Thursday 18 January 2024

వీక్షణం-136 వ సాహితీ సమావేశం

 వీక్షణం-136 వ సాహితీ సమావేశం

-- వరూధిని --
vikshanam-136

డిసెంబరు 13, 2023 న జరిగిన వీక్షణం సమావేశం ఇప్పటివరకు జరిగిన అన్ని సమావేశాల్లోకెల్లా ప్రత్యేక సమావేశం. వీక్షణం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ సమావేశం భారతదేశంలో ప్రత్యక్ష సమావేశంగా హైదరాబాదులో జరిగింది. ఘనంగా జరిగిన ఈ వీక్షణం 136వ సమావేశంలో వీక్షణం అధ్యక్షులు డా.కె.గీత గారి ఆంగ్ల పుస్తకాలు Centenary Moonlight and other poems, At the Heart of Silicon Valley (Short Stories) ఆవిష్కరణలు ప్రముఖ సినీనటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారి చేతుల మీదుగా సాయంత్రం 6 గం. నుండి 9గం.ల వరకు ఆర్ట్ గ్యాలరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగం పల్లి, నల్లకుంట, హైదరాబాద్ లో జరిగాయి.

ఈ సభకు అధ్యక్షత తెలంగాణా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ కందుకూరి శ్రీరాములు వహించగా, ముఖ్య అతిథిగా మ్యూజ్ ఇండియా చీఫ్ ఎడిటర్ శ్రీ ఆత్రేయ శర్మ విచ్చేసారు. వక్తలుగా ప్రముఖ కవులు, రచయితలు, అనువాదకులు శ్రీ వసీరా, డా. ఆలపాటి ట్యాగ్ లైన్ కింగ్, శ్రీమతి శ్రీసుధ కొలచన ప్రసంగించారు. ఇందులో దాదాపు నలభై మంది కవుల కవిసమ్మేళనం కూడా జరిగింది. కవిసమ్మేళనాన్ని డాక్టర్ రాధా కుసుమ గారు నిర్వహించారు. శ్రీమతి విశ్వైక కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి (యూ.ఎస్.ఏ), వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ సభను విజయవంతంగా నిర్వహించారు. ఆవిష్కరణ పూర్తికాగానే డా.కె.గీతామాధవి గారు తన పుస్తక మొదటి ప్రతుల్ని తమ తల్లిగారైన ప్రముఖ రచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మి గారికి, తమ అన్నగారైన కె.ఆర్.ఫణిరాజ్ గార్లకు అందజేశారు.

విశ్వైక ముందుగా డా.కె.గీతామాధవి గారిని ఆహ్వానిస్తూ వారి వివరాలు తెలియజేసారు. డా|| కె.గీత రచయిత్రి, గాయని, భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషాశాస్త్రంలో పిహెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. పది సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు" పొందారు. ద్రవ భాష (2001), శీత సుమాలు (2006), శతాబ్ది వెన్నెల (2013), సెలయేటి దివిటీ (2017), అసింట(2022) కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. "అపరాజిత"- గత ముప్ఫైయ్యేళ్ళ స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకత్వం వహించి ప్రచురించారు. కవిత్వంలో అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం మొ.న అవార్డులు, నవలకు తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ సాహితీ పురస్కారాల్ని పొందారు. ఈ ఆంగ్ల పుస్తకాలు వీరి ప్రచురింపబడిన ఎనిమిది, తొమ్మిదవ సంపుటులు.

డా.కె.గీతామాధవి గారు, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గార్లు ఆహ్వాన ఉపన్యాసాలు చేసారు. పుస్తకాల్ని ఆవిష్కరించి సుబ్బరాయ శర్మ గారు కె.గీత గారు షణ్ముఖి అంటూ వేనోళ్ళ కొనియాడారు. ఈ కథలు, కవితల్లోనించి తనకు నచ్చిన కొన్నిటిని ఉదహరించారు. ఆ తరువాత ప్రసంగించిన ఆత్రేయశర్మగారు సోదాహరణంగా అనువాద విశేషాల్ని వివరించారు. వసీరా గారు సిలికాన్ లోయ సాక్షిగా కథల గురించి వివరంగా ప్రసంగించగా, శ్రీ సుధ గారు సెంటినరీ మూన్ లైట్  గురించి, ఆలపాటి గారు రెండు పుస్తకాల గురించి సరదాగా ప్రసంగించి సభికుల్ని విశేషంగా అలరించారు. అధ్యక్షులు కందుకూరి శ్రీరాములుగారు సభను చక్కగా నిర్వహించి, చివరగా గీత గారి కవితల్ని చదివి వినిపించారు. చివరగా రచయిత్రి, కవయిత్రి డా.కె.గీత గారు తమ ప్రతిస్పందనగా మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి, అనువాద ఆవశ్యకతను తెలియజేసారు. తెలుగువారి రచనలు ప్రపంచ వ్యాప్తం కావాలంటే అనువాదాలు తప్పనిసరి అని తెలియజేసారు.

Centenary Moonlight and other poems డా|| కె.గీత గారి కవితల్లో నించి యాభై ఉత్తమ కవితల అనువాదాలు కాగా, At the Heart of Silicon Valley (Short Stories) సిలికాన్ లోయ సాక్షిగా కథల సంపుటికి ఆంగ్లానువాదం. ఈ పుస్తకాల్ని మో, ఎన్నెస్ మూర్తి, అల్లాడి ఉమ, శ్రీధర్, మాధురి పాలాజీ, వి.విజయకుమార్, వి.వి.బి. రామారావుగార్లు అనువాదం చేసారు.

ఈ సభలో మరో ప్రత్యేకత ఏవిటంటే ఉత్తమ కవిగా శ్రీ రామాయణం ప్రసాదరావు గారికి ఘనసన్మానం జరిగింది. ఆ తరువాత జరిగిన కవిసమ్మేళనంలో డా.కె.గీతామాధవి, సాధనాల వెంకటస్వామి నాయుడు, డా. ఆలపాటి ట్యాగ్ లైన్ కింగ్, శ్రీసుధ కొలచన, రామాయణం ప్రసాదరావు, డాక్టర్ దేవులపల్లి పద్మజ, పిళ్ళా వెంకట రమణమూర్తి, విశ్వైక, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, డాక్టర్ మోటూరి నారాయణరావు, మామిళ్ళ లోకనాథం, అవధానం అమృతవల్లి, డాక్టర్ అరుణ కోదాటి, కె వి యస్ గౌరీపతి శాస్త్రి,డా. రాధా కుసుమ, ఆర్.ప్రవీణ్, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి, డా.వైరాగ్యం ప్రభాకర్, జె వి కుమార్ చేపూరి, రామకృష్ణ చంద్రమౌళి, ఎం. అరుణ కుమారి, మల్కని విజయలక్ష్మి, పోలయ్య కూకట్లపల్లి, డా. దూత రామకోటేశ్వరరావు, శరత్కవి డి వి ఆర్ మూర్తి, జి.కె.నారాయణ, కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, చిట్టాబత్తిన వీరరాఘవులు, కనకయ్య మల్లముల, మన్నె లలిత, విజయలక్ష్మీ వడ్డేపల్లి, డాక్టర్ ఎమ్ ఎన్ బృందా, ఎస్ రత్నలక్ష్మి, పి వసంత శోభ, పి. పద్మావతి, కె‌.జగ్గయ్య, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మొ.నవారు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల కవులు, రచయితలు సాహిత్యాభిలాషులు  మొ.న వారు అనేకులు పాల్గొన్నారు. కవిసమ్మేళనంలో పాల్గొన్న వారికి సన్మానాలతో సభ దిగ్విజయంగా ముగిసింది. అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-136/

https://www.koumudi.net/Monthly/2024/january/jan_2024_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం-135 వ సాహితీ సమావేశం

 వీక్షణం-135 వ సాహితీ సమావేశం

-- వరూధిని --
vikshanam-135

నవంబరు 10, 2023 న ప్రత్యక్ష సమావేశంగా కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ లో షర్మిల గారింట్లో జరిగిన వీక్షణం 135వ సాహితీ సమావేశం శ్రీ మధు ప్రఖ్యా గారి అధ్యక్షతన ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశ ప్రధానోద్దేశ్యం వీక్షణం చిరకాల సభ్యులు, మిత్రులు, ప్రముఖ శతావధానులు అయిన శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారితో ఆత్మీయ సమావేశం జరుపుకోవడం. ఇటీవల శ్రీచరణ్ గారు అవధానిగా అమెరికాలో మొట్టమొదటి సంస్కృతాంధ్ర ద్విశతావధానాన్ని విజయవంతంగా పూర్తిచేసిన విషయం మనందరికీ విదితమే. ఈ సందర్భంగా వారికి ఈ సమావేశంలో ఆత్మీయ సన్మానం జరిగింది.

శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు కాలిఫోర్నియా నివాసి. బహుముఖ ప్రజ్ఞాశాలి. సాఫ్ట్ వేర్ రంగంలో నిపుణులు మాత్రమే కాకుండా సంస్కృతాంధ్ర భాషా పండితులు. పద్య కావ్యాలు రచించారు. అనేక మార్లు కావ్య పఠనం, వ్యాఖ్యానం చేసారు. గత ఐదారేళ్లుగా అవధానాలు చేస్తున్నారు.

వారి గురించి వారి మాటల్లోనే చెప్పాలంటే "మాది తిరుపతి సమీపంలోని కమ్మపల్లె. నాన్నగారు విద్వాన్‌పాలడుగు జయరామా నాయుడు ప్రధానోపాధ్యాయుడిగా, అమ్మగారు రావిళ్ల మనోరంజని జువాలజీ అధ్యాపకురాలిగా పనిచేశారు. మా తమ్ముడు జయచరణ్‌. నా చదువు బీటెక్‌ వరకూ తిరుపతిలోనే జరిగింది. 1997లో ఎంటెక్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేశా. వెంటనే ఉద్యోగం వచ్చింది. 1998లోనే అమెరికా వెళ్లా. అక్కడ సాప్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాను. చిన్నపుడు అమ్మానాన్నలు నేర్పిన శతకపద్యాలు ఇప్పటి నా అవధానాలకు పునాది వేసాయనిపిస్తుంది. రోజూ నాలుగైదు పద్యాలు అప్పట్లో కంఠతా పట్టేవాడిని. రామాయణం, భారతాల నుండి కథలు చెప్పేవారు. ఇక తిరుపతిలో ఉండడమనే కారణంతో గుడులకు వెళ్ళడం, అన్నమాచార్య కళామందిరానికి వెళ్ళడం వంటివి చిన్నతనం నుంచీ అలవడింది. దీంతో భక్తి, సాహిత్యం, భాష.. ఈ మూడింటిపై ఆసక్తి కలిగింది. ఆలయాల్లో పసితనం నుంచీ వింటున్న వేదపారాయణం కారణంగా శృతి, లయలపై కూడా తెలియని అరాధనాభావం ఏదో మదిలో ఉండేది. ఘంటసాల వారి పద్యాలు, ఎన్టీఆర్‌పౌరాణిక సినిమాల ద్వారా సాహిత్యం, పురాణాలపై జిజ్ఞాస కలిగింది. చిన్నతనం నుంచి చూస్తున్న అవధానాలు, వింటున్న ప్రవచనాలు, ఉషశ్రీ పుస్తకాలు వంటివి నాలో సాహిత్యం పట్ల అనురక్తిని పెంపొందించాయి.

అమెరికాలో ఓ గుడికి వెళ్ళినపుడు పరిచయమైన గణేశశర్మ అనే పురోహితుడి ద్వారా ప్రతి సోమవారం సాయంకాలం మూడేళ్లపాటు రుద్రాభిషేకంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ శబ్ద సౌందర్యం మంత్రాలపై ఆసక్తి కలిగించింది. వేదం నేర్చుకోవాలనే కోరిక కలిగింది, కానీ కొన్ని ఆటంకాలతో అది ముందుకు సాగలేదు. చివరకు, గురువుగారు శ్రీ మారేపల్లి నాగవేంకట శాస్త్రి గారు ఒకసారి నాలోని భక్తి, శ్రద్ధ గమనించి, ఈ రెంటికీ తోడు శుద్ధి కూడా పాటిస్తే వేదం నేర్పుతానన్నారు. వారి అనుగ్రహంతో 2007 మే మాసం నుంచి వేదాధ్యయనం చేస్తున్నా. ఒకవైపు తెలుగు, సంస్కృత సాహిత్యాలు చదువుకుంటూ, మరో వైపు వేదం నేర్చుకోవడంతో నాలో సాహిత్య అధ్యయన దృష్టి పెరిగింది.

2007లో తొలిసారి పద్యం రాసే ప్రయత్నం చేశాను, కానీ ఫలించలేదు. అడపా దడపా, ఆశువుగా రాసుకున్న పద్యాలను ఒకసారి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు చూసి, పద్యనిర్మాణంలో మెలకువలు చెప్పారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌నేను రాసిన శివోహం పద్యాలు చూసి ప్రోత్సహించారు. "ఛందఃపద్మాలు" అనే నా తొలిపుస్తకాన్ని 2013లో వారే ఆవిష్కరించారు. నా సాధనలో భాగంగా ఇప్పటివరకూ 8వేలపద్యాలు, శ్లోకాలు రాశా.

ఇంటర్లో సంస్కృతం తీసుకున్నా. అప్పటి మా ఉపాధ్యాయులు పాఠం చెప్పేతీరు సంస్కృతం అంటే నాకుఇష్టం పెరిగేలా చేసింది. ఐఐటీలో మంచి లైబ్రరీ ఉండేది. అక్కడ చాలా పుస్తకాలు చదివా. అమెరికా వెళ్ళిన తొలినాళ్ళలోనే మళ్లీ ఆన్‌లైన్లో సంస్కృతం నేర్చుకోవడం, పుస్తకాలు తెప్పించుకోవడం చేసేవాణ్ణి. తిరుపతి విశాలాంధ్ర నుంచి నాకు కావలసిన పుస్తకాలను అమ్మ కొని పంపేది. అలా సంస్కృతంలో పంచమహా కావ్యాలు, వాల్మీకి రామాయణం పూర్తిగా చదువుకున్నా.

2016లో వద్దిపర్తి పద్మాకర్‌గారు సమస్య, వర్ణనలతో నా చేత అవధానం సాధన చేయించారు. 2017 మే మాసంలో అమెరికాలో నా తొలి అవధానం వేద గుడిలో జరిగింది. వెంటనే సెప్టెంబర్‌మాసంలోనే తెలుగు- సంస్కృత భాషలలో ద్విగుణిత అష్టావధానం మన వీక్షణం వార్షిక సాహితీ సమావేశంలోనే చేశాను. ఆ తరువాత వారంరోజుల వ్యవధిలోనే ఐదు అవధానాలుచేసే అవకాశం వచ్చింది. సంస్కృతంలోనే అప్రస్తుత ప్రసంగంతో అవధానం చేశాను. జంట అవధానం, త్రిగళావధానం, 8 మంది పృఛ్చకులతో కాకుండా 15 మంది పృఛ్చకులతో అవధానం చేయడం జరిగింది. ఇపుడు చేసినది నా తొలి ద్విశతావధానం, అదికూడా సంస్కృతం-తెలుగు భాషల్లో జరిగింది. వీక్షణంలో మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది." అంటూ అవధానంలోని పృచ్ఛకులు అడిగిన సమస్యలను పూరించిన పద్యాలను ఆశువుగా చెప్పి అందరినీ ఆనందింపజేశారు.

శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారిని ఉద్దేశించి వీక్షణం అధ్యక్షులు డా. కె. గీతామాధవి గారు మాట్లాడుతూ "శ్రీ చరణ్ గారు నాకు మా వీక్షణం సాహితీ వేదిక ద్వారా దాదాపు గత పదేళ్ల కిందట పరిచయం కావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారు భాషా, సాహిత్య పండితులు, సాఫ్ట్ వేర్ రంగంలో నిపుణులు మాత్రమే కాకుండా, ఏ రంగంలో ఏ ప్రశ్న అడిగినా చెప్పగలిగిన నిష్ణాతులు. ఒక విధంగా చెప్పాలంటే జీనియస్ ఆయన. అంతకంతా మంచి మనసున్న మనిషి. సౌశీల్యత, నిరాడంబరత కలిగిన గొప్ప మనీషి. అటువంటి శ్రీచరణ్ గారు నా సమకాలీకులు అని చెప్పుకోవడం కూడా గర్వకారణమైన విషయం. నా సహోదర సమానులైన వారి కోసం ఉడతా భక్తిగా ఒక చిన్న పద్యం-

శ్రీచరణ్ గారు -
సంస్కృతాంధ్ర పలుకు సమముగా పలుకుచు
ఎల్ల జగములెల్ల నెదుట నిలుపు
వారి కెవరు సాటి పద్దె విద్యను జూడఁ
చరణు వారి మాట చద్దిమూట!
అంటూ వారిని పద్యంతో కూడా సత్కరించారు.

శ్రీ చరణ్ గారిని ఉద్దేశించి శ్రీ మధు ప్రఖ్యా, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీమతి షంషాద్, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీమతి షర్మిల, శ్రీమతి శారద, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీమతి అనూరాధ, శ్రీ రామకృష్ణ మున్నగువారు ప్రసంగించారు.

శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు చరణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆ రోజు ఆయనకు సరస్వతి పూనినట్లు మధ్య పూరణ గావించారని తెలియజేస్తూ పూరణ చేసిన కొన్ని పద్యాలను,వ్యాఖ్యతో సహా వివరించారు. సమస్యలు అందించిన వారు డా. కె.గీతామాధవి, శ్రీ మధు ప్రఖ్యా, శ్రీ శ్యామ్ పుల్లెల, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, డా. పిల్లలమఱ్ఱి శేషశాయి, శ్రీ చిమటా శ్రీనివాస్ మొ.న వారు.

1. సమస్య: వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్
పూరణ:
ఆర్షజ్ఞాన విధానధర్మములకును యజ్ఞేశ్వరారాధనం
కర్షక్షేత్ర చిదగ్ని బీజరుహ వాగ్గంధ ప్రకాశంబు దు
ర్ధర్షాఘాంధ వినాశమున శివమరుత్కౌండిన్య గోత్రోజసీ
వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్


2. సమస్య: మనలను గాచునదె మారణహోమము చిత్తగింపగన్
పూరణ:
వనరుహ లోచనాభినవ పంచశిరోరుహ నాట్యలాస్యముల్
ధనమదమూని అపహృత ధర్మ నిరీశ్వర యాగభావమున్
దునిమెడివేళ సత్యధృతి దోర్బల భధ్రకరాళ రూపమే
మనలను గాచునదె మారణహోమము చిత్తగింపగన్


3. సమస్య: ఆలి మాట వినుట కలుక దేల
పూరణ:
కాలికైన లోక పాలనా వేశంబు
విషము గ్రోల నైన వెనుదిరుగదు
నిండుబలము నెడమనిండి నడుపువేళ
ఆలి మాట వినుట కలుకదేల


4. సమస్య: పలికెద గాక సత్యమును పట్టణ వీధుల యందు మిత్రమా!
పూరణ:
కలహ విమర్శనాంత నరకప్రద దుఃఖ దురంత భారముల్
నళిన మనోహరాద్భుత గణద్వర నీలిమ రోచిరంశముల్
తొలగెడి వేళలందు నిజరూప విలాస సనాతనంబునే
పలికెద గాక సత్యమును పట్టణ వీధుల యందు మిత్రమా!


మరి కొన్ని పూరణలు:

రామా! శూర్పణఖాంతమ
ప్రామిన్నుకుల సొగసులూని రవళింపగక దు
ష్కామిత మప్రాచ్యయమనును
మామా! మామ్మేమి! మమ్మిమమ్మీ మామ్మా!

బుధుల గొలుచువారి పుణ్యవిశేషముల్
మహితకాంతిసారమౌక్తికములు
జ్ణానదుగ్ధసింధు జాతపర్వాధ్యక్ష
విధుని పొట్టలోన నిధులు మెండు

ఛందఃపద్మాకరమున
వందనపూరిత కవిత్వపానజిగీషన్
చిందు కనకసుమముల ప్రా
కుందేటిని కోడిపిల్ల గుటుకున మింగెన్

నవనవజన్మశ్రీయుత
పవిత్రసూత్రాన్వితునకు వరమంగళమున్!
అవిసెను చింతామణికై
అవధానికి సానిదాని అవసరమయ్యెన్!

విద్వదనేకసంఘపరభీతివిదూరకవిప్లవార్థముల్
మృద్వభిరమ్యభావహితవృత్తివివర్ధితపద్యబంధముల్
సాధ్వభినవ్యవైఖరివిశాలసమున్నతశైలవేదవేదీ
ద్విశతావధనమున తిప్పలుబెట్టిరి పృచ్ఛకాళిరో!

చందనచర్చితానుభవసౌమ్యకళంకవపుర్విలాసముల్
సుందరసింధుజాత విధుసుమ్నకరగ్రహకౌముదీతతుల్
కుందసమానరోచిరతికోమలబైందవతారకావళుల్
వందలభార్యలున్న పతి వందనపాత్రుడు వేదసాక్షిగా!

రాగవిమోహపారసలిలప్లవకేతుకదీర్ఘవీచికల్
మూగినవేళ కప్పబడు మోహమనోగతభావనావళుల్
దాగని ధూర్తవర్తనము దాటగ త్రెళ్ళెడి తార తానహో
ఏగతి వేడుకోగలదు ఈసతి దుర్మతి సాహసించగన్

దాడిమ్యామ్రఫలాంతరద్భుతరసోద్యానాధినాథాళికిన్
నీడల్ గాంచని మూర్ఖసంతతికిలన్ నిర్ఘోషితాక్రందనల్
వ్రీడావర్జితసద్విమర్శసరణిన్ వెల్గొందు ఖడ్గాళికిన్
సోడా త్రాగినవారు వ్రాయగలరే సోకైన పద్యంబిలన్

సద్య ఉపాసనప్రథమశాస్త్రవిచారవిమర్శసంచరత్
వైద్యనిధానమూర్తులకు వంద్యులకున్ సురసోమతీర్థమున్
హృద్యవికారరోగతరణీయసమర్థన చేయువేళ చి
న్మద్యము గ్రోలు వారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

కట్నము దయ్యమై వరలు కాపురుషాధమచిత్తమందునన్
చట్నజనించునట్టి విరసంబుల గాడ్పులు మిన్నునంటగా
పట్నపువాసులెల్లరకు భావము దాచెడి భావముష్టికై
రాట్నము చేతబట్టుకుని రాక్షసకృత్యము చేసినాడహో!

బలరిపుభంజనాకృతి విపత్పరిణామవినాశమూర్తినిన్
పొలుపుగ పేర్చినట్టి పలుభూములగుంపులు కల్పకాలముల్
తెలియగజేయునక్కథల తీరులవింతలు బాంధవాళులన్
చెలువగ రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభు డన్నయౌ

కల్పనా తిగతుంగా కల్పసూత్రము జ్ఞానమంగళమూర్తియై
శిల్పసుందరమందిరాంతర చిద్విలాసమనోజ్ఞియై
పొల్పునిల్చిన దుర్గరూపము మోయచిత్తగుహంబునన్
మిల్పిటాసున సింహమొక్కటి మేలుకొన్నది చూడరా!

ఆర్షజ్ఞానవిధానధర్మములకున్ యజ్ఞేశ్వరారాధనున్
కర్షక్షేత్ర చిదగ్నిబీజరుహ వాగ్గంధప్రకాశంబు దు
ర్ధర్షాగాంధవినాశమున్ శివమరుత్కౌండిన్యగోత్రౌజసీ
వర్షాకాలము వచ్చె గ్రీష్మమువలెన్ వైశాఖమాసంబునన్

ఈ సమావేశంలో స్థానిక వక్తలు, కథకులు, కవులు, కవయిత్రులు, సాహిత్యాభిలాషులు మొ.న వారు పాల్గొన్నారు. సభలోని వారి ఆత్మీయ స్పందనలతో, శ్రీచరణ్ గారికి సన్మానాలతో సభ దిగ్విజయంగా ముగిసింది.

అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-135/

https://www.koumudi.net/Monthly/2023/december/dec_2023_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం-134 వ సాహితీ సమావేశం

 వీక్షణం-134 వ సాహితీ సమావేశం

-- వరూధిని & డా. సంధ్యారాణి కొండబత్తిని --
vikshanam-134

వీక్షణం 134వ సాహితీ సమావేశం జూమ్ వేదికగా డాక్టర్ కె.గీతామాధవి గారి అధ్యక్షతన అక్టోబర్ 14 వ తేదీ శనివారం సాయంత్రం సుమారు మూడు గంటలపాటు జరిగింది. కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. వివిధ దేశాలనుండి వక్తలు, కథకులు, కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ కవి శ్రీ వసీరా, ప్రముఖ యువ కథా రచయిత శ్రీ వి.మల్లికార్జున్ పాల్గొన్నారు.

“వసీరా” గా ప్రసిద్ధి చెందిన వక్కలంక సీతారామారావు పుట్టింది, చదివింది కోనసీమ లోని అమలాపురం. జర్నలిస్ట్ గా వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో దాదాపు 30 స.రాలు  పైనే పనిచేసారు. లోహనది, మరోదశ, సెల్ఫీ కవితా సంకలనాలు రాసారు. “లోహనది” కి ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు, గరికపాటి అవార్డులు వచ్చాయి.

ముందుగా ప్రత్యేక ఆహ్వానితులు ప్రముఖ కవి, జర్నలిస్ట్ 'వసీరా' గారు తమ కవితాపఠనంతో హృదయాలని ద్రవింపచేశారు అంటే అతిశయోక్తి కాదేమో! కవితాసృజనలోని మెలకువలు, సూచనలు, సలహాలు వర్ధమానరచయితలకు ఉపయోగపడేలా సోదాహరణంగా వివరించారు.

ఇటీవల విడుదలైన వారి కవితా సంపుటి "సెల్ఫీ" నించి మొత్తం మూడు కవితల్ని వినిపించారు. మొదటిది హథ్రాస్, ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ అనే చోట ఒక దళిత బాలిక మీద అగ్రవర్ణాలకు చెందిన వారు అతి క్రూరంగా అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటనని ఖండిస్తూ రాసిన కవిత. హథ్రాస్ కవిత 2020 లో నెచ్చెలి అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. ఇందులో బాలికని కాళికతో పోలుస్తూ రాసిన కవితాత్మక వాక్యాలు ఇలా ఉన్నాయి.

"విస్ఫోటించే నేల లోంచి కొత్త కాళిక ఆవిర్భవిస్తోంది.
సత్యానికి నోరిచ్చేందుకు సహస్రబాహువుల్లో
కొత్త ఆయుధాలు ధరించి
పరపరా సరసరా నాలుకలు కోస్తోంది
కోసిన నాలికలు మొల చుట్టూ అలంకరించుకుంది
......
అచ్చంగా పరపరా కలుపు మొక్కలు కోసినట్లుగా
పురుషాంగాలు కోసి మొలచుట్టూ అలంకరించుకుంటోంది"
అని ఆక్రోశాన్ని వ్యక్తం చేసారు. తరువాత "బంగారుపాప", "ఏమో ఎవడికి తెలుసు" కవితల్ని వినిపించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు.

ఆ తర్వాత డా.గీత గారు వర్ధమాన కవులకు ఉపయోగపడేలా వచన కవితాసృజనలోని మెలకువలు, సూచనలు, సలహాలు తెలియజెయ్యమని వసీరా గారిని అడిగినప్పుడు అత్యంత ఆసక్తికరంగా, సోదాహరణంగా వివరించారు.

తరువాత శ్రీ వి.మల్లికార్జున్ గారి కథా పఠనం జరిగింది. 1992లో నల్లగొండ పట్టణంలో పుట్టి పెరిగిన మల్లికార్జున్, ఇంజినీరింగ్ చదివి కథల మీద ఇష్టంతో సాహిత్యరంగం వైపు వచ్చారు. 2014 నుంచి కథలు రాస్తున్నారు. ఇప్పటివరకు ‘ఇరానీకేఫ్’, ‘కాగితం పడవలు’, ‘నల్లగొండ కథలు’ కథాసంపుటాలు వెలువరించారు. గతంలో సాక్షి, వెలుగు దినపత్రికల సండే మ్యాగజైన్లలో పనిచేసి, ఆ తర్వాత సొంతంగా ‘అజు పబ్లికేషన్స్’ పేరుతో పుస్తక ప్రచురణ సంస్థను నెలకొల్పి పది పుస్తకాలు ప్రచురించారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. 2023లో మల్లికార్జున్ తన రచనలకు గానూ డా. వి. చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారం అందుకున్నారు.

ఈ సమావేశంలో 'నల్లగొండ కథలు' అనే కథా సంపుటి నుండి మా అమ్మ ముత్యాలు, మా నాన్న మారయ్య అనే కథల్ని చదివి వినిపించారు. తమ బాల్యం, ఊరు, అమ్మ, నాన్నలతో అనుబంధాన్ని తెలియజేస్తూ, ప్రత్యేకంగా మాండలిక యాసలో సాగిన కథాపఠనం విశేషంగా ఆకట్టుకుంది. శ్రోతలని తమ తమ బాల్యపు అనుభవాలను నెమరువేసుకునేలా చేసింది.

"అప్పట్నించి మా అమ్మ మళ్లా చెవులు కుట్టిచ్చలేదు. ఎడమపక్క చెవి గింతంత తెగి పక్కకి జరిగి ఉంటది. నాకు ఆ గింతంత చెవి ముక్క పట్టుకొని మా అమ్మ పక్కన కూసొని ముచ్చట చెప్పుడంటే పిచ్చి ఇష్టం."

"‘‘ఏం పేరే ఆయనది?’’ అనడిగిన. ‘‘ఏమో పేరుండెనేరా?’’ అని చానాసేపు ఆగిండు. ‘‘ముసిలిమోల్ల పిల్లగాడురా, చానా మంచోడు, చూసినవుగా!’’ అన్నడు మా నాన్న."

