Saturday 6 September 2014

వీక్షణం సాహితీ గవాక్షం - 24(Aug,10-2014)

వీక్షణం సాహితీ గవాక్షం - 24
 


   
ఈ నెల 'వీక్షణం' సమావేశం ఆగస్ట్ 10న ఫ్రీమాంట్ లోని వంశీ ప్రఖ్య గారి ఇంట్లో జరిగింది. ముఖ్య అతిథులు డా.గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు , డా. కాత్యాయనీ విద్మహే గారు. సభాధ్యక్షులు ప్రసిద్ధ రచయిత , సాంకేతిక పరిభాషా తెలుగు పదకోశ కర్త శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు . లక్ష్మీనారాయణ గారు ద్రవీడియన్ తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ వైస్ ఛాన్స్లర్ . ఆధునిక క్లాసిక్ గా పేరు పొందిన యస్ .ఎల్. భైరప్ప గారి కన్నడ నవల 'పూర్వ' ను తెలుగు లోకి అనువదించి 2004 లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య బోధనా రంగాలలో దీర్ఘ కాల విశిష్ట సేవలను అందించి, సమీక్షా సాహిత్యానికి కొత్త స్ఫూర్తిని ఆవిష్కరించిన విద్యావేత్త .
కాత్యాయనీ విద్మహే గారు జగమెరిగిన స్త్రీవాదమూర్తి. స్త్రీవాద సాహిత్య విమర్శనా రంగంలో అగ్రగామి. వీరి 'సాహిత్యాకాశంలో సగం' విమర్శనా గ్రంధానికి 2013 కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ప్రాంతీయ సాహిత్య చైతన్యాన్ని నిష్పక్షపాతంగా వెలుగులోకి తెచ్చిన తెలంగాణవాది.
వంశీ ప్రఖ్య గారి ఆత్మీయ వాక్కుల అనంతరం అధ్యక్షుల వారి ఆహ్వానం. ప్రతిష్టాత్మకమైన కేంద్రసాహిత్య అకాడెమీ సాహిత్యకారులు ఇద్దరూ ఇలా ఈ సమావేశాన్ని అలంకరించడం అరుదైన అదృష్టం అంటూ వారిని అధ్యక్షులు అభినందించడం హర్షదాయకం.
మొదట లక్ష్మీ నారాయణ గారు 'తెలుగు సాహిత్యం - తులనాత్మక విశ్లేషణ' అంశం పై ప్రసంగించారు. సాహిత్య పరిశోధన అంత తేలికగా నలిగేది కాదనీ, జవం జీవం ఉట్టిపడే సాహిత్య పరిశోధనకు సరైన న్యాయం జరగాలంటే శ్రమించాల్సి ఉంటుందనీ, సాహిత్యం ఎదిగినంతగా పరిశోధన వ్యవస్థ ఎదగలేదనీ, నిజానికి ఈనాటి సాహిత్య పరిశోధనా రంగం నాలుగు రోడ్ల కూడలిలో నిలిచి నిలదొక్కుకునే ప్రయత్నం
చేస్తున్నదనీ తెలిపారు!ఈనాటి జర్నలిస్టిక్ విస్తరిలో సాహిత్య పరశోధనా వ్యంజనం వ్యంజన ప్రాయంగానే మిగిలిపోతున్నదని వ్యంగీకరించారు. సిసలైన పరిశోధనకు అంతశ్శోధన ఆత్మసాధన అనివార్యమనీ, ఆ దిశగా పాఠ్య ప్రణాళికలో కొత్తగా రంగప్రవేశం చేసినదే శాస్త్రీయ పరిశోధనా క్రమవిధానం (Research Methodology) అని వాక్రుచ్చారు. సాహిత్య పరిశోధన గత మూడు తరాలలో స్థూలంగా మూడు విధాలుగా విస్తరించి
ఉందన్నారు. ఒకటి సాంత సమన్విత సంవిధానం -wholistic approach. ఇది 1930-1940 మధ్య కాలం లో కొనసాగింది. ఈ సాహిత్య విశ్లేషణా క్రమం లో సాహిత్యకారుని జీవిత విశేషాలను కూడా పొందుపరచడం ఉండేది. రెండవది నిర్మాణదశ -1960 తరువాతి కాలం నాటిది. ఇందులో భారతీయతను పుణికిపుచ్చుకున్న సరైన సాహిత్య విశ్లేషణా సామగ్రిని సమకూర్చుకొని పునర్నిర్మాణ ప్రక్రియాత్మకంగా చారిత్రిక సంశోధనతో ఆవిష్కరించడం (discovering History ), కాలానుగుణ అవగాహనా పరిధిలో వ్యాఖ్యాన రూపంగా (reinterpret) ప్రకాశమానం