Monday 21 October 2013

వీ క్ష ణం- సాహితీ గవాక్షం - వార్షి కోత్సవం (Sep,15- 2013)


వీ క్ష ణం- సాహితీ గవాక్షం - వార్షి కోత్సవం

                             

              సెప్టెంబర్ 15 న బే ఏరియా సాహితీ మిత్రులు తమ 'వీక్షణం' ప్రథమ వార్షిక సమావేశాన్ని ఘనంగా జరుపుకున్నారు.మిల్పీటాస్ ఇండియా కమ్యూనిటీ సెంటర్  ICC లో సుమారు డెబ్భై మంది సాహిత్యాభిమానులు తెలుగు వెలుగు లయ్యారు.ఆరు గంటల పాటు ఆత్మీయ ఆనందోత్సవాలు వెల్లువెత్తి సభ సాహిత్యోత్సవ మయింది.
             డా||కె.గీత గారు గత సంవత్సర కాలంగా సాగుతున్న సాహితీ గవాక్షం అపురూప అక్షర క్షణాలను విహంగ వీక్షణ మాత్రంగా దర్శింప జేస్తూ సభకు నాంది పలికారు. వివిధ సాహిత్య కళా రంగాలలో లబ్దప్రతిష్ఠులైన  వరిష్ఠ అతిథులను ఆహ్వానించి వారి అనుభవ సారాన్ని, సాహితీ సంపదను ఎలా అందిపుచ్చుకోవడం జరిగిందో, పాపినేని శివశంకర్, నరిశెట్టి ఇన్నయ్య, అక్కిరాజు రమాపతి రావు, అల్లం రాజయ్య, చుక్కా రామయ్య, గొల్లపూడి మారుతీ రావు వంటి మహానుభావులు గత వీక్షణం సమావేశాలను ఎలా సుసంపన్నం చేశారో టూకీగా తెలియపరిచారు. 
Smt Nandamuri Lakshmi Parvathi

ఈ సభకు శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి గారువిశిష్ట అతిథి కావడం విశేషం.  శ్రీ ఆకెళ్ళ గారు మరో ఆకర్షణ.
             'కౌముది' సంపాదకులూ,  వీక్షణం అంతస్ఫూర్తీ ఐన శ్రీ కిరణ్ ప్రభ గారు విశిష్ట అతిథులకు స్వాగత వచనాలు పలికి వారిని లాంఛన ప్రాయంగా సభకు పరిచయం చేశారు. భాషా ప్రవీణ తొలి అడుగుగా డాక్టరేటు దాకా సాగిన లక్ష్మీ పార్వతి గారి సాహిత్య ప్రస్థానం గురించి ప్రస్తావిస్తూ వారు ఒక నవలా రచయిత్రి గా, ఒక కవయిత్రి గా, ఒక ఆధ్యాత్మిక అభిజ్ఞులుగా, ఒక పరిణిత రాజకీయ వేత్త గా ఎలా ఎదిగిందీ ఉటంకిస్తూ వారి రచనలు ‘తెలుగు తేజం’, ‘ఎదురులేని మనిషి’, ‘ఆద్యంతాలు’, ‘భజగోవింద వ్యాఖ్యానం’, ముఖ్యంగా NTR గారి పౌరాణిక పాత్రల విశ్లేషణ గురించి క్లుప్తంగా మాట్లాడుతూ 'ఆధునిక జీవితం-ఆధ్యాత్మికత' అంశం పై ప్రసంగించవలసిందిగా వారిని కోరారు.
              శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు ప్రసంగం ప్రారంభిస్తూ రాజకీయాలతో విసిగి వేసారిన తనకు 'వీక్షణం' పిలుపు చల్లని ఊపిరినిచ్చిందని కృతజ్ఞతలు  తెలుపుకున్నారు. 'సహితానాం భావం సాహిత్యం'-సమాజానికి హిత మైనదే సాహిత్యం. మూడువేల ఏళ్ళ ప్రాచీన చరిత్ర గల తొలి ప్రపంచ భాష సంస్కృతమనీ, తెలుగు తొలి తత్సమ భాష అనీ, హిందీ లాటిన్ వంటి ఇతరేతర భాషలు ఆ తరువాతే వచ్చిన గీర్వాణ భాషామ తల్లి ముద్దు బిడ్డలని వాక్రుచ్చారు. శివ తాదాప్త్య తాండవం లో ఢమరుకం రాల్చిన బీజాక్షరాల తత్సమ తద్భవ రూపాంతర ఉన్మీలనమే తెలుగు భాష అన్నారు. వ్యాసవాల్మీకాది అక్షర యోగుల రుగ్వాక్కులు, రాయప్రోలు గురజాడల సాహిత్య ధునులు, సమకాలీన సాహితీ స్రవంతులు నేటికీ తెలుగు సారస్వత క్షేత్రాలను సస్యశ్యామలం చేస్తున్నాయి అని అన్నారు. తెలుగు భాషా క్షేత్ర వైశాల్యం అమేయం. అక్షర సౌలభ్యం, జాతిలక్షణ సొబగు, ఇతర ప్రాంతీయ భాషలను సునాయాసంగా తనలో ఇముడ్చుకోగల సౌమనస్య పరిధి, శాస్త్రీయ సంగీతాన్నీ, శ్లోకాన్నీ, పద్యాన్నీ హృద్యంగా హత్తుకోగల సుగమమైన భాష తెలుగు భాష. 'తేనె బిందువు చిలికుతే తెలుగు భాష'. అత్యంత రామణీయకతను సంతరించుకున్న సుందరమైన భాష ఐనందు వల్లే తెలుగును 'Italian of the East' అన్నారు. ఇలాంటి అపురూపమైన, అపూర్వమైన తెలుగు భాష నేడు రాజకీయ ఉరికంబ మెక్కిందని లక్ష్మీ పార్వతి గారు వాపోయారు. జాతీయ స్వాతంత్రోద్యమంలో సముచిత పాత్ర పోషించిన అలనాటి తెలుగు కవులను, ప్రాంతీయ తెలుగు కవితా వైభవానికి ప్రతీకలైన కాళోజి వంటి మహనీయులను తలచుకున్నారు.
              ఆధునిక జీవనానికి అవసరమైన ఆధ్యాత్మిక ఆవశ్యకతను ప్రస్తావిస్తూ శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు ఆధ్యాత్మిక తత్వసారాన్ని  ప్రతిష్టాపించిన ఆదిశంకర భగవత్పాదుల  అద్వైతం భారతీయ ఆరాధ్య చైతన్య దర్శనంగా పేర్కొన్నారు. ఆనాడు చికాగో లో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభలో భారత దేశం నిరుపేద దేశంగా చిత్రీకరించ బడినప్పుడు వివేకానందుడు భారతదేశం నాటికీ నేటికీ ఒక ఆత్మసంతృప్తి సంపదతో తులతూగుతున్న ఆధ్యాత్మిక వైభవ వంతమైన అత్యంత సంపన్న దేశంగా అభివర్ణించాడని, 'India ,indeed, is a rich country. if India is lost every thing in the world is lost ' అంటూ వారిని నిర్ద్వందంగా ఖండించారని గుర్తు చేశారు.
            కాని, నేడు మనిషి మస్తిష్కం దుర్మార్గ దురభిమాన అధికార వ్యామోహాలకు వశమైపోయి జన్మాది జీవసంస్కారం ఆనంద భూములను వదలి ఇంద్రియ లంపటత్వం లో కూరుకు పోతున్నదని వాపోయారు. స్వార్థ చింతన కారణంగా ఎలా శోకం ఉద్భవిస్తుందో, శోకం క్రోధంగా, భ్రష్ట సమ్మోహనం గా, స్మృతి భ్రంశంగా మారి బుద్ధి నాశనానికి ఎలా దారి తీస్తుందో భగవద్గీత శ్లోక యుక్తంగా ప్రవచించారు. మూర్తి కాయానికీ,  కీర్తికాయానికీ అతీతమైన ఆత్మచైతన్య సూక్ష్మ కాయం మన అంతరాంతరాలలోనే ఉందని, బుద్ధి, చిత్తం, అహం తో జటిలమైన మనోప్రవృత్తి లింక్ తెగిపోయిన నాడు భౌతిక శరీరం నశించి జీవశక్తి మరణాన్ని దాటి పునర్జన్మ ఆవరణ లో మార్పిడికి లోనౌతుందని వాక్రుచ్చారు. నేను శరీరాన్ని కాదు, నేనొక ఆత్మశక్తిని అని తెలుసుకోవడమే అమృతత్వమని  తెలిపారు. జీవితం దుఃఖ భరిత మవడానికి మూల కారణం భౌతికతను అంటిపెట్టుకొని వేలాడడమేనని, బట్రాండ్ రస్సల్ అందుకే '' All the world is too much with us''అని విన్నవించారని వివరించారు. ఎంతటి వాడైనా ఈలోకాన్ని వదలి వెళ్ళిపోయేది empty hands తోనే అని సూచిస్తూ అలగ్జాండర్ అంతటి విశ్వ విజేత తన అంతిమ ప్రస్థాన యాత్రా శవ పేటికలో నుండి తన రిక్త హస్తాలు బయటికి కనిపించేలా ఉంచాల్సిందిగా అవసాన దశలో అంతిమ సందేశం జారీ చేశాడని తెలిపారు. అనన్యమైన భారతీయ తత్వ చింతనకు ప్రభావితులైన గ్రీకులు యుద్ధానంతరం వెళుతూ వెళుతూ మన పండితులను ఎత్తుకెళ్ళారని వివరించారు.
             ఇంతటి తాత్విక గత వైభవం గల భారతీయ సగటు ఆధునిక జీవి ఇప్పుడు డబ్బుకు అడిక్ట్ అవుతున్నాడు. స్వార్థం పెచ్చుమీరి పోతున్నది. పరమ శ్రేష్ట మైన పారమార్థిక చింతన నుండి దిగజారి పోతున్నాడు. ఇదంతటికి కారణం కోర్కెల విజృంభణమే. మహా భారత యుద్ధానికీ,  సీత కష్టాలకూ మూల కారణం కోర్కెలే కదా అని విన్నవించారు. అందుకే ప్రస్తుత నిత్య జీవితంలో మనిషి ధనాపేక్ష తగ్గించుకోవడం, కోర్కెలను అదుపులో పెట్టుకోవడం, మనసును ఆరోగ్య ప్రదంగా నిర్దేశించుకోవడం ఎంతైనా అవసరం అనీ, ఆధునిక మానవుడు ఆధ్యాత్మిక స్పర్శతో కూడిన ఆలోచన అలవరచుకోవాలనీ హితవు పలికారు.
           కాళిదాసు శాక్తేయుడా అన్న పిల్లల మర్రి గారి ప్రశ్నకు సమాధానంగా కవి కాళిదాసు శాక్తేయుడు కాదు, అతడు సిసలైన శివభక్తుడని బదులు పలికారు.
           శ్రీమతి లక్ష్మీ పార్వతి గారి ప్రసంగం పాండిత్య ప్రకర్షతో, ఆధ్యాత్మిక ఎరుకతో, సంసృతభూయిష్టంగా పసందుగా సాగి సభికుల మన్ననలను అందుకుంది.   
          ఆ తరువాత ఆకెళ్ళ గారి ఉపన్యాసం.''నేటి నాటక రంగ వ్యవస్థ- పోటీ నాటకాలు'' ప్రధానాంశంగా ప్రసంగం సాగింది. గత నెల 'వీక్షణం-12'లో వారు జరిపిన నాటక/సినిమా రంగ విస్తృత చర్చకు కొనసాగింపుగా దీనిని భావించ వచ్చు. మృత్యుంజయుడు గారు ఆకెళ్ళ గారి సాహిత్య జీవితాన్ని ముక్తసరిగా ముచ్చటిస్తూ వారిని సభకు పరిచయం చేశారు.
        ఆకెళ్ళ గారు మాట్లాడుతూ నేటి నాటకరంగ నిరాశాజనకమైన పరిస్థితి గురించి, దిగజారుతున్న రంగ స్థల వ్యవస్థ గురించి ముఖ్యంగా నాటక రంగ పరిషత్తుల గురించి లోతైన ఆలోచనలు వ్యక్తపరిచారు.1943 మొదలుకొని నేటి దాకా నడుస్తున్న పరిషత్తులతో తనకున్న స్వీయానుభావాన్ని సభకు పంచారు.ఆంధ్ర నాటక కళా పరిషత్తు, ప్రజానాట్య మండలి, NTR నాటక పరిషత్తు-ఇలా అనేక పరిషత్తుల వ్యవహార లోగుట్టులను బయల్పరిచారు. ఒకానొక కాలంలో నాటకం వల్ల ప్రజలు ఎక్కడ educate ఐపోతారోనని, ఎక్కడ తిరగ పడుతారోనని కొందరిలో భయం ఉండేదని, ఆ సంకుచితత్వమే తెలుగు నాటకం ఎదగకుండా పోవడానికి మొదటి కారణం అయిందని భావించారు. స్వాతంత్ర కాంక్ష రగిలించే చక్కని నాటకాలు జాతీయ స్వాతంత్రోద్యమం కాలంలో వచ్చాయని, 1947 తర్వాత తెలుగు నాటకం ఒక గొప్ప ఇతివృత్తాన్ని కోల్పోయిందన్నారు. నాటకాల నాణ్యతనూ, ప్రామాణ్యాన్నీ, ప్రాచుర్యాన్నీ కాపాడవలసిన నేటి పరిషత్తులు నిజానికి స్వయం అవరోధకాలవుతున్నవి. కులతత్వం, అహం
భావం, వ్యక్తిగత ఈర్ష్య ఇత్యాది కారణాలవల్ల healthy compitition కొరవడుతున్నది. సామాజిక చైతన్యం పేరిట వెలసిన పరిషత్తులు కళాత్మకత పై కాక బహుమతి కొట్టేసే ఎత్తుగడల పైనే శ్రద్ధ చూపుతున్నారు. వారి గొంతెమ్మ కోర్కెలు కోకొల్లలు. ఆర్థిక లాభం, గెలుపు ధ్యేయంగా రచయితలపై పలు ఆంక్షలు పెడుతున్నారు. దాంతో రచయితది conditioned mind ఐపొతున్నది. అతని ప్రతిభ, కళా విలువలు బయటికి రాలేక పోతున్నవి. పరిషత్తులకు కావలసింది గెలుపు గుర్రాల ఇతివృత్తాలు, commercial ఆర్టిస్ట్స్ కాక చౌకబారు నటులే ఉండాలి, ఒకటి రెండుకు మించి స్త్రీ పాత్రలు ఉండరాదు,heavy డైలాగులు ఉండ కూడదు, హాస్య నాటకాలు, దీర్ఘ నాటకాలు నిషేధం. పద్య నాటకాల నటులు గుంపులుగా విడిపోయి రెహర్సెల్స్ చేస్తుండడం వల్ల  ఏఒక్క పాత్రధారికీ  నాటకంపై సంపూర్ణ అవగాహన లేకపోవడం వల్ల ప్రదర్శనలు రససిద్ధి పొందలేకున్నవి. ఫార్ములా కథలనే ఎన్నుకొని 'మోస నాటకాలు'రాయక తప్పని పరిస్థితి. తానూ ఒక ఆరితేరిన మోసనాటక కర్తనే అని ఆకెళ్ళ గారు ఛలోక్తి విసిరారు.


