Monday 26 January 2015

వీక్షణం సమావేశం- 28(Dec,14-2014)

వీక్షణం సమావేశం- 28

ఈ నెల 14 న వీక్షణం సమావేశం పాలడుగు శ్రీచరణ్ గారి ఇంట్లో (సాన్ హోజే ) జరిగింది. సుమారు ముప్ఫై మంది తెలుగు సాహిత్యాభిలాషులు పాల్గొన్నారు. వేద గురువు శ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రి గారు తమ మంగళాచరణాలతో, వేదమాతాస్తవ శ్రావ్య శ్లోకాలతో కార్యక్రమానికి శుభారంభం చేశారు. సాహిత్యాభిలాషి ఐన శ్రీచరణ్ గారు స్వతహాగా సంస్కృత అభినివేశీ, ఆధ్యాత్మిక అనుశీలీ అవడం వల్ల వేదగురువుతో సభ ప్రారంభంకావడం ముదావహం.
శ్రీచరణ్ గారు ఇదివరలో రచించిన 'ఛందః పద్మములు' గ్రంథప్రాశస్త్యాన్ని వారు కొనియాడారు. కార్తీక మాసం లో మిల్పీటాస్ లోని వేద దేవాలయంలో శ్రీచరణ్ గారు 30 రోజులపాటు క్రమం తప్పకుండా విరచించి సమర్పించుకున్న శ్లోకాల సమాహారం "హరిః ఓమ్ కార్తీకే రుద్రాభికోత్సవే ధ్యానమ్ "గ్రంధాన్ని శ్రీ వెంకట నాగాశర్మ గారు ఆవిష్కరించారు. హరిహరాద్వైత ఛందస్పందము ఈ గ్రంథమని ప్రశంసించారు.
మాతృభాషకు మరణం లేదని, మననం వల్ల భాష చిరంజీవి అవుతుందని, అలాంటి ప్రయత్నపర్యవసానమే ఈ "వీక్షణం" అని వాక్రుచ్చారు.



శ్రీచరణ్ గారు ప్రథమ వక్త. శీర్షిక "వేదం లో సాహిత్య విశేషాలు". వేదాల గురించి మాట్లాడుతూ, అవి కేవలం ఆధ్యాత్మిక మత వాజ్మయాలుగానే పరిగణించబడుతూ వస్తున్నందున , సాహిత్య విలువలకు ప్రాధాన్యత ఇవ్వబడని కారణంగా కాలక్రమేణ అవి మనకు దూరమై పోతున్నవని వాపోయారు. ఇంకా ఇలా చెప్పుకు పోయారు. “వేద ప్రమాణం మారనిది. నిజానికి 'ప్రమాణం' అన్నపదాన్ని నిర్వచించింది వేదమే. వేదాలు శబ్దప్రధానాలు.స్వర నిబధ్ధాలు. శబ్దోచ్చారణ లోనూ, స్వరప్రకాశం లోనూ ఎలాంటి అస్పష్టత ఉండదు. వేదాలు సంహితలుగా, బ్రాహ్మణాలుగా, అరణ్యకాలుగా , ఉపనిషత్తులుగా విస్తృతి నొందినవి. ఆ తరువాత యజుర్వేదం కూడా కృష్ణ, శుక్ల యజుర్వేదాలుగా వృధ్ధి నొందినవి. వేదం అక్షర పరబ్రహ్మం.మహర్షులు ద్రష్టలు. వాళ్లు శబ్దాన్ని విన్నారనటం కన్నా శబ్దాన్ని చూచారనటం సమంజసం. వేదము నందలి స్వరవిశేషం ఉదాత్తంగా, అనుదాత్తంగా, స్వరితంగా విభజన చేయబడింది. ఇది ధాతువులలో, సమాసాలలో ఉక్తిదోషం లేకుండా చేసుకో వీలైన విధానం.స్వరం మారితే అర్థం మారే ప్రమాదముంది. ఉదాహరణకు "రాజపుత్ర" అనే పదబంధం సందర్భాన్నిబట్టి తత్పురుషగాను, బహువ్రీహి గాను, ద్వంద్వ,కర్మధారయ సమాసంగానూ వర్తింప చేసుకునే వీలుంది.




ఇంద్రుణ్ణి చంపడానికి యజ్ఞం చేస్తూ వాగ్దోషం వల్ల, తత్పురుష సమాసం బహువ్రీహి గా మారి , అర్థం తలకిందులై తానే మరణించిన ఉదంతం ఉంది. అలాంటి అస్పష్టతకు అవకాశం లేని స్వర సంవిధానం వేదంలో ఉన్నందునే అపౌరుషేయాలైన వేదాలు ఎలాంటి మార్పులకు లోనుగాకుండా నిలిచి ఉన్నవి. పరిశీలిస్తే వేదం లో కథాకధనమే గాక నాటకీయత కూడా చూడవచ్చు. స్థిరమైన సాహిత్య రీతులు సంగ్రహంగా పొందుపరచబడి ఉన్నవి. అలాంటి వేదాలకు మనం దూరం కావడం దురదృష్టకరం. ఇలా శ్రీచరణ్ గారు సాహిత్య దృక్కోణంలో వేదజ్ఞానాన్ని సభికులకు ఎరుకపరచారు.
తరువాత స్వీయకథాపఠనం లో భాగంగా తాటిపాముల మృత్యుంజయుడు గారు కథ వినిపించారు. కథ పేరు "ఆర్ యూ రెడీ? ". ఈ కథ 'ఈ మాట' లో 2010 లో ప్రచురింపబడింది. సమకాలీన ఇతివృత్తం. వాసూ, రోజీలు ఈ కాలం యువ జంట. ప్రేమలో పడతారు. వారి ప్రేమ సినిమా వీక్షణాలతోనూ, పబ్బుల్లోను వర్ధిల్లుతుంది. తరువాత వాసు దృష్టి మరో అమ్మయి లావణ్య మీదకు పోతుంది. లావణ్యను తనదాన్నిగా చేసుకునే నిర్ణయాన్ని తెలిపేందుకు అతను ఆమె వద్దకు పోతాడు. వాళ్లిద్దరూ బీచ్ లో నడచిపోతుంటారు. లావణ్య తెలివిగా ఈ కాలపు యువ ప్రేమ వ్యవహారాల కథ వినిపిస్తుంది. సున్నితంగా, భావనిశితంగా (sentimental) ఆమె వినిపించిన కథ అతని  ఆత్మసాక్షికి(conscience) ఎక్కడో తగిలి ఉంటుంది. అతను లావణ్యను శాశ్వతంగా తక్షణం విడచి వెళ్లేందుకు వెనుతిరుగుతాడు. లావణ్య ఎక్కడికి వెళుతూన్నావని కేక వేస్తుంది. 'రోజీ దగ్గరకు' అంటున్న వాసు మాటలు సముద్ర ఘోషలో లావణ్యకు వినిపించవు. ఇందులో ఉన్న కిటుకేమిటంటే లావణ్య, రోజీలు ఇద్దరు మిత్రులు. కావాలనే లావణ్య కథ నడుపుతుంది. ఈసంగతి వాసుకు గాని, పాఠకునికి గాని ముగింపు వరకు తెలియకపోవడం కొసమెరుపు. కథ నడిపిన తీరు బాగుంది.



