Monday 2 January 2017

వీక్షణం - సాహితీ గవాక్షం-52 (Dec11, 2016)

వీక్షణం సాహితీ సమావేశం- 52

- నాగరాజు రామస్వామి.

ఈ నెల వీక్షణం 52వ సమావేశం డిసెంబర్ 11న ఫ్రీమౌంట్ లోని శర్మీలాగారి ఇంట్లో జరిగింది. అతిథేయులు శ్రీమతి శర్మీలా గారు ఎంతో ఆత్మీయంగా అతిథులను ఆహ్వానించాక, సభ శ్రీ వేమూరి గారి అధ్యక్షతన మూడు గంటల పాటు అత్యంత ఉత్సాహంగా కొన సాగింది. సుమారు నాలుగేళ్ల క్రితం తమ ఇంట్లో మొదటి వీక్షణం జరిగిందని, ఇన్నాళ్లు నిరాఘాటంగా వీక్షణం సమావేశాలు కొనసాగుతుండడం హర్షణీయమని అధ్యక్షుల వారు కొనియాడారు.
కార్యక్రమంలోని మొదటి అంశం శ్రీమతి శర్మీలా గారి కథా పఠనం. వీరి వ్యాసాలు, కథలు  'వార్త' వంటి ప్రసిద్ధ సాహిత్య పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కూచిపూడి శాస్త్రీయ నాట్యాది లలిత కళలలో అభినివేశమున్న వీరు తమ కథలలో లలిత కోమల సంవేదనలను చిత్రిస్తారు. కథా శీర్షిక 'చిన్ని ఆశ '. పేరుకు తగట్టుగానే  కథలో సునుశిత పసి మనస్తత్వం ప్రస్ఫుటించింది. ఏలూరు తిరునాళ్లు, టమటమాల బండి, వెదురు గూళ్ల బళ్లు దర్శనమిచ్చాయి. పల్లె వాతావరణం లో సాగిన పసిప్రాయపు కథనం పూవుకు తావి అబ్బినట్టు సరళంగా సాగింది. చిన్ని చిన్ని వాక్యాలతో  ఉత్తమ పురుషలో నడచిన కథనరీతి పాఠకులను చిటికన వేలిని పట్టుకొని కథా చిత్రం కేసి నడిపిస్తున్నట్టు సహజ సుందరంగా వుందని కిరణ్ ప్రభ గారు కొనియాడారు.
తదనంతర కార్యక్రమం కిరణ్ ప్రభగారి కీలకోపన్యాసం. కవి సామ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ గారి పై 20 వారాలుగా కొన సాగుతున్న వారి 24 సంపుటాల రేడియో టాక్ షోకు పొడిగింపు ఈ ప్రసంగం. ఇంతవరకు ఉటంకించబడని కొన్ని విశిష్టాంశాల విషయ సంగ్రహం. గంటకు పైగా సాగిన వారి వాగ్ధార శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. తన షోలలో విశ్వనాథుని వృత్తాంతాన్ని ఆరు భాగాలుగా విభజించి విశ్లేషిస్తున్నానని తెలిపారు. జీవన రేఖలు, ఏకవీర, వేయి పడగలు, ఆత్మకథ, చిన్న కథలు, రామాయణ కల్పవృక్ష మహా కావ్యం - ఈ ఆరు భాగాలలో  ఆఖరుదైన కల్పవృక్షంపై ఇంకా సమగ్రంగా ప్రసంగించాల్సి వుందని, ఙ్జానపీఠ పురస్కార సందర్భంలో విశ్వనాథుల వారు సమర్పించిన ఆంగ్ల నివేదిక విశేషాలను, వాటి పూర్వపరాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నానని తెలిపారు. వారి అద్భుత ప్రసంగ సారాంశం ఇలాగుంది :
విశ్వనాథ వారికి 1971 లో లక్షరూపాయల ఙ్జానపీఠ పురస్కారం లభించింది. పాతిక సంవత్సరాల అకుంఠిత విశేష కృషి ఫలితంగా విశిష్ట 'రామాయణ కల్పవృక్షం' మహా కావ్యమై ప్రభవించింది. పురస్కార సందర్భంలో విశ్వనాథ గారు ఇంగ్లీషులో చదివిన ఎనిమిది పేజీల ఉపన్యాసం వారి జీవన సత్యాలను ప్రస్ఫుటించింది. జీవన గమనంలో తాను అనుభవించిన పేదరికాన్ని, తాను భరించిన వియోగ విషాదాన్ని, ఎదుర్కొన్న ప్రతిఘటనలను దాపరికంలేకుండా ఏకరువు పెట్టింది. ఆ ఉపన్యాసం ఒక ఉత్కృష్ట 'ధిషణుని' ఉదాత్తతను ప్రతిఫలించింది. A well-structured write-up ; a sheer caliber of  corporate world !
రాస్తే రామాయణమే రాయాలన్న తన తండ్రి గారి ఆదేశంతో కల్పవృక్ష రచనకు వారి 14వ ఏటనే బీజం పడింది. అందుకు కావలసిన సంసిద్ధత కోసం సత్యనారాయణ గారు పాతికేళ్లు పరిశ్రమించారు. రకరకాల రామాయణాలను అవపోసనం పట్టారు. సంస్కృతంలో నిష్ణాతుడు కానిదే రామాయణ ఆత్మను పట్టుకోలేమని గ్రహించి సంస్కృత భాషను కూలంకషంగా అధ్యయనం చేశారు. తన రామాయణ రచనలో  ఎవరూ వాడని వృత్తాలను పొందుపరచాలని, ఒక్కొక్క కాండలో 2000 చొప్పున పద్యాలు ఉండాలని  భావించి 1934 లో శ్రీకారం చుట్టిన రామయణ కల్పవృక్ష మహా కావ్యం పూర్తి అవడానికి 17 ఏళ్లు పట్టింది. ఒక్క బాలకాండ రచనకే 5 సంత్సరాల వ్యవధానం అవసరమయింది. డబ్బు లేమి కారణంగా రచనను ఆపేయాలనుకున్న తరుణంలో మళ్యాల యువరాజా వారు ఆర్థికంగా ఆదుకొని బాలకాండను ప్రచురించి పెట్టారు. తనచే ' రాముడు రాయించిన'  రామాయణం నిజానికి  సీతకథ అని విశ్వనాథులవారు నిర్ధారించారు.
డిగ్రీలు లేని తెలుగు పాండిత్యం అసమగ్రమేనని, ఆంగ్లంపై పట్టు సాధించాలని భావించి పాశ్చాత్య సాహిత్యాన్ని మథించారు. ఆంగ్ల సాహిత్య కళలను, లాటిన్ అనువాదాలను, ఇటాలియన్ నాటకాలను అధ్యయనం చేసి ఇంగ్లీషు భాష పై అధికారం సాధించారు. ఇలా నిరాఘాటంగా సాగిన కిరణ్ ప్రభ గారి ప్రసంగ ధారలో విశ్వనాథ ప్రశస్తి బహు ముఖంగా ప్రవహించింది.
ఈ సారి వేమూరి గారి వ్యంగ్యాస్త్రం పాక శాస్త్రం మీద పడింది. వెంకటేశ్వర్లు గారు 'మష్రూం కర్రీ' పేరున ఇదివరలో అచ్చైన తన స్కెచ్ ను చదివి వినిపించారు. తెలుగు కాని వంటింటి తెలుగులో నడచిన కథనం నవ్వులను పండించింది.
సాయిబాబా గారు 'రిగ్వేదం' పై పద్యం పాడారు. జగమంతా రిగ్గింగే అన్నంత ఇదిగా పాదాలు కదిలాయి.  "వీక్షణ గీతం" రెండవ భాగం లో 'వీక్షణాన్నీ',  'వీక్షణ సభ్య మండలినీ'  పేరుపేరున ప్రస్తుతిస్తూ - అమెరికా గర్వ కారణం, తెలుగు కళాతోరణం, సాంస్కృతిక సంరక్షణం, కిరణ్ ప్రభల ప్రశ్నోత్తరం, ఆసూరి రామాయణం, గీతా మాధవి కవనం అనర్ఘళం అంటూ అంత్య ప్రాసలతో అదరగొట్టేశారు. సటారికల్ గా సాగిన వారి హిలేరియస్ గాత్రం సభికులకు కితకితలు పెట్టింది.
ఈ రోజు హైటీబ్రేక్ తదనంతర కార్యక్రమం సరికొత్తది. విశేషమేమిటంటే ఈ దినం  'వీక్షణం' కర్త, కర్మ, క్రియ లాంటి గీతా మాధవి గారి జన్మదినం. కిరణ్ ప్రభ దంపతులు దిగ్విజయంగా నిర్వహిస్తున్న సాహిత్య పత్రిక ' కౌముది' కి  పదేళ్లు. యాదృచ్చికంగా అమరిన ఈ  రెండు పండుగులను ఏకకాలంలో నిర్వహించుకుని వీక్షణం సభ్యులు సంబరపడి పోయారు. కిరణ్ ప్రభ దంపతులు కేక్ కట్ చేసి గీతగారిని అభినందిస్తే, గీత గారు అభినందన కానుకనందించి కౌముదిని రంగుల బలూన్లతో ఎగిరేశారు.

కిరణ్ ప్రభ గారి సాహిత్య క్విజ్ ప్రశ్నోత్తరావళిలో సభ్యులందరూ పాలు పంచుకొని సభకు నూతనోత్సాహాన్ని చేకూర్చారు.
కవిసమ్మేళన కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణ గారు ఉమ్రలీషా గారి చింతనాత్మక కవితనూ, తన 'అక్షరాన్నీ' గానం చేసి సభికులను రంజింప జేశారు. గీత గారు ' వయసొచ్చిన పుట్టిన రోజు', లెనిన్ గారు 'నా పేరేమిటి', నాగరాజు రామస్వామి ' నవతరానికి నా స్వప్నం' కవితలను వినిపించారు. శ్రీ చరణ్ గారు గళర్షి బాలమురళీ కృష్ణకు నివాళిగా పద్య ప్రసూనాలను ప్రసాదిస్తే, సత్యనారాయణ గారు గానామృతంతో సత్కరించారు. శంషాద్ గారు 'శుక్రారం పుట్టిన రోజు' తెలంగాణ బాణీలో వచన కవితా కుసుమాన్ని అందించారు.
శ్రీమతి లక్ష్మి గారు తన మెక్సికో పర్యటానుభవ స్మృతులను జోడిస్తూ వీక్షణంపై తన కున్న మమకారాన్ని, నాస్టాలజియాను అత్యంత ఆప్త వాక్యాలలో అభివ్యక్తీకరించారు.
ఆశించిన విధంగానే, ఆహ్లాదకరంగా ఆత్మీయంగా సాగిన ఈ రోజు వీక్షణం కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan17/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2017/january/jan_2017_vyAsakoumudi_vikshanam.pdf
http://sirimalle.com/vikshanam.html


వీక్షణం - సాహితీ గవాక్షం-51 (Nov13, 2016)


వీక్షణం 51వ సమావేశ 
సమీక్ష 
-సుభాష్ పెద్దు

వీక్షణం 51వ సమావేశం దుర్ముఖి, కార్తీక మాసం శుద్ధ చతుర్దశి నాడు, అనగా నవంబరు 13, 2016 నాడు శ్రీమతి ఉదయ లక్ష్మి& శ్రీ గాంధీ ప్రసాద్ గారి కుమార్తె గృహమునందు జరిగినది. శ్రీమతి ఉదయలక్ష్మి గారు స్వాగతం పలికిన తరువాత, శ్రీ వేమూరి రావు గారిని అధ్యక్షత వహించవలసినదిగా కోరారు. అధ్యక్షులు శ్రీవేమూరి రావు గారు  శ్రీ మొలకలమూరు శ్రీనివాస మూర్తి గారిని సభకు పరిచయం చేస్తూ, వారు కన్నడ కవిగా ప్రసిద్ధికెక్కినా, పాళీ వాఙ్మయం గురించి పలురచనలు చేసినారని తెలిపి, పాళీ  వాఙ్మయం గురించి ప్రసంగించవలసినదిగా ఆహ్వానించారు. 
శ్రీనివాసమూర్తి గారు పాళీభాష లోని అమరకోశములో నుండి బుద్ధ భగవానునికి కల పలు నామధేయములను,  కొన్ని ఘటములు (శ్లోకములు) ఉద్దండ దండకములాగా పఠించి, తమ ప్రసంగం ప్రారంభించారు. వారి ప్రసంగ విశేషములు: "బుద్ధ భగవానుడి వాడుక భాష మగధీ ప్రాకృతము. ఈ భాషను పాళీ అని కూడా అంటారు. బుద్ధ భగవానుడు 45 సంవత్సరములలో 84,000 ధమ్మఖండములు, అనగా ధర్మ అంశములను పాళీ భాషలోనే వివరించినాడు. ఈ బుద్ధవచనములు తేరవాదములో త్రిపీటికములనుబడు ముఖ్య గ్రంధములు. త్రిపీటకములు అనగా మూడు బుట్టలు. అవి శుద్ధ పీటిక, వినయ పీటిక, అభిధమ్మ పీటిక. ఈ  పాళీ వాఙ్మయం బుద్ధుని మహాపరినిర్వాణము కాలమునాటిది, అనగా క్రీ పూ 543 నాటిది. మొదటి మహా సంగాయనము బుద్ధుడు మహానిర్వాణము జరిగిన మూడు నెలలకు అరిహంత మహాపక్స అధ్యక్షతన జరిగినది. రెండవ, మూడవ మహాసంగాయనములు 100, 250 సంవత్సరముల తరువాత జరిగినవి. బుద్ధుని పాళీ ధమ్మఖండములను భద్ర పరుచుట ఒక ముఖ్య ఉద్దేశము. ఐదవ, ఆరవ మహా సంగాయనములు నేటి బర్మా దేశములో జరిగినవి. ఐదవ మహా సంగాయనములో ఈ పాళీ ధమ్మఖండములను పాలరాతి పలకల పైన చెక్కినారు. పాళీ ధమ్మఖండముల పఠనము, బౌద్ధ ధర్మముతోపాటు ప్రపంచ వ్యాప్తి చెంది, నేటికి కూడా బహు ప్రచారములో ఉన్నవి. 
ఈ పాళీ వాఙ్మయాన్ని పాశ్చాత్య పండితులు బహు ప్రాచుర్యం కలిగించారు. ధమ్మ ఖండములను పాళీ లిపిలోనూ, రోమన్ లిపిలోనూ ప్రక్క ప్రక్కనే పొందు పరిచి వివరణలతో ప్రచురించారు. వారిలో ముఖ్యులు మోనియర్ విలియంస్, ర్రీస్ డేవిడ్స్ దంపతులు,  ఐ బి హొనర్, వుడ్వార్ద్, భిక్ఖు బోధి, జేంస్స్ గ్రె, కె ఆర్ నార్మన్, ఓల్డెంబర్గ్ మొదలైన వారు. వారు పాళీ భాషా, వాఙ్మయానికి చేసిన సేవ బహు ప్రశంసనీయము. ధమ్మఖండములను భారతీయ భాషలు వేటిలోనూ అనువదింపబడలేదు, పండిత వర్గానికి మాత్రమే అందుబాటులో ఈ గ్రంధములు ఉండటము విచారకరము అని మోనియర్ విలియంస్ అభిప్రాయపము.  బుద్ధ భగవానుడి సందేశము అష్ట మార్గముల సాధన ద్వారా, ఎవరికివారు తమ జ్ఞాన జ్యోతిని తెలుసుకోవలెను. పరియత్తి (జ్ఞాన సముపార్జన, ప్రతిపత్తి (సాధన), పరివేధ (అనుభవము) అనే పాళీ పదములు ఈ మార్గము తెలుసుకోవడానికి దోహదము చేస్తాయి." 
ఆ తరువాత, శ్రీనివాసమూర్తి గారు ధమ్మపాదములోని 400వ శ్లోకము పఠించి, బ్రాహ్మణుడు అనగా క్రోధ, మద, మాత్సర్యములు లేనివాడని వివరించారు. మనము మన మంచి గుణముల ద్వారా గుర్తింపబడవలెను, కానీ మన్ను పుట్టుకతో, కుల గోత్రాలతో కాదని తెలిపి, సభకు ధన్యవాదములు తెలిపారు.
రెండవ ప్రసంగకర్త శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. వారు పోతన భాగవతము ప్రారంభ పద్యము శ్రీ కైవల్య పదము వైశిష్ఠ్యతను, సూక్ష్మార్థమును వివరించారు. వారి ప్రసంగ విశేషములు - "ఒక వ్యక్తి, విశ్వమును కలిపేది విశ్వాసము. ధ్యాతను ధ్యేయమును కలిపేది ధ్యానం. భక్తుడు లేక భగవంతుడు లేడు, భగవంతుడు లేక భక్తుడూ లేడు. సత్ అనగా నిస్సందేహమైన, నిర్వివాదమైన సత్యం. చిత్ అనగా నిత్య చైతన్యశాలి, ఆనందము అనగా బ్రహ్మా  నందాన్ని ఇచ్చేది.  ఈ స్థూల సూక్ష్మజ్ఞానము, వేదాంతాల నేపధ్యములలోనుంచి ఉద్భవించినది. పోతన "శ్రీ కైవల్య పదం." పోతన పూర్వ కాలములో గ్రంథ ప్రారంభములో మొదటి పద్యము ఇష్ట దేవతా ప్రార్ధన గురించి ఉండేది. కానీ, పోతన ఏ దేవతల పేరూ ఈ పద్యములో చెప్పలేదు. మోక్షము అనగా విడిపోవడము. పోతన మోక్షం గురించి ప్రార్ధించలేదు. ఒక భక్తుడు భగవంతుడిలోని భాగం కావడము గురించి చెప్పాడు. సత్ చిత్ ఆనందము గురించి చెప్పాడు. ఈ విశిష్ట స్థానాన్ని పొందటం తన ధ్యేయమని పోతన తెలిపాడు.
తెలుగు భాష నిలబడాలంటే నేటి చిన్నారులకు తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉండటం ఆవశక్యం. అమెరికాలో పోతన భాగవతం అంటే అభిమానంతో గజేంద్ర మోక్షములోని పలు పద్యాలని ధారణగా బడి పిల్లలైన కాసుల అంజలి, కాసుల అమృత పఠించి సభను ఆకట్టుకున్నారు.
ఆ తరువాతి కార్యక్రమము సభికులని ఉత్సాహ పరిచే కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమము. ఒక ఉదాహరణ ప్రశ్న "అష్ట కష్టాలు లో లేనిది ఏమిటి? క) యుద్ధములో గాయ పడటం చ) ఒంటరిగా నడవడం ట) దారిద్ర్యం త) అప్పు
తర్వాత  శ్రీ గంగాధర తిలక్ గారు తమ "శ్రమదాన్" గురించి వివరిస్తూ  చేసిన ప్రసంగం సభలోని వారిని ఆసక్తిదాయకుల్ని చేసింది. రోడ్లపై గుంతల్ని ప్రతి రోజూ స్వయంగా పూడుస్తూ తనదైన శైలిలో సమాజ సేవనందిస్తున్న తిలక్ గార్ని అంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. 
షంషాద్ గారు తన తెలుగు కవిత్వములో ఉర్దూ పదాల వివరణ గురించి వివరిస్తూ, ముస్లిం స్త్రీల సమస్యల గురించి వ్రాసిన కవితలలో సరియైన భావ ప్రకటనకు ఉర్దూ పదజాలం వాడడము తప్పనిసరి అని తెలిపి ఉదహరించారు. 
కవి సమ్మేళనం లో చదివిన కవితలు: 
1. గంగిశెట్టి గారు - "ఏదీ మా మండువా లోగిలి .."
2. శ్రీధర్ గారు - "నేను హాలాహలాన్ని"
3. సుభాష్ - 'నా శ్వాస నీ నిశ్వాస ..."
3. శ్రీనివాస మూర్తి గారు కన్నడ కవిత - "చైత్రం వచ్చేసింది"
4. కె.గీత గారు - "వీడ్కోలు విమానం"
5. వేణు గారు - "నా కౌగిలి కరగాలని", "ప్రతి దినం పరుగుల పందెం"
చివరగా సత్యనారాయణ గారు సూఫీ గీతాలను ఆలపించగా, గీత "శివ శివ శివ అనరాదా" అంటూ ఆలపించి సభలోని వారిని ముగ్ధుల్ని చేశారు.
సమావేశం ముగిస్తూ  శ్రీమతి ఉదయలక్ష్మి గారు విచ్చేసిన సభికులందరికీ ధన్యవాదములను తెలిపారు.
Vikshanam
http://www.koumudi.net/Monthly/2016/december/dec_2016_vyAsakoumudi_vikshanam.pdf
http://sirimalle.com/SM-old-issues/2016/December/vikshanam.html
 http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec16/veekshanam.html


