Monday 21 October 2013

వీ క్ష ణం- సాహితీ గవాక్షం - వార్షి కోత్సవం (Sep,15- 2013)


వీ క్ష ణం- సాహితీ గవాక్షం - వార్షి కోత్సవం

                             

              సెప్టెంబర్ 15 న బే ఏరియా సాహితీ మిత్రులు తమ 'వీక్షణం' ప్రథమ వార్షిక సమావేశాన్ని ఘనంగా జరుపుకున్నారు.మిల్పీటాస్ ఇండియా కమ్యూనిటీ సెంటర్  ICC లో సుమారు డెబ్భై మంది సాహిత్యాభిమానులు తెలుగు వెలుగు లయ్యారు.ఆరు గంటల పాటు ఆత్మీయ ఆనందోత్సవాలు వెల్లువెత్తి సభ సాహిత్యోత్సవ మయింది.
             డా||కె.గీత గారు గత సంవత్సర కాలంగా సాగుతున్న సాహితీ గవాక్షం అపురూప అక్షర క్షణాలను విహంగ వీక్షణ మాత్రంగా దర్శింప జేస్తూ సభకు నాంది పలికారు. వివిధ సాహిత్య కళా రంగాలలో లబ్దప్రతిష్ఠులైన  వరిష్ఠ అతిథులను ఆహ్వానించి వారి అనుభవ సారాన్ని, సాహితీ సంపదను ఎలా అందిపుచ్చుకోవడం జరిగిందో, పాపినేని శివశంకర్, నరిశెట్టి ఇన్నయ్య, అక్కిరాజు రమాపతి రావు, అల్లం రాజయ్య, చుక్కా రామయ్య, గొల్లపూడి మారుతీ రావు వంటి మహానుభావులు గత వీక్షణం సమావేశాలను ఎలా సుసంపన్నం చేశారో టూకీగా తెలియపరిచారు. 
Smt Nandamuri Lakshmi Parvathi

ఈ సభకు శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి గారువిశిష్ట అతిథి కావడం విశేషం.  శ్రీ ఆకెళ్ళ గారు మరో ఆకర్షణ.
             'కౌముది' సంపాదకులూ,  వీక్షణం అంతస్ఫూర్తీ ఐన శ్రీ కిరణ్ ప్రభ గారు విశిష్ట అతిథులకు స్వాగత వచనాలు పలికి వారిని లాంఛన ప్రాయంగా సభకు పరిచయం చేశారు. భాషా ప్రవీణ తొలి అడుగుగా డాక్టరేటు దాకా సాగిన లక్ష్మీ పార్వతి గారి సాహిత్య ప్రస్థానం గురించి ప్రస్తావిస్తూ వారు ఒక నవలా రచయిత్రి గా, ఒక కవయిత్రి గా, ఒక ఆధ్యాత్మిక అభిజ్ఞులుగా, ఒక పరిణిత రాజకీయ వేత్త గా ఎలా ఎదిగిందీ ఉటంకిస్తూ వారి రచనలు ‘తెలుగు తేజం’, ‘ఎదురులేని మనిషి’, ‘ఆద్యంతాలు’, ‘భజగోవింద వ్యాఖ్యానం’, ముఖ్యంగా NTR గారి పౌరాణిక పాత్రల విశ్లేషణ గురించి క్లుప్తంగా మాట్లాడుతూ 'ఆధునిక జీవితం-ఆధ్యాత్మికత' అంశం పై ప్రసంగించవలసిందిగా వారిని కోరారు.
              శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు ప్రసంగం ప్రారంభిస్తూ రాజకీయాలతో విసిగి వేసారిన తనకు 'వీక్షణం' పిలుపు చల్లని ఊపిరినిచ్చిందని కృతజ్ఞతలు  తెలుపుకున్నారు. 'సహితానాం భావం సాహిత్యం'-సమాజానికి హిత మైనదే సాహిత్యం. మూడువేల ఏళ్ళ ప్రాచీన చరిత్ర గల తొలి ప్రపంచ భాష సంస్కృతమనీ, తెలుగు తొలి తత్సమ భాష అనీ, హిందీ లాటిన్ వంటి ఇతరేతర భాషలు ఆ తరువాతే వచ్చిన గీర్వాణ భాషామ తల్లి ముద్దు బిడ్డలని వాక్రుచ్చారు. శివ తాదాప్త్య తాండవం లో ఢమరుకం రాల్చిన బీజాక్షరాల తత్సమ తద్భవ రూపాంతర ఉన్మీలనమే తెలుగు భాష అన్నారు. వ్యాసవాల్మీకాది అక్షర యోగుల రుగ్వాక్కులు, రాయప్రోలు గురజాడల సాహిత్య ధునులు, సమకాలీన సాహితీ స్రవంతులు నేటికీ తెలుగు సారస్వత క్షేత్రాలను సస్యశ్యామలం చేస్తున్నాయి అని అన్నారు. తెలుగు భాషా క్షేత్ర వైశాల్యం అమేయం. అక్షర సౌలభ్యం, జాతిలక్షణ సొబగు, ఇతర ప్రాంతీయ భాషలను సునాయాసంగా తనలో ఇముడ్చుకోగల సౌమనస్య పరిధి, శాస్త్రీయ సంగీతాన్నీ, శ్లోకాన్నీ, పద్యాన్నీ హృద్యంగా హత్తుకోగల సుగమమైన భాష తెలుగు భాష. 'తేనె బిందువు చిలికుతే తెలుగు భాష'. అత్యంత రామణీయకతను సంతరించుకున్న సుందరమైన భాష ఐనందు వల్లే తెలుగును 'Italian of the East' అన్నారు. ఇలాంటి అపురూపమైన, అపూర్వమైన తెలుగు భాష నేడు రాజకీయ ఉరికంబ మెక్కిందని లక్ష్మీ పార్వతి గారు వాపోయారు. జాతీయ స్వాతంత్రోద్యమంలో సముచిత పాత్ర పోషించిన అలనాటి తెలుగు కవులను, ప్రాంతీయ తెలుగు కవితా వైభవానికి ప్రతీకలైన కాళోజి వంటి మహనీయులను తలచుకున్నారు.
              ఆధునిక జీవనానికి అవసరమైన ఆధ్యాత్మిక ఆవశ్యకతను ప్రస్తావిస్తూ శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు ఆధ్యాత్మిక తత్వసారాన్ని  ప్రతిష్టాపించిన ఆదిశంకర భగవత్పాదుల  అద్వైతం భారతీయ ఆరాధ్య చైతన్య దర్శనంగా పేర్కొన్నారు. ఆనాడు చికాగో లో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభలో భారత దేశం నిరుపేద దేశంగా చిత్రీకరించ బడినప్పుడు వివేకానందుడు భారతదేశం నాటికీ నేటికీ ఒక ఆత్మసంతృప్తి సంపదతో తులతూగుతున్న ఆధ్యాత్మిక వైభవ వంతమైన అత్యంత సంపన్న దేశంగా అభివర్ణించాడని, 'India ,indeed, is a rich country. if India is lost every thing in the world is lost ' అంటూ వారిని నిర్ద్వందంగా ఖండించారని గుర్తు చేశారు.
