Friday 23 November 2012

వీక్షణం సాహితీ సమావేశం-2 (Oct 14, 2012)

వీక్షణం సాహితీ సమావేశం-2

ఉత్తర అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా ప్రాంతపు సాహితీ పరులు ఎదురుచూసే వీక్షణం సాహితీ సమావేశం అక్టోబర్ 14, 2012 న డబ్లిన్ లో కౌముది అంతర్జాల మాస పత్రిక సంపాదకులు కిరణ్ ప్రభ ఇంట్లో జరిగింది. ఈ సభకు శ్రీ గుండా శివచరణ్ అధ్యక్షత వహించారు.
ఈ సభకు ఈ సారి ఇద్దరు ముఖ్య అతిధులొచ్చారు. వీరు ప్రఖ్యాత పాత్రికేయుడు, మానవవాది ఐన నరిసెట్టి ఇన్నయ్య ఇంకా ప్రముఖ  కవి, కథకులు, విమర్శకులు పాపినేని శివశంకర్.  ఇన్నయ్య అమెరికా లో మేరీలాండ్ రాష్ట్రంలో  నివసిస్తున్నారు. శివశంకర్ గారు భారతదేశం నుంచి వచ్చారు.      

చిత్రం లో ఎడమ నుండి కుడి వైపు: శ్రీయుతులు ఇన్నయ్య ,డా||కె.గీత, వేమూరి వెంకటేశ్వరరావు,గుండా శివచరణ్,కిరణ్ ప్రభ  

ఉత్తర అమెరికా లోని సిలికాన్ లోయ తెలుగు రచయితల, పాఠకుల వేదిక ఐన  వీక్షణం ఆధ్యర్యాన పాత్రికేయుడు నరిసెట్టి ఇన్నయ్య వ్రాసిన మిసిమి వ్యాసాల పుస్తకాన్ని అక్టోబరు 14 న ఆవిష్కరించారు. మల్లాది రఘు సమావేశానికి ఆహ్వానం పలుకగా కార్యక్రమాన్ని గుండా శివచరణ్ నిర్వహించారు. వేమూరి వెంకటేశ్వరరావు  మిసిమి వ్యాసాలను ఆవిష్కరించారు.   కౌముది మాసపత్రిక సంపాదకుడు కిరణ్ ప్రభ సంక్షిప్తంగా పుస్తక విశేషాలను వివరించారు. 20 సంవత్సరాలుగా మిసిమి మాసపత్రికలో వివిధ అంశాలను సులభ శైలిలో  ఇన్నయ్య అందించారని, శాస్త్రీయ ధోరణిలో   వ్యాసాల రచన జరిగిందని కిరణ్ ప్రభ అన్నారు. ఇన్నేళ్ళుగా మానవవాదిగా నిలబడగలగటం,  విషయాలను శాస్త్రీయంగా పరిశీలించటం ప్రముఖంగా ప్రస్తావించారు. 


నరిసెట్టి ఇన్నయ్య  మాట్లాడుతూ  తాను మానవవాదిగా నిలబడగలగటానికి, శాస్త్రీయ ధోరణితో,  వివిధ అంశాలను పరిశీలించటానికి, తోడ్పడిన నేపధ్యాన్ని వివరించారు. తరువాత సభికుల ప్రశ్నలకు ఇన్నయ్య సమాధానం చెప్పారు.  

మిసిమి వ్యాసాల పుస్తకంలో పెక్కు ఆసక్తికరమైన వ్యాసాలున్నాయి. సుభాష్ చంద్రబోస్ గెలిస్తే ఏమయ్యేది?,  మేధావుల ప్రవర్తన ఎలాగైనా వుండొచ్చా?, తెలుగులోకి అనువాదాలు, హేతువాది ఎం.ఎన్.రాయ్ ఇలా చేశాడా?, నేను ముస్లిం ను ఎందుకు కాదు?, పిల్లలకు హక్కులున్నాయి,సంజీవ దేవ్ వంటి పలు వైవిధ్య వ్యాసాలు సుమారు 35 దాకా ఉన్నాయి. మేధావులకు నచ్చే ఈ పుస్తకం ధర రూ. 125/-  ఈ పుస్తకాన్ని ఉచితంగా ఇక్కడ నుంచి దిగుమతి చేసుకొని చదవవొచ్చు.    