          నాటక విజయానికి ఇతివృత్త బలంతోపాటు ప్రదర్శనా బలం కూడా ఉండాలి. భారతదేశంలో ఇతివృత్తానికి ప్రాధాన్యతనిస్తే, విదేశాలలో ప్రదర్శనా పటిమకు ప్రాధాన్యం. అమెరికా లోని ఇల్లినాయ్ రాష్ట్రం లోని బ్రాన్సన్ పట్టణం నాటకాలకు పెట్టింది పేరు. ఆ ఒక్క పట్టణం లోనే 64 థియేటర్లు ఉన్నవి పరి పూర్ణ కళాఖండాలను ప్రదర్శించడమే లక్ష్యంగా వాళ్ళు పోటీ పడుతుంటారు. అంతటి ఆరోగ్యకరమైన వాతావరణం మన తెలుగునాట అసంభవం. నేడు తెలుగుదేశంలో నాటకాలను కాపాడుతున్నది గ్రామీణ నాటక సమాజాల శ్రీరామ నవమి లాంటి పండుగలు, వీధి రికార్డింగ్ డాన్స్లులు, స్కూల్ వారోత్సవాలు మాత్రమే అన్నారు ఆకెళ్ళ గారు.
      పొరుగు రాష్ట్ర మైన తమిళనాడులో నాటకరంగం దినదిన ప్రవర్ధమాన మౌతున్నది. పరిషత్తులను అనుసంధిస్తూ వారు ''సభ''లను పోషిస్తున్నారు. నటులలో, రచయితలలో, నిర్వాహకులలో, ఆత్మవిశ్వాసం పెరిగి కళాత్మకత ఆవిష్కరించబడుతున్నది. కనుక నేటి మన తెలుగు నాటక రంగ పురోభివృద్ధికి అలాంటి వ్యవస్థల ''సభా సంస్కృతి మాత్రమే పరిష్కార మార్గమని ఆకెళ్ళ గారు నొక్కి వక్కాణించారు .
              తదనంతరం మరో ఆసక్తికరమైన అంశం చిమట శ్రీనివాసరావు గారి ఆర్థిక సహాయం తో వెలుగు చూచిన విశిష్ట గ్రంధం ''స్వర్ణయుగ సంగీత దర్శకులు'' ఆవిష్కరణ. తొలినాటి సంగీత దర్శకులు పద్మనాభ శాస్త్రి మొదలు ఇళయరాజా గారి దాకా వచ్చిన 60 మందికి పైగా సంగీత దర్శకుల సమగ్ర జీవిత విశేషాలతో, అరుదైన సాధికార సంగీత విషయ సేకరణ తో,1500 కు పైగా అరుదుగా లభించే ఫోటోలతో, ఖరీదైన ఆర్ట్ పేపర్ మీద క్రౌన్ సైజు లో అందంగా ముద్రించబడిన 760 పేజీల అపూర్వ ఉద్గ్రంధం. సిద్ధాంత గ్రంథ స్థాయిలో ముద్రించబడిన ఈ పుస్తకం శ్రీమతి లక్ష్మీ పార్వతి, శ్రీ ఆకెళ్ళ చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి ఈ పుస్తకాన్ని మీ ముందుకు  తెచ్చానని, అభిమానించి దీన్ని చదువు'కొన'గలరని విన్నవించుకున్నారు. శ్రీ కిరణ్ ప్రభ గారు ఈ పరిశోధనాత్మక అరుదైన పుస్తకాన్నికళా సాహిత్య ప్రియులు తప్పక 'కొని'చదువగలరని ఆశాభావాన్ని వ్యక్త పరిచారు.
             పిదప శ్రీ కిరణ్ ప్రభ గారు నెలనెలా నిర్వహించే సాహిత్య క్విజ్ కార్యక్రమం జరిగింది. వారు సంధించిన ప్రశ్నలకు సభ లోని వారు   ఇచ్చిన జవాబులతో సభ హుషారు గా సాగింది.
          తర్వాతి కార్యక్రమం కవిసమ్మేళనం. రావు తల్లాప్రగడ గారు సంయమనకర్త (moderator) .
సమ్మేళన ఆరంభం వారి కవితతోనే జరిగింది. సైబెర్ క్షేత్ర గీత -సైబెర్ యుద్ధం. ఘంటశాల గారి గీతోపదేశ భగవద్గీత శ్లోకాలకు కితకితలు పెట్టే అనుకరణ. పేరడీ అనవచ్చు. చక్కని ఆధునాతన వ్యంగ్య రచన. బ్లాగు వాసులు, సమానాంధులు, దుర్జనుడు వంటి వ్యంగ్యాత్మక పదాలతో అంతర్జాల యుగాన్ని అభివర్ణిస్తూ netను నెట్టుకు పోవడమే మన అంతిమ కర్తవ్యం అంటూ చదివిన ఆహ్లాద భరితమైన వారి కవిత అందరికీ చక్కిలిగింతలు పెట్టింది.
              డా||కె.గీత గారు 'మనం' అనే చక్కని వచనకవిత చదివి వినిపించారు. వీక్షణం ఆవిర్భావ దశ నుండి నేటిదాకా తామంతా తలా ఒక్క కిరణమైన వాళ్ళమని, ప్రతి సమావేశానంతరం తమకు జీవితాన్ని సుసంపన్నం  చేసే ఒక గొప్ప వాక్యం దొరుకుతూ వచ్చిందని తాదాప్యం చెందుతూ రాసిన చక్కని కవిత.
           శ్రీ గోపాల్ నేమన్ గారు ప్రకృతి రామణీయకతనూ, ఆధ్యాత్మికతనూ రస రమ్యం గా రంగరించి 'ఆత్మ వినోదం','కోష్టారికాదేశం' అనే రెండు కవితలు చదివారు. power point presentation ద్వారా కవితలకు దృశ్య వైభవాన్ని ఆపాదించడం కవితాభివ్యక్తికి కొత్త కోణం.
          శ్రీ పుల్లెల శ్యాంసుందర్ గారి పసందైన పారడీ” ఆంధ్రా ఆవకాయ “ సభ లోని రసనాగ్రేసరులను రంజింప జేసింది.
           “విశ్వ శాంతి” శీర్షికగా శ్రీ పిల్లల మర్రి గారు, నాగరాజు రామస్వామి పద్య కవితలు /వచన కవితలు వినిపించారు.
            ప్రసిద్ధ కథా రచయిత్రి రాధిక గారు కోనసీమను గుప్తాగుప్తంగా గుర్తు చేస్తూ 'వరుడు కావాలి'అన్న కవిత వినిపించారు.
            లక్ష్మీ పార్వతి గారు 'నేను కవినే కాదంటాను' అనే కవిత్వం చదివారు.
            బండి ఆనంద్ గారు, మరి కొందరు తమ కవితలు చదివి సభ ను ఆనంద పరిచారు.
కవిసమ్మేళన కార్యక్రమం చాలా ఉత్సాహంగా కొనసాగింది
           ముఖ్య కార్యక్రమ ఆఖరు అంశంగా శ్రీ మృత్యుంజయుడు గారి ఆధ్వర్యంలో వివిధ సాహితీ ప్రక్రియల పై ప్రసంగాలు, సమీక్షలు ఆసక్తి దాయకంగా జరిగాయి. పలువురు వక్తలు సాహిత్యోపన్యాసాలు
శ్రోతలను ఆకట్టుకొన్నాయి.

