Sunday 8 October 2017

వీక్షణం -వార్షిక సమావేశం-5 (Sep10, 2017)


వీక్షణం పంచమ వార్షిక సమావేశం
- నాగరాజు రామస్వామి

Vikshanam

బే ఏరియా 'వీక్షణం' ఐదవ సంవత్సర సాహితీ సమావేశం సెప్టెంబర్ 10 న మిల్పీటస్ స్వాగత్ హోటల్ లో వైభవంగా జరిగింది. ఉదయం 10 నుండి సాయంత్రం 6 దాకా సాగిన ఈ సాహిత్యగోష్ఠిలో పలువురు తెలుగు సాహిత్య పిపాసకులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.
'వీక్షణం' నిర్వాహకులు శ్రీమతి గీతామాధవి గారు గత ఐదేళ్లపాటు నిరాఘాటంగా క్రమం తప్పకుండా నెలనెలా సాగిన ఈ సమావేశాలను, అందుకు సూత్రధారులైన కిరణ్ ప్రభ వంటి సాహిత్య సారథులను గుర్తుచేసుకుంటూ లాంఛనంగా సభను ప్రారంభించారు. శాక్రమెంటో నుండి ప్రత్యేకంగా విచ్చేసిన 'సిరిమల్లె' అంతర్జాల సాహిత్య మాసపత్రిక సంపాదకులు శ్రీ మధు బుడమగుంట గారు ఆ ఉదయం కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి చక్కని అధ్యక్షోపన్యాసంతో మొదలైన మొదటి సెషన్ లో 'కథా చర్చ' కు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.
ప్రథమ వక్త శ్రీ వేమూరి వెంకటేశ్వర రావు గారు కథకు చెందిన 4 అంశాల - వస్తువు, శిల్పం, భాష, కథన విధానం - భూమిక ఆధారంగా స్వీయ రచనానుభవ స్మృతుల నేపథ్యంగా కథాస్వరూపం గురించి చర్చించారు. రేడియో కూడా లేని తన చిన్నతనంలో అమ్మ, మామ, అన్నగారు వినిపించిన కథలే స్ఫూర్తి దాయకంగా ఉండేవని, ఆ ప్రభావం వల్లే ఆనాడు " గాలి దోషం" వంటి కొన్ని చిన్న కథలను రాశానని తెలిపారు. 'చిత్రగుప్తుడు' అనే పత్రికకు ' కార్డు కథలు' పంపే వాణ్ణని చెప్పారు. సింహాచలం కొండమీది అర్చకుని వలచిన కామిని ( Nimphomeniac ) కథ రాస్తూ తానూ సృష్టించుకున్న మిడతంబొట్లు పాత్రతో పలు కథలు రాశానని తెలిపారు. స్వీయానుభవం ప్రాతిపదికగా రాసిన కథలు రాణిస్తాయని ముగించారు.
రెండవ వక్త శ్రీ చుక్కా శ్రీనివాస్. వారు వి. చంద్రశేఖర్ రావు గారి నవల 'నల్ల మిరియం చెట్టు' పై చక్కని విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. క్లుప్తంగా నవలాకారుని జీవిత విశేషాలను తెలుపుతూ, వారి ఇతర పుస్తకాల ఇంపు సొంపులను వివరిస్తూ అమెరికన్ కవయిత్రి మాయ ఆంజేలోవ్ శైలి ప్రభావంగా వారికి పొయెటిక్ స్టైల్ అబ్బి ఉంటుందని అన్నారు. పోస్ట్ సోవియెట్ సంక్షోభం అతని రచనలలో ప్రతిబింబించిందని, మ్యాజిక్ రియలిజం నడకలో సాగిందన్నారు. 'మాయాలాంతరు', చెంచుల జీవితాలను చిత్రించిన ' ఆకుపచ్చని జీవితం', 'ఆత్మగానం ' వంటి పలు కథానికలు, నవలలు రాశారని తెలిపారు. వారి 'ఐదు హంసలు ' చదివి తీరాల్సిన పుస్తకం అని భావించారు. ఆదివాసుల, దళితుల సమస్యలను మానవీయ దృక్పథం లో మలిచారని పొగిడారు. జీవితంలో ఎలాగైనా ఎదగాలన్న బడుగుజీవి చేసిన సంఘర్షణలో దారితప్పిన రాజసుందరం (నల్లమిరియం చెట్టు లోని ముఖ్య పాత్ర) కథ ఈ నవలలో ఆలోచనాత్మకంగా అందంగా అమరిందని అన్నారు. విషయవిస్తృతితో సాగిన శ్రీనివాస్ గారి విశ్లేషణ అందరినీ ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు.
తదుపరి వక్త శ్రీ వేణు ఆసూరి గారు. సంస్కృతాంధ్ర రామాయణాలను ఆత్మదగ్ధంగా అభిమానించే వీరు రామాయణ భారతాది గ్రంథాల ప్రస్తావనలతో పాటు, తాను చదివిన పలు పుస్తకాల గురించి స్పందించారు. విశ్వనాథసత్యనారాయణ గారి వేయిపడగలు తనకు ఇష్టమైన పుస్తకమని, కిరణ్ ప్రభ ప్రభ గారు 25 వారాల పాటు వేయిపడగలపై ప్రసారం చేసిన రేడియోప్రసంగాలు తనకు స్ఫూర్తి నిచ్చాయని తెలిపారు. చైతన్య స్రవంతి ప్రక్రియలో సాగిన బుచ్చిబాబు గారి నవల 'చివరకు మిగిలేది' లోని దయానిధి పాత్ర అపూర్వమని వాక్రుచ్చారు. తనకిష్టమైన స్త్రీ పాత్రల పుస్తకాల మాటకొస్తే చలం గారి 'మైదానం' చిర స్మరణీయం అన్నారు. స్త్రీవాద నవల The Awakening 1899 బహుశా చలంమైదానానికి స్ఫూర్తి కావొచ్చని, రచయిత్రి జేన్ ఆస్టిన్ రచనలు అభిజాత్య భారతీయ రచయిత్రుల భావజాలాన్ని సంపన్నం చేసి ఉంటాయని అభిప్రాయం పడ్డారు. చారిత్రిక నేపథ్య రచనలలో చార్లెస్ డికెన్స్ రాసిన 'A Tale of Two Cities ' చెప్పుకో దగిన గ్రంథంగా కొనియాడారు. అందులో మనిషికీ మనిషికీ మధ్య ఉండే ద్వేషం, పేదల ధనికుల మధ్య ఉండే వర్గవైరం రెండూ కొత్తకోణంలో ఆవిష్కరించ బడ్డాయన్నారు. మాక్సిం గోర్కీ 'అమ్మ', Ayn Rand ' Fountainhead ', Titanic గొప్ప పుస్తాకాలని అభిప్రాయం వెలిబుచ్చారు. స్వగతం ( monologue ) షేక్స్పియర్ గ్రంథాల్లో విస్తృతంగా కనిపిస్తుందని, అందుకు కారణం అవి నాటకాలు కావడం వల్ల అయిఉంటుందన్నారు. కాళిదాసు శాకుంతలం అంతా స్వగత సంభాషణేనని, పాలస్య హృదయం రావణుని అంతరంగ ఏకపాత్రాభివ్యక్తేనని శ్రీ శ్రీచరణ్ గారు స్పందించారు. ఆధునిక సాహిత్యంలో ఈ స్వగతం మరింత చక్కని స్వరూపాన్ని సంతరించుకుందని వేణుగారు విన్నవించారు. అత్యంత ఆసక్తికరంగా సాగిన వేణు ఆసూరి గారి ప్రసంగం అందరినీ అలరించింది.
Vilkshanam

భోజనానంతరం మధ్యాహ్న సెషన్లో మూడు ఈ -పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి :
  1. కె.గీత గారి "సెలయేటి దివిటీ" కవిత్వావిష్కరణ - ఆవిష్కర్త శ్రీ నాగరాజు రామస్వామి.
  2. వీక్షణం - సాహితీ మిత్రుల రచనా సంకలనం - 2017 - ఆవిష్కర్తశ్రీ కిరణ్ ప్రభ
  3. వీక్షణం సాహితీ గవాక్షం- ఐదేళ్ళ సమావేశాలు-ఎన్నెన్నో మధుర క్షణాలు -ఆవిష్కర్తశ్రీ సుభాష్ పెద్దు
శ్రీ వేణు ఆసూరి గారు 'సెలయేటిదివిటీ' పుస్తక సమీక్ష చేశారు. ఆచార్య గంగిశెట్టి గారి ముందుమాట గల ఈ పుస్తకం వాళ్ళ నానమ్మ కనకమ్మకు గారికి అంకితం ఇవ్వబడి ఉంది. ప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మి గారి కూతురైన కె.గీతగారికి సంక్రమించిన సాహిత్య వారసత్వ సంపద ఆమెను గొప్ప కవయిత్రిని చేసిందని, పుస్తకంలో ఉన్న కవితలన్నీ ద్వేషం కాని, నిందలు కానీ లేని స్త్రీ సంవేదనాత్మక శుద్ధ రస స్పందనలని, ఆమెవి లోతైన ఆలోచనలని, నిజాయితీగా అందంగా కవితలల్లడం ఆమెకు అలవోకగా అబ్బిన విద్య అని వేణుగారు అభినందించారు. గీత గారి ఇతర కవితా సంపుటులు ద్రవభాష, శీత సుమాలు, శతాబ్ది వెన్నెల. ఈ సంపుటిలోని పలు కవితలను విశ్లేషిస్తూ వేణు గారు కవితలలోని భావచిత్రాలను, ఆత్మగంధాలు చిందే ఆమె హృదయాభివ్యక్తి విశేషాలను, ఆమె సరళ సుందర వచన కవితా రీతులను చక్కగా ఆవిష్కరించారు.

మధ్యాహ్న విందుతో బాటూ శ్రోతల వీనుల విందుగా శ్రీ నాగ సాయిబాబా, శ్రీమతి ఉమా వేమూరి, చి|| ఈశా పాటలు పాడారు.
భోజన విరామానంతరం పార్లమెంట్ సభ్యులు శ్రీ మధు యాష్కీ అనుకోకుండా సభకు ప్రత్యేక అతిధిగా విచ్చేసి తెలుగు పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీ కోమటి జయరాం ఆయనను సభకు పరిచయం చేసారు. మధు యాష్కీ మాట్లాడుతూ "తెలుగు వాడిగా తనకు భాషాసాహిత్యాభిలాష ఉందని, అందుకు దోహద పడే "తెలుగు రచయిత", "బర్కిలీ యూనివర్శిటీ తెలుగు" వంటి ఉత్తమ కార్యక్రమాలకు చేయూతనిస్తానని" హామీ ఇచ్చారు.