తేనీటి  సమయం తరువాత కిరణ్ ప్రభ గారి సాహితీ   ప్రశ్నావళి ఆసక్తికరంగా జరిగింది. ఎప్పటిలా సరైన సమాధానాలు చెప్పినవారికి చక్కటి పుస్తకాల రూపంలో   బహుమతులున్నాయి. కొన్ని కవితలు చదివి వినిపించాక, వాటి రచయితలెవరో చెప్పాలి శ్రోతలు.


చిత్రం లో ఎడమ నుండి కుడి వైపు:కిరణ్ ప్రభ,గుండా శివచరణ్  

ఈ సారి సంధించిన ప్రశ్నలలో కొన్ని -
1) వేదంలా గోదావరి ప్రవహిస్తుందే చెల్లి, వెన్నెల వలే కృష్ణవేణి విహరిస్తుందే తల్లి  -ఈ కవిత వ్రాసిన కవి ఎవరు?
2) ఒక్కొక్క పద్యంబునకు ఒక్కొక్క నెత్తురు బొట్టు మేనువులో తక్కువగా రచయించితి  
3) వడగాడ్పు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం  
4) మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి  
5) రైతుల్లారా రాజకీయ వర్షం పడుతుంది, మోసపోయి మీరు విత్తనాలు చల్లకండి   
6) అదృష్టమనేది మత్తకోకిలలా వుంటుంది  ఇది కాలం అనే మావి చిగురులో దాగుంటుంది
7) వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో తెలుపుడీ
8) కొల్లాయి కట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి   
9)  శవం బ్రతకటం ఎంత విచిత్రమో, మనం మేలుకోవటం అంత చిత్రమే.
10) ప్రతి మనిషి ఒక నదిలో సుడిగుండం, ప్రతి మషి ఒక చెరలో ఉరికంబం

సమాధానాలు:  
1) ఆరుద్ర 2) గుర్రం జాషువ (ఫిరదౌసి) 3) గుర్రం జాషువ 4) బాలాంత్రపు రజనీకాంతరావు
5) గుంటూరు శేషేంద్ర శర్మ  6) సి.నా.రె. 7) త్రిపురనేని రామస్వామి 8)  బసవరాజు అప్పారావు 9) దాశరధి 10) బైరాగి

కవితలపై ప్రశ్నల తర్వాత కలంపేర్ల పై ప్రశ్నావళి కొనసాగింది. ప్రశ్నలో కలం పేరు చెపితే సమాధానం గా అసలు పేరు చెప్పాలి.  

బహుమతి పుస్తకాలు

మీ కోసం కొన్ని ప్రశ్నలు దిగువన ఇస్తున్నాము.   
1) వోల్గా
2) పైగంబర కవులు
3) భయంకర్
4) టెంపోరావు  
5) శృంగార సావిత్రి  అనే కావ్యం వ్రాసినదెవరు?

సమాధానాలు:   
1) లలితకుమారి 2)  ఎం.కె.సుగం బాబు, కమలాకాంత్, కిరణ్ బాబు, ఓల్గా, దేవిప్రియ   3) కొవ్వలి లక్ష్మినరసింహరావు. 4)  కూరపాటి రామచంద్రారావు 5) రఘునాధ నాయకుడు
ఈ సాహితీ ప్రశ్నావళి కార్యక్రమంలో సభ్యులంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సరైన సమాధానాలు చెప్పి బహుమతిగా వారికి నచ్చిన పుస్తకాలను స్వీకరించారు.


