Friday 26 April 2013

వీక్షణం సాహితీ సమావేశం - 7 (Mar10, 2013)














బే ఏరియా నిరంతర సాహితీ స్రవంతి "వీక్షణం" సప్తమ సమావేశం రఘు మల్లాది గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి రావు తల్లాప్రగడ అధ్యక్షత వహించారు. ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ సమావేశం లో రెండు పుస్తకావిష్కరణలు జరిగాయి. మొదటిది వేమూరి వేంకటేశ్వర్రావు రచించిన కథా సంపుటి "మహా యానం", రెండోది క్రాంతి శ్రీనివాసరావు కవితా సంపుటి " సమాంతర ఛాయలు" .


ఇటీవల మరణించిన "తెలుగు భాషా పత్రిక" సంపాదకులు, కథా రచయిత "పెమ్మరాజు వేణుగోపాల రావు" గురించిన వేమూరి వేంకటేశ్వర్రావు గారి సంస్మరణ ఉపన్యాసం తో సభ ప్రారంభమైంది. వేణుగోపాలరావు గారి తో తనకున్న అనుబంధాన్ని వేమూరి వివరించారు. ఆయన ప్రవాసాంధ్రులకి భీష్మాచార్యుల వంటి వారని కొనియాడారు. వేణుగోపాలరావు గారు ఎమరీ విశ్వ విద్యాలయంలో భౌతిక శాస్త్రం బోధించే వారనీ, సైన్సుని తెలుగులో రాయటం అనే ప్రక్రియని ప్రోత్సహించడానికి "తెలుగు భాషా పత్రిక" ను స్థాపించిన ఆయన తనను వ్యాసం అడగడం తో తమ పరిచయం ప్రారంభమైందనీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వివరించిన అప్పటి మిమియో గ్రాఫు పద్ధతి సభికులకు ఆసక్తి కలిగించింది. వేణుగోపాలరావు గారి బహుముఖ ప్రజ్ఞను వివరిస్తూ అట్లాంటా లోని వారింటి పెరట్లో కొలువు దీర్చిన, వారే స్వయంగా తయారు చేసిన అనేక శిల్పాల్ని, ఇంటి గోడలకున్న తైల వర్ణ చిత్రాల్ని, నేలమాళిగ లోని పుస్తక ప్రచురణాలయాన్ని ఉదహరించారు. వార్ ఇ రచనలు "కాస్మిక్ కవిత", "లోకానికి చాటింపు" , తిరుప్పావై తెలుగు అనువాదం మొ.నవి వివరించి, వారితో తనకు నాలుగు దశాబ్దాల పరిచయాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.


తరువాత జరిగిన వేమూరి "మహాయానం" ఈ- పుస్తకాన్ని రఘు మల్లాది ఆవిష్కరించగా, కిరణ్ ప్రభ పుస్తక పరిచయం చేసారు. మహాయానం 40 సంవత్సరాలుగా రాసిన 30 కథల సంపుటి అని, రాశి కంటే వాసి ప్రధానం గా ఉన్న ఈ సంపుటిలో విలక్షణమైన కథలు ఉన్నాయనీ అన్నారు. ఈ పుస్తకంలో సాంఘిక కథలతో బాటూ సైన్సు ఫిక్షన్, పరిశోధనాత్మక కథలున్నాయని, ఎంతో కృషి చేస్తే మాత్రమే ఇలాంటి కథలు రాయగలరని అన్నారు. ఇక కథల్లోని తెలుగు పదజాలం, వాక్యాన్ని తీర్చి దిద్దే విధానం ఈ పుస్తకంలో నేర్చుకోవలసిన అంశాలని అన్నారు.

పుస్తక రచయిత వేమూరి తన రచనానుభవాన్ని చెబుతూ కథా రచన కంటే కథాంశపు పరిశోధనకే ఎక్కువ సమయం తీసుకుంటానని, అందుకే సంవత్సరానికి ఒక కథ కంటే ఎక్కువ రాయలేదనీ అన్నారు. ఆంగ్ల పదాలు వాడ వలసిన చోట అచ్చ తెలుగు పదాలు లేదా సంస్కృత సమాలైన తెలుగు పదాల్ని వాడతాననీ, తద్వారా వాడుక లో లేకుండా పోతున్న అనేక పదాల్ని తిరిగి పరిచయం చెయ్యొచ్చనీ అన్నారు.