ఆ తరువాత గునుపూడి అపర్ణ గారు 'కాలచక్రం' అనే కథను వినిపించారు. ఈ కథ అపూర్వ చిత్ర (సినీ నిర్మాణ సంస్థ ) సహకారంతో కథల పోటీలో ఎంపికై "కౌముది" 2012 లో ప్రచురించబడింది. కథావస్తువు నేటి మధ్యతరగతి సభ్య కుటుంబంలో వంశపారంపర్యంగా సాగుతున్న జీవన సరళి. తరానికీ, తరానికీ మధ్య ఆలోచనా విధానం లో మార్పు వస్తున్నట్టు గానే కనిపించినా, మౌలిక మైన జీవన సంవేదనలు అవే. ఉత్తమ పురుష లో రాసిన కథ. తన చిన్నతనం లో తన తలితండ్రులు తన మాట వినేవారు కారు.ఇప్పుడు తన పిల్లలు వినటం లేదు. ఇది పిల్లల పెంపకంలో తలెత్తే సమస్య. కాలచక్రగమనంలో ఆమె డాక్టర్ అవుతుంది. తండ్రి పోతాడు. తల్లి వృద్ధాప్యంలో ఆమె ఇంట్లోనే వుంటుంది. పిల్లల పెంపకం లో తల్లి అనుభవించిన సమస్యలన్నీ ఇప్పుడు ఆమె అవగాహనలోకి వస్తున్నవి. తల్లి ఆరోగ్యం క్రమంగా క్షీణించిన సంగతి ఆలస్యం గా తెలిసి వస్తుంది. తల్లి మానసిక పరిస్థితి వికటించి చిన్నపిల్లలా మారాము చేస్తుంటుంది.ఇందరు పిల్లలను పెంచిన తల్లి ఈ రోజు పసిపిల్లగా మారడం సృష్టి లోని కాలచక్ర మహిమ. తల్లిని బుజ్జగిస్తూ హార్లిక్స్ తాగమని బతిమాలే దైన్య స్థితిలో కథ ముగుస్తుంది. సంఘటనల సమాహారం చక్కగా కుదిరడం వల్ల కథ రక్తి కట్టింది.

ఇక్బాల్ గారి అరబ్బీ భాషాశాస్త ప్రసంగ సిరీస్ లోని భాగంగా ఈ ఉపన్యాసం సాగింది. అరబ్బీ లిపి, వ్యాకరణ సంబంధమైన పలు విషయాలను వివరించారు. అరబ్బీ వర్ణమాలలో 28 అక్షరాలు ఉంటాయని, అవి సూర్య చంద్ర విభాగాలుగా పొందుపరచబడి ఉన్నాయని తెలిపారు. అరబ్బీ లోని మూడు షార్ట్ వోవెల్స్ అ , ఇ , ఉ లను మార్చి రాసే పద్దతిలో భాష ఎలా సంతరించుకున్నదో  వివరించారు. భాషా కుటుంబాలు వేరైనా ఉర్దూ, అరబ్బీ భాషల లిపి ఒకటేనని తెలిపారు. రానున్న సమావేశం లో మరింత లోతుగా చర్చిస్తానని చెప్పారు.
స్నాక్ బ్రేక్ తర్వాత కవిసమ్మేళనంతో కార్య క్రమం తిరిగి ప్రారంభమయింది. తొలుత నాగరాజు రామస్వామి చదివిన కవితలు 'అమెరికాలో ఆకురాలుకాలం' , 'సుప్రభాతం' . డా|| కె.గీత “వానంటే భయం లేదు” అనే చక్కని వచన కవితను వినిపించారు. విజయలక్ష్మి గారు "హుత్ హత్ తుఫాన్" కవిత చదివి విశాఖ లో ఈ మధ్య వచ్చిన తుఫాన్ భీభత్సాన్ని కళ్ళకు కట్టించారు. శంషాద్ గారి "నిన్నటి మీరు , రేపటి నేను" వచనకవిత అందరికీ నచ్చింది. శ్రీచరణ్ గారు ఆధ్యాత్మిక పద్య కవిత "పులిగోరు" చదివారు. వారి కవిత్వం లో వారు వాడిన "కండ సిరి ", "భస్మాంగ రాగమ్", "ఆకాశ వైతాళికం" "భూపుత్ర గేహం" వంటి పదబంధాలు కవితను ప్రౌఢ కవిత్వంగా మలచాయి.
ఆఖరున ఆసక్తి కరమైన సాహిత్య క్విజ్. శ్రీ కిరణ్ ప్రభ ( కౌముది సంపాదకులు) నిర్వహించిన క్విజ్ విజ్ఞాన దాయకంగా ఉండి అందరినీ ఆనంద పరిచింది.
సమావేశంలో - రచయితలూ, కవులు, అంతర్జాల సాహిత్య సంచికల సంపాదకులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, సాహిత్యాభిరుచి ఉన్నసాంకేతిక నిపుణులు- ఇలా భిన్న క్షేత్రాలలో అభినివేశం ఉన్న తెలుగు అభిమానులందరూ ఒక చోట చేరి సాహిత్య సమాలోచనంలో పాలుపంచు కోవడం అభినందించదగిన విషయం.
సుమారు మూడు గంటల పాటు ఆత్మీయంగా సాగిన సాహితీ సమావేశం డా.గీత గారి వందన సమర్పణతో విజయవంతంగా ముగిసింది.