తరువాతి అంశం వర్తమాన కవిత కధ పై డా|| పాపినేని శివశంకర్ ఉపన్యాసం.  డా. పాపినేని శివశంకర్, ప్రసిద్ధ కథకుడు, కవి, విమర్శకుడు.  ఇప్పటివరకు సుమారుగా 150 కవితలు,30 చిన్న కథలు ఇంకా 100 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. సాహిత్యం-మౌలిక భావనలు అనే అంశం పై శివశంకర్ చేసిన పరిశోధన 1996 లో పుస్తకంగా వెలువడింది. వాసిరెడ్డి నవీన్ తో కలిసి  తెలుగు ఉత్తమ కథా సంకలనాలను కథా సాహితి పేరుతో 1990 నుంచి ప్రతి సంవత్సరమూ ప్రచురిస్తున్నారు.శివశంకర్ కవితలు పలు సంకలనాలుగా (స్తబ్ధత - చలనం,ఒక సారాంశం కోసం, ఆకు పచ్చని లోకంలో,ఒక ఖడ్గం - ఒక పుష్పం), నిశాంత : సాహిత్య, తాత్విక వ్యాసాలు  (2008),  మట్టి గుండె (కథలు)(1992), సగం తెరిచిన తెలుపు (కథలు)(2008) గా వెలువడ్డాయి. కవిత వార్షిక సంకలనాన్ని 2004 నుంచి దర్భాశయనం  శ్రీనివాసాచార్య తో కలిసి   ప్రచురిస్తున్నారు.  2004 లో ప్రచురితమైన శివశంకర్ ప్రసిద్ధ కథ,‘చివరి పిచ్చుక’ పర్యావరణం లో మార్పులు, రైతుల స్థితిగతులు, వ్యవసాయ భూములలో మారే పంటలు గురించి అద్భుతంగా వివరిస్తుంది. ఈ కథపై విశ్లేషణకై ఇక్కడ చూడండి. పాపినేని శివశంకర్ ప్రసిద్ధ కధలు చివరి పిచ్చుక, సముద్రం "సగం తెరిచిన తలుపు" కథా సంకలనం లో చదవవొచ్చు. ఆన్లైన్ లో ఐతే సముద్రం కధను ఇక్కడ చదవవొచ్చు. చినుకు,కథా సాహితి,విస్మృత కథ, రైతు కవిత, కవిత సంపుటాలకు సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయము నుంచి, 2000 సంవత్సరములో, సాహితీ పురస్కారం పొందారు.

తాజాగా "తల్లీ! నిన్ను దలంచి"  ప్రాచీన పద్యాల పై విశ్లేషణ శివశంకర్ సంపాదకత్వంలో వెలువడింది.  "ప్రాచీన కవిత్వంలో అతిమానుషమైన లేదా దైవీయమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేడో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు, భక్తుడు నిజం. భక్తకవి అస్తిత్వవేదన నిజం. ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని మనం తక్కువ చేసి చూడనక్కర లేదు. దేవుడిపై అవిశ్వాసం అన్నమయ్య కీర్తననో, పోతన గజేంద్రుడి ఆర్తినో ఆస్వాదించడానికి అడ్డం కాబోదని నా అవగాహన. " అంటారు డా|| శివశంకర్.  


గుండా శివచరణ్  కవి, కధకుడు, విమర్శకుడైన పాపినేని శివశంకర్ ను సభికులకు పరిచయం చేసారు.  శివశంకర్  

