం, చిన్న వయసులో కష్టాలు అనుభవించడం, తన జీవితంలోని అంతులేని దు:ఖాన్ని అధిగమించి తెలుగు కథా చరిత్రలోనే తొలి కథ ‘ ధన త్రయోదశి ’ ని రాయడం మొదలైన విషయాలను కళ్లుకు కట్టినట్లు వివరించారు. నూరేళ్ల కిందట ఆమె రచించిన "అబలా సచ్చరిత్ర రత్నమాల" గొప్పతనాన్ని వివరించారు. పలువురికి సహాయం చెయ్యాలనే మంచి తలంపు కలిగిన ఆమె ప్లేగు బారిన పడి ముప్ఫై సం.రాల పిన్న వయస్సులో మరణించడం దురదృష్టకరం అన్నారు.

కవి సమ్మేళనం లో అపర్ణ గునుపూడి తనకు బాగా నచ్చిన తన తొలి కవిత వినిపించారు, కె.గీత భూగోళానికటూ ఇటూ హృదయాలలో "ప్రవహించే సూర్యోదయం" కవితని, కె.గిరిధర్ "పావురాల వాన", శివచరణ్ "నేనూ సైనికుణ్నే" కవితలు వినిపించారు. చివరగా కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ కార్యక్రమంతో ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశంలో మృత్యుంజయుడు తాటిపామల, ప్రసాద్ నల్లమోతు తదితరులు పాల్గొన్నారు. 

వీక్షణం సాహితీ గవాక్షం -15 (Nov 10, 2013)


 
ఈ నెల "వీక్షణం"సమావేశం పాలో ఆల్టో లోని అపర్ణ గునుపూడి గారి ఇంట్లో జరిగింది. నవంబర్ పది ఆదివారం సాయంత్రం మూడు గంటల పాటు తెలుగు మిత్రులు సాహిత్య ముచ్చట్లను రసోల్లాసంగా పంచుకున్నారు. చిరంజీవి రంజని పాడిన "దండమూ పెట్టేను చూడరా, కొదండపాణీ చూడరా "అనే మంగళప్రద మైన త్యాగరాజ కీర్తన తో సభకు శుభారంభం జరిగింది. మన తెలుగు భాషను అజరామరం చేసిన కర్ణాటక సంగీతాన్ని తలచుకుంటూ, "ఊరు వారూ వీధి వారూ ఒక్క జాతివారూ"అన్న కృతి పరమార్థ సాదృశ స్వరూపాన్ని సభకు ఆపాదిస్తూ, మనమందరం సాహితీ వర్గానికి చెందిన ఒక్కజాతి వారమే నంటూ అపర్ణ గారు సభను సంబోధించడం ఒక చక్కని ఆహ్వానం.

