Sunday 8 October 2017

వీక్షణం -వార్షిక సమావేశం-5 (Sep10, 2017)


వీక్షణం పంచమ వార్షిక సమావేశం
- నాగరాజు రామస్వామి

Vikshanam

బే ఏరియా 'వీక్షణం' ఐదవ సంవత్సర సాహితీ సమావేశం సెప్టెంబర్ 10 న మిల్పీటస్ స్వాగత్ హోటల్ లో వైభవంగా జరిగింది. ఉదయం 10 నుండి సాయంత్రం 6 దాకా సాగిన ఈ సాహిత్యగోష్ఠిలో పలువురు తెలుగు సాహిత్య పిపాసకులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.
'వీక్షణం' నిర్వాహకులు శ్రీమతి గీతామాధవి గారు గత ఐదేళ్లపాటు నిరాఘాటంగా క్రమం తప్పకుండా నెలనెలా సాగిన ఈ సమావేశాలను, అందుకు సూత్రధారులైన కిరణ్ ప్రభ వంటి సాహిత్య సారథులను గుర్తుచేసుకుంటూ లాంఛనంగా సభను ప్రారంభించారు. శాక్రమెంటో నుండి ప్రత్యేకంగా విచ్చేసిన 'సిరిమల్లె' అంతర్జాల సాహిత్య మాసపత్రిక సంపాదకులు శ్రీ మధు బుడమగుంట గారు ఆ ఉదయం కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి చక్కని అధ్యక్షోపన్యాసంతో మొదలైన మొదటి సెషన్ లో 'కథా చర్చ' కు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.
ప్రథమ వక్త శ్రీ వేమూరి వెంకటేశ్వర రావు గారు కథకు చెందిన 4 అంశాల - వస్తువు, శిల్పం, భాష, కథన విధానం - భూమిక ఆధారంగా స్వీయ రచనానుభవ స్మృతుల నేపథ్యంగా కథాస్వరూపం గురించి చర్చించారు. రేడియో కూడా లేని తన చిన్నతనంలో అమ్మ, మామ, అన్నగారు వినిపించిన కథలే స్ఫూర్తి దాయకంగా ఉండేవని, ఆ ప్రభావం వల్లే ఆనాడు " గాలి దోషం" వంటి కొన్ని చిన్న కథలను రాశానని తెలిపారు. 'చిత్రగుప్తుడు' అనే పత్రికకు ' కార్డు కథలు' పంపే వాణ్ణని చెప్పారు. సింహాచలం కొండమీది అర్చకుని వలచిన కామిని ( Nimphomeniac ) కథ రాస్తూ తానూ సృష్టించుకున్న మిడతంబొట్లు పాత్రతో పలు కథలు రాశానని తెలిపారు. స్వీయానుభవం ప్రాతిపదికగా రాసిన కథలు రాణిస్తాయని ముగించారు.
రెండవ వక్త శ్రీ చుక్కా శ్రీనివాస్. వారు వి. చంద్రశేఖర్ రావు గారి నవల 'నల్ల మిరియం చెట్టు' పై చక్కని విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. క్లుప్తంగా నవలాకారుని జీవిత విశేషాలను తెలుపుతూ, వారి ఇతర పుస్తకాల ఇంపు సొంపులను వివరిస్తూ అమెరికన్ కవయిత్రి మాయ ఆంజేలోవ్ శైలి ప్రభావంగా వారికి పొయెటిక్ స్టైల్ అబ్బి ఉంటుందని అన్నారు. పోస్ట్ సోవియెట్ సంక్షోభం అతని రచనలలో ప్రతిబింబించిందని, మ్యాజిక్ రియలిజం నడకలో సాగిందన్నారు. 'మాయాలాంతరు', చెంచుల జీవితాలను చిత్రించిన ' ఆకుపచ్చని జీవితం', 'ఆత్మగానం ' వంటి పలు కథానికలు, నవలలు రాశారని తెలిపారు. వారి 'ఐదు హంసలు ' చదివి తీరాల్సిన పుస్తకం అని భావించారు. ఆదివాసుల, దళితుల సమస్యలను మానవీయ దృక్పథం లో మలిచారని పొగిడారు. జీవితంలో ఎలాగైనా ఎదగాలన్న బడుగుజీవి చేసిన సంఘర్షణలో దారితప్పిన రాజసుందరం (నల్లమిరియం చెట్టు లోని ముఖ్య పాత్ర) కథ ఈ నవలలో ఆలోచనాత్మకంగా అందంగా అమరిందని అన్నారు. విషయవిస్తృతితో సాగిన శ్రీనివాస్ గారి విశ్లేషణ అందరినీ ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు.
తదుపరి వక్త శ్రీ వేణు ఆసూరి గారు. సంస్కృతాంధ్ర రామాయణాలను ఆత్మదగ్ధంగా అభిమానించే వీరు రామాయణ భారతాది గ్రంథాల ప్రస్తావనలతో పాటు, తాను చదివిన పలు పుస్తకాల గురించి స్పందించారు. విశ్వనాథసత్యనారాయణ గారి వేయిపడగలు తనకు ఇష్టమైన పుస్తకమని, కిరణ్ ప్రభ ప్రభ గారు 25 వారాల పాటు వేయిపడగలపై ప్రసారం చేసిన రేడియోప్రసంగాలు తనకు స్ఫూర్తి నిచ్చాయని తెలిపారు. చైతన్య స్రవంతి ప్రక్రియలో సాగిన బుచ్చిబాబు గారి నవల 'చివరకు మిగిలేది' లోని దయానిధి పాత్ర అపూర్వమని వాక్రుచ్చారు. తనకిష్టమైన స్త్రీ పాత్రల పుస్తకాల మాటకొస్తే చలం గారి 'మైదానం' చిర స్మరణీయం అన్నారు. స్త్రీవాద నవల The Awakening 1899 బహుశా చలంమైదానానికి స్ఫూర్తి కావొచ్చని, రచయిత్రి జేన్ ఆస్టిన్ రచనలు అభిజాత్య భారతీయ రచయిత్రుల భావజాలాన్ని సంపన్నం చేసి ఉంటాయని అభిప్రాయం పడ్డారు. చారిత్రిక నేపథ్య రచనలలో చార్లెస్ డికెన్స్ రాసిన 'A Tale of Two Cities ' చెప్పుకో దగిన గ్రంథంగా కొనియాడారు. అందులో మనిషికీ మనిషికీ మధ్య ఉండే ద్వేషం, పేదల ధనికుల మధ్య ఉండే వర్గవైరం రెండూ కొత్తకోణంలో ఆవిష్కరించ బడ్డాయన్నారు. మాక్సిం గోర్కీ 'అమ్మ', Ayn Rand ' Fountainhead ', Titanic గొప్ప పుస్తాకాలని అభిప్రాయం వెలిబుచ్చారు. స్వగతం ( monologue ) షేక్స్పియర్ గ్రంథాల్లో విస్తృతంగా కనిపిస్తుందని, అందుకు కారణం అవి నాటకాలు కావడం వల్ల అయిఉంటుందన్నారు. కాళిదాసు శాకుంతలం అంతా స్వగత సంభాషణేనని, పాలస్య హృదయం రావణుని అంతరంగ ఏకపాత్రాభివ్యక్తేనని శ్రీ శ్రీచరణ్ గారు స్పందించారు. ఆధునిక సాహిత్యంలో ఈ స్వగతం మరింత చక్కని స్వరూపాన్ని సంతరించుకుందని వేణుగారు విన్నవించారు. అత్యంత ఆసక్తికరంగా సాగిన వేణు ఆసూరి గారి ప్రసంగం అందరినీ అలరించింది.
Vilkshanam