వీక్షణం - సాహితీ గవాక్షం-50 (Oct10, 2016)



వీక్షణం 50వ సమావేశ సమీక్ష 
-సుభాష్ పెద్దు

వీక్షణం 50వ సమావేశం దుర్ముఖి, ఆశ్వయుజ నవమి నాడు, అనగా అక్టోబర్ 10, 2016 న శ్రీ తల్లాప్రగడ రావు, శ్రీమతి జ్యోత్స్న గారి గృహమునందు జరిగినది. 
ఈ సమావేశములోని మొదటి అంశము తల్లాప్రగడ రావు గారు రామాయణములోని "సంజీవనీ యాత్ర" ప్రసంగము. ఈ ప్రసంగములో రావు గారు వాల్మీకి రామాయణములోనుండీ, తులసీదాసు రామాయణము నుండీ పలు శ్లోకాలను, దోహాలను ప్రస్తావించారు.   ప్రసంగ విశేషములు: "రావణుడు మయుడుచే చేయబడిన శక్తి శూలాన్ని లక్ష్మణుడిపై విసరగా, అది వాసుకిలాగా, ఒక మహా కాల సర్పములాగా లక్ష్మణుడిని కాటువేయగా,  లక్ష్మణుడు స్పృహ తప్పాడు. జాంబవంతుడు, సుశేనుడూ చెప్పగా హనుమ హిమాలయ దక్షిణ శిఖరాలలో ఉండే ఓషధి పర్వతమునుండీ విశల్యకరణి, సంజీవనీకరణి అనే ఔషధములను తెమ్మని పంపుతారు. హనుమంతుడు దారిలో కాలనేమిని అంతమొందించి, ఓషధీ పర్వతాన్ని చేరుకుని, అందులో ఉండే మూలికలని గుర్తించలేక, పర్వతాన్ని మొత్తాన్నీ పెకిలించి, తీసుకువస్తుండగా, మార్గ మధ్యమున అయోధ్యా నగర వైభవమును దర్శించుటకు కొంత క్రిందికి దిగుతాడు. భరతుడు ఎవరో రాక్షసుడు అనుకుని బాణము వేసి కొట్టగా, "హే రామా" అంటూ కుప్ప కూలతాడు. భరతుడు రామ నామము విని, జరిగిన విషయము తెలుసుకుని హనుమంతుడికి సపర్యలు చేసి, "ఒక బాణము వేసెదను, ఆ బాణమును అధిరోహించి సూర్యోదయమునకు ముందే రాముని వద్దకు చేర"మని పంపిస్తాడు. ఈ సమయములోనే రాముడు ఒక సామాన్యుని వలె దుఃఖిస్తూ, "నా భార్య కోసం నా సోదరుని పోగొట్టుకొని అయోధ్యకు తిరిగి ఎలా వెళ్లగలను?" అని కన్నీరు కారుస్తాడు. ఈ సమయములో హనుమ రాముని వద్దకు చేరగా, వానరులు సంతోషముతో కేరింతలు వేస్తారు. రాముడు కృతజ్ఞుడై హనుమంతుడిని కౌగలించుకొనగా, సుశేనుడు సంజీవనీ లేపనము చేయగా లక్ష్మణుడు సజీవుడై లేచాడు."
తర్వాత శ్రీ నాగ సాయిబాబా  తాను  రచించిన "వీక్షణం" పాటను శ్రావ్యంగా ఆలపించారు. 
అనంతరము రామాయణం గురించి జరిగిన చర్చలో ప్రధాన అంశము యుద్ధానంతరము సీత అగ్ని ప్రవేశము. ఈ విషయముపై చర్చ వాడిగా, వేడిగా జరిగినది. 
రెండవ ప్రసంగము లెనిన్ గారు ఆత్మ పై చేసిన ప్రసంగము. వారి ప్రసంగ విశేషములు: "రామాయణ మహభారతాలలోని ఆత్మ ప్రతిబింబం మన నిజ జీవితములో కనబడుతుంది. ఈ రెండు మహాకావ్యాలలోని పాత్రలు మన నిజ జీవితములోని మానవ భావ, వ్యసన, వ్యాకుల, మోహములకు ప్రతిబింబించే తత్త్వాలు. రామాయణము మానవ సంబంధాలకు ప్రతీక. రాముడు అనేది మనలోని ఒక ఆత్మ, సంస్కృతి, సంస్కారము.  సీత అంతరాత్మ, మనము మన తల్లి దండ్రులు, పూర్వీకుల దగ్గర నుండి  సంక్రమించుకున్న వ్యక్తిత్వము. మనము ఇతరులతోనూ, భావి తరాలతోనూ ఏర్పరుచుకునే సంబంధ, భాంధవ్యాలకు ప్రతీక. లక్ష్మణుడు మన నీడ. మన వెంట ఎప్పుడూ ఉంటాడు. మనము చేసే పనులు ప్రభావము, మనలని ఎప్పుడూ వెన్నంటి నడుస్తూనే ఉంటుంది. రామునిలోనూ, మనలోనూ ఉండే దృఢ నిశ్చయత్వానికి ప్రతిబింబం హనుమంతుడు. మన అందరిలోని సామూహిక ఆలోచనా శక్తి సుగ్రీవుడు. మనలోని మూర్ఖత్వం, మొండితనాలకు ప్రతీక వాలి. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలకు ప్రతీక  రావణుడు. వీటి అన్నిటితోనూ కలసి జరిగే ప్రయాణం రామాయణం. వీటన్నిటిపై మనము జపము తోనూ, ధ్యానముతోనూ  జరిపే పోరాటం రామాయణంలోని యుద్ధకాండ. ఈ యుద్ధము తరువాత నీవెవరివో తెలుసుకోవటానికి జరిగే ప్రయత్నమే రామాయణము యొక్క ఆత్మ. వాల్మీకి మహాముని రామాయణం ద్వారా మనకు అందించే సందేశం ఇదే. అందుకే ఆయన చాలా గొప్ప కవి."
తరువాత జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమములో చదివిన కవితలు:
1. వేణుగారు చదివిన గంగిశెట్టి గారి కవిత;   "నా అందమైన దేశంలో ఒకప్పుడు ఆదరాభిమానాలు ..."
2. సాయి బాబా గారి బ్లాండు కవిత్వము
3. ఉదయలక్ష్మి గారి కవిత "నాన్న"
4. కె. గీత గారి కవిత్వము "ఉద్యోగాన్నీ ప్రేమించాలిసిందే "
5. అక్కిరాజు గారి పద్య గానం
6. భాస్కర రావు గారు చదివిన తిలక్ కవిత్వము 
ఆ తరువాత కిరణ్ ప్రభ గారి తెలుగు క్విజ్ కార్యక్రమం ఎప్పటివలనే ఉత్సాహముగా సాగింది. ఒక ఉదాహరణ ప్రశ్న - "నీలుగు + నీలుగు" ఏమవుతుంది?
కాళిదాసు కవిత్వాన్ని "ధార"గా చెప్పగలిగిన వారు శ్రీ చరణ్ గారు మాత్రమే. కవి కాళిదాసు మొదటి సారిగా భోజ రాజాస్థానమున  ప్రవేశించి నప్పటి దృశ్యాన్ని వర్ణించి, ఆ సందర్భములో కాళిదాసు చదివిన ఐదు శ్లోకాలని శ్రీ చరణ్ గారు పఠించి వివరించారు. కాళిదాసు ప్రతిభకు మెచ్చి భోజరాజు ఒక్కొక్క పద్యానికి తన రాజ్యములోని ఒక్కో దిక్కును బహూకరించి, ఐదవ శ్లోకానికి తన సింహాసనాన్నే  ఇచ్చి వేయగా, కాళిదాసు భోజరాజుని వారించి, బ్రాహ్మణులు సింహాసనాన్ని చేపట్ట కూడదని, భోజరాజు పోషణలో ఉండేందుకు సిద్ధపడతాడు. 
Vikshanamఈ  సమావేశంలో శ్రీ వికాస్, శ్రీ శ్రీనివాస్, శ్రీ కృష్ణ మోహన్, కుమారి మాధవి, శ్రీమతి శారద, శ్రీ వేణు ఆసూరి, శ్రీ శ్యామ్ పుల్లెల, శ్రీమతి కాంతి మొదలైన  సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.



http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/nov2016/index.html
http://www.koumudi.net/Monthly/2016/november/nov_2016_vyAsakoumudi_vikshanam.pdf
http://sirimalle.com/SM-old-issues/2016/November/vikshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-నాల్గవ వార్షిక సమావేశం (Sep11, 2016)