వంటి ఆర్ద్రమైన వాక్యాలు సభలోని వారికి కంట తడి పెట్టించాయి. ఈ కథలన్నీ ఆశువుగా చెప్పినట్టు అల్లడం ప్రత్యేకత. అలాగే ఈ కథల్లో ఎత్తుగడ, ముగింపులు అలవోకగా కనిపించినా కథ చెప్పే మంచి టెక్నిక్ ని ఔపోసన పట్టినట్టు ఉంటాయి.

ఆ తరువాత జరిగిన కవిసమ్మేళనంలో శ్రీధరరెడ్డి బిల్లా, దాలిరాజు వైశ్యరాజు, బాలకృష్ణారెడ్డి తాటిపర్తి, డా.కె.గీత, డా.సంధ్యారాణి కొండబత్తిని, మండ వీరస్వామి గౌడ్, గుర్రం మల్లేశం, ఆకుల అయోధ్య, గడిపె మల్లేశు, షేక్ రహీం సాహెబ్, మచ్చా రాజమౌళి, సరస్వతి రాయవరపు, చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, విజయలక్ష్మి మల్కని, అరుణ జ్యోతి, సత్యవతి యెడ్ల, షేక్ అమీనా కలందర్,

సావిత్రి రంజోల్కర్, అమృతవల్లి అవధానం, డాక్టర్ దేవులపల్లి పద్మజ, డాక్టర్ ఎం.ఎన్.బృంద, దేవి గాయత్రి, నారోజు వెంకటరమణ, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, మేడిశెట్టి యోగేశ్వరరావు, ప్రసాదరావు రామాయణం, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, సాదనాల వెంకటస్వామి నాయుడు, డాక్టర్ మోటూరి నారాయణరావు మొ.న కవులు, కవయిత్రులు వైవిధ్య భరితమైన అంశాలపై కవితాపఠనంతో అలరించారు.

సరస్వతీ పుత్రిక డాక్టర్ గీతామాధవి గారు శతవిధాలా నిరంతరం ఎంతో శ్రమకోర్చి, వృత్తిని ప్రవృత్తిని సమన్వయo చేస్తూ సాహిత్యాభిలాషులను ప్రోత్సహిస్తూ క్రమం తప్పకుండా ప్రతినెలా అద్భుతమైన సాహితీ సమావేశాల్ని నిర్వహిస్తున్న వారి కృషికి అభినందన చందనాలు.

శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల గారు, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గార్ల ఆత్మీయ సహకారాలు, స్పందనలతో సభ దిగ్విజయంగా ముగిసింది. అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-134/

https://www.koumudi.net/Monthly/2023/november/nov_2023_vyAsakoumudi_vikshanam.pdf

"వీక్షణం" సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 11వ వార్షికోత్సవం

 "వీక్షణం" సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 11వ వార్షికోత్సవం

-- సుభద్ర ద్రోణంరాజు & వరూధిని --
vikshanam-11-Anniversary-01

సెప్టెంబరు 9/10, 2023 తేదీలలో ఉదయం 10 గం. నించి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం 11 వ వార్షికోత్సవాన్ని అంతర్జాలంలోనూ, అమెరికాలోని కాలిఫోర్నియాలో మిల్పిటాస్ నగరంలోని స్వాగత్ హోటల్లోనూ అట్టహాసంగా జరుపుకుంది.

ఈ కార్యక్రమాలను వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి ఆహ్వానం పలికి ప్రారంభించారు. ముందుగా ఆన్లైన్ సమావేశంలో వీక్షణం ఆవిర్భావ వికాసాలను గురించి తెలియజేస్తూ-

"గత ఏడాది కాలంగా వీక్షణం అంతర్జాతీయ సాహితీ వేదిక అయ్యింది. ఆన్ లైనులోనూ, ముఖతః సమావేశాలు నడపడానికి తమ వంతు సహాయం చేస్తూ, చేయూతనిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు. ఈ వీక్షణం సాహితీ వేదిక స్థాపనకు అంకురార్పణ ఎలా జరిగిందో ముందు వివరిస్తాను. చిన్నతనం నించి సృజనాత్మక రచనలు చెయ్యడం, సభలు, సమావేశాల్లో పాల్గొనడం అలవాటైన నాకు అమెరికా వచ్చాక నేను అప్పటివరకు నా చుట్టూ ఉన్న సాహిత్య వాతావరణాన్ని కోల్పోయేను. సాహిత్యానికంటూ ఒక వేదిక లేకపోవడం ఒక లోటుగా అనిపించేది. రాయాలనే స్ఫూర్తి అడుగంటిపోతూ ఉండేది. అందుకోసం ఏమైనా ఎవరైనా చేస్తే బావుణ్ణని ఎప్పుడూ అనుకునేదాన్ని. అనుకోకుండా 2012లో ఒకానొక సాయంత్రం ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు. వెంటనే దాదాపు 30 మందితో చర్చించి, మొదటగా వేమూరి వెంకటేశ్వర్రావు గారింట్లో “వీక్షణం” పేరుతో మొదటి సమావేశాన్ని 2012 సెప్టెంబరు 9 వ తారీఖున జరుపుకున్నాం. ఇక ఆగకుండా నెలనెలా రెండవ ఆదివారం నాడు కొనసాగుతూనే ఉంది వీక్షణం. ఈవేళ వీక్షణంలో ప్రపంచవ్యాప్తంగా వెయ్యిమందికి పైగా సభ్యులున్నారు.

కేవలం నాలోను, నా చుట్టూ ఉన్నవారిలోను సాహితీ స్ఫూర్తిని నిలబెట్టుకునే వేదికగా మాత్రమే కాకుండా, ఉచితంగా, స్వచ్చందంగా సమావేశాలు జరపాలనే ఉన్నతమైన లక్ష్యంతో కొనసాగుతూ ఉంది వీక్షణం. ఆ లక్ష్యమే వీక్షణంలో అందరినీ ఒక కుటుంబంగా చేసింది. విరాళాలు లేకుండా జరుపుకునే ఈ సమావేశాలు నిజానికి ఒక విజయవంతమైన ప్రయోగం. ఈ ప్రయత్నంలో నాకు ఎంతగానో సహకరించిన కాలిఫోర్నియా రచయితలు, సాహిత్యాభిలాషులందరికీ సభాముఖంగా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

“వీక్షణం - సాహితీ గవాక్షం” అని మనందరం పిలుచుకునే ఈ వేదికలో లక్ష్మీపార్వతిగారు, గొల్లపూడి మారుతీరావుగారు, సుద్దాల అశోక్ తేజగారు, కాత్యాయనీ విద్మహేగారు, పాపినేని శివశంకర్ గారు, చుక్కా రామయ్య గారు వంటి ఎందరో ప్రముఖులు ప్రసంగించారు. 2021లో ఘనంగా జరిగిన 100 వ సమావేశం జరుపుకున్నాం. అందులో ప్రపంచ వ్యాప్త ప్రముఖులైన  డా|| జంపాల చౌదరి గారు, వంగూరి చిట్టెన్ రాజు గారు, శ్రీ కె.రత్నకుమార్ గారు, శ్రీ సాంస్కృతిక కళాసారధి  (సింగపూర్) , శ్రీ రావు కొంచాడ గారు, ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (ఆస్ట్రేలియా), - తెలుగుతల్లి పత్రికా నిర్వాహకులు శ్రీమతి లక్ష్మి రాయవరపు గారు (కెనడా),  శ్రీ కిరణ్ ప్రభ గారు వంటి ఎందరో ప్రసంగించారు. అన్నివేదికల్లో దాదాపు100మందికి పైగా పాల్గొన్నారు.

అలాగే ప్రతి సమావేశం ఒక క్రమమైన అనుక్రమణికతో జరుగుతుంది. ప్రధాన ప్రసంగం, కవిసమ్మేళనం, చర్చ వంటివి భాగాలుగా ఉంటాయి. వీక్షణం బ్లాగులో, ఫేస్ బుక్ పేజీలో నెలనెలా సమావేశాలు, వివరాలు పొందుపరచబడతాయి. నెలనెలా వీక్షణం కవితల పోటీలు నిర్వ్హహించబడతాయి. సంవత్సరానికొకసారి వీక్షణం వార్షిక ప్రత్యేక సంచిక ప్రచురింపడుతుంది.

వీక్షణం ఛానెల్ లో సమావేశాల వీడియోలు పొందుపరచబడుతున్నాయి. నెలనెలా వీక్షణం సమావేశ సమీక్షలు స్థానిక పత్రికలైన కౌముది, సిరిమల్లెలలో ముద్రింపబడతాయి. ఇలా ఒక చక్కటి కార్యాచరణతో ఇప్పటివరకు 132 సమావేశాలు నెలనెలా క్రమం తప్పకుండా గడిచాయి.

అయితే నాకు నేనుగా ఇదంతా చెయ్యడానికి, ఆసక్తి కోల్పోకుండా ఇటువంటి వేదికని నడపడానికి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో, ఎంత శ్రమ పడాల్సి వస్తుందో తెలిసింది. అన్నిటికంటే విలువైన సమయం వెచ్చించడంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చెయ్యాలో అర్థమైంది. అయితే అది గొప్ప ఆనందాన్నిచ్చే శ్రమ. అత్యంత ఆత్మీయమైన బాధ్యత. ఈవేళ నాకోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది గొప్ప సహృదయులు, ఆత్మీయులు ఉన్నారు అంటే అది కేవలం వీక్షణం వల్లే. నాతో బాటూ అడుగడుగునా సహకరిస్తూ వీక్షణం విజయానికి తోడ్పడుతున్న మిత్రులందరికీ మరోసారి పేరుపేరునా అభివందనాలు తెలియజేస్తున్నాను." అని కృతజ్ఞతలతో ముగించారు.

తరువాత అంతర్జాల కార్యక్రమంలో శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ ఆత్మీయవాక్యాలు పలికారు. మృత్యుంజయుడు తాటిపాములగారు వీక్షణం సభ్యుడిగా మొదటి నించీ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు గత ఏడాది కాలంగా వీక్షణం సమావేశాల అనుభవాలను, ఈ ప్రత్యేక సమావేశ ఏర్పాట్ల విశేషాలను పంచుకున్నారు.

విశిష్ట అతిథిగా వంగూరి ఫౌండేషన్ అధినేత శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు విచ్చేసి, ప్రసంగించారు."గీతమ్మా" అంటూ ఆత్మీయంగా సంబోధిస్తూ ఇటువంటి వేదికలను క్రమం తప్పకుండా నడపడంలో ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలను వివరించారు. వీక్షణం ఇంకా ఎన్నో వార్షిక సమావేశాల్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ముగించారు.

ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారు "తెలుగుసాహిత్య సౌరభం" అనే అంశం మీద ప్రసంగిస్తూ నన్నయ కాలం నుండి నాయకరాజుల కాలం వరకూ సాహిత్యాన్ని సోదాహరణంగా వివరించారు. వరుసగా నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాధుడు, పోతన, కృష్ణదేవరాయలు, వారి ఆస్థానకవులైన పెద్దన, నంది తిమ్మన, రామకృష్ణ కవి మొ.న అష్టదిగ్గజాలు, నాయకరాజుల కాలంలో తాను పరిశోధన చేసిన కందుకూరి రుద్రకవి సాహిత్యం గురించి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని అందిస్తూ చక్కని ప్రసంగాన్ని అందించారు.

ప్రొ.కొలకలూరి మధుజ్యోతి గారు "ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీ చిత్రణ" అనే అంశం మీద వివరణాత్మక ప్రసంగం చేసారు. కందుకూరి వీరేశలింగం పంతులుగారి నించి మొదలుకొని స్త్రీ అభ్యున్నతికి పాటుపడిన గురజాడ, చలం, కొడవటిగంటి కుటుంబరావు, కొలకలూరి ఇనాక్ గారు మొ.న ఎందరో రచయితల రచనల్ని, భండారు అచ్చమాంబ మొదలుకుని ఆధునిక స్త్రీవాద సాహిత్యం వరకూ కథలు, నవలల్ని సోదాహరణంగా వివరిస్తూ ఉధృత ప్రవాహంలా అద్భుతమైన ప్రసంగం చేశారు.

తరువాత డా.సంధ్యారాణి కొండబత్తిని కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఫ్రాన్సు దేశాల నుండి కవులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో వసీరా, డా.కె.గీత, శ్రీధర్ రెడ్డి బిల్లా, ఉషా శ్రీదేవి శ్రీధర, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, సాదనాల వెంకటస్వామి నాయుడు, డాక్టర్ కందేపి రాణిప్రసాద్, దేవి గాయత్రి, డాక్టర్ ఎం.ఎన్.బృంద, మేడిశెట్టి యోగేశ్వరరావు, అమృతవల్లి అవధానం, మామిళ్ల లోకనాధం, నారోజు వెంకటరమణ, డాక్టర్ మోటూరి నారాయణరావు, ప్రసాదరావు రామాయణం, డాక్టర్ దేవులపల్లి పద్మజ, కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, డబ్బీరు వెంకట రమణమూర్తి, మన్నె లలిత మొ.న వారు పాల్గొని కవితాగానం చేసారు.

చివరగా జరిగిన సమాపనోత్సవంలో ప్రత్యేక అతిథులుగా యు.కె నించి శ్రీ రాజేష్ తోలేటి గారు, ఫ్రాన్స్ నించి శ్రీ వెంకట కృష్ణ మాదాసు గార్లు పాల్గొని తమ ఆత్మీయ సందేశాలనందించారు. తమ దేశాల్లో సాహిత్య కార్యక్రమాలు జరుపుకొందుకు వీక్షణం తమకు మార్గదర్శిగా నిలుస్తూ, మంచి ప్రోత్సాహాన్నిచ్చిందని అన్నారు.

vikshanam-11-Anniversary-02

ఇక ఆదివారం సెప్టెంబరు,10 నాడు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో స్వాగత్ హోటల్లో రోజంతా జరిగిన వీక్షణం వార్షికోత్సవాన్ని డా.కె.గీత గారు నిర్వహించారు. డా.కె.గీత ఆహ్వాన ప్రసంగం తరువాత ముఖ్య అతిథులుగా సిరిమల్లె అంతర్జాల మాస పత్రిక సంపాదకులు డా. మధు బుడమగుంట గారు, శ్రీ చిమటా శ్రీనివాస్ గారు, శ్రీ కిరణ్ ప్రభ గార్లు ప్రసంగాలు చేశారు.