            కాని, నేడు మనిషి మస్తిష్కం దుర్మార్గ దురభిమాన అధికార వ్యామోహాలకు వశమైపోయి జన్మాది జీవసంస్కారం ఆనంద భూములను వదలి ఇంద్రియ లంపటత్వం లో కూరుకు పోతున్నదని వాపోయారు. స్వార్థ చింతన కారణంగా ఎలా శోకం ఉద్భవిస్తుందో, శోకం క్రోధంగా, భ్రష్ట సమ్మోహనం గా, స్మృతి భ్రంశంగా మారి బుద్ధి నాశనానికి ఎలా దారి తీస్తుందో భగవద్గీత శ్లోక యుక్తంగా ప్రవచించారు. మూర్తి కాయానికీ,  కీర్తికాయానికీ అతీతమైన ఆత్మచైతన్య సూక్ష్మ కాయం మన అంతరాంతరాలలోనే ఉందని, బుద్ధి, చిత్తం, అహం తో జటిలమైన మనోప్రవృత్తి లింక్ తెగిపోయిన నాడు భౌతిక శరీరం నశించి జీవశక్తి మరణాన్ని దాటి పునర్జన్మ ఆవరణ లో మార్పిడికి లోనౌతుందని వాక్రుచ్చారు. నేను శరీరాన్ని కాదు, నేనొక ఆత్మశక్తిని అని తెలుసుకోవడమే అమృతత్వమని  తెలిపారు. జీవితం దుఃఖ భరిత మవడానికి మూల కారణం భౌతికతను అంటిపెట్టుకొని వేలాడడమేనని, బట్రాండ్ రస్సల్ అందుకే '' All the world is too much with us''అని విన్నవించారని వివరించారు. ఎంతటి వాడైనా ఈలోకాన్ని వదలి వెళ్ళిపోయేది empty hands తోనే అని సూచిస్తూ అలగ్జాండర్ అంతటి విశ్వ విజేత తన అంతిమ ప్రస్థాన యాత్రా శవ పేటికలో నుండి తన రిక్త హస్తాలు బయటికి కనిపించేలా ఉంచాల్సిందిగా అవసాన దశలో అంతిమ సందేశం జారీ చేశాడని తెలిపారు. అనన్యమైన భారతీయ తత్వ చింతనకు ప్రభావితులైన గ్రీకులు యుద్ధానంతరం వెళుతూ వెళుతూ మన పండితులను ఎత్తుకెళ్ళారని వివరించారు.
             ఇంతటి తాత్విక గత వైభవం గల భారతీయ సగటు ఆధునిక జీవి ఇప్పుడు డబ్బుకు అడిక్ట్ అవుతున్నాడు. స్వార్థం పెచ్చుమీరి పోతున్నది. పరమ శ్రేష్ట మైన పారమార్థిక చింతన నుండి దిగజారి పోతున్నాడు. ఇదంతటికి కారణం కోర్కెల విజృంభణమే. మహా భారత యుద్ధానికీ,  సీత కష్టాలకూ మూల కారణం కోర్కెలే కదా అని విన్నవించారు. అందుకే ప్రస్తుత నిత్య జీవితంలో మనిషి ధనాపేక్ష తగ్గించుకోవడం, కోర్కెలను అదుపులో పెట్టుకోవడం, మనసును ఆరోగ్య ప్రదంగా నిర్దేశించుకోవడం ఎంతైనా అవసరం అనీ, ఆధునిక మానవుడు ఆధ్యాత్మిక స్పర్శతో కూడిన ఆలోచన అలవరచుకోవాలనీ హితవు పలికారు.
           కాళిదాసు శాక్తేయుడా అన్న పిల్లల మర్రి గారి ప్రశ్నకు సమాధానంగా కవి కాళిదాసు శాక్తేయుడు కాదు, అతడు సిసలైన శివభక్తుడని బదులు పలికారు.
           శ్రీమతి లక్ష్మీ పార్వతి గారి ప్రసంగం పాండిత్య ప్రకర్షతో, ఆధ్యాత్మిక ఎరుకతో, సంసృతభూయిష్టంగా పసందుగా సాగి సభికుల మన్ననలను అందుకుంది.   
