Thursday 4 October 2018

వీక్షణం ఆరవ వార్షికోత్సవం-2018

వీక్షణం ఆరవ వార్షికోత్సవం

జయమాల & దమయంతి




వీక్షణం ఆరవ వార్షికోత్సవం సెప్టెంబరు 16, 2018 న మిల్పిటాస్ లోని స్వాగత్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది.
సభను ప్రారంభిస్తూ వీక్షణం సంస్థాపకురాలు డా||కె.గీత ఆరేళ్ల ప్రస్థానాన్ని తల్చుకుంటూ ఇప్పుడు వీక్షణం ఇక్కడి వారి జీవితంలో భాగస్వామ్యమైపోయిందనీ, ఆపాలనుకున్నా ఆగని నిరంతర సాహితీ వాహిని గా అందరినీ అలరిస్తూందని, ఈ సంవత్సరం శాక్రమెంటో లో మరో శాఖతో విస్తరిస్తూ సాహితీ సేవలో మరో అడుగు ముందుకేసిందనీ అంటూ అందరికీ ఆహ్వానం పలికారు.
ఉదయం సెషన్ కు శ్రీ చుక్కా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా సాహిత్య సమావేశాలు జరుపుకుంటున్నామంటే మనందరిలో సాహిత్యాభిరుచి, సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి కారణమని అందరినీ అభినందిస్తూ సభను ప్రారంభించారు.
ముందుగా శ్రీ తాటిపామల మృత్యుంజయుడు "భగవద్గీత ను ఎలా చదవాలి, ఎందుకు చదవాలి?" అనే అంశం పై ప్రసంగిస్తూ, తాను చెప్పదలుచుకున్నది మత ప్రచారం కాదని సభకు విన్నవించారు.
కేవలం మరణ సందర్భాల్లో మాత్రమే భగవద్గీత వినాలని ఎలా జన సామాన్యంలో ముద్రపడిపోయిందో వివరించారు. భగవద్గీత లోని తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయని ఉదాహరణగా ‘ఐనిస్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ’ ని విశ్వజనీయతతోను, ఎనర్జీ ప్రసరణ ను ఆత్మ ప్రసరణ తోను, థియరీ ఆఫ్ ఎవిరీథింగ్ ను సుప్రీమ్ పవర్ తోనూ పోల్చి చూడవచ్చని ముగించారు.
తర్వాత శాక్రమెంటో సిటీ నుండి వచ్చిన “సిరిమల్లె” అంతర్జాల మాస పత్రిక సంపాదకులు శ్రీ మధు బుడమగుంట, "సంపాదకీయం- నిశిత పరిశీలన" అనే అంశం పై ప్రసంగిస్తూ, తమ శ్రీమతి ఉమ సహకారంతో గత మూడేళ్ళుగా నడుపుతున్న "సిరిమల్లె" వెబ్ మాస పత్రిక వల్ల తనకి ఈ వేదిక మీద ప్రసంగించే అర్హత కలిగిందని భావిస్తున్నానని ప్రారంభించారు. సంపాదకీయం ఒకప్పుడు ఎంతో ఉన్నత విలువలు కలిగి ఉండి కాలక్రమేణా పొగడ్తలకు, స్వార్థ ప్రయోజనాలకు లోబడిందని సంపాదకులు సాహిత్యానికి తద్వారా సమాజానికి మేలు సమకూర్చాలన్నదే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. తన సంపాదకీయంలో వెలువడిన ఆణిముత్యాలను సభకు పరిచయం చేస్తూ ఒకే పద్యాన్ని అచ్చ తెనుగు లోనూ, సంస్కృత భూయిష్ట సమాసాలతోనూ రాసి పాఠకులు పంపిన ఆటవెలదిని సభకు వినిపించారు.
ఆ తర్వాత శ్రీ అప్పాజీ పంచాంగం "ప్రహ్లాదుడు" అనే అంశంపై ప్రసంగిస్తూ ముందుగా వరాహ, నృశింహ అంశాలని సభకు ఆసక్తిదాయకంగా వివరించారు. జీవన ప్రవాహంలో కొట్టుకుపోతూ మనకు మనం ఎవరమనే సృహను కోల్పోతూ ఉన్నామని, నేనెవరు? అనే ప్రశ్న మనకు మనం గా వేసుకున్నపుడే అంతరంగ అన్వేషణ ప్రారంభమవుతుందని అన్నారు. వరాహ మంటే శ్రేష్ఠమైన రోజని, హిరాణ్యాక్షుడంటే కదిలే వస్తువు ఆకర్షణలో ఉన్నవాడని  వివరించారు. ఆసక్తులు రెండు విధాలని, మొదటిది కర్తృత్వ ఆసక్తి, రెండు భోక్తృత్వ  ఆసక్తి అని, భోక్తృత్వ ఆసక్తి ని విడిచి నిష్కామ కర్మ చేసిన నాడే ఏ పనైనా సుకరము అవుతుందని అన్నారు. ఆహ్లాదము, సంహ్లాదము, ప్రహ్లాదము, అనుహ్లాదము అని ఆహ్లాదం నాలుగు రకాలని అందులో ప్రహ్లాదము అంటే అన్ కండిషనల్ హ్యాపినెస్ అని హిరణ్యకశ్యపత్వమనే అహాన్ని జయించడానికి ప్రహ్లాదత్వమనే దితిత్వాన్ని ఉపయోగించి నృశింహత్వం ఆవిష్కరింపబడుతుందని ముగించారు.
భోజన విరామానంతరం జరిగిన రెండవ సెషన్ కు శ్రీ రావు తల్లాప్రగడ అధ్యక్షత వహించారు.
ముందుగా వీక్షణం ప్రత్యేక సంచికల ఆవిష్కరణ శ్రీ అక్కిరాజు రమాపతిరావు, శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ, శ్రీ లక్కిరెడ్డి హనిమిరెడ్డి గార్ల చేతుల మీదుగా జరిగింది. అనంతరం శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారి సహస్ర చంద్ర దర్శన ప్రత్యేక సందర్భంగా వీక్షణం తరఫున ఘన సన్మానం జరిగింది. ఆ సందర్భంగా వారి సోదరులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ ప్రసంగించారు.
తర్వాత "తెలుగు రచయిత" తొమ్మిది వందల రచయితల పేజీలతో దిగ్విజయంగా మూడు సం.రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులు డా||కె.గీత, శ్రీ వేణు ఆసూరి, శ్రీ సుభాష్ పెద్దు సభకు తెలుగు రచయిత. ఆర్గ్ ను పరిచయం చేసారు. ఈ సందర్భంగా వెబ్సైటు కి తగిన చేయూతనివ్వాలని రచయితలందరికీ గీత విజ్ఞప్తి చేశారు.
తర్వాత శ్రీ సుభాష్ పెద్దు వేంకటాధ్వరి రచించిన "గుణాదర్శం" గ్రంథ సమీక్ష చేశారు. ఈ గ్రంథం ఒక యాత్రా చరిత్రమని, ఈ గ్రంథ ప్రధానోద్దేశ్యం లోకాన్ని చదవడం, మనుషుల్ని అర్థం చేసుకోవడం, నిజాల్ని వెలిబుచ్చడం అన్నారు. గ్రంథ కాలం నాటి సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు రచయిత వర్ణించారని, మధుర మీనాక్షి దంతాలు మల్లెల్లా ఉంటాయని, శ్రీరంగంలో అంతా దొంగలే, అటువంటి చోట్ల దేవుడుండి ఏం లాభమని, జ్యోతిష్కులు, వైద్యులు ఆ కాలంలో చేస్తున్న మోసాలను గురించి విశేషాలను ఆసక్తికరంగా వివరించారు.
తర్వాత శ్రీ పాలడుగు శ్రీ చరణ్ "అవధానాలు చెయ్యడం ఎలా?" అనే అంశమ్మీద ఉపన్యసించారు. అవధాని అని పిలవడం వెనక ఉన్న కారణాలతో మొదలు పెట్టి అవధానం లోని ఒక్కొక్క అంశాన్ని సోదాహరణంగా వివరిస్తూ ఆసక్తిదాయకమైన ఉపన్యాసాన్నిచ్చారు.
ఆ తర్వాత, శ్రీమతి ఆర్ దమయంతి గారి ఆధ్వర్యాన సాహితీ క్విజ్ ఉత్సాహదాయకంగా జరిగింది.
తరువాత జరిగిన కవితా సమ్మేళనంలో శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ, డా|| కె.గీత, శ్రీ శశి ఇంగువ, శ్రీమతి షంషాద్, శ్రీ మేకా రామస్వామి, శ్రీమతి ఛాయాదేవి, శ్రీ హర్ నాథ్ మున్నగువారు పాల్గొన్నారు.
ఆ తర్వాత సింగపూర్ తెలుగు సమితి ఉపాధ్యక్షులు శ్రీ వెంకటరమణ సభకు హాజరై తమ సందేశాన్ని వినిపించడం విశేషం.
చివరగా వీనుల విందుగా జరిగిన సంగీత లహరి కార్యక్రమం లో డా|| కె.గీత, శ్రీమతి ఆర్ దమయంతి, శ్రీమతి గీతా గురుమణి, చి|| ఈశా పాటలు పాడి అందరినీ అలరించారు. ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా, విశేషంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిమానులు విశేషంగా పాల్గొన్నారు.





