Thursday 11 July 2013

వీక్షణం సమావేశం - 10 (June,9-2013)

బే ఏరియా సాహితీ మిత్రుల నెలవారీ సమావేశం జూన్ నెల 9 వ తేదీన క్యుపర్టినో శారద. కె. గారి ఆతిథ్యంలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డా. వేమూరి వెంకటేశ్వర రావు గారు ముందుమాటలో క్రమం తప్పకుండా గత పది నెలలుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి బే-ఏరియా సందర్శిస్తున్న ప్రముఖలంతా హాజరవడం ఎంతో ఆనందదాయకం అన్నారు. డా. వేమూరి ఆనాటి ముఖ్య అతిథులు అల్లం రాజయ్య, చుక్కా రామయ్య (ఐ.ఐ.టి రామయ్య) గార్లను పరిచయం చేశారు.


అల్లం రాజయ్య గారు తన ప్రసంగంలో విదేశాల్లో ఉండి కూడా, స్వదేశీ సాహిత్యం గురించి ఆలోచిస్తున్న ప్రవాసాంధ్రులని అభినందించారు. తను ఇంతకుముందు మాట్లాడిన సమావేశాల కంటే ఈ సమావేశాలు భిన్నమైనవి అన్నారు. తాను, తన సోదరులు కూడా సాహిత్యాన్ని ఉద్యమాలకి అనుకూలంగా ఎలా మలచుకున్నారో వివరిస్తూ, మనుషుల్ని మనుషులుగా బ్రతకనివ్వని సమాజం వలనే తాము సాహిత్య ఉద్యమకారులమైనామని చెప్పారు. సమాజంలోని వైరుధ్యాలు పాఠాలు నేర్పుతాయనీ, వాటిని అందరితో పంచుకునే ప్రయత్నమే సాహితీ సృజన అని రాజయ్య గారు చెప్పారు. ప్రపంచ సాహిత్యంతో తనకు గల పరిచయాన్ని కూడా వివరించారు. అల్లం రాజయ్య గారి ప్రసంగం శ్రోతలని ఆలోచింపచేసేలా సాగింది. అక్కిరాజు సుందర రామకృష్ణ గారి కోరిక మేరకు వట్టికోట ఆళ్వారు స్వామి గురించి, ఆయన వ్రాసిన‘ ప్రజల మనిషి ’, ‘గంగు’ ల గురించి కూడా రాజయ్య గారు ప్రసంగించారు.
ఆ తరువాత చుక్కా రామయ్య గారు ‘ఆధునిక విద్యావిధానంలో తెలుగు భాషా విలువలు పడిపోతున్నాయా?’ అనే అంశం గురించి మాట్లాడారు. నైజాం ప్రభుత్వం కాలం నుంచి వస్తున్న విద్యా విధానాలని క్లుప్తంగా సమీక్షిస్తూ బోధనా మాధ్యమం యొక్క ప్రభావాన్ని చాలా విశదంగా తెలియజేశారు. ఆలోచన అనేది మాతృభాషలో స్పష్టంగా ఉంటుందనీ శాస్త్రీయంగా నిరూపించబడిందని, అందువల్ల మాతృభాషలో విద్య నేర్పడం వల్ల విద్యార్ధులలో సృజనాత్మకత పెంపొందుతుందనీ రామయ్య గారు చెప్పారు. ఆ తరువాత ఉద్యమ సాహిత్యం గురించి కూడా మాట్లాడుతూ రామయ్య గారు కాళోజీ ‘అణా గ్రంధమాల’ గురించి, గోర్కి అనువాదాల గురించి ప్రసంగించారు. సాహిత్యం పఠితల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో వివరించారు. తన ఐ.ఐ.టి. శిక్షణా తరగతుల నిర్వహణలో ఎదురౌతున్న అనుభవాలని కూడా శ్రోతలతో పంచుకున్నారు.