          ఆ తరువాత ఆకెళ్ళ గారి ఉపన్యాసం.''నేటి నాటక రంగ వ్యవస్థ- పోటీ నాటకాలు'' ప్రధానాంశంగా ప్రసంగం సాగింది. గత నెల 'వీక్షణం-12'లో వారు జరిపిన నాటక/సినిమా రంగ విస్తృత చర్చకు కొనసాగింపుగా దీనిని భావించ వచ్చు. మృత్యుంజయుడు గారు ఆకెళ్ళ గారి సాహిత్య జీవితాన్ని ముక్తసరిగా ముచ్చటిస్తూ వారిని సభకు పరిచయం చేశారు.
        ఆకెళ్ళ గారు మాట్లాడుతూ నేటి నాటకరంగ నిరాశాజనకమైన పరిస్థితి గురించి, దిగజారుతున్న రంగ స్థల వ్యవస్థ గురించి ముఖ్యంగా నాటక రంగ పరిషత్తుల గురించి లోతైన ఆలోచనలు వ్యక్తపరిచారు.1943 మొదలుకొని నేటి దాకా నడుస్తున్న పరిషత్తులతో తనకున్న స్వీయానుభావాన్ని సభకు పంచారు.ఆంధ్ర నాటక కళా పరిషత్తు, ప్రజానాట్య మండలి, NTR నాటక పరిషత్తు-ఇలా అనేక పరిషత్తుల వ్యవహార లోగుట్టులను బయల్పరిచారు. ఒకానొక కాలంలో నాటకం వల్ల ప్రజలు ఎక్కడ educate ఐపోతారోనని, ఎక్కడ తిరగ పడుతారోనని కొందరిలో భయం ఉండేదని, ఆ సంకుచితత్వమే తెలుగు నాటకం ఎదగకుండా పోవడానికి మొదటి కారణం అయిందని భావించారు. స్వాతంత్ర కాంక్ష రగిలించే చక్కని నాటకాలు జాతీయ స్వాతంత్రోద్యమం కాలంలో వచ్చాయని, 1947 తర్వాత తెలుగు నాటకం ఒక గొప్ప ఇతివృత్తాన్ని కోల్పోయిందన్నారు. నాటకాల నాణ్యతనూ, ప్రామాణ్యాన్నీ, ప్రాచుర్యాన్నీ కాపాడవలసిన నేటి పరిషత్తులు నిజానికి స్వయం అవరోధకాలవుతున్నవి. కులతత్వం, అహం
భావం, వ్యక్తిగత ఈర్ష్య ఇత్యాది కారణాలవల్ల healthy compitition కొరవడుతున్నది. సామాజిక చైతన్యం పేరిట వెలసిన పరిషత్తులు కళాత్మకత పై కాక బహుమతి కొట్టేసే ఎత్తుగడల పైనే శ్రద్ధ చూపుతున్నారు. వారి గొంతెమ్మ కోర్కెలు కోకొల్లలు. ఆర్థిక లాభం, గెలుపు ధ్యేయంగా రచయితలపై పలు ఆంక్షలు పెడుతున్నారు. దాంతో రచయితది conditioned mind ఐపొతున్నది. అతని ప్రతిభ, కళా విలువలు బయటికి రాలేక పోతున్నవి. పరిషత్తులకు కావలసింది గెలుపు గుర్రాల ఇతివృత్తాలు, commercial ఆర్టిస్ట్స్ కాక చౌకబారు నటులే ఉండాలి, ఒకటి రెండుకు మించి స్త్రీ పాత్రలు ఉండరాదు,heavy డైలాగులు ఉండ కూడదు, హాస్య నాటకాలు, దీర్ఘ నాటకాలు నిషేధం. పద్య నాటకాల నటులు గుంపులుగా విడిపోయి రెహర్సెల్స్ చేస్తుండడం వల్ల  ఏఒక్క పాత్రధారికీ  నాటకంపై సంపూర్ణ అవగాహన లేకపోవడం వల్ల ప్రదర్శనలు రససిద్ధి పొందలేకున్నవి. ఫార్ములా కథలనే ఎన్నుకొని 'మోస నాటకాలు'రాయక తప్పని పరిస్థితి. తానూ ఒక ఆరితేరిన మోసనాటక కర్తనే అని ఆకెళ్ళ గారు ఛలోక్తి విసిరారు.