ఆ రోజు జరిగిన అత్యంతఆసక్తికరమైన చిరస్మరణీయమైనఘట్టం అష్టావధానం:
తెలుగువారికే స్వంతమైన అవధాన సాహిత్యచరిత్రలో మొట్టమొదటి సారిగా"సంస్కృతాంధ్ర ఉభయభాషా ద్విగుణీకృత అష్టావధానం" జరిగింది. అందులోనూ తెలుగు గడ్డ బయట, అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని బే ఏరియా లో జరగడం విశేషం. అందునా అమెరికా పౌరసత్వం తీసుకొని అక్కడే స్థిరపడ్డ తెలుగు సోదరుడు, వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీరయిన శ్రీ పాలడుగు శ్రీ చరణ్, కష్టసాధ్యమైన ఈ ప్రక్రియను జయప్రదంగా నిర్వహించడం మరింత విశేషం. ఇది ఖండాంతరాలకు వెళ్లినా తరగని తెలుగుప్రతిభకు, తెలుగు భాషాభిమానానికి ఉదాహరణగా నిలిచే మరో చారిత్రక సన్నివేశం.
ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని , తిరుపతివెంకటకవుల తర్వాతి యుగంలో అవధాన కళాప్రాచుర్యానికి అపార కృషి చేసి ఇటీవలే స్వర్గస్థులైన డా. సి.వి. సుబ్బన్న శతావధాని స్మృత్యంకితంగా మహాంధ్రభారతి సంయుక్త సహకారంతో నిర్వహించడం జరిగింది.
కాన్పూరు ఐ.ఐ.టి.లో ఎం.టెక్. చేసిన శ్రీచరణ్ వృత్తి రీత్యా 98లో అమెరికా వెళ్లారు. తండ్రి తిరుపతి వాస్తవ్యులు శ్రీ జయరామానాయుడుగారు హిందీలో ఎం.ఏ. చేసి, హిందీ మాష్టారుగా స్థిరపడ్డా, మొదట దేవస్థానం వారి ఓరియంటల్ కళాశాల విద్వాన్ పరీక్ష పాసయినవారు. తల్లి డా. మనోరంజని గారు, కావడానికి స్థానిక పద్మావతీ మహిళా కళాశాలలో జువాలజీ అధ్యాపకురాలైనా తెలుగు భాషాసాహిత్యాల పట్ల అపార ప్రేమ గలవారు. అలా తల్లిదండ్రులనుండి భాషాసాహిత్య ప్రీతి చిన్నప్పటినుండి వారసత్వంగా అబ్బింది. కాలిఫోర్నియా వచ్చాక తెలుగు సంస్కృత భాషాధ్యయనాలను పట్టుదలగా కొనసాగించారు. సందర్శనార్థం వచ్చిన శ్రీ వర్ధిపర్తి పద్మాకర్ గారినుండి పద్యవిద్య మెలుకువల్ని గ్రహించారు. స్థానిక వేద పండితులు శ్రీ మారేపల్లి నాగ వేంకటశాస్త్రి గారి వద్ద వేదాధ్యయనం చేశారు. గురువుల ప్రోత్సాహంతో తెలుగువారి కీర్తి అయిన అవధాన ప్రక్రియలో అడుగుపెట్టారు.

 మొదటగా మొన్న మే నెలలో మిల్పీటస్ లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ కళామండపంలో , తెలుగులో తొలి అష్టావధానం,అభ్యాస నిమిత్తం చేశారు. ఆ తర్వాత నేరుగా ఈ ఉభయభాషావధానాన్ని, రెట్టింపు పృచ్ఛకులతో, జయప్రదంగా చేశారు.
వారి కవితాధారకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు:
సాధారణంగా అవధానులు నిషిద్ధాక్షరిలో చిన్న చిన్న పదాలు వేసుకొంటూ, లేదా ఏకాక్షరి ప్రయోగాల కసరత్తుతో ముందుకు సాగుతుంటారు.సమాసాల కల్పన జోలికి వెళ్లరు, సులభంగా పట్టుబడతామన్న భావంతో! కానీ శ్రీ చరణావధాని నిర్భయంగా సరస సమాసకల్పనతోనే తన పూరణ సాగించారు. శ్రీరామపరంగా చెప్పమన్నదానికి తెలుగు పూరణ ఇది:
కం. రవి వంశ శశిన్నేడీ
కవితాబ్దీందుడ కళాధికంజరిపున్నే
ప్రవిమల భక్తింగొలిచెద
పవనాత్మజ సేవితుని శుభప్రదు రామున్।।
సంస్కృతంలో—కపిలారణ్య రత్నాణి / ద్రు దీర్ఘతమ తత్త్వభిః
రక్త రాస ద్యుమ్నాన్యపి /రమ్య వనాని సంత్యపి
శ్లోకార్థాన్ని వివరిస్తూ ఇప్పుడు కాలిఫోర్నియానే మన పురాణాల్లోని కపిలారణ్యంగా భావిస్తున్నారనిఅవధాని పేర్కొన్నారు.
తెలుగులో సమస్య : " కాపురమున్ గూల్చి యతడు ఘనుడయ్యె నిలన్" .ఈ సమస్యకు 'లం/కాపురమున్ గూల్చి ....' అని సులువుగా పూరణ చేయవచ్చని అందరూ భావిస్తుండగా
"పూరణ శ్రీకృష్ణ పరంగా ఉండాలని"చమత్కారంగా పృచ్ఛకులు నిర్దేశించడంతోవెంటనేఅవధాని ఇలా పూరించారు :
కం.తాపసుల కష్టపెట్టెడు
పాపపు నరకాసురుని విపన్నావనుడౌ
శ్రీపతి తా ప్రాగ్జ్యోతిష
కాపురమున్ గూల్చి యతడు ఘనుడయ్యె నిలన్।।
ఇక సంస్కృతంలో సమస్య : " తక్రం శక్రస్య దుర్లభం"
పూరణ:ఐరావత మదోద్ధత్యా / దుర్గతామర వైభవః
జ్ఞాన పీయూష రిక్తస్య / తక్రం శక్రస్య దుర్లభం
జంభాసురాదులను జయించిన గర్వంతో ఇంద్రుడు, తన గజేంద్రం మీద ఊరేగుతోంటే, ఆ మత్త గజం, ఆశీర్వదించడానికి వచ్చిన దుర్వాసుని కానుకను అందించకుండా అవమానించినప్పుడు, ఆ మహర్షి శాపానికిగురైన ఇంద్రుడు, ఆ ఐరావతంతో సహా తన అమర వైభవాలన్నీ సముద్రం పాలుకాగా, అమృతానికే కాదు, చివరకు మజ్జిగకు కూడా నోచుకోని దుస్థితికి లోనవుతాడన్నది భావం. జ్ఞాన పీయూషాలన్నది లోతైన అర్థ చమత్కారం.
దత్తపదిలో – 'వ్యాస , శుక , శంకర , పోతన' అనే నాలుగు పదాలను వాడి ఏదైనా తెలుగు ఛందంలో పద్యం చెప్పమనగా వెంటనే అందుకొని
కం. సవ్యాసవ్య వివేకము ( — అని మొదటి పాదం చెప్పి తర్వాతి ఆవృత్తాల్లో)
దీవ్యంబై ఈశు కళను ధీరాముండై
క్రవ్యాసుర నాశంకర
భవ్యుడపోతనరినాడు వసుధం ఘనుడై ।। (అని అనాయాసంగా పూర్తి చేశాడు)
అదే పదాలతో సంస్కృతంలోనూ పూరించమనగా —
సవ్యాసవ్య వివేకోయం/ ప్రాంశు కళా పరస్తథా
పాహ్యనిశం కరాబ్జైశ్చ / తాపోతనత రక్షకః – అని అనుష్టుప్పులో పూరించాడు.
తెలుగు న్యస్తాక్షరికి గాను సభాధ్యక్షులైన రావు గారు 1 వ పాదంలో 13వ అక్షరంగా 'దున్' , 2 వ పాదంలో 2 వ అక్షరం- 'డ్ర', 3 వ పాదంలో 5 వ అక్షరం- 'న' , 4 వ పాదంలో 9 వ అక్షరం- 'మి'ఉండాలని,శార్దూల వృత్తం లో గణేశ స్తుతి చేయాలని వస్తు నిర్దేశం చేస్తూఅడిగారు.ఆ అక్షర న్యాసం వెనుక ఆయన దృష్టిలో పెద్దన గారి మనుచరిత్ర పద్యం ఉంది. ఆ విషయాన్ని ఆయనే పూరణ, ధారణ పూర్తయ్యాక వివరించారు. పెద్దనగారి పద్యాన్ని తలపించేలానే అవధానిగారి పూరణ ఇలా సాగింది:
శా. తండ్రిన్ తల్లిని పూజచేసి శ్రుతి విద్యందున్ కవీంద్రుండుగా
తీండ్రల్ గల్గిన మానసంబులను ను త్తీర్ణంబు గావించు తా
నుండ్రాళ్లం దినుచున్ విశేష వరముల్ యోగీంద్ర భక్తాళికిన్
చండ్రార్కేందు హుతాశనామిత సుధీన్యస్తుండు తానిచ్చున్।।
సంస్కృత న్యస్తాక్షరికి గాను శ్రీ కృష్ణకుమార్ : 1 వ పాదం 3 అక్షరం- 'ఖా', 2 వ పాదం 10వ అక్షరం- 'క్ష' , 3 వ పాదం 5 వ అక్షరం-'వ', 4వ పాదం 15వ అక్షరం- 'ష్ట'గాను శ్రీమన్నారాయణ స్తుతిపరం కావాలనీ అడిగారు. దానికి అవధాని నిరాయాస పూరణ :
శా. వైశాఖాయ జనార్దనాయ మహతే కూర్మావతారాయ చ
క్షీరాంభోనిధి తారణేపి క్షర మోహాహంకృతిఘ్నే నమః
ధ్యాయేహంతు నటేశ భక్తమనిశం నారాయణం చక్రిణం
శ్రీ కళ్యాణగుణావహం ప్రణవ సంయోగాష్ట వర్ణార్చితం
వర్ణన, ఆశువుల్లో కూడా ఇలానే సరసమైన పూరణ సాగింది. నాలుగ్గంటలపాటు సాగిన అవధానానంతరం, చివర్లో అందరూ హర్షధ్వానాలు చేస్తుండగా అక్షరం పొల్లు పోకుండా ధారణ చేసి ప్రథమ ప్రయత్నంలోనే అవధాని జయం సాధించారు.అమెరికా పౌరులైన తెలుగు వారి చరిత్రలో ఒక కొత్త అధ్యాయం సృష్టించారు.
తెలుగులో ఛందోబద్ధంగా కవిత్వం రాయగల స్థానిక ప్రముఖులు శ్రీ తల్లాప్రగడ రామచంద్రరావుగారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి, సరసంగా సభను నిర్వహించారు. దాంతోపాటు తెలుగు 'న్యస్తాక్షరి' పృచ్ఛకులుగా కూడా వ్యవహరించారు.శ్రీ పిల్లలమర్రి కృష్ణకుమార్ సంస్కృతంలో న్యస్తాక్షరిప్రశ్ననిచ్చారు. ఎనిమిది పదులు దాటిన సంస్కృతాంధ్ర విద్వాంసులు, శ్రీ హరి కృష్ణమూర్తి గారు తెలుగు నిషిద్ధాక్షరి నిర్వహించగా, సంస్కృతంలో శ్రీమతి సంధ్యావాషికర్ నిర్వహించారు. వారితోపాటు స్థానిక 'సంస్కృతభారతి' సభ్యులైన కన్నడిగులు శ్రీ విశ్వాస్ వాసుకి సంస్కృతంలోనూ, శ్రీపుల్లెల శ్యామ సుందర్ తెలుగులోనూ సమస్యనిచ్చారు. శ్రీ రెంటచింతల చంద్ర, కొండూరు రవిభూషణశర్మ గార్లు తెలుగు సంస్కృతాలు రెండింటిలోనూ దత్తపది, ఆశువులకు సమస్యలనివ్వగా, శ్రీమతి సుమలత సంస్కృతంలో , శ్రీ ఇక్బాల్ తెలుగులో వర్ణన నిర్వహించారు. వేదపండితులు శ్రీ నాగవేంకటశాస్త్రి గారు సంస్కృతంలోనూ , డా. గీతామాధవిగారు తెలుగులోనూ పురాణప్రశ్ననిచ్చారు. తెలుగులో శ్రీ వేణు ఆసూరిగారు, సంస్కృతంలో కేరళకు చెందిన శ్రీ హరినారాయణగారు అప్రస్తుత ప్రసంగంతో సభను రక్తి కట్టించారు. అలా అది కేవలం తెలుగుకే కాక యావద్భారతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకొంది. రెండు భాషల్లోనూ దీటుగా, సమయ స్ఫూర్తితో సమాధానాలివ్వడంతోపాటు చక్కటి ధారతో, ధారణతో , ఛందోబద్ధ కవితాత్మకతతో ప్రథమ ప్రయత్నమైనా , అందరి ప్రశంసలకు పాత్రమయ్యేలా శ్రీచరణ్ గారు ఈ ఉభయభాషావధానాన్ని నిర్వహించి, అమెరికన్ ప్రథమావధాని అయ్యారు.
అవధాని విజయాన్ని అభినందిస్తూఅధ్యక్షులు శ్రీ తల్లాప్రగడ రామచంద్రరావు సన్మాన పత్రంలో తాము రచించిన ఈ కింది పద్యాన్ని సభాముఖంగా చదివి వినిపించారు:
సీ.|| అవధానధనదానమనుదిన పదనద -ధ్యానమందున కూడ ధన్యుడైన,
మదనకథ కథనమధనవిధము నందు- అవధాన ధ్యాసకు అవధి లేని,
సావధానపుమది సదనవదనమున -ఎదల పొదల సొదలెత్తిచూపు,
శ్రీచరణుడు కాడ సిరి సరస్వతికైన - పుంభావవాణిగ పుడమిమెచ్చ!
ఆ.వె.|| సద్యమైన స్ఫూర్తి పద్యములను కూర్చ – పెక్కు పల్కులెన్ని చెక్కినాడు!
సంస్కృతాంధ్రములను శ్వాసగా శాసించి – రంగరించినాడు, రామచంద్ర!**
చివరిగా మహాంధ్రభారతి పక్షాన శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారూ, వారి కుమారులు శ్రీ వంశీగంగాధర్ దంపతులు , అవధానిగారిని పట్టుపంచె,కాశ్మీర్ దుశ్శాలువాలతోనూ, పృచ్ఛకులను జరీ వస్త్రాల తోనూ సాంప్రదాయక రీతిలో సత్కరించారు.
సభ ఆద్యంతం రసవత్తరంగా, ఉత్సాహ భరితంగా సందడిగా సాగి అందరిని అలరించింది. కవి సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితలను వినిపించారు. శ్రీ కిరణ్ ప్రభ గారు 20 సాహిత్య క్విజ్ ప్రశ్నలను సంధించి విశేషంగా ఆకట్టు కున్నారు. కవితా గానంతో , పాటలతో, సాహిత్య చర్చలతో, కథారీతుల విశ్లేషణలతో, అంతిమంగా అపూర్వమైన అష్టావధాన కార్యక్రమంతో ఐదవ వార్షిక వీక్షణ సమావేశం జయప్రదంగా ముగిసింది.