రెండవ పుస్తకం "సమాంతర ఛాయలు " పుస్తక ఆవిష్కరణ వేమూరి చేయగా, పుస్తక పరిచయం డా||కె.గీత చేసారు. హఠాత్తుగా యాభయ్యవ ఏట కవిత్వం ప్రారంభించిన క్రాంతి శ్రీనివాస రావు గారి కవిత్వం లో అద్భుత కవితావిష్కరణ ఉందన్నారు. గొప్ప అభివ్యక్తి ని వివరిస్తూ "క్షత గాత్రం", "అంతా లెక్కే" కవితల్ని ఉదహరించారు.
తర్వాత కవి క్రాంతి శ్రీనివాస రావు ఉపన్యసిస్తూ వేమూరి కి సరిగ్గా వ్యతిరేకం తన కవిత్వ యానం అని చెబుతూ 90 రోజుల్లో 93 కవితల్ని రాసి మొదటి పుస్తకంగా ప్రచురించానన్నారు. కవిత్వ పునాది 7, 8 తరగతుల్లోనే పడిందని అందుకు దోహద పడిన ఉపాధ్యాయులని గుర్తు తెచ్చుకున్నారు. మహా ప్రస్థానం పట్ల ఇష్టం తో, శ్రీ శ్రీ పట్ల అభిమానంతో ఖమ్మంలో శ్రీ శ్రీ విగ్రహాన్ని ప్రతిష్టాపించడం, ఆ సందర్భంగా జరిపిన సాహితీ సభల్ని గుర్తు చేసుకున్నారు. ఫేస్ బుక్ లో కవిత్వ గ్రూపుల లో ప్రతి రోజూ కవిత్వం రాయడం వల్లే హఠాత్తుగా కవినయ్యానని సభికులకి ఆశ్చర్యం కలగ జేసారు. నాయనమ్మ గురించి రాసిన కవిత "దయ్యాల మాణిక్యమ్మ" కవితను చదివి వినిపించారు.
స్వీయ కవితా విభాగంలో గోపాల్ నేమాన "అవ్యక్త మూర్తి" , డా. కె.గీత "కొత్తిల్లు" , నూతక్కి రాఘవేంద్రరావు " గంతనే మూడు చక్రాలు" మొ.నవి, పాలడుగు శ్రీచరణ్ "శివరాత్రి పద్యాలు", క్రాంతి శ్రీనివాస రావు "స్లీపింగ్ బెర్త్" కవితలు సభికుల్ని బాగా అలరించాయి.
కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ , "సూచనలు- సలహాల" కార్యక్రమం లోను వీక్షణం సభికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రఘు మల్లాది వందన సమర్పణ చేసి సభను ముగించారు.
.......................

Tuesday 2 April 2013

వీక్షణం సాహితీ సమావేశం- 6 (Feb 9, 2013)



 




 


 


 
 
ఫిబ్రవరి పదవ తేదీన జరిగిన వీక్షణం ఆరవ సాహితీ సమావేశానికి, బే ఏరియాలోని మిల్పిటాస్ నగరంలో శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారి ఇల్లు వేదిక అయ్యింది. సాయంత్రం మూడు నుండి ఆరు గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ బులుసు నారాయణ గారు అధ్యక్షత వహించగా, స్థానిక రచయితలు, కవులు పాల్గొన్నారు.

ప్రముఖ రచయిత శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చారు. శ్రీ మృత్యుంజయుడుగారు వారిని సభకు పరిచయం చేసారు. అరవై సంవత్సరాల సాహితీగమనంలో జరిగిన ప్రముఖ సంఘటనలను, ప్రముఖులతో పరిచయలాని, ఇతర జ్ఞాపకాలను పంచుకొన్నారు. వారు తమ జీవితంలో రచనా వ్యాసంగం గురించి సవివరంగా ప్రసంగించారు. కలకత్తాలోని భారతీయ భాష పరిషత్, దేశంలోని వివిధ భాషలను సమన్వయ పరుస్తూ, భావ సమైక్యతను ఏకం చేస్తున్న సేవను, అలాగనే వారు దేశంలోని రచయితలను, కవులను సత్కరించటం వివరించారు. అటువంటి సంస్థ ద్వారా పురస్కారం అందుకున్న మొదటి తెలుగు రచయిత కావటం ఎంతో సంతృప్తిని కలిగించిందని తెలియచేసారు. 1961-62లో మొట్టమొదటిసారి, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో తన మొదటి కథ, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ప్రోత్సాహంతో చదవడం ఎంతో మధుర అనుభూతి అని తెలియచేస్తూ, కృష్ణ శాస్త్రిగారికి తమకు ఉన్న అనుబంధం గురించి వివరించారు.