          నాటక విజయానికి ఇతివృత్త బలంతోపాటు ప్రదర్శనా బలం కూడా ఉండాలి. భారతదేశంలో ఇతివృత్తానికి ప్రాధాన్యతనిస్తే, విదేశాలలో ప్రదర్శనా పటిమకు ప్రాధాన్యం. అమెరికా లోని ఇల్లినాయ్ రాష్ట్రం లోని బ్రాన్సన్ పట్టణం నాటకాలకు పెట్టింది పేరు. ఆ ఒక్క పట్టణం లోనే 64 థియేటర్లు ఉన్నవి పరి పూర్ణ కళాఖండాలను ప్రదర్శించడమే లక్ష్యంగా వాళ్ళు పోటీ పడుతుంటారు. అంతటి ఆరోగ్యకరమైన వాతావరణం మన తెలుగునాట అసంభవం. నేడు తెలుగుదేశంలో నాటకాలను కాపాడుతున్నది గ్రామీణ నాటక సమాజాల శ్రీరామ నవమి లాంటి పండుగలు, వీధి రికార్డింగ్ డాన్స్లులు, స్కూల్ వారోత్సవాలు మాత్రమే అన్నారు ఆకెళ్ళ గారు.
      పొరుగు రాష్ట్ర మైన తమిళనాడులో నాటకరంగం దినదిన ప్రవర్ధమాన మౌతున్నది. పరిషత్తులను అనుసంధిస్తూ వారు ''సభ''లను పోషిస్తున్నారు. నటులలో, రచయితలలో, నిర్వాహకులలో, ఆత్మవిశ్వాసం పెరిగి కళాత్మకత ఆవిష్కరించబడుతున్నది. కనుక నేటి మన తెలుగు నాటక రంగ పురోభివృద్ధికి అలాంటి వ్యవస్థల ''సభా సంస్కృతి మాత్రమే పరిష్కార మార్గమని ఆకెళ్ళ గారు నొక్కి వక్కాణించారు .
              తదనంతరం మరో ఆసక్తికరమైన అంశం చిమట శ్రీనివాసరావు గారి ఆర్థిక సహాయం తో వెలుగు చూచిన విశిష్ట గ్రంధం ''స్వర్ణయుగ సంగీత దర్శకులు'' ఆవిష్కరణ. తొలినాటి సంగీత దర్శకులు పద్మనాభ శాస్త్రి మొదలు ఇళయరాజా గారి దాకా వచ్చిన 60 మందికి పైగా సంగీత దర్శకుల సమగ్ర జీవిత విశేషాలతో, అరుదైన సాధికార సంగీత విషయ సేకరణ తో,1500 కు పైగా అరుదుగా లభించే ఫోటోలతో, ఖరీదైన ఆర్ట్ పేపర్ మీద క్రౌన్ సైజు లో అందంగా ముద్రించబడిన 760 పేజీల అపూర్వ ఉద్గ్రంధం. సిద్ధాంత గ్రంథ స్థాయిలో ముద్రించబడిన ఈ పుస్తకం శ్రీమతి లక్ష్మీ పార్వతి, శ్రీ ఆకెళ్ళ చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి ఈ పుస్తకాన్ని మీ ముందుకు  తెచ్చానని, అభిమానించి దీన్ని చదువు'కొన'గలరని విన్నవించుకున్నారు. శ్రీ కిరణ్ ప్రభ గారు ఈ పరిశోధనాత్మక అరుదైన పుస్తకాన్నికళా సాహిత్య ప్రియులు తప్పక 'కొని'చదువగలరని ఆశాభావాన్ని వ్యక్త పరిచారు.