వీక్షణం నాల్గవ వార్షికోత్సవ సమావేశం సమీక్ష
- సుభాష్ పెద్దు
వీక్షణం నాల్గవ వార్షిక సమావేశం దుర్ముఖి నామ సం|| భాద్రపద శుద్ధ నవమి నాడు, అనగా సెప్టెంబర్ 11, 2016 నాడు, కిక్కిరిసిన సాహితీ ప్రియుల మధ్య, అమెరికా లోని కాలిఫోర్నియా లోని మిల్ పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది.
సభ కిరణ్ ప్రభ గారి స్వాగత వచనాలతో ఆవిష్కరించబడినది. "సిలికాన్ లోయలోని తెలుగు సాహిత్య ప్రియులకు వీక్షణం ఒక ఆత్మీయ సమావేశం. డా|| కె.గీత గారు ఒక అసామాన్య శక్తి లాగా ఈ వీక్షణాన్ని నడిపిస్తున్నారు, ఆవిడకు అందరి తరఫునా ధన్య వాదాలు" అని తెలిపి ఉదయం సభకు అధ్యక్షత వహించవలసినదిగా తాటిపామల మృత్యుంజయుడు గారిని ఆహ్వానించారు.
మృత్యుంజయుడు గారు ప్రవాస తెలుగు సాహిత్యంలో సైన్సు కథల ఒరవడిని మొదలు పెట్టిన వేమూరి వెంకటేశ్వర రావు గారిని సభకు పరిచయం చేసి, మహాభారతంలో పునరుచ్చరించబడిన సరళిని గురించి ప్రసంగించటానికి ఆహ్వానించారు.
వేమూరి గారి ప్రసంగం: "కొందరు మాత్రమే యుగ పురుషులు. సంఘంలో పేరుకు పోయిన నైతిక నియమాలని కూకటి వేళ్లతో పెల్లగించి వాటికి సరికొత్త భాష్యం చెప్పగలిగిన వారిని యుగ పురుషులు అంటారు. శంకరాచార్యులు ఒక ఉదాహరణ. వారికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే జన్మించిన యుగ పురుషుడు వేద వ్యాసుడు. పరాశర మహర్షి, సత్యవతులకు జన్మించి, ముందు కృష్ణ ద్వైపాయనుడుగా పేరు పొంది తరువాత మనకు వేద వ్యాసుడుగా తెలిసిన యుగ పురుషుడు. వారు వ్రాసిన మహాభారతంలోని కొన్ని వింత సరళులు ఇవి.
ఉదాహరణకు వంశ పారంపర్యముగా పెద్ద కుమారునికి రాజ్యాధికారం దక్కలేదు. ఉదాహరణకు భీష్ముడుకి కాకుండా అతని తమ్ముడు విచిత్రవీర్యునికి రాజ్యం దక్కింది. ఆ తరువాత కర్ణుడికి కాకుండా ధర్మరాజుకి రాజ్యం దక్కింది. ఆ తరువాత ద్రౌపది పిల్లలకెవెరికీ రాజ్యం దక్కకుండా అర్జునుడి మనమడైన పరీక్షత్తుకి దక్కింది.
ఇంకొక బాణీ శంతనుడికి సత్యవతితో వివాహం కాక పూర్వం, గంగ తో ఉన్న పూర్వ వివాహ సంపర్కం వల్ల దేవవ్రతుడు పుడతాడు. అలాగే కుంతికి వివాహం కాక పూర్వమే సూర్యునితో ఉన్న పూర్వ వివాహం సంపర్కం ద్వారా కర్ణుడు పుడుతాడు. అలాగే మహాభారతంలో పలు అంశాలు పునరావృతమయ్యాయి. స్టార్ ట్రెక్ లాంటి సైన్స్ ఫిక్షన్ కథలలో కూడా ఇటువంటి సరళులు కనబడతాయి."
తరువాతి ప్రసంగం వేణు ఆసూరి గారిది. వారు రామాయణ మాధుర్యం గురించి చేసిన ప్రసంగ విశేషాలు: "వాల్మీకి రామాయణంలోని బాలకాండ, అయోధ్యా కాండలలోని కొన్ని మధురమైన ఘట్టాలను, ఆదర్శవంతమైన పాత్రల తీరుతెన్నులను ప్రస్తావించడం జరిగింది. రాముని జననం, విశ్వామిత్రుని యాగ రక్షణ, శివధనుర్భంగం, సీతారాముల కల్యాణం, కైకేయి కోరికపై రాముని వనవాసం మొదలైన ఘట్టాలను, సందర్భోచితంగా వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు ఉపన్యాసంలో చోటు చేసుకున్నాయి. రామకథ కష్టాల పరంపరల వ్యథ అయినా, ఆదర్శవంతమైన పాత్రలు, వ్యక్తిత్వాలతో, అద్భుతమైన రచనతో అలరారే రామాయణసుధ తరతరాలుగా భరతజాతికి నిత్యపారాయణ గ్రంథంగా నిలిచిపోయింది.
రామాయణ కథలోని ఒక విశేషం, కైకేయికి రాముడు అంటే ఎనలేని ప్రేమ. ఆ ప్రేమను మధించింది మంధర. మంధర పర్వతం పాల సముద్రాన్ని మధించినప్పుడు ఎన్నో గొప్ప గొప్పవి లభిస్తాయి. కానీ మంధర కైకేయి మనస్సును మధించినప్పుడు వచ్చిందే రామ కథ."
విశిష్ట అతిథులు గా ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతి, శ్రీమండలి బుద్ధ ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, శ్రీ కోమటి జయరామ్ గార్లు వీక్షణం సమావేశాలకు హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా శ్రీమండలి బుద్ధ ప్రసాద్ గారు శ్రీ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణగారి "తెలుగు సంస్కృతి- శాసనాలు చారిత్రక పరిణామాలు" పరిశోధనా గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆచార్య వేమూరి వేంకటేశ్వర రావు గారు ఈ గ్రంథాన్ని విశ్లేషిస్తూ, "ఇది శాసనాల ఆధారంగా తెలుగు సంస్కృతి పరిణామాలను పరిశీలించిన పరిశోధన గ్రంథం. తెలుగు నాట శాసనాలను, ముఖ్యంగా 6 వ శతాబ్ది నుంచి 16 వ శతాబ్ది దాకా వచ్చిన తెలుగు శాసనాలను, అధ్యయనం చేసి తెలుగు సమాజంలో, సంస్కృతిలో కలిగిన చారిత్రక పరిణామాలను చర్చించే సిద్ధాంత గ్రంథం. సిద్ధాంత గ్రంథమైనా, చేతబట్టుకొంటే వదిలిపెట్ట బుద్ధి పుట్టనంతగా 'చదివించే గుణం ఉంది" అని తెలిపారు. పేరుకు శాసనాలన్నా, అనేక ఇతర ఆధారాలను కూడా తీసుకొని తెలుగు సంస్కృతిని వివరించే ఒక సమగ్ర గ్రంథంగా ఇది రూపొందిందని ఈ గ్రంథాన్ని ఆవిష్కరించిన మాన్యశ్రీ బుద్ధప్రసాద్ గారు పేర్కొన్నారు. సమకాలీన దృష్టితో అలా చరిత్రను చూపినందుకు రచయితను అభినందిస్తున్నానని ముఖ్యఅతిథి శ్రీ బుద్ధప్రసాద్ గారు కొనియాడారు. తెలుగు సంస్కృతిని అభిమానించే ప్రతివారూ చదవవలసిన పుస్తకమని సభాధ్యక్షులు శ్రీ కిరణ్ ప్రభ గారు పేర్కొన్నారు.
ముందుమాటగా ఆచార్య లక్ష్మీనారాయణ గారు రాసిన ఈ మాటలు అందరినీ ఆకట్టుకొన్నాయి:
" హాలికుల హలంతో, భావుకుల భావనాబలంతో
'సృష్టింప'బడేది సంస్కృతి
సైనికుల భుజబలంతో, సంపన్నుల ధనబలంతో
' నిర్మింప' బడేది నాగరకత
ఒకటి చరిత్ర! మరొకటి చరిత! "
ఇంత మంచి పుస్తకాన్ని 'వీక్షణం' వేదిక మీద ఆవిష్కరించడం తమకు గౌరవ కారకమని సభ్యుల పక్షాన సమన్వయకర్త ధన్యవాదాలు తెలిపారు.
ఆచార్య గంగిశెట్టిగారు తెలుగు అక్షరమాల గురించి వ్రాసిన "మన సుభాష" అనే ఒక ముఖ్యమయిన వ్యాసాన్ని కూడా బుద్ధ ప్రసాద్ గారు ఆవిష్కరించారు. 
ఆ తరువాత మండలి బుద్ధ ప్రసాద్ గారు మాట్లాడుతూ: "మనం ఇక్కడ వాళ్ల దగ్గర నుండి కూడా నేర్చుకోవల్సినది ఉంది. ఉదాహరణకు, భారత దేశం శాంతి దేశం. అమెరికా క్రమశిక్షణ కలిగిన దేశం. మా చిన్నప్పుడు సినిమా హాలులో హీరో కనపడితే అరుపులు, ఈలలూ, కాగితాలు చించి ఎగరవేయటం వంటివి చేసేవారు. ఇప్పుడు ఈ చెడు అలవాటు భారత దేశంలో లేదు. అటువంటిది ఇక్కడ తెలుగు వాళ్లు సినిమా హాలులో చేసే అల్లరిలో ఉంది. ఇది చాలా విచారకరం. అందరూ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి, ఇక్కడి క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. అలాగే ఇక్కడి తెలుగు వాళ్లు కులతత్త్వ రాజకీయాలు, ప్రాంతీయ తత్త్వం గురించి మాట్లాడడం విచారకరం" అన్నారు.
వీక్షణం మిత్రుల రచనా సంకలనం-2016, గత సంవత్సరపు వీక్షణం సమావేశాల సంకలనాలను శ్రీ బుద్ధ ప్రసాద్, శ్రీ కోమటి జయరామ్ గార్లు ఆవిష్కరించారు. బుద్ధ ప్రసాద్ గారు మాట్లాడుతూ "భాషా ప్రేమికుడినైన నాకు అమెరికాలో జరుగుతున్న ఇటువంటి సాహితీ సభకు రావటం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంత మంచి సభలు జరుగుతున్నాయంటే నమ్మలేకుండా ఉన్నాను." అంటూ నాలుగేళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న వీక్షణం నిర్వాహాకులకు అభినందనలు తెలియజేసారు. "వీక్షణం మిత్రుల రచనా సంకలనం-2016" మొదటి ప్రతిని శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి కాంతి కిరణ్ దంపతులకు, "వీక్షణం సమావేశాల సంకలనం" మొదటి ప్రతిని శ్రీ పెద్దు సుభాష్ కు బుద్ధ ప్రసాద్ గారు అందజేశారు. 
ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు రచయితల అంతర్జాల భాండాగారం "తెలుగు రచయిత" వివరాలను, అందుకు సహకరిస్తున్న గాటా సభ్యులను అధ్యక్షురాలు డా.కె.గీత పరిచయం చేశారు. "తెలుగు రచయిత" పై ప్రతిస్పందిస్తూ బుద్ధ ప్రసాద్ గారు అంతర్జాలంలో రచయితల వివరాలు ఎక్కడా లభ్యం కావడం లేదన్న తన స్వానుభవాన్ని వివరిస్తూ "తెలుగు రచయిత" ఆ లోటు ని భర్తీ చేయడానికి పూనుకోవడం మహత్తరమైన విషయమనీ, అందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పక అందజేస్తామనీ సభా ముఖంగా మాటిచ్చారు. అదే సందర్భంలో ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు "తెలుగు రచయిత" కు తమ వంతు తోడ్పాటుగా యాభైవేల రూపాయల చెక్కును బహూకరించారు.
శ్రీ కోమటి జయరామ్ గారు మాట్లాడుతూ వీక్షణానికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. తమ చేతుల మీదుగా శ్రీ బుద్ధ ప్రసాద్ గారిని సన్మానించారు.
భోజన విరామ ప్ర్రారంభంలో వీక్షణం నిర్వాహకురాలు శ్రీమతి కె. గీత దేవులపల్లి వారి "అనరాదా మనసారా" లలితా గీతాన్ని అత్యంత వీనుల విందుగా ఆలపించి సభను అలరించారు.
భోజన విరామానంతరం మొదటి వక్త అనిల్ రాయల్ గారు తను కథలు ఎందుకు వ్రాస్తున్నానో వివరిస్తూ "నేను ఎవరికోసమో, ఎవరినో ఉద్ధరించటానికో, ఏదో ప్రయోజనం ఆశించో కథలు వ్రాయటంలేదు. నేను కేవలం నాకు నచ్చినట్లే, నా సంతృప్తి కోసమే వ్రాస్తున్నాను. అటువంటి సంతృప్తి ఉన్నప్పుడే కథ నాది అవుతుంది" అన్నారు.

ఆ తరువాత సురేంద్ర దారా గారు తమ హాస్య ప్రసంగంలో అమెరికాలోని భారతీయ కిరాణా దుకాణాలలోని మురికిని పరిహసించారు.
మధ్యాహ్నం సదస్సు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, శ్రీ మహమ్మద్ ఇక్బల్ గార్ల అధ్యక్షతన కొనసాగింది. అధ్యక్షుల వారి ఆహ్వానంతో రావు తల్లాప్రగడ గారు చేసిన మొదటి ప్రసంగం "సీతమ్మ గారి తత్త్వాలు". "సత్యాత్మ జ్ఞాన యోగ సాధన మోక్ష గ్రంథం" లో పొందు పరచబడిన సీత్తమ్మ గారి తత్త్వ జ్ఞానం గురించి వారి ప్రసంగ విశేషములు: "మనకి తత్త్వాలు అంటే మొదట గుర్తుకు వచ్చేది బ్రహ్మంగారు, వేమన, చెన్నయ్య దాసు వంటి వారు. వీరు విభిన్నమైన సరళులతో తత్త్వ జ్ఞాన్నాన్ని మనకు అందించారు. ఆ కోవకే చెందిన మహానుభావురాలు సీతమ్మ. వారు 1921వ సం|| చెరుకూరి బ్రహ్మయ్య, శ్రీరామమ్మ దంపతులకు కృష్ణా జిల్లా పెన్మత్స గ్రామంలో జన్మించారు. ఆ నాటి కాలాచారాలని బట్టి బాల్య వివాహం, ఆ తరువాత ఆవిడ 18 ఏళ్ల వయసులోనే భర్త మరణంతో పుట్టింటికి రావడం జరిగినవి. ఈ ఆపత్కాలంలో సీతమ్మ గారిని దండమూడి పూర్ణయ్య గారు ఆధ్యాత్మిక యానం వైపు నడిపించారు. ఆవిడ 10 రోజులలో వేదాధ్యాయనం పూర్తి చేసి, సూర్యజపం ఆచరించి, రామ కోటిని పూర్తి చేసి భద్రాచల రామునికి అర్పించారు.
ఆవిడకు రెండవ గురువు కమ్ముల అప్పన్న. ఆయన దగ్గర యోగాభ్యాసం చేసి నిమ్మకాయ నీరు మాత్రమే త్రాగుతూ అన్నపానాదులను మాని వేసింది. కుండలినీ యోగము కూడా సాధించారు. ఆ తరువాత మాల పిచ్చమ్మ గారి ఆశీర్వచనంతో సీతమ్మగారు సవికల్ప సమాధిలో గడిపారు. ఆ తరువాత తీవ్ర సమాధిలో గడిపిన సీతమ్మ గారు తత్త్వాలు ఒక కాగితం మీద వ్రాసి గదిలో నుండి బయటకు విసిరేవారట. ఆ తత్త్వాలకు యతి ప్రాసలు పాటించారు. రాగం, తాళం కూడా ఆ కాగితం మీదే వ్రాసేవారు. కానీ సీతమ్మగారు పాడిన దాఖలాలు అయితే ఏమీ లేవు.
రావు తల్లాప్రగడ గారు సీతమ్మ గారి తత్త్వాలను పాడి వినిపించారు. ఆ తత్త్వాలు:
1. రవ్వలు చెక్కిన ముత్యాల పంపున ..
2. అమ్మవైన ఆ నీవేనమ్మా మహాయోగి
3. చూడ చక్కని చిన్నది
4. జయ జయ యోగి, జయ మహా యోగి
తర్వాత జరిగిన కిరణ్ ప్రభ గారి తెలుగు సాహితీ క్విజ్‌తో సభికులను కిత కితలు పెట్టి, కొత్త విషయాలు తెలియబరిచి, ఉత్సాహపరిచి వీక్షణం సమావేశానికి నిండుదనం తెచ్చారు. ఈ సారి కూడా ఈ క్విజ్ కార్యక్రమం అత్యుత్సాహంగా జరిగింది.
తర్వాత శ్రీమతి కొండేపూడి నిర్మల గారు తెలుగు సాహితీ ప్రపంచములో స్త్రీ చైతన్యాన్ని, వారి కృషిని, గత నాలుగు దశాబ్దాల కాలములో వచ్చిన పరిణామాలను విశ్లేషిస్తూ, చేసిన ప్రసంగం: "11వ శతాబ్దంలోని దళిత కవయిత్రి మొల్ల దగ్గర నుంచి 1882 లో పుట్టిన సుగార్ హుమాయూన మీరాజ్నుంచి ఇవాళ్టి షాజహానా వరకూ, కుల, మత, పితృస్వామ్య భావజాలమే తమ ప్రధాన శత్రువు అని గుర్తించాలి. గత నాలుగు దశాబ్దాల కాలం స్త్రీ కవిత్వంలో ముఖ్య దశ. తెలుగులో అస్తిత్వవాద కవిత్వానికి బలమైన ప్రతినిధి రేవతీ దేవి. ‘’ నేనెవరినో మీకు తెలియదు/ఆర్తి సెగతో ఎర్రగా జీవించే నీలం నిప్పు రవ్వని" , ఆదూరి సత్యవతి "అలాగే ఎప్పుడూ ఏదో ఒక మూల నాలో జరుగుతూ వుంటుంది / ఒక దీపతోరణ జ్వలనోత్సవం" అంటూ ఉదహరించారు.
1970లలో రచయిత్రులుగా స్త్రీలు తామేమిటో నిర్వచించుకునే తొలి ప్రయత్నాలు పార్రంభించారు. ఓల్గా 1972 లో రాసిన ప్రతి స్త్రీ నిర్మల కావాలి అన్న కవిత ఇందుకు బలమైన ప్రతినిధి.
1980లలో దళిత స్త్రీవాదం ప్రాముఖ్యం సంపాదించుకుంది. కొలకలూరి స్వరూప రాణి నగ్న దేహము జూడగ భాయో/ ద్విగ్నమతివై పోతివందురు/ చోద్యమ౦తకు క్రితము ఎన్నడూ/ చూడనే లేదా? అని ప్రశ్నిస్తుంది. మైనారిటీ స్త్రీ వాద కవిత్వానికి పలువురు ప్రతినిధులు. పరధాను వాజిదా ఖాటూస్ అనే కవయిత్రి , బాల్యం లోనే నిఖాచేసి /దూరం చేశారు నీ బాల్య మధుర స్మృతిని/కట్టుభాట్ల పేరుతో నీ అభివృధిని సఫాచేసి తెచ్చారు నిన్ను హీన స్థితికి" అన్నారు. అంటూ కొనసాగించారు.
ఆ తర్వాత ప్రసంగించిన చుక్కా శ్రీనివాస్ బాలగోపాల్ రూపం- సారం పుస్తక పరిచయం చేస్తూ " సాహిత్యం జీవితమంత విస్తృతమైంది ఆంటారు బాలగోపాల్. సాహిత్యానికి - ముఖ్యంగా కథా సాహిత్యానికి - మానవ సంబంధాల సామాజిక విశ్లేషణ మూల వస్తువు; సాహిత్యాన్ని సాహిత్యం చేసేది రూపమే అని వివరిస్తూ, జీవితంలో ఖాళీలు పూరించడమే సాహిత్యం విశిష్ట పాత్ర అంటూ ఒక లోతైన తాత్విక దృక్పధం మన ముందు ఉంచుతారు." అన్నారు. "బాలగోపాల్ 1908-2009 ల మధ్య వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల పై ఆలోచింపజేసే అభిప్రాయాలను వ్యక్తపరిచారు. గణిత శాస్త్రజ్ఞుడు, న్యాయ వాది అయిన ఆయన విషయాలను శాస్త్రీయంగా నిరూపించారు. తెలుగు సాహితీ చరిత్రకు ఒక కోశాంబి ని పరిచయం చేశారు." అంటూ ప్రసంగించారు.
కవిసమ్మేళనానికి శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ అధ్యక్షత వహించారు. సంస్కృతాంధ్ర పండితులు, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ అయినా శ్రీ వెంకట శివయ్య గారు ఈ కవిసమ్మేళనంలో ముందుగా పాల్గొనడం విశేషం. శ్రీ తుర్లపాటి రామానుజ రావు "రూపాయి" మొదలయిన కవితలను, శ్రీ మతి రాధిక "మొక్కలకు శ్రీకారం", శ్రీ నాగ సాయిబాబా "తకల్లుస్ ", డా||కె.గీత "రెక్కచాటు గెలుపు", శ్రీమతి నిర్మల "అద్దం", శ్రీ రావు తల్లాప్రగడ సనాతనీ శివాని మంగళం అంటూ కవితలను వినిపించగా, శ్రీ వరకూరు గంగా ప్రసాద్ రచించిన పాటలను వారు కుమార్తె ఈశా రాగయుక్తంగా పాడి అందరినీ అలరించింది. శ్రీ వనపర్తి సత్యనారాయణ ఈ సందర్భంగా సూఫీ తత్త్వాన్ని గురించి చక్కని పద్యాలతో వివరించారు. చివరగా అధ్యక్షులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ తమ విశిష్ట పద్య పాటవంతో అందరిని ముగ్ధులను చేశారు.
చివరగా శ్రీ కిరణ్ ప్రభ "విశ్వనాథ వారి చివరి నవల "కుక్కగొడుగులు" గురించి ఆలోచనాత్మక ప్రసంగం చేయగా, శ్రీ చరణ్ 'వేదము - పరమాత్మ సాహిత్య సౌందర్యము' అనే అంశం పై
"ఆత్మ జ్ఞాన ప్రశ్న పరంపర - అవ్యక్త కావ్యాలంకారము. వేదములో సూక్ష్మముగా, పరోక్షంగా అంతర్లీనమై ఉన్న ఎన్నో ప్రక్రియలలో ఒకటైన కావ్య సౌందర్యము" అంటూ ప్రసంగించారు.
చివరగా వందన సమర్పణ సమయంలో శ్రీ చిమటా శ్రీనివాస్ వీక్షణానికి మైకు సెట్ ను బహూకరించారు. శ్రీ లెనిన్, శ్రీ గుత్తా రాజశేఖర్రావు, శ్రీ భాస్కర్ కూరపాటి, శ్రీ ప్రసాద్ నల్లమోతు, శ్రీ వేమూరి శ్రీ రామ్, శ్రీ సుభాష్ పెద్దు ,శ్రీ సత్యనారాయణ, శ్రీ కోట రెడ్డి, శ్రీమతి ఉమ, శ్రీమతి షర్మిల, శ్రీమతి కాంతి, శ్రీమతి మాధవి కడియాల, శ్రీమతి షంషాద్, శ్రీమతి శారద, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి మంజుల జొన్నలగడ్డ, శ్రీమతి హేమలతా దేవి, శ్రీమతి సరస్వతి, శ్రీమతి విజయ మొ.న వారు హాజరైన ఈ సభ ఉదయం నించి సాయంత్రం వరకూ సాహితీ విందును పంచుతూ ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/oct2016/veekshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-48 (Aug14, 2016)


