Monday 26 January 2015

వీక్షణం -సాహితీ గవాక్షం-ద్వితీయ వార్షికోత్సవ సమావేశం (Sep,21-2014)

వీక్షణం -సాహితీ గవాక్షం
ద్వితీయ వార్షికోత్సవ సమావేశం
                                   
               సెప్టెంబర్ 21 ఆదివారం. ఉదయం 10 గంటలు. బేఏరియా  తెలుగు సాహిత్యాభిలాషులతో మిల్పిటాస్ స్వాగత్ హోటల్ కళకళలాడింది.  సాహితీ మిత్రులు తమ "వీక్షణం" ద్వితీయవార్షికోత్సవాన్ని  
అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. 
               కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత , కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి  ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, మచిలీపట్నం 'సాహితీ మిత్రులు' సంస్థ అధ్యక్షులు, 'రావిరంగారావు సాహిత్యపీఠ' వ్యవస్థాపకులు  డా. రావి రంగారావు గార్లు విశిష్ట అతిథులు.. 
               వీక్షణం నిర్వాహకులు డా|| కె.గీత గారి ఆత్మీయ ఆహ్వానం తో సభ ప్రారంభమయింది. మొదటి సెషన్ కు అధ్యక్షులు డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. మొదటి వక్త  రావి రంగారావు గారు. 


               రావి రంగారావు గారు 'బాల గేయాలు' అంశం పై ప్రసంగించారు. బాల సాహిత్య రచన పిల్లల నుడికారానికి తగినట్టుగా సంయుక్తాక్షరాలు లేని సరళ భాషై ఉండాలన్నారు. రచయితకు ప్రాస, అక్షర మైత్రి, పునరుక్తి, పదగ్రస్త ముక్తకాల వంటి సాహిత్య లక్షణాల స్పృహ ఉండటం అవసరమన్నారు. వయోపరిమితిని బట్టి  స్థూలంగా పిల్లలను పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలో విభజించుకొని అందుకు అనుగుణమైన రచనా సంవిధానాన్ని అనుసరించాలన్నారు. హాస్యం, శబ్ద మాధుర్యం, ధ్వన్యనుకరణ , శబ్ద క్రీడ ,కథారూప బోధన, కొసమెరుపుల కితకితల వంటి పద్ధతులతో లేత మనసులను ఆకట్టుకునే విధానాలు బాల సాహిత్య కవుల ఉపకరణాలు కావాలన్నారు. చిన్నారులకు అర్థమైన భాషలో రాస్తేనే వాళ్లు ఆకర్షితులవుతారు కనుక కవికి నిర్దిష్టమైన లక్ష్యం ఎంతైనా అవసరం అన్నారు. తాను రాసిన 'రావిచెట్టు గేయాలు', ఇటీవల తన మనుమని పై రాసిన 'బాలల గేయాలు' లోని కొన్ని జనరంజక కవితలను వినిపించి శ్రోతలను ఆనందింపజేశారు.రావి రంగారావు గారి ప్రసంగం చింతాదీక్షితులను తలపింప జేసిందని అధ్యక్షుల వారు అనటం విశేషం.

                తరువాత  అనిల్ రాయ్ గారు 'సోషల్ మీడియాలో కథ' అంశంగా ఆలోచనాత్మక ప్రసంగం చేశారు. ఈనాటి అంతర్జాలం , వెబ్ పత్రికలు అందరినీ అనుసంధించే సౌలభ్యాన్ని కల్పిస్తున్న మాట వాస్తవమే , కాని వాటిలో ఈమధ్య పెచ్చుమీరి వస్తున్నఅవాంఛనీయ కాంటెంట్ అభ్యంతరకరమైనదే. స్త్రీవాదం పేరిట, వాస్తవ అభివ్యక్తి పేరిట, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరిట జుగుప్సాకరమైన అశ్లీల కథా సాహిత్యం రావటం కలత చెందించే విషయమేనని వాపోయారు.