భోజనానంతరం మధ్యాహ్న సెషన్లో మూడు ఈ -పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి :
  1. కె.గీత గారి "సెలయేటి దివిటీ" కవిత్వావిష్కరణ - ఆవిష్కర్త శ్రీ నాగరాజు రామస్వామి.
  2. వీక్షణం - సాహితీ మిత్రుల రచనా సంకలనం - 2017 - ఆవిష్కర్తశ్రీ కిరణ్ ప్రభ
  3. వీక్షణం సాహితీ గవాక్షం- ఐదేళ్ళ సమావేశాలు-ఎన్నెన్నో మధుర క్షణాలు -ఆవిష్కర్తశ్రీ సుభాష్ పెద్దు
శ్రీ వేణు ఆసూరి గారు 'సెలయేటిదివిటీ' పుస్తక సమీక్ష చేశారు. ఆచార్య గంగిశెట్టి గారి ముందుమాట గల ఈ పుస్తకం వాళ్ళ నానమ్మ కనకమ్మకు గారికి అంకితం ఇవ్వబడి ఉంది. ప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మి గారి కూతురైన కె.గీతగారికి సంక్రమించిన సాహిత్య వారసత్వ సంపద ఆమెను గొప్ప కవయిత్రిని చేసిందని, పుస్తకంలో ఉన్న కవితలన్నీ ద్వేషం కాని, నిందలు కానీ లేని స్త్రీ సంవేదనాత్మక శుద్ధ రస స్పందనలని, ఆమెవి లోతైన ఆలోచనలని, నిజాయితీగా అందంగా కవితలల్లడం ఆమెకు అలవోకగా అబ్బిన విద్య అని వేణుగారు అభినందించారు. గీత గారి ఇతర కవితా సంపుటులు ద్రవభాష, శీత సుమాలు, శతాబ్ది వెన్నెల. ఈ సంపుటిలోని పలు కవితలను విశ్లేషిస్తూ వేణు గారు కవితలలోని భావచిత్రాలను, ఆత్మగంధాలు చిందే ఆమె హృదయాభివ్యక్తి విశేషాలను, ఆమె సరళ సుందర వచన కవితా రీతులను చక్కగా ఆవిష్కరించారు.

