Monday 16 November 2020

వీక్షణం సాహితీ గవాక్షం- సప్తమ వార్షికోత్సవం

 

వీక్షణం సాహితీ గవాక్షం- సప్తమ వార్షికోత్సవం

మాధవపెద్ది ఫణి రాధాకుమారి



సెప్టెంబరు 8, 2019 న కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో స్వాగత్ హోటల్ లో ఉదయం 10 గం.నుండి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం- సాహితీ గవాక్షం సప్తమ వార్షికోత్సవం ఆహూతుల ఆనందోత్సాహల నడుమ అత్యంత రసవత్తరంగా జరిగింది. వీక్షణం నిర్వాహకురాలు డా||కె.గీత మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా నెల నెలా క్రమం తప్పకుండా కొనసాగుతున్న వీక్షణం సాహిత్య కార్యక్రమాలకు సహకారం అందజేస్తున్న స్థానిక సాహిత్య కారుల్ని, అభిమానుల్ని వేనోళ్ల కొనియాడారు. ఈ సందర్భంగా వీక్షణం తనతో బాటూ అందరికీ అందజేస్తున్న సాహిత్య స్ఫూర్తి వల్లే ఇదంతా సాధ్యపడుతున్నదని అన్నారు.



ఈ సభలో ఉదయం సెషన్ కు శ్రీ పొద్దుటూరి ఎల్లారెడ్డి అధ్యక్షత వహిస్తూ కరుణశ్రీ గారి పద్యంతో ప్రారంభించారు. తర్వాత శ్రీ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం నుంచి పద్యాలనాలపించి అందరినీ ముగ్ధుల్ని చేశారు. ముందుగా శ్రీ చుక్కా శ్రీనివాస్ “ఖదీర్ బాబు కథల గురించి మాట్లాడుతూ పప్పుజాన్ కథలు, దర్గామిట్ట కథలు, పోలేరమ్మ బండ కథల నుండి అనేక అంశాల్ని వివరిస్తూ ఆసక్తిదాయకమైన ప్రసంగం చేశారు. తర్వాత శ్రీ పిల్లలమర్రి కృష్ణ కుమార్ “వేదాలు అపౌరుషేయాలా” అన్న అంశమ్మీద, శ్రీ కల్లూరి సత్య రామ ప్రసాద్ “హృద్యమైన తరి- పద్యమే సరి” , శ్రీ శ్రీ చరణ్ పాలడుగు “ఉపమా కాళిదాసస్య” అన్న అంశాల మీద ఉపన్యసించారు.



భోజన విరామానంతరం జరిగిన వీక్షణం రెండవ సెషన్ కు శ్రీమతి మంజుల జొన్నలగడ్డ అధ్యక్షత వహించారు.
వీక్షణం వార్షిక సాహితీ సంచికల ఆవిష్కరణలో సంచికను అందంగా పొందుపరిచి, రూపుదిద్దిన శ్రీమతి కాంతి కిరణ్ తో బాటూ సంచికకు సంపాదకత్వం వహించిన శ్రీ కిరణ్ ప్రభ, డా||కె.గీత, నిర్వాహకులు శ్రీ లెనిన్లు గార్లు పాల్గొన్నారు.
తర్వాత తెలుగురచయిత డాట్ ఆర్గ్ నిర్వాహకులు డా|| కె.గీత, శ్రీ సుభాష్ పెద్దు మాట్లాడుతూ ప్రతిరోజూ ఒక రచయితకు ఒక పేజీ చొప్పున తెలుగు రచయితలందరికీ అంతర్జాల భాండాగారాన్ని నిర్మిస్తున్న తెలుగు రచయిత వెబ్ సైటుకు తగిన వివరాలు తెలియజేయడం, ఆర్ధిక సాయం చేయడం ద్వారా సహాయ సహకారాలు అందించాలని అందరికీ సభా ముఖంగా విజ్ఞప్తి చేశారు.



ఆ తర్వాత జరిగిన “కథ- స్వరూప స్వభావాలు” చర్చా కార్యక్రమాన్ని శ్రీ తాటిపామల మృత్యుంజయుడు నిర్వహించారు. ఇందులో ప్రముఖ విమర్శకులు, వ్యాసకర్త శ్రీ ఎ.కె.ప్రభాకర్, ప్రముఖ కథా రచయిత శ్రీ శ్రీధర పాల్గొన్నారు. ఇందులో కథాశైలి, వస్తువు అన్న అంశాల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది.
తరవాత డా|| తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం, శ్రీ సుబ్రహ్మణ్యం గార్లు రచించిన “జగమంత కుటుంబం” కథా సంకలనం, “శ్రీ శంకరాచార్య” పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో 18 మంది కవులు పాల్గొని కవిత్వపు విందుని అందజేసారు. ఈ కవి సమ్మేళనాన్ని శ్రీ రావు తల్లాప్రగడ నిర్వహించారు. ఇందులో శ్రీ తెన్నేటి మారుతి పాటతో ప్రారంభించారు. శ్రీమతి సుమలత మాజేటి స్వీయ పద్యాల్ని, శ్రీ సాయికృష్ణ ప్రార్ధనా శ్లోకాల్ని వినిపించగా, డా||కె,గీత వీక్షణం నిర్వాహకత్వాన్ని గురించి రాసిన “వ్యక్తి- శక్తి” అనే కవితను చదివి వినిపించారు.



తర్వాత శ్రీ పుల్లెల శ్యామసుందర్ ఆవకాయ మీద హాస్య పద్యం వినిపించారు. శ్రీ పొద్దుటూరి ఎల్లారెడ్డి గారు కాశ్మీర్ పద్యాల్ని, శ్రీ కల్లూరి సత్య రామ ప్రసాద్ కరుణాత్మక పద్యాన్ని, శ్రీ నాగ సాయిబాబా గ్రీన్ కార్డు అనే హాస్య ప్రధాన గేయాన్ని, శ్రీ రావు తల్లాప్రగడ ప్రేమ గురించిన గజల్ ని, శ్రీ సుభాష్ పూదోట నీలిమ అనువాద కవితలు, అభిరామ్ కవితల్ని, శ్రీ వనపర్తి సత్యన్నారాయణ శ్రీ ఉమర్ అలీషా గారి పద్యాల్ని, శ్రీ కిరణ్ ప్రభ గారి కవితల్ని, శ్రీ నార్లశెట్టి రవి హరిశ్చంద్ర పద్యాల్ని శ్రీ అనిల్ కుమార్ కాసేవార్ నిర్భయ చట్టాన్ని గురించిన కవితని, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ చంద్రయాన్ గురించిన కవితని, శ్రీ లెనిన్ పునర్జన్మ కవితని, శ్రీమతి శారద వాన కవితని, శ్రీ రూపారాణి అమ్మ గురించిన పద్యాన్ని, శ్రీమతి ఫణి రాధాకుమారి వీక్షణాన్ని గురించి తమ తొలి కవితను వినిపించారు. అత్యంత విభిన్నమైన కవితలతో కూడిన కవి సమ్మేళనాన్ని సభలోని వారందరినీ అలరించింది.
చివరగా శ్రీమతి శారద కాశీవఝల నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది.
ఈ సభకు విచ్చేసి, దిగ్విజయం చేసిన స్థానిక ప్రముఖులు, ఇండియా నుంచి విచ్చేసిన వక్తలు, సాహిత్యాభిమానులకు కృతజ్ఞతలతో వీక్షణం నిర్వాహకురాలు డా||కె.గీత వందన సమర్పణ చేసి సభను ముగించారు.

_________

http://sirimalle.com/vikshanam-7anniversary/

https://www.koumudi.net/Monthly/2019/october/oct_2019_vyAsakoumudi_vikshanam.pdf

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-%e0%b0%b8/




వీక్షణం సాహితీ సమావేశం - 84

 వీక్షణం సాహితీ గవాక్షం - 84

- ఛాయాదేవి




వీక్షణం 84 వ సమావేశం లాస్ ఆల్టోస్ లోని ఉదయలక్ష్మి గారింట్లో ఆద్యంతం అసక్తిదాయకంగా జరిగింది.

