Monday 28 December 2015

వీక్షణం - సాహితీ గవాక్షం- 39 (Nov8, 2015)

: వీక్షణం - సాహితీ గవాక్షం :
          39 వ సమావేశం
   మాసం మాసం శ్రుత సాహిత్యం
- సి. రమణ

         ఈ నెల 8న  వీక్షణం సాహిత్య సమావేశం  నాగరాజు రామస్వామి గారి అమ్మాయి తిరునగరి మమత గారి ఇంట్లో, సన్నీవేల్ లో జరిగింది. డా.గీతా మాధవి గారు విఘ్నేశ్వర ప్రార్థనతో సభకు శుభారంభం చేశారు.'అమ్మ చేతి పసుపు బొమ్మ, ఆగమాల సారమమ్మ'- అంటూ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ విరచితమైన శాస్త్రీయ  సంగీత ఛాయలున్న దైవ గీతాన్ని గీత గారు శ్రవణ మనోహరంగా పాడారు. ముజ్జగాలను నడిపించే గుజ్జు రూపు వేలుపు, చలి కొండ చూలి కొడుకు, ఒంటి పంటి దేవర, వెండి కొండ పై వెలిగే పగడపు వెలుగుల అబ్బాయి అయిన గణపతి స్తోత్రంతో సాహితీ సభ ఆరంభం కావడం ముదావహం. మాన్యులు, సాహిత్య సారథులు,  సుజనరంజని సంపాదకులు శ్రీ .తాటిపామల మృత్యుంజయుడు గారి అధ్యక్షతన కార్యక్రమం సక్రమంగా సాగింది.
       మొదటి వక్త శ్రీ ఎల్లారెడ్డి గారు. విశ్రాంత మహోపాధ్యాయులు, పౌరాణిక ప్రయోక్త, సాహిత్య మూర్తులు- రెడ్డి గారు అసమాన వాగ్ధాటితో, అరగంట పాటు అనర్ఘళంగా భాగవత ప్రవచనం కావించి సదస్యులను మంత్రముగ్ధులను చేశారు. సర్వం సహా స్వయంభువుడు వామన రూపధారిగా దానవ దానబ్రహ్మ బలిచక్రవర్తి ఆస్థానానికి విచ్చేసి లోక కల్యాణార్థం దేవకార్యం నిర్వహిస్తున్న సందర్భం. 'అలసులు, మంద బుద్ధిబలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు...సుకర్ము లెవ్వరు జేయ జాల రే' , 'కారే రాజులు రాజ్యముల్....', 'ఇంతింతై  వటుడింతయై, ..నభోవీధి నంతై..,బ్రహ్మాండ సంవర్థియై ', 'అమ్మలగన్న యమ్మ, ముగురమ్మల మేలిమిటమ్మ', 'అచ్చపు జుంటి తేనియల...' వంటి అనేక ప్రసిద్ధ పద్య రత్నాలను పౌరాణిక రాగ బంధురంగా, ధార్మిక సాంప్రదాయ బద్దంగా గొంతెత్తి పాడి సభికులను ఆకట్టు కున్నారు. సామాజిక ప్రయోజనం, సమాజ సముద్ధరణ, తెలుగు సాహిత్య సాంప్రదాయ పునర్వికాసం , ఆనందం , ఉపదేశం వంటి సాహిత్య విలువలు సమకాలీన సాహిత్య కారుల పరమావిధీ, ధ్యేయం కావాలని  రెడ్డి గారు ఆకాంక్షించారు.

       తదుపరి కార్యక్రమం నాగరాజు రామస్వామి గారి పుస్తకాల ఆవిష్కరణ. ప్రాచీన  తెలుగు సాహిత్యంలో పండిపోయిన విశ్రాంత నిత్యోపాధ్యాయులు శ్రీ ఎల్లారెడ్డి గారు వచన కవిత్వ సంపుటి 'గూటికి చేరిన పాట' ను ఆవిష్కరించారు. 'ఈ పుడమి కవిత్వం ఆగదు: జాన్ కీట్స్ కవితా వైభవం' అనువాద కవితా సంపుటిని రామాయణాది సంస్కృతాంధ్ర క్లాసిక్ గ్రంధాలను హృదయదఘ్నంగా అధ్యయనం చేస్తూ ఆనందిస్తున్న శ్రీ వేణు ఆసూరి గారు ఆవిష్కరించారు. చిరకాలంగా సాహిత్య వెన్నెలలను విరజిమ్ముతున్న కళల 'కౌముది', బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కిరణ్ ప్రభ గారు దేశ దేశీయ అనువాద  కవన సంపుటి ' అనుస్వరం' ను ఆవిష్కరించారు. శ్రీ దీర్ఘాశి విజయభాస్కర్ గారి దీర్ఘకవిత 'మహా శూన్యం' కు అనువాదమైన ' The Great Void ' ను సాహిత్యాభిలాషి , స్వయంగా రచయిత్రీ ఐన శ్రీమతి గునుపూడి అపర్ణ గారు ఆవిష్కరించగా, ఆంగ్ల కవితా సంకలనం 'Wings of Musings' ను 'సుజనరంజని' పూర్వ సంపాదకులు , ప్రాచీన అర్వాచీన సంస్కృతాంధ్ర సాహితీ రీతులను ఆకళింపు చేసుకున్న శ్రీ రావు తల్లాప్రగడ గారు ఆవిష్కరించారు. ఈ ఐదు పుస్తకాల ఆవిష్కరణ అత్యంత ఆత్మీయంగా కొనసాగింది.
           ఆవిష్కరణ అనంతరం రచయిత శ్రీ నాగరాజు రామస్వామి గారి స్పందన:
           "నేను నా కవిత్వ రచనలలో ముఖ్యంగా ఈ అంశాలపై శ్రద్ధ వహిస్తాను. 1.క్లుప్తత 2. భాషాగాఢత 3. భావనిగూఢత. 4.శ్రావ్యత.
           క్లుప్తత - వచనకవిత ప్రక్రియకు అత్యంత ఆవశ్యకమైన విషయం. సంస్కృత మూలాలైన తత్సమ పదాలు క్లుప్తత కు దోహదపడే సాధనాలు. నిర్దుష్టమైన పదాల/పదబంధాల ఉపయోగంతో క్లుప్తత సాధింపవచ్చు.
          భాషాగాఢత- భాషాగాఢత అంటే  ప్రత్యామ్నాయం లేని పదాల/పదబంధాల ఉపయోగత. లలిత పదచిత్రాల, భావచిత్రాల, ప్రతీకల, పరోక్ష ప్రస్తావనల (allegory), రూపకాల వినియోగం వల్ల కవిత్వంలో సాంద్రతను,  క్లుప్తతను ఏకకాలంలో సాధించవచ్చు.

          నిగూఢత- శుద్ధ వచన ప్రక్రియలా కాకుండా వచన కవితాభివ్యక్తి ఒకింత గుప్తాగుప్తంగా, అవగుంఠనం దాచిన అందంలా భాసిల్ల జేయడం నాకు ఇష్టం. అయోమయతకు దారితీయని అస్పష్టత వాంఛనీయం.
         శ్రావ్యత- శాబ్దిక శ్రావ్యత వైపే నా మొగ్గు. అందుకేనెమో అనుప్రాసలను, వాక్యంత ప్రాసలను అవసరమైన చోట వాడుకుంటాను( సమకాలీన వచనకవితా రీతికి భిన్నంగా ఉన్నా). వచన కవితా రచనలో, వాడబడిన సమాసం శ్రవణ మనోహరమైనప్పుడు వైరి సమాసాలు సైతం వర్జనీయం కాకూడదని నా స్వీయాభిప్రాయం. బహుశా: నాది అనుభూతి ఛాయలున్న కవిత్వం కావచ్చును.
        అనువాద కవిత్వం మాటకొస్తే - భావార్థాలతో పాటు మూలంలోని పాటతనాన్ని, నాటి సాంస్కృతిక పౌరాణిక ( మైథలాజికల్) నేపథ్యాన్ని పట్టుకోవడం, మూలం లోని కీలకమైన పదాలను/ పదబంధాలను గుర్తించి ప్రత్యామ్నాయం లేని సమానార్థక భావాత్మక పదాలను  వినియోగించడం  ముఖ్యమని నా అనుభవం. నా అనువాదాలలో (ముఖ్యంగా ఏంతో శ్రమించి అనువదించిన కీట్స్) లయకు అవరోధమనుకున్న చోట్ల పాదసూచికలు ఉంచాను (గ్రీకు/రోమన్ మిత్/మైథాలజికల్ సందర్భాలలో). మూలంలోని  శైలీ శిల్ప శ్రావ్యతలను నిలుపుకునేందుకు చాలా వరకు వాక్యానువాక్య అనువాదమే ఆమోదయోగ్యమని భావిస్తాను.

        నా స్వీయ కవితా సంకలనం 'గూటికి చేరిన పాట' లోని 'నానుడి', నా అనువాదం 'ఈ పుడమి కవిత్వం ఆగదు: జాన్ కీట్స్ కవితా వైభవం', లోని అనుబంధ వ్యాసం, 'అనుస్వరం' లోని 'అనువాద వ్యాకరణం', నా కవిత 'కృత్యాద్యవస్థ' లో రచనా ప్రక్రియకు సంబంధించిన నా భావజాలం మరింత విస్తృత పరచబడింది."
         పిదప,  శ్రీమతి సి. రమణ గారు కీట్స్ పుస్తకం పై, శ్రీమతి విజయ లక్ష్మి గారు 'గూటికి చేరిన పాట' పై, లెనిన్ గారు 'అనుస్వరం' పై చక్కని విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు.
          "దీపలక్ష్మీ!  ఆవాహయామీ,  ప్రఫుల్ల వదనే, ప్రమోదినీ, మా హృదయ కమల నివాసినీ ఆవాహయామీ" అనే దీపావళి సందర్భోచిత పాటను శ్రీమతి అపర్ణ గారు అతిమధురంగా ఆలాపించి అలరించారు.
తరువాత శ్రీ సాయి బాబా గారు వినిపించిన పేరడీ సంగీత కవిత్వం అందరినీ కడుపుబ్బ నవ్వించింది.
           పిదప, వేణు ఆసూరి గారు వాల్మీకి రచించిన వర్షాకాల శరదృతు వర్ణనల శ్లోకాలు చదివి, అర్థ తాత్పర్యాలను విశదీకరించి అలనాటి భారతావని  ప్రకృతి శోభను కవితాత్మకంగా కళ్ళముందు నిలిపారు.
          తరువాత కూరపాటి భాస్కర్ గారు ఈ గవాక్ష వీక్షణం ను అభినందిస్తూ, గతంలో తాను రాసుకున్న కొన్ని చిన్ని కవితలను, కొన్ని ఆంగ్లానువాద శకలాలను చదివి వినిపించారు.
          పిదప, నెలనెలా సాగే సాహిత్య క్విజ్ ను  శ్రీ కిరణ్ ప్రభ గారు ఈ సారి మరింత విజ్ఞాన భరితంగా, వినోద కేళీ రంజకంగా నిర్వహించి నవ్వులను పండించారు. మెదడుకు మేతా ఎడదకు హాయీ ఈ క్విజ్ ; అదనంగా- సరైన సమాధానం చెప్పిన ఒక్కో శ్రోతకు ఒక్కో పుస్తకం బహుమతి !

          కవిసమ్మేళనం లో భాగంగా  డా॥ కె. గీత గారు వినిపించిన చక్కని వచన కవిత 'యార్డ్ డ్యూటీ'. ఈ పహారా ఉద్యోగంలో-  'బడి పచ్చిక' మీద బిలబిల మంటున్న'మిడతల దండును, కిటికీ ఊచల మీద తలకిందుల వేలాడుతున్న పిల్లమూకలను చూసి తాను 'ఆరు రెక్కల సీతాకోక చిలుక' అయిపోయి ముద్దుగా 'వాళ్లకు తోకలేదు' అనడం అందమైన బాల్యానికి అపరంజి పూతలా ఉంది.
          తరువాత శ్రీచరణ్ గారు తను దేవీ నవరాత్రుల ఉత్సవ సందర్భంలో రాసుకున్న దండకం లోని కొన్ని ఖండికలను శ్రుతిపేయంగా వినిపించారు. సత్యం శివం సుందరం మూర్తీభవించిన  అన్నపూర్ణ  స్తుతి !  శివ శివానీ ఏకత్వ చైతన్యాన్ని ఏకరువు పెట్టిన భక్తిమయ లాస్యలయ!
సభ లోని ఒక శ్రోత అడిగిన రుద్రాభిషేక సంబంధిత ప్రశ్నకు సమాధానంగా శ్రీ చరణ్ గారు స్కాందపురాణం లోని ఒక ఇతివృత్తాన్ని తీసుకొని వివరించారు. ప్రత్యక్షమైన ఆద్యంత రహితమైన 'బింబార్ఠ' తేజో పుంజ అగ్నిస్తంభాగ్రాలను దర్శించాలని బ్రహ్మా విష్ణువులు పోటాపోటీగా బయలు దేరుతారు. వరాహ రూపంలో విష్ణువు అధోలోకాలకు, హంస రూపంలో బ్రహ్మ ఊర్థ్వ లోకాలకు దూసుకొని పోతుంటారు. గగనమార్గంలో బ్రహ్మకు గోవు, కేతకీ పుష్పం కనిపిస్తాయి. ఓటమి రుచించని బ్రహ్మదేవుడు తాను ఆ జ్యోతిర్ స్తంభ శిఖరాగ్రాన్ని చూచానని వాటితో సాక్షం చెప్పించుకు నేందుకు ఒప్పించుకుంటాడు. విష్ణుమూర్తి ఓటమిని ఒప్పుకుంటాడు. తప్పుడు సాక్షం ఇచ్చిన కేతకి దైవపూజకు అనర్హమని, గోపూజకు పృష్ఠభాగ పూజకే పరిమితమని ఉగ్రుడైన జఠాధరుడు శపిస్తాడు. బ్రహ్మదేవుని ఐదవ తలను ఖండించి చతుర్ముఖుణ్ణి చేస్తాడు.