"మనిషి ప్రకృతి నుండి, ఇతర మనుషుల నుండి దూరం అవుతున్నాడు.  అటువంటి సమయంలో ఇలాంటి సమావేశాల అవసరం ఉంది. నలుగురం కలిసిన వేళ మనం మరొక్కరిలోకి, మరొక్కరు మనలోకి ప్రవహించటం ఎంత బావుంటుంది అని నేనొకచోట వ్రాసాను. రచయిత సమాజానికి ఏదైనా  ఇవ్వాలనుకుంటాడో, అంతగా తానూ సమాజం నుంచి పొందుతాడు. నా గురువుగారైన   తెలుగు లెంక  తుమ్మల సీతారామమూర్తి గారు మహాత్మా గాంధి కి గొప్ప భక్తుడు. వారి నుంచి నేను ఎంతో ప్రేరణ పొందాను."  అని చెప్తూ తిక్కన, పోతన, శ్రీనాధుడు వంటి ప్రాచీన కవుల సాహితీ పటిమల నుంచి   ఆధునిక కవులైన గురజాడ, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరధి, శివసాగర్ ల కవిత్వం దాక విశ్లేషించారు శివశంకర్.  ప్రాచీన కవితలో భక్తి తత్వం ఉంటే ఆధునిక కవితలో మానవత్వముంది. గురజాడ కాలం నుంచి ఈ మార్పు కనిపిస్తుంది. విశ్లేషణ కొనసాగిస్తూ దేవులపల్లి, రవీంద్రనాథ్ ఠాగోర్, ఆలూరి బైరాగి, బాలగంగాధర్ తిలక్, ఆరుద్ర, దిగంబర కవులు, వరవరరావు, నగ్నముని కవితలను వాటి ఉద్దేశాలను పరిచయం చేసారు. 1980 నుంచి కవిత్వం లో వచ్చిన వివిధ వాదాల ధోరణులను వివరిస్తూ దళితవాదం, స్త్రీవాదం  ఆ తరువాత వచ్చిన రకరకాల అస్తిత్వ వాదాలు, తెలంగాణా అస్తిత్వ వాదం గురించి వివరించారు. సావిత్రి వ్రాసిన బందిపోటు కవిత  వినిపించారు.పురుషాధిపత్యాన్ని ఎదిరిస్తూ కవితలు రాసాగాయి. స్త్రీవాదాన్ని వినిపిస్తూ కొత్తగొంతుకలు వినపడ్డాయి.   కొండేపూడి నిర్మల,  పాటిబండ్ల రజని, వోల్గా,కె.గీత  మొ.న వారి నుంచి స్త్రీవాద కవితలు వెలువడ్డాయి.
నేటి ఆధునిక కవితలలో మున్నెన్నడూ లేని విధంగా ఎంతో వస్తు వైవిధ్యం కనిపిస్తుంది.
ఈ సందర్భంలో తన కవిత ‘నువు సాకిన మొక్క ‘ వినిపించారు.

విత్తు నువ్వు నాటిందే కాని
మొక్క నువ్వనుకొన్నట్లు పెరుగుతుందా
పోచలెన్నో సేకరించి తదేక దీక్షతో నువ్వొక గూడు కట్టి ఉండొచ్చు
కాని రెక్కలు తొడిగిన పిట్టకి ఎగిరే దారి చెప్పగలవా?

ఉత్తుంగ పర్వతారోహణ చెయ్యాలని నువ్వన్నప్పుడు
కాంచన గంగ శిఖరాన్ని కావలించాలన్నప్పుడు
నేను సాహస సాగరాన్వేషి అయ్యాను
చెదరని శిలను గాక అలను ప్రేమించాను
పర్వత సౌందర్యం పర్వతానిది కావచ్చు
జలపాత జ్వాలామాల జలపాతానిది గదా!

….....................................................

అంటూ పెద్దల ఆశయాలను పిల్లలు తీర్చలేరు, ఎవరి ధ్యేయాలు వారివే అంటూ తమ  కవిత ముగించారు.  


