Saturday 7 September 2013

వీక్షణం -12-సాహిత్య సమావేశం (Aug,10-2013)

  

 
ఏడాది కాలంగా క్రమం తప్పకుండా నెలెనెలా సాగుతూ వస్తున్న సమావేశం-వీక్షణం 12-ఈనెల సాన్హోసే లోని ప్రసాద్ నల్లమోతు గారింటి సాహితీ గవాక్ష మై తెరుచుకుంది. పాతిక పై చిలుకు సాహిత్య ప్రియులు, కళాపిపాసులు ఒక విదేశీ గడ్డ మీద ఒక్క చోట చేరి తమ భాషా రుచులను, సంస్కృతీ మధురిమలను ఆత్మీయ తేనీటి విందు లో కలిసి పంచుకున్న సందర్భం.

సాహిత్య సినీ నాటక రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన శ్రీ ఆకెళ్ళ గారు విశిష్ట అతిథులు.ప్రముఖ వక్తలు శ్రీ విద్వాన్ పెద్దింటి తిరుమల నరసింహా చార్యులు , కథా రచయిత్రి రాధిక గార్లు. సినీ/రంగస్థల నటుడు, స్వయంగా కవి, నాటకీయ ఫక్కీలో శ్రావ్య మైన పద్య పఠనం చేస్తూ ప్రేక్షకులను ఇట్టే మంత్రముగ్ధులను చేయగల ప్రతిభాశాలి శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు సభాధ్యక్షులు. వారి అధ్యక్షతన ఈ సాహిత్య సమాలోచనం రస వత్తరంగా సాగింది.తన స్వీయకృతి జగన్మాత రాజరాజేశ్వరి దేవి ఆవాహన స్తోత్రంతో సభకు శుభారంభం చేశారు. శ్రీ ఆకెళ్ళ గారికీ, వక్తలకూ, సభలో ఉన్న ప్రతిష్ఠాత్మక మైన సాహిత్య పత్రికా సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభ , శ్రీ మృత్యుంజయుడు, శ్రీ తల్లాప్రగడ గార్లకు,వీక్షణం నిర్విరామ నిర్వహణాదక్షులు శ్రీమతి డా. గీతా మాధవి గారికి స్వాగత వచనాలు పలికి, ముఖే ముఖే సరస్వతీ అంటూ రసజ్ఞ శ్రోతలను ఆహ్వానించారు.
మొదట శ్రీ ఆకెళ్ళ గారు ప్రసంగిస్తూ వారి స్వీయానుభావాలనుఆసక్తికరంగాఅందించారు.కాకినాడ నుండి అట్లాంటా దాకా సాగిన వారి సాహిత్య ప్ర స్థాన స్మృతులను పంచారు.సుమారు వంద సినిమాలకు స్క్రిప్ట్ /స్టోరీలు రాయడం, షేక్స్ పియర్ నాటకాలను తెనుగించి రంగస్థలం మీద ప్రదర్శించడం, యాభయవపడిలో 'యమాతా రాజ భానసలగౌ' మొదలుగా తెలుగు ఛందస్సు అభ్యసించి పౌరాణిక నాటకాలు వ్రాసి మెప్పించడం సంగతులు తెలియ పరిచారు.
కథ, నవల, నాటిక, పౌరాణిక పద్య నాటక, సినీ రంగ రచయితగా తన క్రమానుగత పరిణతి వెనుకనున్న నిరంతర కృషి,పట్టుదల గురించి సవివరంగా తెలియచేశారు.
కథలు రాసే తొలి రోజుల్లో ఝటితావేశం తో తాను విశ్వనాథ సత్యనారాయణ గారిని కలుసుకుని తానొక వర్ధమాన కథా రచయితనని పరిచయం చేసుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.వేయిపడగలలో ముఖ్య పాత్ర ఎవరు అని అడిగితే ధర్మారావు అని చెప్పలేక పోయిన తనను , శ్రీపాద, మల్లాది వారి కథలు చదువలేదని చెప్పిన తనను వారు గట్టిగా మొట్టికాయలేసారని తెలిపారు. విశ్వనాథ వారి వేడివేడి 'ముద్దు వడ్డనలు' తిన్న ఆ చేదు అనుభవం తనను దృఢ నిశ్చయం కేసి, సృజన శీలత కేసి మళ్లించిందని ,కనిపించిన కథలన్నీ చదివానని, ఆనాటి ప్రసిద్ధ కథకులందరినీ కలిశానని,'కూర్చుంటే కథ,నిల్చుంటే కథగా 'ఏకబిగిన 200 కథలను వ్రాసి కథ అంతు చూశానని ఆకెళ్ళ గారు తెలిపారు.