      ఆ జ్యోతిస్ఫటిక ప్రత్యగాత్మ స్తంభ స్వరూపం శివాభిషేక అమృత పరిసేచనా సందర్భోచితమని  విప్రభావం!  ఇలా, శ్రీ చరణ్ గారి శుద్ధాత్మ ప్రవచనం పౌరాణ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది.
         ఆ పిదప, బర్క్లీ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగాన్ని చిరస్థాయిగా నిలిపి ఉంచేందుకు ఏళ్లుగా శ్రమిస్తున్న శ్రీ వేమూరి వెంకటేశ్వర రావు గారు మరో సారి దాతలను విజ్ఞప్తి చేశారు. ప్రవాస తీరంలో తెలుగును వెలిగించాలని వారు పడుతున్న నిరంతర ప్రయాస బహుధా ప్రశంసనీయం.
            ఈ విధంగా-సంతోష సందోహంగా, స్మృత్యర్హ చిహ్నంగా సాగిన ఈ సాహిత్య సమావేశం సభికుల మనసులలో చిరకాలం నిలిచిపోయేలా కొనసాగింది. ఈ సభలో శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి ఉమా వేమూరి , శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి విద్యుల్లత, శ్రీ ఆర్. శ్రీనివాస రావు, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్ మొ.న వారు పాల్గొన్నారు.
----------
http://www.koumudi.net/Monthly/2015/december/index.html

వీక్షణం సాహితీ గవాక్షం -38 (Oct 11, 2015)

వీక్షణం సాహితీ గవాక్షం -38 
                                       -- పెద్దు సుభాష్

వీక్షణం 38వ సమావేశము మన్మథ నామ సంవత్సరము, భాద్రపద మాసం, బహుళ పక్ష చతుర్దశి  నాడు, అనగా అక్టోబర్ 11, 2015 న పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్, శాంత గారి స్వగృహమున జరిగినది.  కృష్ణకుమార్ గారు "మీ అందరి రాకతో మా ఇల్లు పావనమైనది" అనే ఆహ్వాన వ్యాఖ్యల తరువాత, డా ॥ కె .గీతా మాధవి గారు సభ ఆరంభించి, ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు గారిని సభాధ్యక్షత వహించ వలసినదిగా కోరారు.
సభాధ్యక్షులవారి ప్రారంభోపన్యాసము: "ఇచట పుట్టిన చెట్టు కొమ్మైనా చేవ గలది కాగలదు సరిగమల త్రోవ అన్నట్టు, ఈ సభ కల్పతరువు.
కావ్యము అంటే విశ్వానికి ప్రయోజనము కలిగించేది. కవి ప్రయోజనము హృదయ స్పందన. గ్రంథము అనగా గుచ్చబడినది. మనకి మొదటి గ్రంథము వాల్మీకి రామాయణము. అందులోని మొదటి శ్లోకం -
  మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః  |
  యత్ క్రౌంచమిథునాదేకం అవధీః కామమోహితం  ||

ఈ శ్లోకము సూచ్యార్ధ సూచిక. అనగా, రాబోవు కథలోని విషయాలను సూచిస్తున్నది. మా అనగా మహా లక్ష్మి, నిషాదుడు విష్ణువు. రావణుడు మరణిస్తే శోకించిన మండోదరికి, మగ క్రౌంచ పక్షి మరణిస్తే శోకముతో నిండిన ఆడ క్రౌంచ పక్షి కథ ఒక సూచిక.

అలాగే, పోతన భాగవతములోని మొదటి పద్యము "శ్రీ కైవల్య పదంబు చేరుటకునై ..." ఈ పద్యములో, "మహానందాంగనా డింభకునకు" అనగా కృష్ణుడు. "కృష్" అనే ధాతువుకు అర్ధము అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేవాడు అని. ఒక వంద ఆనందాలు కలిస్తే దేవానందము. అటువంటి వంద దేవానందములు కలిస్తే గంధర్వానందము. వంద గంధర్వానందాలు కలిస్తే యక్షానందము. వంద యక్షానందాలు కలిస్తే ఒక బ్రహ్మానందము. అటువంటి వంద బ్రహ్మానందాలు కలిస్తే ఒక మహానందము. అంతటి ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణుడు."

తదుపరి కార్యక్రమము సన్మాన సభ.
అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, తమ తల్లిదండ్రుల స్మారకముగా పలువురిని సన్మానిస్తూ చేసిన ప్రసంగము:
మా తండ్రి గారు 1991 సెప్టెంబరు 14.వ.తేదీన పరమపదించారు. ఆ మరుసటి సంవత్సరం నుంచి, ప్రముఖ వ్యక్తులకు (ఒక్క రాజకీయ వ్యక్తులకు దక్క),  మిగతా రంగాలలో వున్న చాలా మంది వ్యక్తులకు, మా తండ్రి గారి పేరున సన్మాన సత్కారాలను చేస్తూనే వస్తున్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయ, కవిత్వ, సంగీత, నాటక రంగాలలోనున్న వారిని సన్మానిస్తూ  వస్తున్నాను. ఈకోవలో స్త్రీ పురుషులు ఇరువురూ వున్నారు. మా నాన్నగారి పేరున 2007.సం.న నా జన్మస్థానమైన, గుంటూరు జిల్లా నరసరావు పేటలోనే  "భువన చంద్ర ఆడిటోరియంలో "మూడు రోజులు ,ఆయన గారి "శత జయంతి "ఉత్సవాలు  జరిపాను. ఆ సందర్భంగా మూడు రోజులూ, నటులకు, కవులకు, గాయకులకు, ఆయన గారి ప్రముఖ శిష్యులకు సన్మానాలు చేశాము. అది చాలా పెద్ద కార్యక్రమం. అప్పటికి మా నాన్న గారి శిష్యులు, ఆయనను ఎరిగిన వారూ చాలా మంది సజీవులు. ఇక మా అమ్మ గారు 2002.సం జనవరి14వ తేదీన పరమ పదించారు .అదే సంప్రదాయంలో అమ్మగారి పేరు మీద గూడా  చేస్తూనే వున్నాను. నా ప్రతి రచనలో మా అమ్మా, నాన్నల ప్రసక్తి  గూడా మీరు జాగ్రత్తగా చదివితే కనిపిస్తుంది. ఇదే గాక అక్కిరాజు ఆర్ట్ అనే సంస్థ నాకు ఒకటి వున్నది. ఆ సంస్థ తరఫున గూడా తల్లిదండ్రులను స్మరిస్తూనే కార్యక్రమాలు చేస్తుంటాను. ఆ క్రమములో ఈ సంవత్సరము ఇక్కడ అమెరికాలో, ముగ్గురికి సన్మానం చేస్తున్నాను.


కీ. శే. అక్కిరాజు "రామయ్య పంతులు" గారి పురస్కారములు
మొదటివారు బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వేంకటశాస్త్రి దంపతులు. శాస్త్రిగారు అమెరికాలోని పలు నగరములలోని గుళ్లలో పూజారిగా చేసారు. ప్రస్తుతము మిల్పిటాసులోని సత్యనారయణ స్వామి గుడిలో పురోహితులు.

సీ. గణన కెక్కిన వేద ఘన పాఠియును
       శాస్త్ర పారంగతుండు "శ్రీ మారెపల్లి"
    మోహన శ్రీ రాగ అహిరి పాడంగ
       సార యశుండు మా "మారెపల్లి"
    చెలికాండ్ర కరయంగ తలలోని నాల్కయై
       ధారుణి వర్తిల్లు "మారెపల్లి"
    నియమ వ్రతుండును, నిరుపమ గుణుడును
       మారారి కిని బంటు "మారెపల్లి"

    వసుధ శిష్యాళి పట్ల వాత్సల్యయుతుడు
    చాల సంస్తుతు లవి గొన్న సద్గురుండు
    చెప్పగను "విక్రమార్కుండు" జీవితాన
    మాన్య మిత్రుండు మహికెల్ల "మారెపల్లి"

పురుస్కారమందుకుంటున్న రెండవవారు, శ్రీ చరణ్ దంపతులు

సీ. వేద వాఙ్మయ నిధి, నాద విద్యాంబుధి
         కర్మఠుడై భువి గ్రాలు వాడు
    సంస్కృతాంధ్రములందు, సమతూకమౌ గతి
         కవిత లల్లెడి నేర్పు గలుగు వాడు
    మాన ధనుడె గాదు, మంజు భాషణుడౌచు
         పరహిత మతి యౌచు బరగు వాడు
    సద్ధర్మ యుతుడౌచు, సద్గోష్ఠి రతుడౌచు
         సలలిత భావాల మెలుగు వాడు

    ఉన్నతోద్యోగి యయ్యును ఉల్లము నను
    అరయ "నివ్వరి"ముల్లంత యైన గూడ
    గీర శూన్యమ వరలు సత్కీర్తి ధనుని
   "పాలడుగు వంశ వార్ధిని" వరలు శశిని
    సఖుని శ్రీ చరాణాఖ్యు నే సన్నుతింతు!

నా గురువు శ్రీ దివాకర్ల వేంకటావధాని గారు. శ్రీ బాబా సాహెబ్ గారికి కూడా వారే గురువులు. బాబా సాహెబ్ ముంతాజ్ దంపతులుకు పురస్కారము --


శా. చింతింపన్ బుధ వంద్య పల్కు చెలియౌ శ్రీ వాణినిన్ భక్తి, చే
    మంతుల్, బంతుల పూజ సల్ప, గుణ సమ్మాన్యుండ ఈ "సాహెబున్
    ముంతాజ్ బేగమ"వీవు, కోర్కె మెయి నీ భూమీస్థలిన్ బుట్టి, కొం
    డంతల్ కీర్తి గడించి నారు, మిము కొండాడంగ నా శక్యమా?!
సన్మానము తరువాత శ్రీమతి ముంతాజ్ గారు శాకుంతలములోని పునస్సమాగము నుండి కొన్ని పద్యాలు వినిపించారు. అవి:

1. కణ్వ మహర్షి శకుంతలను ప్రయాణము చేయుటకు సిద్ధం  కమ్మని చెపుతూ "ఎట్టి సాధ్వులకును పుట్టినింట ఏడుగడ ...", ఏడుగడ అనగా ఏడు విధములైన రక్ష

2. శకుంతల దుష్యంతుని సభలో తనని పునఃపరిచయము చేసుకుంటూ "జననాథ వేట నెపమున .."

3. దుష్యంతుడు గుర్తుపట్టక, ఎచటనుండి వచ్చితివో, అచటికే వెడలుము అని చెప్పిన, శకుంతల "విమల యశోనిధి, పురుష పృథ్వీ .."

మొదలగునవి.

సభాధ్యక్షులు ఆచార్యులుగారు భరతుని గురించి చెపుతూ, "భారత దేశము పేరు భరతుని నుంచి వచ్చినదని ఒక నానుడి. "భ" అనగా సత్యము, "రత" అనగా రమించువారు. భారతీయులు అనగా సత్యమును రమించువారు, లేక కోరువారు అని కూడా అర్ధముంది" అని వివరించారు.


కవి సమ్మేళనము:

1. రావి రంగా రావు గారు: నేను ప్రపంచమంతా చూసాను. ఇప్పుడు మనవడిలో ప్రపంచాన్ని చూస్తున్నాను. ఈ కవిత వాడి గురించే

కవిత  "తల్లి ప్రేమ"

"పిల్లాణ్ణి
నిద్రపుచ్చటానికి
లైటు తీసేస్తాం,
కాలం కూడా అంతే,
సూర్యుణ్ణి తీసేస్తుంది."

2. శ్రీ చరణ్ గారు: గణపతి నవరాత్రుల సందర్భముగా రాసిన పద్యం

సీ|| మల్లికార్జున లింగ మాహాత్మ్య రసభృంగ!
         ఆమ్నాయ శిఖర స్వరాంత రంగ!
     భ్రామరీ వదన చంద్ర కళాధి కౌముదీ
         వామ తారుణ్యార్ధ సోమ శృంగ!
     వృద్ధ మల్లేశాంక పీఠికా హిందోళి
         తూగుటూయల లూగు తుంది లుండా!
     శ్రీ శైల కైలాస శిఖర ప్రతిధ్వాన
         'శంభో! హరా!" ఘోష 'సాక్షి" గణప!

ఆ||  తకిట తోం తకధిమి తాండవ ఢక్కాజ
     వాఙ్మయ గణనాథ! వక్ర తుండ!
     కవి! పరాత్పర! పుర గర్వ ఖర్వ సుపుత్త్ర!
     సుబ్బారాయ విద్దె లిబ్బి ఒజ్జ! ||

లిబ్బి = ఆస్థి, మూలధనం


3. మువ్వా శ్రీనివాసరావు గారు, తమ 6th ఎలిమెంట్ నుండి చదివిన కవితలు:

"గుండె తంత్రిని మీటి చూసి ...
కొత్త కవితగ చిగురులేసీ .."

ఒక వాక్యం
చెరకు గడ
నమిలి తినెయ్య వచ్చు
ఒక వాక్యం
మిరపకాయ
కొరికి భరించవచ్చు
...