కవితా వీక్షణం తర్వాత కధా జగత్ లోకి అడుగెట్టారు శివశంకర్.కథా సాహిత్యం లో మనకు చక్కటి వారసత్వ సంపద ఉందంటూ భారతీయ సాహిత్యంలో పంచతంత్రం అద్భుతమైన రచన అని భారతం మహా ఇతిహాసమని,బృహద్కథలు విలువైన కధా సంగ్రహమని పేర్కొన్నారు. తెలుగు కథలలో సంస్కరణవాదం గురించి చెప్తూ గురజాడ వ్రాసిన  తెలుగులో తొలి ఆధునిక కథ లేదా వ్యవహారిక భాషలో తొలి తెలుగు కథానిక 'దిద్దుబాటు' ను ప్రస్తావించారు. ఇది 'ఆంధ్ర భారతి' పత్రిక 1910, ఫిబ్రవరి సంచికలో ప్రచురితమయ్యింది. తరువాత నవీనాంధ్ర కథకుల్లో ఘనాపాఠిగా మన్ననలందుకొన్న కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి చేతిలో కథ గొప్ప పరిణామం చెందిందంటూ ‘ కలుపు మొక్కలు’ కథను ప్రస్తావించారు. స్త్రీకి ఒక హృదయముంది దానికొక భాష ఉందంటూ ఘోషించిన చలాన్ని ప్రస్తావించారు.చిన్న కథలలో బలమైన భావాలను చలం చెప్పగలిగాడు.ఆ తర్వాత రావి శాస్త్రి, కాళీపట్నం రామారావు,చాగంటి సోమాయాజులు వ్రాసిన కథలు అద్భుతమైనవన్నారు.చాసో  అనగానే అందరికీ గుర్తు వచ్చే  వాయులీనం (Violin) కథను  ప్రస్తావించారు.నేటి రచయితలు ఇతర భాష, తెలుగులోని కథా సాహిత్యాన్ని చదవటం లేదని, మంచి సాహిత్య సృజనకు చదవటం తప్పనిసరి అన్నారు.రవీంద్రనాథ్ ఠాకూర్, శరత్ చంద్ర, కిషన్ చందర్,బుచ్చిబాబు, ఆలూరి బైరాగి కథలు చదవాలి.భావకవి గా పేరుపొందిన దేవులపల్లి ‘రిక్షావాలా ‘కథలో మానవత్వం గోచరిస్తుంది.కథకు ముగింపు బలీయమైనదన్నారు.కథ తరువాత ఇదీ నేను చెప్పదలుచుకున్నదీ అని రచయిత వ్రాయకుండా పాఠకుడినే ఆలోచింపచేసేదే సరైన కథ.రంగనాయకమ్మ వ్రాసిన మురళీ వాళ్ళమ్మ కథ లో భార్యను నిర్లక్ష్యం చేస్తున్న కొడుకును తల్లి నిలదీసి ఆడుగుతుంది. కొడుకు నిర్ఘాంత పోతాడు. అంతటితో కథ అయిపోయింది. కొడుకు మారాడా, చెడుసావాసాలు మానేసాడా అనే విషయం పాఠకుల ఊహకే వదులుతారు రంగనాయకమ్మ.శాస్త్రీయ కాల్పనిక కథలు వ్రాస్తున్న కె.సదాశివరావు,అనిల్ రాయల్ ను ప్రస్తావించారు.       
    హాస్య కథలను ప్రస్తావిస్తూ వేలూరి వెంకటెశ్వరరావు,మందపాటి సత్యం,వంగూరి చిట్టెన్రాజు,శ్రీరమణ బంగారు మురుగు కథ, యెర్రం శెట్టి శాయి లను గుర్తు తెచ్చారు. వైవిధ్యమైన వృత్తం తో వచ్చిన సాయి బ్రహ్మానందం గొర్తి రచన సరిహద్దు కథను ప్రస్తావించారు. తనకు అవకాశమిచ్చిన వీక్షణం వారికి ధన్యవాదాలు చెప్పారు శివశంకర్.


