Wednesday 21 September 2022

వీక్షణం సాహితీ గవాక్షం - 119 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం - 119 వ సమావేశం

-- వరూధిని --
vikshanam-119

వీక్షణం-119వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా జూలై 10, 2022 న ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది.

ఈ సమావేశంలో ముందుగా "కథ ప్రయోజనం" అనే అంశం మీద డా.కే.వి.రమణరావు గారు ప్రసంగించారు.

ముందుగా కథ లక్షణాల గురించి ప్రస్తావిస్తూ కథ లక్షణాల్లో ముఖ్యమైంది ప్రయోజనం. కథలు కొన్ని ప్రయోజనం కోసం రాస్తారు. కొన్ని పెద్దగా ప్రయోజనం ఆశించకుండా రాస్తుంటారు. కాలక్షేపానికి రాసేవి. ఉదా: డిటెక్టివ్, హాస్య రచనలు వంటివి.

ప్రయోజనాన్ని ఆశించి రాసే వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనాలు ఉంటాయి. ఒక్కోసారి ప్రయోజనం అంతర్లీనంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రయోజనం పాక్షికంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రయోజనం పక్కదారి పడుతుంది. ఉదా: మూఢనమ్మకాన్ని నిర్మూలించడానికి రాసింది మూఢనమ్మకాన్ని పెంచొచ్చు.

కథకి తాత్కాలిక ప్రయోజనం, శాశ్వత ప్రయోజనం అనేవి ఉంటాయి. ఉదాహరణకి కోవిడ్ కథలు, యుద్ధానికి సంబంధించిన మొ.వి తాత్కాలిక ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.

దార్శినికతతో రాసేవి కొన్ని. ఉదా: ఉత్తమ సమాజం కోసం రాసేవి. దార్శినికతలో అనులోమం, విలోమం అనే రకాలు ఉన్నాయి.

అసతోమా, తమసోమా, మృత్యోర్మా .. లలో కూడా ప్రయోజనం ఉంది. సంఘం శరణం గచ్చామి అన్నదాంట్లో కూడా ప్రయోజనం స్పష్టంగా సూచించబడింది.

కథ ప్రయోజన పరిణామం అనేది చూస్తే ప్రయోజనం ఎందుకు ఆశిస్తాం అనేదే పరిణామం. ఉదా: సామాజిక అసమానతలు రూపొందించడం. రైతుల ఋణమాఫీ వంటివి.

కథా ప్రయోజనం లో వివిధ మార్గాలు ఏవిటి అనేవి చూస్తే ముందుగా దిద్దుబాటు గురించి చెప్పుకోవాలి. వస్తువు, శిల్పం, ప్రయోజనం లో సరైనది దిద్దుబాటు కాబట్టే ఇప్పటికీ దాని స్థానం మారలేదు.

కథల్లో వివిధ మార్గాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవలసినవి వ్యక్తి లో మార్పులు, సమాజం లో మార్పులను ఉద్దేశించినవి.

వ్యక్తి లో మార్పు, సమాజం లో మార్పు, లేదా రెండిటిలోనూ మార్పులను ఉద్దేశించినవి మరి కొన్ని. ఇందులో మళ్లీ చాలా రకాలు ఉన్నాయి. సంప్రదాయాన్ని ఆశించి రాసేవి. ఇవి మళ్లీ భక్తి, జ్ఞానం, ధర్మం, మోక్షం అనే రకాలు .

ధర్మం కోసం రాసిన వాటికి ఉదాహరణగా విశ్వనాథ వెయ్యిపడగల్ని చెప్పుకోవచ్చు. సంప్రదాయ ధర్మాన్ని తిరిగి నెలకొల్పడం కోసం రాసింది వెయ్యిపడగలు.

సామాజిక చైతన్యం తర్వాతది. గురజాడ ఇందుకు ఉదాహరణ. గురజాడకు మార్క్స్ తెలియకపోయినా ఆయన భావజాలం అటువంటిది. ఆయన చూపు మరో వెయ్యి సంవత్సరాల తర్వాత వరకు ప్రసరించగలది. ఉదా: "ఆధునిక స్త్రీ చరిత్రని తిరగరాస్తుంది", "మంచి గతమున కొంచమేనోయ్" వంటివి.

నాస్తిక ప్రయోజనం కలిగినవి కొన్ని. చాసో, కారా, రావిశాస్త్రి, కేతు విశ్వనాథ రెడ్డి మొ.న వారు రాసిన కథలందుకు ఉదాహరణలు.

ప్రేమ గురించి రాసిన వారు చలం. వ్యక్తి చైతన్యం, తాత్విక, దార్శినిక ధోరణులతో రాసిన వారు బుచ్చిబాబు, గోపీచంద్, చండీదాస్.

తర్వాత మార్క్సిస్టు వాదం, సైన్సుతో కూడిన లిబరల్ వాదం,  దళిత, స్త్రీ, మైనారిటీ లాంటి అస్తిత్వవాదాలు కూడా చెప్పుకోదగినవి. ఆధునికానంతర వాదం ఇప్పుడు నడుస్తున్నది. అంటూ ముగించారు.

ఆ తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో డా.కె.గీత, శ్రీ ఆరి సీతారామయ్య , శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ అమరేంద్ర దాసరి, శ్రీ మల్లిఖార్జున దీక్షిత్, శ్రీ పొన్నాడ మూర్తి, శ్రీమతి దమయంతి, శ్రీ కొప్పర్తి రాంబాబు, శ్రీమతి ఉదయలక్ష్మి మొ.న వారు పాల్గొన్నారు.

స్థానిక సాహిత్యాభిలాషులు అత్యంత ఆసక్తిగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది.

విజయవంతంగా జరిగిన వీక్షణం-118వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు.

https://youtu.be/gOe8YDHB3Ps

---------

https://sirimalle.com/vikshanam-119/

https://www.koumudi.net/Monthly/2022/august/august_2022_vyAsakoumudi_vikshanam.pdf



వీక్షణం సాహితీ గవాక్షం - 118 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం - 118 వ సమావేశం

-- వరూధిని --
vikshanam-118

జూన్ 5, 2022 న వీక్షణం-118వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో ముందుగా "మా మామయ్య- మిథునం శ్రీరమణ" అంటూ శ్రీరమణ గారి మేనల్లుడైన శ్రీ కొప్పర్తి రాంబాబు గారు ప్రసంగించారు.

రాంబాబు గారి పూర్తి పేరు కొప్పర్తి రాంబాబు. పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దుగ్గిరాల గ్రామంలో. పెరిగింది చదువుకున్నది ఆంధ్రా ప్యారిస్ తెనాలి. విద్యాభ్యాసం తెనాలి, కొల్లూరు గ్రామాల్లో. తెనాలిలో చలం, కొడవటి గంటి వంటి ప్రముఖ రచయితలు తిరుగాడిన వీథుల్లో తిరుగుతూ పెరిగారు. సాహిత్య సాంస్కృతిక కేంద్రమైన తెనాలిలోని వారి ఇంట్లో వారి నాన్నగారి ప్రోత్సాహం వల్ల, ఆయనకు గల సాహిత్య నేపథ్యం వల్ల రాంబాబు గారికి సాహిత్యం పట్ల ఆసక్తి మరింత పెరిగింది. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. నాలుగు దశాబ్దాల పాటు ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ పుస్తక పఠనం వదిలిపెట్టలేదు. "కొప్పర్తి కథావాహిని" వీరి ఆడియో కథల ఛానెల్. యూ ట్యూబ్ లో వీరి ప్రసంగాలు వినవచ్చు.




తన ఉపన్యాసంలో భాగంగా రాంబాబు గారు శ్రీరమణ గారి విశేషాలు, ఆయనతో తనకు గల అనుబంధాన్ని హాస్యస్ఫోరకంగా సభకు వివరించారు. శ్రీరమణ గారి అసలుపేరు వంకమామిడి రాధాకృష్ణ. వారి తాతగారు పెట్టినపేరు రామరాజు. రాంబాబు గారు బాబు మావయ్య అని పిలుస్తారు. శ్రీరమణ గారు మొదట్లో పేరడీలు రాసేవారు. ఆయన రాసిన "రైలుబండిలో వైతాళికులు" అద్భుతమైన పేరడీ. ఆయన రాసిన ఫీచర్లలో అక్షరతూణీరం, రంగులరాట్నం, న్యూనుడి మొ.నవి ముఖ్యమైనవి. న్యూనుడి లో ఆయన రాసిన "మోహన ప్రసాద్ వేగుంట- తెలుగువారికి వినిపించని జేగంట", "సీరియల్ చూసే అమ్మ శ్రీవారి ఆకలెరుగదు" వంటివెన్నో పేర్కొనదగినవి.

శ్రీరమణ గారు చిన్నతనంలోనే  రామాయణం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఎంతో ప్రభావితులయ్యేరు. బాపు రమణలతో ఆయనకున్న అనుబంధానికి రామాయణం కారణమయ్యింది అన్నారు. వారి సినిమాలకు దాదాపు 35 సంవత్సరాల పాటు పెళ్లిపుస్తకం నించి శ్రీరామరాజ్యం వరకు సంభాషణలు రాయడమే కాకుండా అనేక సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేసారు.