----------
http://sirimalle.com/issues/2018/10/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2018/october/oct_2018_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 72

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 72
వరూధిని

ఆగస్టు నెల వీక్షణం కాలిఫోర్నియా బే ఏరియా లోని స్వాగత్ హోటల్ లో 12 వ తారీఖున అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. అధ్యక్షులు శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు ముందుగా మొదటి ఉపన్యాసకులు శ్రీ వేణు ఆసూరి గారిని ఆహ్వానించారు. ఆయన అర్మను హైసీ రచించిన "సిద్ధార్థ" నవలను సభకు పరిచయం చేసారు. కథని సూక్ష్మంగా పరిచయం చేస్తూ సిద్ధార్థ అనే యువకుడు గౌతమ బుద్ధుణ్ణి కలవడానికి వెళ్లడం, వారిరువురి మధ్య జరిగిన సంభాషణ, సన్యాసి సంసారిగా మారడం, తిరిగి సన్యాసిగా మారడం, చక్రభ్రమణం జీవితం అని తెలుసుకోవడం మొదలైన విషయాల్ని ఆసక్తికరంగా వివరించారు. అధ్యక్షుల వారి మాటల్లో చెప్పాలంటే "వేణు గారు అత్యంత గహనమైన విషయాన్ని ప్రశాంతంగా విడమర్చి చెప్పారు". ప్రసంగానంతరం రచయిత జీవిత విశేషాలు, ఇతర రచనల గురించి కూడా వివరించారు.
ఆ తర్వాత శ్రీమతి ఆర్. దమయంతి "డా||కె.గీత కవిత్వంలో స్త్రీ హృదయ స్పందన" అనే అంశంమ్మీద ప్రసంగించారు. నారింజ చెట్టు, కొండవాలు వాన తీగె, కథ ముగిసింది, పునరపి జననం మొదలైన కవితల్ని ఉదహరిస్తూ గీత కవిత్వం లో మాతృత్వం అమ్మ, పిల్లలు, నాన్నమ్మ, అమ్మమ్మ పాత్రల ద్వారా పెల్లుబుకుతుందన్నారు. "నారింజ చెట్టు" కవిత లో కూడా మాతృత్వపు స్పందన అద్వితీయమని కొనియాడారు. "పునరపి జననం" కవిత ద్వారా పురిటి బాధను సున్నితంగా వ్యక్తపర్చడం గీతకే చెల్లిందన్నారు. గీత కవిత్వంలో ప్రతి కవితా శీర్షిక ఒక్కో గాథ అని ముగించారు. తన కోరిక ప్రకారం ప్రసంగానంతరం సభలోని వారందరూ అందజేసిన "కవిత్వానికి నిర్వచనాల" ను అందరికీ చదివి వినిపించారు.
విరామానంతరం శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యాన జరిగిన సాహితీ క్విజ్ అందరినీ ఎప్పటిలానే అలరించింది. శ్రీ మృత్యంజయుడు తాటిపామల క్విజ్ మాస్టర్ గా వ్యవహరించారు. అనంతరం మృత్యంజయుడు గారు శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారి సహస్ర చంద్ర దర్శన సందర్భంగా గుంటూరు లో వెలువరించబడిన విశేష సంచికను, సన్మానపు విశేషాల్ని సభకు పరిచయం చేశారు.
శ్రీ కె.వి. రమణారావు గారి "పాట" కథా పఠనం, వారి శ్రీమతి సుభద్ర గారి లలిత గీతాలు, ఈశా వరకూరు స్వాతంత్ర్యోద్యమ గీతాలాపనలు సభకు ప్రత్యేక ఆకర్షణలయ్యాయి.
కవిసమ్మేళనంలో ఆచార్య గంగిశెట్టి, శ్రీ జి.హరనాథ్, డా|| కె.గీత, శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీ సుబ్బారావు, శ్రీమతి ఉమా వేమూరి, శ్రీ వేమూరి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ లెనిన్, శ్రీ మృత్యంజయుడు తాటిపామల, శ్రీమతి జయ, శ్రీమతి శారద, శ్రీమతి ఛాయాదేవి, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి రమణమ్మ, శ్రీ ఇక్బాల్, శ్రీ ప్రసాద్, శ్రీ రామస్వామి, శ్రీ శ్రీచరణ్ మొదలైన వారు ఈ సభలో పాల్గొన్నారు. చివరగా శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీమతి దమయంతి గార్లు ఆలపించిన గీతాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.
సెప్టెంబరు 16 న, ఉదయం 10 గం. నుండి సాయంత్రం వరకూ స్వాగత్ లో జరగనున్న వీక్షణం వార్షిక సమావేశానికి గీత గారు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఆ సందర్భంగా వెలువరించే ప్రత్యేక సంచికకు రచనలు ఆగష్టు 31 లోగా పంపవలసిందిగా విజ్ఞప్తి చేశారు.





-------------
http://sirimalle.com/issues/2018/09/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2018/september/sept_2018_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 70

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 70
Vikshanam

వీక్షణం 70 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో జరిగింది.
ఈ సమావేశాన్ని డా||కె.గీత కన్నడంలో  నుంచి తనే అనువాదం చేసిన స్వాగత గీతంతో ప్రారంభించేరు. శ్రీ లెనిన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం ముందుగా "వేదం" గురించి శ్రీ శ్రీచరణ్ గారి ఉపన్యాసంతో ప్రారంభించబడింది.
ముందుగా వేదం అంతే ఏవిటో వివరిస్తూ, వేదం ఆని చోట్లా ఉందని, అనుభవమే వేదమనీ అన్నారు. వేదాలు ముఖ్యంగా నాలుగు. ఋగ్వేదం, సామ వేదం, యజుర్వేదం, అధర్వ వేదం. మత్స్య పురాణంలో వేదాల గురించిన ప్రస్తావన ఉంది. వేదాలు అపౌరుషేయాలు. విభజన చేసినంత మాత్రాన వ్యాసుడు వేదకర్త కాదు. ఈశ్వరుడి చేత బ్రహ్మకు వేదాలు ఇవ్వబడ్డాయి. వేదంలో అన్నీ ఉత్తమ పురుషలో ఉంటాయి. ప్రతీ వేదం మళ్లీ నాలుగు విభాగాలు. సంహితము, బ్రాహ్మణకము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. వీటిలో చెప్పిన సారాన్ని చివరగా చెప్పేది వేదాంతము. ఇలా వేదాల గురించి వివరంగా విశదీకరిస్తూ ఉపన్యాసం కొనసాగింది.
తరువాత శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరినీ ఎప్పటిలానే అలరించింది.
విరామం తర్వాత శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ "నమ్మకాలు- మూఢ నమ్మకాలు" అనే అంశంమీద ప్రసంగించారు. మూఢనమ్మకాలలో భాగంగా జాతకాలు, శకునాలు, ఆచారాల గురించి వివరించారు.
చివరగా శ్రీ సుభాష్ పెద్దు రాసిన "దిష్టి" కథని శ్రీమతి ఆర్. దమయంతి సభకు ఆసక్తికరంగా పరిచయం చేశారు.
మనవరాలిని తీసుకుని ఒక పెద్దావిడ విజయవాడ నుంచి న్యూయార్క్ కు చేసిన ప్రయాణపు అనుభవాలే "దిష్టి" కథ. ఈ కథకి ప్రాణం "అమ్మతనం" అని దమయంతి గారు అన్నారు.
రచయిత సుభాష్ గారు మాట్లాడుతూ అమెరికాలో పిల్లల్ని పెంచడానికి ఇండియా నుంచి తీసుకొచ్చుకునే  తల్లిదండ్రుల కష్టాలు ఈ కథకి స్ఫూర్తి అన్నారు.
ఈ సమావేశానికి శ్రీమతి ఉమా వేమూరి, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి మాధవి, శ్రీమతి శారద, శ్రీమతి కోటేశ్వరమ్మ, శ్రీమతి రమణమ్మ, శ్రీ వేమూరి, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ లెనిన్, శ్రీ రమణ మున్నగు వారు హాజరయ్యేరు.
-----------
http://sirimalle.com/issues/2018/07/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2018/july/july_2018_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 69

