Monday 28 December 2015

వీక్షణం - సాహితీ గవాక్షం- 39 (Nov8, 2015)

: వీక్షణం - సాహితీ గవాక్షం :
          39 వ సమావేశం
   మాసం మాసం శ్రుత సాహిత్యం
- సి. రమణ

         ఈ నెల 8న  వీక్షణం సాహిత్య సమావేశం  నాగరాజు రామస్వామి గారి అమ్మాయి తిరునగరి మమత గారి ఇంట్లో, సన్నీవేల్ లో జరిగింది. డా.గీతా మాధవి గారు విఘ్నేశ్వర ప్రార్థనతో సభకు శుభారంభం చేశారు.'అమ్మ చేతి పసుపు బొమ్మ, ఆగమాల సారమమ్మ'- అంటూ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ విరచితమైన శాస్త్రీయ  సంగీత ఛాయలున్న దైవ గీతాన్ని గీత గారు శ్రవణ మనోహరంగా పాడారు. ముజ్జగాలను నడిపించే గుజ్జు రూపు వేలుపు, చలి కొండ చూలి కొడుకు, ఒంటి పంటి దేవర, వెండి కొండ పై వెలిగే పగడపు వెలుగుల అబ్బాయి అయిన గణపతి స్తోత్రంతో సాహితీ సభ ఆరంభం కావడం ముదావహం. మాన్యులు, సాహిత్య సారథులు,  సుజనరంజని సంపాదకులు శ్రీ .తాటిపామల మృత్యుంజయుడు గారి అధ్యక్షతన కార్యక్రమం సక్రమంగా సాగింది.
       మొదటి వక్త శ్రీ ఎల్లారెడ్డి గారు. విశ్రాంత మహోపాధ్యాయులు, పౌరాణిక ప్రయోక్త, సాహిత్య మూర్తులు- రెడ్డి గారు అసమాన వాగ్ధాటితో, అరగంట పాటు అనర్ఘళంగా భాగవత ప్రవచనం కావించి సదస్యులను మంత్రముగ్ధులను చేశారు. సర్వం సహా స్వయంభువుడు వామన రూపధారిగా దానవ దానబ్రహ్మ బలిచక్రవర్తి ఆస్థానానికి విచ్చేసి లోక కల్యాణార్థం దేవకార్యం నిర్వహిస్తున్న సందర్భం. 'అలసులు, మంద బుద్ధిబలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు...సుకర్ము లెవ్వరు జేయ జాల రే' , 'కారే రాజులు రాజ్యముల్....', 'ఇంతింతై  వటుడింతయై, ..నభోవీధి నంతై..,బ్రహ్మాండ సంవర్థియై ', 'అమ్మలగన్న యమ్మ, ముగురమ్మల మేలిమిటమ్మ', 'అచ్చపు జుంటి తేనియల...' వంటి అనేక ప్రసిద్ధ పద్య రత్నాలను పౌరాణిక రాగ బంధురంగా, ధార్మిక సాంప్రదాయ బద్దంగా గొంతెత్తి పాడి సభికులను ఆకట్టు కున్నారు. సామాజిక ప్రయోజనం, సమాజ సముద్ధరణ, తెలుగు సాహిత్య సాంప్రదాయ పునర్వికాసం , ఆనందం , ఉపదేశం వంటి సాహిత్య విలువలు సమకాలీన సాహిత్య కారుల పరమావిధీ, ధ్యేయం కావాలని  రెడ్డి గారు ఆకాంక్షించారు.

