Monday 28 December 2015

వీక్షణం సాహితీ గవాక్షం -38 (Oct 11, 2015)

వీక్షణం సాహితీ గవాక్షం -38 
                                       -- పెద్దు సుభాష్

వీక్షణం 38వ సమావేశము మన్మథ నామ సంవత్సరము, భాద్రపద మాసం, బహుళ పక్ష చతుర్దశి  నాడు, అనగా అక్టోబర్ 11, 2015 న పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్, శాంత గారి స్వగృహమున జరిగినది.  కృష్ణకుమార్ గారు "మీ అందరి రాకతో మా ఇల్లు పావనమైనది" అనే ఆహ్వాన వ్యాఖ్యల తరువాత, డా ॥ కె .గీతా మాధవి గారు సభ ఆరంభించి, ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు గారిని సభాధ్యక్షత వహించ వలసినదిగా కోరారు.
సభాధ్యక్షులవారి ప్రారంభోపన్యాసము: "ఇచట పుట్టిన చెట్టు కొమ్మైనా చేవ గలది కాగలదు సరిగమల త్రోవ అన్నట్టు, ఈ సభ కల్పతరువు.
కావ్యము అంటే విశ్వానికి ప్రయోజనము కలిగించేది. కవి ప్రయోజనము హృదయ స్పందన. గ్రంథము అనగా గుచ్చబడినది. మనకి మొదటి గ్రంథము వాల్మీకి రామాయణము. అందులోని మొదటి శ్లోకం -
  మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః  |
  యత్ క్రౌంచమిథునాదేకం అవధీః కామమోహితం  ||

ఈ శ్లోకము సూచ్యార్ధ సూచిక. అనగా, రాబోవు కథలోని విషయాలను సూచిస్తున్నది. మా అనగా మహా లక్ష్మి, నిషాదుడు విష్ణువు. రావణుడు మరణిస్తే శోకించిన మండోదరికి, మగ క్రౌంచ పక్షి మరణిస్తే శోకముతో నిండిన ఆడ క్రౌంచ పక్షి కథ ఒక సూచిక.

అలాగే, పోతన భాగవతములోని మొదటి పద్యము "శ్రీ కైవల్య పదంబు చేరుటకునై ..." ఈ పద్యములో, "మహానందాంగనా డింభకునకు" అనగా కృష్ణుడు. "కృష్" అనే ధాతువుకు అర్ధము అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేవాడు అని. ఒక వంద ఆనందాలు కలిస్తే దేవానందము. అటువంటి వంద దేవానందములు కలిస్తే గంధర్వానందము. వంద గంధర్వానందాలు కలిస్తే యక్షానందము. వంద యక్షానందాలు కలిస్తే ఒక బ్రహ్మానందము. అటువంటి వంద బ్రహ్మానందాలు కలిస్తే ఒక మహానందము. అంతటి ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణుడు."

తదుపరి కార్యక్రమము సన్మాన సభ.
అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, తమ తల్లిదండ్రుల స్మారకముగా పలువురిని సన్మానిస్తూ చేసిన ప్రసంగము:
మా తండ్రి గారు 1991 సెప్టెంబరు 14.వ.తేదీన పరమపదించారు. ఆ మరుసటి సంవత్సరం నుంచి, ప్రముఖ వ్యక్తులకు (ఒక్క రాజకీయ వ్యక్తులకు దక్క),  మిగతా రంగాలలో వున్న చాలా మంది వ్యక్తులకు, మా తండ్రి గారి పేరున సన్మాన సత్కారాలను చేస్తూనే వస్తున్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయ, కవిత్వ, సంగీత, నాటక రంగాలలోనున్న వారిని సన్మానిస్తూ  వస్తున్నాను. ఈకోవలో స్త్రీ పురుషులు ఇరువురూ వున్నారు. మా నాన్నగారి పేరున 2007.సం.న నా జన్మస్థానమైన, గుంటూరు జిల్లా నరసరావు పేటలోనే  "భువన చంద్ర ఆడిటోరియంలో "మూడు రోజులు ,ఆయన గారి "శత జయంతి "ఉత్సవాలు  జరిపాను. ఆ సందర్భంగా మూడు రోజులూ, నటులకు, కవులకు, గాయకులకు, ఆయన గారి ప్రముఖ శిష్యులకు సన్మానాలు చేశాము. అది చాలా పెద్ద కార్యక్రమం. అప్పటికి మా నాన్న గారి శిష్యులు, ఆయనను ఎరిగిన వారూ చాలా మంది సజీవులు. ఇక మా అమ్మ గారు 2002.సం జనవరి14వ తేదీన పరమ పదించారు .అదే సంప్రదాయంలో అమ్మగారి పేరు మీద గూడా  చేస్తూనే వున్నాను. నా ప్రతి రచనలో మా అమ్మా, నాన్నల ప్రసక్తి  గూడా మీరు జాగ్రత్తగా చదివితే కనిపిస్తుంది. ఇదే గాక అక్కిరాజు ఆర్ట్ అనే సంస్థ నాకు ఒకటి వున్నది. ఆ సంస్థ తరఫున గూడా తల్లిదండ్రులను స్మరిస్తూనే కార్యక్రమాలు చేస్తుంటాను. ఆ క్రమములో ఈ సంవత్సరము ఇక్కడ అమెరికాలో, ముగ్గురికి సన్మానం చేస్తున్నాను.