కథకు ప్రాణం ఇతివృత్తమనీ, శైలీ శిల్ప కథాకథన రీతులు తర్వాతేననిఉద్ఘాటించారు. కథలో కొత్త దనం ఉండాలనీ, ఇంతకు పూర్వం ఎవరూ రాయని సరికొత్త ఇతివృత్తం ఇట్టే ఆకర్షిస్తుందని చెబుతూ,చిన్ననాడు బాలమిత్ర కు రాసిన 'జువ్వల యుద్ధం' లోని వస్తు నవ్యతను ఉటంకించారు.యుద్ధ సామగ్రిని చేసిన వాడే యుద్ధాన్ని సృష్టించాలి అన్న వింత ప్రతిపాదన లోని నవ్యత కథకు ప్రచురనార్హత కల్పించిందన్నారు.నేటి అగ్రరాజ్యాలు అనుసరిస్తున్న విదేశీరాజ్యాంగ విధానం అదేనని చురకలేసే ముక్తాయింపు పలికారు.ఆనాడు ఆంధ్రప్రభ లో బహుమతి పొందిన తన నవల 'ఇల్లాలి స్వయంవరం' లో పేరు లోనే ఉన్న కొత్తదనం ఆకర్షణీయమయిందని చెప్పారు.
రఘురామయ్య గారి నాటకాలన్నీ చూశానని, తన మొదటి పద్య నాటకం 'శ్రీనాథుడు' రాగ ప్రాధాన్యత నుండి దృశ్య ప్రాధాన్యత వేపుకు వేసిన ముందడుగుగా అభిప్రాయ పడ్డారు.తన జీవితం లో తారసిల్లిన మహానుభావుల్లో విశ్వనాథ్ గారు ముఖ్యులని ,సినిమాలో ఏమేరకు డైలాగులు ఉండాలో విజువల్స్ ఏమేరకు ఉండాలో ఖచ్చిత మైన జ్ఞానం సినీ రచయితలకు అనివార్యమని ఆయన చెప్పేవారని విశ్వనాథ్ గారి పతిభను కొనియాడారు.
సామాజిక స్పృహ లేని ఏరచన అయినా నిరర్థకమనీ, వర్తమాన రచయితలకు ఈవిషయం శిరోధార్యం కావాలని సెలవిచ్చారు.అలనాడు తానూ AIR కు రాసిన 'అమ్మ' నాటిక గురించి ప్రస్తావిస్తూ ,ఆ నాటిక విన్న తర్వాతే తన కొడుకు తనను ఆదరించి ఇంటికి తెచ్చుకున్నాడని ఆర్ద్ర నయనాలతో ఒక అమ్మ తనను అభినందించడం మరువలేని సాహిత్య ప్రయోజనానుభవం అని చెప్పారు.
కాని సినిమారంగం కేవలం సాహిత్య ప్రయోజనానికి పరిమితం కాలేదని, అది ప్రాథమికంగా వర్తకం కనుక తప్పు పట్టలేమని అభిప్రాయపడ్డారు.
ఇలా ఆకెళ్ళ గారి ప్రసంగం విశ్వనాథ సత్యనారాయణ ,రఘురామయ్య గార్ల నుండి కె.విశ్వనాథ్ గారి దాకా ఆసక్తికరంగా సాగింది.
ఆకెళ్ళ గారి తరువాత శ్రీ పెద్దింటి తిరుమల నరసింహాచార్యులు గారు 'కాళిదాసు కవితా వైభవము 'గురించి ప్రసంగించారు.
సభను ఆహ్వానిస్తూ సభ కల్పవృక్షం వంటిదని, సభాసతులు వృక్ష శాఖల్లాంటి వారని, శ్రోతలు పరిమళాలను ఆఘ్రాణించే రసజ్ఞులని సంస్కృత శ్లోకం తో ఉత్సాహ పరిచారు.