డా.మధు బుడమగుంట గారు "మన సాహిత్యం మన చేతిలో" అనే అంశం మీద ప్రసంగిస్తూ మాతృభాషలో సాహిత్య సృజన చేస్తే జీవం ఉట్టిపడుతూ ఉంటుందన్నారు. మనం మనంగానే మిగిలిన రోజు మానసిక పరిణతి పొంది మనోల్లాసం తో మెదడు చురుకుగా పనిచేసి మనలోని సాహితీ పిపాసి బయటకు వచ్చి మన ఆలోచనల ఉధృతి ని పెంచి అన్నింటా మెరుగైన అక్షరక్రమాన్ని మనకు అందించడం జరుగుతుంది. మనలోని మానసిక పరిపక్వత ను గుర్తించిన నాడు, మనలోని స్వార్థ చింతన తరిగిపోయి సహజమైన మానవత్వ పోకడలు కనబడతాయి. అప్పుడు మాతృభాష మాధుర్యాన్ని ఉగ్గుపాలతో చవిచూసిన మనవంటి భాషా ప్రేమికులకు భాషా సాహిత్య పరిరక్షణ పెద్ద విషయం కాదు. మన బాధ్యత ను గుర్తెరిగి విధిని నిర్వహించడమే అని సెలవిచ్చారు. అలాగే తెలుగు భాష విశిష్టతను తెలియజేస్తూ మన భాషలోని అనేక ప్రత్యేకాంశాలను పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన సాహిత్యం రూపుదిద్దుకునే క్రమాన్ని వివరిస్తూ ముగించారు.

తరువాత శ్రీ చిమటా శ్రీనివాస్ "తెలుగు సినిమా పాటల్లోని మంచి సాహిత్యం" గురించి మాట్లాడుతూ తొలితరం రచనల నించి ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల వరకూ వివరించారు. 1931 లోని భక్తప్రహ్లాద లోని కేశవదాసు, సముద్రాల, పింగళి, దేవులపల్లి, శ్రీశ్రీ , మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఆత్రేయ మున్నగు వారి పాటల్లోని విశేషాల్ని వివరిస్తూ, చక్కగా రాగయుక్తంగా పాడుతూ సభలోని వారందరినీ అలరించారు.

తరువాత వీక్షణం 11 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికల ఆవిష్కరణలు శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి కాంతి పాతూరి, డా.కె.గీత, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ వేణు ఆసూరి, డా.మధు బుడమగుంట, శ్రీ చిమటా శ్రీనివాస్ గార్ల  చేతుల మీదుగా జరిగాయి.

వెనువెంటనే శ్రీ వేణు ఆసూరి కవితాసంపుటి “తరంగాలు” పుస్తకావిష్కరణని  శ్రీ సుభాష్ పెద్దు నిర్వహించారు. ప్రశ్నోత్తర పరంపరగా సాగిన పుస్తక పరిచయం కొత్తగా, విశేషంగా జరిగింది. వేణుగారు స్వేచ్ఛ, సౌందర్యం, అమ్మ గురించిన కవితల్ని గురించి వివరించారు. గీతగారు అప్పటికప్పుడు వేణుగారి కవిత "కలలుకను-కలలుకను" కి రాగం కట్టి అలవోకగా పాడి వినిపించి అందరినీ అలరించారు.

భోజన విరామం తర్వాత శ్రీ కిరణ్ ప్రభ గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జీవిత విశేషాల్ని, గొప్ప తనాన్ని వివరించి అందర్నీ ఆకట్టుకున్నారు. కేవలం వ్యావహారిక తెలుగు భాషా ఉద్యమకారునిగా, తెలుగు భాష సరళీకృత కర్తగా అందరికీ తెలిసిన రామ్మూర్తి పంతులు గారి నిజజీవితంలోని వాస్తవికతను వివరించారు. అందరికీ తెలియని ఎన్నో విషయాలను, రామ్మూర్తి పంతులు గారు స్వీయ ఆసక్తితో, సొంత ఖర్చుతో సవరభాషకు చేసిన విశిష్ట సేవని చక్కగా వివరించారు.

తరువాత శ్రీ ఎ.కె. ప్రభాకర్ గారు నిర్వహించిన కథా చర్చలో శ్రీ కె.వి. రమణారావు , శ్రీమతి తురగా జయశ్యామల, డా.కె.గీత, కుమారి అమూల్య, శ్రీ విద్యార్థి మొ.న వారు పాల్గొన్నారు. గీతగారు రచన సామాజిక బాధ్యత అంటూ, డయాస్పోరా కథల పరిణామం, రచయితల బాధ్యతల్ని వివరించారు. జయశ్యామలగారు, కె.వి. రమణారావు గారు, విద్యార్థి గారు కథా రచయితల నేపథ్యం, కథా వస్తువు, కథా ప్రయోజనం మొ.న అంశాల మీద మాట్లాడేరు. ఇప్పటి కొత్త తరానికి చెందిన యువతి అమూల్య తనకు తెలిసిన తెలుగు సాహిత్యం పట్ల తన అభిప్రాయాల్ని, తన రచనానుభవాల్ని వివరించింది.

చివరిగా శ్రీ వంశీ ప్రఖ్యా గారి నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనంలో స్థానిక ప్రముఖ కవులు శ్రీమతి షంషాద్, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, డా.కె.గీత, శ్రీ ఎ.కె. ప్రభాకర్, శ్రీ వేణు ఆసూరి మున్నగువారు పాల్గొన్నారు.

ఎందరో సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్న ఈ వార్షికోత్సవ సభల సందర్భంగా అధ్యక్షులు డా.కె.గీతామాధవి కవులకు, అతిథులకు ప్రశంసాపత్రాల్ని అందజేశారు.

కిందటి ఏడాది నించి ప్రపంచ వ్యాప్తమైన "వీక్షణం" సాహితీ గవాక్షం అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియా లోనే కాక, నెలనెలా అంతర్జాతీయ అంతర్జాల సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ, ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని ప్రపంచమంతా చాటుతూ విజయవంతంగా 11 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశాల వీడియోల్ని ఇక్కడ చూడవచ్చు.

  1. మిల్పిటాస్, కాలిఫోర్నియాలో జరిగిన ప్రత్యక్ష సమావేశ వీడియోలు:-
    పార్ట్-1: https://youtube.com/live/ceG5lZPhdkU?feature=share
    పార్ట్-2 : https://youtube.com/live/j6aIG1AbIio?feature=share
  2. ఆన్ లైన్ సమావేశవీడియో:- https://youtube.com/live/XgXLLoqHpHM?feature=share
_______________




Wednesday 17 January 2024

 వీక్షణం సాహితీ గవాక్షం-132 వ సమావేశం

-- కె వి యస్ గౌరీపతి శాస్త్రి(వీరవతి) --
vikshanam-132

ఒక వైపు సూర్యోదయం(భారత దేశంలో) మరొక వైపు చంద్రోదయం(అమెరికా/ కాలిఫోర్నియా). ఈ రెండింటి నడుమ కవితోదయం (కవి సమ్మేళనం). ఈ సమన్వయం లో మెరుస్తున్న కవి తారకలు (కవులు).  ఈ విధమైన ప్రకృతి వీక్షణలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమైనది వీక్షణం 132 వ సాహితీ సమావేశం. జూమ్ (Zoom) వేదికగా మధుర స్వాగత వచనాపలుకులతో సంస్థ సంస్థాపక అధ్యక్షురాలు డా. కె గీతామాధవి ఆధ్వర్యంలో ప్రతీ నెల జరుగు విధంగా ఈ 13.08.23 వ తేదీన చాలా ఆసక్తికరంగా ప్రారంభం అయినది. ముందుగా డా. గీతామాధవి సభకు విశేష సంఖ్యలో విచ్చేసిన ప్రధాన ప్రసంగకర్త ప్రొ. సిహెచ్. సుశీల గారిని /అతిథులు/కవులు/సాహితీవేత్త లందరికీ స్వాగతం పలుకుతూ, ఈ సమావేశంలో ఇటీవలే దివంగతులైన శ్రీ రమణ గారి గురించి వారి రచనలను గూర్చి ప్రసంగించ వలసిందిగా ప్రొ।। సుశీలమ్మ గారిని కోరుతూ, వారిని సభకు పరిచయం చేయవలసిందిగా శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారిని కోరినారు.

ప్రొ. సిహెచ్. సుశీల గారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరు లో సుదీర్ఘ కాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలు లో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ ల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనలపై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు.

వీరి నాన్నగారి పేరు మీద విమర్శారంగం లో కృషి చేస్తున్న వారికి కీ.శే. సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారాన్ని గత 3 సంవత్సరాలుగా అవార్డు ఇస్తున్నారు. వరుసగా గత మూడేళ్ళలో కడియాల రామ్మోహనరాయ్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.పి. అశోక్ కుమార్ గార్లకు ఈ అవార్డుని అందజేశారు. విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో "కవిసంధ్య"(శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు. అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష (పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ఈ మాసం మంచి కవిత’  శీర్షిక నిర్వహించారు. వీరి రచనలు:

1.స్తీవాదం - పురుష రచయితలు 2. కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర 3. విమర్శనాలోకనం (విమర్శ వ్యాసాలు) 4. విమర్శ వీక్షణం (విమర్శ వ్యాసాలు)

పరిచయ అనంతరం ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారు సభకు నమస్కరిస్తూ శ్రీరమణ గారి సాహిత్యం గూర్చి ప్రసంగం కొనసాగించారు.

"శ్రీరమణ గారు అర్థశతాబ్దం పాటు అలుపూ సొలుపూ లేకుండా అనేక మైన రచనలు విలక్షణమైన, విశిష్టమైన రీతిలో విస్తృతంగా వ్రాసి తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన మాటల్లోని చెణుపులు గాని, విసుర్లు గాని ఆంధ్రప్రజల్ని ఉర్రూతలూగించినాయి.

ఆయన గుంటూరు జిల్లా తెనాలి వరాంగపురము అగ్రహారములో మధ్యతరగతి కుటుంబములో 1952 సెప్టెంబెర్ 21 వ తేదీన జన్మించారు. అప్పుడు ఆయనకు పెట్టిన పేరు వంకమామిడి రాధాకృష్ణ. వారి తాతగారు (అమ్మ తండ్రి) మగపిల్లలు లేక దత్తత తీసుకోవడం వలన ఆయన ఇంటి పేరు కామరాజు రామారావు. చిన్నప్పట్నుంచి ఆయనకు వ్యాస రచనలు అంటే ఇష్టం. పుస్తకాలు బాగా చదివే వారు. వ్యాస రచనలు వ్రాసే సమయంలో ఎప్పుడూ మొదటి బహుమతి ఆయనకే వచ్చేది. ఆ సమయం లో రామకృష్ణ మిషన్ వారు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రధమ బహుమతి రావడంతో ఈయనను గెస్ట్ గా హిమాలయా పర్వతాలకు తీసుకు వెళ్ళడం జరిగింది. తరువాత, చాలా చిన్న వయస్సులోనే కొంచం ధాఠీగా... రమణమహర్షి గారి విశ్వాసం వల్లనో, ముళ్ళపూడి వెంకట రమణ గారి సాహిత్య అభిలాష వల్లనో తనకు తానే శ్రీరమణ అనే కలం పేరుతో రచనలు చేసి ధైర్యంగా ఆంధ్రప్రభ పత్రికకు పంపించారు. అది చూసి నండూరి రామ్మోహనరావు గారు చాలా ఆనందపడి అతన్ని పిలిపించి, చాలా చురుకైన కుర్రవాడు, పదునైన కలం అని, ఇతనిచేత వ్రాయించాలని అభిలషించి మా పత్రికలో నీవు వ్రాయాలి, అన్నప్పుడు కాలమ్స్ వ్రాస్తా అని చెప్పారు. కాలమ్స్  వ్రాయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే నిన్న ఏం జరిగిందో, లేక ఈరోజు ఏం జరిగిందో, చూసి దాన్ని మర్నాడు దానికి సరిపోయేటట్లుగా, అది సాహిత్యం కావచ్చు, రాజకీయం కావచ్చు, వాటికి చణుకులు అద్దుతూ అందర్నీ ఆకర్షించే విధంగా వ్రాయడమంటే చాలా కష్టం. ఆయన ధైర్యంగా కాలమ్స్ వ్రాస్తానన్నారు, అప్పట్నుంచి బ్రహ్మాండంగా కాలమ్స్ వ్రాస్తూ ఒకేసారి రెండు, మూడు పత్రికలకు వ్రాయడం జరిగింది. రంగుల రాట్నం అనే దాంట్లో అనేక మంది కవులను గురించి లేదా రాజకీయాల గురించి  హాస్యంగా వ్రాయటం జరిగింది.

అలాగే శ్రీరమణ గారు అనగానే మనకు పేరడీలు గుర్తుకు వస్తాయి. అంతకు ముందు పేరడీలు అనగానే జరుక్ శాస్త్రి (జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి) గారు గుర్తుకు వస్తారు. అసలు పేరడీ మనది కాదు. మనకు వ్యంగ్యం ఉంది. పేరడీ అంటే హాస్యపూర్వకంగా చేసే వ్యంగ్యం. ఇది ఆంధ్ర సాహిత్య ప్రభావం వల్లనే వచ్చింది. జరుక్ శాస్త్రి గారు, ఒక్కొక్క రచయితని తీసికొని, ఆయన ఇలా వ్రాస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రమే వ్రాశారు. అయితే శ్రీరమణ గారు ఒక క్రొత్త ప్రయోగం చేశారు. రచయితలు అందరూ కలిస్తే వారి రచనలు ఎలా ఉంటాయి. ఒక గులాబీ పువ్వుని రచయితలు అందరూ ఎలా వర్ణిస్తారు? అనే హాస్య రచన చేయటం జరిగింది. దాంట్లో మనం సుప్రసిద్ధుల వచన పచనం, అంటే వాళ్ళు వచనం ఎలా వ్రాస్తారు? వారి యొక్క వచనం వ్యంగ్యంగా ఎలా ఉంటుంది అని వ్రాశారు. పీఠికా పాటవం. వారు పీఠికలు ఎలా వ్రాస్తారు? అనేది వ్రాశారు. విశ్వనాధ సత్యన్నారాయణ శాస్త్రి గారు కవులనందర్నీ పొగుడుతున్నట్టే ఉంటారు, కానీ ఇతడు కూడా ఒక కవియేనా? కవియని అందరూ అంటూ ఉంటారు అని వ్యంగ్యంగా అంటారు. కొంతమంది సినిమా సమీక్షలు వ్రాశారు. ఒక్క పేరు మారిస్తే చాలు, మిగతా అంతా ఒకేలా ఉంటుంది. దర్శకుడు తన ప్రతిభను చూపించాడు, అలాగే కధానాయకుడు, కధానాయిక వారి శక్తి మేరకు నటించారు లాంటి పడికట్టు పదాలతోటి కొంతమంది వ్రాస్తూ ఉంటారు. దాంట్లో కూడా ప్రముఖులు వ్రాస్తే ఎలా ఉంటుంది? అని వ్రాశారు.