- నాగరాజు రామస్వామి
http://www.koumudi.net/Monthly/2015/january/jan_2015_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan15/veekshanam.html


వీక్షణం - సాహితీ సమావేశం 27 (Nov-26,2014)

వీక్షణం - సాహితీ గవాక్షం

27 వ సమావేశం
( మాసం మాసం శ్రుత సాహిత్యం )
నవంబర్ 16, ఆదివారం రోజున, ఈ నెల వీక్షణం సాహితీ సమావేశం శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో వారి కుమారుడు శ్రీ వంశీ గారి ఇంట్లో (ఫ్రీమాంట్) జరిగింది. పాతిక మంది తెలుగు మిత్రులు కలసి చేసుకున్న సాహిత్య విందు! శ్రీ గంగిశెట్టి వారి లాంచన ఆహ్వానానంతరం శ్రీ అక్కిరాజు రమాపతి గారి అధ్యక్షతన సభ ప్రారంభమయింది.




మొదట శ్రీ వేణు ఆసూరి గారు వాల్మీకి రామాయణం పై కీలక ప్రసంగం చేశారు. రామాయణం సమగ్ర ఆదికావ్యమనీ, తనకెంతో ఇష్టమైన విశిష్ట గ్రంథమనీ, ఇతివృత్తం గానే గాక కథాకథన రీతిలో, ప్రక్రియా పరమైన కావ్య రచనా విధానంలో కూడా రామాయణం విశేష కావ్యమని అన్నారు. ఉదాహరణకు నాటకీకరణ (Dramatisation). వాల్మీకి రామాయణంలో సంఘటనలు సమాంతరం గా ప్రవహిస్తాయి. ఒకే సందర్భానికి చెందిన వివిధ సంఘటనలు ఒకదాని ప్రక్క మరొకటి ఏక కాలంలో ప్రదర్శితమవుతున్నందున నాటకీయతకు బలం చేకూరింది . పట్టాభిషేక ఘట్టంలో ఒకవైపు నగరంలో పుర వీధుల అలంకరణ సాగుతుంటుంది. అంతఃపురంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతుంటవి. అంతలోనే కైక ప్రవేశిస్తుంది. ఇంకో దిక్కు నుండి మంథర ప్రవేశిస్తుంది. మరో వైపు రాముడు ఆయత్తమౌతుంటాడు. వరం తీర్చకుంటే విషం తాగి చస్తానంటుంది కైక. దశరథుడు గుండె కోతకు గురి అవుతుంటాడు. ఇలాంటి గొలుసు కట్టు సంఘటనల సమాహారాన్ని ఒక విశిష్ట రీతిలో విరచిస్తాడు వాల్మీకి. ఒక సన్నివేశ శకలానికి సమగ్ర స్వరూపమిస్తూ, వెనక్కి వచ్చి మరో సన్నివేశాన్ని ఆవిష్కరిస్తూ నాటకాన్ని నడిపిస్తుంటాడు. ఇది నేటి సినిమాటిక్ స్టైల్ కు భిన్నమైనది. సంఘటనల సంవిధానంతో సన్నివేశాన్ని బలోపేతంచేసి కావ్యంలో నాటకీయతను ప్రతిష్టించి రక్తి కట్టిస్తాడు.



సీతాదేవి వనవాసానికి వెళ్ళే ముందు అంతఃపుర స్వజనం ఎదుట నార చీరలు ధరించే సన్నివేశం, భరతుణ్ణి పిలిచేందుకు ఆఘమేఘాల మీద అశ్వికులు పరుగెత్తడం, అటు సీతారాములు వనవాసానికి బయలుదేరి పోతుండడం, ఇటు దశరథుడు ప్రాణాలను వదలడం వంటి పలు సమాంతర సంఘటనలు రసపోషణ నాటకీయ రచనాశైలికి నిదర్శనాలు. షేక్స్పియర్ లాగే వాల్మీకి కూడా సంభాషణల ద్వారా పాత్రల స్వభావాన్ని వ్యక్త పరుస్తాడు. రాముడు సౌమ్యుడు.

రావణుడు అందుకు భిన్నుడు. వాల్మీకి అనుసరించిన విశిష్ట కథన రీతిలో, పాత్ర చిత్రణలో ఈ పాత్రోచిత భిన్న స్వభావాలు మరింత ప్రస్ఫుట మౌతాయి. చక్కని character build-up! ఇందులో flash back లు అనేకం. వీటితో గత వంశ చరిత్ర అభివ్యక్త మౌతుంది.ఆనాటి వందిమాగధుల పాత్ర నిజానికి అదే. శ్రీ రామున్ని విశ్వామిత్రుడు అడవికి తీసుకెళ్తున్నప్పుడు చెప్పిన కథనాలు, భగీరథ, శ్రవణ కుమారుల కథలన్నీ ఫ్లాష్ బాక్ లే.

వాల్మీకి రామాయణంలో అద్భుతమైన ఉపమానాలు కోకొల్లలు.అబ్బుర పరిచే వర్ణనలు అనేకం. లంకాపురి, అయోధ్య వంటి నగరాల వర్ణనలు అమోఘం. ఉపనయన శ్లోకాలలో ఉటంకించబడిన ఉదాత్తమైన పదహారు కళలు రాముని పట్ల అన్వయింపబడ్డాయి. అందుకేనేమో రాముడు షోడశ కళల రామచంద్రుడయ్యాడు! గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞస్య, కృతజ్ఞస్యాది పదహారు లక్షణాలు వాల్మీకి రామాయణంలో అడుగడుగునా document చేయబడినాయి.