తదుపరి జరిగిన కవి సమ్మేళనంలో జి. వెంకట హరనాథ్ గారు, దాసు శ్రీరాములుగారు వ్రాసిన అరుదైన పుస్తకంలోని కొన్ని పద్యాలు చదివి వినిపించారు. ఇంకా నాగరాజు రామస్వామి, క్రాంతి శ్రీనివాస రావు, టి.పి.ఎన్. ఆచార్యులు, విజయలక్ష్మి, డా.గీత, బండి ఆనంద్ తదితరులు కూడా తమ స్వీయ కవితలని వినిపించారు. కిరణ్ ప్రభ నిర్వహించిన సాహితీ క్విజ్ కార్యక్రమంతో ఆ నాటి వీక్షణం సమావేశం ముగిసింది.
- కిరణ్ ప్రభ
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july13/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2013/july/july_2013_vyAsakoumudi_vikshanam.pdf


Tuesday 2 July 2013

వీక్షణం సమావేశం - 9 (May19, 2013)

    

వీక్షణం తొమ్మిదవ సమావేశం శానోజే లో రావు తల్లాప్రగడ గారింట్లో ఆత్మీయంగా, ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ఈ సమావేశానికి రావు తల్లాప్రగడ అధ్యక్షత వహించగా శ్రీ అల్లం రాజయ్య, శ్రీ గొల్లపూడి మారుతీ రావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
 

 
అల్లం రాజయ్య మాట్లాడుతూ సమాజం- ఉత్పత్తి, సమాజం- విద్య, చరిత్ర-నాగరికత-ప్రభావం మొ.న విషయాలను తన కథలు పరిచయం చేస్తాయన్నారు. కథా రచనకు పురిగొల్పిన తక్షణ కారణాలను వివరిస్తూ రైతాంగం పై తన కళ్ల ముందు జరిగిన దురాగతాల్ని, భూస్వామ్య పీడనని, బొగ్గు గని కార్మికుల పట్ల జరిగిన అన్యాయాల్ని పేర్కొన్నారు. అగ్ర- అల్ప వర్ణాల మధ్య తారతమ్యాల్ని పేర్కొంటూ "ప్రత్యర్థులు" కథను ఉదహరించారు. అంతే కాకుండా సమాజం లో మనిషి తను ఎన్నుకోవలసిన వృత్తిని స్వంత ఆసక్తిని బట్టి గాక, సమాజం నిర్దేశించిన ప్రకారం చెయ్యాల్సినప్పటి బాధను తెలిపే కథ "మహదేవుడి కల" ను పరిచయం చేసారు. ఆదివాసీ పద్ధతుల్ని, వారి సంస్కృతిని అధ్యయనం చేసి రాసిన రచనల్ని పేర్కొంటూ సాయుధ పోరాట వీరుడు "కొమురం భీం" గురించి రాసిన నవలను పేర్కొన్నారు.

సభలో ఉన్న వారి ప్రశ్నలకు జవాబిస్తూ తన చుట్టూ జరిగే సంఘటనల సమాహారమే తన రచనలనీ, రచయిత స్థల కాలాల్ని బట్టి మారే పరిస్థితుల్ని రచనల్లో ప్రతిబింబింపజేయాలనీ అన్నారు. మనసుల అట్టడుగుల్లో కాస్త తడి ఉన్న వారెవరైనా సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్షర బద్ధం చేసి తీరుతారని ముగించారు.

తరువాత జరిగిన కవి సమ్మేళనంలో కె.గీత అమెరికా లోని 'హోం లెస్ ' ని గురించి రాసిన "మంచు గబ్బిలం"కవితనీ, రావుతల్లాప్రగడ "సీతమ్మ" గజల్ నీ వినిపించారు. మధు ప్రఖ్యా, శ్రీ చరణ్ పాలడుగు, అక్కిరాజు సుందర రామకృష్ణ ల వైవిధ్య కవిత్వం తో కవిసమ్మేళనం అందరినీ అలరించింది.

తేనీటి విరామం తర్వాత గొల్లపూడి తమదైన శైలి లో హాస్య భరితంగా, సభలోని వారందరినీ ఆలోచింపజేసే విధంగా కథ, నాటక రంగాల గురించి మాట్లాడారు. బండారు అచ్చమాంబ దగ్గర్నించీ కథా పరిణామాన్ని వివరిస్తూ తటస్థ సమాజంలో మార్పును ఎప్పటికప్పుడు అక్షర బద్ధంచేస్తూ, అవసరాన్ని బట్టి అనేక మలుపులు తిరిగింది ఆధునిక కథ అన్నారు. తన కథ "ఈస్పర్" ను సభ లోని వారికి పరిచయం చేసారు. ఒక వ్యక్తి సమాజపు మర్యాదకు, విద్యల వెనుక దాగి ఉన్న కృత్రిమత్వానికి లోనై చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి స్వచ్ఛమైన ప్రవర్తనను ఎలా మరిచిపోతాడో వివరించారు. కథలు రాయడంలో మెళకువలు గురించి ప్రస్తావిస్తూ కథలో తారాజువ్వ లా ఒక స్పార్క్ ఉండాలని చెబుతూ, చెకోవ్, కాఫ్కా కథలను ఉదహరించారు.

