Tuesday 25 December 2012

వీక్షణం సాహితీ సమావేశం- 3 (Nov11, 2012)

వీక్షణం సాహితీ సమావేశం- 3
నవంబర్ పదకొండవ తేదీన, వీక్షణం మూడవ సాహితీ సమావేశం బే ఏరియా లోని ఫ్రీమౌంట్  నగరంలో శ్రీ వంశీ ప్రఖ్య గారి ఇంటిలో జరిగింది. సాయంత్రం మూడు నుండి ఆరు గంటల వరకు  జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ వేమూరి వెంకటేశ్వర రావుగారు  అధ్యక్షత వహించగా, స్థానిక రచయితలు, కవులు పాల్గొన్నారు.

‘అభినవ వివేకానంద’ అని బిరుదాంకితులైన కవి, శ్రీ ప్రొద్దుటూరి యెల్లారెడ్డిగారు, ఆ సమావేశానికి మఖ్య అతిథులుగా వచ్చి “సాహిత్యంలో జాతీయత” అన్న అంశంపై ప్రసంగించారు. కావ్య లక్షణాలు గురించి తెలుపుతూ ఆనందము, ఉపదేశము ముఖ్యమని తెలియచేసారు. అదే విధంగా జాతీయత అనేది మానవీయ కోణంలో ఉండాలి అని ఆకాంక్షించారు.
ఆది కవి నన్నయ్యతో మొదలిడి, ఆధునిక కవులవరకు వారి కవితలలో జాతీయతను, సమాజ శ్రేయస్సును ఎలా కోరుకున్నారో వివరించారు.  నన్నయ్య మనిషి సత్యమార్గంలో నడవాలని  తెలియజేసిన
"నుతజల పూరితమైన నూతులు నూరిటి కంటె  సూనృత వ్రతయగు నొక బావి మేలు "  పద్యంతో  వివరించారు.

తిక్కన కాలానికి దైవారాధనలో భేదాలు ఏర్పడి, శైవం వైష్ణవాలుగా విడి పడిన సమయంలో, హరిహరుడు అనే దైవాన్ని సృష్టించి, శివ,కేశవుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పి తత్కాలీన సామాజిక సమస్యలను ఎలా పరిష్కరించారో  “ "శ్రీ యన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి " పద్యంతో
చెప్పి, కవులన్న వారు సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని, సత్యాన్ని కాపాడడం మానవ కర్తవ్యమ్ అని  చెప్పారు.

ధర్మమూ, ధర్మ సూక్ష్మము వేరు అని, ఎఱ్రన్న పద్యాలను ఉటంకించారు. కవితాత్మను ఆవిష్కరించటం ముఖ్యమని వివరించారు. పోతన తన కవితల ద్వారా సత్యాన్వేషణ,  ఆడిన మాట తప్పకుండుట ముఖ్యమని చెప్పారు. శతకము అనేది, సమాజ సంరక్షణకు తోడ్పడాలని, “సర్వేశ్వర శతకము”లో అన్నమయ్య నరుడే నారాయణుడు అని తెలిపిన సంగతి వివరించారు.
శ్రీనాథ మహాకవి ఒక గొప్ప మానవతావాది అని, ఆయన చెప్పినట్లు పర్వతాలు, సముద్రాలు, వనాలు భూమికి భారం కావని, డబ్బు ఉంది దానం చెయ్యని వారు, జ్ఞానము నలుగురితో పంచుకొని వారు, అధికారము యుండి ప్రజల శ్రేయస్సుకు ఉపయోగించని వారు భారమని, అందువల్లనే అందరూ సమాజ శ్రేయస్సులో పాలుపంచుకోవాలని వివరించారు. శ్రీనాథుడు, తన కవితల ద్వారా, ఆనాటి సామజిక జీవన చిత్రాన్ని, అప్పటి గడ్డు పరిస్థితులని ఎలా పద్యాలలో వివరించారో తెలియచేసారు.
పెద్దన మనుచరిత్ర కావ్యాన్ని వ్యాఖ్యానిస్తూ, గురువులు కేవలం పద్యాన్ని, దాని తాత్పర్యాన్నిమటుకే చెప్పడం కాకుండా, పద్య ఆంతర్యాన్ని, ఆత్మని సవివరంగా విద్యార్ధులకు ఆవిష్కరింపజేయాలని చెప్పారు. మన ప్రాచీన సాహిత్యాన్ని ఒక మూలధనంగా భావించి దాన్ని కాపాడుకోవాలి అని కూడా తెలియ చేసారు.
ఆధునిక కాలంలో, వివేకానందుడు అనే కావ్యంలో ఉండేల మాలకొండా రెడ్డిగారు, బానిసత్వంలో చనిపోయేకన్న, వీరులై రణరంగంలో చావటం మేలని అద్భుతమైన జాతీయత భావాన్ని ఎలా తెలియచేసారో   వివరించారు.  దువ్వురి రామిరెడ్డి గారు, జాతీయత ఒక ఇంద్రజాలం వంటిదని, స్మశానంలో అస్థిపంజరాలు కూడా జాతీయత అనే భావంవల్ల, లేచి వచ్చి పోరాడతాయని ఎలా వివరించారో తెలియచేసారు.
ఝాన్సీ లక్ష్మీబాయి అనే కావ్యంలో విశ్వనాథ సత్యనారాయణగారు విదేశాలలో స్థిరపడిపోయి మాతృభూమిని మరిచిపోయిన వారు భౌతికంగా, బుద్ధిపరంగా రెండు చావులు పొందుతారని, అందువల్ల మాతృభూమిని మరవరాదని వివరించారు. గుఱ్ఱం జాషువాగారు,  చెళ్ళపిళ్ళ వెంకట కవులు  కవికి, కవితలకి జాతి, మతం, కులం అనేవి అడ్డు రాకూడదని, పలుకుల రాణి పాదాలకు ఎలా పసిడి పెండేరం తొడిగారో వివరించారు.
దాశరధి గారు, జెండా ఒక్కటని, దేశం ఒక్కటని, రవీంద్రుడు ఒక్కడే జాతీయ కవి అని, గాంధీ ఒక్కడే జాతిపిత అని చెబుతూ, వారి కవితలతో జాతీయ పోరాటాన్ని ఎలా జనాల్లో ఎలా ప్రేరేపించారో వివరించారు.  చిలకమర్తి  లక్ష్మీ నరసింహం గారు, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు, గురజాడవారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, వారి పద్యాలలో జాతీయత ఎలా చాటారో  వివరించారు. అమృత గర్భం అనే స్వీయ రచనలో జాతీయత, దేశభక్తి ఎలా వివరించారో తెలియచేసి ప్రసంగం ముగించారు. తదనంతరం, శ్రోతల ప్రశ్నలకు జవాబులిచ్చారు.
 ఈ ప్రసంగం తర్వాత, శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారు, “ప్రియమైన శత్రువు” అనే స్వీయ కథను చదివారు. 