ఈ సమావేశానికి శ్రీ పెద్దు సుభాష్ అధ్యక్షత వహించారు. డా||కె.గీత,  శ్రీమతి చాగంటి తులసి గారి కథ "యాష్ ట్రే" చదివి వినిపించి కథా పరిచయం చేశారు. తరువాత జరిగిన కథా చర్చలో భాగంగా  కథలో స్త్రీ వాదం, విశ్వప్రేమ, మాతృహృదయం, స్వార్థ నిస్వార్థాలు, స్త్రీ, పురుషుల మధ్య సున్నితాంశాలు, కథ నేరేషన్ మొ.న అంశాలను గురించి సుదీర్ఘ  చర్చ జరిగింది. రచయిత్రి, కథా వివరాలు అందజేస్తూ "డాక్టర్ చాగంటి తులసి గారు తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యవసరం లేని పేరు. చాసో కుమార్తె గానే కాక రచయిత్రి గా, అనువాదకురాలిగా, సాహిత్య కార్యకర్తగా ఆమె ప్రఖ్యాతిని పొందిన విశిష్టమైన, తెలుగు సాహిత్యం గర్వించదగ్గ సాహితీ మూర్తి. హిందీ, ఒడియా, తెలుగు నడుమ భాషా వారధి గా ఆమె ఎన్నో అనువాదాలు చేశారు. రాహుల్ సాంకృత్యాన్ ‘ఓల్గా నుండి గంగకు’ హిందీ నుండి అనువాదం చేశారు. ఇటీవల తాను పి హెచ్ డి చేసిన రచయిత్రి ‘మహాదేవి వర్మ గీతాలు’ కూడా తెలుగు లోకి తీసుకొచ్చారు. “ఒడిశా జానపద కళలు” కూడా ఉపద్రష్ట అనురాధ గారితో కలిసి తెలుగు లోకి అనువాదం చేసి అందించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ క్రియాశీలక సభ్యురాలిగా కూడా పనిచేశారు. గత 28 ఏళ్ల నుండి ప్రతి ఏటా ‘చాసో పురస్కారం’ మంచి కథకులకు ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే, ఆమెకు చాలా పేరు తెచ్చిపెట్టిన, ఎందరో మెచ్చుకున్న కథ ఇది. ఈ  కథ1976-85 మహిళా దశాబ్ది సందర్భంగా 1976 లో అచ్చయింది. ఆ తర్వాత ఏ కె ప్రభాకర్ గారు వేసిన ‘స్త్రీవాద కథలు’ పుస్తకం లో వచ్చింది. 1992 లో అరుణా సీతేష్ సంపాదకత్వం లో Glimpses: The Modern Indian Short Story Collection లో ప్రచురించబడింది. జయశ్రీ హరిహరన్ ఆంగ్లం లోకి అనువదించారు. హింది, ఒడియా భాషల్లోనూ అనువాదమై అచ్చయింది. ఫెమినిస్ట్ కథలేవీ రాక ముందే వచ్చిన ఈ కథ, స్త్రీ ఆత్మ గౌరవం, ఉన్నత వ్యక్తిత్వం కు అద్దం పడుతుంది. యాష్ ట్రే లో స్త్రీ పాత్ర సమాజం లో కొత్తగా పుడుతున్న పాత్ర. మానవి గా ఎదిగిన స్త్రీమూర్తి పాత్ర. అందుకే ఆమెకు పేరు లేదు. అటువంటి స్త్రీలు పెరిగాక పేర్లు స్థిరపడతాయి అన్నది రచయిత్రి ఉద్దేశం. బతుకుని కత్తిరించి మళ్ళీ అమార్చుకోవడం తెలియాలి. వికారంగా ఉన్న బతుకును అందంగా చేసుకోవడం ఈ కొత్త స్త్రీకి తెలుసు. ఆ స్త్రీమూర్తిని పట్టుకోవడం లో కథకురాలు కృతకృత్యురాలైంది. అందుకే ఆమె తాను పొయెట్ కాదు అని ఎంత చెప్పినా ఆమె లైఫ్ లోని పొయెట్రీ ని, ‘poetry of life’ పట్టుకున్న కథకురాలని జర్మన్ ప్రొఫెసర్, విమర్శకుడు, గెర్ట్ హాఫ్ మెన్ ఈ కథ అనువాదాన్ని ఇంగ్లీషులో చదివి ప్రశంసిస్తూ వ్యాసం రాశారు. ఇది ప్రేమ కథ కాదు. బతుకులోకి కొద్ది రోజులు వచ్చినవాడు స్వార్ధం తో వెళ్లిపోయాడు, తిరిగి స్వార్ధం తో వచ్చాడు. కొద్దిరోజులు పాటు వచ్చి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాడి పట్ల ఏ భావం ఉంది? ప్రేమ భావమా? కానే కాదు, బాహ్య ఆకర్షణ. రూపు రేఖలు మొదట లాగుతాయి, లేని గుణగణాల భ్రమ కలుగుతుంది. ఆ ముద్రా ఇంకా కొద్దో గొప్పో మిగిలి ఉండటమూ సహజమే అందుకే కాస్తంత డైలమా పడ్డట్టు అనిపించినా కేవలం అయిదే ఐదు నిమిషాల్లో అతని తగనితనాన్ని మర్యాదగానే చెప్పినా అది మరి చెంప పెట్టే! కథా వస్తువు, భాష , కథ చెప్పిన తీరూ, ప్రతీకాత్మకంగా, కొత్త స్త్రీమూర్తి ఆచరణాత్మక ఆలోచనలతో, తనను తాను, ప్రతిష్టించుకున్న విధానం కథను అత్యుత్తమ స్థాయిలో చేర్చాయి." అంటూ జగద్ధాత్రి గారు ఇటీవల "నెచ్చెలి" వనితా మాస పత్రికలో రాసిన వాక్యాలతో ముగించారు గీత.

విరామం తర్వాత సుభాష్ గారు "అరుగులు" అన్న వ్యాసాన్ని చదివి వినిపించారు. ఆముక్తమాల్యద నుంచీ ఈ ప్రస్తావన ఉందని, అరుగు ప్రాధాన్యతను, పర్యాయపదాలను వివరించి అందరినీ అలనాటి ఇళ్లకు తీసుకు వెళ్లారు.

ఆ తర్వాత అక్కిరాజు రామాపతిరావు గారు కుంభకోణం గురించి, తెలుగు భాష గురించి వివరించారు.

తరవాత లెనిన్ గారు "అహల్య ఎవరు?" అనే ప్రశ్నతో సభను చర్చకు ఆహ్వానించారు.

చివరగా జరిగిన కవిసమ్మేళనం, పాటల కార్యక్రమంలో డా||కె.గీత ఇటీవల మరణించిన ప్రసిద్ధ కవి శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి పాటను పాడి, తమ స్వీయకవితను చదివి వినిపించగా, సత్యన్నారాయణ గారు "అక్షరం" అనే గేయాన్ని పాడారు. శ్రీ చుక్కా శ్రీనివాస్ సరిహద్దు కవిత, శ్రీ నితిన్ ఆలపించిన ఎందరో మహానుభావులు అందరినీ అలరించాయి. చివరగా శ్రీకాంత్ గారి గాన విభావరి జరిగింది.

ఈ సభలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు.

సెప్టెంబరు 8 వ తేదీన మిల్పిటాస్ లోని స్వాగత్ హోటల్ ప్రాంగణంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గం వరకు వీక్షణం వార్షిక సమావేశం జరుగుతుందని, సాహిత్యాభిలాష కలిగిన అందరూ పాల్గొనచ్చని వీక్షణం నిర్వాహకురాలు డా||కె.గీత సభా ముఖంగా తెలియజేసారు.

--------

http://sirimalle.com/vikshanam-84/

https://www.koumudi.net/Monthly/2019/september/sept_2019_vyAsakoumudi_vikshanam.pdf

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-84/


వీక్షణం సాహితీ సమావేశం - 83

 

వీక్షణం – 83

-రూపారాణి బుస్సా



జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన “బెజవాడ నుంచి బెంగాల్ సరిహద్దు దాక” అన్న ఆసక్తికరమైన కథతో ప్రారంభించారు. నాయనమ్మ చిట్టెమ్మని తీసుకుని బెంగాల్ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి ఉంటున్న బెంగాల్ సరిహద్దు దాక ఎలా ప్రయాణం చేసి క్షేమంగా చేరారన్నది కథా విశేషం. తరువాత కార్యక్రమం అబ్బూరి ఛాయాదేవి గారు గురించి. వీరు స్త్రీల సాహిత్యానికి ద్రోణాచార్యులవంటి వారు ఇటీవలే స్వర్గస్తులైయ్యారు. వీరికి నివాళులు తెలుపుతూ ఆమె వ్రాసిన “వుడ్ రోజ్ ” అన్న చిన్న కథను డా|| కె గీత గారు వాచించారు. ప్రతి ఇంటా జరిగే సహజమైన కథావస్తువు తీసుకుని అందరి కళ్ళల్లో కథా చిత్రం కనిపించేలా రాసారు. సభలోని వారంతా కథ గురించి తమ తమ అభిప్రాయాలను తెలిపారు. తదుపరి కె. వరలక్ష్మిగారిచే రచింపబడ్డ కథను పఠించారు గీత గారు. ఈ కథ గురించి సభలోని వారంతా వివరంగా చర్చలు జరిపాక విరామంలో కూడా చర్చ కొనసాగింది. విరామానంతరం డా|| కె గీత గారు జూలై 10 వ తారీఖున తాము మొదలు పెట్టిన “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక (https://www.neccheli.com/) ను స్త్రీలందరితో కలిసి సభాముఖంగా ఆవిష్కరణ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు సంబంధించిన సాహిత్యాన్నీ, అభ్యున్నతిని, స్ఫూర్తిదాయకమైన అనేక అంశాల్ని “నెచ్చెలి” పరిచయం చేస్తుందని, ‘నెచ్చెలి’ కి స్త్రీలూ, పురుషులూ అందరూ రాయవచ్చునని, ఇంగ్లీషు భాషలో రచనలు చేసేవారికి ప్రత్యేకంగా “Neccheli-English” శీర్షిక అవకాశం కల్పిస్తుందని చెపుతూ, ‘నెచ్చెలి’ రచనలకు ఆహ్వానం పలుకుతోందని, నేరుగా editor.neccheli@gmail.com కు ఈ -మెయిల్ లో పంపవచ్చని

తెలియజేసారు.