కాళిదాసు అగ్రశ్రేణి సంస్కృత కవీశ్వరుడని, మనము లెక్కించే సమయంలో చిటికన వేలు (కని ష్ఠకమ్) తో ఎలా మొదలు పెడతామో అలాగే సంస్కృత కవులలో మొదట లెక్కింప దగిన వాడని శ్లోకయుక్తంగా విశదీకరించారు. భరతుడు పదిరకాల నాటకాలను ప్రతిపాదించాడని ప్రస్తావిస్తూ, “కావ్యేషు నాటకం రమ్యం” అన్న వాస్తవం కాళిదాసుని నాటకాలన్నింటికి వర్తిస్తుందని, అభిజ్ఞానశాకుంతలం అందుకు సాటిలేని తార్కాణమని సెలవిచ్చారు.పరమ రమ్య మయిన శాకుంతలంలో నాలుగవ అంకం చదివినా, కనీసం నాలుగవ అంకంలోని నాలుగు శ్లోకాలు చదివినా ఆ రమ్యత ఏమిటో అర్థమవుతుందని తెలిపారు.క్రాంతదర్శి ఐన కవి కాళిదాసు మూలం లో లేని 'అభిజ్ఞతను'సృష్టించి శాకుంతలానికి ఎనలేని కావ్యగౌరవాన్ని,కావ్యౌచిత్యాన్ని సంతరింపచేశారని చెప్పారు. శ్రవ్యనాటకాలలో దృశ్యతను జొప్పించడం వల్ల స్థాయీభావ రసం ఉప్పొంగి శ్రోతలను ద్రవీభూతులను చేసిన వైనాన్ని ఉటంకించారు.పంచమహా కావ్యాల ప్రసక్తి తెస్తూ,కాళిదాసు కావ్యాలలోని వాగర్థ శోభను, అలంకార వైభవాన్నిచాటే పలు శ్లోకాలను చదివి వినిపించారు.ఉపమాకాళిదాసస్య అంటూ రఘువంశాది కావ్యాలలోని అనేక ఉపమాలంకార విశేషాలను సుశ్లోకంగా సోదాహరణంగా వ్యక్తపరిచారు.మేఘసందేశానికి ముందు సందేశాత్మక కావ్యాలు లేవని, ఆ వారసత్వంలో నుండి వచ్చిందే జాషువ గారి గబ్బిలం అని గుర్తు చేశారు. ప్రసంగంలో ఎక్కువగా రఘువంశ చర్చ జరిగింది.కథానుగతంగా జరిగిన ఈ రఘువంశ రసచర్చలో కాళిదాసు అనన్య కవితా వైభవం కళ్ళకు కట్టింది. ‘మాళవికాగ్నిమిత్రం’ కాళిదాసు చిన్ననాటి అపరిణత కావ్యమనే వాదం అప్రస్తుతమని, అందుకు తానూ ఏకీభవించ లేనన్నారు.కాళిదాసు కాశ్మీర దేశస్తుడా, కాదా అన్న చర్చ కన్నా వారి కావ్యాలలో విస్తరించిన రమణీయ ప్రకృతి వర్ణనలు, కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా వర్ణించబడిన స్థల విశేషాలను గమనించడం శ్రేయస్కరమని వక్కాణించారు.ఇలా రసరమ్యంగా సాగిన వారి ప్రసంగం శ్రోతలను విశేషంగా ఆకట్టుకొంది.చక్కని బోధనా సంవిధాన గరిమతో సులభ గ్రాహ్యంగా వారు విడమరచి చెప్పిన తీరు తాము విన్నది ఒక సంస్కృత కవి విషయం కాక ఒక తెలుగు కవి కవిత్వమేమో అన్నంత సహజంగా ఉండి సభను ఆనంద పరిచింది.