నాటక రంగంలో 'పాండవోద్యోగ విజయాలు ' దగ్గర్నించీ ప్రారంభించి కన్వెన్షన్ థియేటర్ ఆవశ్యకతను గురించి వివరించారు. ఆంధ్ర కళా పరిషత్తు బహుమతి నందుకున్న "కళ్లు" ను ప్రస్తావించారు. మిత్రులతో కలిసి నడిపిన "కళావని " నాటక సంస్థను గురించి, "ఆంధ్ర నాటక చరిత్రము" పుస్తకం అచ్చు వేయించిన సందర్భం గురించీ గుర్తు చేసుకున్నారు.

సినిమాల కథలకు, బయట కథలకు తేడా ను వివరిస్తూ సినిమాలో కథను జనరలైజ్ చెయ్యాల్సి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా 'చక్రభ్రమణం ' నవలను 'డాక్టరు చక్రవర్తి ' గా తెరకెక్కించిన అనుభవాలను గుర్తు చేసుకుని సభలోని వారిని కడుపుబ్బ నవ్వించారు.

విమర్శ గురించి ప్రస్తావిస్తూ విమర్శ క్రియేటివిటీ ని పెంచేదిగా ఉండాలనీ, అంతే కాకుండా విమర్శకుడు తను విమర్శిస్తున్న రచనను ప్రేమిస్తున్నానని మొదట రచయితకి తెలిసే విధంగా విమర్శ ఉండాలని అన్నారు. ఆ సందర్భంగా తన నవల పట్ల విశ్వనాథ వారి విమర్శానుభవాన్ని, స్వయంగా తను చేసిన విమర్శ పర్యవసానాల్ని గుర్తుచేసుకున్నారు.

దాదాపు 70 మంది వరకు హాజరైన ఈ సభలో వేమూరి, కిరణ్ ప్రభ, వంశీ ప్రఖ్యా, నాగరాజు రామస్వామి, తాటిపామల మృత్యుంజయుడు మొ.న వారు పాల్గొన్నారు.

వీక్షణం సమావేశం -8 (Apr 14, 2013)

    

వీక్షణం ఎనిమిదవ సమావేశం శాన్ హోసే లో శ్రీ చరణ్ పాలడుగు గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ఈ సారి అతిథి సమయంలో ఉషశ్రీ గారి ప్రథమ పుత్రిక గాయత్రీ దేవి, అక్కిరాజు సుందర రామకృష్ణ, వింజమూరి అనసూయా దేవి పాల్గొన్నారు. రఘు మల్లాది అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ముందుగా శ్రీ చరణ్ ఆహ్వానంతో ప్రారంభమైంది. 
గాయత్రీ దేవి తమ తండ్రి గారైన ఉషశ్రీ జీవన కాలంలో చేసిన కృషిని గురించి చెబుతూ ఆలమూరు ట్రయో లో ఒకరిగా నిర్వహించిన "తరుణ సాహితి" కార్యక్రమాల గురించి, విశ్వనాథ సత్యన్నారాయణ గారి రచనలకే పరిమితంగా నడిపిన "విశ్వశ్రీ "పత్రిక గురించి సభికులకు తెలియజేసారు. వారి అసలు పేరు సూర్య ప్రకాశ దీక్షితులనీ, "పెళ్లి కొడుకులు", "పైడి కటకటాలు" మొదలైన ప్రఖ్యాతి చెందిన నాటకాలు రచించారనీ చెప్పారు. రేడియో లో ఆయన గొంతు వినని వారు ఆంధ్ర దేశం లో ఎవరూ ఉండి ఉండరని,  "ధర్మ సందేహాలు"రామాయణభారత కార్యక్రమాలతో ఆయన గొంతు చిరస్థాయిగా తెలుగు వారి హృదయాలలో నిలిచి పోయి ఉన్నదన్నారు. వారి కుమార్తెగా జన్మించడం తన అదృష్టమని పేర్కొంటూ ఇంట్లో నాన్నగా గొప్ప పాత్ర నిర్వహించేవారన్నారు.
 