ఆయన రాసిన ఏకైక నవల "ప్రేమపల్లకి". అందులో ప్రధానపాత్ర రాంపండుకి, మిథునం కథలోని మేనల్లుడి పాత్రకి రాంబాబుగారే ప్రేరణ. ఆయన రాసిన కథల్లో మిథునం, బంగారుమురుగుతో బాటూ, నాలుగో ఎకరం, ధనలక్ష్మి, సోడానాయుడు, తేనెలో చీమ, అరటిపువ్వు సాములోరు లాంటి ప్రముఖమైన కథలతోబాటు అంతగా పాపులర్ కాని "చివ్వరి చరణం" కూడా తనకి ఇష్టమైన కథలుగా పేర్కొన్నారు రాంబాబు గారు. తనని తాను పత్రికా రచయితగా మాత్రమే ఐడెంటిఫై చేసుకునే శ్రీరమణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. "ఉపమా రాచకొండస్య" లాంటి ఎన్నో అద్భుతమైన నిర్వచనాలు. వారి మేనల్లుడు కావడం తన అదృష్టమని పేర్కొంటూ ముగించేరు. దాదాపు గంట పాటు సాగిన రాంబాబు గారి ఉపన్యాసం ఛలోక్తులతో సభలోని వారందరినీ విశేషంగా అలరించింది.

ఆ తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో డా కే.వీ. రమణారావు, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ శేషారెడ్డి, శ్రీ శ్రీధర్ రెడ్డి , డా||కె.గీత, శ్రీ దాలిరాజు వైశ్యరాజు, శ్రీ తిరుమలాచార్యులు మొ.న వారు పాల్గొన్నారు.

ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో శ్రీ శ్రీధర్ రెడ్డి "ఎందుకోయ్" కవితని వినిపించగా, డా||కె.గీత దుఃఖపు మిన్నాగు" కవితని వినిపించగా, శ్రీ దాలిరాజు వైశ్యరాజు "నీటి నైతికశాస్త్రం" అనే చిన్నకథని వినిపించారు. శ్రీ తిరుమలాచార్యులు గారు ప్రత్యేకించి సుభాషితాలు దాగివున్న పూర్తి శ్లోకాలను విశదీకరించారు.

చివరిగా గీత గారు తాను మాతృదినోత్సవ సందర్భంగా రాసి, శృతి చేసిన "అమృతవాహిని అమ్మేకదా" అనే లలిత గీతాన్ని పాడి వినిపించి సభని అలరించారు. స్థానిక సాహిత్యాభిలాషులు అత్యంత ఆసక్తిగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది. విజయవంతంగా జరిగిన వీక్షణం-118వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడచూడవచ్చు.

https://youtu.be/n4VRqIF3wPs

-------

https://sirimalle.com/vikshanam-118/

https://www.koumudi.net/Monthly/2022/july/july_2022_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం సాహితీ గవాక్షం - 117 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం - 117 వ సమావేశం

-- కొప్పర్తి రాంబాబు --
vikshanam-117

వీక్షణం 117 వ  సాహితీ  సమావేశం అంతర్జాలం ద్వారా మే 15, 2022 న అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ నాటి సమావేశాన్ని నిర్వహించిన డా.కె.గీతామాధవి గారు అమెరికాలో చిరకాలంగా నివసిస్తూ తెలుగు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ లో ప్రముఖంగా, క్రియాశీలకంగా ఉంటూ వీక్షణం సాహితీ సమావేశాల్ని గత పదేళ్లుగా నిర్వహిస్తున్నారు.

ముందుగా గీతగారు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారిని సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ, సభాధ్యక్షులుగా వ్యవహరించ వలసిందిగా కోరడంతో సమావేశం ప్రారంభం అయ్యింది. అధ్యక్షుని తొలి పలుకులుగా శ్రీ చిట్టెన్ రాజు గారు తమ సహజ హాస్య ధోరణిలో మాట్లాడారు. అమెరికా తెలుగు కథలు ప్రచురించడం మొదలు పెట్టి ఆ తర్వాత వాటిని డయాస్పోరా కథలుగా ఎందుకు పేర్కొనాల్సి వచ్చింది, అసలు డయాస్పోరా అనే మాట ఎలా పుట్టింది, అది సాహిత్యంలోకి ప్రవేశించాక ఏ విధమైన భావనగా మారింది అంటూ వివరంగా చెప్పుకొచ్చారు. తెలుగు డయాస్పోరా కథలు అంటే కేవలం అమెరికాలో స్థిర పడ్డ తెలుగు రచయితల కథలు మాత్రమే కాకుండా తక్కిన విదేశాల్లో, స్థిరపడిన రచయితల కథలు కూడా కలిపి ప్రచురించాలని అనుకోవడానికి గల కారణాలను,డయాస్పోరా అనే మాట చుట్టూ వివరిస్తూ సోదాహరణంగా మాట్లాడారు.


అధ్యక్షుని తొలి పలుకులు ముగిశాక సమావేశ నిర్వాహకురాలు డాక్టర్ కె.గీత గారు, ప్రధాన వక్త శ్రీ ఏ. కె.ప్రభాకర్ గారిని సభకు పరిచయం చేశారు.

శ్రీ ఏ. కె.ప్రభాకర్ గారు ప్రముఖ సాహిత్య విమర్శకులు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏడేళ్లపాటు సంస్కృతం, తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ, జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం , బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు, 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు.

తరువాత ప్రధాన వక్త శ్రీ ఏ కె.ప్రభాకర్ గారు తమ సుదీర్ఘ ఉపన్యాసంలో డయాస్పోరా పదం తెలుగు కథా సాహిత్యంలో ప్రవేశించిన సమయం సందర్భం నుంచి ప్రారంభించి ఇటీవల వెలువడిన డయాస్పోరా తెలుగు కథానిక 2021 లోని కథల్లో ప్రస్తావించబడిన అనేకానేక విషయాలను, విపులంగా చర్చించారు.ఆయా కథలను ప్రస్తావిస్తూ  వాటిలోని అంశాలను అమెరికా జీవన నేపథ్యం , భారత దేశంలోని పరిస్థితులు రెండిటినీ ప్రస్తావిస్తూ సమీక్షించారు.

డయాస్పోరా కథా సంకలనంలో మూడవ వంతు కథలు మాత్రమే తనను ఆకర్షించాయి అనీ , కథానికా రచనలో ఇంకా ప్రమాణాలు పెరగ వలసి ఉంది అని అభిప్రాయపడ్డారు. డయాస్పోరా కథలకు ఎంచుకునే కథాంశాలు అమెరికా లోని నిత్య జీవన అంశాలు అయిఉండాలి అని , ఆ విధంగా కె.గీత గారి సిలికాన్ లోయ సాక్షిగా పూర్తిగా అమెరికా స్థానిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ, కొత్తగా అమెరికా వచ్చిన వారు అమెరికన్ సమాజాన్ని జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి అన్నారు. అమెరికా డయాస్పోరా కథలు తెలుగు కథకి చేర్పు కావాలి అన్నారు.

డయాస్పోరా కథలు అంటే దేశం బయట ఉండే తెలుగు వారు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రం నుంచి వలస వెళ్లి బయటి రాష్ట్రాలలో పాదు కొలుపు కున్న వారు వారి ప్రాంతీయ తెలుగు యాసలో, భాషలో రాసిన కథలు కూడా డయాస్పోరా కథలు అవుతాయి అనీ, అందువల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల నించి వలస వెళ్లిన రచయితలు వారి ప్రాంతీయ మాండలికం కూడా కథా రచనలో వాడితే బావుంటుంది అన్నారు.

ప్రపంచంలో వలస వెళ్లిన జాతి యూదులు అనుకుంటే వారిదే మొదటి డయాస్పోరా చరిత్ర గా భావించాలి అన్నారు.ఇక తెలుగువారి వలస గురించి డయాస్పోరా జీవితాలు గురించి ఆలోచిస్తే దేశాన్ని వదిలి వెళ్లిన వారు, రాష్ట్రాన్ని వదిలి వెళ్లిన వారు కూడా ఒక వేదనకు గురి అవుతారు అనీ, ఆ వేదన, చేతన కింద పరిణమిస్తుంది అని చెప్పారు.

ఆ తరవాత జరిగిన విస్తృత చర్చలో శ్రీ దాసరి అమరేంద్ర, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ ఆరి సీతారామయ్య, శ్రీ తిరుమలాచార్యులు, శ్రీ ప్రసాదరావు, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి కొండపల్లి నీహారిణి, శ్రీ కొప్పర్తి రాంబాబు, శ్రీమతి దశిక శ్యామలాదేవి, శ్రీ లెనిన్ అన్నే, శ్రీ రాజశేఖరం మొ.న వారందరూ పాల్గొన్నారు.

సమావేశం చివరిలో "కవితా పఠనం" జరిగింది. ఇందులో శ్రీ శ్రీధర్ రెడ్డి"కలవరం" అనే కవితని, శ్రీమతి కొండపల్లి నీహారిణి "కలలు"అనే కవితని , డా.కె.గీత "అబార్షన్ మా జన్మహక్కు" అంటూ అమెరికాలోని అబార్షన్ హక్కుల ఉద్యమం గురించి కవితల్ని వినిపించారు.

చివరగా గీత గారి వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది. స్థానిక సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది.

https://youtu.be/n4VRqIF3wPs 

--------

https://sirimalle.com/vikshanam-117/

https://www.koumudi.net/Monthly/2022/june/june_2022_vyAsakoumudi_vikshanam.pdf



వీక్షణం సాహితీ గవాక్షం - 116 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం - 116 వ సమావేశం

-- వరూధిని --
vikshanam-116

ఏప్రిల్ 10, 2022 న వీక్షణం-116వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో ముందుగా "ముత్తుస్వామి దీక్షితార్ రచనల్లో సాహిత్యం- రహస్యాలు" అనే అంశం మీద శ్రీ మధు ప్రఖ్యా గారు ప్రసంగించారు.