ఉమర్ షరీఫ్ గారు తమ పరిచయాన్ని అందిస్తూ తమ కావ్య ప్రవేశం గురించి సభకు తెలిపారు. సాయిబాబ గారు చల్తే చల్తే అను పాత హిందీ పాట బాణి లో తాము లిఖించిన హిందీ పాటను పాడి అందరిని ఉత్సాహ పరిచారు. ఆ తరువాత రూపా రాణి బుస్సా గారు ఓ చెలియా నా ప్రియ సఖియ బాణి లో తామే లిఖించిన ఓ మనసా నా ప్రియ మనసా అన్న పాటను పాడి సభలో అందరి మనసును ఆకట్టుకున్నారు. అనంతరం గీతగారు “అమ్మ చేతి పసుపు బొమ్మ” అను పాటను పాడి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరికీ అందించారు. తదుపరి లెనిన్ గారు “నా పేరేంటి” అన్న పద్యం చదివారు. అలాగే పేరు ఎవరిది మరియు ఎవరి కొరకు ఈ పద్యం వ్రాసారో ప్రసంగించారు. అంతరాత్మ పేరు అదని ఓం తత్ సత్ వివేక విచారంతో కొన్ని వెలకట్టలేని ఆణిముత్యమని తెలిపారు. అనంతరం ఇక్బాల్ గారు కొన్ని మాటలు పలికారు. తాము టెక్సాస్రా ష్ట్రానికి తరలి వెళుతున్న విషయాన్ని వ్యక్త పరచారు. వీక్షణంలో అందరూ ఇక్బాల్ గారికి శుభాకాంక్షలు అందజేస్తూ తాము వారిని ఇక మీదట ఇక్కడ కలుసుకోలేనందుకు విచారం వ్యక్తం చేశారు. తరువాత మాట్లాడిన దమయంతిగారు సహితం నార్త్ కారోలీనా రాష్ట్రానికి బదిలీ అవడం వీక్షణ మిత్రులు వీడ్కోలు శుభాకాంక్షలు అందజేశారు. ఆ తరువాత దమయంతి గారు జయదేవ కృతి చందన చర్చిత పాటను పాడి మంత్రముగ్దుల్ని చేసారు. తదనంతరం శారదగారి క్విజ్ కార్యక్రమం అందరిని అలరించింది. ఇక చివరగా అధ్యక్షులు సాయిబాబ గారు చక్కని మాటలతో సభను ముగించారు. ఈ సమావేశానికి శ్రీ సాయిబాబాగారు, శ్రీ లెనిన్ గారు, శ్రీ ఇక్బాల్ గారు, శ్రీ ఉషర్ష రీఫ్ గారు, శ్రీమతి గీత గారు, శ్రీమతి దమయంతి గారు, శ్రీమతి రూపారాణి బుస్సాగారు, శ్రీమతి శారదగారు, శ్రీమతి షర్మిల గారు, శ్రీమతి మొ.న వారు హాజరైయ్యారు.

 

****

http://sirimalle.com/home-aug2019/

https://www.koumudi.net/Monthly/2019/august/august_2019_vyAsakoumudi_vikshanam.pdf

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-83/



వీక్షణం సాహితీ సమావేశం - 82

 వీక్షణం సాహితీ గవాక్షం - 82

- వరూధిని




వీక్షణం 82వ సమావేశం కాలిఫోర్నియాలోని మోర్గాన్ హిల్ లో డా. కె. గీత గారింట్లో ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం గీత గారు, భర్త శ్రీ సత్యన్నారాయణ గారితో బాటూ కలిసి సభకు ఆహ్వానం పలికారు.

ఈ సభకు శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముందుగా "తెలుగురచయిత.ఆర్గ్" నుండి శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి "ఉద్వేగాలు" కథను సభకు శ్రీ కిరణ్ ప్రభ చదివి వినిపించారు.

రాజు, శేషి అన్నా చెల్లెళ్లు. కథా ప్రారంభంలో "ఉద్వేగాలు అంటే నాకు చాలా అసహ్యం. ఏమీ కారణం లేకపోయినా ఏడవగలగడం ఒక గొప్పతనమేమోగాని, సంఘమర్యాదకీ, నాగరికతకీ తగినది మాత్రంకాదు. పెద్దవాళ్లెవరైనా కంటనీరు పెట్టుకొని ఏడిచారంటే నాకు రోత. నాకేగాదు, నాగరికత అంటే తెలిసిన ప్రతివాడికీని. హరిశ్చంద్రనాటకంలో కూర్చుంటే వేషాలు వేసేవాళ్లు సరిగా ఏడవలేకపోయినా, మనకి అటూ ఇటూ కూర్చున్నవాళ్లు ముక్కులు చీదుకుంటూ, గొంతులు సవరించుకొంటూ కళ్లనీళ్లు తుడుచుకోవటం చూసినప్పుడల్లా ‘అరెరే ఏమిటీ మూఢత్వం?’ అనుకుంటాను. పరామర్శకి వెళ్ళే పెద్దమనుష్యులంతా తేలికగా కళ్లనీళ్లు తెప్పించుకుని కష్టమంతా తమదయినట్టుగా నటించగలగడం చాలా కష్టమేమోగాని, అది సభ్యత ఎంతమాత్రం కాదని నా నిశ్చితాభిప్రాయం." అంటూ ఉపోద్ఘాతంలోనే రాజుకు ఉద్వేగాల్ని ప్రదర్శించే వాళ్లంటే చిరాకు అని మొదలవుతుంది కథ. చెల్లెలు అందుకు భిన్నంగా అన్నిటికీ చలించే పాత్ర. వయసుతో బాటూ శేషి, శేషుగానూ, శేషప్పగానూ మారే తరుణంలో రకరకాల సంఘటనల్లో శేషు ప్రవర్తన ప్రదర్శించిన ఉద్వేగాలు రాజులో చివరకు ఆలోచనలు రేకెత్తిస్తాయి. "మనసులో విచారాన్నంత పైకి వదిలివేయడం తప్పా? దానికి మనసులో ఒకటే సమాధానం. తప్పు కాకపోయినా సభ్యతకాదు. అయితే అటువంటి పరిస్థితులో నేను ఏం చెయ్యాలి? దానికి మాత్రం నా మనసులో సమాధానం లేదు." అంటూ మీమాంసతో ముగుస్తుంది కథ.

అనంతరం కథా చర్చ జరిగింది. మానవ సహజమైన ఉద్వేగాలు నాగరికత, సభ్యత ముసుగు చాటున ఎలా దాక్కుంటాయో తెలియజెప్పే కథ అని, కథ లో అంతర్లీనమైన అంశంగా భావోద్వేగాల్ని చెప్పడం బావుందని, పద్మరాజు గారి శైలి విలక్షణమైనదనీ...అంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసారు అందరూ.

ఆ తర్వాత దానికి కొనసాగింపుగా సభలోని వారి కోరిక మేరకు కిరణ్ ప్రభ గారు గత 22 వారాలుగా ఆసక్తిదాయకంగా కొనసాగుతున్న తన చలం టాక్ షో పై సంక్షిప్త ప్రసంగం చేసారు.

20వ శతాబ్దపు అత్యంత వివాదాస్పద, సంచలన రచయిత - "తన మార్గాన్ని తానే వెదుక్కుంటూ, ఒక వ్యక్తి ఒక జీవితకాలంలో ప్రయాణించగలిగినంత దూరం ప్రయాణించిన ప్రేమర్షి" - చలం సాహిత్యం - జీవితం- అంటూ కొనసాగిన టాక్ షోలో విలక్షణ చలం సాహిత్యం, జీవితంతో బాటూ చలంగారి కారుణ్య దృష్టి, మానవ సేవా దృక్పథ వివరణ, చలం గారి కుటుంబసభ్యులు, పిల్లల వివరాలు, వారి అనుపమాన వ్యక్తిత్వాలను గురించి వివరంగా సాగిన ప్రసంగం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.

విరామం లో "ఫాదర్స్ డే" సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు గీత గారు.

విరామం తర్వాత జరిగిన సాహితీ క్విజ్, కవిసమ్మేళనం, పాటల కార్యక్రమం లో అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.

వీక్షణానికి తొలిసారిగా విచ్చేసిన సాగర్ గారు పాడిన "జగమంత కుటుంబం నాది" పాట, డా. గీత గారు "మేఘమా దేహమా", ఉమా  వేమూరి గారు పాడిన "రావోయి బంగారి మామా" పాటలు, పిల్లలమర్రి కృష్ణకుమార్ గారి సంస్కృత పద్యాలు, వనపర్తి సత్యన్నారాయణ గారు గొంతెత్తి ఆలపించిన ఉమర్ ఆలీషా కవిగారి పద్యాలు, కిరణ్ ప్రభ గారి కవితలు, గీత గారి కవిత "మెసేజీ యుగం" అందరినీ ఆనంద సాగరంలో ఓలలాడించేయి. స్థానిక ప్రముఖులతో బాటూ కొత్తగా వీక్షణానికి విచ్చేసిన సాహిత్యాభిలాషుల ఆనందోత్సాహాల మధ్య ముగిసింది ఈ నాటి సభ.

_______

http://sirimalle.com/vikshanam-82/

https://www.koumudi.net/Monthly/2019/july/july_2019_vyAsakoumudi_vikshanam.pdf

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-82/

వీక్షణం సాహితీ సమావేశం - 81

 వీక్షణం సాహితీ గవాక్షం - 81

- ఛాయాదేవి




వీక్షణం-81 వ సమావేశం శానోజే లోని క్రాంతి మేకా గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ వేమూరి వేంకటేశ్వర రావు గారు అధ్యక్షత వహించారు.

ముందుగా అందరికీ పరిచితమైన  వీక్షణం సాహితీ గవాక్షం సాహితీ లోకానికే  వీక్షణంగా పేరు గాంచాలని  సభలోని వారందరూ ఆకాంక్ష వెలిబుచ్చారు.

మొదటి అంశంగా డా||కె.గీత శ్రీ విశనాథ సత్యన్నారాయణ గారి "జీవుడి ఇష్టం" కథానికను సభకు చదివి వినిపించి కథా చర్చకు ఆహ్వానం పలికారు.