       తదుపరి కార్యక్రమం నాగరాజు రామస్వామి గారి పుస్తకాల ఆవిష్కరణ. ప్రాచీన  తెలుగు సాహిత్యంలో పండిపోయిన విశ్రాంత నిత్యోపాధ్యాయులు శ్రీ ఎల్లారెడ్డి గారు వచన కవిత్వ సంపుటి 'గూటికి చేరిన పాట' ను ఆవిష్కరించారు. 'ఈ పుడమి కవిత్వం ఆగదు: జాన్ కీట్స్ కవితా వైభవం' అనువాద కవితా సంపుటిని రామాయణాది సంస్కృతాంధ్ర క్లాసిక్ గ్రంధాలను హృదయదఘ్నంగా అధ్యయనం చేస్తూ ఆనందిస్తున్న శ్రీ వేణు ఆసూరి గారు ఆవిష్కరించారు. చిరకాలంగా సాహిత్య వెన్నెలలను విరజిమ్ముతున్న కళల 'కౌముది', బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కిరణ్ ప్రభ గారు దేశ దేశీయ అనువాద  కవన సంపుటి ' అనుస్వరం' ను ఆవిష్కరించారు. శ్రీ దీర్ఘాశి విజయభాస్కర్ గారి దీర్ఘకవిత 'మహా శూన్యం' కు అనువాదమైన ' The Great Void ' ను సాహిత్యాభిలాషి , స్వయంగా రచయిత్రీ ఐన శ్రీమతి గునుపూడి అపర్ణ గారు ఆవిష్కరించగా, ఆంగ్ల కవితా సంకలనం 'Wings of Musings' ను 'సుజనరంజని' పూర్వ సంపాదకులు , ప్రాచీన అర్వాచీన సంస్కృతాంధ్ర సాహితీ రీతులను ఆకళింపు చేసుకున్న శ్రీ రావు తల్లాప్రగడ గారు ఆవిష్కరించారు. ఈ ఐదు పుస్తకాల ఆవిష్కరణ అత్యంత ఆత్మీయంగా కొనసాగింది.
           ఆవిష్కరణ అనంతరం రచయిత శ్రీ నాగరాజు రామస్వామి గారి స్పందన:
           "నేను నా కవిత్వ రచనలలో ముఖ్యంగా ఈ అంశాలపై శ్రద్ధ వహిస్తాను. 1.క్లుప్తత 2. భాషాగాఢత 3. భావనిగూఢత. 4.శ్రావ్యత.
           క్లుప్తత - వచనకవిత ప్రక్రియకు అత్యంత ఆవశ్యకమైన విషయం. సంస్కృత మూలాలైన తత్సమ పదాలు క్లుప్తత కు దోహదపడే సాధనాలు. నిర్దుష్టమైన పదాల/పదబంధాల ఉపయోగంతో క్లుప్తత సాధింపవచ్చు.
          భాషాగాఢత- భాషాగాఢత అంటే  ప్రత్యామ్నాయం లేని పదాల/పదబంధాల ఉపయోగత. లలిత పదచిత్రాల, భావచిత్రాల, ప్రతీకల, పరోక్ష ప్రస్తావనల (allegory), రూపకాల వినియోగం వల్ల కవిత్వంలో సాంద్రతను,  క్లుప్తతను ఏకకాలంలో సాధించవచ్చు.

          నిగూఢత- శుద్ధ వచన ప్రక్రియలా కాకుండా వచన కవితాభివ్యక్తి ఒకింత గుప్తాగుప్తంగా, అవగుంఠనం దాచిన అందంలా భాసిల్ల జేయడం నాకు ఇష్టం. అయోమయతకు దారితీయని అస్పష్టత వాంఛనీయం.
         శ్రావ్యత- శాబ్దిక శ్రావ్యత వైపే నా మొగ్గు. అందుకేనెమో అనుప్రాసలను, వాక్యంత ప్రాసలను అవసరమైన చోట వాడుకుంటాను( సమకాలీన వచనకవితా రీతికి భిన్నంగా ఉన్నా). వచన కవితా రచనలో, వాడబడిన సమాసం శ్రవణ మనోహరమైనప్పుడు వైరి సమాసాలు సైతం వర్జనీయం కాకూడదని నా స్వీయాభిప్రాయం. బహుశా: నాది అనుభూతి ఛాయలున్న కవిత్వం కావచ్చును.
        అనువాద కవిత్వం మాటకొస్తే - భావార్థాలతో పాటు మూలంలోని పాటతనాన్ని, నాటి సాంస్కృతిక పౌరాణిక ( మైథలాజికల్) నేపథ్యాన్ని పట్టుకోవడం, మూలం లోని కీలకమైన పదాలను/ పదబంధాలను గుర్తించి ప్రత్యామ్నాయం లేని సమానార్థక భావాత్మక పదాలను  వినియోగించడం  ముఖ్యమని నా అనుభవం. నా అనువాదాలలో (ముఖ్యంగా ఏంతో శ్రమించి అనువదించిన కీట్స్) లయకు అవరోధమనుకున్న చోట్ల పాదసూచికలు ఉంచాను (గ్రీకు/రోమన్ మిత్/మైథాలజికల్ సందర్భాలలో). మూలంలోని  శైలీ శిల్ప శ్రావ్యతలను నిలుపుకునేందుకు చాలా వరకు వాక్యానువాక్య అనువాదమే ఆమోదయోగ్యమని భావిస్తాను.