వీటన్నిటి కంటే అద్భుతంగా, అందర్నీ నవ్వించే "రైలుబండిలో వైతాళికులు". రైలుబండిలో వైతాళికులు ఎవరు? రైలుబండిలో ఒక కంపార్టుమెంటులో విశ్వనాధ సత్యన్నారాయణ శాస్త్రి గారు, కాటూరి వారు, పింగళి వారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, పిలకా గణపతి శాస్త్రి గారు, మొక్కపాటివారు, తల్లావర్ఝుల శివశంకర శాస్త్రి గారు, జలసూత్రం గారు, వీళ్లంతా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది? టి.టి. వచ్చి టిక్కెట్ అడిగి నపుడు వాళ్ళ సంభాషణ ఎలాఉంటుంది అనేది ఒక అద్భుతమైన హాస్య, వ్యంగ్య రచన. వీళ్లందరి పట్లా ఇతనికి అభిమానం, గౌరవం ఉంది. వీళ్ళంటే అతనికి ప్రాణం. అయినా కూడా వారి గూర్చి వ్యంగ్యంగా వ్రాశారంటే, వాళ్ళని ఎంత లోతుగానో చదివి ఉండాలి, వాళ్లపై ఎంత భక్తి తోనో, వాళ్ళ నాడిని పట్టుకొని వ్రాశారు. విశ్వనాథవారు ఎలా వ్రాస్తారు, శ్రీ శ్రీ ఎలా వ్రాస్తారు, అలా అందరి రచనలను అధ్యనం చేసి, వాళ్ళ వాళ్ళ పుస్తకాలు బాగా చదివి, రచనా శైలిని పట్టుకొని వ్రాశారు. టికెట్ కలెక్టర్ వచ్చారు. వచ్చి, పైన పడుకొని ఉన్న కృష్ణశాస్త్రి టికెట్ అడిగి మీరు క్రిందికి దిగి రండి అన్నారు. వెంటనే అతను 'దిగి రాను దిగి రాను పైనుంచి నేను' 'విప్పి వేసుదురుగాక నాకేటి సిగ్గు' అన్నారు. అయితే టిక్కెట్స్ చూపించండి అన్నారు. ఆయన రెండు టికెట్లు చూపించారుట. రెండు టికెట్లు ఎవరికండి అని అడగగా ఒకటి నాకు, రెండవది నా ఊహా ప్రేయసి ఊర్వశి కి అని చెప్పారుట. ఎక్కడున్నారు అని అడిగితే నా కలం, నా ఊహల్లో అని చెప్పారుట. అయ్య బాబోయ్ అని ప్రక్కనే ఉన్న శ్రీ శ్రీ గారిని చూసి, ఎవరండి మీరు అని అడిగితే, 'భూతాన్ని యజ్ఞోపవీతాన్ని' అనే పద్యాన్ని చెప్పారుట. కాస్త తెలుగులో చెప్పండి అన్నారుట. అంటే ఇప్పటి వరకు సాహిత్యం నన్ను నడిపిండి, ఇక్కడ్నుండి సాహిత్యాన్ని నేను నడుపుతాను. కావచ్చండి, ఇది సర్కార్ వారు నడుపుతున్నారు. ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు. అంతలో విశ్వనాధ సత్యన్నారాయణ గారి వద్దకు వచ్చి టికెట్ అని అడిగారు. ఆయన లేదు. అదేమిటండి లేదు అంటారు అంటే, అల నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదు అనే పద్యం చెప్పారుట. అదేంటి టికెట్ లేదంటారు అలా నడిచేరుట. ఇంతకీ టిక్కెట్స్ అన్నీ ఎక్కడి ఉన్నాయి అంటే, జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి గారి వద్ద ఉన్నాయి. అతను ట్రైన్ బయలుదేరాక వేరే కంపార్ట్మెంట్ ఎక్కారు. ఇలా కవుల్నందర్నీ అడుగుతూ, చిట్టా చివరికి ఒక స్టేషన్ లో ఆగి నప్పుడు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు జలసూత్రం గారు. ఇవిగోనండి టిక్కెట్స్ అన్నారు. ఇంతకీ చలం ఏరి అని చూస్తే, ఏమోనండి ఇంతకుముందు ఐదుగురు ఆరుగురుతో స్త్రీలతో కలసి స్టేషన్ లో దిగిపోయారు. ఐతే చలం గారు స్త్రీలకు అండదండగా దిగిపోయారేమో, వారికి రక్షణ కోసం దిగిపోయారేమో, వాళ్ళ మనసు ఉంది, వాళ్ళకు ఆలోచన ఉంది అని వాళ్ళ వెంటపడ్డారేమో, తెలియదు. ఇలా సాగిపోతుంది. ఇది చదివితే ఎవరికీ నవ్వు రాకుండా ఉండదు. "

ఇవాళ మనం ఇటీవలే మరణించిన శ్రీ రమణ గారి రచనలను గూర్చి చెప్పుకుంటూ ఉన్నాము అని వారి ఫోటో చూపిస్తూ సుశీల గారు ఇలా కొనసాగించారు.

ఆయన రోజూ కాలమ్స్ వీక్లీల్లో గాని, ఆదివారం అనుబంధంలో గాని అనేకం వ్రాశారు. అంతేకాకుండా రేడియో ప్రసంగాలు కూడా చాలా రచించారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసింది ఆయన యొక్క కథలు. ఈయన 1997 నుంచి 1999 వరకు 100 వారాల పాటు ఆంధ్రప్రభ  వీక్లీ లో "శ్రీఛానల్" అనే ఫీచర్ని నిర్వహించారు. ఇది కూడా చాలా అద్భుతమైన హాస్య ప్రసంగాలు. కీ।।శే।।శేఖర్ అనే ఆయన చాలా ఇష్టంగా వీటికి బొమ్మలు వేసేవారు. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మగారు సంపాదకులుగా ఉన్నప్పుడు, ప్రతీ వారము 2 పేజీల్లో హాస్యాన్ని వ్రాయాలని అన్నప్పుడు శ్రీ ఛానల్ లో అన్నీ వ్రాశారు. అన్నీ చమత్కారాలు, చమత్ కారాలు, చమత్ ధారలు అని అంత అద్భుతంగా వ్రాశారు. అందులో కోణంగి రాతలు, నేమ్ ట్రాపింగ్, గులాబీ మొగ్గలు, వినయం, మహాకవులు మాతృప్రేమలు, తల్లులు కొడుకు ఎంత గొప్పవారయినా వారి ప్రేమను, వారిపట్ల వారి క్షేమం పట్ల తల్లులు ఆలోచిస్తూ ఉంటారు.

'పదండి ముందుకు పదండి పోదాం, పోదాం పోదాం పైపైకి' అని శ్రీ శ్రీ గారు అన్నప్పుడు, వాళ్ళ అమ్మగారు బాబోయ్ పైకి వెళ్తున్నాడేమో అని 'వెళ్తే వెళ్ళు గాని కాస్త త్రాడు నిచ్చెన తీసుకొని వెళ్ళు నాయనా', జారిపడిపోతావేమో, అని అందట వాళ్లమ్మ. అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 'నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే గాక నాకేటి వెరపు' అన్నప్పుడు, వాళ్లమ్మ "సిగ్గు నీకు లేకపోవచ్చు నాయనా, చూసేవాళ్లకి ఉంటుందిగా, కాస్త లాగు చొక్కా వేసుకొని వెళ్ళు" అన్నదట వాళ్ళమ్మ. ఆవిడకి తెలుసు ఇంత పెద్ద కవియని. అలాగే 'అమృతం కురిసిన రాత్రి' వ్రాసినటువంటి తిలక్ గారు 'అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు నేనువచ్చి తలుపు తెరచి ఇల్లు విడచి ఎక్కడికో దూరంగా మైదానం లోకివెళ్ళి నిల్చుంటాను' అనే దానికి వాళ్లమ్మ 'పన్లేకపోతే సరి ఒంటరిగా అర్ధరాత్రి ఎక్కడికో పోయి నించోవడమెందుకు, అసలే ఆరోగ్యం అంతంత మాత్రం' అందట. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇట్లాంటివన్నీ కూడా ఎవరికివారం చదివి ఆనందించాలి. మనకి నవ్వు రాకుండా ఉండదు. కానీ వీళ్లందరూ అంటే ఇతనికి చాలా చాలా ఇష్టము. అందుకే వాళ్లందరి గురించి వ్రాయటమే కాకుండా, ఎలా వ్రాశారనేది కాకుండా, వాళ్ళ అమ్మలు ఎలా స్పందిస్తారు, తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది వ్రాశారు.

అలాగే హాస్యజ్యోతి, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో 1978 నుండి 1980 వరకు వ్రాశారు. ఇందులో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుకుంటారు, వాళ్ళ హాస్యమెలా ఉంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. కొన్ని తను విన్నారు, కొన్ని ఎవరో చెబితే విన్నారు. అవన్నీ కూడా చిన్న చిన్న జోక్స్ లాగా హాస్యజ్యోతి లో ఆయన వ్రాయటం జరిగింది.

అట్లాగే ఆయన సృష్టించిన వెంకట సత్య స్టాలిన్ అనే క్యారక్టర్ గురించి ఇక్కడ తప్పక చెప్పుకోవాలి. వెంకట సత్య స్టాలిన్ అంటే నాకు కన్యాశుల్కంలో గిరీశమే గుర్తుకు వస్తారు. గిరీశానికి ప్రపంచంలో తెలియని విషయమంటూ లేదు. ఏదడిగినా కూడా చెప్తాడు. కచేరీలా నాకు తెల్సండి, జడ్జిగారు నన్ను పిలిచి అడిగారు. వాళ్లమ్మాయికి నేనే ట్యూషన్ చెప్పాను అంటాడు. నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అంటాడు గిరీశం. మనం ఈ వెంకట సత్య స్టాలిన్ మాటలు వింటూంటే నిజంగా మనకి ఎడ్యుకేషన్ వస్తుందనిపిస్తుంది. వీళ్ళు మనకి కనిపిస్తూనే ఉంటారు. నాలుగు రోడ్ల కూడళ్ళలో గాని, మెకానిక్ షాపుల వద్ద గాని. ఒక పదిమంది కూడినదగ్గర వీళ్ళు తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ స్టాలిన్ ఎంత గొప్పవాడంటే, నేను మోతీలాల్ ని కలవడానికి వెళ్లాను. అప్పుడు చిన్నపిల్లవాడు, జవహర్ అనే పిల్లవాడు తోటలో ఆడుకుంటున్నాడు. నేను వెళ్ళి చక్కగా ఉన్నావని చెప్పి, అక్కడ ఉన్న గులాబీని తీసి అతని కోటుకు గ్రుచ్చాను. అప్పట్నుంచీ అతను తన కోటూకి గులాబీ గ్రుచ్చుకొంటూ ఉన్నాడు, అని చెప్తాడు ఒకదాంట్లో. ఇంకోదాంట్లో, ఇందు. ఇందు పాపం ఆడుకొంటూ ఉంది. ఎవరు ఈ ఇందు అంటే ఇందిరాగాంధీ. మొన్న విజయలక్ష్మీ, 16 ఏళ్ల చిన్నపిల్ల. బాగా వ్రాస్తోంది ఈ మధ్య. నాకు పంపించి సలహాలు అడిగింది, అంటాడు. ఎవరంటే విజయలక్ష్మీ పండిట్.  ఇంతేగాకుండా ఆర్మ్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్  చంద్రగ్రహం పైకి వెళ్ళేటప్పుడు, వాళ్లమ్మగారు భయపడుతూ, ఈయన్ని అర్జంటుగా పిలిపించి. ఏవండీ మా అబ్బాయి వెళ్తున్నాడు ఒంటరిగా, చంద్రలోకం లోకి, మీరు ఆశీర్వచనాలు ఇవ్వాలండీ అని కన్నీళ్లతో దండం పెట్టుకుందిట, అని చెప్తాడు ఈ వెంకట సత్య స్టాలిన్. అంటే ఈ ప్రపంచంలో ఈయనికి తెలియనివాళ్లు ఎవరూ లేరు, వాళ్లందరితోనూ ఇతనికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు. అంతకు ముందు అంటే మనకి స్వతంత్రం రాకముందు, అంటే గవర్నర్ జనరల్స్ కూడా, నిర్ణయాలు తీసికొనేటప్పుడు స్టాలిన్ ని పిలచి అభిప్రాయాలు అడుగుతూంటారుట.  అవన్నీ కూడా వ్రాసుకొచ్చాడు. అవి చూస్తూంటే, చాలా మంది గొప్పలు కొట్టు కొంటూంటారు చూశారా, వాళ్ళకి ప్రతినిధే ఈ వెంకట సత్య స్టాలిన్. అతను మాట్లాడేటటువంటి మాటలు కాలాలతో సంబంధం లేదు. 18 శతాబ్దానికి వెళ్తాడు, 19 వ శతాబ్దానికి వెళ్తాడు, ఈ తరంలోకి కూడా వస్తాడు. ఇటువంటి అద్భుతమైన క్యారక్టర్ ని సృష్టించారు ఈయన.

అంతే కాకుండా పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు మధురవాణి వస్తే ఎలా మాట్లాడుతుందో 'మిసిమి' పత్రికలో వ్రాసేవారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు మిసిమి పత్రికలో వ్రాస్తూన్న తరువాత చిట్టచివర ముగింపు చేసేటప్పుడు, అతను కన్యాశుల్కం లో మధురవాణి మాటలు ఇన్నాళ్లు వ్రాసేవారు కదా ఇప్పుడు మధురవాణి వచ్చి పురాణం సుబ్రహ్మణ్య శర్మగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో అని శ్రీ రమణగారిని అడిగితే స్పెషల్ గా వ్రాశారు. అది 'రచన' పత్రికలో వచ్చింది. అది రచన వాళ్ళు అడిగి మరీ వ్రాయించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యా సంభాషణ లో ఎట్టాగో మధురవాణే గెలుస్తుంది. సుబ్రహ్మణ్య శర్మగారు మధురవాణి ధాటికి తట్టుకోలేకపోతారు. అని అద్భుతంగా వ్రాశారు.

ఇక ఆయన కథల్లోకి వెళ్దాము. అతను నవ్వించి నవ్వించి హాస్యం తోనూ కళ్ళనీళ్లు తెప్పించగలరు. అలాగే కథల్లో హాస్యం ఉంటుంది కానీ, ఎక్కడో సెంటిమెంట్ చొప్పించి ఎక్కడో మనసు తడి అయి ఆ తడితో కళ్ళనీళ్లు తెప్పించేటట్లు వ్రాయగలరు. వాటిల్లో అద్భుతమైన కథ 'బంగారు మురుగు'. బంగారు మురుగు లో బామ్మగారికి తన మనుమడంటే చాలా ఇష్టం. ఆమె 10 ఏళ్ల వయసులో పెళ్లయినపుడు ఒక బాదం చెట్టుని తెచ్చుకొని వాళ్లింటిముందు నాటుతుంది. ఆ బాదం చెట్టు పెద్దదయిపోతుంది. ఆమెకు మనుమడు పుట్టినప్పుడు ఆ చెట్టు దగ్గరికి తీసుకొని పోయి అనేకమయిన కథలు చెప్తూంటే, ఈ పిల్లవాడికి  ఆ బామ్మంటే ఒక పెద్ద అండ. బామ్మ తనకు తోడుగా ఉందని చాలా ధైర్యంగా ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న స్ట్రిక్ట్ గా ఉండాలనుకుంటారు. కానీ, బామ్మ దగ్గరకొచ్చి అతను అన్నీ అడుగుతూ ఉంటాడు. చేగోడీలు గుర్తున్నాయా మనకు. పీచు మిఠాయిలు గుర్తున్నాయా, జీళ్ళు గుర్తున్నాయా? మొత్తం నేటివిటీ. తెలుగువారి నేటివిటీ అంతా కూడా శ్రీరమణ గారి పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈయన గ్రామీణ వాతావరణంలో పెరిగారు. ఆ వరాహపుర అగ్రహారములో ఉన్న అందరితోటి అతనికి స్నేహం ఉంది. అన్నీ వృత్తులవారితోటి స్నేహం ఉంది. అందరూ ఎలా మాట్లాడతారో, వారి మాండలికం ఏమిటి? వారి యాస ఏమిటి? పట్టుకొని ఆయన కథల్లో చెప్పారు తప్ప, ఆయన మీద ఏదో ముద్ర వేసేసి, ఇద్దరు వర్గాలలో ఒక వర్గానికే చెందినవారని చెప్పడం చాలా తప్పు.