              పిదప వేణు అసూరి గారు తెలుగు పద్యం మీద తనకున్న ప్రేమను, అభిరుచిని అత్యంత ఆకర్షణీయ మైన శైలిలో అభివ్యక్తీకరించారు. సింగారాచారి, అరిపిరాల విశ్వం వంటి ఉపాధ్యాయుల స్ఫూర్తి తోనే పద్యం పై మక్కువ పెరిగిందని తెలిపారు. నూతిలో పడిన  దేవయానిని యయాతి మహారాజు రక్షిస్తున్న సందర్భంలో నన్నయ విరచితమైన 'జలధి విలోలిత' పద్యం ఒక గొప్ప పద్యమని వివరించారు. ముక్కుతిమ్మనార్యుని ముద్దు పలుకు ' పారిజాతాప హరణం ' తనకెంతో ప్రీతిపదమైన ప్రబంధ కావ్యమని తెలుపుతూ  'ఈసునబుట్టి ...','నేయి బోయ భగ్గున దరికొన్న భీషణ హతాశన కీల యనంగ' లాంటి పలు పద్యాలను శ్రావ్యం గా వినిపించారు. కోపోద్దీప్త ఉరగాంగన ఐన సత్యభామ ప్రవర్తనను చిత్రించడంలో ప్రౌఢ ప్రభంధనాయికా సల్లక్షణాలు ఎక్కడా భంగపడ లేదు! పోతన ఆంధ్ర భాగవతం లోని పద్యాలు, ముఖ్యం గా 'భద్ర కుంజరం' కంద పద్యాలు, 'ఇంతింతై వటుడింతై బ్రహ్మాండ పర్యంతమై', 'మనసారథి మనసచివుడు ' వంటి పద్యాలు తనకెంతో ఇష్టమైన పద్యాలని వాక్రుచ్చారు. విరాట పర్వంలోని తిక్కన గారి పద్యం 'ఇభమద పంకము...' అద్భుతమైన పద్యమని అభివర్ణించారు. ఇలా వేణు అసూరి గారు అత్యంత శ్రావ్యంగా చేసిన పద్యపఠన ప్రసంగం అందరినీ ఆనంద పరిచింది.