చేయడం ఉంటుంది. ఈ కోవకు చెందినదే బుచ్చిబాబు గారి 'చివరకు మిగిలేది' పై విద్మహే గారి విశ్లేషణ. ఇక మూడవది జనప్రియమైన సాహిత్యాన్ని ఆధునిక అభిరుచి మేరకు అందించడం-a popularised application of literature/ literary criticism. కిరణ్ ప్రభ గారి ఇలాంటి సాహితీసేవ సాహిత్య పరిశోధనా పరిధిలోకే వస్తుందని అభినందించారు. ఇంకా, లక్మీనారాయణ గారి ప్రసంగ ధారలో ప్రవహించిన భావజాలం ఇలా ఉంది. సాహిత్య పరిశోధనా ప్రధాన అంగాలు రెండు. ఒకటి సాహితీ విమర్శ- ఉపరితల వీక్షణం. రెండవది సాహితీ సమీక్ష- సమగ్ర దర్శనం. అంతస్సంబంధాలను పరిపుష్టం చేసి సాంఘిక అనుబంధపట్టిక గా (social data) పరివర్తనం చెందే సృజనశక్తి సాహిత్యానికి ఉన్నది. నిజానికి భాష ఒక సాంఘిక శాస్త్రం. సాహిత్యం ఒక చారిత్రిక సాంస్కృతిక రూపం;a social document. భాషా శాస్త్ర రీత్యా భాష మూడు విధాలు; భావోద్వేగ భాష, వాడుక భాష, వ్యవహార భాష. మానవ మేధకూ హృదయానికీ మధ్య నున్నఆకాశం(space) ను పరివర్తనానుకూల గుణాత్మక భావ ద్రవ్యంతో నింప గలిగే సామర్థ్యం కవిత్వానికి ఉంది. ఈ ప్రపంచం ఒక సాంఘిక శక్తి స్వరూపం. సారస అంబోధినిలో పరివర్తనా అభిముఖ (negative) భాషా తరంగాలు ఎగసిపడుతున్న కాలం ఇది.
లక్ష్మీనారాయణ గారి ప్రసంగం ఇలా స్వానుభవ సంగ్రహంగా సుగమ సాహిత్య ధారా సదృశంగా ప్రవహించి శ్రోతలను ఓలలాడించింది. ఇటీవల దివంగతులైన 'చేరా' కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక నిమిషం మౌనం పాటించడం జరిగింది.
తరువాత కాత్యాయనీ విద్మహే గారు 'తెలంగాణా నవల' పై విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు.
విశ్వనాథుని 'వేయిపడగలు' తో తన అధ్యయనం ప్రారంభమయిందని, బుచ్చిబాబు గారి 'చివరకు మిగిలేది 'తనకు బాగా నచ్చిన నవల అన్నారు. వారి ప్రసంగ ధార అత్యంత ఆసక్తిదాయకంగా ఇలా సాగింది. తెలుగు నవలా సాహిత్యం 'రంగరాజు' చారిత్రిక నవలతో ప్రారంభమయిందని, ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి 'మాలపల్లి' లాంటి నవలలతో సమాజంలోని వ్యక్తి తన సామాజిక రాజకీయ జీవన గమనాన్ని నిర్దేశించుకునే కొత్త శక్తిని
సమిష్టి నుండి పొందవచ్చునన్న అవగాహనకు నాంది పలికింది.తెలుగు సాహిత్య చరిత్ర ప్రాంతీయ చరిత్రలుగా శాఖోప శాఖలై ఉపకథనాలకు తెరతీసి దళిత సాహిత్యం స్త్రీవాదసాహిత్యం మైనారిటీ సాహిత్యం వంటి వైవిధ్యసాహిత్యాలుగా విస్తరిస్తూ వచ్చింది. కాని, తెలుగు సాహిత్య మహా చరిత్ర లో ప్రాంతీయ చారిత్రిక స్పృహ కొరవడుతూ వచ్చింది. కురుగంటి వారి 'నవ్యాంధ్ర సాహిత్య వీధులు ' లో తెలంగాణ సాహిత్య చరిత్ర ప్రతిబింబించ లేదు. ఈర్షా ఉద్వేగాల చులకన అభిప్రాయాల కారణంగా తెలుగు సంస్కృతిక పత్రికా రంగాలు తెలంగాణా ప్రాంతీయతను చిన్నచూపు చూడడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల లోంచే పుట్టుకొచ్చింది తెలంగాణ నవల. 1950 వరకు నవలలు లేవు. హనుమకొండ వాస్తవ్యులు శేషాద్రి రమణ కవులు తొలి తెలంగాణ చారిత్రిక నవలకు పునాదులు వేసారు. 