బంగారుమురుగులో ఆ బామ్మ ఎంత సనాతన ధర్మం కలిగినటువంటి, ప్రాచీన ఆలోచనలతోటి ఉంటుంది కానీ, ఒక వైపున ఆమెకి మనవడంటే విపరీతమయినటువంటి ప్రేమే కాకుండా, అనాచారంగా చేస్తున్నటువంటి ఈ ఆచారవంతులు అంతే ఇష్టం ఉండదు. మేము ఆచారవంతులం, మాకు అన్నీ తెలుసు, మేము అరిషడ్వర్గాలను జయించేశాము, మేము వేదాలన్నీ పఠించాము, ఉపనిషత్తులన్నీ పఠించాము అని బేకారి పనులు చేసేటువంటి దౌర్జన్యాలు గాని, ఆ పటాటోపమ్ ముందు శిష్యులు, వెనుక శిష్యులు, ఒక పల్లకీ లాంటి దాంట్లో రావడము, సింహాసనంలోకూర్చోవడము, ప్రసాదాలు ఇవ్వడము లాంటివి ఆమెకు చిరాకుగా ఉండేది. కానీ, ఈ బామ్మ కొడుకు కోడలికి కొంచము గురువులంటే ఇష్టం. కాబట్టి వాళ్ళని తరచూ పిలిపించి చాలా డబ్బులు బాగా ఖర్చు పెట్టడం చేసేవారు. ఒక గురువుగారు వచ్చారంటే ఊరు ఊరు అంతా వస్తారు కాబట్టి, వారికి ఫలహారాలు, భోజనాలు వంటివి అన్నీ ఏర్పాటు చేయాలి. బామ్మగారికి ఇవన్నీ నచ్చవు. కానీ కొడుకుల ఇష్టంకదాని ఊరుకొంది. కానీ ఒకరోజు గురువుగారు వచ్చినపుడు, పిల్లవారందరూ శుచిగా వచ్చి ప్రసాదం కోసం చేయి చాస్తే, ఈ పిల్లవాడు ఏమీ తెలియక నాకో.. ప్రసాదం అని అడుగుతాడు ఒంటిమీద చొక్కాతోటి వచ్చి. గురువుగారి వద్దకు ఒంటిమీద బట్టలతో వచ్చి ప్రసాదం అడగటం అనేది చాలా అపచారము. చొక్కాతోటి వచ్చి ప్రసాదం అడుగుతావా? అని అక్కడున్న సాంప్రదాయవాదులు, గురువుగారు కన్నెర్ర చేసి, ఆ పిల్లవాడికి బట్టలు విప్పేసి నగ్నంగా అక్కడ నించో పెడతారు. ఎందుకంటే అపచారం చేసేశాడు. అప్పటివరకూ ఊరుకొన్న తండ్రి ఆ పిల్లవాడ్ని ప్రక్కకు తీసికెళ్ళి, బాగా కొడతాడు. అప్పుడు బామ్మ వచ్చి 'ఒరేయ్ దీక్షితులు, ఇటురా' అని పిలుస్తుంది. అతను గురువుగారి ప్రధాన శిష్యుడు. ఏమిటి అరిషడ్వర్గాలను జయించేది, భగవద్గీతను వర్లిస్తే లాభం లేదు. దాన్లోని సారాన్ని తెలుసుకోవాలి. అని చెప్పి, నేను చెప్పేను అని చెప్పు మీ గురువుకి, గురువుగారి శాపాలు నన్నేమీచేయవు. అప్పాలుమీద, అరిసెలుమీద ప్రేమ వాదులుకోలేనివారు, మరి అరిషడ్వర్గాలను ఏమి వదులుకుంటారు? అని అంటుంది.. అంటే మనకు బామ్మలో ఎంత సనాతన ధర్మముందో, అంతగా మనవడి నే కాదు, ఊర్లో మనుషులందర్నీ ప్రేమిస్తుంది ఆవిడ. ఆమెలో ఒక అద్భుతమైన ప్రేమ మూర్తిని చూస్తాము. అయితే పిల్లవాడు పెరిగి పెద్దయిన తరువాత, పెళ్ళి చేయాలనుకొన్నప్పుడు, సొంత కూతురు వచ్చి తన కూతుర్ని ఇస్తానంటే, మేనరికం వద్దని, ఆమె ఇంట్లో ఒక గృహిణిగా ఇమడలేదని చెప్పి, సొంత కూతురు కూతుర్ని కూడా వద్దంటుంది. తరువాత చిన్నప్పుడు పాఠాలు చెప్పిన నరసింహం మాష్టారు, ఒక సంబంధం తీసుకు వస్తే,(ఆ అమ్మాయి పేరు గాయత్రి) చాలా చక్కగా ఉంది, కళగా ఉంది, పెద్ద అందం కాకపోయినా, అలాగే చాలా చక్కగా వినయంగా అన్ని పనులు చేసుకునేటట్టుంది అని, ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకో అని చెప్తుంది. సరే, పెద్దవాళ్లు, పెద్దవాళ్లు మాట్లాడుకొనేటప్పుడు, వాళ్ళకి మూడుకాసులు బంగారం పెట్టాలని అడుగుతారు. ఇంట్లో ఆస్తులన్నీ గురువులకు ఆర్పణం చేశాక, ఇంటిలో డబ్బులేమీ లేవు. అప్పుడు, ఈమె చేతికి ఒక అందమైన లావుపాటి మురుగు ఉంది. అది చాలా ఖరీదు చేస్తుందని అందరికీ తెలుసు. ఆ మురుగు ఎవ్వరికీ ఇవ్వదు. ఆమె కూతురి కళ్ళు కూడా ఆ మురుగు మీదనే ఉంటాయి. ఎన్ని సార్లు అడిగినా సొంత కూతురికి కూడా ఇవ్వదు, ఆ బంగారు మురుగు. అందరి కళ్ళూ ఆ మురుగుపైనే ఉంటాయి.

తరువాత పెళ్ళి అయినపుడు, ఈ అబ్బాయి ఏమీ నిర్ణయించుకోలేకపోతాడు. ఏమి చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో, మనవడి దగ్గరికి వస్తుంది ఆ 80 ఏళ్ల బామ్మ. వచ్చి, నాయనా దాంపత్యమంటే ఏమో కాదు. ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకొంటే, నీ కాళ్ళు పండాలి. నువ్వు ఆకు వక్క వేసుకొంటే, ఆ పిల్ల నోరు పండాలి. అంత అన్యోన్యంగా ఉండాలి దాంపత్యం అని చెబుతుంది. అంటే, ఇక్కడ బామ్మ అద్వైతం చెబుతోందా, తెలిసి చెబుతోందా, తెలియక చెబుతోందా? భార్యా భర్తలు ఇద్దరు వేరుకాదు, ఒకటిగా ఉండాలి అని చెబుతోంది. అలాగే ఆమె తత్వం ఏమిటంటే , నాది అనుకొంటే దుఃఖం. కాదు అనుకొంటే సుఖం.  ఇంతకు మించి భగవద్గీతలో ఏమీ లేదుకదా?

అలా కొన్నాళ్లకి, ఆ బామ్మ 90 ఏళ్ల వయసులో చనిపోయింది. అందరూ వచ్చి ఆ మురుగు తీసి, అమ్ముదామని కంసాలి వద్దకు తేసికెళ్ళి చూస్తే, అది బంగారం కాదు, రోల్డ్ గోల్డ్. ఏమయిందంటే, పెళ్లప్పుడు కాస్త బంగారం ఇవ్వాలి కదా ఆడపిల్లకి అని చెప్పారు కదా! అప్పుడు మంచి సంబంధం చెడిపోతుందనే ఉద్దేశ్యముతో, ఆ బంగారు మురుగు అమ్మేసి, ఈ రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటుంది. ఇది చేసిన వారు ఆ మాష్టారు గారు. ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసు, ఆ అమ్మాయి ద్వారా అందరికీ తెలిసింది. నాయనా నేనెక్కడికీ వెళ్లను. మళ్ళీ నీకు కూతురుగా పుట్టి, ఈ ఇంటికే వస్తాను అంటుంది. అతను కళ్ళ నీళ్ళతో, ఆమె వస్తుంది, గాయత్రి కడుపునే పుడుతుంది. ఆ బంగారం మురుగు నేనే చేయిస్తాను అనుకొంటాడు.

ఇంత అద్భుతమైన బామ్మని చూస్తూంటే, ఆమె చాదస్తంగా ఉండొచ్చు. కాకపోతే మనవడు అడిగాడని తన దగ్గర ఉన్న డబ్బంతా జీళ్ళకు, పీచు మిఠాయిలకే ఖర్చు పెట్టడమే కాకుండా, పూజా మందిరంలో ఉన్న కంచు గంటను కూడా తాకట్టు పెట్టేస్తుంది. అయితే, ఆమెకు పూజ, దేముడు అందరూ ఉన్నారు? కానీ, ఎక్కడ ఉన్నాడు దేముడు? కంచు గంటలో లేడు, చిన్నారి పిల్లవాడి బొజ్జలో ఉన్నారు అంటుంది.

దానికి మర్నాడు కొడుకు, కోడలు వచ్చి, నువ్వు దేముడి మందిరంలో ఉన్న కంచు గంటను కూడా అమ్మేశావా? అనుకుంటారు. ఇది ఎలా తెలిసింది అంటే, ఒకనాడు ఐస్ ఫ్రూట్స్ అమ్మే అబ్బాయి వచ్చి, అమ్మ నాకు గంట ఇచ్చారు. ఇంకా నేను ఆమెకు కొంత డబ్బులు ఇవ్వాలి. అందు నిమిత్తము ఈ జీళ్ళు, పీచు మిఠాయిలు తీసుకోండి అని అతనొచ్చి చెప్పాడు. అది తెలిసి కొడుకు అడిగితే 'దేముడు ఎక్కడో లేడు, చిన్నారి పిల్లవాడి బొజ్జలో ఉన్నాడు' అంటుంది. మరి ఈమె తెలిసి మాట్లాడుతోందో లేక తెలియక మాట్లాడుతోందో తెలియదు. అంత ప్రేమ స్వరూపమైన బామ్మని ఈ బంగారు మురుగు కథలో మరచిపోలేము.