"మరో వైపు"

నేల మీదనే
కాకుంటే అవతలి దిక్కు
ఈ పక్క కాదు అటు పక్క
నడుస్తున్న నాపై
అదేపనిగా
నవ్వుల చిరు జల్లులు
ఎందుకో
....

5. డా॥ కె.గీత గారు:
వీడ్కోలు విమానం
నీ విమానం కిటికీ
చెమ్మగిల్లిన దృశ్యంలో
వేల ముక్కలై పగిలిన
నా వీడ్కోలు హృదయం
ఎలా భరిస్తూ వెనక్కి జేరబడ్డావో గానీ-
నిన్ను వీడ్కోలు విమానం ఎక్కించిన చివరి నిమిషంలో
నీ కనుకొలుకుల్లో విత్తనాలై మొలిచిన దు:ఖం
నా గొంతులో వృక్షమై మోయలేకున్నాను

4. వేణు ఆసూరి గారు:

పొడుపు కథ కవిత, "పొవిత" అనవచ్చునేమో?

అరువు సొమ్ముతో అందలమెక్కి
    ఊరంతా తానే బలాదూర్!
ఊరిలోని అమ్మాయిలంతా
    తనవెంటే పారాహుషార్!

అప్పిచ్చినవాడు కనబడగానే
    ముఖమంతా తెలావెలా!
గుట్టు చప్పుడు కాకుండా
    అమ్మాయిలతో సహా మాయమవ్వాలా?

ఇంతకీ, వాడెవడు?

సమాధానం సమీక్ష చివరిలో ...

కొత్త బొమ్మ
బొమ్మలమ్మ బొమ్మలు
    వింతవింత బొమ్మలు
పిండిముద్ద బొమ్మలు
    పిల్లవాడి బొమ్మలు

.....

5. శ్రీధర్ రెడ్డి గారు:

తన సామ్రాజ్యము పోనీ ...

6. రమేష్ పాలేరు గారు:

శ్రీ కృష్ణ రాయబారము నుండి,

బావా ఎప్పుడు వచ్చితివీవు
అలుగుటయే ఎరుంగని

కిరణ్ ప్రభ గారి క్విజ్ వీక్షణం సమావేశానికి ఒక ఉత్సాహం  నింపే కార్యక్రమము. ఆయన పరీక్షలో నేను పాస్ అవుతానని నేను ఊహించను. కానీ, పెద్దవారిపై అభిమన్యుడు బాణాలు వేస్తే వారు తప్పించుకోవటానికి చేసే ప్రయత్నం  ఈ క్విజ్ కార్యక్రమములో కనబడుతుంది.

క్విజ్ తరువాత సమావేశాన్ని ముగిస్తూ  గీత గారు, 39వ వీక్షణ సమావేశము నవంబరు 8న, నాగరాజు రామస్వామి గారి గృహమునందు సన్నీవేల్ లో జరుగుతుందని ప్రకటించారు.
ఈ సమావేశానికి శ్రీమతి సి. రమణ, శ్రీమతి  శారద, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి ఉమావేమూరి, శ్రీ వేమూరి, శ్రీ లెనిన్ మొ.న వారు హాజరయ్యారు.
----------------
పొవిత విడుపు: చంద్రుడు
---------------
http://www.koumudi.net/Monthly/2015/november/index.html

వీక్షణం మూడవ వార్షికోత్సవం (Sep 6, 2015)

వీక్షణం మూడవ వార్షికోత్సవం

-- పెద్దు సుభాష్


మ.            వీక్షణంబును ఈక్షణంబున వింత శోభల జూసితీ

                 కాంక్షలన్నియు ఆంధ్ర మాతను గౌరవించగ నిల్పితీ

                 ఆంక్షలేవియు లేని ధీమహు లాంధ్ర కైతను దెల్పిరీ

                 సాక్షిగానును ఈ కవీంద్రుల సాధు సాధని పల్కితీ


మ.            వీరభద్రుని దక్ష ధ్వంసము వింతవింతగ వింటిమీ

                 ఆరబోసిన తేటతేనుగు అందమందగ కంటిమీ

                 సారమేర్పగ శంకరం కథ చేరజెప్పెను మంజులా

                 నేర్ప రాయల చిన్న కథలకు తీరుతెన్నులు వింటిమీ


మ.            చక్కచిక్కటి పాతపాటలు చెవ్వుకింపుగ వింటిమీ

                 'పక్కవాడిని గౌరవించ 'ని పెద్దగాజెపె జూలురీ

                 చక్కగున్నది 'బొట్టు ' లోపలి చిక్కనౌనది పద్యమూ

                 అక్కిరాజుది సుందరోన్నత అందమైన సునాటకం!


మ.            కోతలేమియు కోయకుండగ కైతలెందరొ జెప్పిరీ

                 పాతమాటలు గుర్తుతెచ్చెను బాపిరాజువి గున్పుడీ

                 వ్రాత శోభను ఎత్తిజెప్పె కుటుంబరావుది శ్రీనుడే

                 శ్రీత రుక్మిణి సందేశానిని చెప్పె చక్కగ ముంతజా


మ.             రావి వారిది చిన్నవైన సులాభమైన కవితలూ!

                  భావగర్భిత ప్రశ్నలెన్నియొ భాసిచెప్పిరి యాంధ్రులూ!

                  చేవ ఉన్నవి ఇందురోజున చెప్పినన్నియు బాసలే

                  హావభావ సుదర్పితం కద హాయిదైన సువీక్షణం!


                                                                      -- పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్


మన్మథ నామ సంవత్సరం, శ్రావణ మాసం, కృష్ణ పక్షం నవమి నాడు, అనగా సెప్టెంబరు  6, 2015న జరిగిన వీక్షణం మూడవ వార్షిక సమావేశం జరుగుతున్నప్పుడు పిల్లలమఱ్ఱి వారు ఆశువుగా వ్రాసిన మత్తకోకిలలివి. అసలు సమీక్ష అంటే ఇదే. తరువాత వ్రాయబడినది వివరణ మాత్రమే.
పోతన వీరభద్ర విజయం వంటి ప్రాచీన వాఙ్మయం నుంచి "కల్తీ యుగం" వంటి నవ్యాంధ్ర కవితా పఠనము వరకు, చింతామణి నాటకంలోని బిళ్వ మంగళుని పాత్ర వైశిష్ట్యము నుండి "ఆంగ్లంలో తెలుగు, తెలుగులో ఆంగ్లం" వంటి విభిన్న దృక్పధాల వరకు,  అణగారిన వర్గాల చరిత్ర "అంటరాని వసంతం" గురించిన చింతనాత్మక చర్చలతో, వీక్షణం సమావేశం ముచ్చటగా మూడవ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ వేడుకలలో పాలుపంచుకున్న 60 మందికి పైకూడిన తెలుగు సాహిత్యాభిలాషులు, తమ వ్యాఖ్యలతో, చర్చలతో, ప్రశ్నలతో సమావేశాన్ని ఉత్సాహపరిచారు.

డా॥ కె. గీత గారు ప్రారంభ ఉపన్యాసములో వీక్షణం మొదలుపెట్టిన వైనము గురించి వివరించారు. మొదటి సమావేశం డా|| వేమూరి వెంకటేశ్వరరావుగారి ఇంటిలో జరిగిందని,  ప్రతినెలా   అత్యుత్సాహముతో  సాగుతున్న వీక్షణం ఈనాడు మూడవ వార్షికోత్సవము జరుపుకుంటూందని, ఎప్పటికీ ఇదిలా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని" అన్నారు. ముందుగా ఉదయపు సభకు డా|| అక్కిరాజు సుందరరామకృష్ణగారిని అధ్యక్షత వహించ వలసినదిగా ఆహ్వానించారు. సభాధ్యక్షులు అక్కిరాజు వారు, తెలుగు కవులు, కవిత్వము ఎంత గొప్పదో వివరిస్తూ, అలనాటి కవి మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి గారి "పంచవటి" పద్య కావ్యము నుంచి అద్భుతమైన పద్యాలు వినిపించారు. ఈ పద్యాల వలన కవుల వైశిష్ట్యమేమిటో తెలుస్తున్నది. కవిత్వము పరమార్ధమేమిటో కూడా తెలుస్తున్నది.

ఉ||  నృత్య సరస్వతీ కటక నిక్వణమున్ ప్రకటించు కొంచు, సా

       హిత్య సరస్వతీ హృదయ మిచ్చుచు, గాన సరస్వతిన్ బలెన్
       సత్య పదార్ధ కీర్తనము సల్పెడి, మత్కవితా సరస్వతీ
      నిత్యత చాలు, స్వర్గమును నీరస మీ రస సిద్ధి ముందరన్!
ఉ||  మోదము లోన మోదమై పోదురు, ఖేదము లోన ఖేదమై
     పోదురు, సర్వమున్ కరగి పోవును వారల సృష్టి, వారి ఆ
     హ్లాద వినోదముల్ కడు విలక్షణముల్, కవులన్న నిత్య సూ
     ర్యోదయ కాల మానస సరోవర హంస లటుల్ రస ప్రియుల్!
ఈ రెండు పద్యముల వివరణ వలన కవులేమిటో కవితా ధ్యేయములేమిటో స్పష్టమౌతున్నది.
అక్కిరాజుగారు వారి అభీష్ట దైవమును ప్రార్ధిస్తూ, వారి స్వీయ రచనను అద్భుతముగా ఆలపించినారు. ఆ పద్యము
మ||  అరవిందంబుల వంటి కన్ను గవతో, ఆస్యాన చిర్నవ్వుతో,
      హరి నీలంబుల బోలు ముంగురులతో, అద్వైతమౌ శక్తివై,
      కరుణా మూర్తిగ నిత్యనూత్నమగు శృంగారాన నా మోమునన్
      చిరకాలమ్ము నటింపుమమ్మ జననీ శ్రీ రాజరాజేశ్వరీ!
విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వము గురించి కొంత వ్యాఖ్యానము చేస్తూ, ఆనాటి సభలలో జరిగే సందర్భోచిత వ్యాఖ్యల చతురతను ఉదహరించారు. "ఒకసారి గొప్ప పద్య  ప్రసంగిస్తున్నప్పుడు, ఒక శ్రోత, తల ఊపటము మొదలు పెట్టాడు. అతని వెనుక ఉన్న ఇంకొక శ్రోత, వ్యంగ్యముగా "తల బాగా ఊపుతున్నావు, అసలు ఏమన్నా అర్ధమవుతున్నదా నీకు, అది ఏ రాగము?" అని అనగా, అక్కడ ముందు వరసలో కూర్చుని ఉన్నవిశ్వనాధ వారు "అరేయ్, మెడ మీద తలకాయ ఉంటే అర్ధమవ్వుతుంది లేరా" అని సరసోక్తి విసిరాడట".
ఇలా చతురోక్తులతో, సరసోక్తులతో సభ ఆవిష్కరించ బడింది.
అధ్యక్షులు వారి ఆహ్వానముతో శ్రీ చరణ్ గారు పోతన “వీరభద్ర విజయము” మొదటి ప్రసంగం కావించారు.

ప్రసంగ విశేషములు: పోతన భాగవతము రచించిన తరువాత, సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి అడిగితే రచించానని చెప్పాడు. పోతన కూడా దక్ష యజ్ఞం గురించి వ్రాయలేకపోయానని కొంత చింత ఉన్నవాడు. ఆ విధముగా వీరభద్ర విజయము రచించటము జరిగింది. దధీచి తెలియకవచ్చి యాగకర్త లేని యాగాన్ని తిడుతాడు. ఆ విధముగా మొదలైన వీరభద్ర విజయములోని కొన్ని ఘట్టములలోని ముఖ్యమైన పద్యములని పఠించి, వివరణ ఇచ్చారు. వారు చదివిన పద్యములు:
1. ఏ పుణ్య కథ చెప్పి
2. సమతంబులు ఆరును
3. కరకంఠ
4. నరదేవాసుర
5. పుండరీకాక్షుని
6. కల్లోల ధ్వని
కాళిదాసు కుమార సంభవము కంటే  పోతన ఎక్కువ వివరణ ఇచ్చాడు. పార్వతి సౌందర్య వర్ణన కూడా కాళిదాసు వర్ణన కంటే ఎక్కువగా ఉంది.
రెండవ ప్రసంగం బుడుమగుంట మధు గారిది. వారి ప్రసంగ విశేషములు: తెలుగు భాష పుట్ట తేనె వంటిది. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా ఆంగ్ల పదములు వాడుతున్నారు. ఉదాహరణకుTV లోని వంటల కార్యక్రమములో water, sugar అంటారు కానీ, మంచి నీళ్లు, పంచదార అనరు. ఇంగువ దగ్గరకు వచ్చేసరికి ఇంగువ అనే అంటారు, ఎందుకంటే దానికి సరి అయిన ఆంగ్ల పదము వాళ్లకు దొరకదు కాబట్టి. ఇంటువంటి పరిస్థితులలో తెలుగు భాషను ప్రోత్సహించటానికి "సిరిమల్లె" అనే ఇంటర్నెట్ పత్రికను రమేష్, రమామణి, తన  శ్రీమతి బుడుమగుంట ఉమ గారితో కలసి మొదలుపెట్టామని వివరించారు. ఈ పత్రిక మొదటి సంచిక ఈ నెలలోనే విడుదలవ్వుతున్నదని, పత్రికలోని అంశాలు మాతృ భాష మాధుర్యం, మన ఆచారాలు సంప్రదాయాలు, ఆలయాలు మొదలగునవి అని వివరించారు.
జొన్నలగడ్డ మంజుల గారిది మూడవ ప్రసంగం. వారి ప్రసంగ విశేషములు: నాకు సాహిత్యాభిలాష తల్లి తండ్రుల దగ్గరనుంచి వచ్చినది. శంకరమంచి సత్యం నా అభిమాన రచయితలు ఐదుగురిలో ఒకరు. అమరావతి కథలలో నది, గుడి, జలాలు, వాటిని నమ్ముకున్న ప్రజలు, వారి జీవితాలు, కష్ట నష్టాలు గురించిన చక్కటి వర్ణన. ఇంతకు ముందు వారిని పట్టించుకున్నవారు లేరు.
తరువాత పుస్తకావిష్కరణ  కార్యక్రమము జరిగింది. రావి రంగారావు గారు అనిల్ రాయల్ గారి పుస్తకాలని ఆవిష్కరించారు, మొదటిది, కథ వ్రాయటం ఎలా అనే "కథాయణం", రెండవది వారి కథల సంకలనం" నాకరికథ". అనిల్ గారు, కథాయణం లోని కొన్ని అంశాలను చదివి వినిపించారు. "ఎక్కువ నిడివి, ఎక్కువ పాత్రలు ఉంటే నవల వ్రాసుకోవాలని, విషయం క్లుప్తంగా చెప్పాలంటే కథ. భాష, శైలి, భావ వ్యక్తీకరణ ముఖ్యమని, ఒక పాత్ర గురించి ఇచ్చే వివరణ, పాత్ర యొక్క ఆలోచనలు, ప్రవర్తనలో ఇమిడి ఉండాలని, అదే కవిత్వమైతే, అతిశయోక్తి లేకపోతే కవిత్వం లేదు"  అని చెప్పారు.
రెండవ పుస్తకము, వీక్షణం వార్షిక  సంచికలు . ఈ పుస్తకాల్ని  కిరణ్ ప్రభ, కాంతి కిరణ్, గీత, ఇక్బాల్, అపర్ణ, రావు తల్లాప్రగడ గార్లు  అక్కిరాజు సుందరరామకృష్ణ గారి అమృత హస్తముల మీదుగా ఆవిష్కరించమని కోరగా, అక్కిరాజుగారు ఆవిష్కరించటం  జరిగినది.

