Saturday 1 October 2022

వీక్షణం సాహితీ గవాక్షం-120 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం-120 వ సమావేశం

-- వరూధిని --


వీక్షణం-120వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆగస్టు 21, 2022 న ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. 

ఈ సమావేశంలో "ప్రియ భారతం" అనే అంశం మీద శ్రీ సుభాష్ పెద్దు గారు ప్రసంగించారు.

ఈ ప్రసంగంలో 'భారతమాత' అన్న మాట ఎలా పుట్టిందో, వందేమాతర గీతాన్ని ఎప్పుడు మొదటగా వినిపించారో దగ్గర్నించి మొదలు పెట్టి జయజయ ప్రియా భారత జనయిత్రీ గీత ప్రశస్తి వరకూ తెలియని విషయాలనెన్నో కూలంకషంగా వివరించారు. 

'భారతమాత' అనే పదాన్ని మొదటగా బెంగాల్ లో 'బంగోమాత' గా పరిచయం చేసినవారు బుదేబ్ ముఖోపాధ్యాయ. అలాగే 19వ శతాబ్దపు తొలిరోజుల్లో భారతమాత ఆహార్యం ఎంత నిరాడంబరంగా ఉండేదో 

కొన్ని చిత్రాలను చూపించి వివరించారు సుభాష్ గారు. ఇప్పటి కాలంలా కిరీటాలు, సింహం అంటూ దేవీ మాతను పోలిన అలంకారాలు ఉండేవి కావు. ఇందుకు నిదర్శనంగా 1909 నాటి విజయ పత్రిక ముఖ చిత్రాన్ని, అవనీంద్రనాథ్ చిత్రించిన భారతమాత ఊహా చిత్రాన్ని సభకు పరిచయం చేసారు. 

ఇక బంకించంద్ర ఛటర్జీ రాసిన ఆనంద్ మఠ్ లోని వందేమాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ తొలుత ఆలపించారు. ఈ గీతాన్ని బ్రిటిషు వారు 1905 లో నిషేధించారు. 

ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో బ్రహ్మసమాజంలో చేరిన తర్వాత రాసిన గీతం 'భారత భాగ్య విధాతా' గీతం.  ఇంచుమించు అదే కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన "జయజయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి" గీతం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మెచ్చిన గీతం. జాతీయగీతంగా ఏది ఉండాలన్న సమస్య ఎదురైనపుడు ఈ రెండు గీతాలు పరిశీలనలో ఉండడం విశేషం. సుభాష్ చంద్రబోస్ అన్నట్లు జాతీయగీతం అన్నది ప్రజలకి చైతన్యాన్ని చేకూర్చేదిగా ఉండాలి. 'జయజయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి' అటువంటి ఒక చైతన్య గీతం. అంటూ ఈ గీతాన్ని మొదటగా ఆలపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి గారితో తనకున్న అనుబంధాన్ని సభకు వివరించి ముగించారు. 

ఈ సందర్భంగా డా.కె.గీత, శ్రీమతి సుభద్ర గార్లు కలిసి 'జయజయజయ ప్రియ భారత జనయిత్రీ' గీతాన్ని చక్కగా ఆలపించారు. 

ఆ తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో డా.కె.గీత, శ్రీ రమణారావు,  శ్రీమతి సుభద్ర, శ్రీమతి ఉదయలక్ష్మి , శ్రీ దాలిరాజు వైశ్యరాజు మొ.న వారు పాల్గొన్నారు. 

ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో డా.కె.గీత, శ్రీ దాలిరాజు వైశ్యరాజు మున్నగువారు పాల్గొన్నారు. 

స్థానిక సాహిత్యాభిలాషులు ఆసక్తిగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది.   

విజయవంతంగా జరిగిన వీక్షణం-120వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబులో ఇక్కడ చూడవచ్చు.

https://youtu.be/4NDMKAAIhZg

--------------