Monday 2 January 2017

వీక్షణం - సాహితీ గవాక్షం-40 (Dec13, 2015)



వీక్షణం - సాహితీ గవాక్షం-40 
- నాగరాజు రామస్వామి
మబ్బు కమ్మిన మధ్యాన్నపు ఆకాశం. నేల రాలుతున్న వర్ష ధారలను చీల్చుతున్న ఈదురు గాలి. వెచ్చని కోటు వేసుకున్నా జివ్వు మంటూనే వుంది వొళ్లు. కాని, బెదిరే దెవ్వరు!? వలస నేల మీద తెలుగు పలుకుతూనే వుంది, మధుర సాహిత్య మధు కలశం తొణకుతూనే వుంది!
ఈ వాతావరణ నేపథ్యంలో, ఈ నెల 'వీక్షణం' సమావేశం అనిల్ రాయల్ గారి ఇంట్లో మిల్ పీటాస్, కాలిఫోర్నియాలో నిరాఘాటంగా జరిగింది. అధ్యక్షులు వేమూరి వేంకటేశ్వర రావు గారు. ముఖ్య అతిథులు చిర్రావూరి శ్యాం ( మెడికో శ్యాం ) గారు.
కిరణ్ ప్రభ గారు విలక్షణ కథకులైన శ్యాం గారిని పరిచయం చేస్తూ, వారు 70/80 దశకాలలో విజయనగరం ప్రాంతంలోని ప్రసిద్ధ కథకులలో ఒకరని, వంగూరిఫౌండే షన్ ద్వారా ప్రచురితమైన ఆయన కథా సంపుటి 'శాంయానా' ముందు మాటలో వంగూరి గారి ద్వారా కూడా ఈ విషయం ఉటంకించబడిందని తెలిపారు. ఉత్తరాంధ్ర కథకులతో వారికున్న అనుభవాన్ని, అనుబంధాన్ని పురస్కరించుకొని అలనాటి సాహిత్య వాతావరణం గురించి మాట్లాడవలసిందిగా శ్యాం గారిని కోరారు.
అందుకు స్పందిస్తూ శ్యాం గారు తన సాహిత్యానుభవ ఆకాశంలో అలవోకగా విహరిస్తూ శ్రోతలకు విహంగ వీక్షణం చేయించారు. సహజోల్లాస వాగ్ధోరిణిలో తన చిన్ననాటి ముచ్చట్లను గుర్తుచేసుకుంటూ కిరణ్ ప్రభగారు పోస్ట్ కార్డ్ ల పరంపరలతో ముంచెత్తే వాడనీ, అప్పట్లో విశాఖసాహితీ సమాఖ్య, విశాఖ రచయితల సంఘం( విరసం కాదు) అనే రెండు సాహిత్య సమాఖ్య లుండేవనీ, మెడికల్ విద్యార్థిగా ఉన్న రోజుల్లో 'తరుణ' పత్రికలో తన తొలి కవిత 'మెడికో ప్రేమ గీతం' ప్రచురించబడిన కారణంగా, తన పుస్తకం 'మెడికో శాం కథలు' మూలం గా తన పేరు 'మెడికో శ్యాం' గా మారి పోయిందని చెప్పుకొచ్చారు.
తెలుగు సాహిత్య లోకంలో నాటికీ నేటికీ ఉన్న వ్యక్తిగత స్పర్థలను ఉటంకిస్తూ తాను అందుకే హోదాలకు దూరంగా తటస్థంగా ఉండేవాడినని, అంధ్రజ్యోతి సంపాదకులు తన కథను చదవకుండానే పేరును చూసి వేసుకొనేవారని వచ్చిన ఆక్షేపణలకు ప్రతిస్పందిస్తూ 'టి.శ్యాం', 'శై', 'శ్యాం' లాంటి మారుపేర్లతో పత్రికలకు పంపించాల్సి వచ్చేదని చురక లంటించారు. పనిగట్టుకొని వక్రీకరించే కుహనా సాహిత్యాభిలాషులు ఆరుద్ర గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర సమగ్రం కాదనీ, 'ఈ శతాబ్దం నాది' అన్న శ్రీశ్రీ నిజానికి అర్ధశతాబ్ధి కవి మాత్రమేనని అన్న సందర్భాలు ఉన్నాయనీ, శ్రీశ్రీ కి ఎక్కడ నోబెల్ బహుమతి వస్తుందోనని కమిటీకి ప్రతిఘటిస్తూ లేఖలు కూడా రాసారని తెలిపారు. అందుకే కీర్తి రావాలంటే అర్జంటుగా చావాల్సి ఉంటుందని, తాను Dead writer still living అని శ్రీశ్రీ ఛలోక్తి విసిరేవాడని చెప్పారు.
కథకునికి సాహిత్యం పైనే గాక మాండలికం పై కూడా సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. కొందరి కథలలో ఇతివృత్తం తో పాటు విమర్శనా ధోరిణి కలసి పోతున్నదని, అలాంటివారు వారు ప్రాథమికంగా తాము కథకులో, విమర్శకులో తేల్చుకోవలసిన అవసరం ఉంటుందని సలహా ఇచ్చారు. శ్రీశ్రీ కవితలను గాని, మాండలిక శైలిలో ఉన్న రావి శాస్త్రి వారి వంటి రచనలను గాని అనువదించడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. బుచ్చిబాబు గారి చైతన్య స్రవంతి కథ కన్నా, నవీన్ గారి అంపశయ్య చైతన్యస్రవంతి ప్రక్రియ తనకు నచ్చిందన్నారు. వారి ప్రసంగంలో పతంజలి, అరుణ్ కిరణ్, చాగంటి, నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యంశర్మ, మధురాంతకం రాజారావు, చలం, రజనీకాంతరావు, మునిపల్లెరాజు, వివినమూర్తి, గోపీచంద్ మొదలుకొని ఓహెన్రీ దాకా ఎందరో ప్రస్తావించ బడ్డారు. ఇలా లైవ్లీగా, జోవియల్ గా సాగిన వారి ప్రసంగం ' Don't meet the people, rather read the old books'- చణుకులతో ముగిసి అందరిని ఆకట్టుకుంది.