అక్కిరాజుగారు,  వీక్షణం సమావేశం నిర్వహించటం గురించి జరుపుతున్న కృషిని కొనియాడుతూ గీతగారిని అభినందించారు. గీతగారు, నిర్వహణ, సంకలనము మాత్రము తనదని, రాత్రికి రాత్రి పుస్తకముగా కూర్పు చేసినది, ముఖపత్రము సంధించినది కాంతి కిరణ్ గారని, వారికి కృతజ్ఞత తెలిపారు. ఇక్బాల్ గారు, రెండు సంవత్సరములనుండి, వీక్షణం సమావేశములలో పాలు పంచుకుంటున్నానని, ఇంకా పెద్ద సభలు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.
తరువాత శ్రీ పాదన్న రేణుక గారి లలిత సంగీత గానము వీనుల విందుగా జరిగినది. ఈ విందుతో తన్మయులయిన శ్రోతలు, విందుభోజనం గురించి అంత పట్టించుకోలేదేమో!

రేణుక గారు పాడిన లలిత గీతములు:

1. ధగ ధగ మెరిసే కాంతులు చిందే కళ్లు నెమలికెవరు ఇచ్చారు -- అడవి బాపిరాజు
2. చక్కని చిన్నది చుక్కల రాణట పాటను వింటూ పడతి నిలచినది -- అడవి బాపిరాజు
3. మొక్క జొన్న తోటలో - కొనకళ్ల వెంకట రత్నం
భోజన విరామం తరువాత, మధ్యాహ్నపు  కార్యక్రమానికి  రావి రంగా రావు గారు  అధ్యక్షత వహించారు.
నాల్గవ ప్రసంగం జూలూరి వంశీ గారిది. వారి ప్రసంగ విశేషములు: "నేను వృత్తి రీత్యా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో  లో మీడియా స్టడీస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను.  నా ఉపన్యాసం "తెలుగులో ఆంగ్లం, ఆంగ్లంలో తెలుగు".  మనం  ఒప్పుకున్నా లేకపోయినా, "English is a global language,  Indians are an  incredibly voiceless community in world literature, especially Telugu writers. For example, in Jaipur Book Festival, there is very low representation of Telugu writers.The portrayal of Indians, especially Hindus is misrepresented in the West. An example is California School Text Books. Social Studies books have an image of Last Supper to depict Christianity. For Islam, there is the Blue Mosque from Istanbul. But to portray Hindus, there is an image of a woman carrying garbage. The same is true with New York Times. Hindus and India are portrayed in negative contexts.I made small efforts to bring Telugu into English literature. In my book "The Mythologist", the story of a Telugu boy "Parasurama", the grandchild of a yesteryear hero, the dialogue between the protagonist and the lead female character is in Telugu, written in English script. The publisher asked me to change it to English. I refused and questioned him, if you can accept Bengali dialogue in English novels, you should be able to accept Telugu dialogue too."
తరువాత "బొట్టు శతకం" పుస్తకావిష్కరణ కౌముది పత్రిక సంపాదకులు కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ గారి అమృత హస్తముల మీదుగా జరిగింది. ఈ బొట్టు శతకము సంధాన కర్తలు రావి రంగారావు గారు. ఆయన Facebook లో "బొట్టు" మీద పద్యములు వ్రాయవలసిందిగా పలువురు కవులను  ఆహ్వానింపగా, స్పందించిన శ్రోతల యొక్క కవిత్వ సంకలనం బొట్టు శతకము. బ్రిం గారు "జడ" అనే పదము ఇచ్చి తేటగీతిలో పద్యములను వ్రాయవలసిందిగా కోరినప్పుడు వచ్చిన ప్రతి స్పందన "జడ శతకము". ఆ రీతిలోనే "బొట్టు శతకము" కూర్చబడినదని రావి రంగారావు గారు తెలిపారు. ఈ సంకలనములోని పద్యములను మచ్చుకగా రావు తల్లాప్రగడ గారు వినిపించి, బొట్టు అనే మాట యొక్క వివిధ వర్ణనలు, అర్ధాంతర, గూడార్ధ రూపములను ఈ శతకములోని పద్యాలను కూర్చిన కవులు తెలిపారని ప్రశంసించారు. రావి రంగారావు గారి "బొట్టు శతకం" పద్య పఠనము కావించి, మరి కొన్ని మంచి పద్యములను పరిచయం చేసారు.
ఐదవ ప్రసంగం అక్కిరాజు సుందర రామకృష్ణ గారిది.   సంఘ సంస్కరణ ప్రబోధాత్మకమైన, మహాకవి "కాళ్లకూరి నారాయణ రావు" గారిచే విరచితమైన "చింతామణి" నాటకము నుండి అక్కిరాజు వారు, "తల్లిదండ్రులకి సేవ చేసినప్పుడే వాడు కుమారుడనియు, ఎంతటి విజ్ఞానవంతుడైనా, పండితుడైనా అపమార్గమున పడినప్పుడు భ్రష్టుడు  కాక తప్పదనే పద్యములను ఉదహరించారు. అటులనే చమత్కారముగా,  స్త్రీపురుషులు ఇరువురి యందునూ పొర పొత్యములు ఉండుననియూ, అవి సరి దిద్దుకున్నప్పుడే కాపురములు శుభప్రదములు అగుననియు" చక్కని పద్యములు వివరించినారు. కాళ్లకూరి నారాయణరావు గారు వంగ దేశమున ప్రసిద్ధమైన నాటకాన్ని, "చింతామణి" నాటకముగా అంధ్రీకరించారు. నారాయణ రావు గారి కవిత్వ పటిమ, నాటకాన్ని నడిపిన తీరు, పాత్రలను చిత్రీకరించిన పద్ధతి ఉదాత్తమైనది"  అని వివరించారు అక్కిరాజు వారు. వారు ఉదహరించిన పద్యములు:

1. కాలు పెట్టిన తోనె కాంతుని మెడవిరిచి
2. అర్ధాంగ లక్ష్మి అయినట్టి ఇల్లాలిని
3. ఘనుని హరిశ్చంద్రు కాటి కాపరి చేసె
4. ప్రాయము వచ్చినంత, గృహ భారము మూపున దాల్చి
5. చల్లని పిల్లగాడుపులు
6. తన కల్మియను మొదలగునవి.
తరువాత సుభాష్, పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, రావు తల్లాప్రగడ గార్లు  అక్కిరాజు గారిని సన్మానించారు. వారి  పద్య పఠనా, నటనా ప్రావీణ్యతకు ఆశువుగా శ్రీ చరణ్ గారు వ్రాసిన ప్రశంసా పత్రం:


సీ|| `కవన గాండీవి' సౌ `గాత్ర వంశీధరా'
        "అక్కిరాజా"న్వయ చుక్కల దొర!
     మాటయున్ పాటయున్ పోటు పొల్పు నిగుడు
         కైత పాటవ ముబ్బు గాన మూర్తి!
     మంద మంద గతుల మందలించు మగని
         సౌరి స్తుతించిన శూర సూరి!
     పేర్మి నధిక్షేప పూర్ముల నుప్పొంగు
         సరసప్రవాళార్థ జలధి రత్న!
తే|| ఘంటసాల ఆత్మ నిడె! నీ కంఠసీమ!
     విజయ సఖు పాత్ర యును మరి విజయు పాత్ర
     గాత్ర మున్నిల్పు నాటక కళల చంద్ర!
     ఏమి చెబుదింక "సుందర రామ కృష్ణ!"
ఆరవ ప్రసంగం చుక్కా శ్రీనివాస్ గారిది. కల్యాణ రావు గారి రచించిన "అంటరాని వసంతము" పుస్తకము సమీక్షించారు. వారి ప్రసంగము: “వేల సంవత్సరాలుగా, వర్ణ వ్యవస్థ వలన అణగారిన వర్గాల చరిత్రలో ఒక అంకమును తెలిపే పుస్తకము "అంటరాని వసంతం". ఇది బాపట్ల, ఒంగోలు ప్రాంతములోని "చిందు మాదిగ" వారి గత 200 సంవత్సరముల చరిత్ర. Alex Haley “Roots” లాగా, ఒక చిందు మాదిగకు చెందిన ఒక వ్యక్తి వంశోత్తరాలు, వారి ఆచార వ్యవహారాలు, సమాజంలో జరిగిన మార్పులు, అట్టడుగు వర్గాలలో వారు పడిన బాధలు తెలిపే కథ. "ఈ పుస్తకము నన్ను అత్యంత ప్రభావితము చేసినది. కొ.కు, గంగు, అల్లం రాజయ్య, బాలగోపాల్ నా అభిమాన రచయితలు. ఈ పుస్తకం ద్వారా, కల్యాణ రావు గారికి కూడా నేను అభిమానిని అయ్యాను" అన్నారు. కుల వ్యవస్థ ఎంత పాతుకుపోయిందో ఉదహరిస్తూ "ఈ దేశంలో పీల్చే గాలికి కులం వుంది", అంటూ  కొన్ని ముఖ్యమైన ఘట్టాలను  చదివారు.”
ఏడవ ప్రసంగము గునుపూడి అపర్ణ గారిది. వారు అడవి బాపిరాజు గారి వర్ణనా చాతుర్యము గురించి ప్రసంగించారు.  ఆడువారి గురించి, వీరులను గురించి, అడవులను (ప్రకృతి) గురించి, వేరొక్క విషయము ఏదయినా సరే, "గోన గన్నారెడ్డి" నవలలో బాపిరాజుగారు ఎంత చక్కగా వర్ణించారో ఉదాహరణలతో తెలిపారు. ఇప్పటి కవులు, రచయితలు ఈ రకమైన వర్ణనలు  ఎందుకు చేయటములేదు? లేక పాఠకులు కోరటంలేదా? అని ప్రశ్నించారు.
ఎనిమిదవ ప్రసంగం సి.రమణ గారిది. నేడు షష్ఠిపూర్తి సందర్భముగా జరిగే ఆర్భాటాలను విశ్లేషించారు . వారి ప్రసంగ విశేషములు: "ఈ మధ్య 60 సంవత్సరాలు నిండిన పుట్టిన రోజు వేడుకలు బాగా జరుగుతున్నాయి. వేడుకలు, పండుగలు, ఆర్భాటాలతో జరగడం మనకు ఆనవాయితీ అయిపోయింది. కొందరు పెద్ద పెద్ద హోటళ్లలో ఆడవాళ్ల ధగధగలు, మగవాళ్ల ముందు గ్లాసుల గలగల మధ్య ఘనంగా జరగుతున్నాయి. ఇంతకంటే భిన్నంగా ఆలోచించలేమా? మన తల్లిదండ్రుల తరువాత, మన గురువులు, మన సోదరీ సోదరులు, బంధువులు, మిత్రులు, మన సమాజం, మనం ఈ రోజున ఈ స్థితిలో వుండటానికి కారకులు. ఎంతమంది రైతులు కష్టించి, పండించి ఇస్తే ఆహారాన్ని తీసుకున్నాము? 60 సంవత్సరాల పండుగ అంటే Thanks Giving. తిరిగి ఇవ్వడం. అందుకే సమాజానికే ఏదైనా తిరిగి ఇద్దాము. మరి ప్రకృతి నుండి, పంచభూతాల నుండి చాలా, చాలా తీసుకున్నాము కదా! ప్రకృతి మాతకు మనం "return gift"  గా మొక్కలు నాటడం, చెట్లని సంరక్షించడం, నీరు, విద్యుత్  వృధా చేయకుండా, ప్లాస్టిక్ వాడకం మానివేసి, పేపరు వాడకం తగ్గించి ప్రకృతిని రక్షించుకుందాము. మనం పుట్టినప్పుడు వున్న ప్రకృతి స్థితిగతులను మెరుగు పరచి మన భావి తరాలకు అందించుదాము.” అన్నారు.
కవి సమ్మేళనములో రావు తల్లాప్రగడ గారు నిర్వహించారు. కవితల చదివినవారు:
1. డా॥  కె.గీత    - "నిరీక్షణ"
2. షంషాద్         - కిన్నెరసాని
3. పిల్లలమఱ్ఱి - వీక్షణంబున ఈ క్షణంబున
4. ప్రకాశరావు     - కల్తీ యుగం, డాక్టర్లు బాబోయ్ డాక్టర్లు
5. రావు తల్లా ప్రగడ  - తల్లీ లక్ష్మీ దేవి
6. గంగా ప్రసాదు       - మాతృదేవోభవ
7. జ్యోత్స్న   - నర్తించును
చక్కని కవిత్వాన్ని మెచ్చుకుంటూ , అధ్యక్షులు రావి రంగారావు గారు, "నెహ్రూగారిలా కవిత్వము ఉండగూడదు. గాంధీ గారిలాగా ఉండాలి, కవిత్వమంటే ఒక అనుభూతి" అని వివరించారు.