divider
http://sirimalle.com/issues/2017/10/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2017/october/oct_2017_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం - సాహితీ గవాక్షం-60 (Aug13, 2017)

వీక్షణం - 60 సమీక్ష
- పాలడుగు శ్రీ చరణ్

Vikshanam

వీక్షణం 60 వ సమావేశం ఆగష్టు 13న శానోజోలోని శారద, మాధవి గార్ల ఇంట్లో జరిగింది. ఈ సమావేశానికి కాత్యాయనీ విద్మహే అధ్యక్షత వహిస్తూ ఆసక్తి కరమైన రచనలెన్నో చేసిన కథా రచయిత, అనువాదకులు దాసరి అమరేంద్ర విచ్చేసిన వీక్షణం సభలో అధ్యక్షత వహించడం తనకు చాలా సంతోషకరమన్నారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి అమరేంద్ర గారు "తెలుగులో యాత్రా సాహిత్యం" గురించి మాట్లాడుతూ ముందుగా టూరిస్టు వేరు, ట్రాలెలర్ వేరు, యాత్ర వేరు , ప్రయాణం వేరన్నారు.  ముందుగా దిశా నిర్దేశం చేసుకునేవారు టూరిస్టు లనీ, అవి యాత్రలనీ, ప్రయాణంతో బాటూ ముందుకు సాగేవారు ట్రాలెలర్ అనీ స్పష్టం చేసారు.
యాత్రా సాహిత్యాలకు మళయాళం, మరాఠీ భాషాలలో యాత్రా సాహిత్యాలకు గొప్ప ఆదరణ ఉందనీ, దేశవ్యాప్తంగా దాదాపు రెండు వందల కొత్త గ్రంథాలు వస్తున్నాయనీ అన్నారు.
మన తెలుగులో ఏనుగుల వీరాస్వామయ్య, గురజాడ, చలం, ఆచంట, అడవి బాపిరాజు, మాలతీ చందూర్, నవీన్, ఆదినారాయణ, కె.గీత వంటి అనేకమంది రచయితలు యాత్రా చరిత్రల్ని రాశారని అన్నారు.
విభిన్న రూపాల్లోని యాత్రానుభవాల్ని గురించి చెప్తూ పరిమళా సోమేశ్వర్, ఎండ్లూరి సుధాకర్, కాశీయాత్రా చరిత్రల్ని గురించి పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్ని గురించి తెలుగు వారు యాత్రాచరిత్రలు రాసారని, మనం సృశించని ప్రదేశం లేదని అన్నారు.
కొన్ని పుస్తకాల గురించి క్లుప్తంగా వివరిస్తూ, ముందుగా కాశీ యాత్రా చరిత్ర గురించి వివరించారు. మద్రాసులో బయలుదేరి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల మీదుగా  కాశీ వెళ్లి, బీహార్ గుండా వెనుకకు 15 నెలల పాటూ మందీ, మార్బలంతో చేసిన ఈ యాత్ర తెలుగులో రచించబడిన మొట్టమొదటి యాత్రా చరిత్ర అని పేర్కొన్నారు. ఇది170 ఏళ్ళ క్రిందట ఒక సత్యశోధకుడు, జిజ్ఞాసువు చేసిన గొప్ప యాత్రగా పేర్కొన్నారు. ఈ యాత్రాచరిత్ర ద్వారా మనకు అప్పటి భారతదేశపు రూపురేఖలు తెలిసాయని అన్నారు.
తరువాత నాయని కృష్ణకుమారి విద్యార్థులతో చేసిన కాశ్మీర్ యాత్ర "కాశ్మీర దీపకళిక", ఎం. ఆదినారాయణ "భ్రమణ కాంక్ష", రాహుల్ రాసిన డార్జిలింగు యాత్ర, బదరీ పాదయాత్ర గురించి రాసిన సోమశేఖర్, పరవస్తు లోకేశ్వర్ ఛండీగఢ్ స్కూటర్ యాత్ర, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు  ఉత్తర దేశ యాత్ర గురించి రాసిన "మా యాత్ర", దాసరి అమరేంద్ర రాసిన అండమాన్ డైరీ, యూరప్ యాత్రా సమాహారం "మూడు నగరాలు",  స్కూటర్ పై చేసిన యాత్రల గురించి  వివరించారు.  6 ఖండాలలో 14 దేశాల యాత్రా సమాహారమైన ఎం. ఆదినారాయణ "భ్రమణ కాంక్ష" ను ప్రపంచ స్థాయి యాత్రా చరిత్రంగా కొనియాడారు.
ఆ తరువాత సంక్షిప్త చర్చలో భాగంగా సభలోని వారు వేమూరి రాసిన "అమెరికా అనుభవాల" గురించి  గుర్తు చేసేరు.
తరువాత శారద ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ ఆసక్తికరంగా సాగింది.
ఆ తరువాత విశ్రామ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ తన స్వీయ కవితా సంపుటి "మండువా లోగిలి" ని సభకు పరిచయం చేసేరు.
విరామానంతరం వేణు ఆసూరి, కల్లూరి రామ ప్రసాద్ గారి " సచిత్ర శ్రీ త్యాగరాజ కీర్తనామృతం" పుస్తక పరిచయాన్ని చేసారు.
ఆ తరువాత జరిగిన కవి సమ్మేళనం, పాటల కార్యక్రమంలో శ్రీ చరణ్, కె. గీత, వేణు ఆసూరి, లెనిన్, యువ కవి శశి మున్నగు వారు పాల్గొన్నారు.
ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ సమావేశంలో డా|| వెంకటేశ్వర్లు, రవికుమార్, ఐ. ఎం శర్మ దంపతులు, కాంతి పాతూరి, ఉమా వేమూరి మున్నగు వారు కూడా పాల్గొన్నారు.
divider

http://sirimalle.com/issues/2017/09/vikshanam.html

http://www.koumudi.net/Monthly/2017/september/sept_2017_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం - సాహితీ గవాక్షం-59 (Jul16, 2017)





http://www.koumudi.net/Monthly/2017/august/august_2017_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం - సాహితీ గవాక్షం-58 (Jun13, 2017)


వీక్షణం-58వ సమావేశం

-పొట్లూరి చాయాదేవి
నేటి సమావేశం లోని ముఖ్యాంశాలు:- ఈ సమావేశానికి శ్రీ మేకా రామస్వామి గారు ఆహ్వానం పలుకుతూ సాహితీ ప్రపంచానికి ఎల్లలు లేవని అన్నారు. తెలుగు భాష తీగలు భువనమంతా పాకాయని, వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రతీ తెలుగు వారికి ఉందని తెలిపారు.

శ్రీమతి కాత్యాయనీ విద్మహే గారు మరాఠీ అనువాదం “మా బతుకులు” అనే పుస్తకం గురించి విశ్లేషణ చేసారు. తను ఎక్కువగా సాహిత్యంలో స్త్రీల సమస్యల పై స్పందిస్తానని అన్నా రు. స్త్రీల రచనలు సేకరించడం తన బాధ్యతగా భావించానని అన్నారు. సాహిత్యంలో స్త్రీల రచనల పట్ల అసమానతలున్నాయని, వాటిని రూపుమాపాలని, స్త్రీలు తమ రచనలలో తమ అభిప్రాయాలని స్వేచ్ఛగా పొందుపరుస్తారని అన్నారు. స్త్రీల రచనల్లో ఆత్మ కథలు, స్వీయ చరిత్ర లు బహు తక్కువని, అందులో ఒకటి మహారాష్ట్ర లో 1965 లో దళిత మహిళ సమాజంలో అనుభవించిన బాధల సమాహారమే “మా బతుకులు” నవల అన్నారు.
మా బతుకులు నవల మరాఠీ భాషలో 1980 లో స్త్రీ అనే పత్రికలో సీరియల్ గా వచ్చింది. బేబీ కాంబ్లే ఈ నవలను 1960 లో రాసినా రెండు దశాబ్దాల త్ర్వాత ప్రచురణకు నోచుకుంది. వర్గ విభేదం సమాజంలో బలంగా వేళ్లూనుకుందని, దానిని కూకటి వేళ్లల్తో సహా పెకలించివేయాలని అన్నారు. బేబీ కాంబ్లే దళితుల ఆర్థిక జీవనం, సంస్కృతిని తన ఆత్మకథలో చిత్రించారు. అగ్ర స్త్రీ వర్ణానికి, దళిత స్త్రీ వర్గానికి వివక్ష గురించి చర్చించారు. వస్త్రధారణతో సహా వివక్ష ఉండడం గమనించవలసిన విషయం అన్నారు. అత్తా, కోడళ్ల గురించి చెబుతూ బేబీ కాంబ్లే “మేము అందరికీ బానిసలం, కానీ కోడళ్లు అత్తలకు బానిసలే కదా” అన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జీవించాలని పిలుపునిచ్చారు. దళీత స్త్రీల పట్ల వివక్షను గురించి తెలిపే ఇతర రచనల గురించి కూడా కాత్యాయని టూకీగా ప్రస్తావించారు. 1940 లో హవాయి కావేరీబాయి రాసిన “పరిణామం” నవల, 1930 లో గృహలక్ష్మి పత్రికలో సుసర్ల లక్ష్మీ నరసమాంబ రాసిన కథలు, వ్యాసాలు, 1920 లో ఆదుర్తి భాస్కరమ్మ రచనల గురించి వివరించారు. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థల ప్రారంభం గురించిన చర్చలో మెకాలే, విల్సన్ ల కాలంలో ప్రారంభమైన వర్ణ వ్యవస్థ గురించి పిల్లలమర్రి కృష్ణ కుమార్ మట్లాడారు. తర్వాత అత్యంత మనోరంజకంగా సాహితీ క్విజ్ కార్యక్రమం శ్రీ కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత జరిగిన కవితా సమ్మేళనంలో వేణు ఆసూరి గారు హేతువాదం గురించిన కవితను వినిపించారు. మేకా రామస్వామి గారు “జీవన వైవిధ్యం ” అనే కవితను వినిపించారు. ఇందులో పక్షులకు, మనుషులకు గల సారూప్యతను గురించి వివరించారు. శ్రీమతి కె.గీత గారు “పుట్టగొడుగు మడి” కవితను వినిపించారు. వయసొచ్చిన రూపంలోని తెల్ల జుత్తును పుట్టగొడుగు మడిగా పోల్చిన కవిత ఇది.
కిరణ్ ప్రభ గారు రేడియోలో సాహిత్యం గురించి తెలుపుతూ తను సాహిత్యం లోని ప్రసిద్ధ పుస్తకాలు రోజువారి కార్యక్రమంగా మాటల రూపంలో చెప్పటం ద్వారా సుపరిచితులు. సాహిత్యం పట్ల అభిరుచితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. శ్రీమతి గీత గారు తాను అమెరికా వచ్చిన కొత్తలో తెలుగు భాషను, సాహిత్యాన్ని మరిచిపోయేనని, దానికి పునరుజ్జీవనం పోస్తూ వీక్షణం సాహితీ గవాక్షాన్ని ప్రారంభించానని, ఈ రోజు 58 వ సమావేశం జరుగుతూందని, ఈ స్థాయికి తీసుకు రావడానికి అందరి సహకారం ఎంతో ఉందని, ఇందు కోసం తన సాయశక్తులా కృషి చేస్తూనే ఉంటానని, ఈ సాహితీ వనంలో చెట్లు నాటడం, పెంచడం తనకు ఊపిరి, బలం అని, దీనికి జీవం పోయడం తన విధి అన్నారు. ఈ కార్య క్రమం ఆద్యంతం బహు రసవత్తరంగా జరిగింది.
http://sujanaranjani.siliconandhra.org/%E0%B0%B5%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%82-58%E0%B0%B5-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/
http://www.koumudi.net/Monthly/2017/july/july_2017_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం - సాహితీ గవాక్షం-57 (May14, 2017)