ఇందులో ధర్మాధర్మ విచక్షణ, రాజధర్మ పాలనారీతి పాత్రల ద్వారా చెప్పబడింది. పలు వ్యాఖ్యానాలు కల సుందర కాండలో హనుమంతుడు ధృతి, దృష్టి, మతి, దాక్షం(పటుత్వం) వంటి సల్లక్షణ శోభితుడుగా వర్ణింపబడ్డాడు. ఇందులో విహిత కర్మల, నిషిద్ధ కర్మల ప్రస్తావన ఉంది. శ్రీభాష్యం అప్పలాచార్యులు, చాగంటి కోటేశ్వరరావు వంటివారు సీతారాములను ఆత్మ పరమాత్మ అద్వైత రూపాలుగా దర్శించుకున్నారు.

వాల్మీకి రామాయణం ఒక అపూర్వమైన కావ్యనిర్మాణం!
ఇలా శ్రీ వేణు అసూరి గారు అద్భుతమైన ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
అధ్యక్షులు శ్రీ అక్కిరాజు రామాపతి గారు తన స్వీయ రచన ఐన 'శ్రీ రామాయణ సంగ్రహం' గ్రంధాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడారు. 24000 శ్లోకాలతో 7 కాండలలో విస్తరించిన వాల్మీకి రామాయణం ఎందుకు ఆత్మీయమవుతూ వస్తున్నదో వివరించారు. మనకు 1008 రామాయణాలు ఉన్నవి. ఆసేతు హిమాలయ పర్యంతం సగం రామాయణ కథలే ఉన్నవి. లలిత కవిత్వం, మానవ సంబంధాలు, వర్ణనలు, చిత్రవిచిత్ర మైన కథలు రామకథలో ఆకర్షణీయంగా చెప్పబడ్డాయి. ఇంకా విప్పవలసిన ఎన్నో ప్రక్షిప్తాలు ఉన్నప్పటికీ రామాయణం మనం అధ్యయనం చేయవలసిన ఆరాధ్య గ్రంథం అని చెప్పుకొచ్చారు అధ్యక్షులు.

శ్రీ శ్రీచరణ్ గారి స్పందన నిజానికి పై వక్తల రామాయణ విశేషాల పొడిగింపు; ఒకటి రెండు అభ్యంతరాలు మినహా. "భూమి సుతా మనోంబురుహ పుష్కల రాగ ......శోభన రామున కంజలించెదన్" అంటూ "చిల్లర"వారి పద్యంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. యుగవిభజనను క్లుప్తంగా వివరించారు. మొల్ల రామాయణంలో రామరాజ్య వర్ణనలో కవిత్వం గుప్పించబడిందన్నారు. రెండక్షరాల "రామ" శబ్దం పదికోట్ల శ్లోకాలకు సమానమని వాక్రుచ్చారు. రాక్షసుడైన మారీచుని చేత కూడా "రామో విగ్రహామాన్ ధర్మమ్"అని ప్రశంసించబడిన రాముణ్ణి తలచుకున్నారు. అధ్యక్షుల వారు సందేహించిన వాలి సంహార ఘట్టాన్ని రామ పక్షపాతిగా సమర్ధించారు. gladiator తరహాలో వాలి క్రూర వినోదాలు జరిపించేవాడనీ, అలాంటి జంతు సమానమమైన వాలిని అలా చంపడం సబబేనని శ్రీచరణ్ గారు చెప్పుకొచ్చారు. మాయలేడి రూపము లో ఉన్న మారీచుడు "హా లక్ష్మణా" అని అరవటానికి కారణం రావణునికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే కాని రాక్షస నైజం కాదని తెలిపారు. శ్రీ చరణ్ గారి ప్రసంగం సాధికారంగా సహేతుకంగా సాగింది.
వేమూరి వేంకటేశ్వర రావు, ఇక్బాల్, చుక్కా శ్రీనివాస్ మొదలైన వారి స్పందన ప్రతిస్పందనల తో చర్చ ఆసక్తికరం గా సాగింది.
తర్వాత, అతిథేయులు శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణగారు శ్రీ కిరణ్ ప్రభ గారిని (దంపతులను) వేల పురాతన అలభ్య గ్రంధాలను ఈ- పుస్తక రూపం లో ఉంచిన సాహిత్య సేవకు గుర్తుగా శాలువ కప్పి సత్కరించారు. ప్రౌఢ కవిగా పరిచయం చేస్తూ నాగరాజు రామస్వామినీ, కవితా రజతోత్సవ సందర్భంగా కవయిత్రి డా||కె.గీత గార్లను కూడా శాలువలు కప్పి సన్మానించారు. అది వారి ఔదార్యానికి సహృదయతకు సాహిత్యతత్పరకు ఆనవాలు!

తరువాతి కార్యక్రమం కవిసమ్మేళనం. ఈ సారి ఎక్కువ మంది కవితలు చదివారు.మొదట నాగరాజు రామస్వామి తన మనుమడు చిరంజీవి అర్ణవ్ రాసిన ఆంగ్ల పద్యానికి ఆత్మీయానువాదం "హరితం" కవిత వినిపించాడు. శంషాద్ బేగం "తుఫాన్", "మందివ్వమ్మా" కవితలు చదివారు. డా||కె.గీత గారు 'నదులను పొరలు చేసి ......' అంటూ "ఖండాంతరాలలో అపరాహ్ణం" కవిత వినిపించారు. వంశీ ప్రఖ్య గారి "స్మార్ట్ మనిషి"అనే కవితలో 'వేలు ఆడక పొతే వేలాడిపోయే అధునాతన బతుకులను' వ్యంగీకరించారు.'అప్రాశ్చ్య దేశం' లోని 'ఆప్ దేవతలను' వినోదాత్మకంగా కవిత్వీకరించారు. రావు తల్లాప్రగడ గారి 'మావూరి వారు' కవితలో నాస్టాల్జియా అందంగా రూపొందింది. వేణు ఆసూరి గారు వినిపించిన రెండు చక్కని కవితలు 'కొవ్వొత్తులు', 'కొత్తబట్టలు' . శ్రీచరణ్ గారి 'కార్తీక మాసం' కవిత శివ విష్ణువులు ఏకమైన ఆధ్యాత్మిక లోతులున్న అద్వైత కవిత్వం. శ్రీమతి విజయలక్ష్మి కొత్త కోడలిని ఆహ్వానించినప్పటి కవితను వినిపించారు.