వీక్షణం సాహితీ సమావేశం - 48
- పెద్దు సుభాష్
వీక్షణం 48వ సమావేశం శ్రీమతి వేమూరి ఉమ, శ్రీ వేంకటేశ్వర రావు గారి స్వగృహమున దుర్ముఖి శ్రావణ ఏకాదశి నాడు, అనగా ఆగస్టు 14, 2016 నాడు జరిగినది. నాలుగు సంవత్సరాల క్రితము, వీక్షణం ప్రారంభ వేదిక వేమూరి వారి లోగిలి. సభ ప్రారంభిస్తూ వేమూరి వేంకటేశ్వర రావు గారు, వీక్షణం నిరాటంకముగా జరగటానికి గీత గారి పట్టుదల, కార్య దక్షత అని కొనియాడారు.

వేంకటేశ్వర రావు గారు వారి భారత దేశ పర్యటన అనుభవాలు పంచుకుంటూ, అక్కడ జరుగుతున్న సాహితీ సమావేశాలకి, వీక్షణం సమావేశానికి గల వైవిధ్యాలను వివరించారు. భారత దేశములో జరిగే సాహితీ సమావేశాలలో సాధారణముగా ఒక్క విషయము మీద మాత్రమే చర్చ జరుగుతుంది. అంటూ వీక్షణం లో వైవిధ్య కార్యక్రమాలు జరగడం విశేషం అన్నారు.
ఈ సమావేశములోని మొదటి కార్యక్రమం తుర్లపాటి రామానుజరావు గారి "ఉదయాన్నే వెలసిన వర్షం" కవితా సంకలనం, పుస్తక ఆవిష్కరణ. ఈ పుస్తకములో తెలుగు కవితలు, ఆంగ్ల కవితలు, కొన్ని కవితానువాదాలు ఉన్నాయి. ఈ పుస్తకానికి ముందుమాట వ్రాస్తూ, ఆచార్య గంగిశెట్టి గారు చెప్పిన మాట "ఆర్ద్రతే ఇతని రస దృష్టి" అని కొనియాడారు.
ఈ పుస్తకాన్ని మొదట సమీక్షించిన వారు శ్రీ వేణు ఆసూరి గారు. ఆయన ప్రసంగ విశేషములు: "రామానుజా రావు గారి కవితలు మనము ప్రతి రోజూ చూసి, గమనించే విషయాలు. ఉదాహరణకు ఒక ప్రయాణం, వర్షం కురిసిన రాత్రి, నిజ జీవితములోని ఒక ఘోర కృత్యం, లేక ఒక అందమైన అమ్మాయి. ఆయనది నిజాయితీ కలిగిన కవితా రీతి. కదిలిపోయిన గుండెల్లోని భావా లకి, మనసులోని ఆనందానికీ అక్షర రూపం. లోతైన భావాలకోసం ప్రాకులాట లేని కవితలు సహజంగా, సున్నితంగా, తడుముకోకుండా వెలువడ్డ భావాలు. అందుకే చదవడానికి హాయిగా ఉన్నాయి." ఆ తరువాత పుస్తకములోని కవితలను కొన్నిటిని ఉదహరించారు.
రామానుజం గారి ఉదయాన్నే వెలసిన రాత్రి కవితా సంకలానానికి రెండవ సమీక్షకులు అక్కిరాజు సుందర రామ కృష్ణ గారు. వారి ప్రసంగ విశేషములు: ""తుర్లపాటి "వారి "ఉదయాన్నే వెలసిన వర్షం "కావ్యావిష్కరణలో నేనూ సమీక్షకుడిని గావడం ఆనందంగా వున్నది. రాయల వారి ఆస్థానములో వడ్డిచర్ల తుమ్మయ్య అనే కవి కంద పద్యాలతో వర్షం గురించి రచించాడు. తరువాతి కాలంలో జాషువా వర్షం గురించి పద్య కవిత్వం చెప్పారు. ఈ కాలములో రామానుజం గారు వర్షం గురించి వచన కవిత్వం చెప్పారు. ఈ పుస్తకానికి చక్కని పీఠికలు గంగిశెట్టి గారు, అరణ్య కృష్ణ గారు వ్రాసారు. కవులన్న నిత్య మానస సరోవర రస ప్రియత్వం కలిగిన వారు. ఈ లక్షణం తుర్లపాటి వారిలో కనబడుతుంది. పొడి పొడి మాటలు, కాల్పనిక ధోరణి లేకుండా ఉంది వారి కవిత్వం. "రామానుజరావు "గారు నిస్సంశయంగా గొప్ప భావుకుడు, కవితాత్మ తెలిసిన వ్యక్తి . భాష,శైలి ఆలోచనా సరళి అన్నీ ఒక అనుభూతిని కలిగించేవిలా ఉన్నాయి.
"అభినందనీయుడు తుర్లపాటి"
సీ.రమణీయ భావాల కమనీయ దృశ్యాల
చిత్రణన్ చెలువంపు శిల్పివీవు
ఎదహత్తుకుని పోవు పదబంధ సృష్టిలో
సుకవి "బాపన్నకు"నకలు వీవు
ఆంధ్రామ్ గ్లముల యందు ననఘులౌ కవి పాళి
నాడి బట్టిన యట్టి వాడ వీవు
"నిర్మల"హృదయాన నిరతమ్ము వర్తించు
శాంత చిత్తుడవైన సఖుడ వీవు
అరయ నిన్ను "రామానుజుం"డనుట కన్న
అతని అగ్రజుడై ధాత్రి నలరినట్టి
శాంత గుణు డైన "శ్రీరామ చంద్ర మూర్తి
వనుచు భావింప పాడిలే అఖిల గతుల !
భావ కవిత్వపున్ లతల పాదుల కెందరొ నీరు పోయ,పుం
భావ సరస్వతుల్ ఘనుల ,ప్రాజ్ఞుల,ఆలన పాలనన్,కమ్మనౌ
తావులునల్దెసల్ గురిసె దండిగ తొల్లి దినాల,ఆ పయిన్
"బావ "లు,అక్కలున్,సకల బంధులు పెంచిరి దీనినిమ్ముగాన్!
బావ అంటే ("బాపి బావ")
అని .....ఒకానొక సందర్భంలో భావ కవిత్వం గూర్చి అన్నాను ...అదిగో ...
ఏనదె గంటి నా కవుల ఇంపగు ఛాయలు ,నీదు కైతలన్;
వాణి కృపా కటాక్షము ,అపారము నీకది నిక్క మిద్ది ,నీ
వైనము ,భావ పుష్టి కడు ప్రస్తుతి పాత్రము "తుర్ల పాటి ,రా
మానుజ"!మిత్రమా వరలుమా ధర నిట్టులె నూర్వసంతముల్!
"సుందర రామానుజ"!కవి
బృంద మ్ముల నిశ్చయముగ ఈడ్యుడ వేరా!
విందొన గూర్చెను నీ పద
బంధమ్ములు శైలి ,భాష ,వన్నియ లెల్లన్ ! "
తదుపరి, అంతకు ముందు రోజు మరణించిన శ్రీ ఆవంత్స సోమసుందర్ గారికి సంతాపముగా సభ ఒక నిమిషము మౌనము పాటించినది. సోమసుందర్ గారి గురించి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ చేసిన ప్రసంగము: "కవి లోకం అంతా గౌరవించే ఒక దూత రాలిపోయారు. ఆధునిక కవులలో ఆయన అందరికంటే పెద్దవారు. ఆయనది అభ్యుదయ కవిత్వం. శ్రీ శ్రీ గారి తర్వాత ఒక గొప్ప అభ్యుదయ కవి ఆవంత్స సోమసుందర్ గారు. వారి వజ్రాయుధం ఒక దూకుతున్న జలపాతం. ఆయన రాసిన వృత్త ఛందస్సులో ఒక గొప్ప ప్రయోగం శ్రీ వృత్తం. ఎమర్జన్సీ ని మొదటిలో సమర్ధించటం వలన ఆయన ప్రభావం కొంత తగ్గింది. కానీ గొప్ప సృష్టి యొక్క ప్రభ తగ్గదు. ఆయనకి విజ్ఞాన ట్రస్టు వారి పురస్కారం, సోవియట్‌లాండ్ వారి పురస్కారం మొదలైనవి లభించినాయి. వజ్రాయుధం కవి వెళ్లిపోయారు కాని వజ్రాయుధం ఎప్పుడూ ఉంటుంది. తరువాత శ్రీ ఆవంత్స సోమసుందర్ తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని తల్చుకుంటూ డా కె.గీత ఎప్పుడూ ఎంతో ఆత్మీయంగా "అమ్మాయ్ గీతా " అని పిలిచే ఆత్మీయ పిలుపుని కోల్పోయానని అన్నారు. తన కవిత్వాన్ని చదివి ఆయన ఎంతో మెచ్చుకునే వారని గుర్తు చేసుకున్నారు. సభకు వారి వజ్రాయుధం నించి తోలి కవితను చదివి వినిపించారు.
ఆ తరువాతి కార్యక్రమం కిరణ్ ప్రభ గారి క్విజ్. వీక్షణం సమావేశంలో అందరూ ఎదురు చూసే తెలుగు జిమ్నాస్టిక్స్ ప్రక్రియ.
కవి సమ్మేళనం లోని కవితలు:
1. రామానుజా రావు గారు: యోసమైటీ, ఉదయాన్నే వెలసిన వర్షం
2. శ్రీ చరణ్ గారు: కృష్ణా పుష్కరాలు, ఆంజనేయ స్వామి మీద పద్య కవిత్వం
3. అక్కిరాజు సుందర రామ కృష్ణ గారు: తమ కృత్తివాస శతకము నుండి చదివిన పద్యములు - జ్ఞానమటన్న, అంబకు పాదదాసుడు మొదలైన పద్యములు
4. వేణు ఆసూరి గారు పాడిన మహాభారతములోని పద్యాలు - తనయుల వినిచిదెవో, కుప్పించి యెగసిన
5. కె. గీత గారు: "జాబిల్లి చేవ్రాలు" కవిత
తరువాతి కార్యక్రమం అన్నే లెనిన్ గారు రచనల్లో "ఆత్మ" గురించి మాట్లాడుతూ "ఆత్మ అనేది అర్ధం అవుతున్నట్లుంటుంది, కానీ అర్ధం కాదు. ఉదాహరణకు అక్కిరాజు రమాపతి గారి కథ లో ఒక దూర ప్రాంతములో ఉంటున్న తండ్రి కూతుళ్ల ఆత్మ ఘర్షణ" అన్నారు.
చివరిగా వేమూరి వేంకటేశ్వర రావు గారు వీక్షణం కార్యక్రమాలు మెరుగు పరచటానికి అభిప్రాయ సేకరణ చేసారు. సభలోని వారు వీక్షణం నిర్విరామముగా, చక్కగా జరగడానికి ముఖ్య కారణమైన అందరికీ అభినందనలు తెలియజేసారు. అమెరికాలో వీక్షణం వంటి తెలుగు సాహిత్య సభ జరగటము, ఆ మూడు గంటలు మనకి ఇష్టమైన మనుష్యల మధ్య హాయిగా జరగటము ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అంతా అన్నారు. వీక్షణములో ఒకే విషయంపై లోతుగానూ, దీర్ఘముగానూ చర్చిస్తే బాగుంటుందని, యువతకు, బాలలకు తెలుగు సాహిత్యం మీద అభిరుచి పెంపొందించి, వీక్షణము వంటి సభలలో పాల్గొనటము చేస్తే, ఆ తరువాతి తరానికి చెందిని సాహిత్యానికి పునాదులు చేకూరతాయని వచ్చిన సలహాలను తప్పక పాటిస్తామని డా కె.గీత హామీ ఇచ్చారు.
సెప్టెంబర్ నెల 11 న, రెండవ ఆదివారం నాడు జరగబోయే వీక్షణం నాలుగవ వార్షిక సమావేశాన్ని అంతా జయప్రదం చేయవలసిందిగా కోరారు.
http://www.koumudi.net/Monthly/2016/september/sept_2016_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/sep2016/veekshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-47 (Jul10, 2016)