అలాగే ఇంకొక అద్భుతమైన కథ. వరహాల బావి. ఒక పల్లెటూరులో అందరూ అంటే, అన్నీ కులాలవారు, మతాలవారు కలసి మెలసి బతుకుటూ ఉంటారు. ఆ ఊర్లో ఒక శివాలయం ఉంది, అక్కడకు బ్రాహ్మలందరూ వెల్తూంటారు. ఆ ప్రక్కనే ఒక దర్గా ఉంది, అక్కడకు ముస్లిమ్స్ అందరూ వెల్తూంటారు. ఆ మధ్యలో ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు దగ్గర వరహాలమ్మ అనే ఆవిడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉంది. ఆమె ఎక్కడ్నుంచి వచ్చిందో, ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఆవిడ ఊర్లో అందరికీ తల్లో నాలుకలా ఉంది. ఎవరింట్లో ఏ పని పడినా ఆమె వెళ్ళి సహాయం చేస్తూ ఉంటుంది. చక్కగా ఆడపిల్లలందరికీ గోరింటాకు పెడుతుంది. పూలజడలు అల్లుతుంది. రోజూ ప్రొద్దున్నే రాట్నం వాడుకుటూ ఉంటుంది. ఆ రాట్నం తోనే ప్రజలందరూ లేస్తారు, తమ తమ పనులు చేసుకుంటారు. ఆమెకు ఉండే మరో స్పెషల్ ఏమిటంటే, కంట్లో నలక పడితే చాలా చులాగ్గా తీసివేస్తుంది. ఇది మనం వినలేదు కానీ పల్లెటూళ్ళల్లో ఉంది ఉంటుంది. నాలుకపై తేనె చుక్కను వేసుకొని, కళ్ళు బాగా తెరచి ఆ నలకను తీసేస్తుందిట. ఒకరోజు పన్నులు వసూలు చేద్దామని ముస్లిం జాగీద్దారు గారు వస్తారు. అన్నీ ఊర్లల్లో పన్నులు వసూలు చేసికొంటూ, ఈ ఊరు వచ్చేసరికి ఆయన కంట్లో నలక పడుతుంది. ఆ నలకకు ఆయన చాలా బాధ పడుతూ ఉంటే, ఆ పరివారమంతా చాలా కంగారు పడుతూ ఉంటారు. అనుకోకుండా ఆ రావిచెట్టు దగ్గరికి వచ్చినపుడు, ఆయనను ఏమయింది నాయనా యని అడుగుతుంది. నలక పడిన విషయం తెలుసుకొని, ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళి, నాలుకపై తేనె చుక్క వేసుకొని ఆ నలకను తీసివేయగా, ఆయన కృతజ్ఞతగా తన తలపాగాను ఆమె పాదాల వద్ద ఉంచి, తన రొంటిలో నుంచి ఒక బంగారు వరహాల మూటను ఆమెకి ఇచ్చి, కాళ్ళకు మ్రొక్కి వెళ్లిపోతారు. ఈ విషయం అందరికీ తెలిసి, ఆహా మన వరహాలమ్మ ఎంతగొప్పది. జాగీద్దారు కంట్లో నలక తీసేసిందని అనుకుంటారు. అలా ఉండగా రాట్నం చప్పుడు ఒకరోజు ఉదయం వినబడలేదు. ఏమయిందని చెప్పి ఊర్లో వారందరూ చూస్తే, రాట్నం మీద ఒరిగి ఉంటుంది వరహాలమ్మ. అయ్యో అయ్యో వెళ్ళిపోయిందని సానుభూతి పవనాలు వీచీనా, జాగీద్దారు గారు ఇచ్చిన వరహాల మూట కోసం వెదుకుతున్నారు. ఎక్కడా దొరకదు. త్రవ్వటం మొదలు పెట్టారు. అలా త్రవ్వుతూ ఉండగా, ఆ బంగారు నాణేల మూట దొరుకుతుంది. అప్పుడు మాకు దొరికిందంటే, మాకు దొరికిందనే వాదులాటలో, అంతవరకు లేని మతాల సమస్య మొదలయింది. ఆ ఊరికి ఉన్నది ఒక్కటే, నీటి సమస్య. ఆ ఊర్లో బావిలేదు. నీరు పడదు. నీటి ఎద్దడి వచ్చినపుడు చాలా చాలా దూరం వెళ్ళి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊర్లో ఒక గాజులబత్తు ఉంటాడు. అతను అందరి ఇళ్ళకీ వెళ్ళి అందరికీ గాజులు వేస్తూ ఉంటాడు. ఎప్పుడయితే, ఆ ధనం బయట పడిందో, అప్పుడు కులాలు,మతాల గొడవ ప్రారంభమయి, మా శివాలయం దగ్గర దొరికాయి కాబట్టి మావి అన్నారు హిందువులు. మా ముస్లిం జాగీద్దారు ఇచ్చేడు కాబట్టి మావి అంటారు ముస్లింలు. అలా ఇరువర్గాలు కొట్లాడుకొంటూ, కర్రలు పైకి లేచే సమయానికి, అప్పటిదాకా త్రవ్విన ఆ గుంటలోంచి జల బయటకు వచ్చింది. ఏమిటి నీళ్ళు వస్తున్నాయి అని రుచి చూస్తే, అవి మామూలు రుచిగా లేవు. కొబ్బరి నీళ్లంత రుచిగా ఉన్నాయి. అప్పుడు, ఆ ఊరి కరణం గారు, అక్కడి పంతులుగారికి చెప్తారు. కొట్లాడుకోవద్దు, మన ఊరికి ఉన్న సమస్య నీరే కదా! ఈ డబ్బులతోటి ఇక్కడ ఒక పెద్ద చప్టా కట్టిద్దామని ప్రతిపాదన చేస్తారు. ఆ విషయానికి అందరూ సంతోషించి, అందరూ కలిశారు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా సామగ్రి తెచ్చుకొని ఒక పెద్ద బావిని కట్టించుకున్నారు. ఆ బావి అంటే అందరికీ ప్రాణం. ఎందుకంటే అందరికీ ప్రాణాధారమైన మంచినీటిని ఇస్తోందిగా! చివరికి ఏమయిందంటే, ఆ ఊర్లో ఏ శుభకార్యమయినా ఆ బావి దగ్గరికి వచ్చి దండం పెట్టుకోని, ఆమెకు మ్రొక్కులు చెల్లిచుకుంటూ వెళ్లుతూ ఉంటారు. ఆఖరికి, ఆ ఊరు ఎదంటే, వరాలమ్మ బావి ఉన్న ఊరు అనే పేరు వచ్చేసింది. ఇక్కడితో ఈ కథ అయిపోతే ఒక మంచి కథ అయి ఉండేది. అయితే మనుషుల యొక్క మనస్తత్వాలు చెప్పే శ్రీరమణ గారు, కొన్నాళ్లయిన తరువాత ఒకరోజు, ఒక హిందువు ఆవును తోలుకొంటూ వచ్చాడు. అది అక్కడ ఉన్న ఒక పెద్ద తొట్టి వద్దకు నీళ్ళు త్రాగాలని వచ్చింది. అప్పుడు ఒక ముస్లిం (ఖాసిం) ఒక గుర్రాన్ని అక్కడకు తీసుకు వస్తాడు. రెండూ ఒకేసారి త్రాగాలని ప్రయత్నించి నపుడు, ఒకదాని తల ఒకటి కొట్టుకున్నాయి. అవి బాగానే ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఏయ్ అంటే ఏయ్ అని మాటలు రెచ్చిపోయాయి. అలా ఒక తగాదా మొదలై మరల కర్రలు లేచాయి. మళ్ళీ కొట్లాట మొదలైంది. ఇంతలో ఈ గాజుల బట్టు వచ్చాడు. అంతకుముందు ఒక చిన్న తాబేలుని ఆ బావిలో వేశాడు. అది ఆ నీళ్ళలో చాలా పెద్దదయింది. ఆ తాబేలుని చూసేందుకు పిల్లలందరు ఆ బావి దగ్గరకు వస్తారు. ఇంతలో ఆ తగాదా చాలా పెద్దదయి, హిందూ, ముస్లిం కొట్లాటగా మారి, ఆ ఊరువారే కాదు, ప్రక్క ఊరికి ప్రాకి వారుకూడా వస్తారు. ఎంత సముదాయించినా ఎవ్వరూ తగ్గరు. ఇలా ఉండగా ఆగండ్రా, ఆగండ్రా, కొట్టుకో వద్దంటూ ఆ గాజులబట్టు బావిలో దూకేస్తాడు. అతనికి ఎవ్వరూ లేరు పెళ్ళి కూడా అవలేదు. అప్పుడు మరల అందరిలో మానవత్వం లేస్తుంది. కష్టం వచ్చినపుడు మనుషులందరూ కలుస్తారు. ధనం చూసినపుడు స్వార్ధం వస్తుంది అనుకొంటారు. అందరూ త్రాళ్లు, నిచ్చెనలు వేసి, లోపలికి దిగి మొత్తం మీద కష్టబడి ఆ గాజులబట్టుని బయటకు తీసుకువచ్చారు. చెంపలు వేసుకున్నారు. ఈ వరాహాల బావి మనందరిదీ అనుకొన్నారు. మనుషుల్లో స్వార్ధం లేకపోతే, ఐకమత్యంగా ఉంటే సహాయకారి అనే సందేశంతో ఈ అద్భుతమైన కథ ముగుస్తుంది.

తరువాత నాలుగో ఎకరం. ఈ కథ చిట్ట చివర రచన, విహంగ వీక్షణం సంపుటి కోసం ప్రత్యేకంగా వ్రాశారు. 2019 లో, ఇదే శ్రీరమణ గారి చివరి కథ కావచ్చు. అప్పటికి మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా వచ్చేసింది. వ్యాపార ధరలు బాగా పెరిగిపోయాయి. అప్పటివరకు పొలము అంటే  అందరికీ అన్నం పెట్టేటటువంటిది. భూమాత అనే భక్తి ఉంది రైతు అనే వాడు పొలాన్ని ప్రాణంగా చూసుకొంటూ ఉండేవాడు. తరతరాల వారసత్వ సంపదగా, వ్యవసాయం పట్ల, భూదేవి పట్ల చాలా సంతోషంగా ఉండేవారు. రాఘవయ్య అనే అద్భుతమైన క్యారక్టర్. వారి కుమారుడు సాంబశివరావు, అతని స్నేహితుడు కూడా ఆ దగ్గర్లో గల ఊర్లో కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేవారు. అయితే సాంబశివరావు అక్కడ జూనియర్ కాలేజీ లో పని చేయలేక నేను మా ఊరు వెళ్లిపోతాను, నాకు మా ఊరు మీద బెంగగా ఉంది అని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. రాఘవయ్యకు మంచి ఎద్దులు ఉండేవి, అవి వ్యవసాయానికె కాకుండా, సంక్రాంతికి ఎద్దుల పోటీలో వాటికి ప్రతీ సారీ బహుమతి వస్తూనే ఉంటుంది. అలా ప్రథమ బహుమతి వచ్చే వాటికి వెండి కోణాలు పాదాలకు వేసేవారు. అటువంటి సందర్భములో, విలువలుతో కూడిన రాఘవయ్య దగ్గర ఉండి ఒక నాగలిని దుంపను కూడా చెక్కిస్తాడు. ఇక్కడ శ్రీరమణ గారు తన పల్లెటూరి వాసనలను పోగొట్టుకో లేదు. ఆయన పల్లెటూరిలో గల అన్నీ వృత్తులవారి గురించి చక్కగా పరిశీలించి వ్రాసేవారు. మానవత్వాలని, మానవ సంబంధాలని, మనుషులమధ్య జరుగుతున్న సంభాషణలని పట్టుకొనే వారు, ఆయన జ్ఞాపకాల్లో పల్లెటూరు ఉన్నది. అతనికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఆయన చనిపోయేటప్పుడు చాలా మంది వ్రాశారు. ఎప్పుడో చూసిన నన్ను ఎటువంటి భేషజము లేకుండా చాలా చక్కగా పలుకరించేవారని. ఆయనకు పల్లెటూర్లో అన్నివిషయాలు తెలుసు. నాగలి చెక్కేటువంటి విధానం చెబుతారు. నాగలి దుంపను చెక్కటామంటే మాటలా? ఓదేముణ్ణి చెక్కడమే. అంటే నాగలి దేముడు. నిజమేగా, నాగలి లేకపోతే, పొలం దున్నకపోతే, పంట ఎలావస్తుంది. ఇప్పటి ఈ కంప్యూటర్ యుగం వాళ్ళకి అన్నం బియ్యం ద్వారా వసుందని తెలుసు కానీ, దాని వెనుక రైతుపడే కష్టం గూర్చి తెలియదు. ట్రాక్టర్ రావడం మంచి పనికి అని అనుకుంటున్నాము గాని, ఇది రాక ముందు రైతుకు నాగలితో పొలం దున్నడమే చాలా ఇష్టం. పొలాన్ని దున్నేతప్పుడు పొందే ఆనందం ఈ ట్రాక్టర్ల వల్ల పొందలేము. అలాగే రాఘవయ్య అనే ఆయన పిల్లలకి ఎంతో మంచి చెబుతూ ఉండేవాడు. ఆయన సాంబశివరావు అనే కొడుకు తోటి, సాంబా, భూమ్మీదకి వచ్చాక కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రతోడికి కొన్ని బాకీలుంటాయి. వాటిని తీర్చాల. ఎగేయ్యకూడదయ్యా. ఎంతైనా మనం మనుషులం కదా! అన్న మాటల్లో చాలా సత్యం ఉంది. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. మనకి అందరికీ తెలుసు గత 20 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ బాగా పుంజుకొని, దాని వల్ల కోట్లకు కోట్లు లాభాలు వస్తున్నాయని, అయితే పచ్చని పంటలు పండే పొలాలు దేవలప్మెంట్కి ఇచ్చేసి, పెద్ద పెద్ద భవంతులు లేస్తున్నాయని. ఇంత ఆనందంగా సాగుతున్న సమయంలో, ఈ ఊరు మీద ఒక కార్పొరేట్ కళ్ళు పడ్డాయి. వారు వచ్చి పొలం కొంటామంటే, సంవత్సరం మొత్తం వ్యవసాయం చేసి అరా కోరా మిగలటమో లేక అప్పులపాలవటమో అయ్యే ఈ రైతులకి లక్షలు కోట్లు ఇస్తామంటే సహజంగానే ఆశ పుడుతుంది. అందరూ ఈ లక్షల గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అలా అలా ఈ మాటలు సాంబశివరావు చెవిన పడ్డాయి. అప్పుడు నాన్న వద్దకు వచ్చి, నాన్నా మనం కూడా ఈ పొలాన్ని డెవలప్ మెంటుకి ఇచ్చేద్దాము అని. ఆ కార్పొరేట్ కంపెనీ వారు, మేము డబ్బులు ఇవ్వడమే కాదు, ఇక్కడ కంపెనీలు, రెసిడెన్షియల్ కాలేజీలు పెడతాము, మీ పిల్లలు ఇక్కడనే చదువుకోవచ్చు. అలాగే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పరుస్తాము. దీనివల్ల పల్లెలు పట్టణీకరణకు దారి తీస్తాయి. దీనివల్ల పెద్దలకు ఇష్టం ఉండకపోవచ్చు గాని, పిల్లలకి ఆశ పుట్టి ఆకర్షితులు అవుతున్నారు. ఆ విధంగానే సాంబశివరావు కూడా నాన్నతో చెబుతాడు. వీలకున్నది నాలుగు ఎకరాలు. అందులో మూడు ఎకరాలు, తాకట్టు పెట్టి కూతురుకి వచ్చిన అమెరికా సంబంధాన్ని చేస్తాడు. అలా కొన్నాళ్లకి, రాఘవయ్య ఆ అమ్మాయికి చెబుతాడు, అమ్మా ఈ అప్పు నేను తీర్చలేను. ఈ 3 ఎకరాలు ఎంతకో కొంతకు అమ్మేయి లేదా నువ్వే తెసేసికో అని మాటయితే ఇచ్చాడు. ఆ మాట మమతల అడుగున పడిపోయింది. తరువాత ఈ కార్పొరేట్ వారి కళ్ళు ఈ పొలం మీద పడటమే కాకుండా మొత్తం వివరాల చిట్టా తీసేశారు. అలా అమెరికాలో ఉన్న ఆ అమ్మాయి కుటుంబం మొత్తాన్ని అక్కడికి రప్పించారు. ఆ నాలుగు ఎకరాలు కొట్టేయాలని. వారు వచ్చారు. ఆ నాలుగు ఏకరాలకి ఐదు కోట్లు, అన్నీ ఖర్చులు ఫోను ఇస్తామని చెప్పారు. నాలుగు ఏకరాలకి ఐదు కోట్లా!  అని అందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళే ఆ అమ్మాయిని కారులో ఆ ఊరుకి తీసుకు వచ్చి, వాళ్ళ అమ్మాయి వోణి పంక్షన్ కూడా మేమే గ్రాండ్ గా  జరిపిస్తామని చెప్పి, జరిపిస్తారు. ఇలా అందరూ డబ్బు మాయలో పడి పరుగులు తీస్తున్న సమయంలో, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని, నాన్నా మూడు ఎకరాలు నాకిచ్చేస్తానని అన్నావు, అది ఎలాగో నాదే, అయితే ఆ నాలుగో ఎకరం ఏంచేస్తావని అడుగుతుంది. ఆ మాటకు రాఘవయ్య ఆశ్చర్యపోతాడు. రాత్రంతా ఆలోచిస్తాడు. కొడుకుని పిలుస్తాడు. నాయనా, ఆ మూడు ఎకరాలు ఎలాగో చెల్లివే, ఈ నాలుగో ఎకరం నీకు, నాకు, చెల్లికి మూడు భాగాలు చెయ్యాలి, అంటాడు. ఇది నాలుగో ఎకరం కథ.

దీన్లో మనుషుల మనస్తత్వాలు, ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చాక, మనం పంటలు పండే పొలాలను ఎలా ఇచ్చేసుకుంటున్నాము, అంతేకాకుండా మనుషుల మధ్య మానవ సంబంధాలు దెబ్బ తింటున్నాయి, డబ్బే రాజ్యం ఎలుతోంది అన్నమాట, మానవ సంబంధాలను డబ్బుకి ఖరీదు కడుతున్నాము అనే అద్భుతమైన కథ.