కీ. శే. అక్కిరాజు "రామయ్య పంతులు" గారి పురస్కారములు
మొదటివారు బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వేంకటశాస్త్రి దంపతులు. శాస్త్రిగారు అమెరికాలోని పలు నగరములలోని గుళ్లలో పూజారిగా చేసారు. ప్రస్తుతము మిల్పిటాసులోని సత్యనారయణ స్వామి గుడిలో పురోహితులు.

సీ. గణన కెక్కిన వేద ఘన పాఠియును
       శాస్త్ర పారంగతుండు "శ్రీ మారెపల్లి"
    మోహన శ్రీ రాగ అహిరి పాడంగ
       సార యశుండు మా "మారెపల్లి"
    చెలికాండ్ర కరయంగ తలలోని నాల్కయై
       ధారుణి వర్తిల్లు "మారెపల్లి"
    నియమ వ్రతుండును, నిరుపమ గుణుడును
       మారారి కిని బంటు "మారెపల్లి"

    వసుధ శిష్యాళి పట్ల వాత్సల్యయుతుడు
    చాల సంస్తుతు లవి గొన్న సద్గురుండు
    చెప్పగను "విక్రమార్కుండు" జీవితాన
    మాన్య మిత్రుండు మహికెల్ల "మారెపల్లి"

పురుస్కారమందుకుంటున్న రెండవవారు, శ్రీ చరణ్ దంపతులు

సీ. వేద వాఙ్మయ నిధి, నాద విద్యాంబుధి
         కర్మఠుడై భువి గ్రాలు వాడు
    సంస్కృతాంధ్రములందు, సమతూకమౌ గతి
         కవిత లల్లెడి నేర్పు గలుగు వాడు
    మాన ధనుడె గాదు, మంజు భాషణుడౌచు
         పరహిత మతి యౌచు బరగు వాడు
    సద్ధర్మ యుతుడౌచు, సద్గోష్ఠి రతుడౌచు
         సలలిత భావాల మెలుగు వాడు

    ఉన్నతోద్యోగి యయ్యును ఉల్లము నను
    అరయ "నివ్వరి"ముల్లంత యైన గూడ
    గీర శూన్యమ వరలు సత్కీర్తి ధనుని
   "పాలడుగు వంశ వార్ధిని" వరలు శశిని
    సఖుని శ్రీ చరాణాఖ్యు నే సన్నుతింతు!

నా గురువు శ్రీ దివాకర్ల వేంకటావధాని గారు. శ్రీ బాబా సాహెబ్ గారికి కూడా వారే గురువులు. బాబా సాహెబ్ ముంతాజ్ దంపతులుకు పురస్కారము --


శా. చింతింపన్ బుధ వంద్య పల్కు చెలియౌ శ్రీ వాణినిన్ భక్తి, చే
    మంతుల్, బంతుల పూజ సల్ప, గుణ సమ్మాన్యుండ ఈ "సాహెబున్
    ముంతాజ్ బేగమ"వీవు, కోర్కె మెయి నీ భూమీస్థలిన్ బుట్టి, కొం
    డంతల్ కీర్తి గడించి నారు, మిము కొండాడంగ నా శక్యమా?!
సన్మానము తరువాత శ్రీమతి ముంతాజ్ గారు శాకుంతలములోని పునస్సమాగము నుండి కొన్ని పద్యాలు వినిపించారు. అవి:

1. కణ్వ మహర్షి శకుంతలను ప్రయాణము చేయుటకు సిద్ధం  కమ్మని చెపుతూ "ఎట్టి సాధ్వులకును పుట్టినింట ఏడుగడ ...", ఏడుగడ అనగా ఏడు విధములైన రక్ష

2. శకుంతల దుష్యంతుని సభలో తనని పునఃపరిచయము చేసుకుంటూ "జననాథ వేట నెపమున .."

3. దుష్యంతుడు గుర్తుపట్టక, ఎచటనుండి వచ్చితివో, అచటికే వెడలుము అని చెప్పిన, శకుంతల "విమల యశోనిధి, పురుష పృథ్వీ .."

మొదలగునవి.

సభాధ్యక్షులు ఆచార్యులుగారు భరతుని గురించి చెపుతూ, "భారత దేశము పేరు భరతుని నుంచి వచ్చినదని ఒక నానుడి. "భ" అనగా సత్యము, "రత" అనగా రమించువారు. భారతీయులు అనగా సత్యమును రమించువారు, లేక కోరువారు అని కూడా అర్ధముంది" అని వివరించారు.


కవి సమ్మేళనము:

1. రావి రంగా రావు గారు: నేను ప్రపంచమంతా చూసాను. ఇప్పుడు మనవడిలో ప్రపంచాన్ని చూస్తున్నాను. ఈ కవిత వాడి గురించే

కవిత  "తల్లి ప్రేమ"

"పిల్లాణ్ణి
నిద్రపుచ్చటానికి
లైటు తీసేస్తాం,
కాలం కూడా అంతే,
సూర్యుణ్ణి తీసేస్తుంది."