విద్యావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, విశ్రామ ఉపకులపతి శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారిని పద్య వైభవం గురించి మాట్లాడమని కోరగా వారు ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకైన 'పారిజాతపహరణం' లోని ఒకటి రెండు పద్యాలను అత్యంత రమ్య మనోహరంగా వివరించి వినిపించారు. ధ్వని శిల్పం, అర్థ శిల్పం పారిజాతాపహరణ కావ్యంలో పుష్కలంగా వుందన్నారు. 'ఎంతకు లేడు నారద మునీంద్రుడు!' పద్యాన్ని ప్రస్తావించారు. "అతుల మహాను భావమని అవ్విరి తా నొక పెద్దసేసి అచ్యుతునకు ఇచ్చకం బొదవ సూడిద ఇచ్చిన ఇచ్చె గాక , ఆ మతకరి మమ్ము తలంపగ నేల అచ్చటన్". ఈ పద్యం లో సత్యభామ స్వభావం ద్యోతక మౌతుందని, 'మతకరి', 'సూడిద' వంటి పదాల వెనుక వెటకార ధ్వని అందంగా పొదుగ బడిందని వారన్నారు. ధ్వనిశిల్పం అద్వితీయంగా పొందు పరచుకున్న పద్యం -"జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు లతాంతాయుదు కన్నతండ్రి శిర మచ్చోమ వామ పాదమున తొలగం జేసె లతాంగి . అట్లగు,నాథుల్ నేరముల్ సేయ పేరలుకన్ చెందిన కాంతలుచిత వ్యాపారముల్ చేయ నేర్తురే!" . లలితమైన పదాలతో వర్ణించబడిన ఈ పద్యంలో కృష్ణుని కోమలత్వం అత్యంత సుందరంగా అభివ్యక్తీకరించబడిందని తెలిపారు.ఇలా గంగిశెట్టి గారి పద్య పఠనం తో శ్రోతలు మం త్ర ముగ్ధులయ్యారు.

తరువాత, కిరణ్ ప్రభ గారు నిర్వహించిన సాహిత్య క్విజ్ ఆసక్తి దాయకం గా కొనసాగి అందరినీ ఆనంద పరిచింది.
గూప్ ఫోటో తర్వాత అతిథేయులు ఇచ్చిన పసందైన early dinner! సాహిత్య విందు తో పాటు ఆత్మీయమైన విందు భోజనం!
ఈ నాటి వీక్షణం సమావేశం సుమారు నాలుగు గంటలపాటు ఆద్యంతం ఆసక్తి కరంగా ఆనందదాయకంగా సాగింది.
- నాగరాజు రామస్వామి
http://www.koumudi.net/Monthly/2014/december/dec_2014_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec14/veekshanam.html

వీక్షణం -సాహితీ గవాక్షం-ద్వితీయ వార్షికోత్సవ సమావేశం (Sep,21-2014)

వీక్షణం -సాహితీ గవాక్షం
ద్వితీయ వార్షికోత్సవ సమావేశం
                                   
               సెప్టెంబర్ 21 ఆదివారం. ఉదయం 10 గంటలు. బేఏరియా  తెలుగు సాహిత్యాభిలాషులతో మిల్పిటాస్ స్వాగత్ హోటల్ కళకళలాడింది.  సాహితీ మిత్రులు తమ "వీక్షణం" ద్వితీయవార్షికోత్సవాన్ని  
అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. 
               కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత , కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి  ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, మచిలీపట్నం 'సాహితీ మిత్రులు' సంస్థ అధ్యక్షులు, 'రావిరంగారావు సాహిత్యపీఠ' వ్యవస్థాపకులు  డా. రావి రంగారావు గార్లు విశిష్ట అతిథులు.. 
               వీక్షణం నిర్వాహకులు డా|| కె.గీత గారి ఆత్మీయ ఆహ్వానం తో సభ ప్రారంభమయింది. మొదటి సెషన్ కు అధ్యక్షులు డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. మొదటి వక్త  రావి రంగారావు గారు. 


               రావి రంగారావు గారు 'బాల గేయాలు' అంశం పై ప్రసంగించారు. బాల సాహిత్య రచన పిల్లల నుడికారానికి తగినట్టుగా సంయుక్తాక్షరాలు లేని సరళ భాషై ఉండాలన్నారు. రచయితకు ప్రాస, అక్షర మైత్రి, పునరుక్తి, పదగ్రస్త ముక్తకాల వంటి సాహిత్య లక్షణాల స్పృహ ఉండటం అవసరమన్నారు. వయోపరిమితిని బట్టి  స్థూలంగా పిల్లలను పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలో విభజించుకొని అందుకు అనుగుణమైన రచనా సంవిధానాన్ని అనుసరించాలన్నారు. హాస్యం, శబ్ద మాధుర్యం, ధ్వన్యనుకరణ , శబ్ద క్రీడ ,కథారూప బోధన, కొసమెరుపుల కితకితల వంటి పద్ధతులతో లేత మనసులను ఆకట్టుకునే విధానాలు బాల సాహిత్య కవుల ఉపకరణాలు కావాలన్నారు. చిన్నారులకు అర్థమైన భాషలో రాస్తేనే వాళ్లు ఆకర్షితులవుతారు కనుక కవికి నిర్దిష్టమైన లక్ష్యం ఎంతైనా అవసరం అన్నారు. తాను రాసిన 'రావిచెట్టు గేయాలు', ఇటీవల తన మనుమని పై రాసిన 'బాలల గేయాలు' లోని కొన్ని జనరంజక కవితలను వినిపించి శ్రోతలను ఆనందింపజేశారు.రావి రంగారావు గారి ప్రసంగం చింతాదీక్షితులను తలపింప జేసిందని అధ్యక్షుల వారు అనటం విశేషం.