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 69


వీక్షణం 69వ సమావేశము విళంబి నామ సంవత్సరం వైశాఖ మాసం బహుళ త్రయోదశి నాడు, అనగా మే 13వ తారీఖున శ్రీయుతులు గీతా మాధవి, సత్యనారాయణ గార్ల స్వగృహమునందు జరిగినది. ఈ రోజు అమెరికా దేశస్తుల మాతృ దినోత్సవం అవటం కూడా ఒక ప్రత్యేకత.
ఈ సభకు శ్రీ తాటిపాముల మృత్యుంజయడు గారు అధ్యక్షత వహించారు. అధ్యక్షుల వారు ఈ నాటి ముఖ్య అతిధి శ్రీ చెన్నకేశవ రెడ్డి గారిని సభకు పరిచయం చేస్తూ, "వారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో తెలుగు ఎన్సైక్లోపేడియా విభాగాధిపధిపత్యం తో బాటు పలు బాధ్యతలు నిర్వహించారు". శ్రీ చెన్నకేశవ రెడ్డిగారిని తెలుగులో గేయ రచన గురించి చేసిన పరిశోధనని ప్రశంసించారు.
శ్రీ చెన్నకేశవ రెడ్డిగారి ప్రసంగ విశేషములు ' గేయం గతి ప్రధానమైనది. గతులు నాలుగు. అవి త్రిశ్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులు. కావ్యమంటే కథ, పాత్రలు, రసపోషణ, ధ్వని, వస్త్వైక్యం, అలంకారాలు, వర్ణనలు మొదలగు కావ్యాంగాలతో కూడిన రచన. ఈ దృష్ట్యా గేయంతో మొదటి కావ్యం రాసిన వారు సినారె. కావ్యమే కాదు, గేయ నాటికలు, గేయ ఖండికలు, ముక్తకాలు, రుబాయిలూ వంటి పంచ పదులు, గజళ్లు, బుర్ర కథలు, రూపకాలు, అనుసృజనలు, లలిత గీతాలు, సినిమా పాటలూ. సినారే లాగా ఒక కవితా రూపములో ఇన్ని ప్రక్రియలు చేసిన కవి ఏ భాషలోనూ, ఏ కాలంలోనూ లేరని చెప్పాలి.
సినారే రచించిన గేయ కావ్యాలు 1. నాగార్జున సాగరం (మొట్ట మొదటి కాల్పనిక గేయ కావ్యం 2. కర్పూర వసంత రాయలు (మొట్ట మొదటి చారిత్రాత్మక గేయ కావ్యం) 3. విశ్వనాథ నాయకుడు (వీర రస ప్రధాన కావ్యం) 4. ఋతుచక్రం (ఆత్మ కథాత్మక కావ్యం 5. జాతి రత్నం (నెహ్రూ జీవిత చరిత్ర) 6. భూమిక (కవితా చరిత్ర, తాత్విక కావ్యం)."
సమయా భావం వల్ల కేవలం నాగార్జున సాగరం, కర్పూర వసంత రాయలులోని ఇతివృత్తాలను గురించి రేఖా మాత్రముగా చెప్పి, ఆ కావ్యములలోని రచనా సంవిధానాన్ని (లయ పోషణా, పాత్ర పోషణ మొదలైనవి) ఉదాహరణలతో సహా వివరించడం జరిగింది.
తరువాత డా|| కె.గీత కవిత్వాన్నుద్దేశించి మాట్లాడుతూ "శ్రీమతి గీతా మాధవి గృహ ప్రవేశం చేసిన నాడే ఆమె ఇంట ఆమె కవితా మాధురిని గురించి తొలి ప్రసంగం చేయడం ఒక స్వర్ణావకాశము. ఆమె కవితల్లో ఎంతో వస్తు వైవిధ్యమున్నది. కార్మికులు, బాల కార్మికులు, కష్టజీవులు, స్వీయానుభూతులు, స్త్రీవాద కవితలు, అమ్మా నాన్నల మీద, భక్తి మీద, సంతానం మీద, ప్రకృతి, విహార స్థలాలు, కాలిఫోర్నియా రాష్ట్రం మీదా - ఇలా ఎన్నో విషయాల మీద కవితలున్నాయి. "నిరంతరం ఎగిరి దుమికే గాలి పంపులా, సన్నని డొక్కలతో మెకానిక్ కుర్రాడు, నువ్వు బాలుడవన్న దృష్టి మా పిల్లలను చూసైనా తట్టదు", అని ఎంతో హృద్యముగా "మెకానిక్ కుర్రాడు" లో గీత కవిత్వికరించారని శ్రీ చెన్నకేశవ రెడ్డి అన్నారు.
గీత శీర్షికలు కూడా ఉన్నతంగా, భావ గర్భితంగా పెడతారు. ఉదాహరణకు "బంగాళాఖాతం". ఈ శీర్షిక బంగాళాఖాతాన్ని విరిచి, శ్లేషించి, కవితాత్మకంగా విశ్లేషించి తీరు చాలా గొప్పగా ఉంది. ఇది స్త్రీవాద కవితలలో ఉత్తమమైనది. "ఈ రోజంతా" అనే కవితలో, ఒక వీధిని, ఆ వీధిని పోయే జనాలని గురించి, ఒక్కొక్కరి గురించి ఒక వాక్యం రాస్తూ, బహు విధ రేఖా చిత్రంలా దృశ్యమానం చేయటం జరిగింది. అమ్మ మీద, తమ పిల్లల మీద రాసిన కవితలు గుండెను తడుపుతాయి. మెటఫర్లను, మెట్ల వరసగా పేర్చి, కవిత్వాన్ని ఉన్నత స్థితిగా తీసుకు వెళుతుందని, నూతన పద కల్పన శక్తిని గురించి చెప్పారు. ఆమె శైలి ప్రవాహక శైలి. సూటిగా, సుందరంగా, భావ గంభీరంగా చెప్పటం ఆమెకు అలవడినది.
గీతా మాధవికి అమెరికా వచ్చినా ద్రవ్య భాష అలవడలేదని, "స్ట్రాబెరీలకన్నా కాకెంగిలి జామకాయ రుచి సాక్షి" అని ఆమె కవితల్లో మాతృ దేశం మీద, మాతృ భాష మీద మమకారం కనిపిస్తుందన్నది. కేవలం కవయిత్రిగానే కాకుండా, వీక్షణం కార్యక్రమాల ద్వారా మాతృ భాష కు సేవ చేస్తున్నది. ప్రతి ఏటా మాతృ దినోత్సవం నాడు ఆమె ఇంట ఇలాగే మాతృ భాష తో కూడిన ఉత్సవం జరగాలి" అని శుభాకాంక్షలు తెలిపారు."
ఆ తరువాత శ్రీ వేమూరి "అమెరికాలో తెలుగు నేర్పడం" గురించి మాట్లాడేరు.
ఆ తరువాతి కార్యక్రమం ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారయణ గారి "భాష - భాషాభివృద్ధి", "తెలుగు వర్ణమాల: విశిష్ఠతలు" పుస్తక ఆవిష్కరణ, పరిచయాలు. ఈ రెండు పుస్తకములూ తెలుగు భాషా బోధనకూ, అభివృద్ధికీ ప్రామాణికము కాగలవు. తెలుగు వర్ణమాలకు ఉన్న విశిష్ఠత గంగిశెట్టిగారు "శ్రీకారం" యొక్క తెలుగు అక్షరరూపాన్ని ఈ విధముగా నిర్వచించారు:
ఓంకారంలో ఏముంది నేస్తం?
తెల్గు 'శ్రీ' కారంలో ఉంది యోగరహస్యం!
ధ్యానించి చూడు, ఆ వంపుల్లో
దర్శనమిస్తుంది కుండలినీ సర్వస్వం
అండ, పిండ,బ్రహ్మాండ సమస్తం...
కడుపులాటి వృత్తం అండమైతే,
నడుమ సంధిరేఖలో శోభించే పిండం
శిరసున సుడితిరుగుతున్నది  బ్రహ్మాండం
అడుగున విడివడి సకలసృష్టికారక రజో రేఫం
కన్నతల్లిజోలలాటి అమృతాంశురూపం...
*కడుపున శబ్దబ్రహ్మమ్మట
ఆ పై శబల బ్రహ్మమ్మట
అటుపై అనంతమే మన
బ్రహ్మాండావరణమ్మట..
సకలశుభకార్యాలకు ‘శ్రీ’కారమే ఆద్యక్షరం
ఇహ-పర సుఖసంధాయక బీజాక్షరం
యోగశాస్త్రసారాన్ని ఒక్క అక్షరంలో మలిచిన
అక్షరబ్రహ్మ  తెలుగుశిల్పికిదే  పాదాభివందనం!
తదుపరి కార్యక్రమం కిరణ్ ప్రభ గారి క్విజ్. మాతృ దినోత్సవ సందర్భముగా తెలుగు ప్రముఖులూ, తెలుగు కవితలు, గేయ రచనలనుండి ఉందహరించబడిన "మాతృ" అంశముతో  జరిగిన కార్యకమము ఎప్పటివలనే ఉత్సాహముగా జరిగినది.
చివరగా జరిగిన కవి సమ్మేళనము కార్యక్రమములో చదివిన కవితలు:  డా||  గీతా మాధవి "కొత్త జీవితం" కవితను, డా||  జి. చెన్నకేశవ రెడ్డి - బేబీ సిట్టీంగ్ "ముద్దుల మనవణ్ణి మనసు పడి, రెక్కలు కట్టుకుని వస్తే చుక్కలు చూపించావు" అంటూ మనవణ్ణి ఉద్దేశించి, షంషాద్ "ఆసిఫా" కు జరిగిన అన్యాయం గురించి  కవితలు వినిపించారు. ఆర్. దమయంతి గారు  తమ రచనలనే కాకుండా చక్కని పాటలను కూడా పాడి అందరినీ అలరించారు.
ఇంకా శ్రీమతి ఉమా వేమూరి, శ్రీమతి మధురిమ, శ్రీమతి శిరీష, చిన్నారులు ఇందు, ఈశా మున్నగు వారు చక్కని గాత్రంతో కూడిన పాటలతో అందరినీ ఓలలాడించారు.
అన్నిటినీ మించి వెంట్రిలాక్విజం, మిమిక్రి చేసి సభలోని వారందరినీ శ్రీ రాంపల్లి సదాశివ గారు ఆకట్టుకుని  వీక్షణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అనేక మంది పుర ప్రముఖులు హాజరైన ఈ వీక్షణం ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా జరిగింది.






http://sirimalle.com/issues/2018/06/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2018/june/june_2018_vyAsakoumudi_vikshanam.pdf