ఈ కథపై ఆసక్తికరంగా చర్చ జరిగింది. కథలో నాగరిక, అనారిక ప్రజల్ని భారతదేశంలోని ప్రజలు, బ్రిటీషు వారిగా  ఊహించుకోవచ్చని, ఇందులో ప్రధాన పాత్రధారి అయిన స్త్రీ ధైర్యాన్ని కొనియాడవలసినదని, సీతా రావణుల కథకు ప్రతిరూపమని, స్త్రీ హృదయం ఎవరూ దొంగిలించలేరని, కథ పురుషుడు రాసినందు వల్ల స్త్రీ హృదయావిష్కరణ సరిగా జరగలేదని, ఒక స్త్రీ తన పిల్లల్ని తన కళ్ల ముందు నిర్జీవం కానివ్వదని ...ఇలా అనేక రకాల ఆసక్తికరమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు.

తర్వాత శ్రీ కృష్ణమూర్తి గారు గ్రహణం- రేడియాలజీ అనే అంశం మీద సూక్ష్మంగా వైజ్ఞానిక ఉపన్యాసం చేశారు.

ఆ తర్వాత శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు ఆముక్తమాల్యదలోని విష్ణుచిత్తుని కథను, ఇతర ఆసక్తికర అంశాల్ని గురించి ఉపన్యసించారు.

విరామం తర్వాత శ్రీమతి శారద తెలుగు పదాల క్విజ్ ను ఆసక్తికరంగా నిర్వహించారు.

కవి సమ్మేళనం లో శ్రీ కృష్ణమూర్తి గారు మాతృదినోత్సవం సందర్భంగా "స్త్రీ" అనే కవితను, డా||కె.గీత  ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సైబర్ ఉద్యోగుల నుద్దేశ్యించి  "కార్మికులారా వర్థిల్లండి" కవితను , శ్రీ చెన్నకేశవ రెడ్డి గారు మిత్రుల వివాహ దినోత్సవ ప్రత్యేక కవిత "పరిణయ దినోత్సవం" ను చదివి వినిపించగా, శ్రీ సత్యనారాయణ గారు ఉమర్ ఆలీషా గారి పద్యాల్ని రాగ యుక్తంగా పాడి వినిపించారు.

ఆ తర్వాత శ్రీ సుభాష్ గారు సిరికోన సాహితి ప్రచురించిన కవిత్వాన్ని సభకు పరిచయం చేశారు. చివరిగా శ్రీ చిమటా శ్రీనివాస్ గారు వేటూరి వారి గీతాన్ని, డా||కె.గీత "ఎంత చక్కనిదోయి" లలిత గీతాన్ని, శ్రీమతి స్వాతి "వినరో భాగ్యము" అంటూ అన్నమయ్య కీర్తనను ఆలపించి అందరినీ అలరించారు.  ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ సభలో స్థానిక సాహిత్యాభిమానులు విశేషంగా పాల్గొన్నారు.



----------

http://sirimalle.com/vikshanam-81/

https://www.koumudi.net/Monthly/2019/june/june_2019_vyAsakoumudi_vikshanam.pdf

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-81/

వీక్షణం సాహితీ సమావేశం - 80

 

వీక్షణం సాహితీ గవాక్షం - 80

- వరూధిని



వీక్షణం-80 వ సమావేశం కాలిఫోర్నియా బే-ఏరియాలోని పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారింట్లో ఏప్రిల్ 14, 2019 న జరిగింది.

ముందుగా పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు, శాంత గారు సభకు ఆహ్వానం పలుకుతూ నిన్నా మొన్న ప్రథమ సభ జరిగినట్లుగా ఉందని ఇంతలోనే వీక్షణం 80 వ సమావేశం లోకి అడుగు పెట్టడం, ఈ సమావేశం తమ ఇంట్లో జరగడం తమకు అత్యంత ఆనందదాయకమని అన్నారు.

ఉగాది కవి సమ్మేళనం ప్రధాన కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశానికి శ్రీ రావు తల్లాప్రగడ గారు అధ్యక్షత వహించారు.

ముందుగా శ్రీ చరణ్ గారు "రామ నామ శబ్ద విశిష్టత" అనే అంశమ్మీద మాట్లాడుతూ "రం" అనే ధాతువు గురించి, ఋగ్వేదంలోని శబ్ద మూలాల గురించి  వివరించారు. రాముని పుట్టుకకు ముందే ఈ శబ్దం ఉన్నదనీ, అత్యంత ఆనందస్థితే ఈ శబ్దమని అంటూ రామ శబ్దానికి ఈశ్వర తత్త్వానికి ఒకటే అర్థమని వివరించారు. ఇందులో భాగంగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాల గురించి వివరిస్తూ వేదాల్లో చెప్పిన విషయాలను  అర్థం చేసుకోవడానికి ఇతిహాసాలు ఉపయోగపడతాయని, మిత్రసమ్మితంగా వచ్చేవి పురాణాలని అన్నారు. పదహారు సద్గుణాల సమ్మిళితమైన "రామ" శబ్ద విశిష్టత వల్లనే వాల్మీకి మహర్షి రామునికి ఆ పేరు పెట్టారని  ముగించారు.

ఆ తరువాత జరిగిన కవిసమ్మేళనంలో ముందుగా రావు తల్లాప్రగడ గారు "మాయ మయ్యెనిట మాయాలింగము" అంటూ రాగయుక్తమైన గీతాన్ని ఆలపించారు.

తరువాత డా||కె.గీత గారు "2019 లో ఉగాది పండగ" అంటూ ఆధునిక యుగంలో మనిషి వాయిస్ అసిస్టెంట్ల మీద ఆధారపడడం పై హాస్యపూరిత కవితను  వినిపించారు. మధు ప్రఖ్యా గారు "వెయ్యి వెయ్యి అడుగు" అంటూ కవితతో పాటూ జ్యోతిశ్శాస్త్రమ్మీద చమత్కారవంతమైన చిరు ఉపన్యాసం చేసారు. తరువాత కిరణ్ ప్రభ గారు తల్లిదండ్రుల విశిష్టతల్ని తెలిపే కవితల్ని వినిపించారు. కె.శారద గారు "ఉగాది ప్రహసనం" కవితను, నాగరాజు రామస్వామి గారు "విచ్చుకున్న అక్షరం", "ఉహాకోకచిలక" అనే కవితలను, బుస్సా రూప గారు "న గుణింతంలో కృష్ణుని పై" కవితను, "సీతారామ కల్యాణం" కవితను వినిపించారు. ఆ తర్వాత పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు చెన్నుని పద్యాలు, చెన్న కేశవ రెడ్డి గారు "ఎన్నికల కవిత" ను, వంశీ ప్రఖ్యా గారు "చిక్కటి చీకట్లు", నాగ సాయిబాబా గారు "ప్రేమకోసమై వలలో పడినే" అనే పాటకు ప్రేరడీ కవితతోను అందరినీ అలరించారు. చివరగా శ్రీ చరణ్ గారు ఇటీవల తమ అవధానంలోని "అంతరిక్షంలో వివాహం" అనే అంశమ్మీద, తాటకి, హిడింబ, పూతన, మంధర పదాలతో నవ వధువుని ఉద్దేశించి చెప్పిన పద్యాలను వినిపించి కవిసమ్మేళనాన్ని ముగించారు.



ఆ తర్వాత "తెలుగు రచయిత" నిర్వాహకులు డా||కె.గీత, సుభాష్ పెద్దు గార్లు మాట్లాడుతూ ఈ ఉగాదికి "తెలుగు రచయిత" మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని, నాలుగవ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టిందని ఇప్పటి వరకు వెయ్యికి పైగా రచయితలకు ఇందులో స్థానం కల్పించడం జరిగిందని, ఇందుకు దోహదపడిన తానా వారికి, స్థానిక ప్రముఖులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులోనూ సహాయ సహకారాలు అందించాలని  విజ్ఞప్తి చేసారు.

విరామం తర్వాత శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరినీ అత్యంత అలరించింది.

చివరగా అక్కిరాజు రమాపతిరావు గారు రమణ మహర్షి 130 వ వర్థంతి సందర్భంగా ఉపన్యసించి సభను ముగించారు.

ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశంలో స్థానిక ప్రముఖులు అనేకులు విశిష్టంగా పాల్గొన్నారు.

---------

http://sirimalle.com/vikshanam-80/

https://www.koumudi.net/Monthly/2019/may/may_2019_vyAsakoumudi_vikshanam.pdf

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-80/


వీక్షణం సాహితీ సమావేశం - 79

 

వీక్షణం సాహితీ గవాక్షం - 79

- వరూధిని



వీక్షణం 79 వ సమావేశం మిల్పిటాస్ లోని తాటిపామల మృత్యుంజయుడు గారింట్లో జరిగింది.

ఈ సమావేశానికి శ్రీ సుభాష్ పెద్దు అధ్యక్షత వహించారు.

ముందుగా చలం గారి కథ "యముడితో చలం" కథను డా||కె.గీత, శ్రీమతి కె. శారద గార్లు చలం, యముని పాత్రలుగా కథను చదివి వినిపించి అందరినీ అలరించారు.

కథా పఠనం తర్వాత సభలో రసవత్తరమైన చర్చ జరిగింది.

ఈ కథ 1958 లో చలం గారు పూర్వ జీవితానికీ, ఆశ్రమ జీవితానికీ మధ్య కాలంలో రాసినదని, కథలో తత్త్వ విచారం సరిగా జరగలేదని, కొన్ని ప్రశ్నలకు అర్థం లేదని, తప్పు చేస్తేనే శిక్షా?, స్వరం, నరకం అంటే ఏమిటి? పాప పుణ్యాలకు అర్థాలు ఏమిటి? చదువరుల విశ్లేషణ ఎలా ఉంది? అసలు ప్రశ్నలు కథ ముగిసేక మొదలవుతాయి, యముణ్ణి విమర్శిస్తే ఎక్కడా ఎందుకు ప్రతి చర్చ ఉండదు? యముడు, చలం ఇద్దరూ చలమే. చలం గారి ఆత్మాన్వేషణే ఈ కథ..." అంటూ విభిన్న అభిప్రాయల్ని వెలిబుచ్చారు.