             పిదప శ్రీ కిరణ్ ప్రభ గారు నెలనెలా నిర్వహించే సాహిత్య క్విజ్ కార్యక్రమం జరిగింది. వారు సంధించిన ప్రశ్నలకు సభ లోని వారు   ఇచ్చిన జవాబులతో సభ హుషారు గా సాగింది.
          తర్వాతి కార్యక్రమం కవిసమ్మేళనం. రావు తల్లాప్రగడ గారు సంయమనకర్త (moderator) .
సమ్మేళన ఆరంభం వారి కవితతోనే జరిగింది. సైబెర్ క్షేత్ర గీత -సైబెర్ యుద్ధం. ఘంటశాల గారి గీతోపదేశ భగవద్గీత శ్లోకాలకు కితకితలు పెట్టే అనుకరణ. పేరడీ అనవచ్చు. చక్కని ఆధునాతన వ్యంగ్య రచన. బ్లాగు వాసులు, సమానాంధులు, దుర్జనుడు వంటి వ్యంగ్యాత్మక పదాలతో అంతర్జాల యుగాన్ని అభివర్ణిస్తూ netను నెట్టుకు పోవడమే మన అంతిమ కర్తవ్యం అంటూ చదివిన ఆహ్లాద భరితమైన వారి కవిత అందరికీ చక్కిలిగింతలు పెట్టింది.
              డా||కె.గీత గారు 'మనం' అనే చక్కని వచనకవిత చదివి వినిపించారు. వీక్షణం ఆవిర్భావ దశ నుండి నేటిదాకా తామంతా తలా ఒక్క కిరణమైన వాళ్ళమని, ప్రతి సమావేశానంతరం తమకు జీవితాన్ని సుసంపన్నం  చేసే ఒక గొప్ప వాక్యం దొరుకుతూ వచ్చిందని తాదాప్యం చెందుతూ రాసిన చక్కని కవిత.
           శ్రీ గోపాల్ నేమన్ గారు ప్రకృతి రామణీయకతనూ, ఆధ్యాత్మికతనూ రస రమ్యం గా రంగరించి 'ఆత్మ వినోదం','కోష్టారికాదేశం' అనే రెండు కవితలు చదివారు. power point presentation ద్వారా కవితలకు దృశ్య వైభవాన్ని ఆపాదించడం కవితాభివ్యక్తికి కొత్త కోణం.
          శ్రీ పుల్లెల శ్యాంసుందర్ గారి పసందైన పారడీ” ఆంధ్రా ఆవకాయ “ సభ లోని రసనాగ్రేసరులను రంజింప జేసింది.
           “విశ్వ శాంతి” శీర్షికగా శ్రీ పిల్లల మర్రి గారు, నాగరాజు రామస్వామి పద్య కవితలు /వచన కవితలు వినిపించారు.
            ప్రసిద్ధ కథా రచయిత్రి రాధిక గారు కోనసీమను గుప్తాగుప్తంగా గుర్తు చేస్తూ 'వరుడు కావాలి'అన్న కవిత వినిపించారు.
            లక్ష్మీ పార్వతి గారు 'నేను కవినే కాదంటాను' అనే కవిత్వం చదివారు.
            బండి ఆనంద్ గారు, మరి కొందరు తమ కవితలు చదివి సభ ను ఆనంద పరిచారు.
కవిసమ్మేళన కార్యక్రమం చాలా ఉత్సాహంగా కొనసాగింది
           ముఖ్య కార్యక్రమ ఆఖరు అంశంగా శ్రీ మృత్యుంజయుడు గారి ఆధ్వర్యంలో వివిధ సాహితీ ప్రక్రియల పై ప్రసంగాలు, సమీక్షలు ఆసక్తి దాయకంగా జరిగాయి. పలువురు వక్తలు సాహిత్యోపన్యాసాలు
శ్రోతలను ఆకట్టుకొన్నాయి.