-----------

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 68

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 68



వీక్షణం 68 వ సమావేశం కాలిఫోర్నియాలోని ప్లెసంటన్ లో శ్రీ వేమూరి వెంకటేశ్వర్రావు గారింట్లో జరిగింది. శ్రీ సి.బి.రావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా కాళీ పట్నం రామారావు గారి "యజ్ఞం" కథ మీద సుదీర్ఘమైన చర్చా కార్యక్రమం జరిగింది.
ఇందులో సభలోని వారంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఈ కథ గురించి సి. ఎస్. రావు గారు రాసిన ఈ- మాట లోని పరిశీలనా వ్యాసం లోని కొన్ని భాగాలను యథాతథంగా తెలియజేస్తూ  ఈ చర్చలో కథ ను, కథా సందర్భాన్ని  సూక్ష్మంగా డా||కె.గీత వివరించారు.
"కథావేదిక సుందరపాలెం అనే గ్రామం.  కథావిషయం అప్పల్రాముడి కుటుంబం గోపన్నకి బాకీగా ఉన్న అప్పుకు సంబంధించి, దేవాలయం దగ్గరి ధర్మమండపం పంచాయితీ వేదికగా జరుగుతున్న సమావేశంలో పడే తర్జన భర్జనలు. మండపానికి చుట్టూరా, వీధికి ఆ చివరి నుండి ఈ చివరి దనుకా హాజరై కూర్చున్న జనంలో మనం కలిసి పోతాము.
సంక్షిప్తంగా కథ: దశాబ్దాల క్రింద తాను మధ్యవయస్కుడుగా ఉన్నప్పుడు, గోపన్న వర్తకునిగా ఎదిగి స్థిరపడక పూర్వం, అప్పల్రాముడు తన వ్యవసాయ పంటలను అప్పుడే దళారి వ్యాపారిగా జీవితం ప్రారంభించిన గోపన్నకు ఆయన చెప్పిన ధరలకు మారుమాట్లాడకుండా అమ్ముతుండేవాడు. అయిదారు సంవత్సరాలలోనే గోపన్న అంచెలంచెలుగా ఎదిగాడు; అప్పల్రాముడి ఆర్థిక పరిస్థితి మాత్రం క్రమక్రమంగా దిగజారింది. గోపన్న దగ్గర తీసుకున్న కొద్ది అప్పు తడిసి మోపెడయింది. తనకున్న పొలం క్రమక్రమంగా తరిగిపోయి ఇప్పుడు కాసింత మాత్రమే మిగిలింది. గోపన్న అప్పు తీర్చాలంటే ఆ కాసింత అమ్మాలి. అది అమ్మితే తనకు, తన కొడుకులకు, మనవలకు బువ్వ లేనట్లే. బానిస బతుకులు బతకాలి. గోపన్న పరిస్థితి కూడా పెద్ద వర్తకుల పోటీ తట్టుకోలేక పోవటం వలన చితికిపోయింది.
ఇప్పుడు పంచాయితీలో తేల్చవలసిన విషయాలు ఒకటి – అది అప్పా, కాదా? రెండు – దానిలో ధర్మమెంత, అధర్మమెంత? మూడు – తీర్చవలసి వస్తే ఎంత ఇస్తే సరిపోతుంది?
శ్రీరాములు నాయుడు ఊరిలో పెద్ద మనిషి. ఊర్లో వారి తగాదాలు అతనే పరిష్కరించేది. శ్రీరాములు నాయుడు ఎంతో గుంజాటనకు లోనై ఇది అప్పే అని తీర్పు చెప్పాడు. అప్పల్రాముడికి కోపం వచ్చింది. అయినా కోపం దిగమింగుకుని ఆయన తీర్పులోని అసంగతాన్ని వివరించాడు. ఆ ‘కాసింత నేల’ అమ్మి అప్పు తీరుస్తానన్నాడు. కానీ, అప్పల్రాముడి రెండవ కొడుకు సీతారాముడికి ఇది ససేమిరా ఇష్టం లేదు. బ్రతికినంతకాలం చాకిరీ చేసి గోపన్న అప్పు తీరుస్తాను కానీ, నోటికాడి ఆ కాసింత పొలం అమ్మటానికి వీలు లేదన్నాడు. అమ్మితే తండ్రిని చంపి తానూ చస్తానన్నాడు. అయినా అప్పల్రాముడు తన మాటకు కట్టుబడి, అమ్మకం పత్రం మీద నిశానీ పెట్టి, కొడుకుల చేత, మనవళ్ళ చేత నిశానీ వేయించాడు. సీతారాముడి కళ్ళు చండ్రనిప్పు లయినాయి. ఇంటివైపు పరిగెత్తాడు. జనంలో కలకలం పెరిగింది. సీతారాముడికి తనకున్న ఒక్కగానొక్క కొడుకు కంబారీగా ఉండటం ఇష్టం లేదు. ఆ చిన్నవాడ్ని నరికి గోతంలో వేసుకుని ధర్మ మండపం ముందు దభాలున పడవేశాడు. ఈ అకృత్యంతో కథ ముగుస్తుంది.
‘రచయిత అవగాహనలో లోపాలు‘ అనే శీర్షికతో కాళీపట్నం రామారావుగారి యజ్ఞం కథ మీద వ్రాసిన వ్యాసంలో రంగనాయకమ్మగారు తర్కబద్ధంగా వారి విమర్శనాంశాలను వివరించారు. రంగనాయకమ్మగారు పరిశీలించిన ప్రధానాంశాలు:
  • వ్యవసాయ రంగంలో వ్యాపార పంటలప్రవేశం
  • శ్రీరాములు నాయుడి పాత్ర
  • అప్పలరాముని అప్పు స్వభావం
  • కథ ముగింపు
  1. వ్యవసాయరంగంలో వ్యాపార పంటల ప్రవేశాన్ని గురించి అంత విపులంగా చర్చించ వలసినంత ప్రాధాన్యత వాటికి కథ బాగోగులను బేరీజు వేయడంలో అవసరమా అని సందేహం వస్తుంది. దానిలో ఎక్కువ భాగం సాహిత్య విమర్శ క్రిందికి వస్తుందా అని అనుమానం కలుగుతుంది.
  2. శ్రీరాములు నాయుడి పాత్రలో పెద్దగా వైరుధ్యాలున్నట్లు పాఠకులకనిపిస్తుందని నేననుకోను. రచయిత చిత్రించిన పాత్రల స్వరూప స్వభావాలు ఒక క్రమంలోనే నడిచాయి. శ్రీరాములు నాయుడు మృదు స్వభావి, విద్యావంతుడు, ఊరికి మంచి చేద్దామనుకునే స్వభావం కలవాడు. న్యాయంగా తీర్పు చెప్పాలనే ప్రయత్నం చేసేవాడు. గోపన్నకు అప్పల్రాముడు అప్పు పడి వున్నాడనే ఆఖరుకు శ్రీరాములు నాయుడు తీర్పు చెప్పి, అప్పటి అప్పల్రాముడి ఆర్ధిక దుస్థితి దృష్ట్యా తాను అప్పు తీరుస్తానని చెప్పడం అప్పల్రాముడికి అవమానం అనిపించింది, కోపం తెప్పించింది. ఎక్కడా తొణకని, బెణకని అప్పల్రాముడు సహనం కోల్పోయి శ్రీరాములు నాయుడ్ని చాప కింద నీరు లాంటి వాడని, ఆయన కొట్టిన దెబ్బ అది తగిలిన చోట కాక మరోచోట బాధిస్తుందని విమర్శిస్తాడు. ఈ ఒక్కచోట తప్ప రచయిత తన మాటగా కాని, వేరే పాత్రలు కాని (సీతారాముడు మినహా) ఆయననెవరూ తప్పుబడుతూ మాట అన్నట్లు కనబడదు.
శ్రీరాములు నాయుడు గాంధీగారి తాత్విక చింతనతో ప్రభావితుడైతే మనం తప్పు బట్టవలసిన అవసరమేముంది? శ్రీరాములు నాయుడు గాంధేయవాది కనకే “పవిత్రమైన సేవా భావంతో అంత గొప్ప యజ్ఞం (గ్రామాభివృద్ధి) సాధించడం చెయ్యగలిగా”డని రచయిత భావమైతే ఆ భావం కలిగి ఉండే స్వాతంత్ర్యం, హక్కు ఆయనకుండటంలో తప్పు లేదు కదా! ఏ రచయితకైనా ఏవో భావాలు ఉండబట్టే కదా వాటి ననుసరించి రచనలు చేయడం. రంగనాయకమ్మగారు శ్రీరాములు నాయుడి పాత్రను గురించి చేసిన విమర్శలో “అతను గాంధి వాదం ఎడల విశ్వాసం ఉన్న ఆదర్శ నాయకుడుగానూ, ఇంకోపక్క అతను మోతుబరుల కొమ్ముకాసే కపటి గానూ కనిపిస్తా”డని వెల్చేరు నారాయణ రావుగారు చెబుతారు. కథలో ఎక్కడా అతను మోతుబరుల కొమ్ము కాసే కపటిగా కనిపించినట్లు అనిపించదే.
రామారావుగారు వర్గ వైరుధ్యాన్ని స్పష్టంగా చూపించలేదని రంగనాయకమ్మగారి వాదం. కారణం బాకీ ఉన్న అప్పలరాముడు, అప్పిచ్చిన గోపన్న, ఇద్దరూ బీదవాళ్ళే. వారిలో ఎవరూ దోపిడీ మనస్తత్వం కలవారు కాదు. వర్గ వైరుధ్యాల్ని ప్రవేశపెట్టకుండా కథలు వ్రాయడానికి వీలు లేదా? మనం చూసే నిజ జీవితంలో కూడా ఇద్దరు బీదవాళ్ళ మధ్య బాకీ తగవులు ఉండటం గమనిస్తాం. ఒక బీదవాడు ఇంకొంచెం మెరుగైన ఆర్థిక స్థితి ఉన్న బీదవాని దగ్గర వడ్డీకి ఋణం తీసుకోవడం మామూలుగా జరిగే పని. పైపెచ్చు కొంచెం ఎక్కువ వడ్డీకి కూడా. ఇద్దరూ పూరి గుడిసెలలో ఉండే వారే. వారిద్దరి మధ్య వర్గ వైరుధ్యాలు లేకపోయినంత మాత్రాన వారి స్వభావాలకు తగిన పాత్ర చిత్రణతో కథ వ్రాయటానికి వీలు లేదా? మార్క్సిస్ట్ తాత్విక దృష్టితో చూసినపుడు కాకపోయినా, వీరి మధ్య వర్గ వైరుధ్యాలు లేకపోయినా, సంఘర్షణలు తప్పని సరి. అప్పిచ్చిన వారి మధ్య తీసుకున్న వారి మధ్య కూడా సంఘర్షణలు అనివార్యం. వాటిని చిత్రిస్తూ కథలు వ్రాయడానికి వీలు లేదా?
  1. గోపన్న అప్పల్రాముడి మధ్య ఉన్న అప్పు స్వభావం.
    గోపన్న దళారి వర్తకం ప్రారంభించిన నాటి నుండి అప్పల్రాముడు తన పంటల నతనికే అమ్మేవాడు. గోపన్న చెప్పిన ధరలను గానీ, అతని తూకాలను గానీ అప్పల్రాముడు ఎప్పుడూ శంకించే వాడు కాదు. కొన్ని సంవత్సరాలుగా వారిద్దరి మధ్య బేరసారాలు సాగాయి. తనకున్న ఆరెకరాలను అప్పల్రాముడు తొమ్మిదెకరాలు చేయగలిగాడు. గోపన్న దళారీ వ్యాపారంలో ఎదిగాడు. వాణిజ్య పంటల ధరల అస్థిరత్వం వలన రైతులు దెబ్బ తిన్నారు. అప్పలరాముడి భూమి క్రమక్రమంగా తరగ నారంభించింది. గోపన్న స్థితి క్రమక్రమంగా మెరుగు పడింది. కానీ అచిర కాలంలోనే పెద్ద వర్తకుల పోటీకి తట్టుకోలేని గోపన్న స్థితి కూడా క్రమక్రమంగా దిగజారింది. ఆ కాలంలో గోపన్న దగ్గర అప్పల్రాముడు అప్పుడప్పుడూ తీసుకున్న అప్పులన్నీ కలిపి రెండువేల రూపాయలయినట్లు లెక్కలు తేల్చారు. వడ్డీతో రెండువేల అయిదొందల రూపాయలయింది. నోటు కాలపరిమితి అయిపోతుండగా అప్పు తీర్చటానికి మరి కొంత వ్యవధి కావాలంటే శ్రీరాములు నాయుడు పంచాయితీ తీర్పు ద్వారా అప్పల రామునికి మరి మూడు సంవత్సరాల వ్యవధి ఇవ్వడం జరిగింది. వడ్డీ కూడా గవర్నమెంటు రేటుకి తగ్గాలన్నాడు శ్రీరాములు నాయుడు. ఇప్పుడు ఆ వ్యవధి కూడా అయిపొయింది. ఇక బాకీ తీర్చాలి. ఒకప్పుడు తొమ్మిదెకరాలున్న అప్పల్రాముని కిప్పుడు రెండెకరాల ఇరవై సెంట్లు మాత్రమే ఉంది. గంపెడంత సంసారం. గోపన్న పరిస్థితి కూడా తారుమారై చితికిపోయి కొడుకులు కడుపు చేతబట్టుకుని తలా ఒక దిక్కు పోగా కూతురుతో బ్రతుకు వెళ్లదీస్తున్నాడు. ప్రస్తుతపు తీర్పులో అది అప్పే అన్నాడు శ్రీరాములు నాయుడు. వాస్తవానికి అది అప్పు ఎలా కాక పోతుంది? అది తీర్చవలసిందే. కాకపోతే వడ్డీ తగ్గించవచ్చు.
సులభవాయిదాలలో తీర్చే అవకాశం ఇవ్వవచ్చు. వారిద్దరి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది సరియైన తీర్పుగా తోస్తుంది. అప్పల్రామునికి భూమి అమ్మే పరిస్థితి కల్పించగూడదు. శ్రీరాములు నాయుడు అలా తీర్పు ఇచ్చి వుంటే బావుండేది. కాళీపట్నం రామారావుగారు పాత్రోచితంగా కథావసరాలను పాటిస్తూ అలా వ్రాసి ఉంటే బావుండేది.
  1. కథ ముగింపు.
    కథ బలహీనత, రామారావుగారి అవగాహనా లోపం ప్రబలంగా కథ ముగింపులో ఉంది. ఇది ఏ రకంగా సమంజసమైన ముగింపు అని రామారావుగారికి అనిపించిందో అర్ధం కాదు. తండ్రి భూమి అమ్మి గోపన్నకు బాకీ తీర్చడం ఇష్టం లేని సీతారాముడు తండ్రిని దూషించి, మెలోడ్రమటిక్‌గా ఇంటికి పరిగెట్టికెళ్ళి భూమి లేని కంబారీగా తన కొడుకు ఉండటానికి వీల్లేదని వీరావేశంతో ఊగిపోతూ కొడుకుని అడుగుతాడు “అరె! నువ్వు కంబారీగా బ్రతుకుతావా లేదా చచ్చిపోతావా” అని. ఆ చిన్నవాడు చచ్చిపోవటానికి పరుగెట్టుకొస్తాడు. ఇది చాలా అసంగతమైన మెలోడ్రామా, అన్‌కన్విన్సింగ్ ఐడియలైజేషన్. కొడుకంటే వాడు, తండ్రంటే తానన్నట్లు మాట్లాడతాడు. మానవీయత దృష్ట్యా చూసినపుడు ఈ పెద్దోళ్ళ తగాదాకు పరిష్కారంగా ముక్కు పచ్చలారని బాలుడిని దారుణంగా వధించటం అమానుషం, మహా ఘోరమైన అకృత్యం. తండ్రిగా పుత్రప్రేమ లేనివారు ఎవరూ ఉండరు. అభం, శుభం తెలియని, అయిదారేళ్ళయినా నిండని అర్భకుడిని, తన తనయుడిని వాడికే మాత్రం సంబంధం లేకపోయినా నిర్దయగా నరకటానికి ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో, రచయితకు దీనిని కథకు ముగింపుగా వాడుకోవాలనే హృదయ కాఠిన్యం ఎలా వచ్చిందో అర్ధం కాదు."
ఈ చర్చలో ముందుగా శ్రీమతి రమణ ఈ కథలో చివరి సన్నివేశాన్ని గురించి ప్రతిస్పందిస్తూ, "పెద్దవాళ్ల లావాదేవీల్లో చిన్న పిల్లల్ని బలివ్వటం అసమంజసమని" అన్నారు. శ్రీమతి ఆర్. దమయంతి, శ్రీమతి రాధాకుమారి ఆమెను సమర్థించారు. దానికి సమాధానంగా శ్రీ చుక్కా శ్రీనివాస్ "ఈ కథను అన్యాయానికి గురవుతున్న అట్టడుగు వర్గాల జీవితాల్లో మారే జీవన సమీకరణాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలని అన్నారు. తండ్రి మరో మార్గంలేని విధి లేని పరిస్థితులలో కొడుకును చంపుకోవాల్సి వచ్చిందని, కొడుకు బానిసగా బతకడం కంటే చావే మేలని భావించాడని అంటూ కథ లోను ఇతర అంశాలను సోదాహరణంగా వివరించారు. శ్రీ శివ చరణ్ ఆయనను సమర్థిస్తూ కథను, కథా సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడారు. శ్రీ చెన్నకేశవ రెడ్డి, శ్రీ లెనిన్ లతో పాటూ ఇతరులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ చర్చ దాదాపు గంట సేపు కొనసాగింది.