కొత్తగా పెళ్ళైన ఒక ఎన్నారై జంట మధ్య కలిగిన బేదాభిప్రాయాలను కథాంశంగా చేసుకుని, కట్టుకున్న భార్య కూడా సంపాదనలో భాగం పంచుకోవాలి అన్న భర్త అభిప్రాయాన్ని కేవలం తన స్నేహితులతో   ఎలా పంచుకున్నాడో, అందుకు భార్య తన నిరసనను ఒక లేఖ ద్వారా ఎలా తెలియచేసింది  అనేది ఈ కథ సారంశం. దీనిపై విరివిగా చర్చ జరిగింది.
విరామ సమయానంతం,  ఆనంద్ బండి గారు, “అతనొక సైనికుడు” స్వీయ కవితను, వంశీ ప్రఖ్య గారు తాను రచించిన  పాటను ,  డా|| కె.గీత “నరకంలో నాలుగు వారాలు” కవితను వినిపించారు.

-ఆనంద్ బండి
….........................

Friday 23 November 2012

వీక్షణం సాహితీ సమావేశం-2 (Oct 14, 2012)

వీక్షణం సాహితీ సమావేశం-2

ఉత్తర అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా ప్రాంతపు సాహితీ పరులు ఎదురుచూసే వీక్షణం సాహితీ సమావేశం అక్టోబర్ 14, 2012 న డబ్లిన్ లో కౌముది అంతర్జాల మాస పత్రిక సంపాదకులు కిరణ్ ప్రభ ఇంట్లో జరిగింది. ఈ సభకు శ్రీ గుండా శివచరణ్ అధ్యక్షత వహించారు.
ఈ సభకు ఈ సారి ఇద్దరు ముఖ్య అతిధులొచ్చారు. వీరు ప్రఖ్యాత పాత్రికేయుడు, మానవవాది ఐన నరిసెట్టి ఇన్నయ్య ఇంకా ప్రముఖ  కవి, కథకులు, విమర్శకులు పాపినేని శివశంకర్.  ఇన్నయ్య అమెరికా లో మేరీలాండ్ రాష్ట్రంలో  నివసిస్తున్నారు. శివశంకర్ గారు భారతదేశం నుంచి వచ్చారు.      

చిత్రం లో ఎడమ నుండి కుడి వైపు: శ్రీయుతులు ఇన్నయ్య ,డా||కె.గీత, వేమూరి వెంకటేశ్వరరావు,గుండా శివచరణ్,కిరణ్ ప్రభ  

ఉత్తర అమెరికా లోని సిలికాన్ లోయ తెలుగు రచయితల, పాఠకుల వేదిక ఐన  వీక్షణం ఆధ్యర్యాన పాత్రికేయుడు నరిసెట్టి ఇన్నయ్య వ్రాసిన మిసిమి వ్యాసాల పుస్తకాన్ని అక్టోబరు 14 న ఆవిష్కరించారు. మల్లాది రఘు సమావేశానికి ఆహ్వానం పలుకగా కార్యక్రమాన్ని గుండా శివచరణ్ నిర్వహించారు. వేమూరి వెంకటేశ్వరరావు  మిసిమి వ్యాసాలను ఆవిష్కరించారు.   కౌముది మాసపత్రిక సంపాదకుడు కిరణ్ ప్రభ సంక్షిప్తంగా పుస్తక విశేషాలను వివరించారు. 20 సంవత్సరాలుగా మిసిమి మాసపత్రికలో వివిధ అంశాలను సులభ శైలిలో  ఇన్నయ్య అందించారని, శాస్త్రీయ ధోరణిలో   వ్యాసాల రచన జరిగిందని కిరణ్ ప్రభ అన్నారు. ఇన్నేళ్ళుగా మానవవాదిగా నిలబడగలగటం,  విషయాలను శాస్త్రీయంగా పరిశీలించటం ప్రముఖంగా ప్రస్తావించారు. 