ఆ తర్వాత కిరణ్ ప్రభ గారు "చలం జీవితం లో పిల్లల పాత్ర" అనే అంశం మీద ప్రసంగించి అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసారు. ‘చలం గారి గురించి సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన సాహిత్యం అంతా చదవాలి, మొత్తం జీవితం తెలుసుకోవాలి’ అంటూ మొదలు పెట్టి ఆయన జీవితంలో పిల్లలు ఎంత విశిష్ట పాత్ర వహించారో వివరించారు.

అదే వరుసలో శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు "రచయిత చలం రమణ భక్తుడెలా అయ్యేడు?" అన్న అంశమ్మీద ఉపన్యసించారు.

ఆ తరువాత మృత్యుంజయుడు గారు "వెళ్లిపో" అనే స్వీయ కథను సభకు చదివి వినిపించి ప్రశంసలందుకున్నారు.

విరామం తర్వాత  కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ సభలోని అందరినీ ఆనందోత్సాహలలో ముంచెత్తింది.

చివరగా కవిసమ్మేళనంలో శ్రీమతి రాధిక, డా|| కె.గీత, శ్రీ చెన్న కేశవ రెడ్డి, శ్రీ నాగ సాయిబాబా, శ్రీ కృష్ణకుమార్ గార్లు పాల్గొన్నారు.

ఈ సభలో ఇంకా శ్రీమతి అపర్ణ,  శ్రీమతి షర్మిల, శ్రీమతి ఉమ, శ్రీమతి జయ, శ్రీమతి శాంత, శ్రీమతి క్రాంతి, శ్రీ సుబ్బారావు, శ్రీ ఫణీంద్ర, శ్రీ చిమటా శ్రీనివాస్,  శ్రీ వేమూరి, శ్రీ పిల్లల మర్రి కృష్ణకుమార్,  శ్రీ లెనిన్ మొదలైన స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.



-----------

http://sirimalle.com/vikshanam-79/

https://www.koumudi.net/Monthly/2019/april/april_2019_vyAsakoumudi_vikshanam.pdf

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-79/


వీక్షణం సాహితీ సమావేశం - 78

 

వీక్షణం సాహితీ గవాక్షం - 78

- వరూధిని



వీక్షణం 78 వ సాహితీ సమావేశం కాలిఫోర్నియా బే ఏరియాలోని ప్లెసంటన్ లో ఫిబ్రవరి 10, 2019 న శ్రీ  వేమూరి వేంకటేశ్వర్రావు, శ్రీమతి ఉమా వేమూరి గారి ఇంట జరిగింది.

ఈ సమావేశానికి శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు అధ్యక్షత  వహించారు.

ఈ సభలో ముందుగా శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారి కథ "ఉద్యోగం" మీద కథా చర్చ జరిగింది. కథను సభకు శ్రీ కిరణ్ ప్రభ చదివి వినిపించారు. ఒక మధ్యతరగతి వాడు ఉద్యోగం కోసం ఎన్ని పాట్లు పడాలో వివరించే కథ ఇది. ఇక కథ పట్ల సభలోని వారు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతూ, చిన్న చిన్న విషయాలు వివరంగా చెప్పడం కొ.కు స్టైల్ అనీ, కథాంశం కంటే చెప్పే విధానం చాలా బావుందని, కథ చదువుతున్నపుడు కాలమానపరిస్థితులు చక్కగా తెలుసుకోగలిగిన కథ, ఆశ, నిరాశల మధ్య ఊగిసలాటని వ్యంగ్యంగా చెప్పడం బావుందని, కథ వేగంగా నడిచినా కథలో వేగం లేదని, చిన్న ఉద్యోగి కేపిటలిస్టిక్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలియజెప్పే కథ అనీ అన్నారు.

తరువాత కథా రచయిత్రి రాధిక తన పేరిట ప్రతీ సంవత్సరం అందజేసే రాధికా సాహితీ అవార్డుని ఈ సంవత్సరం శ్రీ  వేమూరి వేంకటేశ్వర్రావు గారికి అందజేసారు. ఈ సందర్భంగా వేమూరి జీవిత విశేషాలను, రచనల ద్వారా వారు సాహితీ లోకానికి చేస్తున్న సేవను డా||కె.గీత సభకు వివరించారు.

ఆ తర్వాత శ్రీమతి రాధిక "అనగనగా ఒక రోజు" అంటూ స్వీయ కథా పఠనం చేసారు. రోజు మొత్తమ్మీద ఎదురయ్యే పురుగూపుట్రా జీవితంలో ఎలా తప్పవో వివరిస్తూ, అనుక్షణం పీడించే భర్తను క్రిమితో పోలుస్తూ ముగించడం కొసమెరుపు.

విరామం తర్వాత డా||కె.గీత శ్రీమతి పుట్ల హేమలత గారి కవిత "జ్ఞాపకాల తెరలు"ను సభకు చదివి వినిపించారు. హేమలత గారు తనకెంతో ఆత్మీయులని పేర్కొంటూ, వారి జీవిత విశేషాలను, రచనలను, "విహంగ" పత్రికాధిపతిగా వెబ్ పత్రికా రంగంలో సలిపిన కృషిని వివరించారు. తరువాత ఆమెకు నివాళి గా అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఆ తరవాత శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరినీ ఆసక్తిదాయకుల్ని చేస్తూ అలరించింది.

ఈ సమావేశానికి కొత్తగా విచ్చేసిన శ్రీ ఫణీంద్ర స్వీయ పరిచయం, శ్రీమతి ఉదయలక్ష్మి గారి షేక్స్పియర్ "సోలిలోక్వీ" (స్వగతం) గురించిన పరిచయం తర్వాత, కవిసమ్మేళనంతో సభ విజయవంతంగా ముగిసింది.

స్థానిక ప్రముఖులు శ్రీ మృత్యుంజయుడు, శ్రీ లెనిన్, శ్రీ కృష్ణకుమార్, శ్రీమతి శారద, శ్రీమతి షర్మిల మొ.న వారు ఈ సభలో పాల్గొన్నారు.

----------

http://sirimalle.com/vikshanam-78/

https://www.koumudi.net/Monthly/2019/march/march_2019_vyAsakoumudi_vikshanam.pdf

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b1%87%e0%b0%b6%e0%b0%82-78/

వీక్షణం సాహితీ సమావేశం - 77

వీక్షణం సాహితీ గవాక్షం - 77 

- విద్యార్థి



వీక్షణం 77వ సమావేశం  జనవరి 13, 2019 నాడు, శ్రీమతి విజయా ఆసూరి, శ్రీ వేణు ఆసూరి దంపతుల స్వగృహమునందు జరిగినది. భోగి పండుగ నాడు జరిగిన ఈ సమావేశం సంక్రాంతి సాహిత్య సభగా, ఒక ఆత్మీయ సమావేశంగా సాగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన వారు ఆచార్య చెన్న కేశవ రెడ్డి గారు.

ఈ సభలో మొదటి అంశం రావి శాస్త్రి గారి "పిపీలికం" కథా పఠనం మరియు చర్చ. కథ ఎంత బాగుందో, వేణు ఆసూరి గారి కథా పఠనం కూడా అంత ఆసక్తికరముగా సాగింది. ఈ కథ గురించి వేణుగారు వివరిస్తూ, "రావి శాస్త్రి గారు ఆంధ్రజ్యోతి పత్రిక వారివద్ద అప్పు తీసుకుని, ఆ అప్పు తీర్చటం కోసం వ్రాసి ఇచ్చిన బాకీ కథలలో పిపీలకం ఒక కథ" అని వివరించారు. ఈ కథ శ్రామిక వర్గాలలో చైతన్యం నింపే కథ. వేరే వారెవరూ కాకుండా, పీడిత ప్రజలు తమకు తాము చైతన్యవంతులై దోపిడీవర్గాలను ఎదుర్కోవటాన్ని తెలిపే కథ. కథా శైలి గురించి విపులంగా జరిగిన చర్చ ఆసక్తికరముగా సాగింది.

ఆ తరువాతి కార్యక్రమం డా|| కె. గీత గారి "సిలికాన్ లోయ సాక్షిగా" కథా సంపుటి పుస్తకావిష్కరణ. గీత గారు అమెరికా లోని సిలికాన్ లోయకు వచ్చిన కొత్తలో వారి జీవిత అనుభవాలను, వారు గమనించిన ఇతర భారతీయుల మిథ్యాచారాలను, ఇక్కడి స్పానిష్ శ్రామిక వర్గం ఆత్మీయతలను పొందుపరుస్తూ వ్రాసిన కథల సంపుటి. శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారు ఈ కథల సంపుటిని ఆవిష్కరించి, పుస్తక పరిచయం చేశారు. వారి మాటలలో "ఈ కథలు ఇచ్చటి సమాజాన్ని మంచితనం, మానవత్వంతో విశ్లేషించి, ఇచ్చటి వారి సమతను మమతను వివరించిన కథలు" అని చెప్పారు. తరువాత గీత గారు పుస్తకంలోని కథలను వివరిస్తూ కథలలోని పాత్రలన్నీ ప్రధాన పాత్ర  చుట్టూ అల్లుతూ సాగిన గొలుసు కథలివన్నీ అని వివరించారు. నవ చేతనా పబ్లిషర్సు ప్రచురించిన ఈ కథా సంపుటి గీత గారి తొలి కథా సంపుటి.