               తరువాతి కార్యక్రమం పుస్తకావిష్కరణ. శ్రీమతి శంషాద్ గారి తొలి వచన కవితా సంపుటి 'ఈ కిటికీ తెరచుకునేది ఊహల్లోకే' ను శ్రీ కిరణ్ ప్రభ, డా|| కె.గీత, శ్రీ ఇక్బాల్, రచయిత్రి భర్త అహ్మద్ గార్ల సమక్షంలో శ్రీ గంగిశెట్టి లక్ష్మి నారాయణ గారు, శ్రీ  రావి రంగారావు గారు సంయుక్తం గా ఆవిష్కరించారు. 
               తరువాత, శ్రీ తిరుమల పెద్దింటి నరసింహాచార్యుల వారు 'సాహిత్యంలో చాటువులు' అంశం పై ప్రసంగించారు.సహితస్య భావం సాహిత్యం - హితమును చేకూర్చేదే  సాహిత్యం, రసాత్మకం వాక్యం కావ్యం అంటూ చాటువులు విశేషార్థ ప్రక్షిప్తాలని  సెలవిచ్చారు. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పై ఉన్న సాంప్రదాయ సాహిత్య ప్రభావం మొదలుకొని శంకరాభరణం సినిమా లోని అద్వైత ఆపాదన దాకా, పెద్ద బాలశిక్ష లోని మేకపోతు గాంభీర్యం కథ నుండి మూఢాచారాల రాగిచెంబు కథ దాకా, సమస్యాపూరణాల నుండి ఆశుకవిత్వ అప్రస్తుత ప్రసంగాలదాకా, శ్రీనాథుని చాటువులనుండి 
'ప్రసన్నకలితార్థ యుక్తి' దాకా  పలు విషయాలను చాటువు సాహిత్య సందర్భోచితంగా వివరించారు. 'సిరిగల వానికి చెల్లును పదివేలు... ,తిరిపెమునకు చాలు నిద్దరు','కుంజరయూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్', 'కొండనుండు నెమిలి.....' వంటి వాక్చమత్కార చరణాలు వల్లించారు. స్థాలీపులాక న్యాయంగా పలు పద్య పాదాలను ప్రసంగంలో పొందుపరచారు. విద్వత్ సభలలో నలుగురి నోట పలు సందర్భాలలో జాలువారిన కవిత్వం చాటువుల రూపుదిద్దుకొందని వాక్రుచ్చారు.
            మహ్మద్ ఇక్బాల్ గారి ఆధ్వర్యంలో వీక్షణం ప్రత్యేక సంచికల ప్రెసెంటేషన్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇరవై రచనలతో కూడిన వీక్షణం ప్రత్యేక సంచిక -2014, ఇరువైనాలుగు నెలలుగా జరిగిన వీక్షణం సమావేశాల రివ్యూల సంచిక-ఈ రెండు ఈ- పత్రికలు తెర  పైన ఆవిష్కరించబడినవి. వేదిక మీద జరుగుతున్న కార్యక్రమ అవసరాలకు అనుగుణంగా ఈ తెరను అనువర్తింప చేయడం జరిగింది.ఈ-పత్రిక ఆవిష్కరణలో భాగస్వాములైన శ్రీ నాగరాజు రామస్వామి మున్నగు వారిని  వేదిక మీదికి పిలిచి అభినందించడం జరిగింది. 
               ఈ వేడుకల రెండవ సెషన్ రావి రంగారావు అధ్యక్షతన డా|| కె.గీతా మాధవి గారు శ్రావ్యం గా పాడిన కృష్ణశాస్త్రి గారి లలితగీతాలతో ప్రారంభమయింది. 'తొలిపొద్దు కొండపై వెలసిన ఒక దేవళము', 'ఒదిగిన మనసున ఒదిగిన భావం ! కదిపేదెవ్వరో' , 'అలికిడైతే చాలు ఆశతో వెదికేను కనులు' వంటి గీతాలను వినిపించారు. "ఇలా  పాటలను పాడుకుంటూ వుంటే ఇక్కడికి వెన్నెల వచ్చేస్తుంది" అంటూ కవితాత్మకంగా కృష్ణ శాస్త్రి గారిని ఆత్మీయంగా తలచుకున్నారు..
               తర్వాతి కార్యక్రమం డా|| కె.గీత గారికి కవితా రజతోత్సవ సాహిత్య పురస్కారం. 'రావి రంగారావు సాహిత్యపీఠం' సాహితీ మిత్రుల సంస్థ ఆమెను సత్కరించారు. 3 స్వీయ కవితా సంకలనాలు,300 కవితలు, కథలు, వ్యాసాలూ, పత్రికలకు అనేక కాలమ్స్ రాసిన/ రాస్తున్న గీత గారిని సిలికాన్ తీరంలో స్వాగతహారమనీ, మానవ అనుబంధాల దీపమనీ అభినందిస్తూ రంగారావు గారు శాలువ జ్ఞాపిక ల తో సత్కరించారు. పాతికేళ్ళుగా సాగుతున్న ఆమె కవిత్వ వ్యవసాయానికి గుర్తింపుగా ఈ వేడుకను ఆమె సాహిత్య రజతోత్సవంగా భావించడం సబబన్నారు.