"ముత్తుస్వామి దీక్షితార్ 1775-1835 మధ్య జీవించిన కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన గొప్ప వాగ్గేయకారుడు, వీణ విద్వాంసుడు. ఈయన కృతులు తెలుగు కంటే ఎక్కువగా సంస్కృతంలో రాయబడ్డాయి. కొన్ని కృతులు తమిళము, సంస్కృతాల సమ్మేళనాలుగా కూడా రాయబడ్డాయి. వీరి అన్ని రచనల్లోనూ "గురు గుహ" అనే మకుటం కనిపిస్తుంది.  వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. అయిదువందలకు పైగా రచనలు చేసారు. అందువల్లనో  ఏమో వీరి కృతుల్లో అక్షర వరుసలు ప్రత్యేకమైన జ్యోతిష శాస్త్ర పద్ధతుల్లో అమర్చబడి ఉన్నాయి." అంటూ ముందుగా మధుగారు వారి గురువైన మాండలీన్ రాజేష్ గారు మాండలీన్ పైన వినిపించిన "పంచముఖ మాతంగ ముఖ గణపతినా" అనే ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనని అందరికీ పరిచయం చేసారు.

"ముత్తుస్వామి దీక్షితార్ విభిన్నమైన దేవతలపై కీర్తనలను రాసిన విశిష్టమైన వ్యక్తి. జ్యోతిశ్శాస్త్రాన్ని సంగీతంతో మిళితం చేసి రాగాలకు సరిగ్గా సరిపడే స్వరాల్ని కూర్చడం ఈయన ప్రత్యేకత" అని వివరించారు. ఆయన కీర్తనల్లో పదాలకు, భావాలకు, రాశులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని సోదాహరణంగా తెలియజేస్తూ ముగించారు.

ఇందుకు కొనసాగింపుగా ప్రేక్షకుల కోరిక మేరకు శ్రీమతి అపర్ణ గునుపూడి గారు ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనల్లోని మకుటాయమాయమైన "హిరణ్మయీం లక్ష్మీం" అనే కృతిని పరిచయం చేసారు.

ఆ తరువాత జరిగిన విన్నకోట రవిశంకర్ గారి కవితాసంపుటి "మంచుకరిగాక" ఆవిష్కరణ డా.కె.గీత గారి చేతుల మీదుగా జరిగింది. ముందుగా డా.కె.గీత మాట్లాడుతూ ఇందులో ఒక్కొక్క కవితా ఒకొక్క ఆణిముత్యమని కొనియాడారు. ఈ సంపుటిలో అనుకోకుండా ఏ పేజీ తిరగేసినా వెంటాడే వాక్యాలే అంటూ అక్కడక్కడా కొన్ని పాదాల్ని సభకు చదివి వినిపించారు.

తరువాత శ్రీమతి ఇంద్రాణి పాలపర్తి పుస్తక పరిచయం చేస్తూ రవిశంకర్ గారి కవిత్వంలో సరళత, తేలికపదాల్లో లోతైన భావాల్ని చెప్పడం, క్లుప్తత, తాత్త్వికత ముఖ్య లక్షణాలని అన్నారు. ఇందులో ఏ కవిత లోనైనా కవి నిజాయితీ కనిపించేలా ఉంటుందని ఈ పుస్తకంలో తమ్మినేని యదుకులభూషణ్ గారు రాసిన మాటల్ని సభకు పరిచయం చేసారు. రవిశంకర్ గారు ఇప్పటివరకు దాదాపు 130 కవితలు మాత్రమే రాసినా రాశి కన్నా వాసికి విలువనిచ్చే కవి అని కొనియాడుతూ ఈ సంపుటి నించి కొన్ని కవితల్ని పరిచయం చేసారు.

ఆ తరువాత కవి రవిశంకర్ గారు తమ ప్రతిస్పందనగా మాట్లాడుతూ కవిత్వం 'సర్వ కాలికంగా ఉండే ఒక అన్వేషణ' అన్నారు. ముఖ్యంగా తన కవిత్వంలో మనిషి జీవితంలో కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని ఒడిసిపట్టుకోవడమే కాకుండా కాలాతీతంగా కలిగే సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించడం ప్రధానమని అన్నారు.

ఆ తర్వాత  జరిగిన  కవిసమ్మేళనంలో  శ్రీ విన్నకోట రవిశంకర్ "పాతపద్యం" కవితని, శ్రీమతి ఇంద్రాణి పాలపర్తి  'కాళీపదములు' కవితల్ని, డా||కె.గీత "నెమలీక జ్ఞాపకం" కవితని, శ్రీ శ్రీధర్ రెడ్డి "మధ్యలోనే" కవితని వినిపించగా, శ్రీ మారుతి తన్నీరు "నీలకంఠ రక్షకునకు" పాటని,  శ్రీమతి గునుపూడి అపర్ణ "శ్రీరామ జయరామ" అనే త్యాగరాజ కీర్తనని, డా||కె.గీత  కృష్ణశాస్త్రి గారి "పదములె చాలు" పాడి వినిపించి అందరినీ అలరించారు. స్థానిక సాహిత్యాభిలాషులు ఆసక్తిగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది.

విజయవంతంగా జరిగిన వీక్షణం-116వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో చూడవచ్చు.

https://youtu.be/MZuoCGYtwIs

-------

https://sirimalle.com/vikshanam-116/

https://www.koumudi.net/Monthly/2022/may/may_2022_vyAsakoumudi_vikshanam.pdf



వీక్షణం సాహితీ గవాక్షం - 115 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం - 115 వ సమావేశం

కాళ్ళకూరి భక్త చింతామణి నాటకం- పరమార్థం & ఉగాది కవిసమ్మేళనం
-- వరూధిని --
vikshanam-115

వీక్షణం-115వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా మార్చి13, 2022 న ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో ముందుగా "కాళ్ళకూరి భక్త చింతామణి నాటకం- పరమార్థం" అనే అంశం మీద శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు ప్రసంగించారు.

సమాజంలోని వ్యసనాలను ఎత్తి చూపుతూనే, నైతిక విలువలు బోధించే సందేశంతో పాటూ రసవత్తరంగా ఉండేలా రాసిన సాంఘిక నాటకాల్లో తెలుగునాట విశేష ఆదరణ పొందినవాటిలో చింతామణి కూడా ఒకటి. ఒక కులానికి చెందినవారిని అనుకరిస్తూ, హేళన చేసేలా ‘చింతామణి’ నాటకంలో ఒక పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నాటక ప్రదర్శనలను నిషేధించింది. అయితే ఒక పాత్ర విషయంలో సమస్య ఉంటే మొత్తం నాటకాన్నే నిషేధించడం సరికాదని నాటక రంగ అభిమానుల మాట. ఈ నేపథ్యంలో వీక్షణం ఈ అంశంమీద ప్రసంగించవల్సిందిగా నాటక రంగ ప్రముఖులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారిని కోరారు. అక్కిరాజు సుందర రామకృష్ణ గారు పద్యకవి, రంగస్థల సినిమా నటులు, గాయకులు, అధ్యాపకులు, మంచి వక్త. వీరి తండ్రి అక్కిరాజు రామయ్య, తల్లి అన్నపూర్ణమ్మ. గుంటూరు జిల్లా నరసరావుపేట లో 23 ఏప్రిల్ 1949లో జన్మించారు. ప్రముఖ రచయిత అక్కిరాజు రమాపతిరావు గారు వీరి సోదరులు. సుందర రామకృష్ణ హైదరాబాద్‌లో ఎం.ఎ., ఎం.ఓ.ఎల్.,ఎం.ఫిల్ చేశారు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వేంకటపార్వతీశకవులు - రామాయణ పద్యకృతులు అనే అంశం పై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. థియేటర్ ఆర్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. అమ్మతోడు, కేశవామాధవా, కోనేటి రాయనికి, బాపూరమణా, తేనీటి విందు, కవీశ్వరా, శంకరనారాణీయము,రాజేశ్వరీ శతకము,శ్రీ శనీశ్వర శతకము,అమెరికాలో కవిసుందర్ - శ్యామసుందర్, కవితాశరథి దాశరథి,ఆంజనేయ శతకం, భీమన్న, భీమలింగ శతకం మొదలైన కావ్యాలు వ్రాశారు. వీరు గాయకులు, సంగీత దర్శకులూ కూడా. అనేక రంగస్థల నాటకాల్లో, సినిమాల్లో నటించారు.

సుందర రామకృష్ణ గారు తమ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఎన్నో సార్లు తాను ఏకపాత్రాభినయంగా కూడా  ప్రదర్శించిన ఈ నాటకం మీద ప్రసంగించడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు.

ముందుగా నాటక కథని, చింతామణి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ "చింతామణి నాటకం తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం. ఇది ప్రథమాంధ్ర ప్రకరణముగా గుర్తింపుతెచ్చుకొన్నది. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా శ్రీ కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ప్రధానంగా వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకం లీలాశుకచరిత్ర ఆధారంగా రచించబడినది.

చింతామణి వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి, చెల్లి చిత్ర. భవాని శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు.ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవాని శంకరం ద్వారా అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు అయిన బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చిన ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరించింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. చింతామణి బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది. ఆ సంఘటన తరువాత బిల్వమంగళునిలో పరివర్తన వస్తుంది. ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది. బిల్వమంగళుడు కూడా సోమదేవ మహర్షి పిలుపువల్ల ప్రభావితుడై ఆశ్రమ స్వీకారం చేసి అనంతర కాలంలో లీలాశుక యోగీంద్రుడుగా మారి శ్రీ కృష్ణ కర్ణామృతం అనే సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు.