              శ్రీచరణ్ గారు 'పద్య లక్షణం -ఛందస్సు' గురించి విపులంగా మాట్లాడారు. లక్షణ శాస్త్ర రీత్యా ఛందము కప్పిఉంచే ఒక పొట్లం. ఛందస్సు వేదపురుషుని పాదం. సామవేదానికి ఛందస్సు మరో అభిద. సంస్కృత ఆంత్ర మాలికల ఆంత్ర ఛందస్సు , అనుష్టుప్ ఛందస్సు ఆరోజుల్లో విస్తృతంగా వాడుకలో ఉండేదని, శ్రీమద్భగవద్గీత 8అక్షరాలు 4పాదాలు గల అనుష్టుప్ లోనే ఉందని ',శుక్లాంభర ధరం విష్ణుం' శ్లోకం అనుష్టుప్ ఛందోబద్ధమేనని వివరించారు. వేద సంహిత అంతా 24 అక్షరాల ఛందస్సు. నిజానికి సంసృత ఛందస్సు లో కొంత వెసులుబాటు ఉందని, నన్నయాదుల తెలుగు లౌకిక ఛందస్సు కఠినతర మైనదని వాక్రుచ్చారు. రాను రాను ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర లాంటివి లౌకిక ఛందస్సులో భాగమయ్యాయని వివరించారు. ఛందస్సు శాస్త్ర పరిణతి చెంది అక్షర వృత్తాలుగా, వర్ణ వృత్తాలుగా, మాత్రా వృత్తాలుగా అవతరించాయని తెలిపారు. పుట్టపర్తి గారి 'శివ తాండవం' , శ్రీ శ్రీ నవ్య కవితలు మాత్రా ఛందస్సు కు ఉదాహరణలు. ఇలా వ్యాకరణం, ఛందస్సు నిత్య నూతనంగా పరివర్తన చెందుతూ కొత్త రాగాలను ఆలపిస్తూనే వుందని ముగించారు.
           శ్రీ హరనాథ్ గారు విశ్వనాథ వీరాభిమాని. వారు విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యాలు శ్రావ్యంగా చదివి, స్వీయ పద్యం కుడా వినిపించి ఆనంద పరిచారు.
          శ్రీ చుక్కా శ్రీనివాసరావు గారు కొడవగంటి కుటుంబ రావు నవలలను సమీక్షించారు. సున్నిత హాస్యం వ్యంగ్యం కలసిన వాస్తవ ఇతివృత్తాలు ఎన్నుకున్నారని, మార్క్సిస్ట్ గతితార్కిక భౌతిక వాదం, భారతీయ ఆధ్యాత్మిక నైతికత పునాదుల పై జీవితాన్ని విశ్లేషించే కథలు నవలలు రాసారని వివరించారు. చక్కని విశ్లేషణ.
        అంతిమంగా, రావు తల్లాప్రగడ ధూర్జటి భక్తి రసాత్మక చాటువులను శ్రవణపేయంగా వినిపించి ఆనందంలో ముంచెత్తారు.
       ఇలా, 'వీక్షణం' ప్రథమ సాహిత్య వార్షికోత్సవం ఆద్యంతం అత్యంత రసవత్తరంగా సాగింది.
        విశిష్ట అతిథులను పుష్పగుచ్చాలతో స్వాగతించడం, శాలువలు కప్పి సన్మానించడం, తెలుగింటి మధ్యాహ్న భోజనాలు ఆరగించడం, ఫోటోలు దిగడం లాంటి సహృదయ వాతావరణంలో వార్షికోత్సవం విజయ వంతంగా నిర్వహించబడి అందరి  స్మృతులలో దాచుకోదగ్గ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.
          ఇందుకు వీక్షణం మూలస్తంభాలైన రావు తల్లాప్రగడ, మృత్యుంజయుడు ,కిరణ్ ప్రభ, డా||కె.గీత గార్లు ఎంతైనా అభినందనీయులు.

-నాగరాజు రామస్వామి

http://www.koumudi.net/Monthly/2013/october/oct_2013_vyAsakoumudi_vikshanam.pdf


Saturday 7 September 2013

వీక్షణం -12-సాహిత్య సమావేశం (Aug,10-2013)

  

 
ఏడాది కాలంగా క్రమం తప్పకుండా నెలెనెలా సాగుతూ వస్తున్న సమావేశం-వీక్షణం 12-ఈనెల సాన్హోసే లోని ప్రసాద్ నల్లమోతు గారింటి సాహితీ గవాక్ష మై తెరుచుకుంది. పాతిక పై చిలుకు సాహిత్య ప్రియులు, కళాపిపాసులు ఒక విదేశీ గడ్డ మీద ఒక్క చోట చేరి తమ భాషా రుచులను, సంస్కృతీ మధురిమలను ఆత్మీయ తేనీటి విందు లో కలిసి పంచుకున్న సందర్భం.