                తరువాత  అనిల్ రాయ్ గారు 'సోషల్ మీడియాలో కథ' అంశంగా ఆలోచనాత్మక ప్రసంగం చేశారు. ఈనాటి అంతర్జాలం , వెబ్ పత్రికలు అందరినీ అనుసంధించే సౌలభ్యాన్ని కల్పిస్తున్న మాట వాస్తవమే , కాని వాటిలో ఈమధ్య పెచ్చుమీరి వస్తున్నఅవాంఛనీయ కాంటెంట్ అభ్యంతరకరమైనదే. స్త్రీవాదం పేరిట, వాస్తవ అభివ్యక్తి పేరిట, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరిట జుగుప్సాకరమైన అశ్లీల కథా సాహిత్యం రావటం కలత చెందించే విషయమేనని వాపోయారు.

              పిదప వేణు అసూరి గారు తెలుగు పద్యం మీద తనకున్న ప్రేమను, అభిరుచిని అత్యంత ఆకర్షణీయ మైన శైలిలో అభివ్యక్తీకరించారు. సింగారాచారి, అరిపిరాల విశ్వం వంటి ఉపాధ్యాయుల స్ఫూర్తి తోనే పద్యం పై మక్కువ పెరిగిందని తెలిపారు. నూతిలో పడిన  దేవయానిని యయాతి మహారాజు రక్షిస్తున్న సందర్భంలో నన్నయ విరచితమైన 'జలధి విలోలిత' పద్యం ఒక గొప్ప పద్యమని వివరించారు. ముక్కుతిమ్మనార్యుని ముద్దు పలుకు ' పారిజాతాప హరణం ' తనకెంతో ప్రీతిపదమైన ప్రబంధ కావ్యమని తెలుపుతూ  'ఈసునబుట్టి ...','నేయి బోయ భగ్గున దరికొన్న భీషణ హతాశన కీల యనంగ' లాంటి పలు పద్యాలను శ్రావ్యం గా వినిపించారు. కోపోద్దీప్త ఉరగాంగన ఐన సత్యభామ ప్రవర్తనను చిత్రించడంలో ప్రౌఢ ప్రభంధనాయికా సల్లక్షణాలు ఎక్కడా భంగపడ లేదు! పోతన ఆంధ్ర భాగవతం లోని పద్యాలు, ముఖ్యం గా 'భద్ర కుంజరం' కంద పద్యాలు, 'ఇంతింతై వటుడింతై బ్రహ్మాండ పర్యంతమై', 'మనసారథి మనసచివుడు ' వంటి పద్యాలు తనకెంతో ఇష్టమైన పద్యాలని వాక్రుచ్చారు. విరాట పర్వంలోని తిక్కన గారి పద్యం 'ఇభమద పంకము...' అద్భుతమైన పద్యమని అభివర్ణించారు. ఇలా వేణు అసూరి గారు అత్యంత శ్రావ్యంగా చేసిన పద్యపఠన ప్రసంగం అందరినీ ఆనంద పరిచింది.