అధ్యక్షులు చెన్నకేశవ రెడ్డి గారు తమ స్వీయ రచనలు అందరికీ పరిచయం చేసారు. వారి "అక్షర న్యాసం" ఒక మంచి అధ్యయన వ్యాస సంపుటి. "మకాం మార్చిన మణి దీపం" వారి జీవితానుభవాల కవితా సంపుటి.

కిరణ్ ప్రభ గారి ప్రశ్నావళి కార్యక్రమం ఎప్పటివలెనే అత్యంత ఆసక్తికరముగా, ఉత్సాహంగా జరిగినది.

తర్వాత విద్యార్ధి కథ "కల" గురించి లెనిన్ గారు ఉపన్యసించారు. ఆఖరుగా  జరిగిన కవిసమ్మేళనంలో శ్రీ సాయిబాబా ఎప్పటిలా పేరడీ కవితను, శ్రీ చెన్న కేశవ రెడ్డి గారు గీత ను తమ పుత్రికగా భావిస్తూ రాసిన కవితను వినిపించి అందరినీ అలరించారు.

శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీ ఇక్బల్, శ్రీ మృత్యుంజయుడు తాటిపామల, శ్రీ హరనాథ్, శ్రీ సాయిబాబా, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి కోటేశ్వరి, శ్రీమతి ఉమా వేమూరి మొదలైన స్థానిక  ప్రముఖులు పాల్గొన్న ఈ సభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

------------

http://sirimalle.com/vikshanam-77/

https://www.koumudi.net/Monthly/2019/february/feb_2019_vyAsakoumudi_vikshanam.pdf

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-77/

వీక్షణం సాహితీ సమావేశం - 76

వీక్షణం సాహితీ గవాక్షం - 76 

-వరూధిని



వీక్షణం-76 వ సమావేశం ఫ్రీ మౌంట్ లోని షర్మిలా గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ఈ సభకు శ్రీ తాటిపామల మృత్యుంజయుడు అధ్యక్షత వహించారు.

ముందుగా సభలో వీరేశలింగం గారి గురించి ప్రసంగిస్తూ శ్రీ అక్కిరాజు రమాపతిరావు వారి రచనలపై తన డాక్టరేట్ రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు. వీరేశలింగం గారి విశిష్టతను సభకు పరిచయం చేస్తూ ఆధునిక ఆంధ్ర దేశం గోదావరి అయితే వీరేశలింగం నాసికాత్ర్యయంబకం అన్నారు.

తెలుగు సాహిత్యంలో ఆధునిక ప్రక్రియలైన నవల, కథ, నాటిక మొ.న అన్నిటికీ ఆయనే ఆద్యుడని పేర్కొన్నారు. ఆయన వితంతువులకి ఉచిత విద్యని అందించాడు. ఆయనను గురించి చిలకమర్తి "అటువంటి సంఘసంస్కర్త, అటువంటి రచయిత మరి కొన్ని వందల ఏళ్లకు గాని మళ్లీ పుట్టడు" అన్నారని అన్నారు. వీరేశలింగం "వివేకవర్థిని" పత్రికను నడిపారు, అనేక ప్రహసనాలు రాసేరు, ఆధునిక భావాల్ని విస్తరింపజేసారు. తన స్వీయ చరిత్రను తన శ్రీమతి రాజ్యలక్ష్మికి అంకితం ఇచ్చారు. వర్తమా నాంధ్ర భాషా సమాజాన్ని స్థాపించారు.

తెలుగులో తొలి నవల అయిన "రాజశేఖర చరిత్రము" ను రాసారు. మొత్తంగా వీరేశలింగం పత్రికా సంపాదకత్వం, గ్రంథ రచన, కవుల చరిత్ర, సమాజ సేవ, తాళపత్ర గ్రంథాల సంస్కరణ సల్పిన గొప్ప పండితుడు, అన్నిటినీ మించి గొప్ప మనిషి అని ముగించారు.

తర్వాత శ్రీమతి షర్మిల "చిట్టెమ్మ మనవరాలు" కథను చదివి వినిపించారు. ఆద్యంతం ఆసక్తిదాయకమైన ఈ కథ అందరినీ మెప్పించింది.

ఆ తర్వాత శ్రీ అక్కిరాజు బిలహరి ఏకబిగిన పోతన భాగవతం లోని నృశింహావతారం ఆవిర్భావ ఘట్టాన్ని వినిపించారు.
"అంబా నన్ కృపజూడు భారతీ..అని మొదలు పెట్టి "ఇట్లు దానవేంద్రుడు" అంటూ కరతాళ ధ్వనుల మధ్య ముగించారు.

తన కుమారుణ్ని పరిచయం చేస్తూ శ్రీ అక్కిరాజు సుందర రామ కృష్ణ బిలహరి ఈ ఘట్టాన్ని నెల రోజుల వ్యవథిలో నేర్చుకున్నారని అన్నారు. తర్వాత "సద్యోపగతుండగు.." అంటూ ఆయన స్వయంగా పద్యాలు ఆలపించారు.

విరామం తర్వాత డా|| కె. గీత "ఒక పాటకు..." అంటూ లలిత గీతాన్ని ఆలపించి సభను పున: ప్రారంభించారు. తర్వాత శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ సభలోని వారందరినీ ఉర్రూతలూగించింది.

ఆ తరవాత శ్రీమతి ఉదయలక్ష్మి "కుల వృత్తుల ప్రాధాన్యత" అంటూ పెళ్ళిళ్లలో మరిచిపోతున్న సంప్రదాయాల్ని గుర్తు చేశారు.

చివరగా కవిసమ్మేళనం లో కె.గీత "గర్జించే నలభై లు" కవితను, శ్రీ హరనాథ్ కంద పద్యాన్ని, శ్రీ నాగ సాయిబాబా "విన్నానులే ప్రియా" అంటూ పేరడీ గీతాన్ని ఆలపించి సభను జయప్రదం చేసారు.

ఈ సభలో శ్రీ వేమూరి, శ్రీమతి ఉమ, శ్రీ గాంధీ ప్రసాద్, శ్రీ పల్లా రామకృష్ణ, శ్రీమతి రాధ, శ్రీ లెనిన్, శ్రీ పిల్లలమర్రి కృష్ణ కుమార్, శ్రీమతి శారద, శ్రీమతి మాధవి, శ్రీ రావు, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి కోటేశ్వరమ్మ మొ.న స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

-------

http://sirimalle.com/vikshanam-76/

https://www.koumudi.net/Monthly/2019/january/jan_2019_vyAsakoumudi_vikshanam.pdf

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-76-%e0%b0%b8%e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7/

వీక్షణం సాహితీ సమావేశం - 75 (వజ్రోత్సవ సమావేశం)

 

వీక్షణం సాహితీ గవాక్షం - 75 (వజ్రోత్సవ సమావేశం)

ఆర్. దమయంతి




కాలిఫోర్నియా బే ఏరియాలో నెలకొన్న వీక్షణం సాహితీ సంస్థ 75 మాసాలను పూర్తి చేసుకున్న శుభ తరుణాన వజ్రోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది.

మిల్ పిటాస్ లో నివసిస్తున్న రచయిత శ్రీ అనిల్ ఎస్ రాయల్ గారి స్వగృహం లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

ఆ నాటి సభలో పాల్గొన్న వారిలో తెలుగు సాహిత్యంలో ఘనాపాటీలు గా కీర్తింపబడుతున్న వారు, వేద పండితులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ప్రసిద్ధ కవులు, రచయితలు, విశేష విశ్లేషకులు, మధుర గాయనీ గాయకులు పాల్గొని, తమ తమ ప్రతిభాపాటవాలతో సభికులను రంజింప చేసారు.

సభని ప్రారంభిస్తూ, డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ వీక్షణం వారి సాహితీ సేవలను కొని యాడారు. ఆనాటి ప్రధానోపన్యాసకులు, కేంద్ర సాహిత్య అకడెమీ అవార్డ్ గ్రహీతలు అయిన శ్రీ సదాశివ మూర్తి గారిని గారిని వేదిక మీదకి సాదరం గా ఆహ్వానించారు. శ్రీ సదాశివ మూర్తి గారు - రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ ఆచార్యులు. భాషా ప్రవీణులు. వేద శాస్త్రాల నించి ఆధునిక వచన కవిత్వం వరకు ఏ అంశం గురించి అయినా అలవోకగా విశ్లేషించి వివరించగల ప్రతిభా మూర్తి. గొప్ప వక్త. సంస్కృతం తో బాటు ఆంగ్ల, తెలుగు సాహిత్య విశ్లేషణ లో అనుభవజ్ఞులు.

వీరిని సాహిత్య శాస్త్రాచార్యులు గా అభివర్ణించారు.

శ్రీ సదాశివ మూర్తి గారు ఆధునిక వచన కవిత్వం గురించి మాట్లాడుతూ, వచన కవిత్వం మూలాలు వేదాలలో దొరుకుతాయని ఉదాహరణలతో పేర్కొన్నారు.

పాద వ్యవస్థ లేని వచనం లో శబ్ద సౌందర్యం చోటు చేసుకుని వినసొంపుగా వుంటుందని, నిజానికి ఆ ఆనందాన్ని కలిగించే శబ్దం పేరే చందస్సు అని పేర్కొన్నారు. ఓం - ఏక పాద చందస్సు అనీ, నాట్య శాస్త్రం లో చందస్సు 2 రకాలు అనీ, పాద నియమం లేనిది అనిబధ్ధ చందస్సు అనీ - వివరించారు.