చిత్రం లో ఎడమ నుండి కుడి వైపు: సి.బి.రావు ,శివశంకర్,ఇన్నయ్య

కార్యక్రమ సమన్వయకర్త గుండా శివచరణ్ మట్లాడుతూ "ప్రాచీన సాహిత్య ఔన్నత్యాన్ని చెప్పి దాన్ని చదవమన్నారు శివశంకర్. వస్తు వైవిధ్యం పై మీ పరిశీలన బాగుంది.శివశంకర్ రచనలలో ఒక్క దుష్ట స్త్రీ పాత్ర కూడా లేకపోవటం గమనించదగ్గ విషయం.ఇన్నయ్య  "Forced into Faith" అని పిల్లల గురించిన పుస్తకం వ్రాసారు. దాని పై మాట్లాడారు.శివశంకర్ పిల్లలపై కవిత చదివారు. ఇద్దరూ పిల్లలపై ప్రసంగించటం బాగుంది. మీ ఇద్దరికీ మా ధన్యవాదాలు." అన్నారు. సభికుల ప్రశ్నలకు శివశంకర్ బదులిచ్చారు.  నెక్కల్లు   పిల్లాడినే     అనే తన కవిత వినిపించారు.              
తరువాత కవితలు చదివారు స్థానిక కవులు. మొదట కె.గీత తమ కవిత ‘గుండె  v/s గడియారం’ వినిపించారు.



నన్ను చూసి గడియారం వికటాట్టహాసం చేసింది
అంతా ఎటో వెళ్లిన అపరాహ్న వేళ ఎర్రని డిజిటల్ కళ్లేసుకుని ఉరుమురిమి చూసింది
నా చుట్టూ జ్ఞాపకాల సైకత శిల్పం పొడై రాలుతున్న నిశ్శబ్దం.....................
…..............
ఎక్కడిదో ఓ ఉత్తరం
పుస్తకం పొట్టలో జీర్ణం కానట్లుంది
వీపు తట్టగానే బైట పడింది
.....................

చిత్రం లో ఎడమ నుండి కుడి వైపు: వంశీ ప్రఖ్య,గుండా శివచరణ్

తరువాత వంశీ ప్రఖ్య తమ గీతం ప్రకృతి పదగీతి ని వినిపించారు.

ప్రకృతి పద గతి అమృత మధురిమ ఇచ్చెనే
ప్రణయ సూత్రం ముఖ్య బంధమేదో కలిపినే
వలయ గమనపు కువలయమే వేదికై లయలు నిండెనే
సృష్టి గమనమెలువడినే

తరువాత పిల్లలమర్రి కృష్ణకుమార్ తమ పద్య కవితలు చదివి వినిపించారు.


ఉ| వీక్షణ మానతీయ విని వేచితి నేడిట సాహితీరుచై
  లాక్షణ గౌరవంబు, కవి రాతల మెత్తురటంచు జెప్పగన్
  ఓ క్షణ మాగి జూచితిని ఊపిరి దీయక నాల్గు దిక్కులన్
  రాక్షస వైరి నాదు సుగళామృత ధారల గాచి బ్రోవుతన్

క| తడబడి అడుగిడి సడివడి
   కడుదడ బడితిని మొదలిడ కదలక పేనా
   జడిబడి గడగడ రాసితి
   హడలక పూరితి జేసితి, భవునకు జేజే!

 
సభకు ఫ్లోరిడా, మియామి నుంచి  వచ్చిన నిషిగంధను  పరిచయం చేయటం జరిగింది.  నిషిగంధ వ్రాసిన “ఊసులాడే ఒక జాబిలట”  అనే నవల కౌముది అంతర్జాల మాసపత్రికలో ప్రచురించబడి పలువురి పాఠకుల మన్నలనందుకుంది. నిషిగంధ కవితలు కూడా వ్రాస్తారు.  
తరువాత వంశీ ప్రఖ్య తెలుగు ఒలింపియాడ్ ప్రజ్ఞ గురించిన ప్రకటన చేశారు.
డా||కె.గీత వందన సమర్పణతో సభ ముగిసింది.



సభకు శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా ప్రాంతపు రచయితలు, బ్లాగరులు ఇంకా పాఠకులు వచ్చినవారిలో ఉన్నారు.  


-సి.బి.రావు
****************