వీక్షణం సాహితీ సమావేశం -47
- పెద్దు సుభాష్
వీక్షణం 47వ సమావేశం శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు, వారి కుమారులు శ్రీ వంశీ స్వాగత వచనాలతో ఆరంభించబడింది.
ఈ సమావేశమునకు శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశారంభం, చిన్నారులు శృతి, మాధవుల "ఆరు కోట్ల ఆంధ్రులు, జయ తెలుగు తల్లి" ప్రార్ధనా గీతంతో జరిగినది. వీక్షణం సమావేశములో పది, పన్నెండేళ్ల చిన్నారులు పాల్గొనడం, చక్కని లయతో పాడడం, అమెరికాలో తెలుగు ఝరి కొనసాగడానికి ఒక శుభ సంకేతం.
మొదటి ఉపన్యాసకర్త శ్రీ కల్లూరి సత్యరామ ప్రసాద్ గారు. ఆయన వృత్తి రీత్యా ఇంజినీర్, ఆయన ప్రవృత్తి మాత్రం త్యాగరాజ ఆరాధన. సత్యరామ ప్రసాద్ గారిని పరిచయం చేస్తూ, వారి కుమార్తె శ్రీమతి సత్యవాణి "మా నాన్నగారు నాకు సంగీతం నేర్పించటమే కాకుండా, నేను హైస్కూల్ చదువుతున్నప్పుడు తిరువాయూర్ తీసుకువెళ్లారు" అని చెప్పారు.
సత్యరామ ప్రసాదు గారి ఉపన్యాసం "కవిగా త్యాగరాజు". వారి ఉపన్యాస విశేషములు:
"అందరికీ త్యాగరాజు రామభక్తునిగాను, సంగీతకారుడిగాను పరిచయం, ఆయన కవిత్వములోని సాహిత్య విలువలు ప్రముఖముగా ప్రస్తావించకపోవటానికి పలు కారణములు. గాయకుడి స్వరాటోపములోని హడావిడిలో సాహిత్యం గురించి అంత పట్టించుకోకపోవటం ఒక ముఖ్య కారణము కావొచ్చు. త్యాగరాజు ఆంధ్ర దేశమునకు సుదూర ప్రాంతములో ఉండటం, దక్షిణాది సాహిత్యకారులయందు చిన్న చూపు ఉండటం కూడా కారణాలు కావొచ్చు.
కవిత్వం 2 రకాలు - వస్త్వాశ్రయం (Objective Poetry) ; ఆత్మాశ్రయం (Subjective Poetry). త్యాగరాజ కవిత్వం ఆత్మాశ్రయ పద్ధతిలోనే జరిగినది. ఆత్మాశ్రయంలో భక్తుడి బాధలు, తపన, దేవుడితో సంభాషణ, చనువు మొదలైనవి ఉంటాయి. ఆయన పాటల్లో దాదాపు 85 శాతం తెలుగు, మిగతావి సంస్కృతం అని చెప్పచ్చు.
త్యాగరాజ కీర్తనలలోని లక్షణాకృతిని ‘సొగసుగా మృదంతాళము’ అనే కృతిద్వారా తెలుసుకోవచ్చు. అవి-
1) వస్తువు - నిగమశిరోర్థము కలిగిన వాక్యాలు - వేదాంత వాక్యాలు
ఉదాహరణలు:
* ‘శాంతము లేక సౌఖ్యము లేదు!’ (సామ) - ‘అశాంతస్య కుతః సుఖమ్’ - గీత 2-66
* ‘చెడే బుద్ధి మానురా!’ (అఠాణా) - ‘వాసుదేవః సర్వమ్’ - గీత 7-19
* ’వేదావినాశినమ్’- గీత 2-21; ‘అథ చేత్త్వమిమమ్ - గీత 2-33’; ‘స్వధర్మే నిధనం శ్రేయః’- గీత 3-35 (ఇవన్నీ ’బాగాయెనయ్య!’ అనే చంద్రజ్యోతిరాగకృతిలో)
2) నిజవాక్కులు - స్వంతమైన, అనుభూతితో కూడిన మాటలు
* తెలుగు కానీయండి, సంస్కృతం కానీయండి, ఆయన మాటలను సృష్టించడంలో దిట్ట. చంద్రుడనే మాటకు మనం సాధారణంగా వినే పర్యాయపదాలేమిటి? ‘చందమామ, నెలరాజు, కలువరేడు’ - ఇలాంటివే కదా! మరి ఆయన వాడిన పదాలు - ‘చుక్కలరాయడు, భేశ, విధు, భరాజ’ మొ.వి.
అలాగే సూర్యుడికి - ‘దినమణి, ద్యుమణి, తరణి, మిత్ర’ మొ.వి ; దశరథుడికి - ‘పంక్తిరథుడు’
3) యతివిశ్రమ సద్భక్తి (యతి, ప్రాస మొదలైన నియమాలను - పద్యాలలో ఉన్నట్లుగానే పాటించడం)
‘యతి, 2వ అక్షరం ప్రాస స్థానం, ప్రాసయతి’ - వీటిని ఆయన విధిగా పాటించాడు. పల్లవికీ అనుపల్లవికీ ప్రాసనియమం పెట్టుకున్నాడు; పల్లవిలోను, అనుపల్లవిలోను, తిరిగి ఒక్కొక్క చరణంలోను మళ్ళీ యతిప్రాసలను పాటిస్తాడాయన.
4) ద్రాక్షాపాకంలో కవిత్వాన్ని చెప్పడం
*ఆయన రచనలు సులభబోధకాలు; చదువుకోనివాళ్ళు కూడా హాయిగా పాడుకో గలిగే పాటలు ఎన్నో, ఎన్నో!

*‘మాటల్లో పొదుపు, పొందిక’ - ఉదాహరణలు: మోడి, వగ, జాలి, కేరు మొదలైనవి
*సామెతలు - సామెతలు: "గణనాథుని చేయబోవ కడు వానరుండై తీరెగా", "వరభక్తవేషము వేయు వేళ వర్జ్యకాలమేమో?", "ఎంతవారలైనా కాంతదాసులే!"
5) సందర్భోచితంగా తగిన రసాన్ని ప్రదర్శించడం
‘కళ్ళకు కట్టినట్లుగా పదచిత్రాలను మన ఎదుట ఉంచడం’ అనే ప్రక్రియ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
‘అలకలల్లలాడగ గని’ అనే మధ్యమావతికృతిలో రాముడి ముంగురుల కదలికను కట్టెదుట చూపాడాయన!
6) అలంకారాలు, ఆలంకారికత
‘రామ! నీ సమానమెవరు?’ (ఖరహరప్రియ)లో అనన్వయాలంకారం (నిరుపమ) దాగి ఉంది.
ఇక, శబ్దాలంకారాల విషయానికొస్తే ఎవరో అన్నట్లుగా ‘అంత్యప్రాసలరేడు’ నిన్నటితరంలో ఆరుద్ర అయి ఉండవచ్చుగాక! ఆద్యుడు మాత్రం పోతనగారే, ఆ తరువాత గురువును మించిన శిష్యుడు త్యాగయ్యే!
‘విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు’ అని ఒక విధమైన ధారలో పోతనగారంటే, ‘శ్రీధామా! నాతో వాదమా? నే భేదమా? ఇది మోదమా?’ అంటాడు భక్తిరసధార ముప్పిరిగొన్న ఒక వేళలో స్వామి!"
తదుపరి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి "ఆధునికత-సమకాలీనత" గ్రంథం శ్రీ గంగిశెట్టి గారి కుటుంబ సభ్యులందరితోనూ ఆవిష్కరించబడినది. డా|| కె.గీత, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ వేణు ఆసూరి, శ్రీ చరణ్ వీక్షణం తరఫున తొలిప్రతినందుకున్నారు.
"ఆధునికత-సమకాలీనత" ఒక ఉద్గ్రంథం. పలు ప్రౌడ వ్యాసాల సంకలనం. ఈ గ్రంథం రావటానికి కారణం చెప్తూ శ్రీ గంగిశెట్టి " వీక్షణం సాహితీ సమావేశాల స్ఫూర్తి తో, నేను చేసిన పరిశోధనలను, గతములో పలు సభలలో చేసిన ప్రసంగములను విస్తృత పరిచి, 40 వ్యాసాలుగా పొందుపరిచిన గ్రంథమే ఈ "ఆధునికత-సమకాలీనత " అన్నారు. ఈ సందర్భంగా వీక్షణం సమన్వయ కర్త డా|| కె.గీత ను "లేడీ నెపోలియన్ బోనపార్టీ" గా అభివర్ణించారు.
ఇంతటి ఉద్గ్రంథాన్ని సభకు పరిచయం చేయటానికి ఉద్దండులే కావాలి. అదృష్టవశాత్తు సిలికాన్ వాలీలో తెలుగు ఉద్దండులు చాలా మందే ఉన్నారు. గ్రంథ పరిచయం చేసిన మొదటి వారు శ్రీ వేణు ఆసూరి గారు.
వారి ప్రసంగ విశేషములు:-
"ఈ పుస్తకం గురించి ప్రసంగించటానికి అనుభవ లేమితో ఒప్పుకున్నాను. ప్రతి వాక్యము ఆలోచింప చేసేది. ఆధునికత - ఒక నిర్దిష్ట కాల పరిధిలో వచ్చిన భావతత్వాలకు, ప్రయోగాలకు మాత్రమే సంకేతంగా నిలిచే పేరది. మూడు మహా విప్లవ పోరాటాల భావ ఫలితాలను సమన్వయించుకొని ఒక నూతన నాగరికతను సృష్టించి, ప్రథమ ప్రపంచ యుద్ధం మిగిల్చిన భీభత్స అనుభవంతో ముగింపుపాలైన భావన్విత దశే ఆధునికత.
ప్రపంచ చరిత్రలో ఆధునికత మూలాలు పాశ్చాత్య దేశాలలోని 18, 19, 20వ శతాబ్దముల లోని విప్లవాలు.
అమెరికా విప్లవం - ప్రజాస్వామ్యం (1763 - 1787)
ఫ్రెంచి విప్లవం - స్వేచ్ఛ (1788 - 1804, ఇన్ థ్రీ ఫసెస్)
రష్యా - కమ్యూనిజం/సోషలిజం (1887 - 1917)
ఆధునికత అనగా నవ్యత, సమకాలీనత కాదు. ఆధునికతకు పలు పట్టెలు కలవు.
*చైతన్యం - సరికొత్త రీతులు, పరిధిని దాటిన ఆలోచనలు మొదలైనవాటితో కూడిన ప్రకంపనలు
*ముఖ్యమైన రీతి - సంప్రదాయ పద్ధతుల శృంఖలాలను ఛేదించుకున్న ఆలోచనలు
*పారిశ్రామీకరణ - సామాజిక, సాంస్కృతిక మార్పులు, వ్యక్తుల ఆలోచనా స్వాతంత్య్రం మొదలైనవి.
తెలుగులో పాశ్చాత్య ఆధునికతను ఉన్నది ఉన్నట్టుగా ప్రవేశ పెట్టటం కూడా జరిగినది. ఉదాహరణకు కమ్యూనిస్ట్ సాహిత్యం.
కవిగా విశ్వనాథ స్థానం గొప్పది, రచయితగా వివాదస్పదమైంది, సాహిత్యవేత్తగా (అంటే సాహిత్య విమర్శనా రచయితగా) అనితర సాధ్యమయింది, అతి విస్తృతమయింది. విశ్వనాథ సాంప్రదాయవాది. కానీ, ఆయన విమర్శనా సాహిత్యం ఆధునికతతో కూడి, కొత్త పుంతలు తొక్కింది.
నాటకము - భారతీయ దృక్కోణం వ్యాసములో గంగిశెట్టిగారి విశ్లేషణ చాలా బాగుంది.
నాటకము గురించి మన సాహిత్యములో మొదటి ప్రస్తావన, ముండక ఉపనిషత్తు మూడవ అనువాకంలో:
ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి
అనశ్నన్నన్యో అభిచాకశీతి (3.1.1)
స్థాయీ భావం/రసానందము:
ప్రాచీన సాహిత్యములో ప్రస్తావించబడినవి ఎనిమిది రసానుభూతులే. శాంత రసం తరువాత చేర్చబడినది.
పద వ్యుత్పత్తి:
పరాక్రమం
నటన = నట్ - కానిదాన్ని మనపై ఆరోపించుకొని చూపే క్రియాచేతన జగతి
ఙ్ఞానం = ఙ్ఞ + ఆనం (తన్ను తాను గుర్తు పట్టుకునే ప్రయాణమే ఙ్ఞానం
వి - విపర్యాయ అర్థం, లేక అత్యధికమనే అర్థం
చిత్రం / విచిత్రం
విధవ - ధవుడు (భర్త) లేనిది
ఇవి గంగిశెట్టిగారి "ఆధునికత-సమకాలీనత" లోని అతి కొన్ని అంశములు మాత్రమే. "
"ఆధునికత-సమకాలీనత" గ్రంథాన్ని పాలడగు శ్రీ చరణ్ గారు కూడా సమీక్షించారు. వారి ప్రసంగ విశేషములు: "గంగిశెట్టి గారు, గ్రంథంలోని అధ్యాయాలకు "తరంగాలు" అని పేరు పెట్టారు. ఈ గ్రంథం నిజంగానే ఒక సముద్రం. దీనిలో ఈత కొట్టటం అంత తేలిక కాదు. ప్రతి మాటా మనలను ఆలోచింపచేసి, క్రొత్త దిక్కులకు తీసుకు వెళ్లకలదు. మామూలుగా "అయ్యవారు ప్రకాశం, అమ్మవారు విమర్శ" అంటాము. ఈ గ్రంథం అమ్మవారంతటి మంచి విమర్శ. ఆధునికతకు, నూతనత్వముకు చాలా భేదం వుంది. ఉదాహరణకు, రేపు వచ్చే సోమవారం నూతనం. కానీ, ఆధునికత కాదు. అలాగే సాహిత్య రంగములోని ఆధునికతను విశ్లేషించటం తేలికగా అయ్యే పని కాదు. అంతటి మహా కార్యాన్ని గంగిశెట్టిగారి "ఆధునికత-సమకాలీనత" గ్రంథం సాధించింది."
శ్రీ చరణ్ గారు, నాటక తరంగం కూడా సమీక్షించి, ఆయన రచించిన పద్యాన్ని శ్రీ అక్కిరాజు సుందరరామ కృష్ణ గారిని గానం చేయమని ఆహ్వానించారు. శ్రీ చరణ్ గారి కవిత్వానికి, అక్కిరాజుగారి లయ బద్ధమైన పద్య గానం తోడయ్యి, గంగి శెట్టి గారికి అభినందనీయమయింది.
శ్రీ చరణ్ గారి పద్యం:
సీ|| కవన లక్ష్మీ శిల్ప నవనవోన్మేషంపు
రంగు మెఱయ జేసె `గంగి శెట్టి'!
కావ్య నాటక కథా నవ్యాభినవ గుప్త
లక్ష్య లక్షణ విమర్శ ప్రపేటి!
లలిత భావ తరంగ రత్నాకరానంద
గంభీర `శక్తి' సంకలన పాఠి!
మరణాంత వేదాంత మహనీయ తత్త్వర్షి
రమణర్షి భావార్థ రస నిఘంటి!
ఆ|| భారతీయ తత్త్వ వాగ్గన్ధ తరు వాటి
సంచరించి సాగు స్వర వధూటి (స్వర్వధూటి)
పులక లెత్తు తీపి తెలుగు విరుల జుంటి
తరగల మగనింట వరలు ధాటి! ||
గంగిశెట్టి గారిది పెద్ద మనస్సు. ఆయన గ్రంథావిష్కరణ జరుగుతున్న సభలోనే, శ్రీమతి షమ్షాద్ బేగం గారికి సత్కరించారు. షమ్షాద్ గారి "ఈ కిటికీ తెరుచుకునేది ఊహలలోకే" కవితా సంకలనాన్ని విశ్లేషించారు. సమీక్షకులు వేణు ఆసూరి గారిని, పాలడుగు శ్రీ చరణ్ గారిని కూడా సత్కరించారు.
ఆ తరువాత, కిరణ్ ప్రభ గారి క్విజ్ అనే తెలుగు సాహితీ జిమ్నాస్టిక్స్ కార్యక్రమం. అందరూ ఎదురు చూసే కార్యక్రమం. వీక్షణంకు వచ్చే తెలుగు పండిత ప్రముఖులు కూడా చీకట్లో బాణాలు వేయవలసి వచ్చే కార్యక్రమం. ఉదాహరణ ప్రశ్న: "కదంబము, కదంబకము - ఈ రెండు పదాలకు అర్ధ వ్యత్యాసములు ఏమిటి?".
తర్వాత జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమములోని కవితలు:
డా|| కె.గీత "కాఫీ కప్పు ..."
శ్రీమతి కొండేపూడి నిర్మల "ఉత్తరం ..."
శ్రీమతి షమ్షాద్ "విమాన ప్రయాణం ..."
శ్రీ అక్కిరాజు సుందర రామ కృష్ణ గారు "దొరల వల్ల కాదు" మొ.వి.
వీక్షణం 47 వ సమావేశం కాకర్ల సత్యవాణి గారు పాడిన త్యాగరాజ మంగళం "మంగళం నిత్య జయ మంగళం .." గానంతో ఆద్యంతం ఆసక్తిదాయకంగా ముగిసినది.
ఈ సభలో శ్రీమతి ప్రియదర్శిని, శ్రీమతి మంజులత , శ్రీమతి ఇందుమతి, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి సుశీల, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి శ్రీ చరణ్, శ్రీమతి కాంతి, శ్రీమతి రాధిక, శ్రీ గాంధీ ప్రసాద్ , శ్రీ లెనిన్, శ్రీ భాస్కర్ కూరపాటి, శ్రీ అబ్దుల్లా మహమ్మద్, శ్రీ అక్కిరాజు రమాపతిరావు, శ్రీ రామానుజరావు, శ్రీ రాజు, శ్రీ కేదార్, శ్రీ వంశీ, శ్రీ ప్రసాద్ మున్నగు వారు, చిన్నారులు కూడా పాల్గొన్నారు.
http://www.koumudi.net/…/august_2016_vyAsakoumudi_vikshanam…
http://www.siliconandhra.org/…/suja…/aug2016/veekshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-46 (Jun12, 2016)