శ్రీ వేలూరు వెంకటేశ్వర రావు గారి అద్యక్షతన, అపర్ణ గారి సందర్భోచిత సహకారం తో సభ ఆత్మీయంగా కొనసాగింది.
మొదట శ్రీమతి కర్రా విజయ గారు తన కథ ను వినిపించారు. కథ ఆలోచింప జేసేదిగా వుంది. కథా సంవిధానం, క్రమానుగత కథా కథన రీతి ఉత్కంఠను రేపేదిగా వుంది. "సాయంత్రం క్షేమంగా ఇల్లు చేరుకున్న ఈడొచ్చిన కూతురు కళ్ళ ముందున్నా, టెలిఫోన్లో అవతలి వైపున అసహాయ స్థితిలో ఉన్న కూతురు లాంటి అమ్మాయి ఎవరో 'తనను ఇంటికి రానివ్వు నాన్నా' అని ప్రాధేయ పడుతుంటే సున్నిత మైన తండ్రి సందిగ్ధ హృదయం కాదనలేక పోయింది." అదీ కథకు కొస మెరుపు. చక్కని ముగింపు.
తరువాత, ప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి రాధిక తన స్వీయ కథా సంకలనం "కథా స్రవంతి" నుండి రెండు కథలను చదివి వినిపించారు.మొదటిది "ఆంతర్యం"-ఆకాశవాణి లో 2001లో ప్రసారమైన ప్రసిద్ధ కథ. రెండవది "మాస్టారికో శిక్ష"-89 లో ఆంధ్రప్రభ లో ప్రచురిత మైన పాపులర్ కథ. సుమారు 500 కథలు రాసి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం పొందిన రాధిక గారు తన తొలి సృజన కాలం నాటి పాత సంగతులను, మధురాంతకం రాజారాం వంటి పెద్దల నుండి పొందిన మన్ననలను తలచుకున్నారు.
తర్వాత శ్రీ రాయసం గణపతి శాస్త్రి గారు మల్లాది వెంకటకృష్ణమూర్తి , యండమూరి వీరేంద్రనాథ్ సాహిత్యం గురించి ప్రసంగించారు.మల్లాది వారి రచనలలో పాఠకులను ఆఖరుదాకా ఆపకుండా చదివించే రీడబిలిటీ లక్షణం ఉందని, "డబ్బెవరికి చేదు" నవలను ఉదహరిస్తూ తెలిపారు. వారు అపరాధ పరిశోధక కథలే కాక శృంగార పరమైన నవలలు,ఆద్యాత్మిక కథలు, ట్రావెలాగ్స్, భజగోవింద వ్యాఖ్యానం, తుదకు హాస్యరస భరితమైన విషయాలను కూడా వదలకుండా సుమారు 150 పుస్తకాలు రచించారని వివరించారు.
వీరేంద్రనాథ్ రచనల గురించి మాట్లాడుతూ అవన్నీ ఇంగ్లీషు రచనల కాపీలని అపవాదు ఉందని ,అయినా వారు పలు పుస్తకాలు ప్రచురించారని తెలిపారు. వారి రచనలు యువ పాఠకులను ఇట్టే ఆకర్షిస్తాయని అన్నారు. తులసి, తులసీదళం, వెన్నెల్లో ఆడపిల్ల, యుగాంతం లాంటి 49 నవలలు రాసారని పొగిడారు. ఐతే, కొందరు శ్రోతలు యండమూరి వి అసలు సాహిత్య విలువలున్న రచనలే కాదని, అవి కేవలం marketable commercial pulp writings లనీ ,దిగజారుడు క్షుద్ర సాహిత్యమనీ, ఆకర్షణీయమైన శైలి అబ్బింది కనుక వారు తన art of selfishness ను చల్లగా సొమ్ము చేసుకున్నారని విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఈ చర్చ అందరినీ ఆకర్షిందని చెప్పక తప్పదు.
ఆతర్వాత,మహ్మద్ ఇఖ్బాల్ గారు అరబ్బీ,పర్షియన్, హిబ్రూ లాంటి semitic భాషలు, ఉర్దూ, సంస్కృత భాషల వంటి indo aaryan భాషలలోని కొన్ని పదాల మూలాల గురించి, వాటి వ్యుత్పత్తుల గురించి, ఆ పదాల మాతృకల గురించి వివరించే ప్రయత్నం చేశారు.సంస్కృత పదాలు శబ్ద/నాద ప్రాతిపదికలనీ, అందుకు భిన్నంగా అరబిక్ మాటలకు శబ్ద మూలాలతో సంబంధం లేదని తెలిపారు.ఇంగ్లీషు భాష natural growth కు చెందిన భాష కాదన్నారు. caligraphy అరబిక్ భాసను సుసంపన్నం చేసే దిశగా అత్యంత దోహదకారి అయిందన్నారు. hindustaani ఉత్తరభారత వాడుక భాషగా రూపొందించబడినది అయినందు వలన (ఇండోఆర్యన్ భాషా మూలాలు ఉన్నప్పటికీ ) అది భారతీయ భాషనే అని అన్నారు. అరబిక్ పదాలకు మూడు అక్షరాల ధాతువులు మూలాధారాలని, ఆధాతువులు 14 స్థాయిలలో (scales) ఉంటాయని, ప్రత్యయాల (suffix/affix) తో కలసి వేలాది పదాలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. తన ప్రస్తుత ప్రసంగాన్ని 'ఖాయం','జమ' అనే రెండు పదాల ప్రాగ్రూప విశ్లేషణ కే పరిమితం చేస్తున్నానని, తదనంతర సమావేశాలలో పదాల సంఖ్యనూ, విశ్లేషణనూ విస్తృతం చేస్తానని తెలిపారు.
తర్వాతి కార్యక్రమం కవిసమ్మేళనం. మొదట కె. గీత గారు వారి స్వీయకవితా సంకలనం "శతాబ్ది వెన్నెల" నుండి ఒక చక్కని వచన కవిత 'ఎగిరొచ్చిన ఇల్లు' వినిపించారు. కవిత లో "ఆనంద నిలయం ఐన తన ఇంట్లో వెచ్చని సూర్యుడు మా అరచేతుల్లో వికసిస్తాడని, ఇంట్లో ప్రవహించే సెలయేళ్ళు ఉన్నాయని" బహు రమ్యం గా వర్ణించారు.పిదప నాగరాజు రామస్వామి తన స్వీయ కవితా సంకలనం "ఓనమాలు'', అనువాద కవితా సంకలనం 'అనుధ్వని' నుండి ఒక్కొక్క కవిత వినిపించారు. తర్వాత రాకేశ్వర్ రావు "జెట్లాగ్" ఒక సంసృత స్వీయ రచనను వినిపించి దానికి తన తెలుగు సేతను కూడా జతపరచడం విశేషం.