2. శ్రీ చరణ్ గారు: గణపతి నవరాత్రుల సందర్భముగా రాసిన పద్యం

సీ|| మల్లికార్జున లింగ మాహాత్మ్య రసభృంగ!
         ఆమ్నాయ శిఖర స్వరాంత రంగ!
     భ్రామరీ వదన చంద్ర కళాధి కౌముదీ
         వామ తారుణ్యార్ధ సోమ శృంగ!
     వృద్ధ మల్లేశాంక పీఠికా హిందోళి
         తూగుటూయల లూగు తుంది లుండా!
     శ్రీ శైల కైలాస శిఖర ప్రతిధ్వాన
         'శంభో! హరా!" ఘోష 'సాక్షి" గణప!

ఆ||  తకిట తోం తకధిమి తాండవ ఢక్కాజ
     వాఙ్మయ గణనాథ! వక్ర తుండ!
     కవి! పరాత్పర! పుర గర్వ ఖర్వ సుపుత్త్ర!
     సుబ్బారాయ విద్దె లిబ్బి ఒజ్జ! ||

లిబ్బి = ఆస్థి, మూలధనం


3. మువ్వా శ్రీనివాసరావు గారు, తమ 6th ఎలిమెంట్ నుండి చదివిన కవితలు:

"గుండె తంత్రిని మీటి చూసి ...
కొత్త కవితగ చిగురులేసీ .."

ఒక వాక్యం
చెరకు గడ
నమిలి తినెయ్య వచ్చు
ఒక వాక్యం
మిరపకాయ
కొరికి భరించవచ్చు
...

"మరో వైపు"

నేల మీదనే
కాకుంటే అవతలి దిక్కు
ఈ పక్క కాదు అటు పక్క
నడుస్తున్న నాపై
అదేపనిగా
నవ్వుల చిరు జల్లులు
ఎందుకో
....

5. డా॥ కె.గీత గారు:
వీడ్కోలు విమానం
నీ విమానం కిటికీ
చెమ్మగిల్లిన దృశ్యంలో
వేల ముక్కలై పగిలిన
నా వీడ్కోలు హృదయం
ఎలా భరిస్తూ వెనక్కి జేరబడ్డావో గానీ-
నిన్ను వీడ్కోలు విమానం ఎక్కించిన చివరి నిమిషంలో
నీ కనుకొలుకుల్లో విత్తనాలై మొలిచిన దు:ఖం
నా గొంతులో వృక్షమై మోయలేకున్నాను

4. వేణు ఆసూరి గారు:

పొడుపు కథ కవిత, "పొవిత" అనవచ్చునేమో?

అరువు సొమ్ముతో అందలమెక్కి
    ఊరంతా తానే బలాదూర్!
ఊరిలోని అమ్మాయిలంతా
    తనవెంటే పారాహుషార్!

అప్పిచ్చినవాడు కనబడగానే
    ముఖమంతా తెలావెలా!
గుట్టు చప్పుడు కాకుండా
    అమ్మాయిలతో సహా మాయమవ్వాలా?

ఇంతకీ, వాడెవడు?

సమాధానం సమీక్ష చివరిలో ...

కొత్త బొమ్మ
బొమ్మలమ్మ బొమ్మలు
    వింతవింత బొమ్మలు
పిండిముద్ద బొమ్మలు
    పిల్లవాడి బొమ్మలు

.....

5. శ్రీధర్ రెడ్డి గారు:

తన సామ్రాజ్యము పోనీ ...

6. రమేష్ పాలేరు గారు:

శ్రీ కృష్ణ రాయబారము నుండి,

బావా ఎప్పుడు వచ్చితివీవు
అలుగుటయే ఎరుంగని

కిరణ్ ప్రభ గారి క్విజ్ వీక్షణం సమావేశానికి ఒక ఉత్సాహం  నింపే కార్యక్రమము. ఆయన పరీక్షలో నేను పాస్ అవుతానని నేను ఊహించను. కానీ, పెద్దవారిపై అభిమన్యుడు బాణాలు వేస్తే వారు తప్పించుకోవటానికి చేసే ప్రయత్నం  ఈ క్విజ్ కార్యక్రమములో కనబడుతుంది.

క్విజ్ తరువాత సమావేశాన్ని ముగిస్తూ  గీత గారు, 39వ వీక్షణ సమావేశము నవంబరు 8న, నాగరాజు రామస్వామి గారి గృహమునందు సన్నీవేల్ లో జరుగుతుందని ప్రకటించారు.
ఈ సమావేశానికి శ్రీమతి సి. రమణ, శ్రీమతి  శారద, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి ఉమావేమూరి, శ్రీ వేమూరి, శ్రీ లెనిన్ మొ.న వారు హాజరయ్యారు.
----------------
పొవిత విడుపు: చంద్రుడు
---------------
http://www.koumudi.net/Monthly/2015/november/index.html

No comments:

Post a Comment