నరిసెట్టి ఇన్నయ్య  మాట్లాడుతూ  తాను మానవవాదిగా నిలబడగలగటానికి, శాస్త్రీయ ధోరణితో,  వివిధ అంశాలను పరిశీలించటానికి, తోడ్పడిన నేపధ్యాన్ని వివరించారు. తరువాత సభికుల ప్రశ్నలకు ఇన్నయ్య సమాధానం చెప్పారు.  

మిసిమి వ్యాసాల పుస్తకంలో పెక్కు ఆసక్తికరమైన వ్యాసాలున్నాయి. సుభాష్ చంద్రబోస్ గెలిస్తే ఏమయ్యేది?,  మేధావుల ప్రవర్తన ఎలాగైనా వుండొచ్చా?, తెలుగులోకి అనువాదాలు, హేతువాది ఎం.ఎన్.రాయ్ ఇలా చేశాడా?, నేను ముస్లిం ను ఎందుకు కాదు?, పిల్లలకు హక్కులున్నాయి,సంజీవ దేవ్ వంటి పలు వైవిధ్య వ్యాసాలు సుమారు 35 దాకా ఉన్నాయి. మేధావులకు నచ్చే ఈ పుస్తకం ధర రూ. 125/-  ఈ పుస్తకాన్ని ఉచితంగా ఇక్కడ నుంచి దిగుమతి చేసుకొని చదవవొచ్చు.    

తేనీటి  సమయం తరువాత కిరణ్ ప్రభ గారి సాహితీ   ప్రశ్నావళి ఆసక్తికరంగా జరిగింది. ఎప్పటిలా సరైన సమాధానాలు చెప్పినవారికి చక్కటి పుస్తకాల రూపంలో   బహుమతులున్నాయి. కొన్ని కవితలు చదివి వినిపించాక, వాటి రచయితలెవరో చెప్పాలి శ్రోతలు.


చిత్రం లో ఎడమ నుండి కుడి వైపు:కిరణ్ ప్రభ,గుండా శివచరణ్  

ఈ సారి సంధించిన ప్రశ్నలలో కొన్ని -
1) వేదంలా గోదావరి ప్రవహిస్తుందే చెల్లి, వెన్నెల వలే కృష్ణవేణి విహరిస్తుందే తల్లి  -ఈ కవిత వ్రాసిన కవి ఎవరు?
2) ఒక్కొక్క పద్యంబునకు ఒక్కొక్క నెత్తురు బొట్టు మేనువులో తక్కువగా రచయించితి  
3) వడగాడ్పు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం  
4) మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి  
5) రైతుల్లారా రాజకీయ వర్షం పడుతుంది, మోసపోయి మీరు విత్తనాలు చల్లకండి   
6) అదృష్టమనేది మత్తకోకిలలా వుంటుంది  ఇది కాలం అనే మావి చిగురులో దాగుంటుంది
7) వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో తెలుపుడీ
8) కొల్లాయి కట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి   
9)  శవం బ్రతకటం ఎంత విచిత్రమో, మనం మేలుకోవటం అంత చిత్రమే.
10) ప్రతి మనిషి ఒక నదిలో సుడిగుండం, ప్రతి మషి ఒక చెరలో ఉరికంబం

సమాధానాలు:  
1) ఆరుద్ర 2) గుర్రం జాషువ (ఫిరదౌసి) 3) గుర్రం జాషువ 4) బాలాంత్రపు రజనీకాంతరావు
5) గుంటూరు శేషేంద్ర శర్మ  6) సి.నా.రె. 7) త్రిపురనేని రామస్వామి 8)  బసవరాజు అప్పారావు 9) దాశరధి 10) బైరాగి

కవితలపై ప్రశ్నల తర్వాత కలంపేర్ల పై ప్రశ్నావళి కొనసాగింది. ప్రశ్నలో కలం పేరు చెపితే సమాధానం గా అసలు పేరు చెప్పాలి.  

బహుమతి పుస్తకాలు

మీ కోసం కొన్ని ప్రశ్నలు దిగువన ఇస్తున్నాము.   
1) వోల్గా
2) పైగంబర కవులు
3) భయంకర్
4) టెంపోరావు  
5) శృంగార సావిత్రి  అనే కావ్యం వ్రాసినదెవరు?

సమాధానాలు:   
1) లలితకుమారి 2)  ఎం.కె.సుగం బాబు, కమలాకాంత్, కిరణ్ బాబు, ఓల్గా, దేవిప్రియ   3) కొవ్వలి లక్ష్మినరసింహరావు. 4)  కూరపాటి రామచంద్రారావు 5) రఘునాధ నాయకుడు
ఈ సాహితీ ప్రశ్నావళి కార్యక్రమంలో సభ్యులంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సరైన సమాధానాలు చెప్పి బహుమతిగా వారికి నచ్చిన పుస్తకాలను స్వీకరించారు.