తరువాత అక్కిరాజు సుందర రామకృష్ణ "పద్యం -నాటకం" అనే అంశం గురించి ప్రసంగించారు. నాటక రంగం లో స్వీయ అనుభవాన్ని తెలుపుతూ వినిపించిన పద్యాలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి.
ఒకప్పుడు పద్యమే నాటకంగా ఉండేదని, బళ్లారి రాఘవ, రాజమన్నార్ మొ. న వారి కృషి వల్ల గద్య నాటకాలు వచ్చినా పద్యం పౌరాణిక నాటకాలకు ఆయువుపట్టుగా నిలిచిందని అన్నారు. ఒకప్పుడు తిరుపతి వేంకట కవుల "చెలియో చెల్లకో", "జెండాపై కపిరాజు" పద్యాలు నోటికి రాని ఆంధ్రులు ఉండేవారు కారని అన్నారు. పాండవోద్యోగ విజయం, సత్య హరిశ్చంద్ర, కృష్ణ తులాభారం, చింతా మణి నాటకాలు నాలుగూ నాలుగు స్తంభాల వంటివనిఅప్పట్లో ఈ నాలుగు నాటకాలలో పద్యాలు రాని వారిని నటులుగా పరిగణించేవారుకారని పేర్కొన్నారు. మధ్య మధ్య హాస్య చమక్కులతో గొంతెత్తి శ్రావ్యంగా ఆయన ఆలపించిన పద్యాల్ని సభాసదులు మంత్రముగ్ధులై విన్నారు. చివరిగా కృష్ణ తులా భారంలోని "కస్తూరికా తిలకంబును పోనాడి" పాడి వినిపించారు. ఇప్పటి వరకు ఎన్నో సమావేశాలలో తను  పాలు పంచుకున్నా వీక్షణం వంటి ఆత్మీయ సమావేశం లో ఇప్పటి వరకు పాల్గొనలేదని సంతోషం వ్యక్తం చేసారు.
మధ్య తేనీటి విరామం తర్వాత వింజమూరి అనసూయా దేవి "బాలబంధు బి.వి నరసింహారావు" గురించి తాను రచిస్తున్న కొత్త పుస్తకం గురించి,ఆయన తో తమ కుటుంబానికున్న ఆత్మీయ అనుబంధం గురించి  ప్రసంగం చేసారు. ఈ సందర్భంగా సాహిత్య రంగానికి తను చేసిన కృషిని వివరిస్తూ తాను స్వయంగా ఆరు తరాలను చూసానన్నారు. జానపద గీతాలకు కర్ణాటక నొటేషన్ ఇస్తూ  10 పుస్తకాలు రచించానని  చెప్పారు. ఇక నరసింహరావు గారి గురించి మాట్లాడుతూ  చిన్నతనం లోనే ఆయనకు బాల సాహిత్యానికి పునాది వేసిందనీ చెప్పారు.  తమ ఇంట్లో చాలా చలాకీగా అందరినీ పలకరిస్తూ, నవ్విస్తూ కథలు చెప్తూ తిరిగే వాడని గుర్తు చేసుకున్నారు.
93 ఏళ్ల ప్రాయంలో పుస్తకం రచిస్తున్న అనసూయ గారి మొక్కవోని పట్టుదల సభలోని వారందరికీ  స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
తర్వాత స్థానిక వేద పండితులు వేంకట నాగ శాస్త్రి ఆశీర్వచన ప్రసంగం చేసారు. 
ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో క్రాంతి శ్రీనివాసరావు "లోపలి వ్యవసాయం"రావు తల్లాప్రగడ "అమ్మ" గురించిన గజల్ ను, డా||కె.గీత "కొండవాలు వానతీగ", రాఘవేంద్రరావు నూతక్కి "రెక్కలు" మినీకవితలు, కొన్ని హైకూలు, నాగరాజు రామస్వామి స్వీయకవితలు, అనువాద కవితను వినిపించారు. 
చివరిగా పిల్లలమర్రి కృష్ణ కుమార్, చుక్కా శ్రీనివాస్ లు మాట్లాడారు. ఎంతో కుతూహలంగా, ఆత్మీయంగా  సాగిన వీక్షణం సమావేశానికి వేమూరి, కిరణ్ ప్రభ, శివ, కోటరెడ్డి, శారద, యోగేంద్ర, దర్భా సుబ్రహ్మణ్యం మొదలైన వారు కూడా హాజరై ఆనందించారు.
వచ్చే సమావేశం క్యూపర్టినో లో శారద గారింట్లో జరుగుతుందని ప్రకటించారు.