About



మిత్రులారా! 
బే ఏరియాలో ప్రతిభావంతులైన రచయితలం, కవులం మనందరం ఏడాది కొకసారి సాహితీ సదస్సు రూపంలోనో, ఉగాది కవిసమ్మేళనాల రూపంగానో, అప్పుడప్పుడూ ఔత్సాహికులు నిర్వహిస్తున్న అతిథి కార్యక్రమాలలోనో కలుస్తూనే ఉన్నా ఇక్కడి రచనా వాతావరణంలోని  స్తబ్దతని ఛేదించడానికి  మనకు ఒక వేదికా చైతన్యం కావాలని గాఢంగా నమ్ముతూ ఒక కొత్త వేదిక "వీక్షణం" ను రూపుదిద్దుకుంది.   

వీక్షణం ను  తెలుగు భాషా, సాహిత్య రంగాల్లో ఏ ప్రక్రియ కైనా స్వాగతం పలికేలా తీర్చిదిద్దుదాం. వీక్షణం అనే పందిరి కింద  మనందరం   నెలకోసారి స్థానిక రచయితల ఆత్మీయ సమావేశం జరుపుకుందాం. వీక్షణం లో మనందరం భాగస్వాములమై మన రచనలను కాపాడుకోవడానికి, భావి తరాలకు ఇక్కడి సాహిత్యం అందజేయడానికి నడుం కడదాం రండి!  

 వీక్షణం సమావేశాల్లో ప్రతి రచయితా కనీసం  ఒక రచన రాసి సమావేశానికి తీసుకొచ్చి మనలోని సాహితీ ఆసక్తిని పదిమందితో పంచుకుందాం. అంతే కాకుండా  మనం ఇటీవల చదివిన రచనల గురించి మాట్లాడుకుందాం,  చర్చించుకుందాం.  ఇలాగైనా తప్పనిసరిగా రాయాలనే తపన మనలో కలుగుతుంది. 

ఇక మధ్యలో అతిథులెవరైనా విచ్చేసినప్పుడు సమావేశం, వార్షిక సమావేశాలు జరుపుకుందాం.   వీక్షణం లో సాహిత్యకారులందరం సదస్సులు నిర్వహించుకోవడమే కాకుండా, మన  రచనల  ప్రచురణలు, మన పుస్తకాల ఆవిష్కరణలు  జరుపుకుని బే ఏరియాలో సాహిత్యానికి సరికొత్త గవాక్షాల్ని తెరుద్దాం.

ఇవి మనందరం కలిసి చేసుకునే  సాహితీ సంబరాలు. వీటి విజయవంతానికి మీ ప్రతి ఒక్కరి చురుకైన భాగ స్వామ్యం తప్పనిసరిగా వుండాలి.  మీకు తెలిసిన సాహిత్యాసక్తి కలిగిన మిత్రులందరినీ మీతో ఈ సభకు తీసుకు రండి.






No comments:

Post a Comment