సాహిత్య సినీ నాటక రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన శ్రీ ఆకెళ్ళ గారు విశిష్ట అతిథులు.ప్రముఖ వక్తలు శ్రీ విద్వాన్ పెద్దింటి తిరుమల నరసింహా చార్యులు , కథా రచయిత్రి రాధిక గార్లు. సినీ/రంగస్థల నటుడు, స్వయంగా కవి, నాటకీయ ఫక్కీలో శ్రావ్య మైన పద్య పఠనం చేస్తూ ప్రేక్షకులను ఇట్టే మంత్రముగ్ధులను చేయగల ప్రతిభాశాలి శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు సభాధ్యక్షులు. వారి అధ్యక్షతన ఈ సాహిత్య సమాలోచనం రస వత్తరంగా సాగింది.తన స్వీయకృతి జగన్మాత రాజరాజేశ్వరి దేవి ఆవాహన స్తోత్రంతో సభకు శుభారంభం చేశారు. శ్రీ ఆకెళ్ళ గారికీ, వక్తలకూ, సభలో ఉన్న ప్రతిష్ఠాత్మక మైన సాహిత్య పత్రికా సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభ , శ్రీ మృత్యుంజయుడు, శ్రీ తల్లాప్రగడ గార్లకు,వీక్షణం నిర్విరామ నిర్వహణాదక్షులు శ్రీమతి డా. గీతా మాధవి గారికి స్వాగత వచనాలు పలికి, ముఖే ముఖే సరస్వతీ అంటూ రసజ్ఞ శ్రోతలను ఆహ్వానించారు.
మొదట శ్రీ ఆకెళ్ళ గారు ప్రసంగిస్తూ వారి స్వీయానుభావాలనుఆసక్తికరంగాఅందించారు.కాకినాడ నుండి అట్లాంటా దాకా సాగిన వారి సాహిత్య ప్ర స్థాన స్మృతులను పంచారు.సుమారు వంద సినిమాలకు స్క్రిప్ట్ /స్టోరీలు రాయడం, షేక్స్ పియర్ నాటకాలను తెనుగించి రంగస్థలం మీద ప్రదర్శించడం, యాభయవపడిలో 'యమాతా రాజ భానసలగౌ' మొదలుగా తెలుగు ఛందస్సు అభ్యసించి పౌరాణిక నాటకాలు వ్రాసి మెప్పించడం సంగతులు తెలియ పరిచారు.
కథ, నవల, నాటిక, పౌరాణిక పద్య నాటక, సినీ రంగ రచయితగా తన క్రమానుగత పరిణతి వెనుకనున్న నిరంతర కృషి,పట్టుదల గురించి సవివరంగా తెలియచేశారు.
కథలు రాసే తొలి రోజుల్లో ఝటితావేశం తో తాను విశ్వనాథ సత్యనారాయణ గారిని కలుసుకుని తానొక వర్ధమాన కథా రచయితనని పరిచయం చేసుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.వేయిపడగలలో ముఖ్య పాత్ర ఎవరు అని అడిగితే ధర్మారావు అని చెప్పలేక పోయిన తనను , శ్రీపాద, మల్లాది వారి కథలు చదువలేదని చెప్పిన తనను వారు గట్టిగా మొట్టికాయలేసారని తెలిపారు. విశ్వనాథ వారి వేడివేడి 'ముద్దు వడ్డనలు' తిన్న ఆ చేదు అనుభవం తనను దృఢ నిశ్చయం కేసి, సృజన శీలత కేసి మళ్లించిందని ,కనిపించిన కథలన్నీ చదివానని, ఆనాటి ప్రసిద్ధ కథకులందరినీ కలిశానని,'కూర్చుంటే కథ,నిల్చుంటే కథగా 'ఏకబిగిన 200 కథలను వ్రాసి కథ అంతు చూశానని ఆకెళ్ళ గారు తెలిపారు.
కథకు ప్రాణం ఇతివృత్తమనీ, శైలీ శిల్ప కథాకథన రీతులు తర్వాతేననిఉద్ఘాటించారు. కథలో కొత్త దనం ఉండాలనీ, ఇంతకు పూర్వం ఎవరూ రాయని సరికొత్త ఇతివృత్తం ఇట్టే ఆకర్షిస్తుందని చెబుతూ,చిన్ననాడు బాలమిత్ర కు రాసిన 'జువ్వల యుద్ధం' లోని వస్తు నవ్యతను ఉటంకించారు.యుద్ధ సామగ్రిని చేసిన వాడే యుద్ధాన్ని సృష్టించాలి అన్న వింత ప్రతిపాదన లోని నవ్యత కథకు ప్రచురనార్హత కల్పించిందన్నారు.నేటి అగ్రరాజ్యాలు అనుసరిస్తున్న విదేశీరాజ్యాంగ విధానం అదేనని చురకలేసే ముక్తాయింపు పలికారు.ఆనాడు ఆంధ్రప్రభ లో బహుమతి పొందిన తన నవల 'ఇల్లాలి స్వయంవరం' లో పేరు లోనే ఉన్న కొత్తదనం ఆకర్షణీయమయిందని చెప్పారు.
రఘురామయ్య గారి నాటకాలన్నీ చూశానని, తన మొదటి పద్య నాటకం 'శ్రీనాథుడు' రాగ ప్రాధాన్యత నుండి దృశ్య ప్రాధాన్యత వేపుకు వేసిన ముందడుగుగా అభిప్రాయ పడ్డారు.తన జీవితం లో తారసిల్లిన మహానుభావుల్లో విశ్వనాథ్ గారు ముఖ్యులని ,సినిమాలో ఏమేరకు డైలాగులు ఉండాలో విజువల్స్ ఏమేరకు ఉండాలో ఖచ్చిత మైన జ్ఞానం సినీ రచయితలకు అనివార్యమని ఆయన చెప్పేవారని విశ్వనాథ్ గారి పతిభను కొనియాడారు.
సామాజిక స్పృహ లేని ఏరచన అయినా నిరర్థకమనీ, వర్తమాన రచయితలకు ఈవిషయం శిరోధార్యం కావాలని సెలవిచ్చారు.అలనాడు తానూ AIR కు రాసిన 'అమ్మ' నాటిక గురించి ప్రస్తావిస్తూ ,ఆ నాటిక విన్న తర్వాతే తన కొడుకు తనను ఆదరించి ఇంటికి తెచ్చుకున్నాడని ఆర్ద్ర నయనాలతో ఒక అమ్మ తనను అభినందించడం మరువలేని సాహిత్య ప్రయోజనానుభవం అని చెప్పారు.
కాని సినిమారంగం కేవలం సాహిత్య ప్రయోజనానికి పరిమితం కాలేదని, అది ప్రాథమికంగా వర్తకం కనుక తప్పు పట్టలేమని అభిప్రాయపడ్డారు.
ఇలా ఆకెళ్ళ గారి ప్రసంగం విశ్వనాథ సత్యనారాయణ ,రఘురామయ్య గార్ల నుండి కె.విశ్వనాథ్ గారి దాకా ఆసక్తికరంగా సాగింది.
ఆకెళ్ళ గారి తరువాత శ్రీ పెద్దింటి తిరుమల నరసింహాచార్యులు గారు 'కాళిదాసు కవితా వైభవము 'గురించి ప్రసంగించారు.
సభను ఆహ్వానిస్తూ సభ కల్పవృక్షం వంటిదని, సభాసతులు వృక్ష శాఖల్లాంటి వారని, శ్రోతలు పరిమళాలను ఆఘ్రాణించే రసజ్ఞులని సంస్కృత శ్లోకం తో ఉత్సాహ పరిచారు.
కాళిదాసు అగ్రశ్రేణి సంస్కృత కవీశ్వరుడని, మనము లెక్కించే సమయంలో చిటికన వేలు (కని ష్ఠకమ్) తో ఎలా మొదలు పెడతామో అలాగే సంస్కృత కవులలో మొదట లెక్కింప దగిన వాడని శ్లోకయుక్తంగా విశదీకరించారు. భరతుడు పదిరకాల నాటకాలను ప్రతిపాదించాడని ప్రస్తావిస్తూ, “కావ్యేషు నాటకం రమ్యం” అన్న వాస్తవం కాళిదాసుని నాటకాలన్నింటికి వర్తిస్తుందని, అభిజ్ఞానశాకుంతలం అందుకు సాటిలేని తార్కాణమని సెలవిచ్చారు.పరమ రమ్య మయిన శాకుంతలంలో నాలుగవ అంకం చదివినా, కనీసం నాలుగవ అంకంలోని నాలుగు శ్లోకాలు చదివినా ఆ రమ్యత ఏమిటో అర్థమవుతుందని తెలిపారు.క్రాంతదర్శి ఐన కవి కాళిదాసు మూలం లో లేని 'అభిజ్ఞతను'సృష్టించి శాకుంతలానికి ఎనలేని కావ్యగౌరవాన్ని,కావ్యౌచిత్యాన్ని సంతరింపచేశారని చెప్పారు. శ్రవ్యనాటకాలలో దృశ్యతను జొప్పించడం వల్ల స్థాయీభావ రసం ఉప్పొంగి శ్రోతలను ద్రవీభూతులను చేసిన వైనాన్ని ఉటంకించారు.పంచమహా కావ్యాల ప్రసక్తి తెస్తూ,కాళిదాసు కావ్యాలలోని వాగర్థ శోభను, అలంకార వైభవాన్నిచాటే పలు శ్లోకాలను చదివి వినిపించారు.ఉపమాకాళిదాసస్య అంటూ రఘువంశాది కావ్యాలలోని అనేక ఉపమాలంకార విశేషాలను సుశ్లోకంగా సోదాహరణంగా వ్యక్తపరిచారు.మేఘసందేశానికి ముందు సందేశాత్మక కావ్యాలు లేవని, ఆ వారసత్వంలో నుండి వచ్చిందే జాషువ గారి గబ్బిలం అని గుర్తు చేశారు. ప్రసంగంలో ఎక్కువగా రఘువంశ చర్చ జరిగింది.కథానుగతంగా జరిగిన ఈ రఘువంశ రసచర్చలో కాళిదాసు అనన్య కవితా వైభవం కళ్ళకు కట్టింది. ‘మాళవికాగ్నిమిత్రం’ కాళిదాసు చిన్ననాటి అపరిణత కావ్యమనే వాదం అప్రస్తుతమని, అందుకు తానూ ఏకీభవించ లేనన్నారు.కాళిదాసు కాశ్మీర దేశస్తుడా, కాదా అన్న చర్చ కన్నా వారి కావ్యాలలో విస్తరించిన రమణీయ ప్రకృతి వర్ణనలు, కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా వర్ణించబడిన స్థల విశేషాలను గమనించడం శ్రేయస్కరమని వక్కాణించారు.ఇలా రసరమ్యంగా సాగిన వారి ప్రసంగం శ్రోతలను విశేషంగా ఆకట్టుకొంది.చక్కని బోధనా సంవిధాన గరిమతో సులభ గ్రాహ్యంగా వారు విడమరచి చెప్పిన తీరు తాము విన్నది ఒక సంస్కృత కవి విషయం కాక ఒక తెలుగు కవి కవిత్వమేమో అన్నంత సహజంగా ఉండి సభను ఆనంద పరిచింది.
తరువాత రాధిక గారు 'స్వీయ కథా స్పూర్తి' పై తన స్మృతులతో చక్కగా ప్రసంగించారు.సంగీతం, సాహిత్యం, పెయింటింగ్ కళలో అభినివేశం కల రాధిక గారి చదువు ఏలూరు లో సాగింది.1977 లో సమస్యాపూరణాల కార్యక్రమాలలో పాల్గొనడం తో వారి సాహిత్య ప్రయాణం ప్రారంభమైంది.ఆంధ్రప్రభ లోతన మొదటి కథ 'పూర్ణమ్మ' ,ఆతరువాత పేరుతెచ్చిన కథ 'నలుగురు నవ్విన వేళ', లక్కీ డ్రాప్స్ వంటి కథలు సుమారు 500, నాలుగు నవలలు,4 మినీ నవలలు రాసానని తెలిపారు.ఈ మధ్య వెలుగు చూచిన తన కథా సంకలనం 'కథా స్రవంతి' పుస్తకాలను వీక్షణం కు సమర్పించారు.తన గురించి తాను చెప్పుకునే బదులు పలువురు విశ్లేషకుల అభిప్రాయాలు తెలుసుకుంటే ఉచితంగా ఉంటుందని సవినయంగా విన్నవించారు.కొందరు మిమ్ములను ఓహెన్రీ తో ఎందుకు పోల్చారని శ్రోతలు వేసిన ప్రశ్నకు జవాబుగా తన కథలోని ఆకస్మిక మలుపులు కావచ్చునని తెలిపారు.తనకు కొసమెరుపు కథలంటే ఇష్టమని, చాలావరకు తన కథల్లో ఆఖరి వాక్యం తో అర్ధాంతరంగా కొత్త చమక్కులు ప్రతిఫలిస్తాయని చెప్పుకొచ్చారు.ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురాస్కారం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఉపన్యాసం ముగించారు.
ఆ తరువాత,అధ్యక్షుల వారి మరో దేవీ స్తోత్రం తో కార్యక్రమ ముఖ్యభాగం ముగిసింది.
కిరణ్ ప్రభ గారు నిర్వహించిన క్విజ్, కవిసమ్మేళనం, గ్రూప్ ఫోటో కార్యక్రమం యధావిధిగా ఆసక్తికరంగా జరిగింది.
ముఖ్య అతిథి శ్రీ ఆకెళ్ళ సినిమా జగతికి సంబంధించిన వారు అయినందున క్విజ్ కార్యక్రమం లో కిరణ్ ప్రభ గారు కళా రంగానికి చెందిన ప్రశ్నలను మాత్రమే సంధించి సభలో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
కవి సమ్మేళనం లో మొదట శ్రీమతి విజయ లక్ష్మి వరలక్ష్మిదేవిని స్తుతిస్తూ చక్కని కవిత చదివారు.నృసింహస్వామి ని స్తుతిస్తూ దైవీయ భావోద్వేగం తో పద్యమై ఊగిపోయారు శ్రీ శ్రీచరణ్.శ్రీ హరినాథ్ విశ్వనాథ సత్యనారాయణ గారిని కీర్తిస్తూ చక్కని పద్యాలు వినిపించారు.మధ్య మధ్య రాగయుక్తమైన స్వీయ పద్యకవితలను అందుకుంటూ అధ్యక్షుల వారు కవి సమ్మేళనాన్ని రక్తి కట్టించారు. శ్రీమతి గీతా మాధవి “వేయి వ్రణాల ఆయుధం “ వచన కవిత వినిపించారు. ఎలాంటి భాషా భేషజం లేని సరళమైన వాక్యాలతో సామాజిక స్పృహఉన్న సహజ సుందరమైన ఆర్ద్ర కవిత్వం!భిన్న రసగుణాల పదద్వయం తో ఒక్కటైన సరికొత్త పదబంధం -వేయి వ్రణాల ఆయుధం- రెండు భిన్న ధ్రువాలు అనుసంధించిన అయస్కాంతం లా ఆకర్షించే శీర్షిక! వస్తు ప్రాధాన్యత,ఆకట్టుకునే అభివ్యక్తి కలసి ప్రవహించిన కవిత్వాన్ని అందించారు గీత గారు. తర్వాత నాగరాజు రామస్వామి 'తరుణోపాయాలు' వచన కవిత వినిపించారు.రాశిలో లేశమైనా వాసిలో నాసి కాని ఈ కవిసమ్మేళనం సజావుగా సాగింది.
మృత్యుంజయుడు గారు వచ్చే వార్షిక సమావేశాన్ని గురించి వివరించారు. సమావేశానికి ఆతిధ్యమిచ్చిన ప్రసాద్ నల్లమోతు గారి వందన సమర్పణతో ఆత్మీయ సమావేశం ముగిసింది.
- రచన : నాగరాజు రామస్వామి 