వీక్షణం - 57 సమీక్ష
(మాసం మాసం శ్రుత సాహిత్యం)
- విద్యార్థి

Vikshanam

వీక్షణం 57వ సమావేశము మే 14, 2017న శ్రీ పాలడగు శ్రీచరణ్, యామినీ గార్ల స్వగృహమునందు జరిగినది. ఈ సభకు శ్రీ వెంకట నాగ సాయి బాబా గారు అధ్యక్షత వహించి, "వీక్షణం, వీక్షణం, అమెరికాలో తెలుగు ప్రజల గర్వ కారణం, వీక్షణం ..." స్వరచన కవితా గానముతో, ఆ తరువాత బ్లాండు బేతాళ కథ అంటూ, సగం తెలుగులోనూ, సగం ఇంగ్లీషులోను హాస్య కథతో సభను ప్రారంభించారు.
మొదటి ప్రసంగము  శ్రీచరణ్  తండ్రిగారైన శ్రీ పాలడుగు జయ రామా నాయుడు గారిది. వారు కాళిదాసుని కుమార సంభవము లోని ఒక శ్లోకం గురించి చేసిన ప్రసంగ విశేషములు: "ఇది కుమార సంభవములోని మూడవ శ్లోకము. ముందు రెండు శ్లోకములలో హిమవంతుని ప్రాభవము వివరించి, మూడవ శ్లోకము ఇలా వివరించారు.
అనంతరత్నప్రభావస్య యస్య హిమం న సౌభాగ్యవిలోపి జాతమ్
ఏకోహి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీన్దోః  కిరణేష్వివాంఙ్కః
అనంతమైన రత్నములకు ఓషధిలకు నిలయమైన  హిమవత్పర్వతానికి, అనగా హిమవంతుడు అనే పర్వత రాజునకు ఒక చిన్న దోషముంది. ఈ రత్నాలు, ఓషధులు మంచుతో కప్పబడి ఉన్నాయి. అయినా, చంద్రుని చూచి ఆనందించవలెను కానీ, చిన్న చిన్న మచ్చలను లెక్కపెట్టకూడదు కదా! అలాగే, హిమవంతుని వలె, మన యెదుటనుండే పెద్దవారు కానీ, మహానుభావులని కానీ వారిలోని గొప్ప గుణాలని చూచి ఆనందించవలెను. వారిలోని చిన్న చిన్న లోటుపాట్లను లెక్క చేయరాదు.
ఇదే విషయాన్ని కబీర్ దాసు ఈ విధముగా చెప్పారు.
बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय,
जो दिल खोजा आपना, मुझसे बुरा न कोय।
అనగా, ఒక చెడును చూడడానికి నాకు చెడు ఎక్కడా కనబడలేదు. ఎవరి మనసును చూచినా, నాకు చెడు అనేది కనబడలేదు. మనము వెతుకుతున్నది మన గుణమును బట్టి కనబడుతున్నది.
అలాగే, ఒక ఇద్దరు కలసి ఒక తీర్థంకి వెళ్లారు. పది మణుగుల పాపం వెంటబెట్టుకొచ్చారట. మన గుణము ఎదుటివారిలో మంచిని గ్రహించేదైతే, పుణ్యము అదే వస్తుంది. మన గుణము సరిగా లేకపోతే, ఎంతటి తీర్థానికి వెళ్లినా పాపము పెరుగుతుంది.
కాబట్టి, మనము ఎదుటి వారిలోని మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి"
ఆ తరువాత పాలడుగు శ్రీ చరణ్ గారు కుమారసంభవములోని శివుని తపస్సు, పార్వతీ దేవి పూజ, మన్మథుడు శివునికి పార్వతిపై మోహము కల్పించే ఘట్టాలని క్లుప్తముగా వివరించారు.
ఆ తరువాతి కార్యక్రమం కిరణ్ ప్రభ గారి క్విజ్. క్లిష్ట ప్రశ్నలతో కూడి, సభకు ఇష్టమైన కార్యక్రమం. ఒక ఉదాహరణ ప్రశ్న 'పాత క్రొత్తల మేలు కలయిక క్రొమ్మెరంగులు జిమ్మగ", ఇది ఏ పుస్తకము లోనిది?
విరామానంతరము కవి సమ్మేళనములో చదివిన కవితలు:
  1. మేకా రామస్వామి గారు, "తొణికిన స్వప్నం"
  2. మేకా ఛాయా దేవి గారు, మాతృ దినోత్సవము సందర్భముగా, ఒక స్త్రీ వేదన కవిత
  3. డా|| కె  గీతా మాధవి గారు, "సెలయేటి దివిటీ .."
  4. గీత గారు చదివిన, ఆచార్య గంగిశెట్టి గారి కవిత, "సారస్వత యోగం"
  5. నాగ సాయి బాబా గారి "కాకిని నేను"
  6. శ్రీ చరణ్, "కలలోన ఇలలోన ..
శ్రీమతి ఇందిర, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి శారద, శ్రీమతి మాధవి, శ్రీమతి  లక్ష్మి, శ్రీమతి యామిని, శ్రీమతి ఉమా వేమూరి, శ్రీమతి రత్నకుమారి, శ్రీ కోటి రెడ్డి, శ్రీ ప్రసాద్, శ్రీ సత్యనారాయణ, శ్రీ శ్రీనివాస్, శ్రీ లెనిన్, శ్రీ  తాటిపామల మృత్యుంజయుడు మున్నగు స్థానిక ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు.

divider
http://sirimalle.com/issues/2017/06/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2017/june/june_2017_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం - సాహితీ గవాక్షం-56 (Apr9, 2017)








వీక్షణం 56వ సమావేశం


-సుభాష్ పెద్దు

వీక్షణం 56వ సమావేశం ఏప్రిల్ 9, 2017 నాడు మిల్పిటాసు లోని అనిల్ రాయల్ గారి ఇంటిలో జరిగగింది. ఈ సమావేశానికి శ్రీ పెద్దింటి తిరుములాచార్యులు గారు అధ్యక్షత వహించారు.
అధ్యక్షుల వారు ముఖ్య అతిథిగా ప్రముఖ కథా, నవలా రచయిత్రి, టీ.వీ సీరియల్ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారిని సభకు ఆహ్వానించి ప్రసంగించవలసినదిగా కోరారు.
బలభద్రపాత్రుని రమణి గారి ప్రసంగ విశేషాలు – "నేను 7, 8వ తరగతులలో ఉన్నప్పుడు కథలు వ్రాయటం మొదలుపెట్టాను. ఒకసారి ఒక పత్రికకు కథ పంపిస్తుంటే మా అన్నయ్య బల్ల కొట్టి మరీ చెప్పాడు, ఈ కథను ప్రచురించరు అని. ఆ కథ ప్రచురించబడటమే కాకుండా పలు ప్రశంసలకు కూడా పొందింది. అద్రక్-కె-పంజే వంటి నాటికలు, చలం గారి రచనలు, ముఖ్యముగా "దైవమిచ్చిన భార్య" మొదలైనవి నన్ను ప్రభావితం చేశాయి. నన్ను ప్రోత్సహించిన వారు ఎందరో. వారిలో ముఖ్యులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. "లీడర్, మజిలీలు" వారి ప్రోత్సాహంతో ఎమెస్కో వారు ప్రచురించారు.

నా నవలను మొదటి సారిగా సినిమాకోసం అడిగినప్పుడు నేను పారితోషకం అడగలేదు. నవలను స్క్రీన్‌ప్లేగా మార్చి చిత్రీకరించటంలో అనుభవం కావాలి అని అన్నాను. సత్యనారాయణ గారు, గుమ్మడి గారు వంటి మహా నటులతో సెట్స్ మీద పనిచేయటం ఒక గొప్ప అనుభవం. ఆ రకంగా, సినిమా స్క్రీన్‌ప్లే రచయితగానూ, ఆ తరువాత టీ.వీ సీరియల్స్ కి కథ, స్క్రీన్‌ప్లే రచయితగా స్థిరపడ్డాను.
కథ వ్రాయటం చాలా కష్టం. ఇప్పుడు నేను రోజూ వ్రాసేది టీ.వీ సీరియల్స్. ఒకేసారి 300, 400 పేజీలు వ్రాస్తాను. సెట్స్ దగ్గర కూర్చుని స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, కథ మార్పులు చేర్పులు చేయటం జరుగుతుంది
“ఒక శ్రోత వ్యాఖ్య "టీ.వీ సీరియల్స్‌కి అసలు కథ వుంటుందా!!!”
బలభద్రపాత్రుని రమణి గారి జవాబు "కథ ముఖ్యంగా మార్కెటింగ్ వారి నిర్దేశంలో ఉంటుంది. టిఆర్‌పి రేటింగ్స్ ఏమాత్రం తగ్గినా మార్కెటింగ్ శాఖ వాళ్లు కథని మార్చమంటారు. టిఆర్‌పి బాక్సులు ఎక్కువగా దిగువ తరగతి వాళ్ల ఇళ్లలోనే ఉంటాయి. ఎప్పుడూ టిఆర్‌పి రేటింగ్స్ ఉండేవి అత్తా కోడళ్ల కథలు, వాళ్ల ఇబ్బందులూ, మూఢ నమ్మకాలు మొదలైనవి. ఈ కథలు మార్చాలంటే ముఖ్యమైన సాధనం టివి రిమోట్. అది మీ చేతిలో వుంది, మీరు ఈ కథలు చూడకుండా వుంటే టిఆర్‌పి రేటింగ్స్ తగ్గుతాయి, అప్పుడు మార్కెటింగ్ వాళ్లు మాకు వేరే కథలు వ్రాయటానికి అవకాశం ఇస్తారు”
శ్రీమతి రమణిగారిని అధ్యక్షులు ఆచార్యులుగారు, కిరణ్ ప్రభ గారు, గీత గారు మొదలైనవారు శాలువా కప్పి సత్కరించారు.