వీక్షణ సమావేశములో ఆనవాయితీగా జరిగిన కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమములో సభికులు ఆసక్తితో, ఉత్సాహముగా పాల్గొన్నారు.

చివరగా  బాబా సాహెబ్ గారు, ముంతాజ్ గారు తమ  తెలుగు భాషా అభిమానాన్ని గురించి వివరించారు.
బాబా సాహెబ్ గారి ప్రసంగం: "నేను ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగులో MA పట్టా అందుకున్న మొదటి ముస్లిం ని. దివాకర్ల వెంకటావధాని గారి దగ్గరే చదువుకోవాలని కోరిక. ఆ కోరికను సాధించా. ఖండవల్లి లక్ష్మీరంజనం  వంటి ఆనాటి పెద్దలు నాకు పరిచయస్తులు. సినారె   వంటి వారు ఇంచు మించుగా సహాధ్యాయులు."
ముంతాజ్ గారి ప్రసంగం: "బూర్గుల రామకృష్ణారావు గారు, మాడపాటి హనుమంతరావు గారు స్త్రీ విద్య కోసం చాలా కృషి చేశారు. మావారు కూడా నన్ను చదువుకోవటానికి చాలా ప్రోత్సహించటమే కాకుండా, సాహితీ సమావేశాలకి తప్పని సరిగా తీసుకు వెళ్లేవారు. పిల్లలని కూడా తీసుకు రాకపోతే ఊరుకునేవారు కాదు. అక్కడి వాతావరణములో పిల్లలకి కూడా సాహిత్యం అబ్బుతుందని వారి అభిప్రాయం. మూడేళ్ల ఇక్బాల్ ని తీసుకు వెళ్లితే, వాడు నిద్రపోయేవాడు.  అలా బాబా సాహెబ్ గారి ప్రోద్బలముతో నేను కూడా ఎమ్.ఏ  పూర్తి చేశాను.
చిన్నప్పుడు పోతన భాగవతము లోని దశమ స్కంధములో  చదివిన రుక్మిణీ కల్యాణము లోని పద్యాలు, పుస్తకం పేజీ ఇప్పటికీ అలా కళ్ల ముందు కనిపిస్తున్నది.  అంటూ ముంతాజ్ గారు రుక్మిణీ కల్యాణము లోని పద్యాలు చక్కగా చదివి వినిపించి వివరణ కూడా ఇచ్చారు.
ఆఖరుగా పిల్లలమఱ్ఱి వారు, ఈ సమీక్షకు ముందు పొందు పరచిన పద్యములు చదివారు.
ఈ సభకు మృత్యుంజయుడు తాటిపామల, జయ తాటిపామల, ఉదయ లక్ష్మి, అద్దేపల్లి ఉమాదేవి, రమామణి, ఇక్బాల్, కె.శారద, శారద, మురళి, విజయ మొ.న స్థానిక రచయితలు, సాహిత్యాభిమానులు ఎందరో హాజరయ్యారు. 

చివరగా సభకు విచ్చేసిన వారందరి పరిచయ కార్యక్రమము తో సభ ముగిసింది. అందరికీ  ధన్యవాదములు తెల్పుతూ గీత గారు సభ ముగించారు. 

--------------------
http://www.koumudi.net/Monthly/2015/october/oct_2015_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ గవాక్షం - 36 (Aug,9-2015)


వీక్షణం సాహితీ గవాక్షం - 36
- పెద్దు సుభాష్ 


వీక్షణం 36 వ సాహితీ సమావేశం ఆగస్టు 9, 2015 న డా॥ వేమూరి వెంకటేశ్వరరావు, ఉమా దేవి గారి స్వగృహమున జరిగింది. మూడు సంవత్సరముల క్రిందట, వీక్షణం మొదటి సమావేశం వీరి గృహమునందే జరుగుట ప్రస్తావించదగిన విశేషం.
డా ॥ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు సభాధ్యక్షత వహించారు. సభ ప్రారంభము కాకముందే, అధ్యక్షుడు అంటే అధి+అక్షుడు, అనగా పైన ఉండి అంతా సక్రమముగా జరుగుతున్నదో లేదో పరిశీలనచేసే వాడని వివరించారు. ఇంకొంచెము వ్యంగ్యముగా చెప్పాలంటే "కళ్లు నెత్తికెక్కిన వాడ"ని చెప్పారు.
సమావేశం అధ్యక్షులవారి "పాల సంద్రమునందు ..." పఠనముతో, రాజ రాజేశ్వరి దేవి ప్రార్ధనా వాఖ్యములతో ప్రారంభమయ్యింది.
తదుపరి, అధ్యక్షులవారు ముఖ్య అతిధి శ్రీమతి తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారిని సభకు పరిచయము చేసి, వారి రచనా వ్యాసంగం గురించి ప్రసంగించవలసిందిగా కోరారు.
మీరాబాయి గారి ఉపన్యాసము (సంక్షిప్తం):
మా స్వగ్రామము అనంతపురం జిల్లాలోని "గుత్తి". కర్నూలు ప్రభుత్వ మహిళా కళాశాల నుండి Reader గా పదవీ విరమణ పొందాను. నేను శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం లో M.A., Ph.D. పట్టాలు పొందాను. నా సిద్ధాంత గ్రంథం " Women's Voices". నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయినిని. కానీ ఎక్కువగా తెలుగు కథలు వ్రాస్తాను. ఇప్పటి దాకా నాలుగు నవలలు, రెండు వందల పైన కధానికలు ప్రముఖ పత్రికలలో వచ్చాయి. ఆరు కథా సంకలనాలు వెలువడినాయి. ఆకాశవాణి లో స్త్రీ సమస్యల గురించిన ప్రసంగాలు ప్రసారమయ్యాయి. నేను రాసిన కొన్ని నాటికలు కూడా ఆకాశవాణిలో ప్రసారమైనాయి.
1962లో కాకినాడ పి.అర్. కళాశాల లో డిగ్రీ మొదటి సం|| చదువు తున్నప్పుడు మా ఇంగ్లీష్ మాస్టరు బులుసు వెంకటేశ్వర్లు గారు అడిగితే కాలేజ్ మాగజైన్ కోసం చిన్న కథలు రెండు రాసాను. నా మొదటి కథానిక "పసి మనసులు". 15-3-1963 ఆంధ్ర ప్రభ వార పత్రిక లో వచ్చింది..
నేను మొదటిసారి అమెరికా 15 సం|| క్రితము వచ్చినప్పుడు, ఆమెరికా జీవితం గురించి రాసిన కథ " వేడివెన్నెల" 27-6-2003 లో ఆంధ్ర ప్రభ వార పత్రికలో వచ్చింది. ఆ రోజులలో ఇక్కడి పరిస్థితులను గమనించి వ్రాసిన కథ. తరువాత ఇక్కడికి పలుమార్లు రావటము జరిగింది. ఈ 15 సం|| ఇక్కడ జరుగుతున్న మార్పులు గమనించాను. ఇప్పుడు ఇక్కడ తెలుగు వాతావరణం బాగుంది. నిజం చెప్పాలంటే, ఇటువంటి సాహితీ, సంస్కృతిక సమావేశములు ఇక్కడే ఎక్కువ జరుగుతున్నవేమో. బహుశా nostalgia వలన, దూరాన ఉన్నటువంటి వాటిని కౌగలించుకోవాలని కోరిక ఎక్కువ ఏమో? అందువలనే ఇటువంటి కవితా, కథా సమావేశాలు ఎక్కువ ఏమో? నేను కథా రచయిత్రిని. కానీ, కవితలు, నవలలు కూడా రాశాను. కాకినాడ పి. ఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, బులుసు వెంకటేశ్వర్లుగారు కథలు వ్రాయమని ప్రోత్సహించేవారు. రాయటానికి స్పందన జీవితములో జరిగిన ఏదో ఒక సంఘటనతో కథలు మొదలవుతాయేమో? ఉదాహరణకి ఈ వీక్షణంలో జరిగే సంఘటనలు, పరిచయాలు ఎప్పటికో "ఆ "కారము ధరించి కథగా వ్రాయబడతాయి. ఒక కథ చదివితే, ఒక కిటికీ తెరిచి ఆ సంఘటనలను దర్శించుతాము.
ప్రముఖ విశ్లేషకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు నా మొదటి కథా సంకలనం " ఆశల మెట్లు" ఆవిష్కరించారు. ఆయన అన్నారు "మీరాబాయి గారు చిన్న కథ రచనా శిల్పాన్నికరతలా మలకం చేసుకున్నారు" అని.
ఇదివరకు కలం కాగితముతో వ్రాస్తే, ఇప్పుడు కంప్యూటరు మీద టైపు చేస్తాను. మా అమ్మాయి ప్రచురణకు పంపుతుంది.
మీరాబాయి గారి రచన "చివరకు మిగిలేది" కథా పఠనము తో వారి ప్రసంగము ముగిసింది. మనకు కావాల్సింది, కావాల్సిన మనుష్యులను దూరం చేసుకుంటున్నామేమో అనే అభిప్రాయముతో వ్రాసిన కథ అని వివరించారు. ఈ కథ ఏప్రిల్, 2007 రచన. ఇంటింటి మాస పత్రికలో ప్రచురింపబడి , కథా పీఠం పురస్కారం పొందింది.
తరువాత, అధ్యక్షులవారు రచయిత్రి అద్దేపల్లి ఉమాదేవి గారిని పరిచయము చేసి, వారిని ఉపన్యసించవలసిందిగా కోరారు.
అద్దేపల్లి ఉమా దేవిగారి ప్రసంగం:
మా తండ్రిగారు భాగవతుల సుబ్బారావుగారు. మా పెద తండ్రి గారు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు. నేను 7,8 సం|| వయసునుండే రచనలు చేస్తున్నాను. చిన్నప్పుడు వ్రాసినవి మా తమ్ముడి పేరుమీద మీద పత్రికలకు పంపుతుండేదాన్ని. ఆ వచ్చే పారితోషకము వాడికి సరదా. వ్రాయటము ఒక అభిలాష. నేను ఐదవ తరగతి వరకే తెలుగు చదువుకున్నాను. తరువాత మేము ఒరిస్సాలో ఉండటము వలన ఎక్కువగా ఒరియా, బెంగాలీ సాహిత్యము చదివాను.
ఇప్పుడు ఎక్కువగా ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాస్తాను. మేము ఉండేది పాండిచ్చేరీలో. శ్రీ అరబిందో philosophy, spirituality ప్రభావము ఉంది. ఎమెస్కో వాళ్లు సామాజిక కథలు, వ్యాసాలు వ్రాయమని ప్రోత్సాహించారు. అప్పటినుంచి కథలు కూడా వ్రాస్తున్నాను. స్త్రీ ఉత్తేజం గురించి కూడా వ్రాస్తాను. ఒకొక్కసారి ఆవేశం పెల్లుబుకుతుంది. అప్పుడు అది అక్షర రూపం చేరుతుంది. "కుమార సంభవం" అనే సాంఘీక నవల వ్రాసాను. అమెరికాలో శ్లోకాలు, పద్యాలు చర్చించుకుంటున్నారు. అది చూస్తే సాహిత్యము మీద ప్రేమ ఇక్కడే ఉందేమోనని అనిపిస్తున్నది.
విందు తర్వాత జరిగిన కవి సమ్మేళనం లో భాగంగా శ్రీ రావి రంగారావు మనవడి పై అద్భుతమైన కవితలను చదివారు. డా ॥ కె. గీత గారు "ఇంటిని వదలలేని బెంగ" అనే చక్కని కవితను చదివారు.
ప్రతి సమావేశములో శీర్షికలాగా జరిగే కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమము జరిగింది.
పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు పెండ్లి వేడుకలో వధూవరులు అరుంధతీ నక్షత్రము చూడటానికి గల ప్రాశస్త్యమును వివరించారు. అరుంధతి, వసిష్ఠ అనేవి సప్తర్షి మండలములోని (Big Bear Constellation) జంట నక్షత్రాలు (Dual Stars). అవి ఒకటి చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. మనకి ఒకే నక్షత్రములాగా కనిపిస్తాయి. వధూవరులు అలాగే తమ జీవతాన్ని కలసి ఒక్కటిగా గడపాలనే సంకేతానికి అరుంధతీ, వసిష్ఠ నక్షత్రములు సంకేతములని వివరించారు.
అధ్యక్షుల వారు శ్రీ చరణ్ గారిని వేద పఠనము గురించి ప్రసంగించ వలసిందిగా కోరారు.
శ్రీ చరణ్ గారి వేద పఠనము ప్రౌఢముగా జరిగింది. వారు వేదము అధ్యయనము చేసే పద్ధతిని వివరించారు. ఉపనయనము చెందిన బాలురు 7వ ఏటను మొదలు పెట్టితే, 15వ ఏట వరకూ చదువుతారని, ఇది వేద పాఠశాలలో జరిగే కార్యక్రమము. వేద పాఠశాలలు నిర్వహించటము, ఈ బాలురను పోషించటము ఖర్చుతో కూడినది. నిర్వాహుకులు విరాళములు అడిగినప్పుడు, వారు commercialize అయ్యారనే విమర్శ తప్పు అని వివరించారు.
ముంతాజ్ బేగం గారు చక్కని ఉచ్చారణతో భర్తృహరి సుభాషిత పద్య పఠనము చేసారు.
సభ ముగిస్తూ, అధ్యక్షులు అక్కిరాజు గారు శ్రీ కృష్ణ తులాభారములోని పద్యాలను, రాయబారములోని పద్యాలను పద్య నాటక బాణీ ల్లో ఉత్తమముగా పఠించారు. పఠనా ప్రయుక్తములను వివరించి, ఉదాహరణకు, ప్రేయసి ప్రేమను కోరే పద్యాన్ని ఎలా పఠించకూడదో కూడా చెప్పారు. కాళిదాసు శాకుంతలములో కణ్వుడు శకుంతలను దుష్యంతుని దగ్గరకు పంపుతూ చెప్పిన నాలుగు శ్లోకాలు నాటకములో చక్కగా పఠించటము ఎంత ముఖ్యమో, రాయబారములోని పద్యాలు నాలుగు అంత ముఖ్యమని చెప్పి, వారి పఠనా చాతుర్యాన్ని ప్రదర్శించి, సభను రంజింపచేశారు. ఆ నాలుగు పద్యాలు చెల్లియో చెల్లకో, అలుగుటయే యెరుంగని,
జండాపై కపిరాజు, సంతోషంబున సంధిచేయుడు.
ఈ సభలో శ్రీ ఇక్బాల్, వారి తల్లిదండ్రులు, సహోదరి, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్, శ్రీమతి శాంత, శ్రీమతి వందన, శ్రీ శివ చరణ్, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి రమణ తదితరులు పాల్గొన్నారు.
సభాంతర ప్రకటన చేస్తూ, గీత గారు తదుపరి సమావేశము వార్షిక సమావేశమని,అందరూ తప్పక విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందని కోరుతూ ఆ వివరాలను తెలిపారు.
వీక్షణము 3వ వార్షిక సమావేశము:-
సెప్టెంబరు 6, ఆదివారము, ఉ|| 11 గంటలనుండి, సా|| 4 గంటల వరకు.
వేదిక: స్వాగత్, మిల్పిటాసు
----------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/sep2015/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/september/sept_2015_vyAsakoumudi_vikshanam.pdf