Friday 9 August 2013

వీక్షణం 11వ సాహితీ సమావేశం (July14, 2013)


 
వీక్షణం 11వ సాహితీ సమావేశం సన్నీవేల్ లోని డా.కె. గీత గారి ఇంట్లో జరిగింది. రచయితలు, కవులు, సాహితీప్రియులు పాల్గొన్న ఈ సమావేశానికి తాటిపాముల మృత్యుంజయుడు అధ్యక్షత వహించారు. ప్రధానవక్తలుగా విద్యావేత్త డా.ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి, ప్రముఖకథకుడు బి.పి.కరుణాకర్ మరియు పేరొందిన అనువాదకుడు డా.కూచి నరసింహారావు ప్రసంగించారు.


మొదటగా అప్పల నరసింహమూర్తిగారు 'గురజాడ కన్యాశుల్కం - మనకు ఇంకా అవసరమా?' అనే అంశంపై మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో విశేషంగా పరిశోధనలు జరిపిన ఉపాధ్యాయులగారు మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన దేశంలోని కొన్ని ప్రస్తుత సమస్యలను తీసుకొని, వాటిని కన్యాశుల్కంలోని కొన్ని ప్రధానాంశాలకు జోడిస్తూ సామీప్యత చూపారు. అలాగే, కన్యాశుల్కంలో రామప్పంతులు, లుబ్ధావధానులు, మధురవాణి, బుచ్చమ్మ మొదలగు పాత్రల ఔచిత్యాన్ని తీసుకొని, ఆ పాత్రల మనస్తత్వాన్ని నేటితరం ఆలోచనాధోరణికి ఆలంబన చేసారు. 1897 సంవత్సరంలో రచింపబడ్డ కన్యాశుల్కం ఇప్పటికీ మన సమాజానికి ఎంతగానో అవసరముందని తెలియజేసారు.

తరువాత బి.పి.కరుణాకర్ గారు మాట్లాడుతూ జీవితంలో జరిగిన ఏ చిన్న సంఘటనను, అనుభవాన్ని ఐననూ ఒక మంచి కథగా మలచవచ్చునని చెప్పుకొస్తూ తెలుగు మరియు ఇతర భాషల్లోని కథలను ఉదహరించారు. అవి గొప్పకథలు ఎందుకు అయ్యాయో వివరించారు. సభికుల కోరికపై స్వీయరచనల్లో రెండు కథలను, వాటి కథనాన్ని, ముగింపులను విశదీకరించారు.

చివరగా, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పట్టున్న కూచి నరసింహమూర్తిగారు ప్రసంగిస్తూ పరభాషలోనుండి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు భాష, ఆచారవ్యవహారాలు, మానవసంబంధాలు మొదలైన అంశాల పరంగా తీసుకోవలసిన మెళకువలను కొన్ని ఉదహారణలతో వివరించారు. అనువాదం (అను + వాదం = తరువాత చెప్పేది) ప్రధానోద్దేశ్యం పాఠకానాందం అని చెప్పుకొస్తూ ఉత్తమ సాహిత్యం ఎక్కువ పాఠకుల చేరువలోకి వెళ్లాలంటే అనువాదాలు పెక్కుగా జరగాలని చెప్పారు.

 

పెద్దింటి నరసిం హాచార్యులు, హరనాథ్, డా.కె. గీత, క్రాంతి శ్రీనివాసరావు గార్లు కవితాపఠనం చేసారు. గీతగారు వచ్చిన అతిధులకు రుచికరమైన ఫలహారాలు అందించారు. వీక్షణం 12వ సమావేశం నల్లమోతు ప్రసాద్ గారింట్లో ఆగష్టు 11న జరుగుతుంది. అలాగే, 13వ సమావేశాన్ని మొదటి వార్షిక సమావేశంగా ఘనంగా జరపాలని నిశ్చయించడం జరిగింది.
-మృత్యుంజయుడు తాటిపామల
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/aug13/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2013/august/august_2013_vyAsakoumudi_vikshanam.pdf

Thursday 11 July 2013

వీక్షణం సమావేశం - 10 (June,9-2013)

బే ఏరియా సాహితీ మిత్రుల నెలవారీ సమావేశం జూన్ నెల 9 వ తేదీన క్యుపర్టినో శారద. కె. గారి ఆతిథ్యంలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డా. వేమూరి వెంకటేశ్వర రావు గారు ముందుమాటలో క్రమం తప్పకుండా గత పది నెలలుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి బే-ఏరియా సందర్శిస్తున్న ప్రముఖలంతా హాజరవడం ఎంతో ఆనందదాయకం అన్నారు. డా. వేమూరి ఆనాటి ముఖ్య అతిథులు అల్లం రాజయ్య, చుక్కా రామయ్య (ఐ.ఐ.టి రామయ్య) గార్లను పరిచయం చేశారు.


అల్లం రాజయ్య గారు తన ప్రసంగంలో విదేశాల్లో ఉండి కూడా, స్వదేశీ సాహిత్యం గురించి ఆలోచిస్తున్న ప్రవాసాంధ్రులని అభినందించారు. తను ఇంతకుముందు మాట్లాడిన సమావేశాల కంటే ఈ సమావేశాలు భిన్నమైనవి అన్నారు. తాను, తన సోదరులు కూడా సాహిత్యాన్ని ఉద్యమాలకి అనుకూలంగా ఎలా మలచుకున్నారో వివరిస్తూ, మనుషుల్ని మనుషులుగా బ్రతకనివ్వని సమాజం వలనే తాము సాహిత్య ఉద్యమకారులమైనామని చెప్పారు. సమాజంలోని వైరుధ్యాలు పాఠాలు నేర్పుతాయనీ, వాటిని అందరితో పంచుకునే ప్రయత్నమే సాహితీ సృజన అని రాజయ్య గారు చెప్పారు. ప్రపంచ సాహిత్యంతో తనకు గల పరిచయాన్ని కూడా వివరించారు. అల్లం రాజయ్య గారి ప్రసంగం శ్రోతలని ఆలోచింపచేసేలా సాగింది. అక్కిరాజు సుందర రామకృష్ణ గారి కోరిక మేరకు వట్టికోట ఆళ్వారు స్వామి గురించి, ఆయన వ్రాసిన‘ ప్రజల మనిషి ’, ‘గంగు’ ల గురించి కూడా రాజయ్య గారు ప్రసంగించారు.
ఆ తరువాత చుక్కా రామయ్య గారు ‘ఆధునిక విద్యావిధానంలో తెలుగు భాషా విలువలు పడిపోతున్నాయా?’ అనే అంశం గురించి మాట్లాడారు. నైజాం ప్రభుత్వం కాలం నుంచి వస్తున్న విద్యా విధానాలని క్లుప్తంగా సమీక్షిస్తూ బోధనా మాధ్యమం యొక్క ప్రభావాన్ని చాలా విశదంగా తెలియజేశారు. ఆలోచన అనేది మాతృభాషలో స్పష్టంగా ఉంటుందనీ శాస్త్రీయంగా నిరూపించబడిందని, అందువల్ల మాతృభాషలో విద్య నేర్పడం వల్ల విద్యార్ధులలో సృజనాత్మకత పెంపొందుతుందనీ రామయ్య గారు చెప్పారు. ఆ తరువాత ఉద్యమ సాహిత్యం గురించి కూడా మాట్లాడుతూ రామయ్య గారు కాళోజీ ‘అణా గ్రంధమాల’ గురించి, గోర్కి అనువాదాల గురించి ప్రసంగించారు. సాహిత్యం పఠితల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో వివరించారు. తన ఐ.ఐ.టి. శిక్షణా తరగతుల నిర్వహణలో ఎదురౌతున్న అనుభవాలని కూడా శ్రోతలతో పంచుకున్నారు.


