Tuesday 25 December 2012

వీక్షణం సాహితీ సమావేశం- 3 (Nov11, 2012)

వీక్షణం సాహితీ సమావేశం- 3
నవంబర్ పదకొండవ తేదీన, వీక్షణం మూడవ సాహితీ సమావేశం బే ఏరియా లోని ఫ్రీమౌంట్  నగరంలో శ్రీ వంశీ ప్రఖ్య గారి ఇంటిలో జరిగింది. సాయంత్రం మూడు నుండి ఆరు గంటల వరకు  జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ వేమూరి వెంకటేశ్వర రావుగారు  అధ్యక్షత వహించగా, స్థానిక రచయితలు, కవులు పాల్గొన్నారు.

‘అభినవ వివేకానంద’ అని బిరుదాంకితులైన కవి, శ్రీ ప్రొద్దుటూరి యెల్లారెడ్డిగారు, ఆ సమావేశానికి మఖ్య అతిథులుగా వచ్చి “సాహిత్యంలో జాతీయత” అన్న అంశంపై ప్రసంగించారు. కావ్య లక్షణాలు గురించి తెలుపుతూ ఆనందము, ఉపదేశము ముఖ్యమని తెలియచేసారు. అదే విధంగా జాతీయత అనేది మానవీయ కోణంలో ఉండాలి అని ఆకాంక్షించారు.
ఆది కవి నన్నయ్యతో మొదలిడి, ఆధునిక కవులవరకు వారి కవితలలో జాతీయతను, సమాజ శ్రేయస్సును ఎలా కోరుకున్నారో వివరించారు.  నన్నయ్య మనిషి సత్యమార్గంలో నడవాలని  తెలియజేసిన
"నుతజల పూరితమైన నూతులు నూరిటి కంటె  సూనృత వ్రతయగు నొక బావి మేలు "  పద్యంతో  వివరించారు.

తిక్కన కాలానికి దైవారాధనలో భేదాలు ఏర్పడి, శైవం వైష్ణవాలుగా విడి పడిన సమయంలో, హరిహరుడు అనే దైవాన్ని సృష్టించి, శివ,కేశవుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పి తత్కాలీన సామాజిక సమస్యలను ఎలా పరిష్కరించారో  “ "శ్రీ యన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి " పద్యంతో
చెప్పి, కవులన్న వారు సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని, సత్యాన్ని కాపాడడం మానవ కర్తవ్యమ్ అని  చెప్పారు.