సమీక్షకుడి వ్యాఖ్య – టిఆర్‌పి రేటింగ్స్ బాక్సులు దిగువ తరగతి వారి ఇళ్లలోనే పెడతారని రమణి గారు అన్నారు. ఇది పాశ్చాత్య దేశాల మార్కెటింగ్ విధానానికి విరుద్ధం. “పర్చేసింగ్ పవర్” అనగా ఎవరు ఎక్కువ ఖర్చుదారులు అనే సమూహానికి రేటింగ్స్ విలువ ఎక్కువ. ఉదాహరణకి మధ్య, ఎగువ తరగతి వారిలో 13 నుండి 30 వయసు మధ్యనున్నవారికి అడ్వర్టయిజర్స్ ఇచ్చే విలువ ఎక్కువ. ఎందుకంటే నిజ జీవితంలో వారే ఎక్కువ ఖర్చుపెడతారు కాబట్టి. మరి భారత దేశంలో అడ్వర్టయిజర్స్ యీ విషయం పట్టిచుకోవటంలేదా? పలు తెలుగు ఛానల్స్ పాశ్చాత్య దేశాలలో ప్రసారమవుతాయి. మరి భారత దేశంలో వుండే
దిగువతరగతి వారి అభిరుచులు, పాశ్చాత్య దేశాలలో ఉండే తెలుగు వారి అభిరుచులకూ సంభంధమేమిటి? పాశ్చాత్య దేశాలలో వుండే తెలుగు పిల్లలు టీ.వీ సీరియల్స్ చూసి మూడ నమ్మకాలు, స్త్రీ హింసను చూసి ప్రభావితం కాకుండా వుండగలరా? ఆమాట కొస్తే, కేవలం టిఆర్‌పి రేటింగ్స్ కోసం భారత దేశంలో మూడ నమ్మకాలను, స్త్రీ హింసను ఎదిరించకపోగా వ్యాప్తి చేసే సాధనముగా టివీ సీరియల్స్ ఉండటం ఒక దుర్దశ. టీ.వీ చానల్స్ వారు ఈ దుర్దశకు కారణం “మీ చేతిలోని రిమోట్” అని, సామాన్య ప్రజ “టీ.వీ వాళ్లు అదే చూపిస్తున్నారు కాబట్టి చూస్తున్నాము” అని ఒక విషవలయము ఏర్పాటు చేసుకుని, ఆ విషవలయం లోనుంచి అథః పాతాళానికి సొరంగం తవ్వుకుని, ఒక జారుడు బల్ల ఏర్పాటు చేయటము. “సొంత లాభము కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడవోయి” అనేదీ టిఆర్‌పి రేటింగ్స్ మాయలో మరుగున పడిపోయింది.
నాడు సమాజంలో మూఢ నమ్మకాలు ప్రబలి ఉండకపోతే ఒక రాజా రామ్మోహన రాయ్ ఉండేవాడు కాదు. మళ్లీ మనం ఆ అవసరం తెచ్చుకొనే స్థితి రాగూడదు. 80వ దశకంలో మషాలా ఫార్ములాలతో సినిమాలు వచ్చే రోజులలో "నాట్య మయూరి" ఒక స్ఫూర్తి. నేటి టిఆర్‌పి రేటింగ్స్ ప్రకారం, ఆ సినిమా తీయగూడదు. కానీ వ్యాపారాత్మకంగా కూడా విజయం సాధించింది. అలాగే "శంకరాభరణం" సెలయేటి తరంగాలపై తేలియాడుతూ, యేటి ఒడ్డున ఉన్న మల్లె తోటలపైనుండి ప్రసరించిన ఒక యేటి గాలి. అదే శంకరాభరణం విడుదల కాగానే విజయం సాధించలేదు. నేటి టిఆర్‌పి లకు భయపడి శంకరాభరణం కథ వంకరలు తిరగటం ఊహకందని విషయం. టీ.వీ ఛానెల్ అధినేతకు విలువలతో కూడిన కథలను ప్రయోగాత్మకముగా తీసే స్తోమత వుంది.మరి ఆ ఆలోచనలు ఎందుకు రావటములేదో. ఒక పేరున్న రచయిత్రిగా, "వేప చెట్టు" వంటి మంచి కథలను అందించిన రచయిత్రిగా, కథా'బల'ము, 'భద్ర'మైన 'పాత్ర'లతో, 'రమణీ"యముగా టివీ సీరియల్స్ గమనాన్ని మార్చగలరని నా ఆశావాదం.
ఆ తరువాతి కార్యక్రమం అనిల్ రాయల్ గారి కథా పఠనం. వారు రచయించిన "రాక్షస గీతం" అనే కథ. "సత్యమనేది ఒక స్థిర భ్రాంతి" అనే ఐనిస్టీన్ ఉల్లేఖనం స్ఫూర్తితో వ్రాసిన కథ. ఒక మనిషి తనకు ఒక ప్రత్యేక శక్తి ఉంది అని నమ్మి, తనది ప్రత్యేక శక్తి కాదు, అది ఒక భ్రాంతి అని తెలిపే కథ. అలాగే, ప్రతి మనిషి తను నమ్మినది సత్యమో, భ్రాంతియో, లేక ఒక ఉన్మాదమో అని ఆలోచింపచేసే కథ.
తరువాత కార్యక్రమం తెలుగు రచయిత కొత్త వెబ్ సైటు ఆవిష్కరణ. అంతర్జాలలంలో తెలుగు రచయితల వివరాలను వివరముగా, అందంగా పొందుపరచబడిన పొదరిల్లు "తెలుగు రచయిత". ఈ ప్రక్రియ క్రితం సంవత్సరము ఉగాది నాడు ప్రారంభింపబడినది. ఆ వార్షికోత్సవము సందర్భముగా డా. కె. గీత గారు గత సంవత్సరంగా సాధించిన విజయాలను గురించి వివరించారు. అధ్యక్షులవారు "తెలుగు రచయిత ఒక బిందువులో సింధువు. ఒక పేజీలోనుండి తెలుగు సాహిత్యాన్ని వృద్ధి చేసిన ప్రముఖులు, వారి రచనల గురించి ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చు" అని కొనియాడారు.
తరువాత అందరూ ఎదురు చూసే కార్యక్రమం కిరణ్ ప్రభ గారి క్విజ్. ఎప్పటి వలనే సభికులందరూ నవ్వుతూ, ఆడుతూ పాల్గొని, బోలెడు ప్రశ్నలుకు సమాధానములు సరి జవాబు చెప్పలేక పోయారు. ఉదాహరణ ప్రశ్న. దిష్టాంతము అనగా ఏమిటి? అ) పడమటి దిక్కు ఆ) పొద్దు గ్రుంకు వేళ పొడిచే నక్షత్రం ఇ) చావు ఈ) చెఱువు గట్టు మీది కొంగ
ఇక్బాల్ గారి ఆధ్వర్యంలో కవి సమ్మేళనంలోని కవితలు:
1. తల్లాప్రగడ రావు గారు – "వేయి పేర్లున్నగాని అసలు పేరు ఏది". లలిత సహస్రనామంలో "అమ్మ" అనే పదం లేక పోవటం గురించి వ్రాసిన కవిత.
2. వేదానంద్ గారి (రేపల్లె) గారి కవిత "ప్రభాతమా .., ఆమని అరుణోదయ రాగమా .."
3. డా. కె. గీత గారు "కంప్యూటర్ కాపురం"
4. మేకా రామస్వామి గారు "మనిషి నడుస్తున్నాడు", "ముందు స్వార్థం, వెనుక స్వార్థం".
5. వేణు ఆసూరిగారు ""కలలు కను కలలు కను, కనులు తెరిచి కలలు కను …." కలల సిరులతో, ఆ"సూరి" మృదు మధుర "వేణు" గానముతో సభ స్వస్తి పలికింది.
ఈ సభలో శ్రీ త్రిపురనేని గోపిచంద్ గారి కుమార్తె శ్రీమతి రజని, వారి మనుమడు శ్రీ శిల్పి, శ్రీమతి క్రాంతి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి శారద, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి లక్ష్మి, శ్రీ లెనిన్, శ్రీ గాంధీ ప్రసాద్, శ్రీ శ్రీచరణ్, శ్రీ వేమూరి, శ్రీమతి ఉమా వేమూరి మొ.న ప్రముఖులు పాల్గొన్నారు.

వీక్షణం - సాహితీ గవాక్షం-55 (Mar12, 2017)