తదుపరి జరిగిన కవి సమ్మేళనంలో జి. వెంకట హరనాథ్ గారు, దాసు శ్రీరాములుగారు వ్రాసిన అరుదైన పుస్తకంలోని కొన్ని పద్యాలు చదివి వినిపించారు. ఇంకా నాగరాజు రామస్వామి, క్రాంతి శ్రీనివాస రావు, టి.పి.ఎన్. ఆచార్యులు, విజయలక్ష్మి, డా.గీత, బండి ఆనంద్ తదితరులు కూడా తమ స్వీయ కవితలని వినిపించారు. కిరణ్ ప్రభ నిర్వహించిన సాహితీ క్విజ్ కార్యక్రమంతో ఆ నాటి వీక్షణం సమావేశం ముగిసింది.
- కిరణ్ ప్రభ
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july13/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2013/july/july_2013_vyAsakoumudi_vikshanam.pdf


Tuesday 2 July 2013

వీక్షణం సమావేశం - 9 (May19, 2013)

    

వీక్షణం తొమ్మిదవ సమావేశం శానోజే లో రావు తల్లాప్రగడ గారింట్లో ఆత్మీయంగా, ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ఈ సమావేశానికి రావు తల్లాప్రగడ అధ్యక్షత వహించగా శ్రీ అల్లం రాజయ్య, శ్రీ గొల్లపూడి మారుతీ రావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
 

 
అల్లం రాజయ్య మాట్లాడుతూ సమాజం- ఉత్పత్తి, సమాజం- విద్య, చరిత్ర-నాగరికత-ప్రభావం మొ.న విషయాలను తన కథలు పరిచయం చేస్తాయన్నారు. కథా రచనకు పురిగొల్పిన తక్షణ కారణాలను వివరిస్తూ రైతాంగం పై తన కళ్ల ముందు జరిగిన దురాగతాల్ని, భూస్వామ్య పీడనని, బొగ్గు గని కార్మికుల పట్ల జరిగిన అన్యాయాల్ని పేర్కొన్నారు. అగ్ర- అల్ప వర్ణాల మధ్య తారతమ్యాల్ని పేర్కొంటూ "ప్రత్యర్థులు" కథను ఉదహరించారు. అంతే కాకుండా సమాజం లో మనిషి తను ఎన్నుకోవలసిన వృత్తిని స్వంత ఆసక్తిని బట్టి గాక, సమాజం నిర్దేశించిన ప్రకారం చెయ్యాల్సినప్పటి బాధను తెలిపే కథ "మహదేవుడి కల" ను పరిచయం చేసారు. ఆదివాసీ పద్ధతుల్ని, వారి సంస్కృతిని అధ్యయనం చేసి రాసిన రచనల్ని పేర్కొంటూ సాయుధ పోరాట వీరుడు "కొమురం భీం" గురించి రాసిన నవలను పేర్కొన్నారు.

సభలో ఉన్న వారి ప్రశ్నలకు జవాబిస్తూ తన చుట్టూ జరిగే సంఘటనల సమాహారమే తన రచనలనీ, రచయిత స్థల కాలాల్ని బట్టి మారే పరిస్థితుల్ని రచనల్లో ప్రతిబింబింపజేయాలనీ అన్నారు. మనసుల అట్టడుగుల్లో కాస్త తడి ఉన్న వారెవరైనా సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్షర బద్ధం చేసి తీరుతారని ముగించారు.

తరువాత జరిగిన కవి సమ్మేళనంలో కె.గీత అమెరికా లోని 'హోం లెస్ ' ని గురించి రాసిన "మంచు గబ్బిలం"కవితనీ, రావుతల్లాప్రగడ "సీతమ్మ" గజల్ నీ వినిపించారు. మధు ప్రఖ్యా, శ్రీ చరణ్ పాలడుగు, అక్కిరాజు సుందర రామకృష్ణ ల వైవిధ్య కవిత్వం తో కవిసమ్మేళనం అందరినీ అలరించింది.

తేనీటి విరామం తర్వాత గొల్లపూడి తమదైన శైలి లో హాస్య భరితంగా, సభలోని వారందరినీ ఆలోచింపజేసే విధంగా కథ, నాటక రంగాల గురించి మాట్లాడారు. బండారు అచ్చమాంబ దగ్గర్నించీ కథా పరిణామాన్ని వివరిస్తూ తటస్థ సమాజంలో మార్పును ఎప్పటికప్పుడు అక్షర బద్ధంచేస్తూ, అవసరాన్ని బట్టి అనేక మలుపులు తిరిగింది ఆధునిక కథ అన్నారు. తన కథ "ఈస్పర్" ను సభ లోని వారికి పరిచయం చేసారు. ఒక వ్యక్తి సమాజపు మర్యాదకు, విద్యల వెనుక దాగి ఉన్న కృత్రిమత్వానికి లోనై చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి స్వచ్ఛమైన ప్రవర్తనను ఎలా మరిచిపోతాడో వివరించారు. కథలు రాయడంలో మెళకువలు గురించి ప్రస్తావిస్తూ కథలో తారాజువ్వ లా ఒక స్పార్క్ ఉండాలని చెబుతూ, చెకోవ్, కాఫ్కా కథలను ఉదహరించారు.

నాటక రంగంలో 'పాండవోద్యోగ విజయాలు ' దగ్గర్నించీ ప్రారంభించి కన్వెన్షన్ థియేటర్ ఆవశ్యకతను గురించి వివరించారు. ఆంధ్ర కళా పరిషత్తు బహుమతి నందుకున్న "కళ్లు" ను ప్రస్తావించారు. మిత్రులతో కలిసి నడిపిన "కళావని " నాటక సంస్థను గురించి, "ఆంధ్ర నాటక చరిత్రము" పుస్తకం అచ్చు వేయించిన సందర్భం గురించీ గుర్తు చేసుకున్నారు.

సినిమాల కథలకు, బయట కథలకు తేడా ను వివరిస్తూ సినిమాలో కథను జనరలైజ్ చెయ్యాల్సి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా 'చక్రభ్రమణం ' నవలను 'డాక్టరు చక్రవర్తి ' గా తెరకెక్కించిన అనుభవాలను గుర్తు చేసుకుని సభలోని వారిని కడుపుబ్బ నవ్వించారు.

విమర్శ గురించి ప్రస్తావిస్తూ విమర్శ క్రియేటివిటీ ని పెంచేదిగా ఉండాలనీ, అంతే కాకుండా విమర్శకుడు తను విమర్శిస్తున్న రచనను ప్రేమిస్తున్నానని మొదట రచయితకి తెలిసే విధంగా విమర్శ ఉండాలని అన్నారు. ఆ సందర్భంగా తన నవల పట్ల విశ్వనాథ వారి విమర్శానుభవాన్ని, స్వయంగా తను చేసిన విమర్శ పర్యవసానాల్ని గుర్తుచేసుకున్నారు.

దాదాపు 70 మంది వరకు హాజరైన ఈ సభలో వేమూరి, కిరణ్ ప్రభ, వంశీ ప్రఖ్యా, నాగరాజు రామస్వామి, తాటిపామల మృత్యుంజయుడు మొ.న వారు పాల్గొన్నారు.

వీక్షణం సమావేశం -8 (Apr 14, 2013)

    

వీక్షణం ఎనిమిదవ సమావేశం శాన్ హోసే లో శ్రీ చరణ్ పాలడుగు గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ఈ సారి అతిథి సమయంలో ఉషశ్రీ గారి ప్రథమ పుత్రిక గాయత్రీ దేవి, అక్కిరాజు సుందర రామకృష్ణ, వింజమూరి అనసూయా దేవి పాల్గొన్నారు. రఘు మల్లాది అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ముందుగా శ్రీ చరణ్ ఆహ్వానంతో ప్రారంభమైంది. 
గాయత్రీ దేవి తమ తండ్రి గారైన ఉషశ్రీ జీవన కాలంలో చేసిన కృషిని గురించి చెబుతూ ఆలమూరు ట్రయో లో ఒకరిగా నిర్వహించిన "తరుణ సాహితి" కార్యక్రమాల గురించి, విశ్వనాథ సత్యన్నారాయణ గారి రచనలకే పరిమితంగా నడిపిన "విశ్వశ్రీ "పత్రిక గురించి సభికులకు తెలియజేసారు. వారి అసలు పేరు సూర్య ప్రకాశ దీక్షితులనీ, "పెళ్లి కొడుకులు", "పైడి కటకటాలు" మొదలైన ప్రఖ్యాతి చెందిన నాటకాలు రచించారనీ చెప్పారు. రేడియో లో ఆయన గొంతు వినని వారు ఆంధ్ర దేశం లో ఎవరూ ఉండి ఉండరని,  "ధర్మ సందేహాలు"రామాయణభారత కార్యక్రమాలతో ఆయన గొంతు చిరస్థాయిగా తెలుగు వారి హృదయాలలో నిలిచి పోయి ఉన్నదన్నారు. వారి కుమార్తెగా జన్మించడం తన అదృష్టమని పేర్కొంటూ ఇంట్లో నాన్నగా గొప్ప పాత్ర నిర్వహించేవారన్నారు.
 
తరువాత అక్కిరాజు సుందర రామకృష్ణ "పద్యం -నాటకం" అనే అంశం గురించి ప్రసంగించారు. నాటక రంగం లో స్వీయ అనుభవాన్ని తెలుపుతూ వినిపించిన పద్యాలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి.
ఒకప్పుడు పద్యమే నాటకంగా ఉండేదని, బళ్లారి రాఘవ, రాజమన్నార్ మొ. న వారి కృషి వల్ల గద్య నాటకాలు వచ్చినా పద్యం పౌరాణిక నాటకాలకు ఆయువుపట్టుగా నిలిచిందని అన్నారు. ఒకప్పుడు తిరుపతి వేంకట కవుల "చెలియో చెల్లకో", "జెండాపై కపిరాజు" పద్యాలు నోటికి రాని ఆంధ్రులు ఉండేవారు కారని అన్నారు. పాండవోద్యోగ విజయం, సత్య హరిశ్చంద్ర, కృష్ణ తులాభారం, చింతా మణి నాటకాలు నాలుగూ నాలుగు స్తంభాల వంటివనిఅప్పట్లో ఈ నాలుగు నాటకాలలో పద్యాలు రాని వారిని నటులుగా పరిగణించేవారుకారని పేర్కొన్నారు. మధ్య మధ్య హాస్య చమక్కులతో గొంతెత్తి శ్రావ్యంగా ఆయన ఆలపించిన పద్యాల్ని సభాసదులు మంత్రముగ్ధులై విన్నారు. చివరిగా కృష్ణ తులా భారంలోని "కస్తూరికా తిలకంబును పోనాడి" పాడి వినిపించారు. ఇప్పటి వరకు ఎన్నో సమావేశాలలో తను  పాలు పంచుకున్నా వీక్షణం వంటి ఆత్మీయ సమావేశం లో ఇప్పటి వరకు పాల్గొనలేదని సంతోషం వ్యక్తం చేసారు.
మధ్య తేనీటి విరామం తర్వాత వింజమూరి అనసూయా దేవి "బాలబంధు బి.వి నరసింహారావు" గురించి తాను రచిస్తున్న కొత్త పుస్తకం గురించి,ఆయన తో తమ కుటుంబానికున్న ఆత్మీయ అనుబంధం గురించి  ప్రసంగం చేసారు. ఈ సందర్భంగా సాహిత్య రంగానికి తను చేసిన కృషిని వివరిస్తూ తాను స్వయంగా ఆరు తరాలను చూసానన్నారు. జానపద గీతాలకు కర్ణాటక నొటేషన్ ఇస్తూ  10 పుస్తకాలు రచించానని  చెప్పారు. ఇక నరసింహరావు గారి గురించి మాట్లాడుతూ  చిన్నతనం లోనే ఆయనకు బాల సాహిత్యానికి పునాది వేసిందనీ చెప్పారు.  తమ ఇంట్లో చాలా చలాకీగా అందరినీ పలకరిస్తూ, నవ్విస్తూ కథలు చెప్తూ తిరిగే వాడని గుర్తు చేసుకున్నారు.
93 ఏళ్ల ప్రాయంలో పుస్తకం రచిస్తున్న అనసూయ గారి మొక్కవోని పట్టుదల సభలోని వారందరికీ  స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
తర్వాత స్థానిక వేద పండితులు వేంకట నాగ శాస్త్రి ఆశీర్వచన ప్రసంగం చేసారు. 
ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో క్రాంతి శ్రీనివాసరావు "లోపలి వ్యవసాయం"రావు తల్లాప్రగడ "అమ్మ" గురించిన గజల్ ను, డా||కె.గీత "కొండవాలు వానతీగ", రాఘవేంద్రరావు నూతక్కి "రెక్కలు" మినీకవితలు, కొన్ని హైకూలు, నాగరాజు రామస్వామి స్వీయకవితలు, అనువాద కవితను వినిపించారు. 
చివరిగా పిల్లలమర్రి కృష్ణ కుమార్, చుక్కా శ్రీనివాస్ లు మాట్లాడారు. ఎంతో కుతూహలంగా, ఆత్మీయంగా  సాగిన వీక్షణం సమావేశానికి వేమూరి, కిరణ్ ప్రభ, శివ, కోటరెడ్డి, శారద, యోగేంద్ర, దర్భా సుబ్రహ్మణ్యం మొదలైన వారు కూడా హాజరై ఆనందించారు.
వచ్చే సమావేశం క్యూపర్టినో లో శారద గారింట్లో జరుగుతుందని ప్రకటించారు.