తరువాతి అంశం వర్తమాన కవిత కధ పై డా|| పాపినేని శివశంకర్ ఉపన్యాసం.  డా. పాపినేని శివశంకర్, ప్రసిద్ధ కథకుడు, కవి, విమర్శకుడు.  ఇప్పటివరకు సుమారుగా 150 కవితలు,30 చిన్న కథలు ఇంకా 100 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. సాహిత్యం-మౌలిక భావనలు అనే అంశం పై శివశంకర్ చేసిన పరిశోధన 1996 లో పుస్తకంగా వెలువడింది. వాసిరెడ్డి నవీన్ తో కలిసి  తెలుగు ఉత్తమ కథా సంకలనాలను కథా సాహితి పేరుతో 1990 నుంచి ప్రతి సంవత్సరమూ ప్రచురిస్తున్నారు.శివశంకర్ కవితలు పలు సంకలనాలుగా (స్తబ్ధత - చలనం,ఒక సారాంశం కోసం, ఆకు పచ్చని లోకంలో,ఒక ఖడ్గం - ఒక పుష్పం), నిశాంత : సాహిత్య, తాత్విక వ్యాసాలు  (2008),  మట్టి గుండె (కథలు)(1992), సగం తెరిచిన తెలుపు (కథలు)(2008) గా వెలువడ్డాయి. కవిత వార్షిక సంకలనాన్ని 2004 నుంచి దర్భాశయనం  శ్రీనివాసాచార్య తో కలిసి   ప్రచురిస్తున్నారు.  2004 లో ప్రచురితమైన శివశంకర్ ప్రసిద్ధ కథ,‘చివరి పిచ్చుక’ పర్యావరణం లో మార్పులు, రైతుల స్థితిగతులు, వ్యవసాయ భూములలో మారే పంటలు గురించి అద్భుతంగా వివరిస్తుంది. ఈ కథపై విశ్లేషణకై ఇక్కడ చూడండి. పాపినేని శివశంకర్ ప్రసిద్ధ కధలు చివరి పిచ్చుక, సముద్రం "సగం తెరిచిన తలుపు" కథా సంకలనం లో చదవవొచ్చు. ఆన్లైన్ లో ఐతే సముద్రం కధను ఇక్కడ చదవవొచ్చు. చినుకు,కథా సాహితి,విస్మృత కథ, రైతు కవిత, కవిత సంపుటాలకు సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయము నుంచి, 2000 సంవత్సరములో, సాహితీ పురస్కారం పొందారు.

తాజాగా "తల్లీ! నిన్ను దలంచి"  ప్రాచీన పద్యాల పై విశ్లేషణ శివశంకర్ సంపాదకత్వంలో వెలువడింది.  "ప్రాచీన కవిత్వంలో అతిమానుషమైన లేదా దైవీయమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేడో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు, భక్తుడు నిజం. భక్తకవి అస్తిత్వవేదన నిజం. ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని మనం తక్కువ చేసి చూడనక్కర లేదు. దేవుడిపై అవిశ్వాసం అన్నమయ్య కీర్తననో, పోతన గజేంద్రుడి ఆర్తినో ఆస్వాదించడానికి అడ్డం కాబోదని నా అవగాహన. " అంటారు డా|| శివశంకర్.  


గుండా శివచరణ్  కవి, కధకుడు, విమర్శకుడైన పాపినేని శివశంకర్ ను సభికులకు పరిచయం చేసారు.  శివశంకర్  

"మనిషి ప్రకృతి నుండి, ఇతర మనుషుల నుండి దూరం అవుతున్నాడు.  అటువంటి సమయంలో ఇలాంటి సమావేశాల అవసరం ఉంది. నలుగురం కలిసిన వేళ మనం మరొక్కరిలోకి, మరొక్కరు మనలోకి ప్రవహించటం ఎంత బావుంటుంది అని నేనొకచోట వ్రాసాను. రచయిత సమాజానికి ఏదైనా  ఇవ్వాలనుకుంటాడో, అంతగా తానూ సమాజం నుంచి పొందుతాడు. నా గురువుగారైన   తెలుగు లెంక  తుమ్మల సీతారామమూర్తి గారు మహాత్మా గాంధి కి గొప్ప భక్తుడు. వారి నుంచి నేను ఎంతో ప్రేరణ పొందాను."  అని చెప్తూ తిక్కన, పోతన, శ్రీనాధుడు వంటి ప్రాచీన కవుల సాహితీ పటిమల నుంచి   ఆధునిక కవులైన గురజాడ, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరధి, శివసాగర్ ల కవిత్వం దాక విశ్లేషించారు శివశంకర్.  ప్రాచీన కవితలో భక్తి తత్వం ఉంటే ఆధునిక కవితలో మానవత్వముంది. గురజాడ కాలం నుంచి ఈ మార్పు కనిపిస్తుంది. విశ్లేషణ కొనసాగిస్తూ దేవులపల్లి, రవీంద్రనాథ్ ఠాగోర్, ఆలూరి బైరాగి, బాలగంగాధర్ తిలక్, ఆరుద్ర, దిగంబర కవులు, వరవరరావు, నగ్నముని కవితలను వాటి ఉద్దేశాలను పరిచయం చేసారు. 1980 నుంచి కవిత్వం లో వచ్చిన వివిధ వాదాల ధోరణులను వివరిస్తూ దళితవాదం, స్త్రీవాదం  ఆ తరువాత వచ్చిన రకరకాల అస్తిత్వ వాదాలు, తెలంగాణా అస్తిత్వ వాదం గురించి వివరించారు. సావిత్రి వ్రాసిన బందిపోటు కవిత  వినిపించారు.పురుషాధిపత్యాన్ని ఎదిరిస్తూ కవితలు రాసాగాయి. స్త్రీవాదాన్ని వినిపిస్తూ కొత్తగొంతుకలు వినపడ్డాయి.   కొండేపూడి నిర్మల,  పాటిబండ్ల రజని, వోల్గా,కె.గీత  మొ.న వారి నుంచి స్త్రీవాద కవితలు వెలువడ్డాయి.
నేటి ఆధునిక కవితలలో మున్నెన్నడూ లేని విధంగా ఎంతో వస్తు వైవిధ్యం కనిపిస్తుంది.
ఈ సందర్భంలో తన కవిత ‘నువు సాకిన మొక్క ‘ వినిపించారు.