తరువాత శ్రీమతి రమణ అమెరికా పర్యటన సందర్భంగా ఇటీవల తను రాసిన రెండు మూడు మ్యూజింగ్స్ చదివి అందరినీ అలరించారు.
తరువాత జరిగిన కవి సమ్మేళనం, పాటల కార్యక్రమం లో డా|| కె.గీత, శ్రీమతి ఆర్ దమయంతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వేమూరి 68 సమావేశాల వీక్షణం ప్రస్థానాన్ని కొనియాడుతూ మొదటి సభ తమ ఇంటి లోనే ప్రారంభం కావడాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఇష్టమైన ఆంగ్ల కథల్ని సభకు పరిచయం చేశారు.
"కథా పఠనం" కార్యక్రమంలో శ్రీమతి ఆర్ దమయంతి పురస్కారం పొందిన స్వీయ కథను చదివి వినిపించారు.
ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీమతి రాధాకుమారి, శ్రీమతి ఉమ, శ్రీమతి రమణమ్మ, శ్రీ శివచరణ్, శ్రీ శ్రీనివాస్, శ్రీ సిబిరావు, శ్రీమతి రమణ, శ్రీమతి గీతామాధవి, శ్రీ లెనిన్, శ్రీ చెన్నకేశవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
------------
http://sirimalle.com/issues/2018/05/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2018/may/may_2018_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 67

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 67


- పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్

Vikshanam

వీక్షణం 67 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిలిపిటాస్ లో కథా రచయిత శ్రీ అనిల్ రాయల్ గారింట్లో జరిగింది.
శ్రీ సి.బి.రావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా కథల్లోని "రెడ్ హేరింగ్స్" అనే అంశమ్మీద  సోదాహరణమైన ఉపన్యాసాన్నిస్తూ తన కథ "శిక్ష" ను మరొకసారి సభకు పరిచయం చేసారు అనిల్ రాయల్. "రెడ్ హేరింగ్స్" ని తెలుగులో "ఎండు చేపలు" అని అనొచ్చని అన్నారు. "శిక్ష" కథలోని "రెడ్ హేరింగ్స్" ని కనిపెట్టే కథా క్విజ్ అందర్నీ అలరించింది.
ఆ తరువాత శ్రీ చెన్న కేశవ రెడ్డి గారు సినారె కవిత్వాన్ని వినిపించేరు. ఆ సందర్భంగా శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు సినారె దుబాయి యాత్రలో తమ అనుభవాలు సభలోని వారితో పంచుకున్నారు.
ఎప్పటిలాగే శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యాన జరిగిన సాహితీ క్విజ్ అత్యంత ఆసక్తి దాయకంగా జరిగింది.
విరామం తర్వాత శ్రీ సి.బి.రావు హైదరాబాదులో తమ ఆధ్వర్యాన నెల నెలా నిర్వహింపబడుతున్న "వేదిక" కార్యక్రమం విశేషాలు పంచుకున్నారు.
చివరగా జరిగిన కవి సమ్మేళనంలో పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, చెన్న కేశవరెడ్డి, కె.గీత, శారద గార్లు కవిత్వాన్ని వినిపించారు.
ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ లెనిన్, శ్రీ వేమూరి, శ్రీమతి ఉమ, శ్రీమతి కాంతి కిరణ్,  శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

http://sirimalle.com/issues/2018/04/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2018/april/april_2018_vyAsakoumudi_vikshanam.pdf
---------