కబుర్లు - వీక్షణం సాహితీ గవాక్షం-35(July 12,2015)

వీక్షణం
సాహితీ గవాక్షం-35
- డా.అక్కిరాజు సుందర రామ కృష్ణ
07-12-2015 ఆదివారం ఫ్రీమాంట్, కేలిఫోర్నియా లో తెలుగు భాషాభి మానులు, స్నేహశీలి "శ్రీ సుభాష్ "గారి స్వగృహంలోజరిగిన సమా వేశం, ఒక నివేదిక-
"వేణు ఆసూరి"గారి సభాధ్యక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీ ప్రముఖులు,తెలుగుభాషా సేవకులూ శ్రీయుతులు వేమూరి,కిరణ్ ప్రభ ,పసుమర్తి నరసింహా రావు దంపతులు, భారత దేశాన్నించి విజిటర్స్ గా విచ్చేసిన డా.అక్కిరాజు సుందర రామ కృష్ణ, ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మి, ప్రసిద్ధ తెలుగు కవి,భాషాప్రియుడు ఫ్రీమాంట్ వాస్తవ్యుడు అయిన "ఇక్బాల్ "గారి తలిదండ్రులు, హైదరాబాదునుండి విచ్చేసిన ప్రముఖ రేడియాలజిస్టు,వచన కవి డా. ఉపాధ్యాయుల కృష్ణమూర్తి గారూ, ఇంకా వంశీ ప్రఖ్యాగారి తల్లి గారు, షంషాద్, కె.శారద తదితర సోదర సోదరీమణులతో సభ నిండింది.
ఇవాల్టి సభలో ప్రత్యేకత ఏమిటంటే ప్రఖ్యాత కథా రచయిత్రి భారతదేశంలో విశాఖపట్నం వాస్తవ్యురాలైన "సాయి పద్మగారు"సభనలంకరించడమే! ఆవిడ గారు వినిపించిన కథానిక "మావయ్య వస్తాడంట", చక్కని సామాజిక స్పృహతో, వాస్తవికతలకు చాలా దగ్గరగా అనిపించింది. శ్రోతలు కొంతమంది ఆ కథానికలోని ,ఇతివృత్తానికి సంబంధించిన ప్రశ్నలను సంధించి తమ సందేహాలను తీర్చుకున్నారు. ముఖ్యంగా వివాహ వ్యవస్థ మీదనే కథ అంతా నడవడం గమనార్హం. నిజంగానే ప్రస్తుత వైవాహిక వ్యవస్థకు అద్దం పట్టినట్లుగానే వున్నది ఆ కథానిక. ఆ సభలో సాయిపద్మగారి భర్త ప్రజ్ఞానంద్ గారు, బాల్యమిత్రుడు గూడా విచ్చేశారు.
అటు తర్వాత గాన గంధర్వుడు కీ.శే .ఘంటసాల వేంకటేశ్వర రావు గారి పైన డా.అక్కిరాజు గారు, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి విరచితమైన చక్కని పద్యాన్ని ఆలపించారు. ఆ వెంటనే అథ్యక్ష స్థానంలో వున్న "వేణు ఆసూరి "గారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కవిత్వంలో,ముఖ్యం గా చిత్రగీతాలలోని సొగసులను,తామే స్వయంగా ఆలపిస్తూ, భిన్న కోణంలో వివరించి సభారంజనం గావించారు. మధ్యలో సినారె కవితా వైశిష్ట్యం గూడా వివరించారు తర్వాత చిన్న విరామం, ఆ తర్వాత కవి సమ్మేళనం జరిగింది. కవి సమ్మేళనంలో డా|| కె.గీత, కె.వరలక్ష్మి, షంషాద్, వేణు ఆసూరి మొ.న వారు పాల్గొన్నారు.
తర్వాత "ఇక్బాల్" గారు అరబిక్ భాషలోని సొగసులు,వాక్య నిర్మాణాలను గురించి క్లుప్తంగా వివరించారు." సాయి పద్మ" గారికి చిరు సన్మానంతో సభ ముగిసింది.

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/aug15/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/august/august_2015_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ గవాక్షం-34 (June,14-2015)


వీక్షణం
సాహితీ గవాక్షం-34
- ‘విద్వాన్’ విజయాచార్య.
ఈ నెల 6-14-15 ఆదివారం వీక్షణం సాహితీ సమావేశం ప్రముఖ “కౌముది” పత్రిక సంపాదకులు, కవి, రచయిత, విమర్శకులు శ్రీ కిరణ్ ప్రభ గారి యింట్లో సకల జన మనో రంజకంగా, సహృదయ హృదయాహ్లాదజనకంగా జరిగింది. కిరణ్ ప్రభగారు తమ ఆహ్వానంతో సభని ప్రారంభించారు. నేటి సమావేశానికి ’విద్వాన్’ శ్రీ తిరుమల పెద్దింటి నరసింహాచార్యులు గారు అధ్యక్షులుగా సమయానుకూల సమన్వయంతో, సందర్భోచితవ్యాఖ్యలతో సభని చక్కగా నిర్వహించారు. ఈనాటి సమావేశంలో ప్రముఖ రచయిత్రి, కేంద్రసాహిత్యఅకాడమీపురస్కార గ్రహీత శీమతి కాత్యాయని విద్మహే గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధాన ప్రసంగం చేసారు. వారు పరిశోధన చేసిన బుచ్చిబాబు “చివరకుమిగిలేది” నవలపై సమగ్రంగా, సోదాహరణ పూర్వకంగా ఉపన్యసించారు.


“అస్తిత్త్వ చైతన్య” రీతిలో సాగిన చివరకు మిగిలేది నవలలో ‘దయానిధి’ పాత్రలోని హేతుబద్ధత, వ్యక్తిగత విముక్తిని వివరిస్తూ,ఆ నవలలో ‘ ఫ్రాయిడ్’ తెల్పిన ‘ఈడిపశ్ కాంప్లెక్స్,’ సిద్ధాంతాన్ని వివరించి, ఆరాట పోరాటాలని, నైతికవిలువల్ని, ప్రజా స్వామిక భావాలని, ప్రపంచీకరణవిధానాన్ని శ్రోతల కనుల ముందు ఆవిష్కరించారు.
తదుపరి శ్రీ వేమూరిగారు, కొంతమంది శ్రోతలు అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలను యిచ్చి ప్రసంగాన్ని ముగించారు.కె.గీత “చైతన్య స్రవంతి” శైలినిగూర్చి ప్రశ్నించగా. కాత్యాయని విద్మహే గారు సోదాహరణంగా వివరించారు. శ్రీ కిరణ్ ప్రభ గారు బుచ్చి బాబు గారి సతీమణి శ్రీమతి సుబ్బలక్ష్మిగారి గొప్పతనాన్ని సభకి వివరించారు.
తరువాత శ్రీ క్రాంతి శ్రీనివాసరావుగారి ‘6th ఎలిమెంట్' కవితా సంపుటిని, ఆ కవితలపై డా|| ఆవంత్స సోమసుందర్ గారు వ్రాసిన ‘క్రాంతి గీతాలు’ అనే రెండు గ్రంథాలని ముఖ్య అతిథి ఆవిష్కరించి, వివరించారు. పిదప శ్రీ క్రాంతిశ్రీనివాస్ గారు గ్రంథ రచనా నేపధ్యాన్ని సభకి వివరించారు.
విరామంలో కిరణ్ ప్రభగారి సతీమణి శ్రీమతి కాంతి గారు తయారు చేసిన పసందైనవిందు అందరూ ఆనందంగా ఆరగించేరు. తదుపరి కవితాగానం. ముందుగా శ్రీ వేణు ఆసూరి గారు "త్రిగుణం" అనే కవితను చదివి అందరిని అలరించేరు. పిదప కె.గీతగారు "ఆకాశం – పర్వతం, అతడు-నేను" అనేకవితలో ధీరగంభీరముద్ర, కంటి చివరిభాష్పం, దూది కంబళి వంటి పదాలను గుప్పించి శ్రోతల ప్రశంసలనందుకొన్నారు. క్రాంతి శ్రీనివాసు గారు-“ఆమెకథ” అనే కవితను చదివి సభాసదుల మన్ననలు పొందేరు.

తదుపరి కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమం ఎప్పటి వలే సభాసదులను ఉత్సాహపరచింది. ఇక్బాల్ గారి,అరబిక్ వ్యాకరణ బోధన, అధ్యక్షుల వారి మలిపలుకులు, గీతగారి వందన సమర్పణతో కార్యక్రమం విజయ వంతంగా ముగిసింది.

ఈ నాటి సభలో ప్రముఖ కథా రచయిత్రి కె.వరలక్ష్మి గారు, శ్రీమతి టి.పి.విజయలక్ష్మి గారు, శ్రీమతి గునుపూడి అపర్ణ, శ్రీ సుబ్బారావు, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి కె.శారద, శ్రీ శివచరణ్, శ్రీమతి ఉమా వేమూరి, శ్రీ సుభాష్, శ్రీ పిల్లలమర్రి కృష్ణ కుమార్ మొదలగు ప్రముఖులు పాల్గొని, సభకి నిండుదనాన్ని కలిగించేరు. స్వస్తి.
----------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july2015/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/july/july_2015_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం సాహితీ గవాక్షం-33( May17,2015)