వీక్షణం 55వ సమావేశం


కాలిఫోర్నియా క్యూపర్టినోలోని నాగసాయి బాబా గారి ఇంట్లో ఈ నెల 12న వీక్షణం 55వ సమావేశం జరిగింది. అతిధేయ దంపతుల ఆత్మీయ ఆహ్వానం తరువాత, అధ్యక్షులు శ్రీ నరసింహాచార్యులు గారు సమావేశాన్ని తమ అధ్యక్షోపన్యాసం తో ప్రారంభించారు. ఆచార్యులవారు బమ్మెర పోతన విరచితమైన శ్రీమద్భాగవతం లోని భక్తి తత్వాన్ని, సాంప్రదాయ నవనవోన్మేష కవిత్వ వైభవాన్ని సాధికార సమగ్రతతో కొనియాడారు. స్థాలీపులాక న్యాయంగా ఉటంకిస్తాను అంటూనే, పోతన బాల్య ఉదంతాల నుండి గజేంద్ర మోక్ష ఘట్టాల దాకా ఆసక్తికరంగా వివరించారు. ఆచంద్ర తారార్కా లైన  సెలయేళ్ళ గిరిసీమలో ఆదిశంకరుణ్ణి నెలకొల్పుకొని, తన నోట రామభద్రునిచే భాగవత బృహద్రచనను పలికించుకున్న హరిహరాద్వైత భక్త కవితల్లజుడు బమ్మెర. ఆచార్యుల వారి ప్రసంగంలో ఆణిముత్యాల లాంటి అనేక పోతన పద్యాలు అలవోకగా దొర్లాయి. “పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట”,  “అలవైకుంఠ పురములో”, “మందార మకరంద మాధుర్యమును గ్రోలు ” వంటి పద్య రత్నాలు పరిఢవిల్లాయి. వసుచరిత్రను ఉటంకిస్తూ కోలాహల పర్వతం, శుక్తిమతి, గిరిక ఆదిగల అభిధానాలలోని అర్థ స్ఫూర్తి ని అబేధ లింగ సామ్యంగా సమన్వయించారు. నేటి “పరుస” పండుగల వంటి ఆనాటి ఉత్సవాలలోని బాలపోతన అనుభవ కథనాలను వివరిస్తూ, “చొప్పదంటు ప్రశ్నలు”గా తలపించే ఆతని సందేహాల వెనుక దాగిన సర్వేశ్వర ఏకతను ఏకరువు పెట్టారు. కవయా క్రాంతి దర్శనః – పోతనామాత్యుడు క్రాంతిదర్శకుడు ఐనందుననే రవికాంచని వైకుంఠాపురాన్ని కవిగా అంత సాంగోపాంగంగా సందర్శించుకున్నాడు. నానృషే కురుతే కావ్యం – బమ్మెర ఋషి తుల్యుడైనందుననే సంకాశ సుభగంగా ‘పాహి పాహి యని కుయ్యాలించిన విఫల గజేంద్రుని’ మొరను ఆలకించ గలిగాడు, “ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్క నొత్తకుండా”, హుటాహుటిగా పరుగెత్తిన ‘ఆర్త త్రాణ పరాయణున్ని’ అంత విస్పష్టంగా దర్శించుకో గలిగాడు. ‘ఇంతింతై నభోవీధి పర్యంతమై’ ఎదిగిన వటుని పరమ పావన పాద పీఠాన్నీ భావించ గలిగాడు. ఇలా, అధ్యక్షులు గారు పోతనార్యున్ని భక్త కవిగా, క్రాంత దర్శకుడిగా అభివర్ణిస్తూ, సాంప్రదాయంలో కవిత్వం ఉన్నందు వల్లే ఈనాటికీ సాహిత్యంలో నవనవోన్మేష నవీనత మిగిలి ఉందని ముగించారు.
ఈ నాటి విశిష్ట అతిథులు ప్రఖ్యాత సాహిత్య మూర్తి త్రిపురనేని గోపీచంద్ గారి కూతురు, విఖ్యాత హేతువాద వేత్త త్రిపురనేని రామస్వామి చౌదరి గారి పౌత్రి  శ్రీమతి రజని కాట్రగడ్డ గారు.  బెంగళూరు నుండి విచ్చేసిన రజని గారు సభలోని సభ్యులను ఎంతో ఆసక్తి తో పేరుపేరునా పరిచయం చేసుకోవడం అందరినీ ఆనందపరిచింది. శ్రోతల అభ్యర్థన మేరకు వారు తన జీవిత విశేషాలను వివరించారు. లబ్ధప్రతిష్టులైన వారి కుటుంబ సభ్యుల, ముఖ్యంగా వారి తండ్రి గారైన గోపీచంద్ గారి వ్యక్తిత్వాన్ని అభివ్యక్తీకరిస్తూ వారు రచన వేరు జీవితం వేరు అనేలా కాకుండా, తమ రచనను జీవన విధానాన్ని ఏకీకృతం గావించుకున్న ఆత్మశుద్ధి  గలిగి ఉండే వారని తెలిపారు. చిన్ననాటి నుండీ తన సందేహాలకు నాన్నగారి పుస్తకాల్లో సమాధానం లభించేదని అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గోపీచందుల మధ్య, ముఖ్యంగా ‘వేనరాజు’ నవలా విషయంలో అభిప్రాయం బేధాలు ఉన్నా వాళ్ళిద్దరితో మిత్రబంధం బలంగా ఉండేదని తెలిపారు. హేతువాది ఐన తన తాతగారు రామస్వామి చౌదరి, సాంప్రదాయ విషయ బద్ధుడైన ఉన్నవ లక్ష్మినారాయణ గారి మధ్య ఎన్ని భావ పరమైన బేధాలు ఉన్నా వారి స్నేహం ఏనాడూ చెడలేదని తెలిపారు. వారిది జ్ఞాన సంపన్నమైన కుటుంబమనీ, నారాయణగూడా లోని వాళ్ళ ఇల్లు నిత్యనూతన సరస్వతీ నిలయంగా ఉండేదని హర్షం వెలిబుచ్చారు. సోదరులు చంద్ర, జ్యోత్స, శాయి తనకన్నా పెద్దవారు కనుక ఆనాటి మా కుటుంబ సాహిత్య కళా నేపథ్యం వారికి కలిసి వచ్చిందని వివరించారు. తన రచనలోని మానసిక విశ్లేషణ అందరికీ అందిరావాలని, ఏ రచన కైనా సాహిత్య ప్రయోజనంతో పాటు సామాజిక ప్రయోజనం కూడా ఉండి తీరాలని గోపీచందుగారు తపించే వారని చెప్పుకొచ్చారు. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’, ‘అసమర్థుని జీవిత యాత్ర’, ‘విశ్వదర్శనం’ (తాత్విక గ్రంధం ౧ &౨) ఇత్యాది గ్రంధాలు ఎంతో పేరుప్రతిష్టలు తెచ్చిపెట్టాయని , అసమర్థుని జీవిత యాత్ర మూడేళ్ళలో ఐదు సార్లు పునర్ముద్రణ పొందిందని, వారి శతజయంత్రి సందర్భంలో అలకనందావారు సమగ్ర సాహిత్యాన్ని వేశారని, లత గారు కూర్చి పెట్టిన ‘చీకటి గదులు’ అసంపూర్ణంగానే మిగిలిపోయిందని తెలిపారు. అసమర్థుని జీవనయాత్ర చైతన్య స్రవంతి ప్రక్రియలో సాగిన మనోవిజ్ఞాన విశ్లేషణాత్మక రచన. దాన్ని తండ్రి గారైన రామస్వామి చౌదరి గారికి అంకితమిస్తూ “ఎందుకు అన్న ప్రశ్న వేసిన నాన్నకు అంకితం” అని రాసుకున్నారు. గోపీచందుగారు రానురాను ఆశువుగా చెబుతూ రచనలు సాగించే వారని అన్నారు. నాస్తికవాదిగా ముద్రపడిన తాతగారు, హేతువాదులూ, ఎం ఎన్ రాయ్ అనుయాయులూ ఐన తండ్రి గారు సాహిత్యకారులే కాక సమాజ సంస్కరణా కంకణ బద్ధులని, మారుమూల గ్రామాలకు వెళ్లి  తాము సంస్కరించి రూపొందించిన ముక్తసరి వివాహ తంతును జరిపించే వారని, భోగం మేళా దేవదాసీ వేశ్యాది వృత్తులను నిర్మూలించేందుకు కృషి చేసే వారని, వయోజన విద్యా వ్యాప్తికి పాటుపడే వారని రజని గారు కొనియాడారు.  అప్పుడెప్పుడో తన కథ ” అచ్చినానమ్మ కథ” ను కౌముదిలో ప్రచురించినందుకు రజని గారు ధన్యవాదాలు తెలుపగా, త్వరలో తన రేడియో టాక్ షోలో గోపీచంద్ గారి గురించిన ప్రసంగం ఉంటుందని కిరణ్ ప్రభ గారు తెలిపారు. ఆరోజుల్లో విశ్వనాథుల వారు ” గొప్ప గోపీచంద్” అనే గేయాన్ని రాసినట్టు గుర్తు చేశారు.  52 ఏళ్లకే పరమపదించిన హేతువాదైన తన తండ్రి గోపీచంద్ గారు చరమాంక దశలో పాండిచ్చేరీ లోని మహర్షి అరవింద్ ఘోష్ తాత్విక భావ ప్రభావానికి లోనై శుద్ధ ఆధ్యాత్మికతను ఆశ్రయించిన విశేష ఉదంతాన్ని రజని గారు అరమరికలు లేకుండా విన్నవించారు. రజని గారి ప్రసంగం ఆత్మీయంగా ముచ్చట్ల మృదు భాషణంగా సాగి అందరినీ మురిపించింది.
తరువాతి కార్యక్రమం నెలనెలా క్రమం తప్పకుండా కిరణ్ ప్రభ గారు నిర్వహిస్తున్న ‘చతుర ప్రశ్నావళి’ (క్విజ్). సాహిత్య సినీ కళా రంగ సంబంధితమైన 20 ఆసక్తి కరమైన ప్రశ్నలకు శ్రోతలు స్పందించి  పుస్తకాలను బహుమతులుగా గెలుచుకున్నారు.
కవిసమ్మేళనంలో డా|| కె.గీత గారు సమకాలీన అమెరికా సమాజంలో జరుగుతున్న భారతీయ హత్యల నేపధ్యంలో రాసిన “డాలరు మరక” కవితను , శ్రీచరణ్ గారు”శివ తత్వాన్ని”, నాగసాయి బాబా గారు హాస్య స్ఫోరక కవితను, లెనిన్ గారు ఆత్మ సిద్దాంతాన్ని  చదివి శ్రోతలను రంజింప చేశారు. నాగరాజు రామస్వామి తమ కవితలను చదవడమే కాకుండా కవిత్వం రాయడం లో ఎన్నుకోవలసిన పదజాలాల్ని, కవిత్వంలో నిగూఢత ఆవశ్యకతను విశదీకరించారు.
శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ గాంధీ ప్రసాద్, శ్రీ ప్రసాద్ నల్లమోతు, శ్రీ చుక్కా శ్రీనివాస్ , శ్రీ శిల్పేష్, శ్రీ రాజేశ్వర్, శ్రీ  రావు తల్లా ప్రగడ, శ్రీ సుభాష్ పెద్దు ,  శ్రీ వికాస్, శ్రీమతి శారద మొదలైన స్థానిక ప్రముఖులు పాల్గొన్న  ఈనాటి వీక్షణం సమావేశం ఆసక్తికరంగా సాగి, ఆహ్లాదకరంగా ముగిసింది.
http://sujanaranjani.siliconandhra.org/%E0%B0%B5%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%82-55%E0%B0%B5-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/
http://www.koumudi.net/Monthly/2017/april/april_2017_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం - సాహితీ గవాక్షం-54 (Feb12, 2017)


వీక్షణం సాహితీ సమావేశం- 54
నాగరాజు రామస్వామి



వీక్షణం 54వ సమావేశం ఫిబ్రవరి 12, 2017 నాడు శ్రీ చుక్కా శ్రీనివాస్ గారి స్వగృహమున జరిగింది. ఈ సమావేశమునకు శ్రీ పిల్లలమఱ్ఱి శ్రీ కృష్ణ కుమార్ గారు అధ్యక్షత వహించారు.

మొదటి వక్త శ్రీ ఉప్పలూరి విజయ కుమార్ గారు. వారు గత 40 సంవత్సరాలుగా పలు కథలు, నవలలు వ్రాసానని తెలిపి, 30 సంవత్సరాల క్రితం పల్లకీ పత్రికలో ప్రచురితమైన తమ కథ "లోపలి మనిషి" అనే కథను చదివారు. అంటరానితనమును ప్రశ్నిస్తూఒక వ్యక్తి తనలో అంతర్గతంగా ఉన్న అంటరానితనాన్ని ప్రశ్నించుకునే ఈ కథ అందరినీ ఆకట్టుకుంది.

తరువాతి కార్యక్రమం శ్రీ నాగరాజు రామస్వామి గారి రవీంద్రుడి గీతాంజలికి తెలుగు అనువాదం "గీతాంజలి" పుస్తకావిష్కరణ.

మొదటి సమీక్షకులు శ్రీ వేణు ఆసూరి గారు. వారి ప్రసంగ విశేషములు "ఈ గీతాంజలి చదువుతున్నప్పుడు నేను మూలాన్ని కాని, మరో అనువాదాన్ని కాని ప్రక్కన పెట్టుకుని పోల్చి చూడలేదు. నాగస్వామిగారి రచనను ఒక సరికొత్త రచనగానే చదివి ఆనందించడం జరిగింది. వారి గీతాంజలిని చదువుతున్నప్పుడు నన్ను ఎంతో ఆకట్టుకున్న కొన్ని విషయాలు:

- వారి రచన ఒక ప్రవాహంలా, అందమైన నడకతో సాగుతుంది.

- గీతాంజలి వంటి రచన ఎంతో లోతైన తాత్విక దృష్టితో పాటు, స్వచ్ఛమైన ఆత్మ సౌందర్యాన్ని మనస్సులో దర్శించి, ఆరాధించి, అనుభవించిన వారికే సాధ్యం. ఇక్కడ లోతైన తాత్విక దృష్టి అంటే విషయాన్ని మరింత జటిలంగా చూపడం కాదు - మనస్సుకుండే పొరలను దూదిపింజల్లాగా విడగొట్టి నిజమైన ఆత్మ సౌందర్యాన్ని, పరమాత్మ స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం. ఠాగోర్ నిజానికి ఒక మహర్షి - కనుక దర్శించగలిగాడు, ఒక మహాకవి - కనుక అంత అందంగా మనకందించగలిగాడు.

సృష్టికర్తను అల్లుకున్న అపురూప ప్రేమ, అనంత సౌందర్య పిపాస, అతిలోక భావుకత, ఉపనిషద్ స్పర్శ, భారతీయ మూల సంస్కృతి, విశ్వజనీన ప్రేమ, శాంతికొరకు పరితపించే మానసిక ప్రవృత్తి, మానవత్వంపై వల్లమాలిన నమ్మకం - అంటారు ముందుమాటలో లంకా శివప్రసాద్ గారు.