విత్తు నువ్వు నాటిందే కాని
మొక్క నువ్వనుకొన్నట్లు పెరుగుతుందా
పోచలెన్నో సేకరించి తదేక దీక్షతో నువ్వొక గూడు కట్టి ఉండొచ్చు
కాని రెక్కలు తొడిగిన పిట్టకి ఎగిరే దారి చెప్పగలవా?

ఉత్తుంగ పర్వతారోహణ చెయ్యాలని నువ్వన్నప్పుడు
కాంచన గంగ శిఖరాన్ని కావలించాలన్నప్పుడు
నేను సాహస సాగరాన్వేషి అయ్యాను
చెదరని శిలను గాక అలను ప్రేమించాను
పర్వత సౌందర్యం పర్వతానిది కావచ్చు
జలపాత జ్వాలామాల జలపాతానిది గదా!

….....................................................

అంటూ పెద్దల ఆశయాలను పిల్లలు తీర్చలేరు, ఎవరి ధ్యేయాలు వారివే అంటూ తమ  కవిత ముగించారు.  


కవితా వీక్షణం తర్వాత కధా జగత్ లోకి అడుగెట్టారు శివశంకర్.కథా సాహిత్యం లో మనకు చక్కటి వారసత్వ సంపద ఉందంటూ భారతీయ సాహిత్యంలో పంచతంత్రం అద్భుతమైన రచన అని భారతం మహా ఇతిహాసమని,బృహద్కథలు విలువైన కధా సంగ్రహమని పేర్కొన్నారు. తెలుగు కథలలో సంస్కరణవాదం గురించి చెప్తూ గురజాడ వ్రాసిన  తెలుగులో తొలి ఆధునిక కథ లేదా వ్యవహారిక భాషలో తొలి తెలుగు కథానిక 'దిద్దుబాటు' ను ప్రస్తావించారు. ఇది 'ఆంధ్ర భారతి' పత్రిక 1910, ఫిబ్రవరి సంచికలో ప్రచురితమయ్యింది. తరువాత నవీనాంధ్ర కథకుల్లో ఘనాపాఠిగా మన్ననలందుకొన్న కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి చేతిలో కథ గొప్ప పరిణామం చెందిందంటూ ‘ కలుపు మొక్కలు’ కథను ప్రస్తావించారు. స్త్రీకి ఒక హృదయముంది దానికొక భాష ఉందంటూ ఘోషించిన చలాన్ని ప్రస్తావించారు.చిన్న కథలలో బలమైన భావాలను చలం చెప్పగలిగాడు.ఆ తర్వాత రావి శాస్త్రి, కాళీపట్నం రామారావు,చాగంటి సోమాయాజులు వ్రాసిన కథలు అద్భుతమైనవన్నారు.చాసో  అనగానే అందరికీ గుర్తు వచ్చే  వాయులీనం (Violin) కథను  ప్రస్తావించారు.నేటి రచయితలు ఇతర భాష, తెలుగులోని కథా సాహిత్యాన్ని చదవటం లేదని, మంచి సాహిత్య సృజనకు చదవటం తప్పనిసరి అన్నారు.రవీంద్రనాథ్ ఠాకూర్, శరత్ చంద్ర, కిషన్ చందర్,బుచ్చిబాబు, ఆలూరి బైరాగి కథలు చదవాలి.భావకవి గా పేరుపొందిన దేవులపల్లి ‘రిక్షావాలా ‘కథలో మానవత్వం గోచరిస్తుంది.కథకు ముగింపు బలీయమైనదన్నారు.కథ తరువాత ఇదీ నేను చెప్పదలుచుకున్నదీ అని రచయిత వ్రాయకుండా పాఠకుడినే ఆలోచింపచేసేదే సరైన కథ.రంగనాయకమ్మ వ్రాసిన మురళీ వాళ్ళమ్మ కథ లో భార్యను నిర్లక్ష్యం చేస్తున్న కొడుకును తల్లి నిలదీసి ఆడుగుతుంది. కొడుకు నిర్ఘాంత పోతాడు. అంతటితో కథ అయిపోయింది. కొడుకు మారాడా, చెడుసావాసాలు మానేసాడా అనే విషయం పాఠకుల ఊహకే వదులుతారు రంగనాయకమ్మ.శాస్త్రీయ కాల్పనిక కథలు వ్రాస్తున్న కె.సదాశివరావు,అనిల్ రాయల్ ను ప్రస్తావించారు.       
    హాస్య కథలను ప్రస్తావిస్తూ వేలూరి వెంకటెశ్వరరావు,మందపాటి సత్యం,వంగూరి చిట్టెన్రాజు,శ్రీరమణ బంగారు మురుగు కథ, యెర్రం శెట్టి శాయి లను గుర్తు తెచ్చారు. వైవిధ్యమైన వృత్తం తో వచ్చిన సాయి బ్రహ్మానందం గొర్తి రచన సరిహద్దు కథను ప్రస్తావించారు. తనకు అవకాశమిచ్చిన వీక్షణం వారికి ధన్యవాదాలు చెప్పారు శివశంకర్.


చిత్రం లో ఎడమ నుండి కుడి వైపు: సి.బి.రావు ,శివశంకర్,ఇన్నయ్య

కార్యక్రమ సమన్వయకర్త గుండా శివచరణ్ మట్లాడుతూ "ప్రాచీన సాహిత్య ఔన్నత్యాన్ని చెప్పి దాన్ని చదవమన్నారు శివశంకర్. వస్తు వైవిధ్యం పై మీ పరిశీలన బాగుంది.శివశంకర్ రచనలలో ఒక్క దుష్ట స్త్రీ పాత్ర కూడా లేకపోవటం గమనించదగ్గ విషయం.ఇన్నయ్య  "Forced into Faith" అని పిల్లల గురించిన పుస్తకం వ్రాసారు. దాని పై మాట్లాడారు.శివశంకర్ పిల్లలపై కవిత చదివారు. ఇద్దరూ పిల్లలపై ప్రసంగించటం బాగుంది. మీ ఇద్దరికీ మా ధన్యవాదాలు." అన్నారు. సభికుల ప్రశ్నలకు శివశంకర్ బదులిచ్చారు.  నెక్కల్లు   పిల్లాడినే     అనే తన కవిత వినిపించారు.              
తరువాత కవితలు చదివారు స్థానిక కవులు. మొదట కె.గీత తమ కవిత ‘గుండె  v/s గడియారం’ వినిపించారు.



నన్ను చూసి గడియారం వికటాట్టహాసం చేసింది
అంతా ఎటో వెళ్లిన అపరాహ్న వేళ ఎర్రని డిజిటల్ కళ్లేసుకుని ఉరుమురిమి చూసింది
నా చుట్టూ జ్ఞాపకాల సైకత శిల్పం పొడై రాలుతున్న నిశ్శబ్దం.....................
…..............
ఎక్కడిదో ఓ ఉత్తరం
పుస్తకం పొట్టలో జీర్ణం కానట్లుంది
వీపు తట్టగానే బైట పడింది
.....................

చిత్రం లో ఎడమ నుండి కుడి వైపు: వంశీ ప్రఖ్య,గుండా శివచరణ్

తరువాత వంశీ ప్రఖ్య తమ గీతం ప్రకృతి పదగీతి ని వినిపించారు.

ప్రకృతి పద గతి అమృత మధురిమ ఇచ్చెనే
ప్రణయ సూత్రం ముఖ్య బంధమేదో కలిపినే
వలయ గమనపు కువలయమే వేదికై లయలు నిండెనే
సృష్టి గమనమెలువడినే

తరువాత పిల్లలమర్రి కృష్ణకుమార్ తమ పద్య కవితలు చదివి వినిపించారు.


ఉ| వీక్షణ మానతీయ విని వేచితి నేడిట సాహితీరుచై
  లాక్షణ గౌరవంబు, కవి రాతల మెత్తురటంచు జెప్పగన్
  ఓ క్షణ మాగి జూచితిని ఊపిరి దీయక నాల్గు దిక్కులన్
  రాక్షస వైరి నాదు సుగళామృత ధారల గాచి బ్రోవుతన్

క| తడబడి అడుగిడి సడివడి
   కడుదడ బడితిని మొదలిడ కదలక పేనా
   జడిబడి గడగడ రాసితి
   హడలక పూరితి జేసితి, భవునకు జేజే!

 
సభకు ఫ్లోరిడా, మియామి నుంచి  వచ్చిన నిషిగంధను  పరిచయం చేయటం జరిగింది.  నిషిగంధ వ్రాసిన “ఊసులాడే ఒక జాబిలట”  అనే నవల కౌముది అంతర్జాల మాసపత్రికలో ప్రచురించబడి పలువురి పాఠకుల మన్నలనందుకుంది. నిషిగంధ కవితలు కూడా వ్రాస్తారు.  
తరువాత వంశీ ప్రఖ్య తెలుగు ఒలింపియాడ్ ప్రజ్ఞ గురించిన ప్రకటన చేశారు.
డా||కె.గీత వందన సమర్పణతో సభ ముగిసింది.



సభకు శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా ప్రాంతపు రచయితలు, బ్లాగరులు ఇంకా పాఠకులు వచ్చినవారిలో ఉన్నారు.  