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 66

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 66


- విద్యార్థి

వీక్షణం 66వ సమావేశం మిల్పిటాసు (కాలిఫోర్నియా) లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కార్యాలయమందు, ఫిబ్రవరి 12, 2018 నాడు జరిగినది. ఈ సభకు శ్రీ చెన్నకేశవ రెడ్డిగారు అధ్యక్షత వహించినారు.
సాహిత్యంలో తత్త్వ దర్శనం గురించి అధ్యక్షులవారు ప్రసంగిస్తూ చెప్పిన విశేషములు - "అష్టాక్షరీ మంత్రము "ఓం నమోనారాయణ" లోని రా శబ్దమునకు పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" లోని మ అక్షరం కల్పితే వచ్చేది రామ శబ్దము. ఆ రామ అయనము అనగా రాముని ప్రయాణము యొక్క తత్త్వాన్ని వివరించేదే రామాయణము. సాహిత్యములో కబీర్, తుకారాం, వేమన, బసవడు మొదలగు వారి రచనలలో తత్త్వ దర్శనం ఉంటుంది. అలాగే తెలుగు సాహిత్యములో బహు రచనలు తత్త్వ బోధనతో కూడి ఉన్నాయి".
మొదటి ప్రసంగకర్త, శ్రీ అన్నే లెనిన్ గారిది. వారి ప్రసంగ విశేషములు - "నవీనాంధ్ర కవిత్వములో ఆత్మ, తత్త్వము పలువురి రచనలలో కనబడుతుంది. సముద్రాల, సిరివెన్నెల మొదలగు సినీ రచయితల గేయాలలో కూడా తత్త్వ దర్శనం ఉంటుంది. ఆ కోవకు చెందిన వారే శ్రీ కిరణ్ ప్రభ గారు. వారి కవితలలోనూ, కౌముది పత్రిక సంపాదకీయాలలోనూ, రేడియో టాక్ షో ప్రసంగాలలోనూ ఒక ఆత్మ, తత్త్వము ఉంటుంది. ఒకరి కవిత్వమైనా, రచన అయినా, చెప్పేవారి లోపలికి వెళ్ళేది తత్త్వము, బయటకు వచ్చేది కవిత్వము. ఈ నిర్వచనము ప్రకారము ఉత్తమ కవితా రచన శ్రీమతి షంషాద్ గారి "ఈ కిటికీ తెరుచుకునేది ఊహలలోకే .."
తర్వాత శ్రీమతి షంషాద్ గారు లెనిన్‌గారికి ధన్యవాదములు తెలుపుతూ, "నెగెటివ్", "కిన్నెరసాని" కవితలని సభకు చదివి వినిపించారు.
ఆ తరువాత శ్రీమతి ఉదయలక్ష్మి గారు కిరణ్ ప్రభగారి అంతర్జాల ప్రసంగాల ద్వారా చేస్తున్న విశిష్ఠ కృషి కి ధన్యవాదముల తో కూడిన అభినందన వ్యాసం చదివారు. అలాగే, కిరణ్ ప్రభ గారు, కాంతి కిరణ్ గారూ నెల నెల అందిస్తున్న ఉత్తమ అంతర్జాల తెలుగు పత్రిక పాత తరం యువను గుర్తు చేస్తున్నదని అన్నారు.
ఆ తరువాతి కార్యక్రమము శ్రీ కిరణ్ ప్రభ గారి క్విజ్. అది ఎప్పటి లాగానే ఉత్సాహముగా జరిగినది.
విరామానంతరము శ్రీ అప్పాజీ గారు సంస్కృత భాగవతం లోని రామాయణ కథ యొక్క తత్త్వం గురించి చేసిన ఒక విశిష్ఠ వివరణలోని ప్రధానాంశములు - "వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణం రచించారు. ఆ రామాయణ కథను పలువురు ఋషులు పలు ప్రమాణాలతో, వారి వారి తాత్త్విక దర్శనముతో రచించారు. వ్యాసుడు భాగవతంలో రెండు అధ్యాయాలలో రామాయణ కథను తెలిపారు.
దేవతలు ప్రార్ధించగా సాక్షాత్తు బ్రహ్మమయుడైనటువంటి శ్రీ హరి తన అంశలో అంశగా నాలుగు రూపాలుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా జన్మించారు. బాహ్యార్థములో ఒక కుటుంబము, ఆ కుటుంబీకుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు రామాయణ కథలో కనిపిస్తాయి.
రామాయణ కథలో ఋషి దర్శనము ఏముందో కొంత తరచి చూస్తే ఒక విశిష్ఠార్థము కనపడుతుంది. దశరథుడు అనగా పది రథములు కలవాడు అని, లేక పది గుఱ్ఱములతో లాగబడే రథము కలవాడని అని ఒక అర్థము. ఒక మహా చక్రవర్తికి పది రథములే ఉన్నాయనటములో ఒక విశిష్ఠత కనబడదు. ఇక్కడ ఋషి యొక్క తాత్త్విక దర్శనము ఐదు జ్ఞానేంద్రియములు (త్వక్కు (చర్మము), చక్షువు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణేంద్రియాలు), ఐదు కర్మేంద్రియములచే (వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థలు) ఒక మనిషి ఎప్పుడూ లాగబడుతూ ఉంటాడు. ఈ పది ఇంద్రియములని ఒక ఉన్నతమైన ధ్యేయము కొరకు వినియోగించే ప్రతి మనిషీ దశరథుడు.
బ్రహమయమైన సగుణ ఆనంద తత్త్వాన్ని సూచించేది రామ శబ్దము. రామ శబ్దానికి వివరణ "రమతే ఇతి రామః" లేక "రమంతే యోగినః సర్వే అస్మిన్ ఇతిహి రామః" అనగా సమస్త యోగులు ఏ ఆనంద తత్త్వములో రమిస్తూ ఉంటారో, ఏ తత్త్వమైతే సమస్త ప్రాణులని ఆనందింప చేస్తుందో అది రామ శబ్దము.
ఆ సగుణ బ్రహ్మముయొక్క లక్షణములు లేక చిహ్నములు లక్ష్మణుడు. లక్ష్మణయ ఇతి లక్ష్మణః. ఈ ఆనంద తత్త్వము మనసులో ఉన్నవారికి ఉత్తమమైన భరణ శక్తి ఉంటుది. అదే భరత తత్త్వము. భరణాత్ భరతః. ఒక మనిషికున్న పంచేంద్రియములని నియంత్రించేది మనస్సు. ఈ పంచేద్రియములు బందిపోటు దొంగల వంటివి, అవి మనిషిలోని ఆనంద తత్త్వాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఆ అంతః శత్రువులని జయించినవాడే శత్రుఘ్నుడు. శత్రు ఘ్నంతి ఇతి శతృఘ్నః. అంతః శత్రువులని జయించటమే మోక్ష మార్గము.
రామ శబ్దము ధర్మము. ధ+రమ = ధర్మము. రమ శబ్దమూ, రామ శబ్దము ఒకటే.
కామనలు తీర్చుకోవటానికి అర్థము. అర్థ యోచనతో అంతః ఘర్షణలు లేక బాహ్య ఘర్షణలు సంభవించవచ్చు. ఆ అర్థాన్ని ఘర్షణ రహితం కావించేదే ధర్మము. కామాన్ని తీర్చుకోవడానికే అర్థము, అర్థము తీర్చుకోవడానికే ధర్మము అనే వలయములోనుంచి విముక్తి కోరితే మోక్షము.
పైన చెప్పిన విధముగా కాకుండా, ధర్మాన్ని ధర్మము కోసమే ఆచరిస్తే మోక్షమనేది ఋషి దర్శనము. ధర్మము కోసమే అర్థము, మోక్షము కోసమే కామన వాడితే జీవితము పూర్తిగా ఘర్షణ రహితము.
ఇప్పుడు ఇక్కడ అర్థమనగా లక్ష్మణుడు. అర్థాన్ని ధర్మానికి కలపాలి. అందుకే, లక్ష్మణుడు ఎప్పుడూ రాముడికి వెన్నంటివుంటాడు. అలాగే శతృఘ్నుడు అనగా కామన. కామనని మోక్షానికి కలపాలి.
సత్త్వ తమో రజో గుణాలతో కూడినది త్రిగుణాత్మకమైన ప్రపంచము. ఈ ముగ్గురూ దశరథునికి ఉన్న భార్యలు. ఈ మూడు గుణాలు ధర్మార్థ కామ మోక్షముల కొరకు ప్రాకులాడుతూ ఉంటాయి. అర్థాన్ని (లక్ష్మణుడు) ధర్మముతో (రాముడు)తో కలపాలి, కామాన్ని (భరతుడుని) మోక్షం (శతృఘ్నుడి) కొరకు వినియోగించాలి. ఆ విధముగా ఆచరిస్తే జీవితములో ఘర్షణలు ఉండవు.
దశరథుడు పుత్ర కామేష్ఠి చేసి సగం పాయసం కౌశల్య కిచ్చాడు. నాల్గవ వంతు సుమిత్ర కిచ్చాడు. మిగలినదానిలో ఒక ఎనిమిదవ భాగాన్ని కైకేయికి, ఇంకొక ఎనిమదవ భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. అనగా, దశరథుడి ఇంద్రియాలని అర్థ భాగం ధర్మము కొరకు, నాల్గవ భాగాన్ని అర్థము కొరకు, ఒక ఎనిమిదవ భాగాన్ని కామము కొరకు, మిగిలినది మోక్షము కొరకు నియోగించాడు. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసినది ఎనిమిదవ భాగమైన కామాన్ని ధరమ మోక్షముల కొరకు వినియోగిస్తే ఘర్షణా రహితమైన జీవతము. ఆ కామాన్ని కామము కొరకే, లేక అర్థము కొరకు వినియోగిస్తే ఘర్షణ హేతువు అవుతుంది. ఆ కామ విచక్షణ, నియమన ఎవరికి ఉంటుందో వారు బ్రహ్మమయమైన ఆనందాన్ని రమించగలరు.
ఆ తరువాత కవి సమ్మేళనములో యువ కవులు శశి, సాయి కృష్ణ, రేష్మా లతో బాటూ శ్రీ చరణ్, షమ్షాద్, డా|| గీతా మాధవి, అప్పాజీ గార్లు పాల్గొన్నారు.
ఆద్యంతం అత్యంత ఆసక్తి దాయకంగా జరిగిన ఈ సమావేశంలో శ్రీ జయరామ్, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్, శ్రీ రావు తల్లాప్రగడ, శ్రీ సి.బి రావు, శ్రీ వేమూరి, శ్రీ  గాంధీప్రసాద్, శ్రీమతి  ఆర్. దమయంతి, శ్రీమతి శారద, శ్రీమతి ఉమ, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి రమణ తదితరులు పాల్గొన్నారు.