               తదనంతర కార్యక్రమ అంశం శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి కీలక ప్రసంగం-"మహా భారతం -పర్వ పునః సృజన". ప్రసిద్ధ కన్నడ రచయిత S.L.బైరప్ప మహాభారత ఇతిహాసాన్ని ఆధునిక క్లాసిక్ గా మలచి రచించిన "పర్వ" కు శ్రీ లక్ష్మీనారాయణ గారు తెలుగులో అనుసృజన చేసి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. అత్యంత ఆసక్తి దాయకంగా సాగిన వారి ప్రసంగం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. ప్రసంగ సారాంశం ఇలా వుంది. మహాభారతాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, భారతం పై వ్రాయడం కష్టమైన పని. నన్నయ గారి మదాంధ్ర మహాభారతం 'అవతారిక' లో వ్యాస భారత ప్రామాణికత ద్యోతకమౌతుంది. తెలుగు సాహిత్య విద్యార్థి అధ్యయనాన్ని నన్నయ తో ప్రారంభిస్తే మంచిది. బైరప్ప గారు మహాభారతాన్ని "పర్వ" అన్నారు. పర్వ అంటే ఉత్సవం. భారతం విషాద సాహిత్యం. జీవుని విషాదం. విశ్వనాథుని "జీవుని వేదన" ఈశ్వరునితో ఐక్యం కావడానికి పడే వేదన. బైరప్ప గారి వేదన జీవుడిగా వేరుపడటం వల్ల కలిగే వేదన. భారత శబ్దాన్ని విడగొట్టి చూస్తే - భా అంటే జీవ కాంతి, రతం అంటే క్రీడ. జీవుడు పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ సాగే  ఈ క్రీడే, జీవుని ఈ విషాద గాథే భారత కథ.మహాభారతం. అనంతమైన ఈ విషాదానికి సమాధానం భగవద్గీత! సింధూ నాగరికత తదనంతర లోహయుగ దశ (పి.డబ్ల్యు.జి) సంస్కృతి కురు పాంచాల గాధ  అంతా విషాదమయం.వేదనా భరితం. భారత ఇతిహాసం లోని ద్రౌపది భీష్మాదుల గాథ అంతా వారి అంతరంగ విషాదమే. ఆ విషాదం లోని సర్వ పార్శ్వాలను ఆ అంతరంగ వేదనల ప్రాతిపదికగా భారత కథను లోతుగా కొత్త కోణం లో దర్శించి ఆవిష్కరించి నందు వల్లే బైరప్ప గారి "పర్వ" అపూర్వ మయింది.
              తరువాత, ప్రఖ్యాత నాట్య విద్వాంసులు వెంపటి చిన సత్యం గారి పుత్రుడు వెంపటి వెంకట్ గారు సభకు రావడం యాదృచ్చికం. వారు సమకాలీన సాహిత్యం - నాట్య కళ సంబంధం గురించి క్లుప్తంగా మాట్లాడారు.సాంధ్ర సాహిత్యం లేందే  నాట్యకళ బతకదు. కాని దురదృష్టవశాత్తు ఈనాడు ఆ సాహిత్య సంపద కొరవడిందని వాపోయారు.
               పిదప, శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు తెలుగు నాటకం గురించి ప్రసంగిస్తూ 'నాటకం కావ్యేషు రమ్యం', నాటకం నాదరస భరితం, కాళిదాసు అందుకే నాటకాన్ని చాక్షుసయజ్ఞం గా అభివర్ణించారని అన్నారు. సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం. కావ్య నాటకానికి ఈ రెండింటి అనివార్యతను ఉటంకిస్తూ బలిజేపల్లి లక్ష్మీ కాంత రావు, తిరుపతి వెంకట కవులను గుర్తు చేసు కున్నారు. 'బావా ఎప్పుడు వచ్చితీవు', 'అదిగో ద్వారక, ఆలమందలవిగో' లాంటి మరువలేని నాటక పద్యాలను గొంతెత్తి పాడారు. నాటకాన్ని బతికించాలి, పోషించాలి అని అన్నారు. 
                  కిరణ్ ప్రభ గారు చరిత్ర పుటల్లో తెరమరుగైన అసామాన్య వ్యక్తి  శ్రీ బంకుపల్లి మల్లయ్య గారి జీవిత విశేషాలను ప్రస్తావిస్తూ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. గురజాడ 151వ  జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని చేసిన ఈ ప్రసంగం సందర్భోచితం. కందుకూరి వీరేశలింగం, కాశీనాధుని  నాగేశ్వర రావు , గిడుగు రామమూర్తి వంటి సంఘ సేవకుల కోవకు చెందిన బంకుపల్లి మల్లయ్య గారు 1876 లో శ్రీకాకుళం జిల్లా లోని ఉర్లాం లో జన్మించారు. మూడు వేదాలను తెనుగించిన తొలి తెలుగు బిడ్డ. నిమ్నవర్గాల ఉద్ధరణకు కంకణం కట్టుకుని, బాలవితంతు వివాహాలను కేవలం ప్రోత్సహించడమే కాక ఆచరించి చూపించిన అభ్యుదయ మూర్తి. తానూ తన పిల్లలకూ సైతం బాల వితంతువులనే ఎంచుకున్న సంఘ సంస్కర్త. కాశి ప్రయాణానంతరం మార్గ మధ్యం లో ఖరగ్ పూర్ లోని ఒక నిమ్న జాతి కుటుంబీకుని ఇంటిలో చివరి శ్వాస వదలి , మరణం లోనూ  తన ఆశయాలను ఆచరించి చూపిన  ఉన్నత వ్యక్తి బంకుపల్లి మల్లయ్య గారని కిరణ్ ప్రభ గారు తెలిపారు.
                