               తరువాతి కార్యక్రమం పుస్తకావిష్కరణ. శ్రీమతి శంషాద్ గారి తొలి వచన కవితా సంపుటి 'ఈ కిటికీ తెరచుకునేది ఊహల్లోకే' ను శ్రీ కిరణ్ ప్రభ, డా|| కె.గీత, శ్రీ ఇక్బాల్, రచయిత్రి భర్త అహ్మద్ గార్ల సమక్షంలో శ్రీ గంగిశెట్టి లక్ష్మి నారాయణ గారు, శ్రీ  రావి రంగారావు గారు సంయుక్తం గా ఆవిష్కరించారు. 
               తరువాత, శ్రీ తిరుమల పెద్దింటి నరసింహాచార్యుల వారు 'సాహిత్యంలో చాటువులు' అంశం పై ప్రసంగించారు.సహితస్య భావం సాహిత్యం - హితమును చేకూర్చేదే  సాహిత్యం, రసాత్మకం వాక్యం కావ్యం అంటూ చాటువులు విశేషార్థ ప్రక్షిప్తాలని  సెలవిచ్చారు. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పై ఉన్న సాంప్రదాయ సాహిత్య ప్రభావం మొదలుకొని శంకరాభరణం సినిమా లోని అద్వైత ఆపాదన దాకా, పెద్ద బాలశిక్ష లోని మేకపోతు గాంభీర్యం కథ నుండి మూఢాచారాల రాగిచెంబు కథ దాకా, సమస్యాపూరణాల నుండి ఆశుకవిత్వ అప్రస్తుత ప్రసంగాలదాకా, శ్రీనాథుని చాటువులనుండి 
'ప్రసన్నకలితార్థ యుక్తి' దాకా  పలు విషయాలను చాటువు సాహిత్య సందర్భోచితంగా వివరించారు. 'సిరిగల వానికి చెల్లును పదివేలు... ,తిరిపెమునకు చాలు నిద్దరు','కుంజరయూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్', 'కొండనుండు నెమిలి.....' వంటి వాక్చమత్కార చరణాలు వల్లించారు. స్థాలీపులాక న్యాయంగా పలు పద్య పాదాలను ప్రసంగంలో పొందుపరచారు. విద్వత్ సభలలో నలుగురి నోట పలు సందర్భాలలో జాలువారిన కవిత్వం చాటువుల రూపుదిద్దుకొందని వాక్రుచ్చారు.
            మహ్మద్ ఇక్బాల్ గారి ఆధ్వర్యంలో వీక్షణం ప్రత్యేక సంచికల ప్రెసెంటేషన్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇరవై రచనలతో కూడిన వీక్షణం ప్రత్యేక సంచిక -2014, ఇరువైనాలుగు నెలలుగా జరిగిన వీక్షణం సమావేశాల రివ్యూల సంచిక-ఈ రెండు ఈ- పత్రికలు తెర  పైన ఆవిష్కరించబడినవి. వేదిక మీద జరుగుతున్న కార్యక్రమ అవసరాలకు అనుగుణంగా ఈ తెరను అనువర్తింప చేయడం జరిగింది.ఈ-పత్రిక ఆవిష్కరణలో భాగస్వాములైన శ్రీ నాగరాజు రామస్వామి మున్నగు వారిని  వేదిక మీదికి పిలిచి అభినందించడం జరిగింది. 
               ఈ వేడుకల రెండవ సెషన్ రావి రంగారావు అధ్యక్షతన డా|| కె.గీతా మాధవి గారు శ్రావ్యం గా పాడిన కృష్ణశాస్త్రి గారి లలితగీతాలతో ప్రారంభమయింది. 'తొలిపొద్దు కొండపై వెలసిన ఒక దేవళము', 'ఒదిగిన మనసున ఒదిగిన భావం ! కదిపేదెవ్వరో' , 'అలికిడైతే చాలు ఆశతో వెదికేను కనులు' వంటి గీతాలను వినిపించారు. "ఇలా  పాటలను పాడుకుంటూ వుంటే ఇక్కడికి వెన్నెల వచ్చేస్తుంది" అంటూ కవితాత్మకంగా కృష్ణ శాస్త్రి గారిని ఆత్మీయంగా తలచుకున్నారు..
               తర్వాతి కార్యక్రమం డా|| కె.గీత గారికి కవితా రజతోత్సవ సాహిత్య పురస్కారం. 'రావి రంగారావు సాహిత్యపీఠం' సాహితీ మిత్రుల సంస్థ ఆమెను సత్కరించారు. 3 స్వీయ కవితా సంకలనాలు,300 కవితలు, కథలు, వ్యాసాలూ, పత్రికలకు అనేక కాలమ్స్ రాసిన/ రాస్తున్న గీత గారిని సిలికాన్ తీరంలో స్వాగతహారమనీ, మానవ అనుబంధాల దీపమనీ అభినందిస్తూ రంగారావు గారు శాలువ జ్ఞాపిక ల తో సత్కరించారు. పాతికేళ్ళుగా సాగుతున్న ఆమె కవిత్వ వ్యవసాయానికి గుర్తింపుగా ఈ వేడుకను ఆమె సాహిత్య రజతోత్సవంగా భావించడం సబబన్నారు.
               తదనంతర కార్యక్రమ అంశం శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి కీలక ప్రసంగం-"మహా భారతం -పర్వ పునః సృజన". ప్రసిద్ధ కన్నడ రచయిత S.L.బైరప్ప మహాభారత ఇతిహాసాన్ని ఆధునిక క్లాసిక్ గా మలచి రచించిన "పర్వ" కు శ్రీ లక్ష్మీనారాయణ గారు తెలుగులో అనుసృజన చేసి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. అత్యంత ఆసక్తి దాయకంగా సాగిన వారి ప్రసంగం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. ప్రసంగ సారాంశం ఇలా వుంది. మహాభారతాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, భారతం పై వ్రాయడం కష్టమైన పని. నన్నయ గారి మదాంధ్ర మహాభారతం 'అవతారిక' లో వ్యాస భారత ప్రామాణికత ద్యోతకమౌతుంది. తెలుగు సాహిత్య విద్యార్థి అధ్యయనాన్ని నన్నయ తో ప్రారంభిస్తే మంచిది. బైరప్ప గారు మహాభారతాన్ని "పర్వ" అన్నారు. పర్వ అంటే ఉత్సవం. భారతం విషాద సాహిత్యం. జీవుని విషాదం. విశ్వనాథుని "జీవుని వేదన" ఈశ్వరునితో ఐక్యం కావడానికి పడే వేదన. బైరప్ప గారి వేదన జీవుడిగా వేరుపడటం వల్ల కలిగే వేదన. భారత శబ్దాన్ని విడగొట్టి చూస్తే - భా అంటే జీవ కాంతి, రతం అంటే క్రీడ. జీవుడు పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ సాగే  ఈ క్రీడే, జీవుని ఈ విషాద గాథే భారత కథ.మహాభారతం. అనంతమైన ఈ విషాదానికి సమాధానం భగవద్గీత! సింధూ నాగరికత తదనంతర లోహయుగ దశ (పి.డబ్ల్యు.జి) సంస్కృతి కురు పాంచాల గాధ  అంతా విషాదమయం.వేదనా భరితం. భారత ఇతిహాసం లోని ద్రౌపది భీష్మాదుల గాథ అంతా వారి అంతరంగ విషాదమే. ఆ విషాదం లోని సర్వ పార్శ్వాలను ఆ అంతరంగ వేదనల ప్రాతిపదికగా భారత కథను లోతుగా కొత్త కోణం లో దర్శించి ఆవిష్కరించి నందు వల్లే బైరప్ప గారి "పర్వ" అపూర్వ మయింది.
              తరువాత, ప్రఖ్యాత నాట్య విద్వాంసులు వెంపటి చిన సత్యం గారి పుత్రుడు వెంపటి వెంకట్ గారు సభకు రావడం యాదృచ్చికం. వారు సమకాలీన సాహిత్యం - నాట్య కళ సంబంధం గురించి క్లుప్తంగా మాట్లాడారు.సాంధ్ర సాహిత్యం లేందే  నాట్యకళ బతకదు. కాని దురదృష్టవశాత్తు ఈనాడు ఆ సాహిత్య సంపద కొరవడిందని వాపోయారు.
               పిదప, శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు తెలుగు నాటకం గురించి ప్రసంగిస్తూ 'నాటకం కావ్యేషు రమ్యం', నాటకం నాదరస భరితం, కాళిదాసు అందుకే నాటకాన్ని చాక్షుసయజ్ఞం గా అభివర్ణించారని అన్నారు. సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం. కావ్య నాటకానికి ఈ రెండింటి అనివార్యతను ఉటంకిస్తూ బలిజేపల్లి లక్ష్మీ కాంత రావు, తిరుపతి వెంకట కవులను గుర్తు చేసు కున్నారు. 'బావా ఎప్పుడు వచ్చితీవు', 'అదిగో ద్వారక, ఆలమందలవిగో' లాంటి మరువలేని నాటక పద్యాలను గొంతెత్తి పాడారు. నాటకాన్ని బతికించాలి, పోషించాలి అని అన్నారు. 
                  కిరణ్ ప్రభ గారు చరిత్ర పుటల్లో తెరమరుగైన అసామాన్య వ్యక్తి  శ్రీ బంకుపల్లి మల్లయ్య గారి జీవిత విశేషాలను ప్రస్తావిస్తూ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. గురజాడ 151వ  జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని చేసిన ఈ ప్రసంగం సందర్భోచితం. కందుకూరి వీరేశలింగం, కాశీనాధుని  నాగేశ్వర రావు , గిడుగు రామమూర్తి వంటి సంఘ సేవకుల కోవకు చెందిన బంకుపల్లి మల్లయ్య గారు 1876 లో శ్రీకాకుళం జిల్లా లోని ఉర్లాం లో జన్మించారు. మూడు వేదాలను తెనుగించిన తొలి తెలుగు బిడ్డ. నిమ్నవర్గాల ఉద్ధరణకు కంకణం కట్టుకుని, బాలవితంతు వివాహాలను కేవలం ప్రోత్సహించడమే కాక ఆచరించి చూపించిన అభ్యుదయ మూర్తి. తానూ తన పిల్లలకూ సైతం బాల వితంతువులనే ఎంచుకున్న సంఘ సంస్కర్త. కాశి ప్రయాణానంతరం మార్గ మధ్యం లో ఖరగ్ పూర్ లోని ఒక నిమ్న జాతి కుటుంబీకుని ఇంటిలో చివరి శ్వాస వదలి , మరణం లోనూ  తన ఆశయాలను ఆచరించి చూపిన  ఉన్నత వ్యక్తి బంకుపల్లి మల్లయ్య గారని కిరణ్ ప్రభ గారు తెలిపారు.
                