చింతామణి అందాల రాశి. సకల విద్యలు నేర్చిన నెరజాణ. సంగీత, సాహిత్యాల్లో నిష్ణాతురాలు. నాట్యంలో మయూరి. లోకానుభవానికి కొదవే లేదు.అయినా కులవృత్తి రీత్యా వేశ్య కాక తప్పలేదు. వేశ్యాకులంలో పుట్టినా సంస్కారవంతురాలు. కాబట్టే మంచీ చెడులవిచక్షణను గుర్తెరిగి ప్రవర్తించేది. తన వ్యామోహంలో పడి సర్వం సమర్పించుకొని, ఉత్తచేతులతో మిగిలిన భవానీ శంకరాన్ని బయటకు గెంటేయమంటుంది తల్లి శ్రీహరి. అయితే చింతామణి ఇందుకు ఓ పట్టాన అంగీకరించదు. తల్లికి నచ్చ జెప్పబోతుంది. నిజానికిచింతామణికి వేశ్యా కుల సహజ లక్షణాలు ఒంటబట్టలేదు. వేశ్యకు కూడా నీతి వుంటుందని చింతామణి నిరూపించింది. అందుకే చింతామణి ప్రియవస్య, సర్వాంగ సుందరి అంటాడు భవానీ శంకరం." అన్నారు.

అలాగే ఈ నాటకంలోని  అనేక విశేషాంశాల్ని తెలియజేసి, "కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు", "వారాసి నడుమ", "అర్ధాంగ లక్ష్మి యైనట్టి ఇల్లాలిని", "అత్తవారిచ్చిన అంటుమామిడి తోట" వంటి ప్రసిద్ధ పద్యాల్ని రాగయుక్తంగా ఉదహరిస్తూ, ఆలపిస్తూ సభలోని వారికి వీనుల విందు చేసారు.

ఆ తర్వాత జరిగిన శుభకృత్ నామ సంవత్సర ఉగాది కవిసమ్మేళనంలో స్థానిక కవులు విశేషంగా పాల్గొని తమ కవితల్ని చదివి, పద్యాల్ని రాగయుక్తంగా ఆలపించి, గీతాలు పాడి ఉగాదికి స్వాగతం పలికారు. శ్రీ రావు తల్లాప్రగడ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది కవిసమ్మేళనం లో శ్రీ రావు తల్లాప్రగడ "నీ తలపే" గజల్ ని, డా||కె.గీత "యుద్ధప్రశ్నలు" కవితని, "జంగమయ్యా" అనే అనుసృజన గీతాన్ని, శ్రీ మధు ప్రఖ్యా "పులిహోర" అనే హాస్య కవితని, శ్రీ మారుతి తన్నీరు "నా పైన నర్తించె నాగభూషణుడు" పాటని, శ్రీ సాయికృష్ణ మల్లవరపు విఘ్నేశ్వర స్తోత్ర పద్యాల్ని, శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ ఉగాది పద్యాల్ని, శ్రీమతి స్వాతి ఆచంట "హనుమంతుడు" కవితని, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి ఉగాది పద్యాల్ని, శ్రీ దాలిరాజు వైశ్యరాజు"నిరాశ్రయుల వేదన" కవితని , శ్రీ తాటిపర్తి బాలకృష్ణారెడ్డి "కాలచక్రం" కవితని, శ్రీమతి నీహారిణి కొండపల్లి"రసహృదయాలు-రాగరంజితాలు" కవితని , శ్రీమతి గునుపూడి అపర్ణ"తాండవించె లక్ష్మి" గీతాన్ని, శ్రీ వెంకట సోమయాజి ధవళ "తెలుగువాడిని నేను" కవితని వినిపించారు.

స్థానిక సాహిత్యాభిలాషులు ఆసక్తిదాయకంగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది. వీక్షణం-115వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో చూడవచ్చు.

https://youtu.be/MZuoCGYtwIs

------

https://sirimalle.com/vikshanam-115/

https://www.koumudi.net/Monthly/2022/april/april_2022_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ గవాక్షం - 114 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం - 114 వ సమావేశం

-- వరూధిని --
vikshanam-114

వీక్షణం-114వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఫిబ్రవరి13, 2022 న అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో ముందుగా "కథామధురం- స్త్రీల పాత్రలు" అనే అంశం మీద శ్రీమతి ఆర్. దమయంతి గారు ప్రసంగించారు. నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రికలో ధారావాహికంగా ప్రచురిస్తున్న 'కథా మధురం' శీర్షిక నించి కొన్ని కథలనెంచుకుని ప్రసంగించారు దమయంతి గారు.

ప్రసంగాన్ని ప్రారంభిస్తూ - తాను ఈ శీర్షికను ఎంచుకోవడం లో గల ముఖ్యోద్దేశాన్ని ముందుగా వివరించారు. కథని విశ్లేషించేటప్పుడు సాధారణంగా కథని, కథాంశాన్ని, శైలిని, భాషని ప్రస్తావించడం సహజ సాధారణమైన విషయమనీ, కానీ తానందుకు భిన్నంగా కథలోని స్త్రీపాత్రలకు, స్వరూప స్వభావాలకు పట్టం కట్టి  స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించడానికే ప్రాధాన్యతనిస్తున్నానని చెప్పారు. అందుకుగాను నెచ్చెలి పత్రికా సంపాదకురాలు డా.కె.గీత కూడా సమ్మతించి, ప్రోత్సహించడం ఎంతైనా ముదావహం అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

విశ్లేషణలో భాగం గా ముందుగా శ్రీమతి మన్నెం శారద గారు రచించిన 'తాతగారి ఫోటో' కథలోని స్త్రీ పాత్రలను విశ్లేషించారు. కట్టుకున్న వాడు బయటవాళ్ళకు ఎంత గొప్ప వాడైనా, భార్య మనసులో అతనికి ఇసుమంత స్థానమైనా లేనప్పుడు అతను పోయాక దుఃఖమూ వుండదు, ఇక లేడన్న బాధా వేయదు. అంతెందుకు, చివరికి గోడ మీద వేలాడే ఫోటోని సైతం తొలగించేందుకు వెనుకాడదు. అని స్పష్టం చేస్తుందీ కథ అన్నారు. అలానే, ఆయన గారి రెండో సావాసిని గురించి మాట్లాడుతూ..'అదర్ వుమన్..' అంటే చాలా మంది చులకన చేసి మాట్లాడతారనీ, సమాజంలో ఆమె స్థానం హీనమన్నట్టు కించపరుస్తారని, కానీ కథలో ఆ పాత్రని ఎంతో హుందాగా మలచడం రచయిత్రి సంస్కారానికొక కొలబద్ద అని కొనియాడారు. పోయిన ఆ పెద్దమనిషి ఫోటో తన ఇంట్లో కూడా వొద్దనడం ఆ స్త్రీ ఆత్మ గౌరవానికి చిహ్నమని పేర్కొన్నారు. కథంతా నడిపిన మనవరాలు ముగింపులో అమ్మమ్మకి తోడుగా నిలవడం పై మాట్లాడుతూ ఈ రోజుల్లో తల్లితండ్రులకి, ఇంట్లోని వృద్ధులకీ - ఆడపిల్లలే తోడై నిలుస్తున్నరనడానికి ఈ పాత్ర ఓ మచ్చుతునకగా పేర్కొనాలన్నారు.

డా.కె.వి.రమణ రావు గారు రచించిన 'కలలోని నిజం..' కథలోని స్త్రీ పాత్రల రూపకల్పన గురించి, ఆయా పాత్రల ఔన్నత్యం గురించి మాట్లాడారు. కథలోని ప్రధాన పాత్రధారి మాధవరావు లోని చీకటి ఆలోచనలను తొలగించి, అతనిలో మార్పుని తీసుకొచ్చిన ముగ్గురు వనితల ఉన్నత సంస్కారాన్ని కొనియాడారు. శ్రీమతి పావనీ సుధాకర్ రచించిన 'ప్రయాణం..' చిన్న కథ లోని ఏకైక స్త్రీ పాత్రని వివరిస్తూ.. పసిపిల్లాడితో వొంటరిగా ప్రయాణించే స్త్రీలకి కథలోని హీరో లాటి మగవాడు దొరకడం కేవలం కథలకే పరిమితం కాకూడదని..హీరో ఇజం అంటే ఇబ్బందుల్లో వున్న స్త్రీలకి సహాయాన్నందించి, చేయూత గా నిలవడం ఎంతైనా అవసరం అన్నారు.అలా సాయం చేసిన ఆ హీరో ఆమె మనసులో చెరగని ముద్ర వేయడం, అతని జ్ఞాపకం ఆమె మనసులో పరిమళాలను వెదజల్లుతున్నాయని ఆమె ప్రకటించడం వెనక స్త్రీ స్వచ్చమైన కృతజ్ఞతాభావాన్ని ప్రశంసించారు.

స్త్రీ భావప్రకటనా స్వేచ్చకి పెద్ద పీట వేసిన కథ గా "ప్రయాణం" కథని అభివర్ణించారు. జింబో రాజేందర్ గారు రచించిన 'ఆమె కోరిక..' కథలో-విడాకులకు ఆ భార్య అంగీకరించని కారణం వెనక దాగిన రహస్యంతో బాటు ఆమె మనోభావాల మీద, మనోభారాల వ్యధల మీద పూర్తి విశ్లేషణా ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే, పాఠకులు కథని చదవడం కోసం ముగింపుని సశేష విభాగం లో వుంచారు.

ఈ కథలపై డా.గీత గారితో బాటు శ్రీ విద్యార్ధి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ సి.బి.రావు, శ్రీమతి రమణ, శ్రీ ప్రసాదరావు గోగినేని, శ్రీ వెంకట సోమయాజి మొ.న వారు కూడా చర్చలో పాల్గొని ఆనాటి కథా విశ్లేషణా కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

వీక్షణం సంస్థాపకఅధ్యక్షులు డా.కె.గీత గారు మాట్లాడుతూ - జీవితంలో తుఫానులాటి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు స్త్రీలు మనోధైర్యాన్ని కలిగివుంటమే కాదు, అవసరమైతే కొత్త మార్గాన్ని ఎంచుకుని మార్గదర్శకత చాటాలని సూచించారు. అతిథులందరూ శ్రీమతి ఆర్. దమయంతిని అభినందించారు.