తదుపరి కార్యక్రమం కవిసమ్మేళనం. చక్కని కవితలు వ్రాసిన పన్నెండు మంది కవులు సమ్మేళనం లో పాల్గొన్నారు.రావు తల్లాప్రగడ గారు 'అహంకార స్తోత్రం', శ్రీ నాగరాజు రామస్వామి 'ఆప్త సంధ్య', డా|| కె.గీత గారు 'అతనితో నడచే సాయంత్రం', శ్రీచరణ్  'పద్యాలు', శ్రీమతి శంషాద్ 'ఇదే ఇదే పదే  పడదే', వరకురు ప్రసాద్ గారు 'పని', ఇక్బాల్ గారు 'ఉపవాసం', రాచకొండ విజయలక్ష్మి గారు 'వీక్షణం ', వేణు ఆసూరి గారు 'అమ్మా నువ్వు గుర్తొచ్చావే' , రాధిక గారు 'రాబోయే తరం లో కనపడనివి', నరసింహాచార్యులు గారు 'కాలమహిమ' కవితలను వినిపించారు. చుక్కా శ్రీనివాస్ గారు బాల గంగాధర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం లోని 'నిన్న రాత్రి ' కవితకు ఆంగ్లానువాదం  'లాస్ట్ నైట్ ' వినిపించారు. 
                  కిరణ్ ప్రభ గారి సాహిత్య క్విజ్ ఆసక్తి కరంగా జరిగింది.
                   విశిష్ట అతిథులు శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారిని, రావి రంగారావు గారిని సభలో పెద్దవారైన గోపాల స్వామి గారి చేతుల మీదుగా వీక్షణం మిత్రులు  శాలువాలతో సత్కరించడం జరిగింది.
                   గ్రూప్ ఫోటో, పసందైన స్వాగత్ విందు భోజనం! 
                   ఆఖరు గోష్ఠి 'ప్రత్యేక చర్చా కార్యక్రమం'. ఈ మధ్య విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు వేర్వేరు ప్రామాణిక భాషలు ఉండాలా అన్నది చర్చనీయాంశం. శ్రోతల నుండి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. చర్చ ఆసక్తి కరంగా సుహృద్భావ వాతావరణంలో కొనసాగింది. ఈ అసహన చర్చకు సమన్వయ ముగింపు పలుకుతూ భాషా వేత్తలైన గంగిశెట్టి గారు వ్యక్తి భాష ,మాండలిక భాష, వ్యవహార భాష లాగే ప్రామాణిక భాష కూడా అవసరాల మేరకు అనువైన స్వరూపంగా  పరిణమిస్తూనే ఉంటుందని సెలవివ్వడం హర్షదాయకం.
                    ఆరు గంటల పాటు ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ  'వీక్షణం' ద్వితీయ వార్షికోత్సవం ఆనంద సందోహంగా, ఆత్మీయ సంగమంగా ,సాహితీ వీక్షణ గమనంలో మరుపురాని మైలు రాయిగా మిగిలి పోయిందనడం లో సందేహం లేదు. ఈ సభలో  కె.శారద, లెనిన్, పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్, గోపాల స్వామి, కాంతి పాతూరి, ప్రసాద్ మంగిన, రాధిక, మంజుల జొన్నలగడ్డ, సింధూర, అపర్ణ గునుపూడి మొ.లైన వారు పాల్గొన్నారు.
               -నాగరాజు రామస్వామి 
http://www.koumudi.net/…/oct_2014_vyAsakoumudi_vikshanam.pdf 
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=26747&SupID=36 
http://telugutimes.net/…/1368-vikshanam-second-anniversary-…

No comments:

Post a Comment