వీక్షణం సాహితీ సమావేశం -46
పిల్లల మఱ్ఱి కృష్ణ కుమార్
వీక్షణం 46 వ సాహితీ సమావేశం ఫ్రీ మౌంట్ లోని శ్రీ పెద్దు సుభాష్, వందన గారింట్లో జూన్ 12 వ తారీఖున విజయవంతంగా జరిగింది. సుభాష్ గారు అందర్నీ ఆహ్వానిస్తూ రెండవసారి వారి ఇంట్లో ఈ సమావేశం జరగడం చాలా సంతోషకారణమని చెప్పారు. శ్రీ కూరపాటి భాస్కర్ గారు సభకి అధ్యక్షత వహించి, ముందుగా "కథా పఠనం" కార్యక్రమంలో శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారిని కథ వినిపించమని కోరారు.
రమాపతి రావు గారు శ్రోతల్ని కథకి పేరు సూచించమని కోరుతూ, కథా పఠనాన్ని కొనసాగించారు. అమెరికాలో ఉంటూ భారతదేశంలో ఉన్న తండ్రిని కోల్పోయిన వనిత కథ. ఆ ఉద్వేగంలో తనకి సహాయం చేసిన మిత్రుడే భాగస్వామి అయిన వైనం. ఆద్యంతం కథ అందరిని ఆసక్తిదాయకులను చేసింది.
ఆ తరువాత శ్రీమతి రాధిక గారు తన కథానిక "అలంకరణ" చదివి వినిపించారు. అమాయకంగా పెళ్ళికలలు కనే పిల్లని ఎలా సముదాయించాలో తెలియక సతమతమయ్యే తల్లి మనో ఘర్షణ చక్కగా చూపించిన కథ. ఇంతా చేసి పెళ్ళీడుకి వచ్చిన పిల్ల పెళ్లొద్దని అనడం, విముఖత చూపించడం తల్లికి తలకాయ నొప్పైంది. ఆ మార్పు ఎందుకో కూతురు తల్లికి జాబు ద్వారా వివరించడమే కథా సారాంశం.
ఆ తరువాత రాధిక ప్రతీ ఏడాది తన పేరుతో ఇచ్చే "రాధిక అవార్డు "ని ఈ సారి శ్రీమతి కొండేపూడి నిర్మల కి ఇస్తూ , ఇప్పటికి తొమ్మిదేళ్లుగా అవార్డు గ్రహీతల వివరాలను తెలిపారు.
తరువాత చిన్నారులు గ్రంథి శ్రీమయి, శ్రీ మైత్రి చక్కటి గాత్రంతో భాగవత పద్యాలు, మంచి పాటలు పాడి శ్రోతల్నిముగ్థులని చేసారు.
కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమం ప్రతీసారిలాగానే చాలా ఆసక్తికరంగా సాగింది. శ్రోతలందరూ ఉత్సాహంగా పాల్గొని రక్తి కట్టించారు. కిరణ్ ప్రభ గారు ఎంత పాప్యులరో మరోసారి ఋజువయ్యింది.
తెలుగు రచయిత వెబ్ సైటు గురించి కె.గీత, పెద్దు సుభాష్ గార్లు వివరిస్తూ తెలుగు రచయిత నిర్వహణ సహకారం అందిస్తున్న "గాటా" కు 501(సి) నమోదు వచ్చిందని, విరాళం ఇచ్చిన వారికి టాక్సు లాభం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఎవరైనా ఇచ్చే విరాళంతో వారి కంపెనీలు కూడా మేచ్ చేస్తాయని, సాహితీ మిత్రులు, సాహిత్యాభిమానులు ఇందుకు సహకారం ఇతోధికంగా అందించమని కోరారు. విరాళం ద్వారా తమకు నచ్చిన రచయిత పేజీని స్పాన్సర్ చేయవచ్చునని, వివరాలకు తెలుగురచయిత డాట్ ఆర్గ్ చూడవచ్చని తెలిపారు.
విరామంతర్వాత జరిగిన కవి సమ్మేళనంలో నూతక్కి రాఘవేంద్రరావు గారు తమ "నానో" లను చదివి వినిపించారు. కొండే పూడి నిర్మల కవిత రాయలేని స్థాయిని గురించిన కవితను, డా|| కె.గీత "తొలి పొద్దు పరిష్వంగం" ను, శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ అమెరికాలోని తెలుగు బడికెళ్తున్న మనవడి గురించి కవితను, శ్రీ రామానుజరావు పైసా మహిమల్ని గురించిన కవితలను వినిపించారు. ఆ తరువాత చక్కటి పద్య పఠనంతో శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, శ్రీ పాలడుగు శ్రీ చరణ్, శ్రీ పిల్లల మఱ్ఱి కృష్ణ కుమార్ వరుసగా సభను అలరించారు.
అక్కిరాజు వారు పెద్దు సుభాష్ గారి సూచన మేరకు పిల్లలకి పద్యం ఎలా పాడాలో నేర్పిస్తానని వాగ్దానం చేసారు.
యువ కవి దీక్షిత శేఖర్ ఆంగ్ల భాషలో తనదైన శైలిలో ఒక కవిత చదివి వినిపించారు. ఆ తరువాత శ్రీ రామానుజారావు, శ్రీమతి కె.గీత, శ్రీమతి విజయ గార్ల చక్కటి పాటల్తో సభ ముగిసింది.
ఇంకా ఈ సభలో శ్రీమతి విజయ ఆసూరి, వారి తల్లి గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి, శ్రీమతి భాస్కర్, శ్రీమతి భాస్కర్, శ్రీమతి ఉదయ లక్ష్మి, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి విజయ, శ్రీ తాటిపామల మృత్యుంజయుడు, శ్రీ కృష్ణబాబు, శ్రీ లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
http://www.koumudi.net/Monthly/2016/july/july_2016_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july2016/veekshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-45 (May8, 2016)

వీక్షణం సాహితీ సమావేశం- 45
-శ్రీ చరణ్ పాలడుగు
వీక్షణం 45 వ సాహితీ సమావేశం మే నెల 8 వ తారీఖున ఫ్రీ మౌంట్ లోని పిల్లల మఱ్ఱి కృష్ణ కుమార్ గారింట్లో ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. సభ శ్రీ సాయిబాబా "నమో వేంకటేశా" అనే కీబోర్డుతో ప్రార్థనా గీతంతో ప్రారంభమయ్యింది. సభాధ్యక్షులు శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు మాట్లాడుతూ ఆనాటి వక్తలు శ్రీమతి కొండేపూడి నిర్మల, శ్రీ రామానుజరావు గార్లను సభకు పరిచయం చేసారు. నిర్మల స్త్రీవాద కవయిత్రులలో మొదటి అయిదు స్థానాలలో నిలిచిన కవయిత్రి అనీ, అనువాదంలో చెయ్యితిరిగిన వారు రామానుజరావనీ అన్నారు.
ముందుగా నిర్మల తన కవితా నేపథ్యాన్ని గురించి మాట్లాడుతూ "వీక్షణం సభలకు రావడం అంటే మళ్లీ మాతృభూమికి వచ్చినంత ఆనందంగా ఉంది" అన్నారు. బాల్యంలో సాహిత్యాభిరుచి పెద్దగా లేదన్నారు. ఉమ్మడి కుటుంబం, నలుగురిలో ఒక అమ్మాయిగా పెరిగానన్నారు. చిన్నతనంలో నాన్న అమ్మ మీద చేసే పెత్తనం, తమ్ముడి పై చూపే ప్రత్యేక శ్రద్ధ ఒక వివక్షత భావన రేకెత్తించేది. చిన్నపిల్లవి, వినకూడదు, వెళ్లిపో వంటి పెద్ద వాళ్ళ మాటలు ఎందుకు? అనే ప్రశ్నని రేకెత్తించి బాగా ఆలోచనని కలిగించేవి.
పెద్దవారికి వార్తాపత్రిక చదివి వినిపించినపుడు రేడియో వార్తలు చదివినట్లు ఉందని పెద్దలు ప్రశంసించేవారనీ, తరువాత ఆకాశవాణిలో అదే స్ఫూర్తితో యువవాణి కార్యక్రమాలు చేసానన్నారు. 18 సంవత్సరాల వయసులో చదువు కంటే కవిత్వమే ఎక్కువ ఆసక్తిదాయకంగా ఉండేదన్నారు. చదువుతో బాటూ జర్నలిజంలో ప్రవేశించేననీ, ఆంధ్రజ్యోతిలో చేరడం ఒక మలుపన్నారు. ఆంధ్రజ్యోతిలో నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గార్లతో పరిచయ భాగ్యం కలిగిందనీ, పురాణం వారి ప్రోత్సాహంతో బాపు బొమ్మలకు కథ వ్రాయడం మంచి అనుభవమనీ అన్నారు. వివాహం తర్వాత కరీంనగర్ లో డొమెస్టిక్ వయొలెన్స్ మీద విషయ సేకరణ, రచన చేసానన్నారు. 1992 లో ఉదయంలో చేరిన తర్వాత హాలీవుడ్ తారల జీవితాల్లో చీకటి కోణాల్ని ఆవిష్కరించాననీ, ట్రాన్స్లేషన్సు చేయడం వల్ల ఇంగ్లీషులో పట్టు దొరికిందనీ, తను రాసిన ఒక కవిత తో ఉద్యోగమొచ్చిందనీ, యూనిసెఫ్ లో పనిచేయడం వల్ల వస్తు వైవిధ్యం తో రచనలు చేయగలిగనన్నారు.మొదటి కథ "మువ్వ మూగబోయింది" తో రచన వృత్తిగా మారిందనీ, లేబర్ రూం కవిత స్త్రీవాదంలో కవిత్వంలో ఒక మలుపనీ, అప్పట్లో స్త్రీవాదం మీద జరిగిన తిరుగుబాటుల్ని ఎదుర్కొన్న మొదటి సిపాయినన్నారు. తన తర్వాత అప్పటికి చిన్నపిల్లగా ఉన్న కె.గీత లాంటివాళ్లు లేబర్ రూం కొనసాగింపు కవితలు రాసారని, చివరగా "లేబర్ రూం" కవితను సభకు చదివి వినిపించారు. ఆ తర్వాత సభలో ఈ కవిత మీద చాలా సేపు చర్చ జరిగింది. ప్రముఖ స్త్రీవాద కవయిత్రుల గురించి చెబుతూ విమల, జయప్రభ, రేవతీదేవి, కె.గీతలను పేర్కొన్నారు.
తర్వాత శ్రీ రామానుజరావు కథా నేపథ్యం చెప్తూ, తండ్రిగారి నుంచి చదవటం అలవాటు అయ్యింది. బందరు హిందూ కాలేజీ లో లెక్చరర్ లక్ష్మణ రావు గారి ప్రభావం తో శ్రీ శ్రీ అభిమానిగా మారానన్నారు. అన్నయ్య "విశ్వ భరత్" తో కలిసి వ్రాసిన కథ మొదటి కథ. ఆదివిష్ణు గారితో పరిచయం ఆయన ప్రభావంతో "దోమల బాధ" అని హాస్య కథ రాయడం జరిగిందన్నారు. 1989లో పుస్తకం అచ్చువేసేననీ, అప్పటి నుంచి అడపాదడపా రాస్తూనే ఉన్నాననీ అన్నారు. అనువాదాలు కూడా చేసానని అన్నారు. ప్రస్తుతం విహంగ పత్రికలో సీరియల్ రాస్తున్నానని చెప్పారు.
ఆ తర్వాత డా||కె.గీత తెలుగు రచయిత ప్రారంభించి నెల రోజులు గడిచిన సందర్భంగా 30 వ పేజీ ఆవిష్కరణ అధ్యక్షులు శ్రీ గంగిశెట్టి గారి చేతుల మీదుగా జరిపించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రచయితలు ఇతోధికంగా సహకరించి తెలుగు రచయిత ను ముందుకు తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి చేసారు. క్రమం తప్పకుండా రోజుకొక రచయిత పేజీ వెబ్ లో ప్రత్యక్షం కావడం చిన్నవిషయం కాదనీ మనందరం అభినందించవలసిన గొప్ప కార్యక్రమం "తెలుగు రచయిత" అని శ్రీ గంగిశెట్టి కొనియాడారు.
చక్కని విందు తో జరిగిన విరామం తర్వాత కిరణ్ ప్రభ గారి సాహితీ క్విజ్ అత్యంత ఆసక్తి దాయకంగా కొనసాగింది.
కవితా పఠనంలో కె.గీత "కనుపాప సవ్వడి" కవితను, సాయిబాబా "బ్లాండు కన్య పూర్ణమ్మ" హాస్య కవితను, శ్రీ చరణ్ "మదర్శ్ డే పద్యం, సోమవార స్తుతులు", నిర్మల "పద్యమైనా, చేపైనా అంటూ" వచన కవితను వినిపించారు. చివరగా వరకూరు గంగా ప్రసాద్ గారు రచించిన పాటను వారి అమ్మాయి ఈశా సభలో రాగయుక్తంగా ఆలపించింది.
ఈ సభలో శ్రీ లెనిన్, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి రాణి, శ్రీ చుక్కా శ్రీనివాస్, శ్రీతాటిపామల మృత్యుంజయుడు, వేమూరి సోదరులు, శ్రీ అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. వీక్షణం 45 సమావేశాలు జరుపుకోవడం అత్యంత ఆనందదాయకమని అంతా కొనియాడారు.
http://www.koumudi.net/…/june_2016_vyAsakoumudi_vikshanam.p…
http://www.siliconandhra.org/…/suj…/june2016/veekshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-44 (Apr10, 2016)