ఆ తర్వాత ఇటీవల పరమపదించిన "బుజ్జాయి" గా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ కార్టూనిస్టు, దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి గారి గురించి శ్రీ విద్యార్థి ప్రసంగించారు. ఆయన దేవులపల్లి కృష్ణ శాస్త్రి  గారి ఏకైక కుమారుడు. ఎటువంటి ప్రాథమిక విద్య లేకుండా ఆయన జీవితాన్ని గడపడం ఆశ్చర్యకరం. విద్యార్థి గారు ఆయన కార్టూనిస్టు కావడానికి దోహదపడిన విషయాలని పరిచయం చేస్తూ స్వయంగా కృష్ణ శాస్త్రి గారి మేనకోడలు శ్రీమతి వింజమూరి అనసూయ గారు తనతో ప్రస్తావించిన అనేక అంశాల్ని సభకు పరిచయం చేసారు.

ఆ తర్వాత డా.కె.గీత గారు, శ్రీమతి రమణ గారు శ్రీ నరిశెట్టి ఇన్నయ్య గారి సతీమణి శ్రీమతి కోమల గారికి నివాళులు అర్పించారు. కోమల గారు నెచ్చెలిలో రాస్తున్న తెలుగు, ఆంగ్ల శీర్షికల్ని పరిచయం చేసారు.

కోమలగారు డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారు. శేషజీవితాన్ని వాషింగ్టన్ డీ.సీ లో గడిపారు. వారు అనేక అనువాదాలు చేసారు. వారి స్వీయచరిత్రని  తెలుగులోను, ఇంగ్లీషులోను రచించారు. అనేక పత్రికలకి వ్యాసాలు రాశారు. అయాన్ హిర్సీఅలీ  నోమాడ్ ను,  కేజ్డ్ వర్జిన్ ను, యంగ్ ఛాంగ్  వైల్డ్ స్వాన్స్ ను, ఎమ్.ఎన్.రాయ్ 'మెమోయిర్స్ ఆఫ్ కాట్' ను, ఎలీవీజల్' నైట్ 'ను, తస్లీమా నస్రీన్ 'సోథ్‌'ను చెల్లుకు చెల్లు పేరుతో  తెలుగులోకి అనువాదం చేసారు. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి ప్రశాంతంగా డిసెంబరు 5, 2021న అమెరికాలో తనువు చాలించారు.

చివరిగా ఇదేనెలలో స్వర్గస్తులైన ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ కు నివాళులు అర్పిస్తూ శ్రీమతి దమయంతి, డా.కె.గీత గానం చేశారు.

ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో డా||కె.గీత ఇటీవల కర్ణాటకలో జరిగిన హిసాబ్ వివాదం గురించి రాసిన "నా ఆహార్యం - నా ఇష్టం" కవితని, దమయంతి గారి కోరిక మీదట "మా నారింజచెట్టు" కవితని, శ్రీ వెంకట సోమయాజి అంతర్జాతీయ స్త్రీల దినోత్సవాన్ని గురించిన కవితని వినిపించారు. స్థానిక సాహిత్యాభిలాషులు ఆసక్తిదాయకంగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది.

వీక్షణం-114వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో చూడవచ్చు.

https://youtu.be/MZuoCGYtwIs

-------

https://sirimalle.com/vikshanam-114/

https://www.koumudi.net/Monthly/2022/march/march_2022_vyAsakoumudi_vikshanam.pdf



వీక్షణం సాహితీ గవాక్షం - 113 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం - 113 వ సమావేశం

-- వరూధిని --
vikshanam-113

వీక్షణం-113వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆద్యంతం ఆసక్తిదాయకంగా జనవరి 9, 2022 న జరిగింది. ఈ సమావేశంలో ముందుగా ప్రముఖ కథారచయిత్రి, రేగడివిత్తులు నవలా రచయిత్రి డా.చంద్రలత కథ "బొట్టెట్టి" కథాపఠనం జరిగింది.

ఈ కథ ‘’బొట్టెట్టి’’ అని అదే పేరు గల కథా సంపుటి లోనిది. ఈ కథ గురించి అనురాధ నాదెళ్ల గారు ఇటీవల రాసిన సమీక్షలో-

"ఆడపిల్లకు పుట్టింటి మీద ఉండే మమకారం ప్రతి ఆడపిల్లకూ అనుభవమే. దానికి కారణం ఆ ఇంటినుంచి ఏవో సంపదలు పొందాలన్న ఆశ కాదు. చిన్ననాట ఆ ఇంట ఆడిన ఆటలు, పొందిన ప్రేమ జీవితాంతం తనను వెన్నంటి ఉండే ఆత్మీయ, మమకారాలు, చిరునవ్వుతో జీవితాన్ని ఎదుర్కొనే ఆత్మస్థయిర్యాన్నిస్తాయి. పుట్టింటి నుండి పిలుపు అంటే అది బొట్టెట్టి పిలవనక్కరలేదు. మాట మాత్రం చాలదా? ఇదే ప్రశ్న అడుగుతుంది కథలో రమణి తన భర్తని. సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా పడుతూ లేస్తూ పుట్టింట జరిగే అనేక వేడుకలకి నిరంతరంగా ప్రయాణాలు చేసి చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని కూడా వెళ్లేందుకు సిద్ధపడుతూనే ఉంటుంది.

పుట్టింటి నుంచి ఆస్తులు తెచ్చుకోవాలన్న ఆశతో వెళ్తోందంటూ చుట్టుపక్కలవాళ్లు హేళన చేస్తున్నారంటూ అత్తగారు, ఆడపడుచు విసుక్కున్నా పట్టించుకోదు. పిల్లలతో చేసే ప్రయాణాలు, ఆనక ఒంటిగానూ అన్ని దశల్లోనూ రకరకాల అసౌకర్యాలను భరిస్తూనే ఉంటుంది రమణి. భర్త విమర్శిస్తే అయినవాళ్లు మన అవసరాలకి, మన ఇంట్లో అక్కరలకీ రావద్దామరి? అని అడుగుతుంది. ఆమె అన్నట్టుగానే భర్త పోయినప్పుడు పుట్టింటివారొచ్చి అవసరమైన కార్యక్రమాలన్నీ జరిపిస్తారు.

ఆనక పుట్టింట్లో జరిగిన శుభకార్యాలకు అలవాటుగా వెళ్ళినా ఆమెను అశుభమంటూ దూరం పెడతారు. అన్నీ భరిస్తూనే ఉంటుంది. తన పిల్లల పెళ్లిళ్లకి ఇరుగుపొరుగులే అన్నీ అయి ఆదుకుంటారు. ఆరోగ్యం పోగొట్టుకుని, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థిక సమస్యల మధ్య వైద్యం చేయించుకుంటుంది. అప్పుడూ వెళ్తుంది పుట్టింటికి.

స్నేహితురాలు సుధ సహించలేక ‘’నీరాక పట్ల గౌరవం, నీ పట్ల సానుభూతి లేని చోటుకి అనారోగ్యంతో ఎందుకా ప్రయాణాలు?’’ అని గట్టిగా అడిగినప్పుడు, ‘’అవునులే. నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటాలే’’ అని చెబుతూనే రమణి తన బ్యాగ్ లోంచి నెయ్యి గుబాళింపుతో ఉన్న చలిమిడిని తీసి స్నేహితురాలికి పెడుతుంది. ఆపైన కొబ్బరిపుల్లకి గుచ్చిన బొగడపూలను చూపిస్తూ ‘’బొగడచెట్టు నాన్న నాటిందే’’ అని చెప్పి మురిసిపోతుంది. పుట్టింటి పెరట్లోంచి తెచ్చిన ముద్దబంతులు, కారబ్బంతులు బ్యాగ్ లోంచి తీస్తుంది. ఏటి ఒడ్డున ఏరుకొచ్చిన మెరిసేరాళ్లను కూడా చూపిస్తుంది. ఇంకా, పెళ్ళినాడు నాన్న అమ్మకి బహూకరించిన శరత్ నవల అమ్మ పదేపదే చదవగా పసుపు రంగులోకి మారిందంటూ తీసుకొచ్చి చూపిస్తుంది. నాయనమ్మ పుట్టింటి నుంచి తెచ్చి నాటిన రాతి ఉసిరి చెట్టు కాయలూ తెస్తుంది.

‘’అమ్మమ్మ వడికిన రాట్నం ఈసారి వెళ్లినప్పుడు అడిగి తెస్తాలే.’’ అని చెబుతుంది. స్నేహితురాలికి నోట మాటరాదు. ‘’పుట్టింటి నుంచి చీరెసారెలేం తెచ్చుకున్నావ్?’’ అని విసుగుతో అడగాలనుకున్న ఆమె గొంతు మూగబోతుంది.

అన్నన్ని మాటలు పడుతూ, అన్నన్ని వ్యయప్రయాసలకి ఓరుస్తూ పుట్టింటికెళ్తోందని అందరూ వింతపడినా ఆమె పసిమనసు పొందుతున్న అపరిమిత ఆనందం ఎవరికి అర్థం అవుతుంది? పుట్టింటి ఆలోచనతోనే, ఆ ఇంటి చెట్టూ, పుట్టాతోనే ఆత్మీయతనల్లుకున్న రమణి ముఖంలో వెలిగే ఆ సంతోషం ఎవరికి అవగాహనకొస్తుంది?! అనే అందమైన కథ." అంటారు.