నాగరాజు రామస్వామి గారి గీతాంజలిని చదువుతున్నప్పుడు, ఒక అనువాద రచనను చదువుతున్నామన్న ఆలోచన ఉండదు - కారణం, నాగరాజుగారు రవీంద్రుడి గీతాంజలిని ప్రేమించి, అనుభవించి, మైమరచి రాసారు కనుక. వారి రచనలలో మనకు కనిపించే సహజ గుణం అది. ఉదాహరణకు వారు కీట్సు కవితలను వ్రాసిన (ఈ పుడమి కవిత్వం ఆగదు) కారణం అదే. కీట్సైనా, ఠాగోర్ అయినా, వారి రచనలతో ప్రేమలో పడి, ఆనందంలో ఓలలాడి, మైమరచి, ఆ తరువాత సొంత గొంతుతో (సొంత భాషలో) ఆలపిస్తారు. మచ్చుకి పుస్తకంలోని కొన్ని కవితలని వినిపిస్తాను. కవిత వింటున్నప్పుడు, మీకు ఆహా అనిపిస్తే ఆ మెచ్చుకోలునంతా నాగరాజుగారి ఖాతా లోనే వెయ్యండి. ఒక అందమైన పోతన భాగవత పద్యం విన్నప్పుడు మనం ఆహా పోతన పద్యం అనుకుంటామే గాని, ప్రతిసారీ వ్యాసుడికి అందులో భాగం పంచడం జరుగదు. అంటే మూలం వ్యాసుడు రాసాడని మనకు తెలియక కాదు, అంత లోతు భావాన్ని అంత అందంగా చెప్పిన పోతన కవిత్వానికి మనం పరవిశిస్తాం. భావాన్ని తెలుసుకుని, మళ్లీ మళ్లీ ఆ భావాన్ని అంత అందంగ ఆవిష్కరించిన పద్యాలని చదువుకుని ఆనందిస్తాం.

పోతన పద్యాలని మెచ్చుకున్నప్పుడల్లా, పరోక్షంగా వ్యాసుడికి మన అభివాదాలు అందజేసినట్లే! ఎందుకంటే ఆ క్షణంలో పోతన, వ్యాసుడు ఒక్కరే! అలాగే ఈ కవితలను మనం ఆస్వాదించి ఆనందిస్తున్న క్షణాలలో, నాగరాజు రామస్వామి గారే రవీంద్రనాథ్ టాగోర్. అలా అనుకోకపోతే రసాస్వాదనకు భంగం కలుగుతుంది కూడా.

నిజానికి, ఈ పుస్తకానికి పూర్తి న్యాయం చెయ్యాలంటే నేను మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది. మొదట నాగరాజు రామస్వామి నన్ను ఈ పరిచయ వాక్యాలు చెప్పమన్నప్పుడు నేను కొంత వెనుకాడాను, ప్రస్తుతం నాకున్న పనుల మధ్య చెయ్యగలనో లేదో అని. నేను పుస్తకానికి న్యాయం చెయ్యలేక పోయినా, పుస్తకం సమీక్షించడం వల్ల నాకు మళ్లీ గీతాంజలి వైపు మనసు మళ్లింది. నన్ను నేను సంస్కరించుకోవడానికి మరో అవకాశం దొరికింది. దానికి నాగరాజు రామస్వామికి గారికి నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు. ఇంత మంచి పుస్తకం పాఠకులకి అందించినందుకు మన:పూర్వక అభినందనలు, ధన్యవాదాలు."

ఆ తరువాతి సమీక్షకులు శ్రీ కిరణ్ ప్రభ గారు. వారి ప్రసంగ విశేషములు - "అనువాదం చాలా కష్టం, కవి వ్రాసినది అన్వయించుకునే విధానం అనువాదం. రామస్వామి గారి గీతంజలి అనువాదం మాత్రం ఒక రంగు రంగుల పూలతోట, రంగుల సముద్రం. ఎక్కడా కష్ట పడినట్టు కనిపించదు. అలవోకగా వ్రాసినట్లుంటుంది. నాగరాజు గారు చేసిన చక్కని అనువాదానికి ఉదాహరణలు "స్వాభిమానం సగర్వంగా ఎక్కడ తలెత్తుకు తిరుగుతుందో" "ఏకాంత నిర్జన నది ఏటవాలు తీరాన నా వంటి ఇంటి చీకటి" మొదలైనవి. చలం చేసిన అనువాదానికి నాగరాజు గారి అనువాదానికి ఎక్కడా పోలిక లేదు. రవీంద్రుని గీతాంజలి ఒక ప్రేమ కావ్యం. అందులో ప్రభూ అనే పదాన్ని తీసివేసి, ప్రియ అనే పదం వాడితే ప్రేమ కావ్యం అవుతుంది. ఒక ఉదాహరణ, చాలా కాలం క్రితం ఈ విషయం ఒక కాష్మీరీ కుర్రవాడికి చెపితే నా దగ్గర ఉన్న గీతాంజలిని బదులు తీసుకు వెళ్లాడు. ఆరు నెల్లల తరువాత సంతోషంగా తిరిగి ఇచ్చేశాడు. కారణం అడిగితే, మీరు చెప్పినట్టే గీతాంజలిలో ఒకొక్క గీతానికి ప్రభూ బదులు ప్రియా అని మార్చి ఒక అమ్మాయికి పంపించాను, ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను పెళ్లి చేసు కుంటానంటున్నది, ఇక పుస్తకం అవసరం లేదు అని చెప్పాడు. అంత అందమైనది గీతాంజలి. అంతే అందమైనది నాగరాజుగారి అనువాదం: ఆ తరువాత శ్రీ నాగరాజు రామస్వామి గారు తన పుస్తకం గురించి ప్రసంగిస్తూ తెలిపిన విషయాలు: " గీతాంజలి అనువాదానికి నన్ను ప్రత్యేకంగా పురికొల్పిన వ్యక్తులంటూ ఎవరూ లేరు. వందకు పైగా అనువాదాలు వచ్చాయని విన్నానే కాని ఏదీ చదువలేదు. ఆ రోజుల్లో పాతికేళ్ళ పాటు ప్రవాస జీవితం గడిపాను కనుక అవి నా కంట పడలేదు. ఏళ్ల క్రితం నేను చదివిన రవీంద్రుని విశ్వజనీన సాహిత్యం, నేను శాంతినికేతన్ లో గడిపిన స్వల్పకాలిక స్మృతులు గీతాంజలి అనువాదానికి నన్ను ఉత్తేజ పరిచాయనవచ్చు. నా చిన్ననాట చదివిన కొంగర జగ్గయ్య గారి గీతాంజలి ఙ్ఞాపకాలు, రవీంద్రున్ని తలపించే కృష్ణశాస్త్రి కవిత్వం, నాకు నచ్చిన రవీంద్ర సంగీత్ గురుదేవునికి నేను ఇవ్వాల్సిన నివాళిని గుర్తు చేశాయి. మిత్రులు వద్దన్నా వినలేదు నా ఎద లోపలి ఎడద. తేటగీతి పద్యం పాటకు చేరువలోఉంటుందని కొన్నిరవీంద్ర గీతాలను తేటగీతులలో గతంలోఅనువదించినా, ప్రస్తుత సంకలనానికి నాకు ఇష్టమైన వచన కవితా ప్రక్రియనే ఎన్నుకున్నాను; ఇప్పుడు వీస్తున్నగాలి వచన కవిత్వం మరి. రవీంద్రుని ఆంగ్ల రచన గీతాంజలి పాటలా సాగిన కవితాత్మక వచనం. అది ఆతని అంతస్సుల నుండి నిసర్గ సుందరంగా, కవన మధురంగా పెల్లుబికిన ఆత్మనివేదన. నివేదనను వెన్నంటి అంతర్లీనంగా ప్రవహించింది పాట. అపూర్వ రసానుభవం ఆతని అలతి అలతి వాక్యాలలో అనుభూతి కవిత్వమై జాలువారింది. అందుకే ఇన్ని అనువాదాలు. నా అనువదించిన కవితలన్నీ నాకు అత్యంత ప్రియమైనవే. నా అనువాదం అలవోకగానే సాగిందనాలి. 'where the mind is without fear' అనేక కవులు అనువదించిన కవిత కనుక, అనేకసార్లు సవరించాను. నిజానికి అది నేరుగా సాగిన దేశభక్తి గీతం. తాత్విక క్లిష్టత లేని సరళ గీతం. అందరికీ తెలిసిన కవిత కనుక ఖండన మండనాలకు ఆస్కారం ఎక్కువ. అందుకే అత్యంత జాగరూకతతో తెనుగించాను. నా దృష్టిలో విశిష్ట మైన ఒక గీతాన్ని తీసుకుని, అది ఎందుకు నాకు ప్రియమైనదో తెలుప మన్నారు మిత్రులు వికాస్. అందుకు నేను ఎంచుకున్న కవిత 53 - "ఎంత అందంగా ఉంది / రవ్వలతో, రంగురంగుల రత్నాలతో/ నైపుణ్య యుక్తియుక్తంగా చెక్కబడిన నీ నక్షత్ర కర కంకణం!". ఈ కవితలోని విశిష్టత, నా దృష్టిలో, మిగతా కవితలకు భిన్నమైన నిగూఢ తాత్వికత. పరమాత్మున్ని ఒక గంభీర సుర సుందర మూర్తిగా అలంకరించుకొని, నేరుగా స్తుతించకుండా, ఆతని నక్షత్ర ఖచిత కరకంకణాన్ని, ఆతని వజ్రాయుధాన్ని వర్ణించాడు రవీంద్రుడు. వర్ణనలో నక్షత్ర మండలాలు జ్వలించాయి, మహోగ్ర పర్జన్య గర్జనలు వినిపించాయి. పైగా పసిడి కంకణం కన్నా నిశిత ఖడ్గమే ఉత్కృష్ట మైనదని తేల్చాడు. కంకణం వైభవానికి, కటారు మృత్యువుకు ప్రతీకలు. రవీంద్రునికి మృత్యువుపై ఆరాధనా భావం ఉంది. ఆతని అనేక రచనలలో ఆ భావం అంతర్లీనంగా ప్రవహిస్తుంటుంది. ఆ కవితలో అంతటి తాత్వికలోతులు ఉన్నాయని నేను భావించి నందునే నా అనువాదంలో కొంత శబ్ద గాంభీర్యం చోటు చేసుకుంది. నా ఈ పుస్తకాన్ని దయతో ఆవిష్కరించిన కవి పండితులు శ్రీచరణ్ గారికి, ఆప్త వాక్యాలతో అలరించిన ఆత్మీయులు కిరణ్ ప్రభ గారికి, అద్భుతంగా విశ్లేషించి కీలకోపన్యాసం చేసిన వేణు ఆసూరి గారికి, సహృదయ సంధాన కర్త గీతామాధవి గారికి, శ్రేయోభిలాషి గంగిశెట్టి గారికి, తొలినాళ్ళ నుండి నన్ను నన్ను గుండెలకు హత్తుకుంటూ వసున్న' వీక్షణానికి', మిత్రులందరికీ ఇవే నా ధన్య వాదాలు."

ఆ తరువాతి కార్యక్రమం కిరణ్ ప్రభ గారి క్విజ్. ఆయన శ్రోతలకు తెలియకుండానే పాఠాలు చెపుతారు. క్విజ్ కార్యక్రమం వీక్షణం సభ్యులకు తెలియకుండానే పెట్టే పరీక్ష. సభ్యులు ఉత్సాహంగా పరీక్ష కోసం ఎదురుచూచి, పరీక్ష తప్పుతామని తెలిసికూడా పాల్గొనే కార్యక్రమం ఈ క్విజ్. ఒక ఉదాహరణ ప్రశ్న "మాయా రంభ నలకూబర సంవాదం, ఏ పుస్తకంలోనిది". ఈ సమీక్ష మీరు పొరపాటున చదివితే, ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఉచితం. "కళాపూర్ణోదయం".

తరువాతి కార్యక్రమం కవి సమ్మేళనం. చదివిన కవితలు:

1. గీతా మాధవి - జానపద గీతం, వారి స్వరచన, వారి స్వర రచన, వారి స్వరములోనే అందముగా వినిపించారు. "తూరుపొంక గోడవంక"


2. శ్రీ చరణ్ గారు - రథ సప్తమి సందర్భంగా సూర్య భగవనుడి మీద వ్రాసిన పద్యం "ఎందుకింత మండి పోతున్నాడు"

3. విద్యార్థి - అమెరికా వచ్చి, అమెరికాకు పిల్లలని పంపుతూ, అమెరికాను తూలనాడే తెలుగు పెద్దలని నిలదీస్తూ "ఏమేరకు"

4. ఉదయ లక్ష్మి గారు - "తెలుగింటి తియ్యదనాల పిలుపులు"

5. సాయి బాబా గారి సతీమణి శ్రీమతి లక్ష్మి - "నరుడా, నీవే శివుడవు"

6. సాయి బాబా గారు - "మా సవతి తల్లికి మల్లె పూదండ, మము పెంచు తల్లికి ఫ్లవర్ బుకేలు".