తరువాత రాధిక గారు 'స్వీయ కథా స్పూర్తి' పై తన స్మృతులతో చక్కగా ప్రసంగించారు.సంగీతం, సాహిత్యం, పెయింటింగ్ కళలో అభినివేశం కల రాధిక గారి చదువు ఏలూరు లో సాగింది.1977 లో సమస్యాపూరణాల కార్యక్రమాలలో పాల్గొనడం తో వారి సాహిత్య ప్రయాణం ప్రారంభమైంది.ఆంధ్రప్రభ లోతన మొదటి కథ 'పూర్ణమ్మ' ,ఆతరువాత పేరుతెచ్చిన కథ 'నలుగురు నవ్విన వేళ', లక్కీ డ్రాప్స్ వంటి కథలు సుమారు 500, నాలుగు నవలలు,4 మినీ నవలలు రాసానని తెలిపారు.ఈ మధ్య వెలుగు చూచిన తన కథా సంకలనం 'కథా స్రవంతి' పుస్తకాలను వీక్షణం కు సమర్పించారు.తన గురించి తాను చెప్పుకునే బదులు పలువురు విశ్లేషకుల అభిప్రాయాలు తెలుసుకుంటే ఉచితంగా ఉంటుందని సవినయంగా విన్నవించారు.కొందరు మిమ్ములను ఓహెన్రీ తో ఎందుకు పోల్చారని శ్రోతలు వేసిన ప్రశ్నకు జవాబుగా తన కథలోని ఆకస్మిక మలుపులు కావచ్చునని తెలిపారు.తనకు కొసమెరుపు కథలంటే ఇష్టమని, చాలావరకు తన కథల్లో ఆఖరి వాక్యం తో అర్ధాంతరంగా కొత్త చమక్కులు ప్రతిఫలిస్తాయని చెప్పుకొచ్చారు.ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురాస్కారం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఉపన్యాసం ముగించారు.
ఆ తరువాత,అధ్యక్షుల వారి మరో దేవీ స్తోత్రం తో కార్యక్రమ ముఖ్యభాగం ముగిసింది.
కిరణ్ ప్రభ గారు నిర్వహించిన క్విజ్, కవిసమ్మేళనం, గ్రూప్ ఫోటో కార్యక్రమం యధావిధిగా ఆసక్తికరంగా జరిగింది.
ముఖ్య అతిథి శ్రీ ఆకెళ్ళ సినిమా జగతికి సంబంధించిన వారు అయినందున క్విజ్ కార్యక్రమం లో కిరణ్ ప్రభ గారు కళా రంగానికి చెందిన ప్రశ్నలను మాత్రమే సంధించి సభలో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
కవి సమ్మేళనం లో మొదట శ్రీమతి విజయ లక్ష్మి వరలక్ష్మిదేవిని స్తుతిస్తూ చక్కని కవిత చదివారు.నృసింహస్వామి ని స్తుతిస్తూ దైవీయ భావోద్వేగం తో పద్యమై ఊగిపోయారు శ్రీ శ్రీచరణ్.శ్రీ హరినాథ్ విశ్వనాథ సత్యనారాయణ గారిని కీర్తిస్తూ చక్కని పద్యాలు వినిపించారు.మధ్య మధ్య రాగయుక్తమైన స్వీయ పద్యకవితలను అందుకుంటూ అధ్యక్షుల వారు కవి సమ్మేళనాన్ని రక్తి కట్టించారు. శ్రీమతి గీతా మాధవి “వేయి వ్రణాల ఆయుధం “ వచన కవిత వినిపించారు. ఎలాంటి భాషా భేషజం లేని సరళమైన వాక్యాలతో సామాజిక స్పృహఉన్న సహజ సుందరమైన ఆర్ద్ర కవిత్వం!భిన్న రసగుణాల పదద్వయం తో ఒక్కటైన సరికొత్త పదబంధం -వేయి వ్రణాల ఆయుధం- రెండు భిన్న ధ్రువాలు అనుసంధించిన అయస్కాంతం లా ఆకర్షించే శీర్షిక! వస్తు ప్రాధాన్యత,ఆకట్టుకునే అభివ్యక్తి కలసి ప్రవహించిన కవిత్వాన్ని అందించారు గీత గారు. తర్వాత నాగరాజు రామస్వామి 'తరుణోపాయాలు' వచన కవిత వినిపించారు.రాశిలో లేశమైనా వాసిలో నాసి కాని ఈ కవిసమ్మేళనం సజావుగా సాగింది.
మృత్యుంజయుడు గారు వచ్చే వార్షిక సమావేశాన్ని గురించి వివరించారు. సమావేశానికి ఆతిధ్యమిచ్చిన ప్రసాద్ నల్లమోతు గారి వందన సమర్పణతో ఆత్మీయ సమావేశం ముగిసింది.
- రచన : నాగరాజు రామస్వామి