ఈ కథలో రచయిత్రి వైధవ్యం పేరిట స్త్రీలని ఏ విధంగా చిన్నచూపు చూస్తారో చెప్తూ "మేనకోడలి పెళ్ళిలో, ఎంతగా ఒక పక్కగా వొదిగికూర్చున్నా, అపశకునంలా పెళ్ళికూతురికి ఎదురొచ్చావని, చేయిపట్టి మరీ పక్కకు లాగిపడేసారు ఆ పెళ్లికూతురి అమ్మమ్మగారు. కానుకలు తీసుకొంటారు. రమణి చేత్తో కాదు. చిట్టోబుజ్జో ఇవ్వాలిట. అదట ఇదట. ఎవరి నమ్మకాలు వారివి. ఒక పక్క మౌనంగా కూర్చుంటే సరిపోతుందనుకొంటే, పెళ్ళిపనుల్లో సాయం చేయలేదని నిందలు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది. ’కాలం ముందుకు వెళుతుందా వెనక్కా’ అని. ఏది ఏమైనా, ఈ కొత్తహోదాని శిలువలామోస్తూ" అని అంటారు.

ఆ తరవాత జరిగిన కథా చర్చలో ఇలా స్త్రీలు వైధవ్యాన్ని శిలువలా మొయ్యాల్సిన బాధాకర సంఘటనల గురించి, ఇటువంటి మూఢత్వాల గురించి, స్త్రీలు ప్రతిఘటించాల్సిన అవసరం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన, వైవిధ్యమైన దేశంలో ఉంటూ కూడా ఇంకా ఇంటిపేర్లు, గోత్రాలు అడిగిమరీ అవమానిస్తున్న సంస్కృతిని గురించి కొందరు ఆవేదన వ్యక్తం చేసారు.

అలాగే చంద్రలతగారు రాసిన 'రేగడివిత్తులు' నవల గురించి, గ్రీన్ రివల్యూషన్ వంటి అంశాల మీద ఆసక్తిదాయకమైన చర్చ జరిగింది.

కథా చర్చా కార్యక్రమంలో శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి భవాని, శ్రీ సి.బి.రావు, శ్రీమతి రమణ, శ్రీ రాజశేఖరం, డా||కె.గీత, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ ప్రసాదరావు గోగినేని మొ.న వారు పాల్గొన్నారు.

ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో  డా||కె.గీత "పండగంటే" కవితని, శ్రీ శ్రీధర్ రెడ్డి "స్వస్థత" అనే కవితని, శ్రీ దాలిరాజు వైశ్యరాజు పేరడీ కవితని వినిపించారు. శ్రీమతి భవాని "కవితా కదలిరా" అంటూ రాగయుక్తంగా ఆలపించారు. శ్రీమతి గునుపూడి అపర్ణ గారు "పాహి పాహి లక్ష్మి" కీర్తనని, దేవులపల్లి అనువాదం చేసిన తిరుప్పావై గీతాన్ని డా||కె.గీత అతి శ్రావ్యంగా పాడి వినిపించారు.

స్థానిక సాహిత్యాభిలాషులు ఆసక్తిదాయకంగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది. వీక్షణం-113 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో చూడవచ్చు.

https://youtu.be/MZuoCGYtwIs

---------

https://sirimalle.com/vikshanam-113/

https://www.koumudi.net/Monthly/2022/february/feb_2022_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం సాహితీ గవాక్షం - 112 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం - 112 వ సమావేశం

-- వరూధిని --
vikshanam-112

వీక్షణం-112వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా డిసెంబరు 12, 2021 న జరిగింది. ఈ సమావేశం డా.కొండపల్లి నీహారిణి గారి కథ "మృత్యుంజయుడు" కథాపఠనంతో ప్రారంభమైంది.

ఈ కథ నీహారిణి గారి తండ్రిగారయిన పెండ్యాల రాఘవరావు గారి జీవిత ఆధారంగా, రజాకార్ల పోరాట కాలంలో జరిగిన యదార్థవిషయాలను అనుసరించి రాసిన కథ. పెండ్యాల రాఘవరావు గారు రజాకార్ ఉద్యమంలో పాల్గొన్న కమ్యూనిస్ట్ యోధులు. ఆనాటి పోరాటాలలో మూడుసార్లు జైలుశిక్ష అనుభవించారు రాఘవరావు గారు. దాదాపు 5 ఏళ్లు జైలు జీవితం గడిపారు. పోలీస్ ఆక్షన్ తరువాత ప్రథమ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. జైలునుంచే నామినేషన్ వేసిన రాఘవరావు గారు రెండు MLA స్థానాలు, ఒక MP స్థానాన్ని గెలుచుకున్నారు.

పెండ్యాల రాఘవరావు వరంగల్ జిల్లా మొదటి పార్లమెంటేరియన్. 1952 నుండి 1956 వరకు కమ్యూనిస్టుపార్టీ తరపున కమ్యూనిస్టు వీరునిగా, ఎం .పి గా 5 ఏళ్లు ఢిల్లీలో ప్రతిపక్ష నేత గా పనిచేసారు. ఆయన అనుభవాల జ్ఞాపకాలైన ‘నా ప్రజా జీవితం' పుస్తకానికి  నీహారిణి సంపాదకత్వం వహించారు. ఆ పుస్తకానికి ఆయన సహోద్యమకారులు రాసిన ముందుమాటల్లో అప్పట్లో వారి తండ్రిగారిపై జరిగిన దాడిని "మృత్యుంజయుడు" కథగా మలిచి రాసేరు. ఈ కథ నీహారిణి గారి ‘రాచిప్ప‘ కథా సంపుటి లోనిది.

ఇక కథ విషయానికి వస్తే-

‘మృత్యుంజయుడు ‘కథ పోరాట వీరుని కథ. అవి తెలంగాణ లో ఆనాడు జరిగిన నవాబు పాలనపై, రజాకార్ల అన్యాయాలపై పోరాటాలు జరిగిన రోజులు. కమ్యూనిస్టులు ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రయత్నించి విజయవంతమైన రోజులు. కథానాయకుడు రాఘవరావు గారు.

రాఘవరావు గారు భూస్వామి, కరణం గారి కొడుకు. అయినా ఆయన తన తండ్రిని ఎదిరించి ప్రజాపోరాటానికి పిడికిలి ఎత్తిన వీరుడు. ఉద్యమసమయంలో రాఘవరావు పైన దాడులు జరిగాయి. పోలీసుల నుండి పోరాటంలో గెలవడం విశేషం. పార్టీ లోకి తాను తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తే తనపై కుట్రపన్ని చంపాలనుకుంటాడు. అది గ్రహించిన కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయం వారే నిర్ణయం తీసుకుని అతనికి మరణశిక్ష ను విధించిన ఆనాటి యదార్థగాథను కథగా మలిచారు కొండపల్లి నీహారిణి గారు.

నిస్వార్థ సేవ చేసిన ఎందరో కమ్యూనిస్టు యోధులు మనకు ఉన్నారు. అటువంటి యోధుడు పెండ్యాల రాఘవరావు గారు. ప్రత్యక్ష పోరాటానికి ఎన్నో పథకాలు వేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే శంకర్ అనే ఒక షూటింగ్ ఎక్స్పర్ట్ ను పార్టీ లోకి తీసుకుని అతనిని దేశ సేవ వైపు మళ్ళించాలని ప్రయత్నం చేసారు. కాని శంకర్ తన పాత గుణాలను వదులుకోలేదు. అతని అరాచకాన్ని పార్టీ అరికట్టింది మరణశిక్ష విధించింది. ఈ సన్నివేశాన్ని చిన్ని చిన్ని సంఘటనలతో ఉత్కంఠ భరితంగా కథగా అల్లారు నీహారిణి గారు.

ఆ తర్వాత రేగడివిత్తులు నవలా రచయిత్రి, ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి చంద్రలత, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి భవాని, శ్రీ సి.బి.రావు, శ్రీమతి రమణ, శ్రీ ఆచార్యులు, శ్రీ రాజశేఖరం, డా||కె.గీత, శ్రీ శ్రీధర్ రెడ్డి మొ.న వారు కథా చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణా మాండలికంలో రాసిన ఈ కథని నీహారిణి గారు చదవడం వల్ల కథ మరికాస్త గొప్పదనాన్ని పొందిందని అంతా కొనియాడారు. శంకర్ పాత్ర మీద, కథలో అతడి మరణం పట్ల, పార్టీ నిర్ణయం పట్ల సుదీర్ఘ చర్చ జరిగింది.

ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో డా||కె.గీత,  డా|| కొండపల్లి నీహారిణి, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ దాలిరాజు వైశ్యరాజు, మొ.న కవులు పాల్గొన్నారు. చివరగా శ్రీమతి గునుపూడి అపర్ణ గారు స్వయంగా రాసిన "దీపలక్ష్మి" గీతాన్ని అతి శ్రావ్యంగా పాడడం విశేషం. అర్థవంతంగా జరిగిన ఈ సభలో స్థానిక సాహిత్యాభిలాషులు ఆసక్తిదాయకంగా పాల్గొని సభను జయప్రదం చేశారు.

వీక్షణం-112 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు. 

https://youtu.be/2GFJt9SgP9g

---------

https://sirimalle.com/vikshanam-112/

https://www.koumudi.net/Monthly/2022/january/jan_2022_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ గవాక్షం - 111 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం - 111 వ సమావేశం

వరూధిని
-vikshanam-111

వీక్షణం-111 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా నవంబర్ 14, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు గారి కథాపఠనం, శ్రీ సుభాష్ పెద్దు గారిచే డా.కె.గీత గారు రాసిన "వెనుతిరగని వెన్నెల" నవలా సమీక్ష జరిగింది.