పద్యం, గద్యం, ప్రోజ్, రూపకాలు, నాటకాలు - ఈ ప్రక్రియలు సమస్తం వాంగ్మయ కావ్యంగా అభివర్ణిస్తూ, గద్యమూ చందస్సే అని అన్నారు. వృత్తగ్రంధి వచనాన్ని గద్యం గా పేర్కొనవచ్చన్నారు. చూర్ణ గద్యం గురించి వివరిస్తూ, వ్యావహారిక భాషలొ కవిత్వ ప్రక్రియ పశ్చిమ సాహిత్యం నించి దిగుమతి అయిందన్నారు. వేదాలు, ఇతిహాసాలు, కావ్య కాలం అనంతరం, జాన పద సాహితీ కళా వైభవ కాలాన్ని వర్ణిస్తూ పదకవిత పితామహుడు అన్నమయ్య రాసిన పలు కీర్తనలలోని పదాల సౌరభాలని వెదజల్లారు.

జయదేవుని గీతగోవిందం విశిష్టత ని వర్ణిస్తూ - సామానుయునికి సైతం అర్ధమయ్యేలా చక్కని కథని వినిపించారు.

తల్లి యశోదని అడుగుతాడట, బాల కృష్ణుడు. పాలు కావాలి అమ్మా అని. అప్పటికే బొజ్జ నిండి వుంది. ఇంకా తాగితే పసి వానికేమైనా అవుతుందని తల్లి భయపడి, వొద్దంటుంది. 'ఎందుకు వొద్దూ?' అని మారు ప్రశ్నిస్తాడు పిల్లడు.

పగలైపోనీ, చీకటయ్యాక ఇస్తానని దాటేస్తుంది.

అప్పుడా అల్లరి, కళ్ళు మూసుకుని, చీటైపోయింది, పాలివ్వమంటాడు.

వాని తెలివికి యశోద ఎంతగా మురిసిపోతుందనీ!?

సంస్కృతం లో ఈ వర్ణన అత్యంతద్భుతం గా, ఛందో బద్ధం గా వుంది, చెవులకు శబ్ద సౌందర్యాన్నిఅందిస్తూ, మనసుకి మనోల్లాసాన్ని కలిగిస్తూ భక్తి పార్వశ్యం లో ముంచి తేల్చుతుందని ఎంతో హృద్యం గా ప్రసంగించారు.

పద్యాన్ని సరళ సంభాషణ గా నిర్వచించారు. వేదాలలోని అష్టపాత్ ని గద్యం గా పరిగణించవచ్చన్నారు.

తిత్రీయం గురించి విపులీకరిస్తూ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ని ఉదహరించారు.

అపూర్వమైన గురు శిష్యుల అనుబంధాన్ని వివరిస్తూ..మూడు రకాలు గురువులుంటారని, పూర్వ కాల గురువులు శిష్యులని తనయులుగా భావించేవావరనీ, అందుకు విశ్వామిత్ర వశిష్టులే మనకు ప్రత్యక్ష సాక్ష్యులన్నారు. ఆనాటి గురువులు 'శిష్య విత్తాపహరులు' కారన్న మాటలకు సభలోని వారందరూ కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని తెలిపారు. విద్య కర్తవ్యాన్నీ, ధర్మాన్ని బోధించేదిగా వుండాలని, బహుజన హితమైన బోధనల వల్ల సమాజం లో శాంతి సమన్వయాలు నెలకొంటాయంటూ సత్యతత్వాన్నీ వినిపించారు.

పద్యాన్ని వ్యాకరణా వ్యాయమం తో రాసి మెప్పించవచ్చు కానీ గద్యం అలా కాదు, రాసి మెప్పించగలిగినప్పుడే గద్యం గ్లామర్ నిలుస్తుందన్నారు.

వచన కవిత్వానికి మూలాలు - వర్ణన, ప్రభావ పరిమితి, స్థల పరిమితి, కాల పరిమితి, మమతా సామర్ధ్య పరిమితి గా విపులీకరించారు.

కవిత్వం ఆశయసిధ్ధి లక్షణాన్ని కలిగి వుండటం వల్ల, కవి క్రాంతి దర్శి అవుతాడని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

శ్లోకం, పద్యం, గద్యం, కవిత్వం, వచనం ఏదైనా రసపూర్ణమై, తంత్రీ లయాకృతమై ధ్వనించాలన్నారు. వాల్మీకి నించి, నేటి ఆధునిక కవుల వరకు వారి వారి రచనలలో ప్రవహించే పదాల పరుగుల వేగాన్ని ఒడిసి పట్టుకుని మచ్చుకకి కొన్ని పాదాలను గానించి వినిపించారు.

'పడవ నడపవోయ్..పూల పడవ నడప ఓయి..చిట్టిన తెర చాపనెత్తి గట్టిగా చుక్కాని బట్టి ...' అంటూ పద్యం గాను, కవితగానూ చదివీ, ఆ పిమ్మట అదే పాట గా పాడి పద ధ్వనుల పట్టుని తేనె పట్టుగా పట్టి వీనుల విందు చేశారు.

కవిత్వం లో లయ ప్రాధాన్యత గురించి వివరిస్తూ, మహా కవి 'శ్రీ శ్రీ' రగడలు, దేవులపల్లి లేత పదాలు, వింజమూరి సాహిత్య సొగసుల్ను వఋనించారు.

అమెరికా లో నిర్వహిస్తున్న సాహితీ సభలు ఇండియాలో కంటే మిన్నగా, ఉన్నతం గా సాగుతున్నాయనీ, వీక్షణం వజ్రోత్సవ సభలో తన దీర్ఘ ప్రసంగాన్ని వినిపించే అవకాశం కలగడం ఒక అదృష్టం గా భావిస్తున్నట్టు చెప్పారు.

ఈ మహావకాశాన్ని కలగ చేసిన డా. కె. గీతా మాధవి గారికి తన ధన్యవాదాలు తెలియచేస్తూ, తమ పుస్తక కావ్యాన్ని గీత గారికి అందచేసారు.

అనంతరం శ్రీ ఎ.కె.ప్రభాకర్ గారి ప్రసంగం ఆరంభమైంది.

వీరు ప్రముఖ రచయిత, విశ్లేషకులు, సంస్కృత తెలుగు భాషా కోవిదులు. ప్రభాకర్ తన గురించి చెబుతూ, తెలుగు మాండలీక కథా సాహిత్య పరిశోధనా క్రమంలో తెలంగాణా కథ తనని అమితం గా ఆకట్టుకుందనీ, ఆవేదన తో బాటు తన అన్వేషణా కొన సాగిందంటూ తన ప్రసంగాన్ని ఆరంభించారు ప్రభాకర్. కథా సాహిత్యం తో ఉద్యమం విజృభించిందా? ఉద్యమ సెగలలోంచి ఉద్యమ కథ పుట్టిందా? ఈ సత్య శోధనలొ తాను తెలుసుకున్న నిజాలను కొన్నిట్ని వివరించారు. వారి మాటలని సభికులు ఎంతో నిశ్శబ్దంగా, ఆసక్తి కరం గా ఆలకించారు.

ఉద్యమాల కథలు అనేక ముఖాలు గా విస్తరించిందంటూ, వాటి స్వరూపాలను వివరించారు. సంస్కరణోద్యమం, వ్యావహారిక భాషోద్యమం, స్వాతంత్రోద్యమం, అస్థిత్వోద్యమాల గురించి పుట్టుపూర్వోత్తరాల గురించీ క్షుణ్ణం గా వివరించారు.

ప్రజల్లారా మీరెటు వైపు? అంటూ అడిగిన ఒకే ఒక్క ప్రశ్న - విప్లవాత్మకమైన రాజకీయ పరిణామాలకు దారితీసిందని చెబుతూ, 70 ల నాటి విరసం ఉద్భవం, ప్రభావం, నక్సల్ బరీ, విద్యార్ధుల ఉద్రేకం, దోపిడీ వ్యవస్థ పై తిరుగుబాటు చేసిన విధానం గురించి కళ్లక్కట్టినట్టు వివరించారు. ఈ ఉద్యమ ప్రచారం లో ప్రధాన పాత్ర పోషించినది ఉద్యమ సాహిత్యమని పేర్కొన్నారు. కథ, కవిత్వం, పదం, జానపద గీతం, నాట్య దృశ్యా రచనం అంతా కూడా ఒక ప్రచార కళా రూపమని అభిప్రాయపడ్డారు.

ఆది భట్ల కైలాసం, భూషణం మాస్టార్రి కథలను - ఉద్యమ సాహిత్యానికి ఉదాహరణలన్నారు. స్వాతంత్రోద్యమంతో అంతమవ్వాల్సిన బానిసత్వం, బడుగు వర్గాల అణచివేత, రాజకీయ చెదరంగం ప్రజలకి అవగాహనకొచ్చేసరికి 20 ఏళ్ళు పట్టిందన్నారు.

1967 లో రగిలిన విప్లవోద్యమం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం గా చూపారు. శ్రీకాకుళం నించి పుట్టిన ఉద్యమం అక్కడ ఎందుకు తగ్గు ముఖం పట్టిందో, అది తెలంగాణా దిశగా ఎలా ప్రవహిస్తూ వచ్చిందో, ఆ ఉద్యమ విజృంభన ఎలా దద్దరిల్లిందో, ఉద్యమ సాహిత్యం ద్వారా ఎలా విజయాన్ని సాధించిందో అంశాల వారీగా విశ్లేషించారు. చివరిమెట్టున విప్లవోద్యమం అనేక ఉద్యమాలు గా మారి ప్రధాన కేంద్ర బిందువు నిండి విడివడి, అనేకానేక ఉద్యమ వర్గాలుగా చీలిన మాట వాస్తవమన్నారు.