మధ్యాహ్న విందుతో బాటూ శ్రోతల వీనుల విందుగా శ్రీ నాగ సాయిబాబా, శ్రీమతి ఉమా వేమూరి, చి|| ఈశా పాటలు పాడారు.
భోజన విరామానంతరం పార్లమెంట్ సభ్యులు శ్రీ మధు యాష్కీ అనుకోకుండా సభకు ప్రత్యేక అతిధిగా విచ్చేసి తెలుగు పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీ కోమటి జయరాం ఆయనను సభకు పరిచయం చేసారు. మధు యాష్కీ మాట్లాడుతూ "తెలుగు వాడిగా తనకు భాషాసాహిత్యాభిలాష ఉందని, అందుకు దోహద పడే "తెలుగు రచయిత", "బర్కిలీ యూనివర్శిటీ తెలుగు" వంటి ఉత్తమ కార్యక్రమాలకు చేయూతనిస్తానని" హామీ ఇచ్చారు.

ఆ రోజు జరిగిన అత్యంతఆసక్తికరమైన చిరస్మరణీయమైనఘట్టం అష్టావధానం:
తెలుగువారికే స్వంతమైన అవధాన సాహిత్యచరిత్రలో మొట్టమొదటి సారిగా"సంస్కృతాంధ్ర ఉభయభాషా ద్విగుణీకృత అష్టావధానం" జరిగింది. అందులోనూ తెలుగు గడ్డ బయట, అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని బే ఏరియా లో జరగడం విశేషం. అందునా అమెరికా పౌరసత్వం తీసుకొని అక్కడే స్థిరపడ్డ తెలుగు సోదరుడు, వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీరయిన శ్రీ పాలడుగు శ్రీ చరణ్, కష్టసాధ్యమైన ఈ ప్రక్రియను జయప్రదంగా నిర్వహించడం మరింత విశేషం. ఇది ఖండాంతరాలకు వెళ్లినా తరగని తెలుగుప్రతిభకు, తెలుగు భాషాభిమానానికి ఉదాహరణగా నిలిచే మరో చారిత్రక సన్నివేశం.
ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని , తిరుపతివెంకటకవుల తర్వాతి యుగంలో అవధాన కళాప్రాచుర్యానికి అపార కృషి చేసి ఇటీవలే స్వర్గస్థులైన డా. సి.వి. సుబ్బన్న శతావధాని స్మృత్యంకితంగా మహాంధ్రభారతి సంయుక్త సహకారంతో నిర్వహించడం జరిగింది.
కాన్పూరు ఐ.ఐ.టి.లో ఎం.టెక్. చేసిన శ్రీచరణ్ వృత్తి రీత్యా 98లో అమెరికా వెళ్లారు. తండ్రి తిరుపతి వాస్తవ్యులు శ్రీ జయరామానాయుడుగారు హిందీలో ఎం.ఏ. చేసి, హిందీ మాష్టారుగా స్థిరపడ్డా, మొదట దేవస్థానం వారి ఓరియంటల్ కళాశాల విద్వాన్ పరీక్ష పాసయినవారు. తల్లి డా. మనోరంజని గారు, కావడానికి స్థానిక పద్మావతీ మహిళా కళాశాలలో జువాలజీ అధ్యాపకురాలైనా తెలుగు భాషాసాహిత్యాల పట్ల అపార ప్రేమ గలవారు. అలా తల్లిదండ్రులనుండి భాషాసాహిత్య ప్రీతి చిన్నప్పటినుండి వారసత్వంగా అబ్బింది. కాలిఫోర్నియా వచ్చాక తెలుగు సంస్కృత భాషాధ్యయనాలను పట్టుదలగా కొనసాగించారు. సందర్శనార్థం వచ్చిన శ్రీ వర్ధిపర్తి పద్మాకర్ గారినుండి పద్యవిద్య మెలుకువల్ని గ్రహించారు. స్థానిక వేద పండితులు శ్రీ మారేపల్లి నాగ వేంకటశాస్త్రి గారి వద్ద వేదాధ్యయనం చేశారు. గురువుల ప్రోత్సాహంతో తెలుగువారి కీర్తి అయిన అవధాన ప్రక్రియలో అడుగుపెట్టారు.