ముందుగా శ్రీ వేమూరి కథాపఠనంలో భాగంగా "బొమ్మలూరు" అనే స్వీయకథని చదివి వినిపించారు. ముందుగా కథానేపథ్యాన్ని వివరిస్తూ "ఈ కథ ఎప్పుడో చిన్నప్పుడు ఇంటర్మీడియేట్ లో పాఠ్యపుస్తకం ‘గలివర్స్ ట్రావెల్స్’ లో ‘వాయేజ్ టు బ్రాబ్డింగ్నేగ్’ చదువుతున్నప్పుడు మా గురువుగారు ఇలాంటి కథే ఒకటి చెప్పగా అది గుర్తుకు వచ్చి రాసిన కథ. నేను బింఘంటన్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు దగ్గరలోనే ఉన్న ఇథకా కాలేజీలో పని చేస్తున్న రాడ్ సెర్లింగ్ ఉపన్యాసం విన్నాను. ఆయన ఇటువంటి కథనే టివిలో 1960 దశకం నాటి ట్వైలైట్ జోన్ పరంపరలో తీసినట్లు చెప్పేడు." అన్నారు.

ఆద్యంతం అత్యంత ఉత్సుకతతో సాగిన కథ ఇది. చిన్న కథ అయినా ఆలోచింపజేసిన చక్కని కథ.

అలాగే కథ ముగింపు గురించి చెపుతూ "అతను, ఆమె కళ్లప్పగించి చూస్తున్నారు. చెవులు రిక్కించి వింటున్నారు. వాళ్లు ఒంటరిగా లేరు. ఎవరింట్లోనో ఉన్నారు. ఆ ఇల్లు కూడ వారనుకున్నట్లు ఖాళీగా లేదు.

చిన్న బాలిక చేసే కిలకిలారావం పైనుండి వస్తోంది. పైపెచ్చు ఆ పిల్ల కేరింతలు కొడుతూన్న శబ్దం కూడ వినబడుతోంది. ఆ అమ్మాయి ఆడుకుంటోంది కాబోలు. నేపథ్యం నుండి మరొక పెద్దామె గొంతుక స్పష్టంగా వినిపిస్తోంది: “అమ్మాయీ! చూడమ్మా! మీ నాన్న నీకోసం భూలోకం నుండి తీసుకొచ్చిన బొమ్మరిల్లు బావుందా?”

ఆ మాట వినగానే ఉదయం లేచినప్పుడు గుసగుసలాడుతూ ఆమె అతనిని అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికింది." అన్న ముగింపుకి కథని ప్రచురించిన సంపాదకులు చేర్పించిన వాక్యంగా మరొక వాక్యం రాయాల్సి వచ్చిందని అది “తామున్నది మహాకాయులు నివసించే మరోలోకంలో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మరిల్లులో అని వారికి అర్థం అయింది.” అని చెప్పేరు.

అయితే తీరా ఒక పాఠకుడు ఈ చివరి వాక్యానికి స్పందిస్తూ "ఆ చివరి వాక్యం రాసి పాఠకుల ఆలోచనా శక్తిని కించపరచేనని వ్యాఖ్యానించేడు." అని వాపోయారు. అంతేకాకుండా ఇటువంటి అనుభవం వల్ల నేర్చుకోవలసింది ఏవిటంటే కథను రచయితలు నచ్చినట్టు రాయొచ్చని, సంపాదకులు చెప్పిన మాట విననక్కర్లేదని స్పష్టం చేస్తూ ముగించారు.

ఆ తర్వాత జరిగిన నవలా సమీక్ష కార్యక్రమంలో శ్రీ సుభాష్ పెద్దు గారిచే "వెనుతిరగని వెన్నెల" సమీక్ష జరిగింది. "వెనుతిరగని వెన్నెల - ఒక స్టీల్ మాగ్నోలియా" అని పేర్కొంటూ "శీతాకాలంలో దుర్భరమైన చలికి, మంచుకి నిలబడి, పెద్ద పెద్ద దోసిళ్లంత పూలతో తనను తాను కప్పుకుని వసంతాన్ని ఆవిష్కరిస్తూ అందరినీ ఆహ్లాదపరిచే చెట్టు మాగ్నోలియాలా ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉక్కులాగా నిలబడుతూ, సున్నితంగా సమస్యలను పరిష్కరించుకుని తన చుట్టూ ఉన్నవారిని ఆహ్లాదపరిచిన నాయిక ఇందులోని ప్రధాన పాత్ర "తన్మయి" అన్నారు.

1970, 80, 90ల ప్రాంతాలలో పెరిగినవాళ్లందరూ ఎప్పుడో ఒకప్పుడూ ఈ నవలలోని సన్నివేశాలు ప్రత్యక్షంగా చూసినవారే. చాలా మంది తెలుగు మహిళలు తమ నిజ జీవితంలో అనుభవించి, వికసించిన స్టీల్ మాగ్నోలియాలే అయ్యి ఉండ వచ్చు కూడా. సన్నివేశం మారవచ్చు, కానీ ఇది వారి కథ కూడా. స్త్రీల సామాజిక, ఆర్థిక  జీవన పరివర్తనలోని దశలకు నవలా రూపంలోని కాలనాళిక ఈ "వెనుతిరగని వెన్నెల" అన్నారు.

తన్మయి రావల్సిన సామాజిక పరివర్తనకు మార్గదర్శకురాలు. కష్టాలు పంచుకుంటూ ఓదార్పు మాటలతో తన్మయి స్నేహితురాలు మేరీ మగవాళ్లనందరినీ ఒక గాటను కట్టివేస్తుంటే, "నా కొడుకు కూడా మగవాడే కదా, తండ్రి లాంటివాడు కాకుండా పెంచాలి" అని తన్మయి అంటుంది. సామాన్యంగా కనిపించే ఈ మాటలలో మంచి నిర్దేశ్యం ఉన్నది. అందరు తల్లులు తమ కొడుకులకి కూతుళ్లతో పాటే వంటింటి పనులు, ఇంటి పనులు నేర్పితే, తరువాతి తరంలో స్త్రీ సమానత్వానికి తోడ్పడినవారవుతారు.

పాత్రల చిత్రీకరణ కూడా చాలా సహజంగా వున్నది. ఈ నవల మానవీయతా విలువలకు చెందిన నవల. ఇది భారతీయ సమాజంలో నేటికీ వ్యవస్థీకృతమైన స్త్రీ పురుష తారతమ్యాలకి ప్రతిబింబం. హీరోయిజం కథలకు మాత్రమే అలవాటుపడిన సమాజంలో తనకు తాను నిలబడేవారిని గుర్తించి, వారే పురోగతికి మార్గదర్శకులు అని చెప్పగలిగే కథ ఇది. అలాగే పేజీల సంఖ్యలో పెద్దనవల అయినా పాఠకుడిని ఒక్క ఉదుటున చదివించగలిగిన మంచి నవల. ఒక మంచి నవలకు వుండవలసిన లక్షణాల గురించి చాలా చర్చలు, ఉపన్యాసాలు, వ్యాసాలు ఉన్నాయి. కానీ, పాఠకుడు అసలు ఎందుకు చదవాలి అని ప్రశ్నించుకుంటే, Jane Austen మాటలు గుర్తుకు వస్తాయి. “Some work in which the greatest powers of the mind are displayed, in which the most thorough knowledge of human nature, the happiest delineation of its varieties, the liveliest effusions of wit and humor are conveyed to the world in the best chosen language (Northranger Abbey)”. ఈ మాటలకు గుండెలలో నుంచి వచ్చిన కథ అనే లక్షణాన్ని జోడిస్తే, పాఠకుల హృదయాలకు చేరుతుంది. నవలలో చెప్పిన మాటలు, విషయాలు కొన్నైనా పాఠకుల మనసులలో నిలుస్తాయి. అనవసరమైన ఫిలాసఫీ, వర్ణన కోసం వర్ణనలూ లేకుండా, చెప్పవలసిన విషయాన్ని సూటిగా, సరళమైన వాక్యాలతో నడిచిన శైలి. మంచి మాటలూ, సందర్భోచితమైన సూక్తులూ/శ్లోకాలూ కూడా చాలానే వున్నాయి. అందుకే ఒక్క ఉదుటున చదివించగలిగింది.

ఈ నవలను యువతకు ఒక పాఠ్యాంశంగా ఉంచితే, చదివి విశ్లేషించి స్ఫూర్తి పొందటానికి అవకాశం కలుగుతుంది. మార్కులు, రాంకుల కాలంలో, ఏదో ఒక పరీక్షా పత్రానికి జవాబు లాగా కాకుండా, విద్యార్థులకి చర్చాంశంగా ఉంటే, యువత ఆలోచన సరళి మారే అవకాశం ఉంటుంది, సామాజిక పురోగతికి తోడ్పడుతుంది.

సామాజిక పురోగతికి తోడ్పడే "వెనుతిరగని వెన్నెల" స్ఫూర్తినిచ్చి బోలెడు ఉక్కు పుష్పాలను తయారు చేయగల మంచి కథ." అని ముగించారు.

ఆ తర్వాత నవలారచయిత్రి  డా.కె.గీత ఈ నవలకి తాను రాసిన ముందుమాటనే తన స్పందనగా చదివి వినిపించారు. ఆ తర్వాత ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన చర్చా కార్యక్రమంలో శ్రీ టి. పి.ఎన్. ఆచార్యులు, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ ప్రసాదరావు గోగినేని, శ్రీ నల్లమోతు ప్రసాద్, శ్రీ జక్కంపూడి మోహనరావు, శ్రీ రాజారామ్ మొ.న వారు పాల్గొని సభను జయప్రదం చేశారు.

చివరగా శ్రీ టి. పి.ఎన్. ఆచార్యులు గారు తమ కవితా గానాన్ని వినిపించి అందరినీ అలరించారు. వీక్షణం-111 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు.

https://youtu.be/e5Z7u8knFLU

----------

https://sirimalle.com/vikshanam-111/

https://www.koumudi.net/Monthly/2021/december/dec_2021_vyAsakoumudi_vikshanam.pdf



వీక్షణం సాహితీ గవాక్షం - 110 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం - 110 వ సమావేశం

వరూధిని
vikshanam-110

వీక్షణం-110 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా అక్టోబర్ 10, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీమతి రాధికా నోరి గారు "సి నా రె - యుగళగీతాలు" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు.