 
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారిపై డాక్టరేట్ చేయటం వలననే కృష్ణశాస్త్రి గారికి, అలాగనే ఎందరో పెద్దలకు, తెలుగు భాషాభిమానులకు ఆప్తుడయ్యానని అభిప్రాయపడ్డారు. పంతులుగారి పై పరిశోధనా సమయంలో వారి ప్రయాసాలను వివరిస్తూ, ఆప్పుడు సహాయం చేసిన వారిని జ్ఞప్తికి తెచ్చుకుని, శ్రీ వీరేశలింగంగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపిన వారి వద్ద నుండి ఆ ప్రతులను సేకరించిన విధానం తెలియచేసి, ఆ ప్రతులను శాశ్వతంగా భద్రపరిచే విధానం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

తమకు పూర్వ, సమకాలీన కవులు, రచయితలను గురించి చెబుతూ, బహు భాషాకోవిదులైన శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి వారికి అత్యున్నత సాహితీ పురస్కారమైన 'జ్ఞానపీఠ' లభించకపోవడం కడు శోచనీయమని తెలియచేసారు. ప్రసంగం తర్వాత, ప్రశ్నోత్తరాల సమయంలో వారి కథాంశాలకు, కలం పేరుకు ప్రేరణ, మరిన్ని విషయాలు ఎంతో మధురంగా వివరించారు.
 

 
ఈ ప్రసంగం అనంతరం విచ్చేసిన వారికి అందరికీ శ్రీమతి తాటిపాముల జయగారు, అల్పాహార విందు, తేనీరు ఏర్పాటు చేసారు.
విరామ సమయానంతరం, శ్రీ చిమట శ్రీనివాస్ గారు, ప్రశ్నోత్తరాల పోటీ నిర్వహించారు. ఈ సారి, తెలుగు సినిమాతో అనుబంధం ఉన్న కవులు, వారి రచనల పై జరిగిన క్విజ్ లో ఎందరో ఉత్సాహంగా పాల్గొని, పుస్తకాలను బహుమతులుగా పొందారు.
కార్యక్రమం ఉత్తర భాగంలో శ్రీమతి కె.గీతగారి మూడవ కవితా సంపుటి 'శతాబ్ది వెన్నెల' శ్రీమతి గునుపూడి అపర్ణగారు ఆవిష్కరించి ముఖ్య అతిధికి, సభాధ్యక్షులకి, ఇతరులకి అందించి, గీతగారు మరిన్ని రచనలు చేయాలని అభిలషించారు. అనంతరం, శ్రీ కిరణ్ ప్రభగారు పుస్తక పరిచయం చేస్తూ, శతాబ్ది వెన్నెల సంపుటిలోని కవితలు ఉటంకిస్తూ, వారి రచనా శైలి అద్భుతమని, ఆధునిక వచన కవితా రచయితలలో గీతగారికి ప్రత్యేక స్థానమున్నదని కొనియాడారు. నిర్జీవ వస్తువైనా 'అమ్మేసిన కారు', అలాగనే 'డంబార్టన్ బ్రిడ్జి' లతో మనము పంచుకునే మధురానుభూతులు కూడా ఒక కవితా వస్తువు చేసుకోవడం, అటువంటి వస్తువులను కూడా మనము మానవీయ దృక్కోణంలో చూడడం కూడా కేవలం గీతగారికే చెల్లిందన్నారు. వారి ఈ సంపుటి, కొత్త రచయితలకు ఒక రిఫరెన్స్ వంటిదని కొనియాడారు. శ్రీమతి గీతగారు తమ మూడవ కవితా సంపుటి ఆవిష్కరణపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కవిత్వం రాయడం తనకు ఊపిరి పీల్చుకునేంత సమానమని తెలియచేసారు. .
వీక్షణం సమావేశాలకి, బ్యానర్ ను బ్యానర్ రూపకర్త శ్రీమతి కాంతి కిరణ్ గారు ఆవిష్కరించారు.
అనంతరం స్వీయ కవితాపఠనం అంశంలో ఆనంద్ బండి గారు, 'ఈ దేశం నా దేశం' అనే కవితా గేయాన్ని పాడగా, శ్రీమతి కె.గీత గారు తమ ఎనభై ఏళ్ళ నాయనమ్మ పై వ్రాసిన 'కథ ముగిసింది' కవిత చదివారు, శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు తాను రచించిన 'శ్రీ సత్యదేవం భజే' అనే శతకం లోని నాలుగు శ్లోకాలను వినిపించారు.

తమకు నచ్చిన కవితలను చెబుతూ శ్రీ తాటిపాముల మృత్యుంజయుడుగారు, కందుకూరి రామభద్ర రావు గారి 'ఎంత చక్కని దోయి ఈ తోట' అనే కవిత, తెలుగు మహా సభల కోసం ప్రత్యేకంగా తెలుగు భాషపై వ్రాసిన గేయాన్ని చదివారు.

కార్యక్రమంలో చివరి అంశంగా శ్రీ కిరణ్ ప్రభ గారు రచయిత శారద గారి జీవిత విశేషాలని వివరించారు. 
   
 
 - ఆనంద్ బండి