తదుపరి కార్యక్రమం కవిసమ్మేళనం. చక్కని కవితలు వ్రాసిన పన్నెండు మంది కవులు సమ్మేళనం లో పాల్గొన్నారు.రావు తల్లాప్రగడ గారు 'అహంకార స్తోత్రం', శ్రీ నాగరాజు రామస్వామి 'ఆప్త సంధ్య', డా|| కె.గీత గారు 'అతనితో నడచే సాయంత్రం', శ్రీచరణ్  'పద్యాలు', శ్రీమతి శంషాద్ 'ఇదే ఇదే పదే  పడదే', వరకురు ప్రసాద్ గారు 'పని', ఇక్బాల్ గారు 'ఉపవాసం', రాచకొండ విజయలక్ష్మి గారు 'వీక్షణం ', వేణు ఆసూరి గారు 'అమ్మా నువ్వు గుర్తొచ్చావే' , రాధిక గారు 'రాబోయే తరం లో కనపడనివి', నరసింహాచార్యులు గారు 'కాలమహిమ' కవితలను వినిపించారు. చుక్కా శ్రీనివాస్ గారు బాల గంగాధర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం లోని 'నిన్న రాత్రి ' కవితకు ఆంగ్లానువాదం  'లాస్ట్ నైట్ ' వినిపించారు. 
                  కిరణ్ ప్రభ గారి సాహిత్య క్విజ్ ఆసక్తి కరంగా జరిగింది.
                   విశిష్ట అతిథులు శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారిని, రావి రంగారావు గారిని సభలో పెద్దవారైన గోపాల స్వామి గారి చేతుల మీదుగా వీక్షణం మిత్రులు  శాలువాలతో సత్కరించడం జరిగింది.
                   గ్రూప్ ఫోటో, పసందైన స్వాగత్ విందు భోజనం! 
                   ఆఖరు గోష్ఠి 'ప్రత్యేక చర్చా కార్యక్రమం'. ఈ మధ్య విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు వేర్వేరు ప్రామాణిక భాషలు ఉండాలా అన్నది చర్చనీయాంశం. శ్రోతల నుండి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. చర్చ ఆసక్తి కరంగా సుహృద్భావ వాతావరణంలో కొనసాగింది. ఈ అసహన చర్చకు సమన్వయ ముగింపు పలుకుతూ భాషా వేత్తలైన గంగిశెట్టి గారు వ్యక్తి భాష ,మాండలిక భాష, వ్యవహార భాష లాగే ప్రామాణిక భాష కూడా అవసరాల మేరకు అనువైన స్వరూపంగా  పరిణమిస్తూనే ఉంటుందని సెలవివ్వడం హర్షదాయకం.
                    ఆరు గంటల పాటు ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ  'వీక్షణం' ద్వితీయ వార్షికోత్సవం ఆనంద సందోహంగా, ఆత్మీయ సంగమంగా ,సాహితీ వీక్షణ గమనంలో మరుపురాని మైలు రాయిగా మిగిలి పోయిందనడం లో సందేహం లేదు. ఈ సభలో  కె.శారద, లెనిన్, పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్, గోపాల స్వామి, కాంతి పాతూరి, ప్రసాద్ మంగిన, రాధిక, మంజుల జొన్నలగడ్డ, సింధూర, అపర్ణ గునుపూడి మొ.లైన వారు పాల్గొన్నారు.
               -నాగరాజు రామస్వామి 
http://www.koumudi.net/…/oct_2014_vyAsakoumudi_vikshanam.pdf 
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=26747&SupID=36 
http://telugutimes.net/…/1368-vikshanam-second-anniversary-…