 మొదటగా మొన్న మే నెలలో మిల్పీటస్ లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ కళామండపంలో , తెలుగులో తొలి అష్టావధానం,అభ్యాస నిమిత్తం చేశారు. ఆ తర్వాత నేరుగా ఈ ఉభయభాషావధానాన్ని, రెట్టింపు పృచ్ఛకులతో, జయప్రదంగా చేశారు.
వారి కవితాధారకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు:
సాధారణంగా అవధానులు నిషిద్ధాక్షరిలో చిన్న చిన్న పదాలు వేసుకొంటూ, లేదా ఏకాక్షరి ప్రయోగాల కసరత్తుతో ముందుకు సాగుతుంటారు.సమాసాల కల్పన జోలికి వెళ్లరు, సులభంగా పట్టుబడతామన్న భావంతో! కానీ శ్రీ చరణావధాని నిర్భయంగా సరస సమాసకల్పనతోనే తన పూరణ సాగించారు. శ్రీరామపరంగా చెప్పమన్నదానికి తెలుగు పూరణ ఇది:
కం. రవి వంశ శశిన్నేడీ
కవితాబ్దీందుడ కళాధికంజరిపున్నే
ప్రవిమల భక్తింగొలిచెద
పవనాత్మజ సేవితుని శుభప్రదు రామున్।।
సంస్కృతంలో—కపిలారణ్య రత్నాణి / ద్రు దీర్ఘతమ తత్త్వభిః
రక్త రాస ద్యుమ్నాన్యపి /రమ్య వనాని సంత్యపి
శ్లోకార్థాన్ని వివరిస్తూ ఇప్పుడు కాలిఫోర్నియానే మన పురాణాల్లోని కపిలారణ్యంగా భావిస్తున్నారనిఅవధాని పేర్కొన్నారు.
తెలుగులో సమస్య : " కాపురమున్ గూల్చి యతడు ఘనుడయ్యె నిలన్" .ఈ సమస్యకు 'లం/కాపురమున్ గూల్చి ....' అని సులువుగా పూరణ చేయవచ్చని అందరూ భావిస్తుండగా
"పూరణ శ్రీకృష్ణ పరంగా ఉండాలని"చమత్కారంగా పృచ్ఛకులు నిర్దేశించడంతోవెంటనేఅవధాని ఇలా పూరించారు :
కం.తాపసుల కష్టపెట్టెడు
పాపపు నరకాసురుని విపన్నావనుడౌ
శ్రీపతి తా ప్రాగ్జ్యోతిష
కాపురమున్ గూల్చి యతడు ఘనుడయ్యె నిలన్।।
ఇక సంస్కృతంలో సమస్య : " తక్రం శక్రస్య దుర్లభం"
పూరణ:ఐరావత మదోద్ధత్యా / దుర్గతామర వైభవః
జ్ఞాన పీయూష రిక్తస్య / తక్రం శక్రస్య దుర్లభం
జంభాసురాదులను జయించిన గర్వంతో ఇంద్రుడు, తన గజేంద్రం మీద ఊరేగుతోంటే, ఆ మత్త గజం, ఆశీర్వదించడానికి వచ్చిన దుర్వాసుని కానుకను అందించకుండా అవమానించినప్పుడు, ఆ మహర్షి శాపానికిగురైన ఇంద్రుడు, ఆ ఐరావతంతో సహా తన అమర వైభవాలన్నీ సముద్రం పాలుకాగా, అమృతానికే కాదు, చివరకు మజ్జిగకు కూడా నోచుకోని దుస్థితికి లోనవుతాడన్నది భావం. జ్ఞాన పీయూషాలన్నది లోతైన అర్థ చమత్కారం.
దత్తపదిలో – 'వ్యాస , శుక , శంకర , పోతన' అనే నాలుగు పదాలను వాడి ఏదైనా తెలుగు ఛందంలో పద్యం చెప్పమనగా వెంటనే అందుకొని
కం. సవ్యాసవ్య వివేకము ( — అని మొదటి పాదం చెప్పి తర్వాతి ఆవృత్తాల్లో)
దీవ్యంబై ఈశు కళను ధీరాముండై
క్రవ్యాసుర నాశంకర
భవ్యుడపోతనరినాడు వసుధం ఘనుడై ।। (అని అనాయాసంగా పూర్తి చేశాడు)