Friday 26 April 2013

వీక్షణం సాహితీ సమావేశం - 7 (Mar10, 2013)














బే ఏరియా నిరంతర సాహితీ స్రవంతి "వీక్షణం" సప్తమ సమావేశం రఘు మల్లాది గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి రావు తల్లాప్రగడ అధ్యక్షత వహించారు. ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ సమావేశం లో రెండు పుస్తకావిష్కరణలు జరిగాయి. మొదటిది వేమూరి వేంకటేశ్వర్రావు రచించిన కథా సంపుటి "మహా యానం", రెండోది క్రాంతి శ్రీనివాసరావు కవితా సంపుటి " సమాంతర ఛాయలు" .


ఇటీవల మరణించిన "తెలుగు భాషా పత్రిక" సంపాదకులు, కథా రచయిత "పెమ్మరాజు వేణుగోపాల రావు" గురించిన వేమూరి వేంకటేశ్వర్రావు గారి సంస్మరణ ఉపన్యాసం తో సభ ప్రారంభమైంది. వేణుగోపాలరావు గారి తో తనకున్న అనుబంధాన్ని వేమూరి వివరించారు. ఆయన ప్రవాసాంధ్రులకి భీష్మాచార్యుల వంటి వారని కొనియాడారు. వేణుగోపాలరావు గారు ఎమరీ విశ్వ విద్యాలయంలో భౌతిక శాస్త్రం బోధించే వారనీ, సైన్సుని తెలుగులో రాయటం అనే ప్రక్రియని ప్రోత్సహించడానికి "తెలుగు భాషా పత్రిక" ను స్థాపించిన ఆయన తనను వ్యాసం అడగడం తో తమ పరిచయం ప్రారంభమైందనీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వివరించిన అప్పటి మిమియో గ్రాఫు పద్ధతి సభికులకు ఆసక్తి కలిగించింది. వేణుగోపాలరావు గారి బహుముఖ ప్రజ్ఞను వివరిస్తూ అట్లాంటా లోని వారింటి పెరట్లో కొలువు దీర్చిన, వారే స్వయంగా తయారు చేసిన అనేక శిల్పాల్ని, ఇంటి గోడలకున్న తైల వర్ణ చిత్రాల్ని, నేలమాళిగ లోని పుస్తక ప్రచురణాలయాన్ని ఉదహరించారు. వార్ ఇ రచనలు "కాస్మిక్ కవిత", "లోకానికి చాటింపు" , తిరుప్పావై తెలుగు అనువాదం మొ.నవి వివరించి, వారితో తనకు నాలుగు దశాబ్దాల పరిచయాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.


తరువాత జరిగిన వేమూరి "మహాయానం" ఈ- పుస్తకాన్ని రఘు మల్లాది ఆవిష్కరించగా, కిరణ్ ప్రభ పుస్తక పరిచయం చేసారు. మహాయానం 40 సంవత్సరాలుగా రాసిన 30 కథల సంపుటి అని, రాశి కంటే వాసి ప్రధానం గా ఉన్న ఈ సంపుటిలో విలక్షణమైన కథలు ఉన్నాయనీ అన్నారు. ఈ పుస్తకంలో సాంఘిక కథలతో బాటూ సైన్సు ఫిక్షన్, పరిశోధనాత్మక కథలున్నాయని, ఎంతో కృషి చేస్తే మాత్రమే ఇలాంటి కథలు రాయగలరని అన్నారు. ఇక కథల్లోని తెలుగు పదజాలం, వాక్యాన్ని తీర్చి దిద్దే విధానం ఈ పుస్తకంలో నేర్చుకోవలసిన అంశాలని అన్నారు.

పుస్తక రచయిత వేమూరి తన రచనానుభవాన్ని చెబుతూ కథా రచన కంటే కథాంశపు పరిశోధనకే ఎక్కువ సమయం తీసుకుంటానని, అందుకే సంవత్సరానికి ఒక కథ కంటే ఎక్కువ రాయలేదనీ అన్నారు. ఆంగ్ల పదాలు వాడ వలసిన చోట అచ్చ తెలుగు పదాలు లేదా సంస్కృత సమాలైన తెలుగు పదాల్ని వాడతాననీ, తద్వారా వాడుక లో లేకుండా పోతున్న అనేక పదాల్ని తిరిగి పరిచయం చెయ్యొచ్చనీ అన్నారు.


రెండవ పుస్తకం "సమాంతర ఛాయలు " పుస్తక ఆవిష్కరణ వేమూరి చేయగా, పుస్తక పరిచయం డా||కె.గీత చేసారు. హఠాత్తుగా యాభయ్యవ ఏట కవిత్వం ప్రారంభించిన క్రాంతి శ్రీనివాస రావు గారి కవిత్వం లో అద్భుత కవితావిష్కరణ ఉందన్నారు. గొప్ప అభివ్యక్తి ని వివరిస్తూ "క్షత గాత్రం", "అంతా లెక్కే" కవితల్ని ఉదహరించారు.
తర్వాత కవి క్రాంతి శ్రీనివాస రావు ఉపన్యసిస్తూ వేమూరి కి సరిగ్గా వ్యతిరేకం తన కవిత్వ యానం అని చెబుతూ 90 రోజుల్లో 93 కవితల్ని రాసి మొదటి పుస్తకంగా ప్రచురించానన్నారు. కవిత్వ పునాది 7, 8 తరగతుల్లోనే పడిందని అందుకు దోహద పడిన ఉపాధ్యాయులని గుర్తు తెచ్చుకున్నారు. మహా ప్రస్థానం పట్ల ఇష్టం తో, శ్రీ శ్రీ పట్ల అభిమానంతో ఖమ్మంలో శ్రీ శ్రీ విగ్రహాన్ని ప్రతిష్టాపించడం, ఆ సందర్భంగా జరిపిన సాహితీ సభల్ని గుర్తు చేసుకున్నారు. ఫేస్ బుక్ లో కవిత్వ గ్రూపుల లో ప్రతి రోజూ కవిత్వం రాయడం వల్లే హఠాత్తుగా కవినయ్యానని సభికులకి ఆశ్చర్యం కలగ జేసారు. నాయనమ్మ గురించి రాసిన కవిత "దయ్యాల మాణిక్యమ్మ" కవితను చదివి వినిపించారు.
స్వీయ కవితా విభాగంలో గోపాల్ నేమాన "అవ్యక్త మూర్తి" , డా. కె.గీత "కొత్తిల్లు" , నూతక్కి రాఘవేంద్రరావు " గంతనే మూడు చక్రాలు" మొ.నవి, పాలడుగు శ్రీచరణ్ "శివరాత్రి పద్యాలు", క్రాంతి శ్రీనివాస రావు "స్లీపింగ్ బెర్త్" కవితలు సభికుల్ని బాగా అలరించాయి.
కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ , "సూచనలు- సలహాల" కార్యక్రమం లోను వీక్షణం సభికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రఘు మల్లాది వందన సమర్పణ చేసి సభను ముగించారు.
.......................

Tuesday 2 April 2013

వీక్షణం సాహితీ సమావేశం- 6 (Feb 9, 2013)



 




 


 


 
 
ఫిబ్రవరి పదవ తేదీన జరిగిన వీక్షణం ఆరవ సాహితీ సమావేశానికి, బే ఏరియాలోని మిల్పిటాస్ నగరంలో శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారి ఇల్లు వేదిక అయ్యింది. సాయంత్రం మూడు నుండి ఆరు గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ బులుసు నారాయణ గారు అధ్యక్షత వహించగా, స్థానిక రచయితలు, కవులు పాల్గొన్నారు.

ప్రముఖ రచయిత శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చారు. శ్రీ మృత్యుంజయుడుగారు వారిని సభకు పరిచయం చేసారు. అరవై సంవత్సరాల సాహితీగమనంలో జరిగిన ప్రముఖ సంఘటనలను, ప్రముఖులతో పరిచయలాని, ఇతర జ్ఞాపకాలను పంచుకొన్నారు. వారు తమ జీవితంలో రచనా వ్యాసంగం గురించి సవివరంగా ప్రసంగించారు. కలకత్తాలోని భారతీయ భాష పరిషత్, దేశంలోని వివిధ భాషలను సమన్వయ పరుస్తూ, భావ సమైక్యతను ఏకం చేస్తున్న సేవను, అలాగనే వారు దేశంలోని రచయితలను, కవులను సత్కరించటం వివరించారు. అటువంటి సంస్థ ద్వారా పురస్కారం అందుకున్న మొదటి తెలుగు రచయిత కావటం ఎంతో సంతృప్తిని కలిగించిందని తెలియచేసారు. 1961-62లో మొట్టమొదటిసారి, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో తన మొదటి కథ, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ప్రోత్సాహంతో చదవడం ఎంతో మధుర అనుభూతి అని తెలియచేస్తూ, కృష్ణ శాస్త్రిగారికి తమకు ఉన్న అనుబంధం గురించి వివరించారు.