రాధిక గారు ముందుగా సి. నారాయణరెడ్డి గారి గురించి, ఎన్నుకున్న ప్రసంగాంశం గురించి మాట్లాడుతూ "నారాయణరెడ్డి గారు గొప్ప కవి, రచయిత, నాటకకర్త, సంగీతకర్త, గాయకులు, సాహితీవేత్త, ప్రొఫెసరు, రాజ్యసభ మెంబరు, సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత, అంతేకాకుండా మన సాహిత్య ప్రపంచంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా. ఈవేళ నేను చలనచిత్రాల కోసం ఆయన రాసిన గీతాల గురించి మాట్లాడదాము అనుకొంటున్నాను. ఆయన మన చలనచిత్రాలలో సుమారుగా మూడు వేలకు పైగా పాటలు రాశారు. అన్ని జానర్స్ లోనూ రాశారు. వాటన్నిటి గురించి చెప్పటం కూడా సాధ్యం కాదు. అందుకని కేవలం ఆయన రాసిన కొన్ని యుగళగీతాల గురించి మాత్రం చెప్పదలచుకున్నాను. యుగళగీతాలు అంటే రెండు గళాలు వున్న పాటలన్నమాట. అసలు నారాయణరెడ్డి గారు చలనచిత్రాలలో తన ప్రవేశమే ఒక చక్కటి యుగళగీతంతో మొదలెట్టారు. 1962 నుంచి రాసిన యుగళగీతాలు ఇప్పటికీ నవనూతనాలే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు." అని ప్రారంభించారు.

రాధిక గారు తమ ప్రసంగం ఆద్యంతం గొప్ప గానమాధురిమతో అన్ని గీతాల్ని గొంతెత్తి రాగయుక్తంగా ఆలపిస్తూ సభలోని వారందరినీ అలరించారు. ముందుగా సి నా రె గారి యుగళగీతాల్లో శృంగార గీతాల గురించి ప్రస్తావిస్తూ

"నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని / పూలదండవోలె / కర్పూర కళికవోలె / ఎన్ని యుగాలైనా / ఇది ఇగిరిపోని గంధం"

"ఏమో ఏమో ఇది / నాకేమో ఏమో అయినది/ ఈ వేళలో / నా గుండెలో / ఏదో గుబులవుతున్నది"

"సొగసైన కనులేమో నాకున్నవి / చురుకైన మనసేమో నీకున్నది / కనులేమిటో / ఈ కథ ఏమిటో / శృతి మించి రాగాన పడనున్నది / పడుతున్నది"

"బుగ్గ గిల్లగానే సరిపోయిందా / గిలిగిలి గిలిగిలి నవ్వగానే అయిపోయిందా"

వంటి గీతాల్ని ఉదహరించారు.

"అటు సందర్భానికి తగ్గట్లుగా, ఇటు అందరికీ సులభంగా అర్థం అయ్యేలా, ఇంకోపక్క ప్రాస బాగాకుదిరేట్టుగా, ఇలా అన్ని విధాలా నప్పేట్లుగా రాయటం ఆయన ప్రత్యేకత. అలాగే ప్రేమ గురించి నారాయణరెడ్డిగారి పాటలు వింటూ వుంటే ఇదే కదా నిజమైన ప్రేమ అనిపిస్తుంది." అంటూ

"జడలోన మల్లెలు జారితే / నీ ఒడిలో ఉన్నాననుకున్నా.. / చిరుగాలిలో కురులూగితే / నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో / ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా..!! / హసీనా.. ఓ.. హసీనా.."

పాటని పాడి వినిపించారు.

చిన్నప్పుడు నారాయణరెడ్డిగారి చదువంతా ఉర్దూ మీడియం లో జరిగింది. అందుకని ఆయనకి ఆ భాష మీద చాలా గొప్ప ప్రావీణ్యత వుంది. అవసరమైనపుడు సందర్భానికి చక్కగా అతికేటట్లుగా ఆయన ఉర్దూ పదాలు వాడేవారు. అవి అన్యభాషా పదాలుగా కాకుండా ఆ పాటలో కలిసిపోయేవి. అలాంటిదే ఈ పాట. ఈ పాటలో సిపాయి, హసీనా అన్నవి ఉర్దూ పదాలు. కానీ అవి సందర్భానికి సమకూరాయి కాబట్టి, ఆపాట పాడేవారు ముస్లిములు కాబట్టి ఆ ఉర్దూ పదాలని ఆయన తెలివిగా అక్కడ వాడుకున్నారు.

మరికొన్ని ప్రేమపాటలకి ఉదాహరణలుగా

"నీ నడకలోన రాజహంస అడుగులున్నవి"

"తడిసీ తడియని నీలికురులలో / కురిసెను ముత్యాలూ" మొ.వి పేర్కొన్నారు.

సినారె గారి పదమాధుర్యాన్ని వివరిస్తూ -

"లలిత లలిత యువ పవన చలిత పల్లవ దళాలలోనా / రమణీయ కుసుమ రమణీరంజిత భ్రమరగీతిలోనా"

"కెరటానికి ఆరాటం / తీరం చేరాలని / తీరానికి వుబలాటం / ఆ కెరటం కావాలని"

ఈ పదాలు వింటేనే చాలు, మనం తేలికగా చెప్పెయ్యచ్చు, ఈ పాట నారాయణరెడ్డి గారు రాసారని. ఆయన ముద్ర అన్నమాట." అని అన్నారు.

నారాయణరెడ్డిగారు సంభాషణ రూపం లో కూడా పాటలు రాశారు. 1963 లో అలాంటిదే ఈ పాట చాలా జనాదరణ పొందింది. ఇది ఇద్దరి ప్రేమికుల మధ్య పాటలాగా జరిగిన అతి సరళమైన, రాగయుక్తమైన సంభాషణ.

"మబ్బులో ఏముంది / నా మనసులో.. ఏముంది/
మబ్బులో..కన్నీరు / నీ మనసులో..పన్నీరు
నేనులో ఏముంది.. / నీవులో..ఏముంది
నేనులో..నీవుంది / నీవులో..నేనుంది"

వంటివి ఇందుకు ఉదాహరణలు.

నారాయణరెడ్డిగారి అత్యంత జనాదరణ పొందిన యుగళగీతాల్లో తోటలో నా రాజు పాట ఒకటి. విశ్వనాధగారి ఏకవీరను చలనచిత్రంగా తీసినప్పుడు నారాయణరెడ్డిగారు మొదటిసారిగా దానికి సంభాషణల తో పాటు కొన్ని పాటలు కూడా రాశారు.

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

నవ్వులా అవి కావు నవ పారిజాతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
అపరంజి కలలన్ని చిగురించునా

హీరో, హీరోయిన్ల ఉదాత్తమైన పాత్రలకి యుగళగీతాలు రాయటమే కాకుండా ఒక ప్రతినాయకునికి, అంటే, ఒక విలనుకి అన్నమాట, ఒక మంచి పాట రాసి అందరి మెప్పును పొందారు ఆయన. ఇప్పటిదాకా చలనచిత్ర చరిత్రలో దుర్యోధనుడి గురించి ఇంత అద్భుతమైన పాట రాసినవారు మరొకరు లేరు. హీరో, హీరోయిన్ల పాటలతో సమానమైన జనాదరణను పొందింది ఈ పాట.

మచ్చలేని నెలరాజువు నీవే
మనసులోని వల రాజువు నీవే

రాగభోగ సుర రాజువు నీవే

రాజులకే రారాజువు నీవే
ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా
స్వాగతం సుస్వాగతం

అంటే దుర్యోధనుడిలో  ఏవైనా కాస్త మంచి గుణాలు వుంటే వాటిని బయటికి వెలికి తీసి, అందరికీ తెలిసేలాగా వాటిని వర్ణించి, కాస్సేపు ఆయన దుర్గుణాలని మనందరం మర్చిపోయేలాగా చేసిన ఆ పాటని అంత జనాదరణ పాలు చేసిన ఘనత ఖచ్చితంగా నారాయణరెడ్డిగారికి చెందుతుంది.

ఇలా ఒకదాని మించి ఇంకొకటి ఎన్నో యుగళగీతాలు, ఎన్నో జానర్స్ లో నారాయణరెడ్డిగారు రాశారు. అన్నీ ఆణిముత్యాలే! అన్నీ జనరంజకాలే!

నారాయణరెడ్డి గారు రాసిన ఏ పాటైనా మన ఆత్మలను సంపూర్తిగా ఆకట్టుకుని వాటి చేత అనేక తీరుల పలికించాయి. అలాగే ఈ యుగళగీతాలు కూడా సున్నితంగా మన మనసులను తాకి వాటి భావాలు అక్కడ శాశ్వతంగా తిష్ఠ వేసేట్టు చేసాయి. చాలా సులభ రీతిలో, చాలా తేలికైన పదాలు వాడి, సందర్భానికి తగిన పాటలు, మనందరినీ సమ్మోహనపరిచే పాటలు రాసి నారాయణరెడ్డి గారు మన మనసులలో చెరగని ముద్రలు వేశారు." అని ముగించారు.

ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో డా||కె.గీత, శ్రీమతి భవాని, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ దాలిరాజు వైశ్యరాజు, శ్రీ టి. పి.ఎన్. ఆచార్యులు, శ్రీమతి రాధికా నోరి మొ.న కవులు పాల్గొన్నారు. ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొని సభను జయప్రదం చేశారు.

---------

https://sirimalle.com/vikshanam-110/

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-110-%e0%b0%b5/

https://www.koumudi.net/Monthly/2021/november/nov_2021_vyAsakoumudi_vikshanam.pdf