http://sirimalle.com/issues/2018/03/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2018/march/march_2018_vyAsakoumudi_vikshanam.pdf
-----------

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 65

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 65


- కృష్ణమోహన్ మోచెర్ల

జనవరి 14, 2018 న కాలిఫోర్నియా లోని మిల్‍పిటాస్ స్వాగత్ హోటల్ లో వీక్షణం సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది.
సమావేశానికి శ్రీ వేణు ఆసూరి అధ్యక్షత వహించారు. సమావేశం లో ముందుగా శ్రీ సి.బి రావు & శ్రీమతి రమణ డిశంబర్ 14 న హైదరాబాదు లో ఆవిష్కరణ జరుపుకున్న శ్రీమతి ఓల్గా గారి "యశోబుద్ధ" నవలను  పరిచయం చేసారు. సిద్దార్థ, యశోధర ల దాంపత్య అవగాహన వివరణ, సిద్దార్థుని నిష్క్రమణ, గ్రామ పర్యటన, స్త్రీల బౌద్ధ మత ప్రవేశంపై సిద్దార్థుని నిరాకరణ, బుద్ధు ని నిర్యాణం, యశోధర, సిద్దార్థుల సంవాదం మున్నగు అంశాలను ప్రస్తావించారు. తరువాత సిద్ధార్థుని నిష్క్రమణ - అనుమతి ఊహాజనితమా? స్త్రీల మనోభావాలను ప్రతిబింబించే విధంగా రచన ఉన్నదా? బౌద్ధం కుటుంబాన్ని త్యజించమంటుందా? సన్యాసాన్ని బోధిస్తుందా? మొ||న ప్రశ్నలకు జవాబులిచ్చారు.
ఆ తరువాత హైదరాబాదు నుంచి వచ్చిన శ్రీమతి ఆర్.దమయంతి గారిని శ్రీ మోచెర్ల కృష్ణమోహన్ సభకు పరిచయం చేసారు. దమయంతి గారు తన కథ "బంతిపూల పడవమీద పోదాం పదవా" ను చదివారు. భార్య తన భర్తకు వ్రాసిన జాబులో మొత్తం కథ నడుస్తుంది. ఈ కొత్తదనాన్ని సభికులు తమ వ్యాఖ్యలతో మెచ్చుకున్నారు.
ఆ తరువాత కౌముది సంపాదకులు, కవి, కిరణ్ ప్రభ గారు "సాహితీ క్విజ్" కార్యక్రమంలో ఆసక్తికరమైన ప్రశ్నలతో ప్రశ్నావినోదం కావించారు.
తదుపరి తెలంగాణా ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక ఆహ్వానితురాలిగా హైదరాబాదుకి వెళ్లిన కవయిత్రి డా|| కె.గీత అక్కడి విశేషాలు సభకు తెలిపారు.
ఆ తరువాత కవితా పఠనం, సభికుల పాటల కార్యక్రమం జరిగింది.
ఇందులో చిన్నారి ఈశా వరకూరు పుష్ప విలాపం నించి పద్యాలను చక్కటి గాత్రంతో పాడి వినిపించింది. శ్రీమతి ఛాయాదేవి, శ్రీ భువన్ తమ పాటలతో అలరించారు. కవితా పఠనంలో శ్రీ వరకూరు గంగాప్రసాద్, శ్రీ జి. చెన్నకేశవరెడ్డి, శ్రీ ఆర్. గోపాలరెడ్డి , డా|| కె.గీత, శ్రీ వెంకట రమణ మొ.న వారు కవితలు చదివారు. తర్వాత గీతామాధవి సభికులను సభకు పరిచయం చేసారు.
కార్యక్రమం యావత్తూ ఆసక్తిగా జరిగింది. సభ పూర్తయ్యక కూడా సభికులు పిచ్చాపాటి గావించారు. ఒకరినొకరు పరిచయం చేసుకొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ, శ్రీ రావు వేమూరి, శ్రీ వికాస్, శ్రీ అహ్మద్, శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీ పిల్లల మర్రి కృష్ణకుమార్, శ్రీ సతీష్ కుమార్ అద్దేపల్లి, శ్రీమతి ఉదయ లక్ష్మి, శ్రీమతి కోటేశ్వరి, శ్రీమతి షమ్షాద్, శ్రీమతి జహారా, శ్రీమతి తాయబా, శ్రీమతి శారద, శ్రీమతి కాంతి, శ్రీమతి ఉమ, శ్రీమతి అద్దేపల్లి ఉమాదేవి తదితర స్థానిక ప్రముఖులు కూడా పాల్గొన్నారు.





http://sirimalle.com/issues/2018/02/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2018/february/feb_2018_vyAsakoumudi_vikshanam.pdf
--------------

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 64

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 64


- అన్నే లెనిన్


వీక్షణం 64 వ సమావేశం మిల్పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో డిసెంబరు 10 వ తేదీన ఆసక్తికరంగా జరిగింది.
శ్రీ చిమటా శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సభలో ముందుగా మిసిమి పత్రిక సహ సంపాదకులు, ప్రముఖ చిత్రకళా చారిత్రకులు శ్రీ కాండ్రేగుల నాగేశ్వర్రావు ఆంధ్రుల చిత్ర కళ చరిత్ర గురించి సవివరంగా ప్రసంగించారు. ముఖ్యంగా పాశ్చాత్య యుగంలో రినైసాన్స్ తరువాత పునరుజ్జీవనం పొందిన చిత్రకళ ను గురించి, ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గురించి వివరించేరు. ముఖ్యంగా పికాసో భారతీయ చిత్రకళా గొప్పదనాన్ని, అప్పటి ఇల్లస్త్రేటెడ్ వీక్లీ సంపాదకులు ఏ. ఎస్. రామన్ గారికి తెలియజేసిన విధానాన్ని వివరించేరు. ఎవరికీ అంత సులభంగా ఇంటర్వ్యూ ఇవ్వని పికాసో ఏ. ఎస్. రామన్ ను దగ్గరకు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇస్తూ "ఇండియా ఈజ్ ఎ లాండ్ ఆఫ్ వేదాస్, ద బుద్ధా, అండ్ ద కలర్స్" అని పొగిడారట. పార్లమెంటు భవనంలో అశోక చక్ర నమూనా ని తీసుకుని అటు భారతీయ శిల్పకళను, ఇటు పాశ్చాత్య శిల్పకళను మేళవించి ఎలా నిర్మించారో వివరంగా చెప్పేరు. ఆంధ్రుల చితకళ గురించి వివరిస్తూ దామెర్ల రామారావు గారి గురించి సవివరంగా పరిచయం చేసేరు.
తరువాత "కాళిదాస రఘువంశం" గురించి శ్రీ శ్రీచరణ్ పాలడుగు ప్రసంగిస్తూ మొదటి సర్గ నుంచి దిలీపుని ఉదయం వరకూ తాత్పర్య సహితంగా కొన్ని శ్లోకాలు వివరించేరు. కాళిదాసు యొక్క సాభిప్రాయమైన ప్రయోగాల వివరణలు సోదాహరణంగా చెప్పేరు.
శ్రీమతి శారద "మెదడుకి మేత" అనే భాషా పరమైన పజిల్ ను క్విజ్ కార్యక్రమంగా ఆసక్తికరంగా నిర్వహించేరు.
విరామం తర్వాత జరిగిన కవిత్వ పఠనం లో డా|| కె. గీత, శ్రీమతి షంషాద్, శ్రీ లెనిన్, శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ, శ్రీ వేంటేశ్వర్రావు, డా|| ఆర్. గోపాల రెడ్డి గారు మొ.న వారు పాల్గొన్నారు.
ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ సమావేశంలో స్థానిక ప్రముఖులతో బాటూ ఆంధ్ర ప్రదేశ్ ఆధికారిక ఎన్నారై ప్రతినిధి శ్రీ కోమటి జయరాం కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం.
కార్యక్రమంలోని వీడియోలను ఇక్కడ చూడవచ్చు.
https://drive.google.com/open?id=1Han73S9VBBfLyp8iw3XbIpZRJfXzCUWK




http://sirimalle.com/issues/2018/01/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2018/january/jan_2018_vyAsakoumudi_vikshanam.pdf


