Tuesday 2 July 2013

వీక్షణం సమావేశం - 9 (May19, 2013)

    

వీక్షణం తొమ్మిదవ సమావేశం శానోజే లో రావు తల్లాప్రగడ గారింట్లో ఆత్మీయంగా, ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ఈ సమావేశానికి రావు తల్లాప్రగడ అధ్యక్షత వహించగా శ్రీ అల్లం రాజయ్య, శ్రీ గొల్లపూడి మారుతీ రావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
 

 
అల్లం రాజయ్య మాట్లాడుతూ సమాజం- ఉత్పత్తి, సమాజం- విద్య, చరిత్ర-నాగరికత-ప్రభావం మొ.న విషయాలను తన కథలు పరిచయం చేస్తాయన్నారు. కథా రచనకు పురిగొల్పిన తక్షణ కారణాలను వివరిస్తూ రైతాంగం పై తన కళ్ల ముందు జరిగిన దురాగతాల్ని, భూస్వామ్య పీడనని, బొగ్గు గని కార్మికుల పట్ల జరిగిన అన్యాయాల్ని పేర్కొన్నారు. అగ్ర- అల్ప వర్ణాల మధ్య తారతమ్యాల్ని పేర్కొంటూ "ప్రత్యర్థులు" కథను ఉదహరించారు. అంతే కాకుండా సమాజం లో మనిషి తను ఎన్నుకోవలసిన వృత్తిని స్వంత ఆసక్తిని బట్టి గాక, సమాజం నిర్దేశించిన ప్రకారం చెయ్యాల్సినప్పటి బాధను తెలిపే కథ "మహదేవుడి కల" ను పరిచయం చేసారు. ఆదివాసీ పద్ధతుల్ని, వారి సంస్కృతిని అధ్యయనం చేసి రాసిన రచనల్ని పేర్కొంటూ సాయుధ పోరాట వీరుడు "కొమురం భీం" గురించి రాసిన నవలను పేర్కొన్నారు.

సభలో ఉన్న వారి ప్రశ్నలకు జవాబిస్తూ తన చుట్టూ జరిగే సంఘటనల సమాహారమే తన రచనలనీ, రచయిత స్థల కాలాల్ని బట్టి మారే పరిస్థితుల్ని రచనల్లో ప్రతిబింబింపజేయాలనీ అన్నారు. మనసుల అట్టడుగుల్లో కాస్త తడి ఉన్న వారెవరైనా సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్షర బద్ధం చేసి తీరుతారని ముగించారు.

తరువాత జరిగిన కవి సమ్మేళనంలో కె.గీత అమెరికా లోని 'హోం లెస్ ' ని గురించి రాసిన "మంచు గబ్బిలం"కవితనీ, రావుతల్లాప్రగడ "సీతమ్మ" గజల్ నీ వినిపించారు. మధు ప్రఖ్యా, శ్రీ చరణ్ పాలడుగు, అక్కిరాజు సుందర రామకృష్ణ ల వైవిధ్య కవిత్వం తో కవిసమ్మేళనం అందరినీ అలరించింది.

తేనీటి విరామం తర్వాత గొల్లపూడి తమదైన శైలి లో హాస్య భరితంగా, సభలోని వారందరినీ ఆలోచింపజేసే విధంగా కథ, నాటక రంగాల గురించి మాట్లాడారు. బండారు అచ్చమాంబ దగ్గర్నించీ కథా పరిణామాన్ని వివరిస్తూ తటస్థ సమాజంలో మార్పును ఎప్పటికప్పుడు అక్షర బద్ధంచేస్తూ, అవసరాన్ని బట్టి అనేక మలుపులు తిరిగింది ఆధునిక కథ అన్నారు. తన కథ "ఈస్పర్" ను సభ లోని వారికి పరిచయం చేసారు. ఒక వ్యక్తి సమాజపు మర్యాదకు, విద్యల వెనుక దాగి ఉన్న కృత్రిమత్వానికి లోనై చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి స్వచ్ఛమైన ప్రవర్తనను ఎలా మరిచిపోతాడో వివరించారు. కథలు రాయడంలో మెళకువలు గురించి ప్రస్తావిస్తూ కథలో తారాజువ్వ లా ఒక స్పార్క్ ఉండాలని చెబుతూ, చెకోవ్, కాఫ్కా కథలను ఉదహరించారు.

నాటక రంగంలో 'పాండవోద్యోగ విజయాలు ' దగ్గర్నించీ ప్రారంభించి కన్వెన్షన్ థియేటర్ ఆవశ్యకతను గురించి వివరించారు. ఆంధ్ర కళా పరిషత్తు బహుమతి నందుకున్న "కళ్లు" ను ప్రస్తావించారు. మిత్రులతో కలిసి నడిపిన "కళావని " నాటక సంస్థను గురించి, "ఆంధ్ర నాటక చరిత్రము" పుస్తకం అచ్చు వేయించిన సందర్భం గురించీ గుర్తు చేసుకున్నారు.

సినిమాల కథలకు, బయట కథలకు తేడా ను వివరిస్తూ సినిమాలో కథను జనరలైజ్ చెయ్యాల్సి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా 'చక్రభ్రమణం ' నవలను 'డాక్టరు చక్రవర్తి ' గా తెరకెక్కించిన అనుభవాలను గుర్తు చేసుకుని సభలోని వారిని కడుపుబ్బ నవ్వించారు.

విమర్శ గురించి ప్రస్తావిస్తూ విమర్శ క్రియేటివిటీ ని పెంచేదిగా ఉండాలనీ, అంతే కాకుండా విమర్శకుడు తను విమర్శిస్తున్న రచనను ప్రేమిస్తున్నానని మొదట రచయితకి తెలిసే విధంగా విమర్శ ఉండాలని అన్నారు. ఆ సందర్భంగా తన నవల పట్ల విశ్వనాథ వారి విమర్శానుభవాన్ని, స్వయంగా తను చేసిన విమర్శ పర్యవసానాల్ని గుర్తుచేసుకున్నారు.

దాదాపు 70 మంది వరకు హాజరైన ఈ సభలో వేమూరి, కిరణ్ ప్రభ, వంశీ ప్రఖ్యా, నాగరాజు రామస్వామి, తాటిపామల మృత్యుంజయుడు మొ.న వారు పాల్గొన్నారు.

No comments:

Post a Comment