వీక్షణం - సాహితీ గవాక్షం-44
- శ్రీ చరణ్ పాలడుగు
వీక్షణం-44 వ సాహితీ సమావేశం ఏప్రిల్ నెల 10 వ తారీఖున కిరణ్ ప్రభ గారింట్లో జరిగింది. శ్రీ వేణు ఆసూరి అధ్యక్షత వహించిన ఈ సభలో ముందుగా శ్రీ సుభాష్ పెద్దు "అనసూయమ్మ కబుర్లు" అనే అంశం పై ప్రసంగించారు. శ్రీమతి వింజమూరి అనసూయాదేవి సంగీత ప్రతిభాపాటవాలను వివరిస్తూ కొనసాగిన ఈ ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. దేవులపల్లి వారి మేనగోడలైన అనసూయా దేవి భావ సంగీతానికి, లలిత సంగీతానికి స్వరాలు కూర్చిన మొదటి స్త్రీ అని అన్నారు. ప్రజలు చిన్నచూపు చూసే జానపద సంగీతానికి సేకరణ, స్వరపరచడం ద్వారా గొప్ప ప్రాముఖ్యతని కల్పించారు ఆమె. ఇవేళ జానపద గేయాలు పీ.ఎచ్.డీ చేసే స్థాయికి ఎదిగాయంటే అది ఆవిడ చలవేనన్నారు. అనసూయాదేవి శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఆలిండియా రేడియో మద్రాసు వ్యస్థాపక గాయకుల్లో ఒకరు. వీరికి ప్రభుత్వం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. దేవులపల్లి వారి "జయ జయ ప్రియ భారత జనయిత్రీ" వంటి అనేక గీతాలకు స్వర కల్పన చేసారు. ఇప్పుడు 96 ఏళ్ళ వయసులో ఉన్న యువతి అని కొనియాడారు. అనసూయాదేవి గారి జీవిత విశేషాలను, ఇతరులకు తెలియనివెన్నో వివరాలను సేకరించానని, ప్రత్యేకించి తాను స్వయంగా రెండు సం. రాలపాటు ఆవిడ జీవితచరిత్రను చెప్తూండగా రాసి పుస్తకప్రచురణకు తోడ్పాటు చేసి ఆవిడ గీతాల పట్ల ఉన్న అభిమానానికి చిరు కానుకగా సమర్పించానని అన్నారు సుభాష్. ప్రసంగానికి ముక్తాయింపుగా వింజమూరి అనసూయాదేవి సేకరించిన జానపద గేయం "నోమి నోమన్నలాల"ను కె.గీత ఆలపించారు.
తర్వాత శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు కథా పఠనం లో భాగంగా "శిక్ష" కథను చదివి వినిపించారు. "సైన్స్ ఫిక్షనులో అందె వేసిన చేయి" వేమూరి అని సభాధ్యక్షులు వేణు ఆసూరి కొనియాడారు.
ఆ తర్వాత డా|| కె.గీత "తెలుగు రచయిత" వెబ్ సైటు తొలి రచయితల పేజీ "కందుకూరి వీరేశలింగం పంతులు" ను సభలో శ్రీ వేమూరి, కిరణ్ ప్రభ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసారు. నిర్వహణ బాధ్యతలను వివరిస్తూ అనేక ప్రయాసలకోర్చి రచయితలందరికీ ప్రత్యేక పేజీలను రూపొందిస్తున్నామని అన్నారు. ఇందుకు వేణు ఆసూరి, సుభాష్ లతో పాటూ తాను సంస్థాపించిన "గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు ఆథర్స్" విశేషంగా సహాయ సహకారాలను అందజేస్తూందని, రచయితలంతా తమ వంతు సహకారాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా శ్రీ అక్కిరాజు రమాపతి రావు తాను పీ.ఎచ్.డీ చేసిన కందుకూరి వారి గురించి ప్రసంగించారు. "ఆధునిక ఆంధ్రదేశం అఖండ గోదావరీ అయితే, నాసికాత్ర్యయంబకం కందుకూరి" అన్నారు. వెయ్యేళ్ల తెలుగు చరిత్రలో రెండే యుగాలున్నాయని, అవి నన్నయ యుగం, వీరేశలింగం యుగం అని కొనియాడారు. ఆయన తన 71 సం.వత్సరాల జీవితంలో 134 గ్రంథాలు రచించారని, కృష్ణశాస్త్రి అన్నట్లు "మరణించేవరకూ వీరేశలింగానికి మరణించే తీరిక లేదని " అన్నారు. తను స్వయంగా ప్రయాసలకోర్చి సాగించిన పరిశోధనల్ని గుర్తు చేసుకున్నారు.
వీరేశలింగం గారితో సమానంగా రచనల్ని చేసిన రమాపతిరావు గారిని "21 వ శతాబ్దపు వీరేశలింగం" గా గీత కొనియాడారు.
శ్రీ చరణ్ అప్పటి కప్పుడు ఆశువుగా అక్కిరాజు గారిపై పద్యం అల్లారు.
"శ్రీ కందుకూరి రసధి
ప్రాకట రాకేందు "రమాపతి"! మంజుశ్రీ
మాకీవే ఆంధ్ర కవన
లోకాంబుధి వారధి! వయ! రోచిస్సాంద్రా!"
తేనీటి విరామం తర్వాత జరిగిన సాహితీ క్విజ్ తో కిరణ్ ప్రభ సభలో అందరినీ ఉత్సాహితుల్ని చేసారు.
కవి సమ్మేళనంలో భాగంగా శ్రీచరణ్ "ఉగాది పద్యాలు", కె.గీత రాష్ట్ర విభజనని గురించిన "నేనెవ్వరిని?" కవితని, పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ "ఉగాది చంపక మాలలు" వినిపించారు.
చివరగా శ్రీ ఇక్బాల్ "ఐనా నేను ఓడిపోలేదు" శ్రీమతి జ్యోతిరెడ్డి స్ఫూర్తిదాయక ఆత్మకథను సభకు పరిచయం చేసారు.
ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో శ్రీ & శ్రీమతి ఉదయ, శ్రీమతి శాంత, శ్రీమతి ఉమ, శ్రీ శివచరణ్ మొ.లైన వారు పాల్గొన్నారు.
http://www.koumudi.net/…/may_2016_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/…/suja…/may2016/veekshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-43 (Mar13, 2016)

వీక్షణం - సాహితీ గవాక్షం-43
                                                                                                         - సుభాష్ పెద్దు

మార్చి నెల వీక్షణం సమావేశం 13 వ తారీఖున ఫ్రీ మౌంట్ లో వేణు ఆసూరి గారింట్లో జరిగింది. వేణు గారు సమావేశానికి ఆహ్వానం పలుకుతూ "వీక్షణం గురించి మొదట విన్నప్పుడు వీకెండ్ లో సమావేశమా?" అనుకున్నాను. కానీ ఒకసారి అటెండ్ అయ్యేక ఇక "ఎప్పుడెప్పుడా" అని ఎదురుచూపు మొదలయ్యింది అన్నారు. వీక్షణంలో రచయితల భాగస్వామ్యాన్ని కొనియాడుతూ, యువతని అధికంగా భాగస్వామ్యుల్ని చేసే ఆలోచన చేయాలని అన్నారు.
అక్కిరాజు రమాపతి రావు అధ్యక్షత వహిస్తూ భాస్కర శతకం నుంచి "పండితులైన వారు" పద్యంతో ప్రారంభించారు. రచయిత భాషను 'జీవభాష'గా మలచాలన్నారు. తిక్కన పద్యాలు ఈ కాలానికీ సులభ సాధ్యం కావడం ఇందుకు ఉదాహరణ అన్నారు.
సభలో ముందుగా పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ "ఫ్రీవిల్" గురించిన పరిశోధనాత్మక ప్రసంగం చేసారు. భారత దేశంలోను, పాశ్చాత్య దేశాలలోను "ఫ్రీవిల్" మూలాల్ని గురించిన ఆలోచనాత్మక ప్రసంగం ఇది. తర్వాత మహమ్మద్ ఇక్బాల్ "కావ్యాలలో పీఠికలు" అనే అంశాల పై ప్రసంగించారు. భారత అవతారికను ప్రధానంగా ఉదహరిస్తూ కావ్యాలలో పీఠికలు కవి కాలాదులు, అంకితం, జీవిత విశేషాలు మొదలైన విషయాలకు నిలయాలని చెప్పారు. పాల్కురికి సోమనాధుని, శ్రీనాధుని కావ్యాలలో అవతారికల విశేషాలను ఆసక్తి దాయకంగా వివరించారు. 'కవికి, పాఠకునికి మధ్య వారధి పీఠిక' అని ముగించారు.
తర్వాతి కార్యక్రమం "తెలుగు రచయిత" వెబ్ సైటు హోం పేజీ ఆవిష్కరణ. "తెలుగు రచయిత" వెబ్ సైటు హోం పేజీ ఆవిష్కరణ డా||కె.గీత , శ్రీ వేణు ఆసూరి, శ్రీ సుభాష్ పెద్దు ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ ప్రభ చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా డా||కె.గీత మాట్లాడుతూ " వెయ్యి సంవత్సరాలకు పైబడి సాహిత్య చరిత్ర, ఏ ప్రపంచస్థాయి సాహిత్య ప్రమాణాలకూ తీసిపోని పరిపుష్ఠమైన సాహిత్య సృష్టీ, విశిష్టఆశుకవితా ప్రక్రియలూ, కాలంతో పాటే రూపురేఖలు మార్చుకున్న ఛందో రూపాలూ, ఒక్క శతాబ్దకాలంలోనే ఎన్నో సాహిత్యోద్యమాలూ చూసింది తెలుగు. భాషాపరిణామం, తత్త్వచింతన, ఇతిహాసం, పురాణం, జానపదసాహిత్యం, సంగీతం, నాటకం, నవల, కథ, కవిత, వ్యాసం, చరిత్ర, జీవిత చరిత్రలు, యాత్రా కథనాలు, రేడియో, టీ.వీ మాధ్యమాలకు అనుగుణంగా మలుచుకున్న సాహిత్యప్రక్రియలూ, వీటన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించిన గొప్ప గొప్ప రచయితలు మనకు ఉన్నారు." అన్నారు.
చరిత్రను, విలువైన చారిత్రక ఆధారాలను, గొప్ప సాహిత్యకారుల జీవిత, రచనా విశేషాలనూ, వారు నివసించిన గృహాలనూ, వినియోగించిన వస్తువులనూ జాతి సంపదగా భావించి పదిలపరచుకోవలసి ఉన్నదనీ, మన కళ్ళముందే జీవించి, సాహిత్యాన్నీ, జీవన విధానాన్నీ ప్రభావితం చేసిన వ్యక్తులు మన మధ్యనుండి కనుమరుగవగానే, వారి సాహిత్యం అదృశ్యం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనకున్నదనీ, తమ జీవితాన్ని భావితరాల అభివృద్ధికీ, అభ్యున్నతికీ ధారపోసిన వ్యక్తుల గురించిన సమాచారం చెదలు పట్టకుండా జాగ్రత్త పరచుకోవడం మన కనీస ధర్మమనీ' అన్నారు.
చరిత్ర లో నిలిచిపోయే ఈ వెబ్ సైటు ఆశయాలు కార్యరూపం దాల్చడానికి రచయితలందరూ సహకరించాలని కోరారు. వెబ్ సైటు పూర్తి రూపం దాల్చి మొదటి రచయితల పేజీ రాబోయే ఉగాది నాడు ప్రారంభించబడుతుందని చెప్పారు. వెబ్ సైటు సేకరణలో ఎంతో సహకరిస్తున్న శ్రీ నౌడూరి మూర్తిగారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రచయితలు తమ రచనలనూ, జీవిత విశేషాలనూ http://www.telugurachayita.org/ లేదా http://www.teluguwriter.org/ లో సమర్పించవచ్చని అన్నారు.
తెలుగు రచయిత వెబ్సైటు నిర్వహణకు తొలి మెట్టు గా "గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు ఆథర్స్" -గాటా (Global Association of Telugu Authors-GATA) నాన్ ప్రాఫిట్ సంస్థ కె.గీత, వేణు ఆసూరి, సుభాష్ పెద్దు ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. వేణు, సుభాష్ గార్లు మాట్లాడుతూ "గాటా" వివరాలు అందరికీ తెలియజేసారు.
సభను అత్యంత ఆసక్తిదాయకంగా మలిచే సాహితీ క్విజ్ కార్యక్రమం కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన పిదప విరామపు విందు జరిగింది.
విరామానంతరం కార్యక్రమంలో జరిగిన కవి సమ్మేళనంలో కె.గీత "వీక్షణ నిరీక్షణ" అనే కవితను, షంషాద్ "ఎలిజీ" అనే తనకు నచ్చిన భాస్కర భట్ల కవితను చదివి వినిపించారు. తర్వాత వేణు "యోగ నిద్ర" కవితను వినిపించారు.
చివరగా వీనుల వీందైన పాటల కార్యక్రమం లో శ్రీమతి విజయ సినిమా గీతాన్ని, శ్రీమతి అపర్ణ దైవ భక్తి గీతాన్ని, డా||కె.గీత దేవుల పల్లి రచించిన "మధూదయంలో " లలిత గీతాన్ని ఆలపించి సభను అలరించారు. ఈ పాట గురించి దేవులపల్లి మేనగోడలైన వింజమూరి అనసూయా దేవి గారు చెప్పిన విశేషాలను సుభాష్ సభతో పంచుకున్నారు.
ఎడతెరిపి లేని వాన కురుస్తున్నా సభకు విచ్చేసి ఆద్యంతం ఆసక్తిగా విన్న సభలోని వారికి, సభకు ఆతిథ్యమిచ్చిన వేణు, విజయ ఆసూరి దంపతులకు కృతజ్ఞతలతో సభ ముగిసింది.
ఈ సభలో శ్రీ కృష్ణబాబు, శ్రీ సుబ్బారావు, శ్రీమతి కాంతి, శ్రీమతి వందన, శ్రీమతి ఇక్బాల్, శ్రీమతి సుబ్బలక్ష్మి మొ.న వారు పాల్గొన్నారు.
http://www.koumudi.net/Monthly/2016/april/april_2016_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/april2016/veekshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-42 (Feb14, 2016)