కబుర్లు - వీక్షణం
సాహితీ గవాక్షం-33
- ‘విద్వాన్’ విజయాచార్య.
ఈ మాసం 5-17-15 ఆదివారం వీక్షణం సమావేశం ఫ్రీ మౌంట్ లో శ్రీమతి తాయిబా మన్సూర్ గారి యింట్లో సంగీత, సాహిత్య సంగమంగా, నవరస రాగ భరితంగా సాగింది. శ్రీ ఇక్బాల్ గారు సభాధ్యక్షులుగా ఉండి, కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. నేటి సమావేశానికి ముఖ్య వక్త సినీ, దూరదర్శన్ నటులు, బహుగ్రంథ కర్త, సంగీత,సాహిత్యాలలో మేటి ,నాటకాలలో, భువనవిజయాలలో నటించి ప్రేక్షకులను తమ సంగీత మాధుర్యంలో ఓలలాడించిన ప్రముఖ నటులు, కవి అయిన శ్రీ అక్కిరాజు.సుందర రామకృష్ణ గారు “ మణి ప్రవాళ “ శైలిలో ఉన్నపద్యాలను పాడి,ఆ పద్యాలలో ఉన్న సౌందర్యాన్ని సభకు వివరించి శ్రోతలను ఆనంద పరవశులను గావించేరు. రామకృష్ణ గారు “శారదా త్రిశతి” అనే అధిక్షేప కావ్యాన్ని రచించి, “అధిక్షేప కవితా చంద్ర” అనే బిరుదును పొందిన వైనాన్ని సభకుతెల్పేరు. ధూర్జటి, జాషువా కవుల పద్యాలను వినిపించి, వివిధ రకాల నవ్వులను వివరించి, పౌరాణిక నాటకాలలో ప్రసిద్ధి చెందిన “జండాపై కపిరాజు” పద్యంపాడి శ్రోతలను అలరించారు. తదుపరి సాయిబా గారు పసందైన విందును ఏర్పాటు చేసారు. .
తదుపరి ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి గారి ‘రిక్షా’ అనే కథను వారి కుమార్తె కె. గీతగారు భావయుక్తంగా చదివి వినిపించగా, రచయిత్రి కథా నేపధ్యాన్నివివరించారు.
తదుపరి దీనిపై సభ్యుల చర్చ జరిగింది. పిదప శ్రీ టి.పి.యన్. ఆచార్యులు గారు “శ్రీకాకుళం జిల్లా మాండలిక భాషలో” రచించిన ‘ స్వప్న సత్యం’ అనేకవితను చదివి శ్రోతల ప్రశంసలను అందుకొన్నారు. డా|| కె.గీతగారు ‘ప్రపంచం కన్నా పాపాయి గొప్పది’ కవితలో పాపాయి కి, తల్లికి ఉన్న అనుబంధాన్ని,పాపాయి బాల్య చేష్టలను కళ్ళకు కట్టినట్లు వర్ణించి సభికుల కరతాళ ధ్వనులనందుకొన్నారు.
పిదప శ్రీ వేణు ఆసూరిగారు ‘ త్రోవ తెలియని బాటసారి’ కవిత చదివి ఆహూతులను అలరించారు. ఈ సమావేశంలో బర్కిలీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతులైన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావుగారికి శ్రీమతి ఆకెళ్ళ జానకి గారు వారి తల్లిగారి ద్వారా మూడు వేల డాలర్ల చెక్కును తెలుగు శాఖాభి వృద్దికి వితరణగా అందించారు.
అటుపై శ్రీ కిరణ్ ప్రభగారు ప్రముఖ హాస్యనటుడు “ చార్లీ చాప్లిన్” అపూర్వమైన జీవిత విశేషాలను, ప్రముఖతెలుగు సినిమా హాస్య నటి ‘సూర్యకాంతం’ గారి జీవితం లోని వితరణ గుణాన్ని సభకు వివరించి, క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించిరి. చివరగా అధ్యక్షులవారి మలిపలుకులతోను, అరబిక్ వ్యాకరణంలోని అక్షరోత్పత్తి స్ధానాల వివరణతో, గీతగారి వందన సమర్పణతో నేటి సమావేశం దిగ్విజయంగా ముగిసింది.
ఈ సమావేశంలో శ్రీమతి గునుపూడి అపర్ణ, శ్రీ సుబ్బారావు, శ్రీమతి ఆకెళ్ల వరలక్ష్మి, శ్రీమతి ఇక్బాల్, శ్రీ లెనిన్, శ్రీ వేమూరి, శ్రీమతి ఉమా వేమూరి, శ్రీమతి కాంతి కిరణ్ తదితర సాహిత్యాభిలాషులు పాల్గొన్నారు.
--------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/june15/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/june/june_2015_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ గవాక్షం - 32 (Apr,19-2015)



వీక్షణం సాహితీ గవాక్షం - 32


-‘విద్వాన్’ విజయాచార్య

ఈ నెల 4-19-15 ఆదివారం ‘ వీక్షణం’ సమావేశం ప్రముఖ కథా రచయిత ‘ బి.పి. కరుణాకర్’ గారి అమ్మాయి గారి ఇంట్లో రస రమ్య భరితంగా, కథా కథన కుతూహలంగా జరిగింది. ఈ సమావేశానికి శ్రీ ‘విద్వాన్’ టి.పి. యన్. ఆచార్యులు గారు అధ్యక్ష స్థానాన్ని అలంకరించి, సభా కార్యక్రమాలు నిర్వహించారు.

ముందుగా శ్రీ కరుణాకర్ గారు వారి నాలుగు కథా సంపుటాలని సభకి పరిచయం చేసి, రచనా నేపధ్యాన్ని సోదాహరణంగా వివరించేరు. నేటి యాంత్రిక జీవితంలో పుస్తకం చదవడం గొప్ప ఉపశమనం అని తెలిపి “ రెల్లు” కథలోని ‘సరోజని, రాజ రత్నం ‘ పాత్రల చిత్రీకరణలో రచయిత తన అంతరంగ కథనాన్ని ,మానసిక విశ్లేషణల్నిశ్రోతలకి వివరించారు. శ్రీ కరుణాకర్ గారు ”రెల్లుపూల”ని జీవితానికి అన్వయింపజేసి, సమన్వయ పరచిన విధానం శ్రోతల్ని ఆలోచింప జేసింది. అట్లే ‘ అంబాలీస్' అనే ఆటని తమ కథల పుస్తకానికి పేరుగా పెట్టడం క్రొత్తగా ఉంది.
ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి వరలక్ష్మి గారు కరుణాకర్ గారి కథలలోని ఆర్ద్రత, శైలి గొప్పగా ఉంటుంది అని కొనియాడగా, కరుణాకర్ గారు వరలక్ష్మిగారి కథలు నూతనత్వం తో హృదయానికి హత్తుకొనే విధంగా ఉంటాయని తెలపడం నేటి సభలో ప్రత్యేకత. ఇంకా ‘కౌముది’ అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభగారు కరుణాకర్ గారి కథలలోని రచనా విన్యాసాలని సోదాహరణంగా వివరించారు. డా|| కె. గీతగారు కరుణాకర్ గారి ‘ఎదురు నీడ’ ‘పొగ’ కథలను చదివి సభికులను అలరించారు.

తదుపరి జరిగిన చర్చలో శ్రీ ఇక్బాల్ గారు, మురళి గారు, లెనిన్ గారు అడిగిన ప్రశ్నలకు రచయిత చక్కని సమాధానాలని చెప్పి ,’కన్నీటి నురుగు’ కథలోని రిక్షావాడు, సావిత్రి పాత్రల స్వభావాలని, కథముగింపు లోని కొస మెరుపుని చక్కగా వివరించారు. ఆపై అధ్యక్షులు ఆచార్యులు గారు “ నిత్య వ్యవహారంలో మనం ఉదహరించే సంస్కృత లోకోక్తులు” ఆలస్యం అమృతం విషం, ధనమూలమిదం జగత్, నభూతో న భవిష్యత్ వంటి వాక్యాల పూర్వాపరాలని అద్భుతంగా విశదీకరించి శ్రోతలని అలరింప జేసారు.
కొద్దిసేపు అల్పాహార విరామం తరువాత. కిరణ్ ప్రభగారు నిర్వహించిన ‘సాహీతీ క్విజ్ ‘ సభను రంజింప జేసింది.
తదుపరి గీతగారు చదివిన "పుట్ట గొడుగు మడి" కవిత -ప్రతీకాత్మ స్వరూపంగా,భావ గాంభీర్యంగా ఉండి శ్రోతల మన్ననలను పొందింది. ఇంకా ‘విద్వాన్’ విజయలక్ష్మిగారు ‘ఉగాది’ కవితలో త్రికాలాలని, త్రిగుణాలని, త్రిమూర్తి స్వరూపాన్ని, ప్రకృతి తత్వాలని విపులంగా వర్ణించి సభికులను ఆనందింప జేశారు. శ్రీ ఇక్బాల్ గారు అరబిక్, తెలుగు భాషల వ్యాకరణాన్ని సభకు క్లుప్తంగా పరిచయం చేసారు.
గీతగారి వందన సమర్పణతో నేటి సభ దిగ్విజయంగా ముగిసింది.
--------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2015/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/may/may_2015_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ సమావేశం-31(Mar,15-2015)



వీక్షణం సాహితీ సమావేశం-31

 

వీక్షణం 31 వ సాహితీ సమావేశం పాలో ఆల్టో లోని శ్రీమతి గునుపూడి అపర్ణ గారింట్లో జరిగింది.
వేమూరి వేంకటేశ్వరరావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశం లో ముందుగా రిటైర్డ్ జర్నలిస్టు శ్రీ పిల్లలమర్రి వేణుగోపాల స్వామి గారు జర్నలిజంలో తన అనుభవాల్ని, జ్ఞాపకాల్ని పంచుకున్నారు. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగినందు వల్ల ఇంజనీరింగు చదువుని మధ్యలోనే ఆపేసి, స్వస్థలమైన తెనాలిలో స్థిరపడ్డారు గోపాలస్వామి గారు. మిత్రుని వల్ల జర్నలిజంతో పరిచయం ఏర్పడిందనీ, మొదట్నించీ ఆంగ్లభాష పట్ల మక్కువ వల్ల జర్నలిజంలో అతి వేగంగా రాణించ గలిగానన్నారు. దాదాపు 40 సం||రాలు జర్నలిస్టుగా కొనసాగారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ కు అధ్యక్షులుగా 3 సార్లు ఎన్నికయ్యారు.
ఎమర్జన్సీ సమయంలో ఘాటుగా రాసిన ప్రభుత్వ వ్యతిరేక రిపోర్టు ఎన్నో మన్ననలు పొందిందని అన్నారు. ఆంధ్ర ఉద్యమ సమయంలో అంతటా బందు సమయంలో వార్తల సేకరణ ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. కొన్ని సార్లు అసలు వార్తలు మరుగున పడి, అసత్య వార్తలు ఎలా ప్రచారమవుతాయో వివరించారు. చుండూరు హత్య గురించి రిపోర్టు రాయలేని పరిస్థితుల్ని వివరించారు. జర్నలిజం మీద ఫ్యాక్షనిజం ప్రభావం గురించి చర్చించారు.
తర్వాత శ్రీమతి మద్దూరి లక్ష్మి 'కవన శర్మ" గారి సాహిత్య పరిచయం చేసారు. వారు రాసిన బ్రెయిన్ డ్రెయిన్, సంఘ పురాణం, సైన్స్ నడిచిన బాట వంటి రచనల్ని గురించి, బెంగుళూరులో తెలుగు విజ్ఞాన సమితి, మేలు కలయిక వంటి సంస్థల ద్వారా కవన శర్మ గారి సాహితీ సేవని వివరించారు.ఈ సందర్భంగా వేమూరి కవన శర్మ గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత గునుపూడి అపర్ణగారి తొలి కథా సంపుటి "ఘర్షణ" ఆవిష్కరణ ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి గారి చేతుల మీదుగా జరిగింది.
ఆ తర్వాత కథా పఠనంలో భాగంగా అపర్ణ గారు "జాతక చక్రం" కథను చదివి వినిపించారు.
పిల్లల పెంపకం విషయంలో ఎలా ప్లాన్ చేసినా చివరికి ఎలా జరగాలనుందో అదే జరుగుతుందనే విషయాన్ని చక్కగా వివరించిన కథ ఇది.
కథా ప్రారంభంలో ఫైనాన్షియల్ ప్లానింగుకి సంబంధించిన సంఘటనని వివరించడం రచయిత్రి కథా రచనా ప్రతిభ కు తార్కాణం.
తేనీటి విరామం తర్వాత ఇక్బాల్ గారి అరబిక్ వ్యాకరణ సిరీస్ లో భాగంగా అరబిక్ నామవాచకాలు, పదాల భేదాలు వివరించారు.
కవిసమ్మేళనంలో డా|| కె.గీత ఉగాది సందర్భంగా "ఉగాది జ్ఞాపకాలు" కవితను వినిపించారు.
శ్రీ వేణు ఆసూరి "శ్రీ శ్రీ కవిత్వంలో పదబంధాలు", "శివ దండకం లో పదబంధాలు" అనే విషయాలను చిన్న ఉపన్యాసంలో వివరించారు. శ్రీ శ్రీ కవిత్వంలో "నిలకడ గల క్రొక్కారు మెరుపు", "సదమన మదగజగమన" వంటివి, దండకంలో "జయత్పదభ్రవిభ్రమత్" వంటివి ఉదహరించారు.
ఆ తర్వాత రాయసం కృష్ణ కాంత్ చక్కని గాత్రంతో పాటలు ఫాడి అందరినీ అలరించారు.
సాహితీ క్విజ్ తో శ్రీ కిరణ ప్రభ సభను దిగ్విజయంగా ముగించారు.
----------------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/april15/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/april/april_2015_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ సమావేశం-30 (Feb,15-2015)



వీక్షణం సాహితీ సమావేశం-30

-

ఈ నెల వీక్షణం సాహితీ సమావేశం తాటిపామల మృత్యంజయుడు గారింట్లో ఫిబ్రవరి 15న జరిగింది. ఈ సమావేశానికి మృత్యుంజయుడు గారే అధ్యక్షత వహిస్తూ అందరికీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి గారిని కథా రచన విశ్లేషణ, స్వీయ కథా పఠనం చేయమని అహ్వానించారు. కె. వరలక్ష్మి మాట్లాడుతూ తన కథల్లో పాత్రలన్నీ తను పుట్టి పెరిగిన ఊరులో చుట్టూ నిత్యం కనిపించేవే అన్నారు. మొదటి కథ "గాజు పళ్లెం" గురించి మాట్లాడుతూ ఆ కథ రంజని అవార్డు పొందిందని, అనేక సంకలనాల్లో చోటు చేసుకుందని చెప్పారు. ఇదొక పల్లెటూరి అమ్మాయి కథ.



ఆ తర్వాత నించి రాసిన అనేక కథలకు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయని చెప్తూ తన కథల్లోని కొన్నిటి ఇతివృత్తాలను, కథా సంవిధానాన్ని వివరించారు. మంత్రసాని కథ గురించి చెప్తూ ఒకప్పుడు పురుడు పోసే ఎరుకల సాని జీవన విధానాన్ని, అన్యాయాల్ని వివరించారు.