-సి.బి.రావు
****************
 
















  

Thursday 18 October 2012

వీక్షణం తొలి సాహితీ సమావేశం (Sep9, 2012)



వీక్షణం తొలి సాహితీ సమావేశం

శాన్ ఫ్రాన్సిస్కో  bay ఏరియా లో ప్లెసంటన్   లోని శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారింట్లో వీక్షణం తొలి సాహితీ సమావేశం ఆదివారం   సెప్టెంబర్ 9   జరిగింది.
డా|| కె. గీత



ఆహూతులకు డా|| కె. గీత స్వాగతం చెప్పి, వీక్షణం సాహితీ గవాక్షాలను తెరిచారు. సభకు రఘు మల్లాది అధ్యక్షత వహించారు.  
శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు

వంగూరి ఫౌండేషన్ వారిచే  $116/- బహుమతి పొందిన వేమూరి వెంకటేశ్వరరావు గారి "మరో లోకం" సైన్స్ ఫిక్షన్ స్వీయకథా పఠనంతో కార్యక్రమం మొదలయ్యింది.  మిడతంభొట్లు అనే శాస్త్రజ్ఞుడి వద్దకు ఒక గ్రహాంతరజీవి వచ్చి మరో 200 ఏళ్ళలో భూలోకానికి ఉపద్రవం రాబోతున్నదని, ఈ భూమి పై ఉన్న జీవరాశులను  కాపాడటానికి తాము పథక రచన చేసామని, ఇక్కడి ప్రాణులన్నింటినీ తమ గ్రహానికి తరలిస్తామని అందులకు శాస్త్రజ్ఞుడైన మిడతంభొట్లు తమకు సహకరించాలని కోరుతాడు. ఈ ప్రతిపాదనకు మిడతంభొట్లు ఎలా స్పందించాడన్నదే ఈ కథలోని ఆయువుపట్టు.ఈ కథను వేమూరివారు చక్కగా చదివి రక్తి
కట్టించారు. "మరో లోకం" కథను ఇక్కడ చదవవొచ్చును.

 

శ్రీమతి తమిరిశ జానకి

రోజు వీక్షణం కు వచ్చిన అతిధులలో ఒకరు తమిరిశ జానకి. వీరు పెక్కు కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు వ్రాశారు. నాలుగు కథా సంపుటాలు వెలువడ్డాయి. మొట్టమొదటి నవల ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రికలో "విశాలి" పేరుతో సీరియల్ గా వచ్చింది.  ఈ సీరియల్ అదే పేరుతో  1973 లో ఎ. సంజీవి దర్శకత్వంలో, కృష్ణంరాజు, శారద నాయక, నాయిక పాత్రలలో సినిమాగాను, పుస్తకంగాను వచ్చింది.   
వేమూరి గారి స్వీయ కథాపఠనం తరువాత రచయిత్రి తమిరిశ జానకి గారు  కథారచనకు తమను ప్రేరేపించిన అంశాల గురించి మాట్లాడారు.  నిత్యం వచ్చే బిచ్చగాడు కొన్నిరోజులుగా  రాకపోతే ఏ కారణం వలన అతను రావటం  లేదో అని ఆలోచిస్తూ, 1964 లో తమ తొలి కథ "వాడుకైనవాడు" అనే కథ రాసామన్నారు.  రచయిత తన చుట్టూ  ఉన్న సామాజిక రుగ్మతల  వల్ల ప్రభావితుడై ఒక కథ వ్రాస్తూ ఇది ఒకరినైనా మారిస్తే బాగుండును అని తలుస్తాడు. పాత రోజుల్లో తన కథ చదివి పత్రికా కార్యాలయానికి, తనకూ పాఠకులు ఉత్తరాలు వ్రాసేవారు. ఇప్పుడంతా స్పీడ్ యుగం అయిందని, కథ చదువుతూనే పాఠకులు ఫోన్ ద్వారా లేక e-mail ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తమ సంతోషం తెలియచేశారు.  హైదరాబాదులో జరిగే సాహిత్య సభలు, చాలా పత్రికలు తనను కొత్త రచనలు చేసేలా ఉత్తేజ పరుస్తాయని తెలిపారు. తాను నిరంతర పాఠకురాలనని కొత్త పుస్తకాలు, పత్రికలు చదువుతుంటానని చెప్పారు. కొద్ది పత్రికలు మినహాయించి   చాలా పత్రికలలో తన రచన అచ్చయిందన్న విషయం తన పాఠకుల ద్వారానే తనకు సమాచారమందుతుందని తెలిపారు. రచయితలకు తమ రచన అచ్చైన పత్రికలు Complimentary copies పంపిస్తే బాగుంటుందని అభిప్రాయం వెలిబుచ్చారు. కథారచన గురించి సభికుల పలు ప్రశ్నలకు బదులిచ్చారు.
    

   
చిత్రం లో ఎడమ నుంచి కుడి వైపు -శ్రీమతి తమిరిశ జానకి, శ్రీ సి.బి.రావు, శ్రీ మల్లాది రఘు    