              శ్రీచరణ్ గారు 'పద్య లక్షణం -ఛందస్సు' గురించి విపులంగా మాట్లాడారు. లక్షణ శాస్త్ర రీత్యా ఛందము కప్పిఉంచే ఒక పొట్లం. ఛందస్సు వేదపురుషుని పాదం. సామవేదానికి ఛందస్సు మరో అభిద. సంస్కృత ఆంత్ర మాలికల ఆంత్ర ఛందస్సు , అనుష్టుప్ ఛందస్సు ఆరోజుల్లో విస్తృతంగా వాడుకలో ఉండేదని, శ్రీమద్భగవద్గీత 8అక్షరాలు 4పాదాలు గల అనుష్టుప్ లోనే ఉందని ',శుక్లాంభర ధరం విష్ణుం' శ్లోకం అనుష్టుప్ ఛందోబద్ధమేనని వివరించారు. వేద సంహిత అంతా 24 అక్షరాల ఛందస్సు. నిజానికి సంసృత ఛందస్సు లో కొంత వెసులుబాటు ఉందని, నన్నయాదుల తెలుగు లౌకిక ఛందస్సు కఠినతర మైనదని వాక్రుచ్చారు. రాను రాను ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర లాంటివి లౌకిక ఛందస్సులో భాగమయ్యాయని వివరించారు. ఛందస్సు శాస్త్ర పరిణతి చెంది అక్షర వృత్తాలుగా, వర్ణ వృత్తాలుగా, మాత్రా వృత్తాలుగా అవతరించాయని తెలిపారు. పుట్టపర్తి గారి 'శివ తాండవం' , శ్రీ శ్రీ నవ్య కవితలు మాత్రా ఛందస్సు కు ఉదాహరణలు. ఇలా వ్యాకరణం, ఛందస్సు నిత్య నూతనంగా పరివర్తన చెందుతూ కొత్త రాగాలను ఆలపిస్తూనే వుందని ముగించారు.
           శ్రీ హరనాథ్ గారు విశ్వనాథ వీరాభిమాని. వారు విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యాలు శ్రావ్యంగా చదివి, స్వీయ పద్యం కుడా వినిపించి ఆనంద పరిచారు.
          శ్రీ చుక్కా శ్రీనివాసరావు గారు కొడవగంటి కుటుంబ రావు నవలలను సమీక్షించారు. సున్నిత హాస్యం వ్యంగ్యం కలసిన వాస్తవ ఇతివృత్తాలు ఎన్నుకున్నారని, మార్క్సిస్ట్ గతితార్కిక భౌతిక వాదం, భారతీయ ఆధ్యాత్మిక నైతికత పునాదుల పై జీవితాన్ని విశ్లేషించే కథలు నవలలు రాసారని వివరించారు. చక్కని విశ్లేషణ.
        అంతిమంగా, రావు తల్లాప్రగడ ధూర్జటి భక్తి రసాత్మక చాటువులను శ్రవణపేయంగా వినిపించి ఆనందంలో ముంచెత్తారు.
       ఇలా, 'వీక్షణం' ప్రథమ సాహిత్య వార్షికోత్సవం ఆద్యంతం అత్యంత రసవత్తరంగా సాగింది.
        విశిష్ట అతిథులను పుష్పగుచ్చాలతో స్వాగతించడం, శాలువలు కప్పి సన్మానించడం, తెలుగింటి మధ్యాహ్న భోజనాలు ఆరగించడం, ఫోటోలు దిగడం లాంటి సహృదయ వాతావరణంలో వార్షికోత్సవం విజయ వంతంగా నిర్వహించబడి అందరి  స్మృతులలో దాచుకోదగ్గ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.
          ఇందుకు వీక్షణం మూలస్తంభాలైన రావు తల్లాప్రగడ, మృత్యుంజయుడు ,కిరణ్ ప్రభ, డా||కె.గీత గార్లు ఎంతైనా అభినందనీయులు.

-నాగరాజు రామస్వామి

http://www.koumudi.net/Monthly/2013/october/oct_2013_vyAsakoumudi_vikshanam.pdf