Wednesday 3 October 2018

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 63

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 63


- అన్నే లెనిన్






నవంబరు 12, 2017 న ఫ్రీమౌంట్ లోని శ్రీ పిల్లలమఱ్ఱి  కృష్ణ కుమార్ గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.
శ్రీ మృత్యుంజయుడు తాటిపామల అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ పాడుగు శ్రీ చరణ్ "రఘువంశ ప్రశస్తి" లోని కొన్ని శ్లోకాలను టీకా తాత్పర్య సహితంగా ఉదహరిస్తూ అత్యంత రమణీయంగా ఉపన్యసించారు. 17 సర్గల రఘువంశ చరిత్రను సూక్ష్మంగా వివరించారు. దిలీపుడు, సగరుడు, భగీరధుడు, హరిశ్చంద్రుడు గొప్పవారైనా రఘువు పేరు మీదుగానే వంశం వర్థిల్లడానికి కారణాలు వివరించారు. మల్లినాథ సూరి గారి సంజీవని వ్యాఖ్యావిశేషాల్ని, కాళిదాసు, పోతన పద్య సారూప్యతలను వివరించారు.
తరువాత శ్రీ క్రాంతి శ్రీనివాసరావు "ఆధునిక కవిత్వం" అనే అంశం మీద ఉపన్యసిస్తూ సాహితీ సభల లోని రకాలను హాస్యస్ఫోరకంగా వివరించారు. తాను ఇంతవరకు పాల్గొన్న సభలన్నిటిలో వీక్షణం ప్రత్యేకమైనదని అభిమానాన్ని వ్యక్తం చేసారు. నన్నయ్య చెప్పినట్లు విశ్వ శ్రేయస్సుని కోరేదే కవిత్వం అన్నారు. కవిత్వానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు వక్కాణించిన నిర్వచనాల్ని వివరించారు. విశ్వానికి కవి కన్ను వంటి వాడు అనీ, కవిత్వం పాఠకుణ్ణి చేరినపుడే సంపూర్ణమవుతుందనీ అంటూ, కవి, పాఠకుడు కలిసి రాసేదే కవిత్వం అన్నారు.
ఎప్పటిలానే అత్యంత రసవత్తరంగా కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యాన సాహితీ క్విజ్ జరిగింది.
చివరగా పిల్లలమఱ్ఱి  కృష్ణ కుమార్ గారి "దేవాలయాలకు ఎందుకు వెళతాం?" అనే పరిశోధనాత్మక ప్రసంగంతో వీక్షణం ఉల్లాసంగా ముగిసింది. ఈ ప్రసంగంలో వాస్తు శాస్త్రాన్ని క్షుణ్ణంగా సభకు పరిచయం చేసారు కృష్ణ కుమార్.
ఈ సభలో శ్రీ సత్యనారాయణ, శ్రీ లెనిన్, శ్రీ వికాస, శ్రీ రావు తల్లాప్రగడ, శ్రీ రవి కుమార్ వల్లూరి, శ్రీమతి రత్న కుమారి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి కోటేశ్వరి, శ్రీమతి జయమాల, శ్రీమతి శాంతికుమారి, డా||కె. గీత మొ.న వారు పాల్గొన్నారు.
---
http://www.koumudi.net/Monthly/2017/december/dec_2017_vyAsakoumudi_vikshanam.pdf
http://sirimalle.com/issues/2017/12/vikshanam.html

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 62


వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 61


- అన్నే లెనిన్




అయిదేళ్ళు జయప్రదంగా పూర్తి చేసుకొని ఆరో ఏడాదిలోకి విజయవంతంగా అడుగుపెట్టిన బే ఏరియా సాహితీ వీక్షణం 61 వ సమావేశం మిల్పీటస్ లోని స్వాగత్ హోటల్ ప్రాంగణం లోని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కార్యాలయంలో అక్టోబరు ‘17 న  జరిగింది.
శ్రీ రావ్ తల్లాప్రగడ అధ్యక్షత వహించిన ఈ సమావేశాన్ని మొదట శ్రీ వేణు ఆసూరి తమ స్వాగత వచనాలతో ప్రారంభించారు. ఇకనుంచీ క్రమం తప్పకుండా ప్రతి సమావేశంలోనూ ఆధునిక సాహిత్యంతో పాటు, ప్రాచీన సంప్రదాయ సాహిత్యంపై కూడా ప్రత్యేక ప్రసంగాలు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇవేళ్టి ‘కాళిదాసు కావ్య వైభవం’ అనే ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల ప్రసంగకర్త , వృత్తికి సాఫ్టువేర్ ఇంజనీరయినా సంస్కృత భాషాప్రచారానికి అంకితమైన  శ్రీ విశ్వాస్ వాసుకి గారిని సభకు పరిచయం చేశారు.
శ్రీ విశ్వాస్ గారు కాళిదాసు కావ్య ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, భారతీయ సాహిత్యాన్ని కాళిదాసు పూర్వం, కాళిదాసు తరువాత అని విడదీసి చూడొచ్చని, అంతగా ఆయన భారతీయ సాహిత్య సంప్రదాయాన్ని ప్రభావితం చేశారని సోదాహరణ ప్రాయంగా విశదీకరించారు. అలాగే ఆయన కావ్యాలలో దర్శనమిచ్చే ఆనాటి భారతదేశ స్వరూపాన్ని కూడా విపులీకరించారు. దేశమంటే కేవలం భౌగోళిక రూపం కాదనీ, ఒక సాంస్కృతిక వాస్తవమనీ స్పష్టం చేశారు.
ఆ తరువాత ముఖ్యకార్యక్రమం శ్రీ నాగరాజు రామస్వామిగారు తెలుగులోకి అనువదించిన నోబెల్ బహుమతి గ్రహీత ఆక్టోవియా పాజ్ కావ్యం ‘సూర్య శిల’ (సన్ స్టోన్ ) ఆవిష్కరణ. అధ్యక్షులు, శ్రీ తల్లాప్రగడ రామచంద్రరావుగారు పుస్తకాన్ని ఆవిష్కరించి, పాజ్ గూర్చి, పాజ్ అనుసరించిన సర్రియలిజం విధానాన్ని గూర్చి, రామస్వామిగారి అనువాద ప్రాశస్త్యాన్ని గూర్చి సభకు పరిచయం చేశారు. అంకిత మందుకొన్న ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ సర్రియలిస్టిక్ శైలి గూర్చి మరికొంత వివరించారు. ప్రముఖ సాహిత్య సౌందర్యవేత్త హెర్బర్ట్ రీడ్, మార్క్సిజం+ ఫ్రాయిడిజం = సర్రియలిజం అని నిర్వచించాడనీ, జీవన వాస్తవాలని మానవ సుప్తచిత్తం శకలాలు, శకలాలుగా గ్రహిస్తూ తనకు తోచిన రీతిలో పరివర్తనం చేసుకొంటుందనీ , అందువల్ల సర్రియలిజం ధోరణిలో సహజంగానే ఒక సంక్లిష్టత చోటుచేసుకొంటుందనీ, అర్థం చేసుకోడానికే కష్టమైనదాన్ని అనువదించాలనుకోవడం గొప్ప సాహసమనీ , దాన్ని సునాయాసంగా నెరవేర్చి, తెలుగు సాహిత్యానికి శ్రీరామస్వామి గారు గొప్ప కానుక ఇచ్చారనీ, దీన్ని అంకితమందుకోవడం తన భాగ్యమనీ పేర్కొన్నారు.
అనువాదకులు శ్రీ నాగరాజు రామస్వామి గారు, మెక్సికన్ కవి అయిన ఆక్టోవియో పాజ్ భావ నేపథ్యం గూర్చి , కవిగా, వ్యక్తిగా ఆయన గొప్పదనం గూర్చి సమగ్రంగా వివరించారు. భారత దేశంలో అమెరికా రాయబారిగా ఉన్న పాజ్ ఏ పరిస్థితుల్లో ,మెక్సికన్ గౌరవం కోసం తన పదవిని త్యజించారో తెలియజేశారు. ఆయనలో పాశ్చాత్య నాగరకత పరిధి దాటి బౌద్ధ హిందూ సంస్కృతి అభిమానం బలంగా అగుపిస్తుందనీ, అదే తనను ఈ అనువాదానికి ప్రేరేపించిందనీ పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక వైవిధ్యంలో తలెత్తిన భావ సంక్లిష్టతను తెలుగు నుడికారంలో ఇమిడించడానికి తనకెదురైన సమస్యలు, అందుకు తానెంచుకొన్న పరిష్కార మార్గాలను గూర్చి సంక్షిప్తంగానే అయినా సమగ్రంగా వివరించారు. సమగ్రత కోసమే ‘సూర్య శిల’ తోపాటు మరో ఏభై ఖండికలను కూడా అనువదించి ఈ సంపుటిలో చేర్చినట్లు తెలిపారు శ్రీ నాగరాజు రామస్వామి గారు . తరువాత ప్రథమ ప్రతిని వీక్షణం సమన్వయకర్త డా. గీతామాధవికి బహూకరించారు.
పుస్తక ప్రచురణకు తోడ్పడిన అందరికి పేరుపేరున కృతజ్ఞత తెలుపుకున్నారు. పాలపిట్ట పబ్లికేషన్ అధిపతి  శ్రీ గుడిపాటి గారికి, దీర్ఘమైన ముందుమాటను అనుగ్రహించిన వాడ్రేవు చిన వీరభద్రుడు గారికి, అంకిత గ్రహీత ఆచార్య గంగిశెట్టి లక్ష్మి నారాయణ గారికి, అధ్యక్షుల వారికి, "వీక్షణం" కు ధన్యవాదాలు తెలిపారు. విశిష్ట కవి, విమర్శకులు, చిత్రకారులు, తాత్వికులు, నడిచే విజ్ఞాన సర్వస్వమైన శ్రీ చినవీరభద్రుడు గారు తన కవితా సంపుటికి పీఠిక రాయడం మహా అదృష్టంగా భావిస్తున్నాని విన్నవించుకున్నారు.
తదుపరి కార్యక్రమం సాహిత్య క్విజ్ . చతుర సాహిత్య కళా కేళి ! శ్రీ కిరణ్ ప్రభ గారు నిర్వహించిన క్విజ్ అందరినీ ఆకట్టుకుంది.

పిదప కవితాపఠనం కార్యక్రమంలో శ్రీమతి గీతామాధవి, శ్రీమతి తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం, శ్రీమతి షంషాద్ బేగం, శ్రీ వెంకట రెడ్డి, శ్రీ వికాస్ విన్నకోట మొదలగు వారు కవితలను వినిపించారు.
ఆద్యంతం ఆసక్తికరంగా మూడు గంటల పాటు ఆత్మీయంగా సాగిన సాహిత్య సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ  కార్యక్రమంలో శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి కోటేశ్వరమ్మ, శ్రీమతి మాధవి, శ్రీమతి శారద, శ్రీమతి జ్యోత్స్న తల్లాప్రగడ,  శ్రీ  లెనిన్,  శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీ అబ్దుల్లా మహమ్మద్,  శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్,  శ్రీ గాంధీ ప్రసాద్,  శ్రీ శ్రీ చరణ్,  శ్రీ భువన్,  శ్రీ మారుతీ కుమార్,  శ్రీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

------
http://www.koumudi.net/Monthly/2017/november/nov_2017_vyAsakoumudi_vikshanam.pdf
https://sujanaranjani.siliconandhra.org/%E0%B0%B5%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%82-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82-61/
http://sirimalle.com/issues/2017/11/vikshanam.html