రోజు వీక్షణం కు వచ్చిన మరొక అతిధి సి.బి.రావు గారు.  దీప్తిధార, పారదర్శి బ్లాగుల ద్వారా వీరు పరిచితులు. వీరు ఎంచుకున్న అంశం కథా ప్రయోజనం. "రచయితలు వ్రాస్తారు. ఈ రచనల ప్రయోజనమేమిటి? ఏ ఉద్దేశంతో, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ కథలు వ్రాస్తున్నారో ఆ ప్రయోజనం నెరవేరుతుందా? రచయిత  ఎవరికోసం వ్రాస్తున్నాడో వారికి  తన రచనలు అందుతున్నాయా?  ఉద్దేశించిన పాఠకులు తన రచనలు చదువుతున్నారా? ఇలాంటి ప్రశ్నలు రచయితలను వేధిస్తాయి.  పై ప్రశ్నలు వేసుకునుంటే కార్ల్ మార్క్స్, ప్రపంచ గతిని మార్చిన  దాస్ కాపిటల్ అనే ఉద్గ్రంధం వ్రాసిఉండెడివాడు కాదేమో!   రచయిత ప్రధమ కర్తవ్యం  తను చెప్పవలసిన విషయాలు పాఠకులకు అర్ధమయ్యేలా , ఆసక్తికరంగా రచనలు చెయ్యటమే.  రచయితలు కొందరు కేవలం వినోదాత్మక కథలు వ్రాస్తే, మరికొందరు ప్రయోజనాత్మక కథలు వ్రాస్తారు. ఇంకొందరు తమ కథలలో మంచి  కథాశిల్పం రావాలని ఆశిస్తారు. ప్రయోజనాత్మక కథలవలన ఏ కొందరైనా మారుతారని, సమాజం లో మార్పు వస్తుందని  రచయిత చిన్న ఆశతో తన రచన చేస్తాడు. " అంటూ తమ దృష్టిలో ప్రయోజనాత్మక   కథలేవిటో వివరిస్తూ  ఉదాహరణగా 1) శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు -"అభయారణ్యంలో ఏంబర్"  2) వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో ఉండే రచయిత్రి శ్రీమతి సామాన్య -"కల్పన" 3) శ్రీ జె.యు.బి.వి.ప్రసాద్ ల "అంజనం"  కథలను విశ్లేషించారు. "ఏ ప్రయోజనం ఆశించి రచన చేస్తాడో, ఆ ఉద్దేశ్యం  నెరవేరితే రచయిత ఎంతో సంతృప్తుడవుతాడు. రెట్టించిన ఉత్సాహంతో సమాజహితం కోసం మరిన్ని రచనలు చేస్తాడు." అని చెప్తూ తమ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సభికుల ప్రశ్నలకు బదులిచ్చారు.
 

శ్రీ కిరణ్ ప్రభ



ఇప్పటిదాకా గంభీరమైన ఉపన్యాసాలతో వేడెక్కిన సభ కౌముది మాసపత్రిక సంపాదకుడు కిరణ్‌ప్రభగారి Quiz కార్యక్రమంతో తొలకరి జల్లు కురిసినట్లై చల్లబడింది. ప్రశ్నలన్నీ తెలుగు సాహిత్యానికి సంబంధించినవే. ఉదాహరణకు కిరణ్‌ప్రభగారు సంధించిన కొన్ని ప్రశ్నలిస్తున్నాను పాఠకుల సమాచారనిమిత్తం. 1) రేడియో ప్రయోక్త ఉషశ్రీ గారి అసలు పేరు? 2) విశ్వనాధ సత్యనారాయణ గారి మొదటి నవల ఏది? 3) తాపీ ధర్మా రావు గారి స్వీయచరిత్ర పేరేమిటి?  4) "అనుభవాలూ జ్ఞాపకాలు " వ్రాసిన రచయిత ఎవరు?  ఇలాంటి ప్రశ్నలెన్నో!   సరైన సమాధానం చెప్పినవారికి చక్కటి పుస్తకాలు బహూకరించారు.

శ్రీ మధు ప్రఖ్య


తరువాత స్థానిక కవుల కవితాగానం జరిగింది.
 
 
శ్రీయుతులు మధు ప్రఖ్య, రావు తల్లా ప్రగడ, వరకూరు ప్రసాద్, డా|| కె. గీత  ప్రభృతులు తమ స్వీయ కవితాగానం చేసి శ్రోతలను అలరించారు. ఈ కవితా గాన సౌరభాన్ని మాటలలో వర్ణింప తరమా! పాఠకులు ఈ కవితలు ఇక్కడ విని ఆనందించకోరుతాను. చక్కటి కవితలున్నవిందులో


 
శ్రీరావు తల్లాప్రగడ   


రఘు మల్లాది గారి సమయపాలనతో సభ  సజావుగా జరిగింది. వీక్షణం తరఫున గీత గారి వందన సమర్పణతో సభ ముగిసింది.



కుడి నుండి ఎడమ కు ముందు వరుసలో  కూర్చున్నవారు మృత్యుంజయుడు తాటిపామల, కృష్ణకుమార్ పిల్లలమర్రి, ప్రసాద్ వరకూరు,
కుర్చీలలో ఎడమ నుంచి కుడికి సి.బి. రావు, తమిరిశ జానకి, రమణ, కె.గీత, శారద,
వెనక నిలబడ్డవారు ఎడమ నుంచి కుడికి కిరణ్, దర్శన, శ్రీమతి కృష్ణకుమార్, బులుసు నారాయణ, చిమటా శ్రీనివాస్, రావు తల్లాప్రగడ, వేంకటేశర్రావు రావు వేమూరి, రఘు మల్లాది, గిరిధర్ రావు, శివచరణ్ గుండా, కిరణ్ ప్రభ, శ్యాం పుల్లెల, శ్రీనివాస్ చుక్కా, కిరణ్ వాకా



స్థానిక రచయితలు, కవులు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేశారు. 
-సి.బి.రావు
…........................
కౌముది, అక్టోబరు 2012 ప్రచురణ
http://www.koumudi.net/Monthly/2012/october/index.html 

సుజన రంజని, అక్టోబరు 2012 ప్రచురణ
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/oct12/veekshanam.html