అదే పదాలతో సంస్కృతంలోనూ పూరించమనగా —
సవ్యాసవ్య వివేకోయం/ ప్రాంశు కళా పరస్తథా
పాహ్యనిశం కరాబ్జైశ్చ / తాపోతనత రక్షకః – అని అనుష్టుప్పులో పూరించాడు.
తెలుగు న్యస్తాక్షరికి గాను సభాధ్యక్షులైన రావు గారు 1 వ పాదంలో 13వ అక్షరంగా 'దున్' , 2 వ పాదంలో 2 వ అక్షరం- 'డ్ర', 3 వ పాదంలో 5 వ అక్షరం- 'న' , 4 వ పాదంలో 9 వ అక్షరం- 'మి'ఉండాలని,శార్దూల వృత్తం లో గణేశ స్తుతి చేయాలని వస్తు నిర్దేశం చేస్తూఅడిగారు.ఆ అక్షర న్యాసం వెనుక ఆయన దృష్టిలో పెద్దన గారి మనుచరిత్ర పద్యం ఉంది. ఆ విషయాన్ని ఆయనే పూరణ, ధారణ పూర్తయ్యాక వివరించారు. పెద్దనగారి పద్యాన్ని తలపించేలానే అవధానిగారి పూరణ ఇలా సాగింది:
శా. తండ్రిన్ తల్లిని పూజచేసి శ్రుతి విద్యందున్ కవీంద్రుండుగా
తీండ్రల్ గల్గిన మానసంబులను ను త్తీర్ణంబు గావించు తా
నుండ్రాళ్లం దినుచున్ విశేష వరముల్ యోగీంద్ర భక్తాళికిన్
చండ్రార్కేందు హుతాశనామిత సుధీన్యస్తుండు తానిచ్చున్।।
సంస్కృత న్యస్తాక్షరికి గాను శ్రీ కృష్ణకుమార్ : 1 వ పాదం 3 అక్షరం- 'ఖా', 2 వ పాదం 10వ అక్షరం- 'క్ష' , 3 వ పాదం 5 వ అక్షరం-'వ', 4వ పాదం 15వ అక్షరం- 'ష్ట'గాను శ్రీమన్నారాయణ స్తుతిపరం కావాలనీ అడిగారు. దానికి అవధాని నిరాయాస పూరణ :
శా. వైశాఖాయ జనార్దనాయ మహతే కూర్మావతారాయ చ
క్షీరాంభోనిధి తారణేపి క్షర మోహాహంకృతిఘ్నే నమః
ధ్యాయేహంతు నటేశ భక్తమనిశం నారాయణం చక్రిణం
శ్రీ కళ్యాణగుణావహం ప్రణవ సంయోగాష్ట వర్ణార్చితం
వర్ణన, ఆశువుల్లో కూడా ఇలానే సరసమైన పూరణ సాగింది. నాలుగ్గంటలపాటు సాగిన అవధానానంతరం, చివర్లో అందరూ హర్షధ్వానాలు చేస్తుండగా అక్షరం పొల్లు పోకుండా ధారణ చేసి ప్రథమ ప్రయత్నంలోనే అవధాని జయం సాధించారు.అమెరికా పౌరులైన తెలుగు వారి చరిత్రలో ఒక కొత్త అధ్యాయం సృష్టించారు.
తెలుగులో ఛందోబద్ధంగా కవిత్వం రాయగల స్థానిక ప్రముఖులు శ్రీ తల్లాప్రగడ రామచంద్రరావుగారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి, సరసంగా సభను నిర్వహించారు. దాంతోపాటు తెలుగు 'న్యస్తాక్షరి' పృచ్ఛకులుగా కూడా వ్యవహరించారు.శ్రీ పిల్లలమర్రి కృష్ణకుమార్ సంస్కృతంలో న్యస్తాక్షరిప్రశ్ననిచ్చారు. ఎనిమిది పదులు దాటిన సంస్కృతాంధ్ర విద్వాంసులు, శ్రీ హరి కృష్ణమూర్తి గారు తెలుగు నిషిద్ధాక్షరి నిర్వహించగా, సంస్కృతంలో శ్రీమతి సంధ్యావాషికర్ నిర్వహించారు. వారితోపాటు స్థానిక 'సంస్కృతభారతి' సభ్యులైన కన్నడిగులు శ్రీ విశ్వాస్ వాసుకి సంస్కృతంలోనూ, శ్రీపుల్లెల శ్యామ సుందర్ తెలుగులోనూ సమస్యనిచ్చారు. శ్రీ రెంటచింతల చంద్ర, కొండూరు రవిభూషణశర్మ గార్లు తెలుగు సంస్కృతాలు రెండింటిలోనూ దత్తపది, ఆశువులకు సమస్యలనివ్వగా, శ్రీమతి సుమలత సంస్కృతంలో , శ్రీ ఇక్బాల్ తెలుగులో వర్ణన నిర్వహించారు. వేదపండితులు శ్రీ నాగవేంకటశాస్త్రి గారు సంస్కృతంలోనూ , డా. గీతామాధవిగారు తెలుగులోనూ పురాణప్రశ్ననిచ్చారు. తెలుగులో శ్రీ వేణు ఆసూరిగారు, సంస్కృతంలో కేరళకు చెందిన శ్రీ హరినారాయణగారు అప్రస్తుత ప్రసంగంతో సభను రక్తి కట్టించారు. అలా అది కేవలం తెలుగుకే కాక యావద్భారతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకొంది. రెండు భాషల్లోనూ దీటుగా, సమయ స్ఫూర్తితో సమాధానాలివ్వడంతోపాటు చక్కటి ధారతో, ధారణతో , ఛందోబద్ధ కవితాత్మకతతో ప్రథమ ప్రయత్నమైనా , అందరి ప్రశంసలకు పాత్రమయ్యేలా శ్రీచరణ్ గారు ఈ ఉభయభాషావధానాన్ని నిర్వహించి, అమెరికన్ ప్రథమావధాని అయ్యారు.
అవధాని విజయాన్ని అభినందిస్తూఅధ్యక్షులు శ్రీ తల్లాప్రగడ రామచంద్రరావు సన్మాన పత్రంలో తాము రచించిన ఈ కింది పద్యాన్ని సభాముఖంగా చదివి వినిపించారు:
సీ.|| అవధానధనదానమనుదిన పదనద -ధ్యానమందున కూడ ధన్యుడైన,
మదనకథ కథనమధనవిధము నందు- అవధాన ధ్యాసకు అవధి లేని,
సావధానపుమది సదనవదనమున -ఎదల పొదల సొదలెత్తిచూపు,
శ్రీచరణుడు కాడ సిరి సరస్వతికైన - పుంభావవాణిగ పుడమిమెచ్చ!
ఆ.వె.|| సద్యమైన స్ఫూర్తి పద్యములను కూర్చ – పెక్కు పల్కులెన్ని చెక్కినాడు!
సంస్కృతాంధ్రములను శ్వాసగా శాసించి – రంగరించినాడు, రామచంద్ర!**
చివరిగా మహాంధ్రభారతి పక్షాన శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారూ, వారి కుమారులు శ్రీ వంశీగంగాధర్ దంపతులు , అవధానిగారిని పట్టుపంచె,కాశ్మీర్ దుశ్శాలువాలతోనూ, పృచ్ఛకులను జరీ వస్త్రాల తోనూ సాంప్రదాయక రీతిలో సత్కరించారు.
సభ ఆద్యంతం రసవత్తరంగా, ఉత్సాహ భరితంగా సందడిగా సాగి అందరిని అలరించింది. కవి సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితలను వినిపించారు. శ్రీ కిరణ్ ప్రభ గారు 20 సాహిత్య క్విజ్ ప్రశ్నలను సంధించి విశేషంగా ఆకట్టు కున్నారు. కవితా గానంతో , పాటలతో, సాహిత్య చర్చలతో, కథారీతుల విశ్లేషణలతో, అంతిమంగా అపూర్వమైన అష్టావధాన కార్యక్రమంతో ఐదవ వార్షిక వీక్షణ సమావేశం జయప్రదంగా ముగిసింది.


divider
http://sirimalle.com/issues/2017/10/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2017/october/oct_2017_vyAsakoumudi_vikshanam.pdf

No comments:

Post a Comment