వీక్షణం - సాహితీ గవాక్షం-42
- సుభాష్ పెద్దు
వీక్షణం-42 వ సమావేశం ఫిబ్రవరి 14, 2016 తారీఖున, అనగా రథసప్తమి నాడు, క్యుపర్టీనో నగరములోని పాలడుగు శ్రీ చరణ్ గారి స్వగృహమున జరిగినది. ఈ సభకు ప్రముఖ రచయిత, వీరేశలింగంగారి జీవిత చరిత్ర పరిశోధన కర్త అయిన అక్కిరాజు రమాపతి గారు అధ్యక్షత వహించారు.
ఈ సభలో సరికొత్త ముఖ్యాంశం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు రచయితల పూర్తి వివరాలను, రచనలను, వారి శ్రవణ, దృశ్య మాలికలను పొందు పరిచేందుకు "తెలుగు రచయిత" అంతర్జాల స్థావరము (వెబ్ సైటు) ను డా॥ గీతా మాధవి గారు ప్రకటించారు. అధ్యక్షులు అక్కిరాజు రమాపతి గారిచే ఈ బృహత్ కార్యక్రమము ఆవిష్కరించబడినది. తెలుగు రచయితల గురించి సంపూర్ణ వివరములన్నీ భావి తరాలకు అందుబాటులో ఉండే విధంగా ఒక చోట భద్రపరచడం ధ్యేయంగా తనకు వచ్చిన ఆలోచనను ఒక ఉద్యమముగా రూపొందించడానికే ఈ ప్రయత్నము అని గీత గారు వివరించారు. అధ్యక్షులు రమాపతి గారు "తెలుగు రచయిత" ప్రణాళికనీ, ధ్యేయాన్ని అభినందిస్తూ "ఇది చాలా పెద్ద కార్యక్రమము. ఏ పెద్ద యూనివర్శిటీ వారో, సంస్థ వారో చేయవలసిన పనిని గీత చేస్తోంది. పైగా ఆడియో, వీడియో లను కూడా పెడుతున్నారు. ఈ ప్రయత్నము చాలా గొప్పది, దీనిని అందరూ ప్రోత్సహించ వలసినదే" అని తెలిపారు.
అధ్యక్షులు అక్కిరాజు రమాపతి గారి ప్రారంభోపన్యాసము: "నేను వయసులో పెద్దవాడిని. ఇక్కడ ఉన్న వారిలో పాత తరము ప్రముఖ రచయితలతో పరిచయము కలిగిన వాడిని ప్రస్తుతము నేనేనేమో. నాకు ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులతో పరిచయము కలిగింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, మామిడిపూడి వెంకట రంగయ్య, కంభంపాటి రామ శాస్త్రి (హరిజన బాలికను పెండ్లి చేసుకున్న సంఘ సంస్కర్త), దామెర్ల వెంకట్రావు (దామెర్ల రామారావు గారి పిన తండ్రి కొడుకు), తారకం, వేముల కూర్మయ్య, అయ్యదేవర కాళేశ్వర రావు గారితో మంచి పరిచయముండేది. నేను బహుశా కలవని ఆనాటి ప్రముఖులు శ్రీ పాద సుబ్ర హ్మణ్య శాస్త్రి, అడివి బాపిరాజు గారు మాత్రమే.
రఘుపతి వెంకటరత్నము నాయుడు గారు నిజంగానే బ్రహ్మర్షి. ఒకసారి ఆయన బెజవాడ నుండి మద్రాసు ప్రయాణం చేస్తున్నప్పుడు పొన్నేరి రైల్వే స్టేషన్లో దిశ మొలలతో తిరుగుతున్న ఇద్దరు అనాధ బాలికలు కనిపించారు. వారు మద్రాసు చేరుకోగానే పట్టాభి సీతారామయ్యగారిని పంపించి ఆ ఇద్దరు బాలికలను తన దగ్గరకు తెప్పించి, చదువు చెప్పించి ప్రయోజకులను చేసారు. పట్టాభి గారిని పిల్లలు ఎత్తుకుపోతున్నారని ముందు పోలీసులు అడ్డగించారట. కానీ, తరువాత రఘుపతి వెంకటరత్నం గారు తీసుకురమ్మన్నారని తెలిసిన తరువాత అభ్యంతరం తెలుపలేక పోయారట.
నేటి తరం ఆనాటి మహనీయులను మరచిపోవటం నిస్పృహని కలిగిస్తున్నది.
తరువాత వెంకట నాగ సాయి గారు "అదిగో అల్లదివో --" అన్నమచార్య కీర్తనతో సభను అలరింప చేసారు.
మొదటి ప్రసంగం మహమద్ ఇక్బాల్ గారిది. వారు ఏనుగుల వీరాస్వామయ్య గారు 200 సంవత్సరముల క్రితము వ్రాసిన "కాశీ యాత్రా చరిత్రము" నుండి కృష్ణా, గోదావరి మధ్య దేశపు వివరాలను వివరించి, ఇక్బాల్ గారి చిన్నతనములో కర్నూల్ నుండి హైదరాబాద్ వరకూ వారు ప్రయాణించిన దారి సాపేక్షతను చూపారు. కాలం మారినా ఆ దారి, దారిలోను, హైదరాబాద్ నగరములోని అంగళ్లు నేటికి కూడా పెద్ద మార్పులు లేకుండా కనబడుతున్నాయని వివరించారు.
వీరాస్వామయ్య గారిని ట్రావెలాగ్ వ్రాయమని సి.పి. బ్రౌన్ గారు ప్రోత్సహించారని అధ్యక్షులువారు రమాపతి గారు తెలిపారు.
ఇక్బాల్ గారి ప్రసంగ విశేషాలు: ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్ర చరిత్రము తెలుగులో మొదటి ట్రావెలాగ్. వీరాస్వామయ్య గారు ఈ పుస్తకములో ఆనాటి దేశ, కాల, పర్యావరణ పరిస్థితులని విపులంగా వర్ణించారు. వీరాస్వామయ్య గారు మద్రాసులో అదాలత్ కోర్టులో మొదటి ద్విభాషా అధికారి. అనగా తెలుగు, ఆంగ్ల భాషలలో కోర్టు వ్యవహరాలను నడిపినవారు. ఆయన ఆ రోజులలో 5000 మందికి ఏకాదశి భోజన సంతర్పణ చేసేవారు.
ఆయన వ్రాసిన చరిత్రలో ఒంటిమిట్ట పోతన గారి విగ్రహము దగ్గరనుండి, దారిలో ఒక బండరాయి పైన ఇంకొక బండరాయి నిలబడడము దాక చక్కని వర్ణన. అవి అన్నీ నేటికీ కనబడతాయి. ఆయన జడచర్ల, శంసాబాదు, బేగంబజారు, కార్వాన్, చంద్రఘట్టం, శాలిభండ మొదలయినవి పేర్కొన్నారు. నేటి హైదరాబాద్ లోని ఇంగ్లీషు వారి దండు (Military Cantonment) గురించి, తురకల జపశాల (అనగా మక్కా మసీదు), ముర్గీ చౌక్, గుజ్రీ అంగడి, నిజాం దేవిడీ మొదలైనవి పేర్కొన్నారు. ప్రతి ప్రదేశము గురించి విపులంగా పేర్కొన్నారు. ఉదాహరణకి గుజ్రీ అంగడిలో 200 సంవత్సరముల క్రితము పాత సామాన్లు అమ్ముతున్నారని చెప్పారు. నేటికి కూడా గుజ్రీ అంగడిలో పాత సామాన్లు (పాత్రలు, బుత్తలు మొదలైనవి) అమ్మటము చూడవచ్చు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో ఆయుధాలే భూషణములుగా ధరించి తిరిగేవారిని పేర్కొంటూ, వారితో వ్యవహరించటానికి "వాక్ పౌరుష్యము" కావాలని చెప్పారు. నేటి టాంక్ బండ్ పై జాతులవారిని (తెల్లవారిని) తప్ప వేరెవరినీ ఎక్కనిచ్చే వారు కాదని పేర్కొన్నారు. ఇంకా గోలకొండ, నిజాము దేవిడి దగ్గరి బగీచా లో పైకి లేచే జలధారలు (Fountains) గురించి వర్ణించారు. నిజాము రాజ్యం కుంపిణీకి (East India Company) నెలకు 3 లక్షల రూపాయలు చెల్లించేదని వివరించారు.
రమాపతి గారు ఆనాటి విశేషాలు చెపుతూ, "ఒకసారి మంధురాంతకం రాజారావు గారిని ఒక పెద్దాయాన మీరు ఆరోగ్యం బాగా చూసుకోండి అని చెప్పేరట. అప్పటికి రాజారావు గారికి వయసు పైబడింది. రాజారావు గారు, "ఏమీ ఫర్వాలేదు, నా ఆఖరి రచన అయ్యేదాకా నా ఆరోగ్యానికి డోకా లేదు" అని చెప్పారు. వెంటనే మొదటి పెద్దమనిషి, "అయితే మీరు ఆఖరి రచన చెయ్యబాకండి" అని సలహా ఇచ్చాడట." అని అన్నారు.
తరువాతి కార్యక్రమము "తెలుగు రచయిత" కు శంఖారావము. ఈ కార్యక్రమంలో తెలుగు రచయిత ప్రకటన పత్రం ఆవిష్కరణ అధ్యక్షులు రమాపతిరావు గారు, శ్రీ వేమూరి, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ వేణు ఆసూరి, శ్రీ సుభాష్, డా॥కె.గీత ల చేతుల మీదుగా జరిగింది. గీత గారి ప్రసంగం తర్వాత తెలుగు రచయిత కమిటీ సభ్యులు వేణు ఆసూరి, సుభాష్ గార్లు కార్యక్రమ ఇతర వివరాలు తెలియజేసారు. ఈ బృహత్ కార్యక్రమానికి తొలి ఆమోద ముద్ర "తానా" నించి రావడం ముదావహమని మొదటి చెక్కు ఇచ్చి ఆర్థిక సహకార ప్రారంభం చేసిన శ్రీ చరణ్ అన్నారు. ఇందులో మూడు విధాలుగా సహాయం చెయ్యవచ్చని గీత గారు ప్రకటించారు. 1) రచయితలు తమ పూర్తి సమా చారాన్ని అందజెయ్యవచ్చు. 2) రచయితలు తమకు తెలిసిన రచయితల సమాచారాన్ని లేదా గత రచయితల రచనలూ, వివరాలూ, ఫోటోలూ, ఆడియో, వీడియో టేపులూ వివరాలు తెలియజెయ్యవచ్చు. 3) ఆర్థిక సహాయం చెయ్యవచ్చు. 'రచయితల పరిచయ పత్రం' మొ.న వివరాలకు ఈ మెయిల్ telugurachayita@gmail.com ద్వారా సంప్రదించవచ్చని అన్నారు.
కవి సమ్మేళనం విశేషాలు:
1. రథసప్తమి సందర్భముగా వేణు ఆసూరి గారు శ్రీ కృష్ణార్జున యుద్ధం లో ఘంటశాల గారు పాడిన శ్లోకాన్ని, శ్రావ్యముగా పాడారు.
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
అక్కిరాజు సుందర రామకృష్ణ గారు పంపిన సందేశాన్ని, వారు వ్రాసిన ఈ కింది పద్యాన్ని కూడా చదివి వినిపించారు.
వర గుణు డైన"మారుతి"కె వ్యాకరణంబులు నేర్పినట్టి,స
ద్గురుడు,ప్రచండ తేజు డయి గొప్పగ దోచెడు పద్మ మిత్రుదౌ
గరిమను ,పండితా ళియు ఘనంబుగ మెచ్చ,వచించి నట్టిశ్రీ
చరణుని,"విశ్వ బంధు"నిగ సల్పును గావుత సర్వ దేవతల్!
అవని సురులకు గాయత్రి "అమ్మ" యనుట
"కల్పకం"బనుటలవి నిక్కంబు గాదు!
సత్య మరయంగ "గాయత్రి "సకలురకును
కన్న తల్లియే! ఒక్కింత మిన్న గూడ!
2. పాలడుగు శ్రీ చరణ్ గారు రథసప్తమి సందర్భముగా మయూరుని సూర్య శతకము గురించి చదివిన శ్లోకము, వివరణ:
శ్రీ చరణ్ గారు రధసప్తమి సందర్భముగా చేసిన ప్రసంగం:
మయూరుడు సూర్యాష్టకము, సూర్యశతకము రచించినాడు. మయూరిడికి కుష్ఠు వ్యాధి వచ్చినప్పుడు రోగ నివారణ కొరకు సూర్యుడిని స్తుతించుతూ ఈ సూర్య శతకము చెప్పినాడు. ఈ స్తుతితో సూర్యుడు ప్రత్యక్షమై మయూరిడికి రోగ విముక్తి కలిగించాడు. ఇది అత్యుత్తమమైన కవిత్వము. ఈ వర్ణన ఎంత గొప్పగా ఉన్నదంటే, శ్రీనాధుడు కాశీఖండములో సూర్య స్తుతి కోశము మయూరిడి శ్లోకాలని యథాతథముగా అనువదించాడు.
రాజశేఖరుడు అనే కవి మయూరిడి ప్రతిభ గురించి ఈ విధముగా వర్ణించాడు:
దర్పం కవి భుజంగానామ్ గతా శ్రవణగోచరమ్
విశ్వవిద్యేవ మయూరి మయూరి వాన్ నికృంతతి
దర్పముతో కూడిన నాగులకు (భుజంగములకు) మయూర శబ్దముతో గర్వము ఎలా నశించుతుందో
దర్పంతో కూడిన దుష్కవులకి మయూరుని పాండిత్యము వలన నాశనము కలుగుతుంది.
3. వెంకట నాగ సాయి గారు "బ్లాండు కన్య" అంటూ చక్కని హాస్యముతో కూడుకున్న పద్యాలని వినిపించి అందరినీ కడుపుబ్బ నవ్వించారు.
4. డా ॥ కె. గీత గారు అరుణ్ సాగర్ నివాళి గా రాసిన "మంత్ర పుప్పొడి" కవిత్వ పఠనం చేసారు.
కొన్ని పంక్తులు:- 
కవికి మరణం ఉందేమో కవిత్వానికి మరణం లేదు కదూ!
రచయిత కాల గర్భంలో కుంచించుకు పోతున్న
నీటి బొట్టు చివరి ఊపిరి చిత్రం నన్ను మెలకువలోనూ వెంటాడుతూంది.
అనుభవైక వేదననీ అనుభూతుల వెల్లువని
అనుక్షణం అక్షరీకరించే కవి హృదయాన్ని
ఇక సజీవీకరించవలసిందే-
5. కూరపాటి భాస్కర్ మాట్లాడుతూ తమ వంటి ఆరునెలల అతిథులకి వీక్షణం కార్యక్రమాలు ఉపిరినిస్తున్నాయని అన్నారు. కార్యక్రమాలకు కొన్ని సూచనలు ఇచ్చారు.
వీక్షణం కార్యక్రమములో అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ , ఆహ్లాదముగా పాల్గొనే కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమము ఎంతో ఆసక్తిగా కొనసాగింది. సభలో తెలుగు పండితులు, కవులు చాలా మంది ఉన్నారు. శ్రీమతి వందన, శ్రీమతి సాయిబాబా, శ్రీమతి భాస్కర్, శ్రీమతి & శ్రీ కొండారెడ్డి, శ్రీమతి లత వెంపటి, శ్రీమతి తాయిబా , శ్రీ మన్సూర్, శ్రీ ప్రసాద్ నల్లమోతు, శ్రీ లెనిన్, శ్రీ గోపాల స్వామి, శ్రీ చుక్కా శ్రీనివాస్ మొ.న పలువురు ఇందులో పాల్గొన్నారు.
http://www.koumudi.net/…/march_2016_vyAsakoumudi_vikshanam.…
http://www.siliconandhra.org/…/suja…/march16/veekshanam.html


వీక్షణం - సాహితీ గవాక్షం-41 (Jan10, 2016)

జనవరి 10, 2016 న ఫ్రీమౌంట్ లో తాయిబా మన్సూర్ గారింట్లో జరిగిన వీక్షణం 41 వ సమావేశం ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.
ఈ సమావేశానికి శ్రీ మహమ్మద్ ఇక్బాల్ గారు అధ్యక్షత వహించారు. సభకు తాయిబా, మన్సూర్ దంపతులు ఆహ్వానం పలికారు. ముందుగా శ్రీ నాగ సాయిబాబా కీబోర్డుతో బాటూ గానాన్ని మిళితం చేసి సభను అలరించారు. సభాధ్యక్షులు ఇక్బాల్ గారు రమణ గారి "కోతి కొమ్మచ్చి" లోంచి కొన్ని ఘట్టాల్ని అందరికీ చదివి వినిపించారు.
ఆత్మకథ రాయడానికి ప్రోత్సాహం కలిగించిన వేమూరి బలరాం గారి మాటలతో మొదలుకుని, బాల్యంలోని పేదరికపు అనుభవాలు, బాపూతో స్నేహం, సినీ ప్రస్థానంలో ఎదురైన చేదు అనుభవాల వరకు ప్రతీ సంఘటనా హాస్యంతో మిళితం చేసి, ఎక్కడా దాపరికం లేకుండా తన గురించి చెప్పుకున్నారు శ్రీ ముళ్లపూడి రమణ.
తరువాత శ్రీ భాస్కర్ "కందుకూరి శ్రీ రాములు కవిత్వ పరిచయం" చేసారు. మట్టి పరిమళం వేసే కవిత్వం శ్రీ రాములి కవిత్వం అనీ, కవిత్వం ఎంత స్వచ్ఛమైనదో అతని వ్యక్తిత్వమూ అంత స్వచ్ఛమైనదని కొనియాడారు. మిత్రులు "కంశ్రీ" గా పిల్చుకునే కందుకూరి తనకు చిరకాల "ద్వారకా" మిత్రుడని చెప్పుకొచ్చారు. పుస్తకంలోని కొన్ని కవితా పంక్తుల్ని ఉదహరిస్తూ అతని కవిత్వాన్ని పుస్తక రూపంలో పరిచయం చేసిన సౌభాగ్య కవిత్వాన్ని కూడా ఉదహరించారు. తేనీటి విరామం తర్వాత శ్రీమతి బండారి విజయ గారు భానుమతి పాడిన చక్కని సినీ గీతాల్ని ఆలపించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసారు. శ్రీ కిరణ్ ప్రభ అందరినీ ఆసక్తి దాయకుల్ని చేసి ఎప్పటిలా క్విజ్ కార్యక్రమంతో కట్టిపడెయ్యడమే కాకుండా సుభాష్ చంద్ర బోస్ జీవితం గురించి తనదైన చక్కని బాణీలో వివరించారు. సుభాష్ చంద్రబోస్ విభిన్నమైన, విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడని, భారత దేశ చరిత్రలో అంతటి ధైర్యమూ, తెగువ కలిగి, నిస్వార్థంగా పనిచేసిన నేత మరొకరు లేరని కొనియాడారు. ఆ రోజుల్లో అయ్యేఎస్ ఉత్తమ శ్రేణి లో సాధించినా స్వాతంత్రం కోసం ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసిన ఉత్తముడన్నారు. గాంధీకి ఎదురు నిలబడి జాతీయ కాంగ్రెస్ కు రెండు సార్లు అధ్యక్షుడిగా నిలిచారన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడ్తూ కూడా జర్మనీలో దేశ స్వాతంత్రం కోసం పాటుపడడం, "అజాద్ హింద్ ఫౌజ్" ను నడిపించడం వంటి గొప్ప బాధ్యతలను భుజస్కంధాల మీద మోసారన్నారు. ఆయనకు ప్రతీ అడుగులోనూ సహరించిన తెలుగు వారైన "అబీఊద్ హస్సన్", "దాట్ల సూర్య నారాయణ రాజు" మొ.న వారి నిస్వార్థ సేవను కూడా వివరించారు.

ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమం లో డా|| కె.గీత "సెలయేటి దివిటీ" కవితని "నువ్విక్కడ లేవు అయినా జ్ఞాపకాలవెన్నెల దివిటీతో దారి వెతుక్కుంటూ ఇక్కడిక్కడే తచ్చాడుతున్నాను- నీ క్షేత్రంలో మొలకెత్తిన పంటల మధ్య తిరుగుతున్నాను..." అంటూ వినిపించారు. శ్రీ సాయిబాబా కొన్ని సరదా "రుబాయతులు" తెలుగు ను, ఉర్దూను కలిపి వినిపించారు.

చివరగా శ్రీ లెనిన్ కథలు, కవిత్వంలో ఉండవలిసిన ముఖ్యాంశాల గురించి వివరించారు. ఆద్యంతం అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సాహిత్యాభిమానులు ఆసక్తి గా పాల్గొని సభను జయప్రదం చేసారు.
------