ధర్మమూ, ధర్మ సూక్ష్మము వేరు అని, ఎఱ్రన్న పద్యాలను ఉటంకించారు. కవితాత్మను ఆవిష్కరించటం ముఖ్యమని వివరించారు. పోతన తన కవితల ద్వారా సత్యాన్వేషణ,  ఆడిన మాట తప్పకుండుట ముఖ్యమని చెప్పారు. శతకము అనేది, సమాజ సంరక్షణకు తోడ్పడాలని, “సర్వేశ్వర శతకము”లో అన్నమయ్య నరుడే నారాయణుడు అని తెలిపిన సంగతి వివరించారు.
శ్రీనాథ మహాకవి ఒక గొప్ప మానవతావాది అని, ఆయన చెప్పినట్లు పర్వతాలు, సముద్రాలు, వనాలు భూమికి భారం కావని, డబ్బు ఉంది దానం చెయ్యని వారు, జ్ఞానము నలుగురితో పంచుకొని వారు, అధికారము యుండి ప్రజల శ్రేయస్సుకు ఉపయోగించని వారు భారమని, అందువల్లనే అందరూ సమాజ శ్రేయస్సులో పాలుపంచుకోవాలని వివరించారు. శ్రీనాథుడు, తన కవితల ద్వారా, ఆనాటి సామజిక జీవన చిత్రాన్ని, అప్పటి గడ్డు పరిస్థితులని ఎలా పద్యాలలో వివరించారో తెలియచేసారు.
పెద్దన మనుచరిత్ర కావ్యాన్ని వ్యాఖ్యానిస్తూ, గురువులు కేవలం పద్యాన్ని, దాని తాత్పర్యాన్నిమటుకే చెప్పడం కాకుండా, పద్య ఆంతర్యాన్ని, ఆత్మని సవివరంగా విద్యార్ధులకు ఆవిష్కరింపజేయాలని చెప్పారు. మన ప్రాచీన సాహిత్యాన్ని ఒక మూలధనంగా భావించి దాన్ని కాపాడుకోవాలి అని కూడా తెలియ చేసారు.
ఆధునిక కాలంలో, వివేకానందుడు అనే కావ్యంలో ఉండేల మాలకొండా రెడ్డిగారు, బానిసత్వంలో చనిపోయేకన్న, వీరులై రణరంగంలో చావటం మేలని అద్భుతమైన జాతీయత భావాన్ని ఎలా తెలియచేసారో   వివరించారు.  దువ్వురి రామిరెడ్డి గారు, జాతీయత ఒక ఇంద్రజాలం వంటిదని, స్మశానంలో అస్థిపంజరాలు కూడా జాతీయత అనే భావంవల్ల, లేచి వచ్చి పోరాడతాయని ఎలా వివరించారో తెలియచేసారు.
ఝాన్సీ లక్ష్మీబాయి అనే కావ్యంలో విశ్వనాథ సత్యనారాయణగారు విదేశాలలో స్థిరపడిపోయి మాతృభూమిని మరిచిపోయిన వారు భౌతికంగా, బుద్ధిపరంగా రెండు చావులు పొందుతారని, అందువల్ల మాతృభూమిని మరవరాదని వివరించారు. గుఱ్ఱం జాషువాగారు,  చెళ్ళపిళ్ళ వెంకట కవులు  కవికి, కవితలకి జాతి, మతం, కులం అనేవి అడ్డు రాకూడదని, పలుకుల రాణి పాదాలకు ఎలా పసిడి పెండేరం తొడిగారో వివరించారు.
దాశరధి గారు, జెండా ఒక్కటని, దేశం ఒక్కటని, రవీంద్రుడు ఒక్కడే జాతీయ కవి అని, గాంధీ ఒక్కడే జాతిపిత అని చెబుతూ, వారి కవితలతో జాతీయ పోరాటాన్ని ఎలా జనాల్లో ఎలా ప్రేరేపించారో వివరించారు.  చిలకమర్తి  లక్ష్మీ నరసింహం గారు, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు, గురజాడవారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, వారి పద్యాలలో జాతీయత ఎలా చాటారో  వివరించారు. అమృత గర్భం అనే స్వీయ రచనలో జాతీయత, దేశభక్తి ఎలా వివరించారో తెలియచేసి ప్రసంగం ముగించారు. తదనంతరం, శ్రోతల ప్రశ్నలకు జవాబులిచ్చారు.
 ఈ ప్రసంగం తర్వాత, శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారు, “ప్రియమైన శత్రువు” అనే స్వీయ కథను చదివారు. 

కొత్తగా పెళ్ళైన ఒక ఎన్నారై జంట మధ్య కలిగిన బేదాభిప్రాయాలను కథాంశంగా చేసుకుని, కట్టుకున్న భార్య కూడా సంపాదనలో భాగం పంచుకోవాలి అన్న భర్త అభిప్రాయాన్ని కేవలం తన స్నేహితులతో   ఎలా పంచుకున్నాడో, అందుకు భార్య తన నిరసనను ఒక లేఖ ద్వారా ఎలా తెలియచేసింది  అనేది ఈ కథ సారంశం. దీనిపై విరివిగా చర్చ జరిగింది.
విరామ సమయానంతం,  ఆనంద్ బండి గారు, “అతనొక సైనికుడు” స్వీయ కవితను, వంశీ ప్రఖ్య గారు తాను రచించిన  పాటను ,  డా|| కె.గీత “నరకంలో నాలుగు వారాలు” కవితను వినిపించారు.

-ఆనంద్ బండి
….........................