తరువాత శ్రీ లెనిన్ కవిత్వంలో ఆత్మ పరిశీలనను గురించి సూక్షంగా ప్రసంగించగా, శ్రీ చుక్కా శ్రీనివాస్ ఆశు కవిత లా "ఆశు కథ" ప్రయోగం ఎందుకు చేయకూడదు? అంటూ తన మనసులో అప్పటికప్పుడు రూపుదిద్దుకున్న కథ కొంత భాగాన్ని వినిపించారు.
చివరగా ఆసక్తికరమైన చర్చలతో సభ విజయవంతంగా ముగిసింది.
------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/mar17/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2017/march/march_2017_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం - సాహితీ గవాక్షం-53 (Jan15, 2017)


 వీక్షణం సాహితీ సమావేశం- 53
నాగరాజు రామస్వామి
'సాహితీ గవాక్ష వీక్షణం - బే ఏరియా ప్రవాస సాహిత్యాభిమానులు 53 నెలలుగా నెలనెలా జరుపుకుంటున్న అక్షరోత్సవం; జనవరి 15న వేణు ఆసూరి గారింట్లో కళా వాహినై పొంగులెత్తింది. సుమారు ముప్పై మంది అరమరికలు లేని ఔత్సాహిక రసాత్ములు తెలుగు వెలుగుల ఆత్మీయ కెరటాలై తరంగించారు. మిత్రమండలి సభకు నిండుతనాన్ని కూర్చగా, వేమూరి వెంకటేశ్వర్ రావు , కిరణ్ ప్రభ, రావు తల్లాప్రగడ, గీతా మాధవి, వేణు ఆసూరి, శ్రీ చరణ్ వంటి సాహిత్య సంపన్నులు నిండు సభకు నిగనిగలను చేకూర్చారు. తెలుగు గడ్డ నుండి విచ్చేసిన శ్రీ అల్లం రాజయ్య, శ్రీమతి సుహాసిని ఆనంద్ వంటి విశిష్ట అతిథులతో సాహితీ గవాక్షంలో తెలుగుల కళ తొణకింది. తెలుగు చలువ తెల్ల నేల మీద పల్లవించింది.
వేణు ఆసూరి గారి హార్థిక స్వాగతం తరువాత అధ్యక్షులు వేమూరి వెంకటేశ్వర రావు గారి సంక్రాతి శుభాకాంక్షలతో కార్యక్రమం ప్రారంభమయింది. తొలి వక్త అల్లం రాజయ్య గారు.
రాజయ్యగారి ప్రసంగంలో 1968-1969 నాటి తెలంగాణా ప్రాంతీయ నేపథ్యం ప్రతిఫలించింది. అప్పటి స్థలకాల సమాజ దృక్పథాన్ని జాగృత జన చైతన్య ధార లోకి తేవడానికి విస్తృత యత్నం జరిగిందని, నాటి బడుగు జీవుల బతుకు కథలను వ్యవసాయ కుటుంబాల స్థితిగతులను ఆనాటి సమకాలీన కథా సాహిత్యం విశదపరచే ప్రయత్నం చేసిందని, విద్యార్థి ఉద్యమాలు, రైతాంగ తిరుగుబాట్లు, లెఫ్ట్ రాజకీయాలు ఆనాటి తెలంగాణా వాతావరణాన్ని ఊపివేసాయని వారు తెలిపారు. కొమరం భీం, కొలిమంటుకుంది, వసంతగీతం వంటి నవలలు ఉద్యమ స్ఫూర్తితో ఉద్భవించాయని చెప్పారు. రావిశాస్త్రి గారు ప్రాంతీయ యాసలో రాసిన కథలలాగే తెలంగాణా మాండలికంలో కథాసాహిత్యం తరగెత్తిందని, అందుకు అవసరమైన అనేక సాహిత్య వర్క్ షాపులను తాము నిర్వహించి సాహిత్యాన్ని సాధనంగా మలుచుకున్నామని తెలిపారు. పిదప, 40 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం తెచ్చిన పరిణామాలను వివరించే కథ " టైగర్ జోన్" ను (డిసెంబర్ 16 చతురలో ప్రచురించబడింది) ప్రస్తావిస్తూ రాజయ్య గారు 'అరుణతార'లో వచ్చిన "వెలుతురు నది" కథను చదివి వినిపించారు. అది రాష్ట్ర విభజనానంతరం తెలంగాణ విద్యాధిక ఉద్యోగుల సామాజిక మహిళా వాద దృక్కోణంలో సాగిన ఈనాటి కథ. రైలు ప్రయాణంలో కొనసాగిన సమకాలీన సమస్యల సమాహారం. కథా గమనంలో పెద్దపల్లి, మందమర్రి లాంటి ప్రాంతీయ పరిసరాల సంగతులు, అగ్రకులాలతో పాటు మాదిగ, యాదవ, పద్మశాలీల వంటి ఇతర కులాల ఊసులు, పోలవరం ఆదివాసుల, దళితుల, బహుజనుల సమస్యలు మూల కథను అల్లుకున్నాయి. మౌలికంగా ఆ కథ స్త్రీల కథ. తరతరాలుగా తెగని స్త్రీల వ్యథ. పాత్రల సంభాషణ సాగి సాగి, నిజానికి మహిళలకు నిజ చరిత్ర అంటూ ఉంటుందా అన్నంత దాకా వస్తుంది. నేటికీ, నాగరికంగా ఎదిగిన సమాజంలో సైతం, భార్యా భర్తల మధ్య అజ్ఞాత అసంతృప్తి అనివార్యమౌతున్న సంఘటనలు కథా సందర్భంగా ఉటంకించబడుతాయి. అపురూప కానుకలు అనదగిన ఆడవాళ్లను యుగయుగాలుగా మగవాళ్ళు కేవలం దేహంగానే అర్థం చేసుకుంటున్నారన్న నిరాశ ఈ కథలో పొడసూపింది. 'నిలువెల్ల గాయాలైన పిల్లంగోవి' లానే స్త్రీ అస్తిత్వం రూపుకట్టింది.
హైదరాబాద్ నుండి వచ్చిన రెండవ వక్త శ్రీమతి సుహాసిని ఆనంద్. వీరిది సంగీత వారసత్వం ఉన్న కుటుంబం. వీరి తండ్రి గారు శ్రీ పాలగుమ్మి రాజగోపాల్, లలితా సంగీత పర్యాయపదమైన పాలగుమ్మి విశ్వనాథ్ గారి అనుజులు. సాలూరు రాజేశ్వర్ రావు గారి శిష్యులు. వీళ్లిద్దరు కలిసి 14 సినిమా పాటలకు సంగీతం సమకూర్చారు. మరుగున పడుతున్న ప్రబంధ సాహిత్యాన్ని జనసామాన్య నాలుకలమీద ఆడేలా చేయాలన్న సత్సంకల్పంతో రాజగోపాలం గారు గజేంద్ర మోక్షం, గీతశంకరం, పోతన భాగవత సుధ, ప్రహ్లాదచరిత్రము, వామనావతారం లాంటి కావ్యాల పద్యాలను కర్ణాటక సంగీత బాణీలో స్వరపరిచారు. ఏ ఒక్క పద్యం పొల్లుపోకుండా శాస్త్రీయ సంగీత రాగాలలో పద్యాలను పలికించడం హర్షించదగ్గ గొప్ప యత్నం. అందుకు, రాశి ట్రస్ట్ వారు నిర్మాతలు కాగా, నక్షత్ర మ్యూజిక్ మార్కెటింగ్ సంస్థ వారు ఆడియో సీడీల రూపకర్తలు. పంచమహాకావ్యాలలో తొలి ప్రబంధ మైన 780 పద్యాల 'మనుచరిత్రము' ను 75 పద్యాల మాలగా మలచి వెలువరించిన 'గాన మాధురీ' సీడీని కిరణ్ ప్రభ గారు ఆవిష్కరించారు. ఇది తెలుగు పద్యానికి పట్ఠాభిషేకం, తెలుగు కావ్యానికి రాగ నివాళి. " పరుడే ఈశ్వరుడై మహా మహిముడై...ప్రారుద్భావ స్థాన త్రిశక్తి యుతుడై...అంతర్జ్యోతుడైన హరికిన్ తత్వార్థినై మొక్కెదన్ " అన్న గజేంద్రమోక్షం లోని పద్యాన్ని రాగయుక్తంగా పాడి సుహాసిని గారు సభను రంజింప జేశారు.
తదుపరి కార్య క్రమం కిరణ్ ప్రభగారు వీక్షణం సమావేశాలలో ధారావాహికంగా నిర్వహిస్తూ వస్తున్న 'సాహిత్య క్విజ్'. అత్యంత ఆసక్తిగా సాగింది.
కవితాగోష్ఠి లో మొదట కె. గీత గారు తన తొలి కవితా సంకలనం 'ద్రవ భాష' లోని 1991 నాటి ' పండగొచ్చినపుడు' కవిత వినిపించారు. పిల్లల బుడిబుడి కేరింతలు, చెంగావి చీరల జరజరలు, పేకముక్కల అల్లుళ్ళ హడావుడులు, కంచాల దగ్గరి కయ్యాలు, కోళ్లకు కూడా కసి నేర్పే సంక్రాంతి సంరంభాలు ఆ కవితలో చోటుచేసుకోవడం సందర్భోచితంగా వుంది. అరుణ్ సాగర్ తన కవితా సంకలనానికి రాసుకున్న 'నానుడి' లో తనను ప్రభావితం చేసిన కవులలో కవయిత్రి గీత గారు ఒకరని ఉందని సభికులు గుర్తు చేయడం అందరికీ సంతోషం కలిగించింది. అనతి కాలంలోనే 'వీక్షణం' ను ఆత్మీయం చేసుకున్న ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ఇండియా నుండి పంపించిన కవిత "శివంకర రాత్రి " ని తల్లాప్రగడ రావు గారు చదివారు. లోతైన కవితకు పసందైన పఠనం.తెలుగు మాట్లాడడమే ఒక భోగంగా భావించే శ్రీచరణ్ గారు మకర సంక్రమణం శీర్షికతో సంస్కృతాంధ్ర పదభూయిష్టమైన పద్యాలను వినిపించారు. సుభాష్ పెద్దు గారు తమ కవితలో సుమ భావ పలుకరింతలను, మంచిముత్యాల కాంతులను వెదజల్లారు. ఉమర్ ఆలీషా శ్రీ విజ్ఞాన ఆధ్యాత్మిక తత్వ పీఠం అనుయాయులు వనపర్తి సత్యనారాయణ గారు పద్య పఠనం గావించగా, పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్ గారు చినజియ్యరు స్వామి గారి శారదా పీఠంను పురస్కరించి కవితాత్మకంగా ప్రసంగించారు. లెనిన్ గారు కవితలలో ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేయగా, సాయిబాబా గారు తనదైన సరదా ధోరణిలో 'వీక్షణం ఆరంభ గీతం' చదివి నవ్వించారు. నాగరాజు రామస్వామి " తురీయం / ( లాస్ట్ లెగ్ ) " కవిత వినిపించగా, వేణు ఆసూరిగారు " హే చంద్ర చూడ " అనే సినిమా పాటను పాడి సభను రంజింప జేశారు.
మూడు గంటలకు పైగా సంతోషదాయకంగా సాగిన ఈ సమావేశం సంతృప్తికరంగా ముగిసింది. సుహాసిని గారు మరో రాగమయ పద్యంతో సభకు స్వస్తి పలకడం ఒక మంగళకర ముక్తాయింపు.


http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb17/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2017/february/feb_2017_vyAsakoumudi_vikshanam.pdf