ఇటీవల రాసిన "ఆ నాటి వాన చినుకులు" కథలో ఎప్పుడో విడిపోయిన ప్రేమికుల కథ ద్వారా జ్ఞాపకాల్ని పదిల పరుచుకోవడమే ఆనందదాయకమనే విషయాన్ని చెప్పారు. కథలకు ముగింపు విషయాలు చెప్తూ ఒక్కోసారి ముగింపు ముందే తడుతుందని, ఒక్కోసారి ముగింపు కోసం చాలా రోజులు ఆలోచనల్లో గడపాల్సి వస్తుందని అన్నారు.


స్త్రీలకు సమాజం అంతా శత్రువే అన్నారు. చేరా తనని ఉద్దేశించి.. "స్త్రీల సమస్యల గురించి పట్టించుకోవడమే కాదు, ముఖ్యంగా గ్రామీణ స్త్రీల గురించి రాసిన ఏకైక స్త్రీ వాద కథా రచయిత్రి అని" పేర్కొన్నారని అన్నారు. అందుకు ఉదాహరణగా "సువాసినీ పూజ" కథను వివరించారు.

గ్రామీణ నేపథ్యంలో మట్టి, బంగారంతో సమానమయ్యే ఘటనల్ని వివరించే "మట్టి బంగారం' కథ, ఇప్పటి ప్రపంచంలో మనిషి ఇమడలేక పోవడాన్ని వివరించే "కలకానిది విలువైనది" కథలు అందరినీ ఆకట్టుకున్నాయి. చివరగా వారి కుమార్తె డా|| కె.గీత కథా చదివిన వరలక్ష్మి గారి కథ "శివంగి" అంతర్జాతీయ స్థాయి కథ అని సభలో అందరూ కొనియాడారు.


ఆ తర్వాత వరలక్ష్మి గారి నాలుగవ కథా సంపుటి "క్షతగాత్ర" పుస్తకాన్ని శ్రీమతి గునుపూడి అపర్ణ ఆవిష్కరించగా, శ్రీ మృత్యుంజయుడు కథా పరిచయం చేసారు.

చక్కని విందు భోజనపు విరామం తర్వాత కవి సమ్మేళనంలో శ్రీ వేణు ఆసూరి అంతర్జాతీయ సమస్యను సున్నిత బంధాలతో పోలుస్తూ కవితను చదవగా, డా|| కె.గీత " మా మధ్య వేలైంటైన్స్ డే " కవితను వినిపించారు.

శ్రీ లెనిన్ మహా భారత తత్త్వ వివేచన మరో పది నిమిషాలు సాగిన తర్వాత, శ్రీ కిరణ్ ప్రభ జనరంజకంగా క్విజ్ నిర్వహించడమే కాకుండా, అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తూ శరత్ బాబు జీవితాన్ని గురించి అత్యంత ఆసక్తి దాయకంగా వివరించారు. అత్యంత కష్టాలతో గడిచిన శరత్ బాల్యం, యౌవనం, జీవితంలో అన్నీ కోల్పోయిన అభాగ్యుడిగా మిగిల్చిన విధి వంచన, తిరిగి కథా రచయితగా ఆయన నిలదొక్కుకోవడం,
అత్యంత స్ఫూర్తిదాయకమైన రచయితగా మహా నిష్క్రమణను వివరించారు.

ఈ సభకు శ్రీమతి శారద, శ్రీ నరసింహారావు, శ్రీమతి జయమాల, శ్రీమతి మృదుపాణి, శ్రీమతి స్వప్న, మొదలైన వారు హాజరై సభను జయప్రదం చేసారు.

చివరగా ఇటీవల దివంగతులైన ప్రసిద్ధ నవలా రచయిత శ్రీ కె. కేశవరెడ్డి గారికి నివాళి అర్పించి సభను ముగించారు. 
----------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/march15/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/march/march_2015_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సమావేశం- 29(Jan,18-2015)

కబుర్లు

వీక్షణం – సమీక్షణం


వీక్షణం 29వ సాహితీ సమావేశం


-‘విద్వాన్’ విజయాచార్య.

వీక్షణం 29వ సాహితీ సమావేశం శ్రీ వేణు ఆసూరి గారి ఇంట్లో ఈ నెల 18న రస రాగ రంజితంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రఖ్యాత సినీ, నాటక, నవలా, కధారచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు విచ్చేశారు.

నేటి సమావేశానికి శ్రీ తాటిపాముల మృత్యుంజయడు గారు అధ్యక్షత వహించి సభని చక్కగా నడిపించేరు. ముందుగా శ్రోతలు అడిగిన సినిమా నాటక రంగాలకి సంబంధించిన ప్రశ్నలకి పార్థసారథిగారు యుక్తియుక్తంగా, సవివరంగా సమాధానాలు చెప్పి, సభని ఉత్కంఠభరితం గావించేరు. పూర్వ కాలం సినిమాలకి, ఇప్పటి సినిమాలకి గల తారతమ్యాలని, విలువలని, విపులంగా విశదీకరించేరు. రచయితకి నాటకరంగంలో ఉన్న తృప్తి, స్వేచ్ఛ సినిమారంగంలో ఉండదని తెల్పి, తమ అనుభవాలను,రచనా వ్యాసంగాన్ని, సభకి చక్కగా వివరించేరు.

తన మొదటి సినిమా “ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం” గురించి చెబుతూ “విజయవాడ లో హాస్య నాటికల పోటీ లో ప్రదర్శించిన “పూజకు వేళాయెరా” నాటిక ను రేలంగి నరసింహారావు గారు చూసి, నాటికలోని సన్నివేశాలను “ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్“ కు తీసుకున్నారన్నారు. అంతే గాక ఆయన తీసిన తరువాతి సినిమా “ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం” కు డైలాగ్ రైటర్ గా అవకాశం ఇచ్చారన్నారు.
సినిమా కు కథ వేరు, స్క్రీన్ ప్లే వేరని చెప్పారు. సినిమా కథ రాయడం లో ఉన్న కొన్ని ఇబ్బందుల్ని చెప్తూ, సినిమా కథలకు ముందుగా హీరో ఇమేజ్ ను గుర్తుపెట్టుకోవలసిందని,
కామెడీ ఎప్పటికప్పుడు కొత్తగా, వైవిధ్యభరితంగా ఉండాలని అన్నారు. ఇక స్క్రీన్ ప్లే అనేది ఒక్కొక్క స్క్రీన్ ను పేర్చుకుంటూ వెళ్లడమని అన్నారు.
సినిమా కథలకు ఫార్ములా లు ఉండవని, డైరక్టర్ స్టైలు లు బట్టి మలచబడతాయని అన్నారు. అందుకు ఉదాహరణగా ఇద్దరు ముగ్గురు దర్శకుల పద్ధతులు హాస్య స్ఫోరకంగా చెప్పి అందర్నీ కడుపుబ్బ నవ్వించారు.ముందుగా తన సినిమారంగానుభావాల్ని క్లుప్తంగా వివరించి తరువాత సభలోని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలనిచ్చారు శంకరమంచి.
“నాటకాలలో చెయ్యి తిరిగిన రచయిత అయిన మీ నాటకానుభవం సినిమా రచనలో ఉపయోగపడిందా?” అనే ప్రశ్నకు “నాటక రచనకు, సినిమాకు చాలా దగ్గర సంబంధం ఉందని, ఏ పాత్ర ఎంత వరకు ఉండాలి అనే తూకం, సీన్ నిడివి, పాత్రత, ఔచిత్యం వంటివి, డైలాగులలో పదును నాటక రచనలో తెలుస్తాయన్నారు. ముఖ్యంగా కామెడీ నాటక రచయితగా తనకు సినిమా పెద్దగా కష్టమనిపించలేదన్నారు.”
“రచనలు చేయడానికి ప్రభావితమయిన ప్రాచీన, అర్వాచీన సాహిత్యం గురించి” అన్న ప్రశ్నలకు, “ రచనా ప్రస్థానాన్ని వివరించమన్న” ప్రశ్నకు“తనకు ప్రాచీన సాహిత్యం చాలా తక్కువ తెలుసనీ, కానీ ఆధునికుల్లో రావిశాస్త్రి, తిలక్, శ్రీపాద మొ||న వారి ప్రభావం ఉందన్నారు. చిన్న తనం నించి తనకున్న సినిమా అభిరుచి బాగా దోహదపడిందన్నారు.
ముఖ్యంగా “ఆదుర్తి సుబ్బారావు” గారి తో కలిసి పనిచేయాలని ఆకాంక్ష ఉండేదన్నారు. కానీ ఫామిలీ పరిస్థితుల దృష్ట్యా సెంట్రల్ గవర్న్ మెంట్ ఉద్యోగి అయ్యినా ఆకాంక్ష సినిమా మీదే ఉండేదన్నారు. ఆదివిష్ణు గారి పరిచయం ఒక మలుపు. ముందు నా ఆలోచనలని కాగితమ్మీద పెట్టమని సలహా ఇచ్చారు. అలా కథా రచయితనయ్యాను. అక్కణ్ణించి నవలలు, ఆ తర్వాత నాటక రచయిత గా మారానన్నారు.
“పూజకు వేళాయెరా“ నాటికకు ప్రథమ బహుమతి లభించిన సందర్భంలో నాటక ప్రదర్శనలో పాఠకుడికి, రచయితకు ఉన్న ప్రత్యక్ష సంబంధం బాగా నచ్చడం వల్ల నాటక రచయిత గా స్థిర పడ్డానన్నారు. కామెడీ నాటకాల ప్రయోగాల్లో భాగంగా రెండు గంటల పాటు తెర వేయకుండా, లైట్లు ఆర్పకుండా ప్రదర్శించిన “దొంగల బండి” నాటకం ఒక రికార్డు అన్నారు.
“నాటక రచయితగా మొత్తం నా రచన అని కలిగే సంతృప్తి, సినిమా రచయితగా కలుగుతుందా?” అనే ప్రశ్నకు
“తెలుగు లో ఒకప్పుడు లేదని తొంభైలలో ప్రారంభమయిందని, ఒక రచయిత కంటే ఎక్కువ మంది రచయితలు ఇలా ఒక సినిమాకు పనిచేసే సంప్రదాయాన్ని క్రమంగా తర్వాతి వారు అనుసరించి, ఇక అదే పధ్ధతి ని కొనసాగించారన్నారు. అయితే ఇందు వల్ల ఎవరికీ వారు గంగాళంలో పాలు పొయ్యమంటే అంతా నీళ్లు పోసిన చందమయ్యింది ఇప్పటి సినిమాకథ అన్నారు.”
ఇలా దాదాపు గంట పైనే అన్ని ప్రశ్నలకూ ఎంతో ఓపిగ్గా సమాధానాలనిచ్చారు.
తదుపరి వేణు, విజయా ఆసూరి దంపతులు ఏర్పాటు చేసిన, షడ్ రుచులతో కూడిన విందుని అందరూ స్వీకరించిన పిదప కవిసమ్మేళనం జరిగింది. ముందుగా వేణుఆసూరిగారు “గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు” పంపిన “సృష్టి” కవిత చదివి, పిదప స్వీయరచన ప్రకృతి , ప్రియురాలు వర్ణనలతోకూడిన కవిత చదివి వినిపించేరు. పిదప డా|| కె. గీత ఇరవై వసంతాల కుమారుడి పుట్టిన రోజున అతడి బాల్యాన్ని గుర్తు చేసుకొంటూ మాతృ మూర్తి మనస్సులో కలిగే భావవీచికల్ని విశదీకరించే అద్భుతమైన “అబ్బాయి ఇరవయ్యవ పుట్టిన రోజు” కవిత చదివి శ్రోతలని అలరింపచేసారు. తదుపరి వరకూరు గంగా ప్రసాద్ గారు తమ కవిత ‘వందేమాతరం’ ను పాటగా పాడి వినిపించేరు. శ్రీచరణ్ గారు పద్యాలలో అయ్యప్పని, సంక్రాంతిని కొనియాడేరు. ఆ పై ‘విద్వాన్’ విజయలక్ష్మిగారు సంక్రాంతి లక్ష్మిని సవివరంగా వర్ణిస్తూ చదివిన కవిత శ్రోతల్ని అలరించింది. అలాగే శ్రీ టి.పి.యన్. ఆచార్యులు గారు చదివిన ‘ప్రకృతి’ కవిత సభారంజకంగా సాగింది.కవి సమ్మేళనం తర్వాత శ్రీ ఇక్బాల్ గారు చదివిన “స్వర్గీయ యన్.టి. రామారావు గారు రచించిన రావణుని ప్రాముఖ్యతను వివరించే వ్యాసం” శ్రోతల్ని అలరించింది.


అధ్యక్షులవారి ప్రకటనతో శ్రీ కిరణ్ ప్రభ గారు “సినిమాక్విజ్” కార్యక్రమాన్ని చాకచక్యంగా నిర్వహించేరు. మల్టిపుల్ ఛాయిస్ లు క్విజ్ లో కొత్తగా ప్రవేశపెట్టడం వల్ల సభికులందరూ ఈ సినిమా క్విజ్ కార్యక్రమంలో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. చివరగా గీత గారి వందన సమర్పణతో నేటి సమావేశం దిగ్విజయంగా ముగిసింది. ఈ సభలో కె.శారద, సత్యనారాయణ దంపతులు, వంశీ, శంషాద్, అహ్మద్
మొ||న స్థానిక ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు.
--------
http://www.koumudi.net/Monthly/2015/february/feb_2015_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb15/veekshanam.html