1955 లో వట్టికోట ఆళ్వారు గారి 'ప్రజల మనిషి', 'గంగు' తెలంగాణా ప్రాంతీయ వైతాళిక నవలలు.1947 నాటి తెలంగాణా సాయుధ పోరాటం ఉద్యమరూప నవలగా ఎదిగింది. 1970 నాటికి విప్లవోద్యమం తెలుగు నవలగా కవిత్వంగా రూపురేఖలు సంతరించుకుంది. కవన శర్మకు ఇంజనీరింగ్ వ్యవస్థ నవలా వస్తువయింది. నవీన్ గారు విద్యా వ్యవస్థ మీద ధ్వజమెత్తి 1967 లో చైతన్య స్రవంతి శైలిలో 'అంపశయ్య' నవలను ఆవిష్కరించారు. 1970 తరువాత వచ్చిన నవలలో అల్లం రాజయ్య గారి 'కొలిమంటుకున్నది', 'అగ్నికణం' అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న మాండలికంలో సాగిన నవలలు. 1990 ప్రాంతంలో తెలంగాణ జీవన అస్తిత్వ ఉద్యమ రూపంలోంచి వచ్చినవి వృత్తిపరమైన నవలలు. నేర్ల శ్రీనివాస్ 'బతుకుతాడు' గౌడులకు, కాలువ మల్లయ్య'బతుకు' పద్మశాలీలకు, బి.ఎస్.రాములు ' బతుకు పోరు' బీడీ కార్మికులకు, జాతశ్రీ 'నల్ల వజ్రం' గని కార్మికులకు చెందిన నవలలు. తెలంగాణా వృత్తికారుల, కార్మికుల, శ్రామికుల, స్త్రీల బతుకు గాధలు ఈ నవలల ఇతివృత్తాలు. లోకేశ్వర్ గారి 'సలామ్ హైదరాబాద్ ' 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమ ప్రాతిపదికగా హైదరాబాద్ చరిత్ర సంస్కృతుల పాతకొత్తల మేళవింపుగా రూపుదిద్దుకున్న చక్కని నవల. ఇలా తెలంగాణ నవలా సాహిత్యం ప్రాంతీయ చైతన్యంగా వర్ధిల్లుతున్నది.

ప్రఖ్య గారు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా విద్మహే గారు "తెలంగాణా జీవనాన్ని, వాస్తవ సంఘర్షణలను ప్రతిబింబించే ఇతివృత్తం గల ఏ నవలైనా తెలంగాణా నవలగా భావించవచ్చు. కాని ప్రాంతీయులు స్వానుభవం తో రాసిన తెలంగాణ నవలా సాహిత్యం వాస్తవానికి చేరువలో ఉంటుందనటంలో సందేహం లేదు. నేనైతే ఖచ్చితంగా తెలంగాణా వాదినే " అంటూ వారు నిర్మొహమాటంగా చెప్పడం విశేషం .
స్వల్పాహార స్వల్ప విరామం తర్వాత కవిసమ్మేళనం. మొదట డా||గీత గారు "ఆత్మీయ ఆనవాలు" వినిపించారు. 'కవిత్వం చిరపరిచిత పదం కోసం, ఆత్మీయ స్వరం కోసం పలవరిస్తుంది' అంటూ సాగిన చక్కని వచన కవిత అందరినీ అలరించింది. రావి రంగారావు గారు అంతర్జాలంలో వస్తున్న గొప్ప కవితల గురించి ప్రస్తావించారు. పనసకర్ల, పట్వర్ధన్, క్రాంతి శ్రీనివాసరావు లాంటి వాళ్లు శివారెడ్డి స్థాయి కవిత్వం
రాస్తున్నారన్నారు. కవిసంగమం వంటి గ్రూప్ లున్న ఫేస్ బుక్ పై తనకున్న సదభిప్రాయాన్ని తెలియపరిచారు. వంశీ ప్రఖ్య గారిది 'వన్స్ మోర్ 'అనిపించుకున్న దీర్ఘకవిత. నాగరాజు రామస్వామి వినిపించిన కవితలు "వ్యర్థ వసంతాలు" ,"ఆకాశం చివర ఆకు పచ్చని ఆశ్చర్యం ". విద్మహే గారు తన మనుమడు అర్ణవ్ ను ఆనంద సంద్రాల కౌగిలిగా అభివర్ణించి వాత్సల్యాన్ని కవిత్వం గా మలిచారు.
కిరణ్ ప్రభ గారు నిర్వహించిన సాహిత్య క్విజ్ ఉత్సాహ భరితంగా హుషారుగా సాగింది.
శ్రీమతి కిరణ్, ఉమా వేమూరి, శారద, శ్రీ అక్కిరాజు రమాపతిరావు,వంశీ, లెనిన్, మహమ్మద్ ఇక్బాల్,మొ.న వారు ఈ సమావేశం లో పాల్గొన్నారు. సభ ఆద్యంతం రసవత్తరంగా సాగి అందరినీ ఆనంద పరిచింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
-నాగరాజు రామస్వామి