ఆనవాయితీగా వస్తున్నక్విజ్ కార్యక్రమాన్ని శ్రీ కిరణ్ ప్రభ గారు సమర్థ వంతంగా నిర్వహించి సభలో ఉత్సాహాన్ని ఇనుమడింప జేశారు.
ఆఖరు గా ఫోటో సెషన్, అపర్ణ సుబ్బారావు గార్ల కమ్మని స్నాక్ విందు, రాయసం కృష్ణ కాంత్ పాడిన పసందైన పాటల శ్రావ్యత ! ఈ సమావేశం చక్కని సాయంత్రాన్ని స్వంతం చేసుకున్నామన్న సంతృప్తిని అందరిలో మిగిల్చింది. ఈ కవితా గవాక్ష వీక్షణం చిరకాలం ఇలాగే కొనసాగుతుందనడంలో సందేహం లేదు.
--నాగరాజు రామస్వామి.
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec13/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2013/december/dec_2013_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం 14 వ సమావేశం(Oct 13, 2013)



వీక్షణం 14 వ సమావేశం ఫ్రీమౌంట్ లో శ్రీ వంశీ ప్రఖ్యా ఆతిథ్యంలో జరిగింది. ఈ సభకు అధ్యక్షులుగా వంశీ ముందుగా కథా రచయిత శ్రీ బి.పి కరుణాకర్ గారిని ఆహ్వానించారు. కరుణాకర్ తన రచనలకు ప్రేరణ గా నిలిచిన పాశ్చాత్య కథల గురించి చెబ్తూ చెకోవ్ కథలను ప్రస్తావించారు.  కథకు చివర ముగింపు ఎప్పుడూ పాఠకుణ్ణి ఆలోచింపజేసేదిగా ఉండే లక్షణం తాను అటువంటి రచయితల నుండి అలవరచుకున్నానని తెలిపారు. ఇక కథల్లోని పాత్రధారులు మన చుట్టూ పరిభ్రమించే మన ప్రపంచం నుంచే పుడతారని గుర్తు చేసారు. స్వీయ కథ లలో నుంచి "పొగ" అనే కథ ను కళ్లకు కట్టినట్లు వినిపించారు. ఈ కథను డబ్బుకు, మానవీయ విలువలకు ఉన్న ప్రత్యక్ష సంఘర్షణను సన్నివేశ చిత్రాల ద్వారా ఎలా చెప్పొచ్చో ఉదాహరణ గా పేర్కొన్నారు.

ఆ తరువాత శ్రీ మహమ్మద్ ఇక్బాల్ "నన్నయ్య కవితా రీతులను" గురించి వివరంగా పరిశోధనాత్మక ప్రసంగం చేసారు. నన్నయ్యకు పూర్వం కవిత్వం ఎలా ఉండేదో  శాసనాల ద్వారా లభ్యమైన సమాచారాన్ని, నన్నయ్య ను భారతాంధ్రీకరణకు పురిగొల్పిన పరిస్థితులను, భారత రచనా పద్ధతుల్లో కవిత్రయానికున్న విలక్షణతను  సోదాహరణంగా వివరించారు. ఇక నన్నయ్య కవితా రీతులైన "ప్రసన్న కథా కలితార్థ యుక్తి", "అక్షర రమ్యత", "నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము" భారత రచన లో చోటు చేసుకున్న విధానాన్ని చక్కగా వివరించారు.
ఆ తర్వాత శ్రీ కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన క్విజ్ కార్యక్రమం సభ లో హాజరైన వారిని ఆనందంతో ఉత్తేజితుల్ని చేసింది. సాహిత్య ప్రధాన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి పుస్తకాలు బహుమానం గా అందాయి. 

ప్రతీ సారీ జరిగే క్విజ్ కార్యక్రమం లో ఇలా పుస్తకాలు బహుమతిగా ఇచ్చే వీలు కోసం సభ్యులను తమ గ్రంధాలయంలో నిల్వ ఉన్న పుస్తకాలను "వీక్షణం గ్రంథాలయానికి" తెచ్చి ఇవ్వమని ఈ సందర్భంగా కిరణ్ ప్రభ గుర్తు చేసారు. ఈ సారి సమావేశం లో బహుమతి పుస్తకాలను  శ్రీమతి కె.శారద అందజేశారు. 
దసరా రోజున జరిగిన సమావేశం కావడం తో ఈ సారి వీక్షణం సభ సాహితీ మిత్రులతో సరదా పండుగగా సాగింది.
శ్రీమతి వంశీ పిండి వంటలతో విందు చేసారు.
కవి సమ్మేళనం లో డా|| కె.గీత పాప ను బడి నుంచి తీసుకు వచ్చే దృశ్యాన్ని ఆవిష్కరించే "బడి పాపాయి" కవితను  చదివి వినిపించారు. వంశీ ప్రకృతి పరమైన కవితల్ని వినిపించారు.  ఈ సభకు శ్రీ వేమూరి, శ్రీ పిల్లల మర్రి, శ్రీ రాజేంద్ర, శ్రీమతి గునుపూడి అపర్ణ, శ్రీమతి రాధిక, శ్రీ ప్రసాద్ మొ.న వారు హాజరయ్యారు. వచ్చే సమావేశం పాలో ఆల్టో లోని శ్రీమతి గునుపూడి అపర్ణ గారింట్లో జరగనుందని గీత ప్రకటించారు.
 

http://koumudi.net/Monthly/2013/november/nov_2013_vyAsakoumudi_vikshanam.pdf