ధనలక్ష్మి కథ: ధనలక్ష్మి ఆ ఊర్లో చిన్న పాప, మూడో క్లాస్ చదువుతూ ఉంది. వాళ్ళ నాన్న ఈశ్వరయ్య. అతనికి అనారోగ్యం వలన, ఇవాళో, రేపో కాలం చేస్తానని అనుకోని ఆ అమ్మాయిని చుట్టాలు అయిన రామాంజనేయులు అనే వాడిని దత్తు తీసికొని, వాళ్ళ బామ్మరిది అయిన వీరాంజనేయులు అనేవాడికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. వాళ్ళకి బాగా డబ్బు ఉన్నది. కానీ ఈశ్వరయ్య తేరుకొని బ్రతుకుతాడు. ఈ లోపున ఈ అబ్బాయి ఎనిమిదవ క్లాస్ లో ఉన్నప్పుడు కోడిగ్రుడ్డును చూపించి, దీన్నేమంటారు అని మాస్టారు అడిగితే,  పైన పెంకు, లోపల కోడిపిల్ల అని చెబుతాడు. అప్పుడు మాష్టారు బెంచ్ పై నిలబెడతారు. (వీరాంజనేయులుకి చదువు ఎక్కువ రాదు). ఆ సమయంలో ఆ ధనలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి, వీరాంజనేయులూ, నాకు పెన్సిల్ కావాలి అని అడుగుతుంది. దాంతో అవమానం పాలై చదువు మానేసి ఇంటికి వెళ్లిపోతాడు. తరువాత కొన్నాళ్లకి వీళ్ళ ఆస్తులన్నీ కరిగి పోతాయి. ధనలక్ష్మి ధైర్యంగా, ఒక చిన్న పిండిమర పెట్టుకుంటుంది. ఆ మరలోంచి మెల్లమెల్లగా పొడులన్నీ వేయడం మొదలు పెట్టి, అమ్మడం మొదలు పెడుతుంది. తరువాత పట్నం నుంచి అలా అలా సరుకులు తేవడం, వాటిని అమ్మడం ద్వారా, మెల్ల మెల్లగా ఆ వ్యాపారాన్ని వృధ్ధి చేసి, ఎదరగా ఉన్న స్థలాన్ని కొని, ఇల్లు మీద ఇల్లు వేసి, ఖాళీ స్థలాన్ని కొని ఒక గోడౌన్ కూడా నిర్మాణం చేస్తుంది. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు, భర్త తెలివైన వాడు కానప్పుడు, ఈ అమ్మాయి చదువు రాకపోయినా, చాలా అద్భుతంగా ఆ కుటుంబాన్ని ఎలా లాక్కువచ్చింది. ఈ కథ ఎందుకు నచ్చుతుందంటే, ఒక స్త్రీ తనకాళ్ళ మీద తను నిలబడి పాతాళలోకానికి వెళ్లిన తమ ఆర్ధిక పరిస్థితిని ఎలా తెలివితేటలతో పైకి తీసుకు వచ్చింది.

ఇక "షోడానాయుడు" అనే కథలో షోడానాయుడు ఆ ఊళ్ళో షోడాలు అమ్ముతూ ఉంటాడు. బాల్యం లో మగ పిల్లలు అందరూ గోలీలు సేకరించుకొంటూ ఉంటారు. ఎన్ని గోలీలు ఉన్నా నీలం రంగు గోలీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అలాగే ఒక అబ్బాయి గోలీల కోసం ఈ నాయుడు వెనుక పడడం, ఇతను కసురుకోవడం జరుగుతూ ఉంటే, ఆ అబ్బాయిని చదువుకోసం పట్నం పంపించడం, ఆ తరువాతి కాలంలో ఆ అబ్బాయి ఉపాధి కల్పనా ఆఫీసర్ గా ఆ ఊరు రావడం, అతను ఏర్పాటు చేసిన మీటింగ్ కి  షోడానాయుడు లోను కోసం రావడం, బెరుగ్గా కూర్చొని జేబు తడుముకోవడం, వారం తరువాత కనబడమని చెప్పడం, డోర్ తీసుకొని అతను వెళ్ళే సమయంలో డోర్ తగిలి ఆ జేబులోంచి ఈ అబ్బాయి కోసం తెచ్చిన గోలీలు క్రింద పడడం, షోడానాయుడు పారిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ ఆఫీసర్ చిన్న పిల్లాడిలా కుర్చీలోంచి వచ్చి ఆ గోలీలు ఏరుకోవడం, అందులో నీలం గోలీ దొరకడం, దాన్ని తీసుకొని ఆప్యాయంగా గుండెకు హత్తుకుంటాడు. షోడానాయుడూ నిన్ను చిన్నప్పుడు నీలం గోలి అడగడం గుర్తుంది అన్న మాట అంటాడు. అప్పుడు షోడానాయుడు అతని సంస్కారానికి మనసులోనే నమస్కారాలు అర్పించుకుంటాడు. అంటే మనిషి ఎంత పెద్ద వాడయినా, బాల్యాన్ని మరచిపోలేడు అని చెప్పే ఒక అద్భుతమైన కథ.

ముఖ్యంగా చెప్పవలసినది మిథునం కథ. చదివిన వాళ్ళు చదివారు. చదవని వారి కోసం తనికెళ్ల భరణి గారు అద్భుతంగా సినిమా తీశారు. ఇందులో అప్పదాసు క్యారక్టర్ తనే వేయాలనుకున్నారో, LB శ్రీరాం చేత వెయిద్దామనుకొన్నారో, చివరకు SP బాల సుబ్రహ్మణ్యం కరెక్ట్ అనుకొని అతని చేత వేయించారు. హీరోయిన్ కి చాలా మందిని అనుకోని, లక్స్మి చేత వేయించారు. ఈ అద్భుతమైన సినిమా చాలా విజయాలు చూసింది. ఇక్కడ నేను కథ చెప్పను. మిథునం సాధించిన చాలా విజయాలు ఉన్నాయి. అవి చాలా మందికి తెలియక పోవచ్చు. 1997 లో మిథునం కథ వ్రాశారు. అది బాపు గారికి పంపించారు. బాపు - రమణలు మద్రాసు తీసుకొనిపోయి చాలా కాలం వారివద్దే పెట్టుకున్నారు. శ్రీరమణ గారు వారి సినిమాల్లో చాలా పనులు చేశారు. సహ డైరక్టర్ గా కూడా చేశారు. చాలా కాలం మద్రాసు లో ఉండి రచనల కోసం హైదరాబాద్ వచ్చేశారు. బాపు గారు ఎంత బాగుందని చెప్పాలో అతనికి తోచలేదు. చివరికి 28 పేజీలలో తన స్వదస్తూరితో వ్రాసి మరల ఆ కథని రమణ గారికి పంపించారు. రమణ గారు చాలా ఆనంద పడ్డారు. బాపూ గారు దీనికి కస్తూరి తిలకం అని పేరు పెట్టారు. ఈ కథ 1997 ఆగస్టులో ఆంధ్రభూమి పత్రికలో నాలుగు వారాలు ప్రచురించారు. 1998 అక్టోబరు లో ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు దీపావళి ప్రత్యేక సంచికలో, మళ్ళీ బాపూ గారి చేతివ్రాతతో ప్రచురించారు. అలా మరల రెండు సార్లు బాపు గారి వ్రాతతో దస్తూరి తిలకం గా ప్రచురించారు. బాపు గారి చేతి వ్రాతతో గల ఈ పుస్తకాన్ని అమెరికాలో గల జంపాల చౌదరి గారికి పంపించి నపుడు ఆయన కొన్ని వేల ప్రతులు వేశారుట. ఇదిచాలా ప్రాచుర్యం లోకి వచ్చింది. అమెరికాలో అయితే ఏ ఫంక్షన్ లో నయినా, ఈ పుస్తకాలు తెప్పించుకోవడం, ముఖ్యంగా షష్టి పూర్తి సమయాలలో పంచిపెట్టుకోవడం జరిగేది. కొన్ని లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. ఇది జంపాన చౌదరి గారు దీనిపై విశ్లేషణ తోటి ఆన్ లైన్ లో పెట్టారుట. 1999 లో కథలో మిథునం అనువాదాన్ని చదివి ముచ్చట పడ్డ సుప్రసిధ్ధ మలయాళ దర్శకుడు MT వాసుదేవన్ నాయర్ ఈ కథ ఆధారంగా 9 ఏళ్ల విరామం తరువాత సినిమా తీయాలనుకొన్నారు. తరువాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వారు ప్రత్యేకంగా ప్రచురించిన తెలుగు కథ 1997 సంకలనంలో ఆ ఏటి ఉత్తమ కథల్లో మిథునం కూడా నిలబడింది. 2000 సంవత్సరంలో MT వాసుదేవన్ నాయర్ దర్శకత్వంలో 'ఒరుచెరు పుంజరి ' అంటే చిన్న చిరునవ్వు అనే పేరుతో మలయాళం లో సినిమా నిర్మించారు. 2001 లో జాతీయ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ పర్యావరణ పరిరక్షణ (అంటే ఇక్కడ ఇద్దరు భార్యా భర్తల కథ కాదు. వాళ్ళోక అద్భుతమైన తోటని పెంచుతారు. ఆవుని పెంచుతారు.) అవార్డు కూడా వచ్చింది. కేరళ ప్రభుత్వ ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చింది. అంతకంటే గౌరవము ఏమిటంటే ఈ చిత్రం పతాక సన్నివేశాన్ని 9వ తరగతి విద్యార్థులకు(కేరళలో) పర్యావరణ టెక్స్ట్ బుక్ లో పెట్టారుట. రచన పత్రికలో 1999 లో ప్రచురింప బడిన ఈ కథకు దువ్వూరి శారాదాంబ బహుమతిని ఇచ్చారు. ఆ కథలను కథా మహి పేరున ప్రచురించారు. 2001 లో నవోదయ పుబ్లికేషర్స్ వారు రమణ గారి మిథునం 8 కథల సంపుటిగా ప్రచురించారు. ఆ నవోదయ వారే ఇప్పటికీ 8 సార్లు ప్రచురించారు. 2006 మే లో మళ్ళీ రచన పత్రిక, బాపు దస్తూరితో ఉన్న కథను ప్రత్యేక సంచికగా వేశారు. ఇలా అనేకమంది రిటర్న్ గిఫ్ట్లు గా కూడా ఇవ్వడం జరిగింది. తరువాత దీన్ని 2011 లో K చంద్రనాథ్, KK మహాపాత్ర  ఆంగ్లంలోకి అనువదించారు. 2011లో వాహిని బుక్ ట్రస్ట్ ద్వారా రచన సాయి ఒకే ఒక్క మిథునం (బాపు దస్తూరితో ఉన్నది) అనే పేరుతోటి శ్రీ రమణ, జంపాల చౌదరి, వసుంధర వారి ముందు మాటలతో ప్రచురించారు. అది అదే సమయంలో 20 వేల కాపీలు అమ్ముడు పోయాయి. 2011 లో ప్రసిధ్ధ నటుడు, రచయిత తనికెళ్ల భరణి గారు దర్శకత్వంలో, ముయినం ఆనందరావు నిర్మాతగా తెలుగులో చిత్రాన్ని నిర్మించారు. ఇది 2012 లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు తో తృతీయ ఉత్తమ చిత్రంగా బహుమతిని గెలుచుకొంది. అప్పదాసు పాత్ర ధరించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కి, బుచ్చి లక్ష్మి పాత్ర ధరించిన లక్ష్మికి ప్రత్యేక జ్యూరీ బహుమతులు కూడా వచ్చాయి. తనికెళ్ల భరణి ఉత్తమ సంభాషణా రచయితగా కూడా అవార్డు దీంట్లో పొందారు. ఈ కథని తమిళం లోకి కూడా అనువదించారు. రేడియో నాటికగా కూడా వచ్చింది. ఈ విధంగా మిథునం కథకి చాలా విశేషాలు ఉన్నాయి.

ఈ విధంగా శ్రీరమణ గారు కథా రచయితగా, పేరడీ రచయితగా, హాస్య రచయితగా, అనేక కాలమ్స్ చేసిన రచయితగా మన తెలుగువారి గుండెల్లో ఉంటారు. ఎందుకంటే తెలుగు నేటివిటీ, సహజత్వాన్నీ అతను ఎక్కడా కోల్పోలేదు. గ్రామీణ వాతావరణాన్ని, మనుషుల్లో ఉన్న సహజత్వాన్ని తన కథల్లో చెప్పారు. ఇతని సంభాషణాల్లో ఒక విధమైన చురుకుదనం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఇటువంటి శ్రీరమణ గారు జూలై 19, 2023 న మరణించారు.  అనేక మండి ఆయన స్మృతికి రచనలు కూడా చేశారు.

అటువంటి ఆయన గూర్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వీక్షణం వారికి ముఖ్యంగా డా.కె.గీత గారికి , విన్నవారికి ధన్యవాదాలు" అని ఆమె ప్రసంగాన్ని ముగించారు.

సుశీలమ్మ గారి ప్రసంగాన్ని ఒక రోల్ మోడల్ గా శ్రీ మృత్యుంజయుడు గారు అభివర్ణించి, ఆమె కథను వివరించిన తీరుకు, ప్రసంగ ధాటికి, రమణగారి వైవిధ్యమైన నాలుగు కథల సారం విశ్లేషణకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డాక్టర్ గీత గారిని కోరారు. గీత గారు కూడా ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు.

తరువాత, జూలై 23 కవితా పురస్కార గ్రహీతగా శ్రీమతి పి ధనమ్మ రెడ్డి గారు ఎన్నికయినట్లు ప్రకటించారు. ఆమె వ్రాసిన 'మౌనం నాతో మాట్లాడింది' అనే కవితకు గాను ఈ పురస్కారం లభించినట్లు డా.గీత గారు సభకు తెలియజేశారు. తదుపరి కవిసమ్మేళనం ప్రారంభించారు.

ఈ కవి సమ్మేళనం లో అనేకమంది తమ తమ కవితలు వినిపించారు. ఇందులో రావెలపురుషోత్తమరావు, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, గౌరీపతి శాస్త్రి కె వి ఎస్(వీరవతి), ఆకుమళ్ల కృష్ణదాస్, మోటూరి నారాయణరావు, మేడిశెట్టి యోగేశ్వరరావు, పిళ్ళా వెంకట రమణమూర్తి, డాక్టర్ ఎం. ఎన్. బృంద, ప్రసాదరావు రామాయణం, చిట్టాబత్తిన వీరరాఘవులు, జోషి మధుసూదన శర్మ, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, ధనమ్మ రెడ్డి పి, అమృత వల్లి అవధానం, పత్తి సుమతి, దామరాజు విశాలాక్షి, ఆళ్ళ నాగేశ్వరరావు, డా.భమిడిమఱ్ఱి కమలాదేవి, విజయలక్ష్మి మల్కని, కొండూరు పోతన్న, డాక్టర్ సంధ్యారాణి కొండబత్తిని, డా బల్లూరి ఉమాదేవి, సి హెచ్ సాయిజ్యోతి, కలివే నాగేశ్వర రావు, కె పోతన్న, మాధురి ఇంగువ, డి వి ఆర్ మూర్తి మొదలైన వారు పాల్గొని సభను విజయవంతం చేశారు.

అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-132/

https://www.koumudi.net/Monthly/2023/september/sept_2023_vyAsakoumudi_vikshanam.pdf