 
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారిపై డాక్టరేట్ చేయటం వలననే కృష్ణశాస్త్రి గారికి, అలాగనే ఎందరో పెద్దలకు, తెలుగు భాషాభిమానులకు ఆప్తుడయ్యానని అభిప్రాయపడ్డారు. పంతులుగారి పై పరిశోధనా సమయంలో వారి ప్రయాసాలను వివరిస్తూ, ఆప్పుడు సహాయం చేసిన వారిని జ్ఞప్తికి తెచ్చుకుని, శ్రీ వీరేశలింగంగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపిన వారి వద్ద నుండి ఆ ప్రతులను సేకరించిన విధానం తెలియచేసి, ఆ ప్రతులను శాశ్వతంగా భద్రపరిచే విధానం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

తమకు పూర్వ, సమకాలీన కవులు, రచయితలను గురించి చెబుతూ, బహు భాషాకోవిదులైన శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి వారికి అత్యున్నత సాహితీ పురస్కారమైన 'జ్ఞానపీఠ' లభించకపోవడం కడు శోచనీయమని తెలియచేసారు. ప్రసంగం తర్వాత, ప్రశ్నోత్తరాల సమయంలో వారి కథాంశాలకు, కలం పేరుకు ప్రేరణ, మరిన్ని విషయాలు ఎంతో మధురంగా వివరించారు.
 

 
ఈ ప్రసంగం అనంతరం విచ్చేసిన వారికి అందరికీ శ్రీమతి తాటిపాముల జయగారు, అల్పాహార విందు, తేనీరు ఏర్పాటు చేసారు.
విరామ సమయానంతరం, శ్రీ చిమట శ్రీనివాస్ గారు, ప్రశ్నోత్తరాల పోటీ నిర్వహించారు. ఈ సారి, తెలుగు సినిమాతో అనుబంధం ఉన్న కవులు, వారి రచనల పై జరిగిన క్విజ్ లో ఎందరో ఉత్సాహంగా పాల్గొని, పుస్తకాలను బహుమతులుగా పొందారు.
కార్యక్రమం ఉత్తర భాగంలో శ్రీమతి కె.గీతగారి మూడవ కవితా సంపుటి 'శతాబ్ది వెన్నెల' శ్రీమతి గునుపూడి అపర్ణగారు ఆవిష్కరించి ముఖ్య అతిధికి, సభాధ్యక్షులకి, ఇతరులకి అందించి, గీతగారు మరిన్ని రచనలు చేయాలని అభిలషించారు. అనంతరం, శ్రీ కిరణ్ ప్రభగారు పుస్తక పరిచయం చేస్తూ, శతాబ్ది వెన్నెల సంపుటిలోని కవితలు ఉటంకిస్తూ, వారి రచనా శైలి అద్భుతమని, ఆధునిక వచన కవితా రచయితలలో గీతగారికి ప్రత్యేక స్థానమున్నదని కొనియాడారు. నిర్జీవ వస్తువైనా 'అమ్మేసిన కారు', అలాగనే 'డంబార్టన్ బ్రిడ్జి' లతో మనము పంచుకునే మధురానుభూతులు కూడా ఒక కవితా వస్తువు చేసుకోవడం, అటువంటి వస్తువులను కూడా మనము మానవీయ దృక్కోణంలో చూడడం కూడా కేవలం గీతగారికే చెల్లిందన్నారు. వారి ఈ సంపుటి, కొత్త రచయితలకు ఒక రిఫరెన్స్ వంటిదని కొనియాడారు. శ్రీమతి గీతగారు తమ మూడవ కవితా సంపుటి ఆవిష్కరణపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కవిత్వం రాయడం తనకు ఊపిరి పీల్చుకునేంత సమానమని తెలియచేసారు. .
వీక్షణం సమావేశాలకి, బ్యానర్ ను బ్యానర్ రూపకర్త శ్రీమతి కాంతి కిరణ్ గారు ఆవిష్కరించారు.
అనంతరం స్వీయ కవితాపఠనం అంశంలో ఆనంద్ బండి గారు, 'ఈ దేశం నా దేశం' అనే కవితా గేయాన్ని పాడగా, శ్రీమతి కె.గీత గారు తమ ఎనభై ఏళ్ళ నాయనమ్మ పై వ్రాసిన 'కథ ముగిసింది' కవిత చదివారు, శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు తాను రచించిన 'శ్రీ సత్యదేవం భజే' అనే శతకం లోని నాలుగు శ్లోకాలను వినిపించారు.

తమకు నచ్చిన కవితలను చెబుతూ శ్రీ తాటిపాముల మృత్యుంజయుడుగారు, కందుకూరి రామభద్ర రావు గారి 'ఎంత చక్కని దోయి ఈ తోట' అనే కవిత, తెలుగు మహా సభల కోసం ప్రత్యేకంగా తెలుగు భాషపై వ్రాసిన గేయాన్ని చదివారు.

కార్యక్రమంలో చివరి అంశంగా శ్రీ కిరణ్ ప్రభ గారు రచయిత శారద గారి జీవిత విశేషాలని వివరించారు. 
   
 
 - ఆనంద్ బండి   

Wednesday 27 February 2013

వీక్షణం సాహితీ సమావేశం- 5 (Jan12, 2013)


వీక్షణం ఐదవ సమావేశం జనవరి 12 తల్లాప్రగడ రామచంద్రరావు గారింట్లో రసవత్తరంగా జరిగింది. పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ అధ్యక్షత వహించిన సమావేశంలో సిలికాన్ వ్యాలీలోని సాహితీవేత్తలు మరియు సాహితీప్రియులు తమ కుటుంబసభ్యులతో పాల్గొన్నారు.

మధు ప్రఖ్య 'సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం' అనే అంశంపై కీలకోపన్యాసం చేసారు. కొత్త పంథాలో సాగిన ఉపన్యాసంలో మనిషి జీవితంలో సాహిత్యం యొక్క ప్రాముఖ్యతను విశదపరిచారు. సాహిత్యం ఒక ఇంజక్షన్ లాంటిదని, మనిషి గుర్తుంచుకునే మంచిమాటలన్నీ సాహిత్యానికి సంబధించినవేనని చెప్పారు. జీవితంలో జరిగిన ముఖ్య అనుభూతులు, సంఘటనల వెనుక సాహిత్యం తప్పక ఉంటుందని వివరిస్తూ బాల్యంలో తల్లి పాడే జోలపాట, పెళ్ళిలోని భాజాభజంత్రీలు మొదలైన వాటిని ఉదాహరణలుగా పేర్కొన్నారు. మనిషికి, పశువుకి స్పష్టంగా కనిపించే తేడా సాహిత్యం అన్నారు.

మనకు ఎంత ఇష్టమైన వంటకాన్ని పదేపదే తింటే మొహం మొత్తుతుందనీ, కానీ ఇష్టమైన సాహిత్యాన్ని ఎన్నిసార్లైనా చదవడమో, వినడమో, లేదా చూడటానికి ఇష్టపడతామన్నారు. దృశ్యం, శ్రవణం, ఇంకా అనేక హంగులు మిళితమీన సినిమా మనకు లభ్యమైన ఒక మహత్తర సాహిత్యమంటూ తనదైన శైలిలో మధ్యమధ్యలో చమక్కులు, చురుక్కులు విసురుతూ సభికులను రజింపజేసారు. సాహిత్యం ఒక వైరస్ లా తెలియకుండా సంఘంలోకి ప్రవేశించి మనల్ని ప్రభావితం చేస్తున్నదని చెప్పుకొస్తూ రామాయణ కావ్యాన్ని గుర్తుచేసారు.

సమావేశంలో వైవిధ్యంగా సభికులు ఒక్కొక్కరు తమను ప్రభావితం చేసిన పద్యాన్ని, మనిషిని, సంఘటనని, కథని, లేదా నవలని క్లుప్తంగా సమీక్షించారు.
ఎప్పటిలాగే కిరణ్ ఫ్రభగారు 'సాహితీ క్విజ్జు 'లో మెదడుకు పదును పెట్టే ప్రశ్నలను (తెలుగులో అచ్చు అయిన మొట్టమొదటి పుస్తకం - సమాధానం 'బైబిల్ ', Alex Haley రాసిన Roots కి తెలుగు అనువాదం - సమాధానం 'ఏడుతరాలు ' మొదలైనవి) అడిగారు.
ఈసారి సభలో పిల్లలు పాల్గొనడం ఒక విశేషం. ఏడేళ్ల బాలిక తుర్లపాటి అమృత 'గణనాయకాయ, గణదైవతాయా...' పాటను మధురంగా ఆలపించింది. అలాగే విజాపురపు సంధ్య కర్ణాటక సంగీతంలోని కొన్ని కీర్తలను ఆలాపించింది.

విన్నకోట వికాస్, శ్రీచరణ్, పుల్లెల శ్యాం సుందర్, తల్లాప్రగడ రావు,  తమ స్వీయకవితలను చదివి వినిపించారు.
సమావేశంలో చివరగా కిరణ్ ప్రభగారు తాను రోజు ఉదయం టోరీ రేడియో ప్రొగ్రాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం 'మా తెలుగుతల్లికి మల్లె పూదండ ' రచయిత 'శంకరంబాడి సుందరాచార్య ' పై జరిపిన ప్రసంగంలోని కొన్ని విశేషాలని పంచుకొన్నారు.
భోగి పండుగ సందర్భంగా రావుగారి సతీమణి జ్యోత్స్న గారు పులిహోర, గారెలు, పెరుగన్నం లాంటి రుచికరమైన పదార్థాలని అందించారు.

ఫిబ్రవరి నెల వీక్షణం సమావేశం తాటిపాముల మృత్యుంజయుడు ఇంట్లో జరుగుతుందని ప్రకటించారు.
.....................
-తాటిపాముల మృత్యుంజయుడు
 
http://www.koumudi.net/Monthly/2013/february/feb_2012_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb13/veekshanam.html