తదుపరి కార్యక్రమం అనిల్ రాయల్ గారి కథా పఠనం. వీరు ఇప్పటివరకు రాసినవి 9 కథలే అయినా, అన్నీ వాసికెక్కినవే. సైన్స్ ఫిక్షన్ కథలు రాయటం వీరి ప్రత్యేకత. టైం ట్రావెల్ కథాంశానికి చెందిన కథ 'నాగరికత' ఆ సంవత్సరం కథ సంపుటిలో చోటు చేసుకోవడం వీరి కథా రచన కౌశలానికి చక్కని నిదర్శనం. వీరి కథలలో విమర్శనాంశం అడపాదడపా తొంగిచూడడం విమర్శలకు దారి తీసినా, తనదైన శైలితో ఆత్మబలంతో పురోగమిస్తున్నారు. ఈ రోజు వీరు చదివిన కథ పేరు 'బ్రహ్మాండం'. ఇది Andy Weir రాసిన "The Egg" కు చక్కని అనువాదం. టైమ్-స్పేస్ భూమిక, థియరీ ఆఫ్ రిలెటివిటీ బాక్ డ్రాప్. ఫోర్త్ డైమెన్షన్ అయిన కాలం నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మికత కొనసాగించిన సైన్స్ ఫిక్షన్ కథా గమనం. యావత్ విశ్వాన్ని ఒక మహత్తర 'అండ' స్వరూపం గా దర్శించడం, స్వర్గనరకజన్మపరంపరలను ఆమోదించడం, అభావ అద్వైత భావనను సైన్స్ పరంగా అనుసంధించి కథను నడిపించడం కష్టసాధ్యమైన పని. సరైన నిర్దిష్ట కథాకథన రీతిని ఎంచుకొన్న అనువాదకుడు అభినందనీయుడు. కథా పఠనం ఆసక్తిగా సాగింది.
పిదప, శ్రీమతి విజయ కర్ర గారు "నన్ను మరచిన వేళ" కథను చదివి వినిపించారు. ఈనాటి ఎలక్త్రానిక్ యుగంలోని టివి, ఐఫోన్, ఐపాడ్లకు పాత్రోచిత ప్రాధాన్యత కల్పించి కథన కౌశలంతో 'మెటాలిక్ వాతావరణం' లో నడిపించిన చక్కని కథ ఇది. సంధ్య చీకటి కొండ మీది నుండి దూకిన ముగింపు అర్థవంతంగా వుండి కథ అందరిని ఆకర్షించింది.
స్వల్ప విరామం తరువాత కవి సమ్మేళనం. మొదట, శ్రీమతి గీత గారు 'నాలుగు పదుల తర్వాత' అనే వచన కవితను వినిపించారు. నాలుగు పదుల వయసు అబద్ధాల వయసున చాక్లెట్లు పుట్టిన రోజున జ్ఙాపకాల అలలై విస్తరిస్తాయి. నాలుగు పదుల పుట్టిన రోజు అంటే ఇప్పటి దుప్పటిలో పరకాయప్రవేశం చేయడమే అంటున్నారు గీత గారు. వెంటనే, పిల్లలమర్రి కృష్ణ కుమార్ గారు 'ఆరు పదుల జన్మదినం' అంటూ అశువుగా గొంతెత్తి అందరిని అలరించారు. నాగరాజు రామస్వామి 'నెమిలీకలు' అనే వచనకవితను, 'The Wrenched Rainbow' పోయెమ్ వినిపించారు. శ్రీ నాగసాయి బాబా గారు 'బారు అంటె బీరు కాదు' అంటూ ప్రారంభించి, ఆత్రేయ గారి సినీగీతం "అయినా మనసు మారలేదూ, ఆతని మమత తీరలేదూ" అంటూ పాడి నవ్వించారు.
ఆఖరున రసవత్తర ఘట్టం- కిరణ్ ప్రభ గారు నిర్వహించిన సాహిత్య క్విజ్. ఆసక్తిగా సాగింది. ప్రశ్నలు కఠినమైన వైనా, అవి ఎడ్యుకేటివ్ గా ఉన్నందున శ్రోతలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
శ్రీ లెనిన్, శ్రీ కూరపాటి భాస్కర్, శ్రీమతి లక్ష్మి , శ్రీమతి ఉమా వేమూరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశం అతిథేయులు అనిల్ దంపతుల అభినందనతో జయప్రదంగా ముగిసింది.
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan2016/veekshanam.html
-----



No comments:

Post a Comment