కొ.కు, కారా మాస్టార్ల కథ, నవలా సాహిత్యాలు, శ్రీ శ్రీ కవిత్వంలో చోటు చేసుకున్న పరిణామాలు, 70 ల తర్వాత సాహిత్యం గీతాలలో ప్రాణం పోసుకుని పరుగిడిన వైనాలు, పాటలోనే కథా సాహిత్యాన్ని గుప్పించి, ప్రజలను చైతన్యవంతులుగా చేసిన శివసాగర్, 1972 నాటి జననాట్యమండలి, 74 రాడికల్ స్టూడెంట్ యూనియన్, గ్రామలకు తరలండి, ప్రచారం చేయండంటూ పిలుపునిచ్చిన జయప్రకాశ్ నారాయణ నాయకత్వం గురించి..ఇంకా అనేకానేక ఆసక్తికరమైన అంశాల గురించి ఉద్యమ సాహిత్య విశిష్టత గురించీ ప్రసంగించారు.

తన ఉద్యమ కథా సాహిత్య పరిశోధనల కోసం పలు ప్రాంతాలు పర్యటించి. పరిశోధించి తెలుసుకున్న సత్యాల గురించి చెబుతూ, 1940 లో తెలంగాణలో రైతు ఉద్యమ ఉద్రిక్తత పరిస్థితుల గురించి ప్రస్తావించారు. గ్రంధాలయోద్యమం పుట్టుకనీ, దాని ప్రాశస్త్యాన్ని పేర్కొన్నారు. అటు పిమ్మట భూస్వామ్య వ్యతిరేకోద్యమం- వెట్టిచాకిరీ నిర్మూలన కి ఎంత గా దోహద పడిందీ చెబుతూ, అందుకు ప్రధాన నాయక పాత్ర పోషించిన దొడ్డి కొమరయ్య సేవలను కొనియాడారు.

రాజ్యాధికారం కోసం చేసే ఉద్యమాలను ప్రస్తావిస్తూ.. ఎం.వి.తిరుపతయ్య రాసిన న్యాయం కథని ఉటంకించారు.

ఉద్యమ సాహిత్యానికి చెరలు, రాజకీయ అధికారుల ఆటంకాలు, అవరోధాలు, ఆనకట్టలు, రచయితల అరెస్టులూ, చెరసాల పాలు చేసి పెట్టిన హింసలు భరించక తప్పలేదంటూ తన ఆవేదన ని వ్యక్తపరిచారు.

'న్యూవేవ్ 'సంకలనం గురించి వివరిస్తూ తాడిగిరి పోతరాజు ని అధికారులు టార్గెట్ చేసిన మాట నిజమన్నారు.

ఎర్ర బుట్ట కవి నించి పతంజలి భావోద్రేకాలనీ, - రైతు ఉద్యమం నించి కార్మికోద్యమం, పని వేతనం, శ్రమ దోపిడీ కి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు, విప్లవాలు, సాధించిన విజయాలను వివరిస్తూ అందుకు కృషి సలిపిన రచయితలు - తుమ్మేటి రఘోత్తమరెడ్డి, అల్లం రాజయ్య, సత్యం,- విప్లవ సాహితీ వేత్తలను పేర్లను పేర్కొంటూ మరి ఒక ఆసక్తి కరమైన విషయాన్ని చెప్పారు. అప్పట్లో దరిదాపు వెయ్యిమంది మేధావుల సమూహం ప్రత్యమ్నాయ ప్రభుత్వాన్ని నడిపేదని న్యాయ పొరాటం చేసేదని అందుకు ఉద్యమ సాహిత్యమే ఒక పదునైన ఆయుధమని తెలియ చేపారు.

గిరిజనుల దోపిడి ఉద్యమం లో భాగం గా పుట్టిన సాహిత్యం గురించి చెబుతూ 'ఇప్పుడు కాగితం చూసి ప్రజలు భయపడుతున్నారు. నేను చెమట నించీ రక్తమ్నించీ పుట్టిన భాషనే మాట్లాడతాను..' అంటూ నిర్భయం గా ప్రకటించిన అల్లం రాజయ్య మాటలని, సాహిత్యోద్యమం లో తెలుగు అక్షరం పోషించిన అద్భుత అసామాన్య పాత్రనీ కొనియాడారు.

అసమానత్వం రాజ్యమేలుతున్నంత కాలమూ ఉద్యమాలు పుడుతూనే వుంటాయని, ఉద్యమ సాహిత్యం ఉద్భవిస్తూనే వుంటుందంటూ..ప్రసంగ ముగింపు వాక్యాన్ని పలికారు.

తనకీ అవకాశాన్ని కలిగించిన వీక్షణం సాహితీ సంస్థకీ, వ్యవస్థాపకురాలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రభాకర్ గారి ఉపన్యాసం ఆద్యంతమూ ఆసక్తికరం గా సాగింది. ఆ నాటి చారిత్రాత్మక విప్లవ సన్నివేశాలు, సంఘటనలు, విషాదాలు చోటు చేసుకున్న కారణం కావొచ్చు, సభికులు కదలకుండా నిశ్శబ్దం గా శ్రద్ధ గా ఆలకించారు. రెట్టించిన ఉత్సహాంతో కరతాళ ధ్వనుల ద్వారా తమ హర్షాన్ని తెలియచేసారు.

అనంతరం -

సభ కి విరామం ఇస్తూ అందరూ టీ, స్నాక్స్, సేవించారు. కారం, తీపి, పులుపు, ఫ్రూట్స్, టీ సేవిస్తూ కూడా సాహిత్యమమకార సంగతులే మాట్లాడుకున్నాం.

తాము రాసిన లేటెస్ట్ రచనల గురించో, చదివిన పుస్తకం గురించో పర్యటించిన ప్రదేశాల విశేషాల గురించో..గుంపులు గుంపులు గా ఎవరి టాపిక్ వారిదే అన్నట్టు..వింటున్న నాకు, నిజమైన తెలుగు వారి పండగ అంటే ఇది కదా అనిపించింది.

బ్రేక్ అనంతరం, ఎప్పట్లానే కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమం ఆరంభమైంది.

ఆప్షనల్ ఆన్సర్స్ కాబట్టి నేనూ ఉత్సాహం గా పాల్గొంటుంటాను. ప్రశ్న వేసి, ఆప్షన్స్ చదివాక వెంటనే జవాబు చెప్పకూడదు. జవాబు తెలిసిన వారు చేయెత్తి ఊరుకోవాలి. క్విజ్ మాస్టర్ శ్రీ మృత్యంజయుడు తమ చాయిస్ ప్రకారం ఎవర్ని జవాబు చెప్పమని అడిగితే వారే ఆన్సర్ చెప్పాలి. ఈ రూల్ ని నేనెప్పుడూ పొరబడి అధిగమిస్తూన్నే వుంటా. 🙂

ఈ నెల క్విజ్ లో కూడా సరికొత్త విషయాలను చొప్పించి, ప్రశ్నలు తయారు చేసారు కిరణ్ ప్రభ గారు.

విజేతలకు పుస్తకాల బహుమతులుంటాయి. నేనూ కొన్నిట్ని గెలుచుకున్నాను.

క్విజ్ కార్యక్రమానంతరం పాలపర్తి వారు కమ్మని తెలుగు పద్యాన్ని వినిపించారు.

టెక్సాస్ నించి విచ్చేసిన రచయిత శ్రీ ఇస్మాయిల్ పెనుగొండ క్లుప్తంగా మాట్లాడుతూ శుభాకాంక్షలనందచేసారు.

అనిల్ కాసావర్ 'ఆరోగ్యమే మహాభాగ్యం' అంటూ చక్కని కవితని చదివి వినిపించారు.

జి.వి.హరనాథ రావు గారు - తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల మీద హాస్య వ్యంగ్య బాణాలు విసురుతూ చదివిన కవిత సభికులను ప్రశంసలతో బాటు హాస్య చురకలనూ అందుకున్నాయి.

కార్యక్రమం లో భాగం గా ' సిరికోన' వాట్సప్ గ్రూప్ వారు అక్టోబర్ మాసాన సభ్యులతో కలిసి పంచుకున్న సాహిత్యం నించి ఉత్తమ రచనల ను ఏర్చి కూర్చి ఒక మాగజైన్ గా పబ్లిష్ చేసారు. సిరికోన ప్రధమ సంచిక ని ఆవిష్కరిస్తూ, తమ పత్రిక ఆ నాటి ప్రతిష్టాత్మకమైన భారతి పత్రిక స్థాయిలో పాఠకులకు ఉత్తమ రచనలను అందచేయాలనేదే తమ ఆశయం గా పేర్కొన్నారు - ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. సిరికోన ని నెల నెలా ఒక మాగజైన్ గా వెలువరించడంలో తమ వంతు కృషి తాము చేస్తున్నామన్నారు - ఆడ్మిన్ మెంబర్స్ శ్రీ వేణు, శ్రీ చరణ్.

ప్రసంగాలనంతరం డా.గీత గారి కవితా గానం, పలువురి పెద్దల వందనాభినందనల అభివందనలాతో..ఆనాటి వజ్రోత్సవ వేడుక మళ్ళీ వచ్చేనెల మొదలయ్యే నెల నెలా సాహితీ సందడి కోసం విరామాన్ని ప్రకటిస్తూ అక్కడితో ఆగింది. ఎందరో మహానుభావులు అందరకీ వందనములు. 

______

http://sirimalle.com/vikshanam-75/

https://www.koumudi.net/Monthly/2018/december/dec_2018_vyAsakoumudi_vikshanam.pdf

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-75-%e0%b0%b5/