        నా స్వీయ కవితా సంకలనం 'గూటికి చేరిన పాట' లోని 'నానుడి', నా అనువాదం 'ఈ పుడమి కవిత్వం ఆగదు: జాన్ కీట్స్ కవితా వైభవం', లోని అనుబంధ వ్యాసం, 'అనుస్వరం' లోని 'అనువాద వ్యాకరణం', నా కవిత 'కృత్యాద్యవస్థ' లో రచనా ప్రక్రియకు సంబంధించిన నా భావజాలం మరింత విస్తృత పరచబడింది."
         పిదప,  శ్రీమతి సి. రమణ గారు కీట్స్ పుస్తకం పై, శ్రీమతి విజయ లక్ష్మి గారు 'గూటికి చేరిన పాట' పై, లెనిన్ గారు 'అనుస్వరం' పై చక్కని విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు.
          "దీపలక్ష్మీ!  ఆవాహయామీ,  ప్రఫుల్ల వదనే, ప్రమోదినీ, మా హృదయ కమల నివాసినీ ఆవాహయామీ" అనే దీపావళి సందర్భోచిత పాటను శ్రీమతి అపర్ణ గారు అతిమధురంగా ఆలాపించి అలరించారు.
తరువాత శ్రీ సాయి బాబా గారు వినిపించిన పేరడీ సంగీత కవిత్వం అందరినీ కడుపుబ్బ నవ్వించింది.
           పిదప, వేణు ఆసూరి గారు వాల్మీకి రచించిన వర్షాకాల శరదృతు వర్ణనల శ్లోకాలు చదివి, అర్థ తాత్పర్యాలను విశదీకరించి అలనాటి భారతావని  ప్రకృతి శోభను కవితాత్మకంగా కళ్ళముందు నిలిపారు.
          తరువాత కూరపాటి భాస్కర్ గారు ఈ గవాక్ష వీక్షణం ను అభినందిస్తూ, గతంలో తాను రాసుకున్న కొన్ని చిన్ని కవితలను, కొన్ని ఆంగ్లానువాద శకలాలను చదివి వినిపించారు.
          పిదప, నెలనెలా సాగే సాహిత్య క్విజ్ ను  శ్రీ కిరణ్ ప్రభ గారు ఈ సారి మరింత విజ్ఞాన భరితంగా, వినోద కేళీ రంజకంగా నిర్వహించి నవ్వులను పండించారు. మెదడుకు మేతా ఎడదకు హాయీ ఈ క్విజ్ ; అదనంగా- సరైన సమాధానం చెప్పిన ఒక్కో శ్రోతకు ఒక్కో పుస్తకం బహుమతి !

          కవిసమ్మేళనం లో భాగంగా  డా॥ కె. గీత గారు వినిపించిన చక్కని వచన కవిత 'యార్డ్ డ్యూటీ'. ఈ పహారా ఉద్యోగంలో-  'బడి పచ్చిక' మీద బిలబిల మంటున్న'మిడతల దండును, కిటికీ ఊచల మీద తలకిందుల వేలాడుతున్న పిల్లమూకలను చూసి తాను 'ఆరు రెక్కల సీతాకోక చిలుక' అయిపోయి ముద్దుగా 'వాళ్లకు తోకలేదు' అనడం అందమైన బాల్యానికి అపరంజి పూతలా ఉంది.
          తరువాత శ్రీచరణ్ గారు తను దేవీ నవరాత్రుల ఉత్సవ సందర్భంలో రాసుకున్న దండకం లోని కొన్ని ఖండికలను శ్రుతిపేయంగా వినిపించారు. సత్యం శివం సుందరం మూర్తీభవించిన  అన్నపూర్ణ  స్తుతి !  శివ శివానీ ఏకత్వ చైతన్యాన్ని ఏకరువు పెట్టిన భక్తిమయ లాస్యలయ!
సభ లోని ఒక శ్రోత అడిగిన రుద్రాభిషేక సంబంధిత ప్రశ్నకు సమాధానంగా శ్రీ చరణ్ గారు స్కాందపురాణం లోని ఒక ఇతివృత్తాన్ని తీసుకొని వివరించారు. ప్రత్యక్షమైన ఆద్యంత రహితమైన 'బింబార్ఠ' తేజో పుంజ అగ్నిస్తంభాగ్రాలను దర్శించాలని బ్రహ్మా విష్ణువులు పోటాపోటీగా బయలు దేరుతారు. వరాహ రూపంలో విష్ణువు అధోలోకాలకు, హంస రూపంలో బ్రహ్మ ఊర్థ్వ లోకాలకు దూసుకొని పోతుంటారు. గగనమార్గంలో బ్రహ్మకు గోవు, కేతకీ పుష్పం కనిపిస్తాయి. ఓటమి రుచించని బ్రహ్మదేవుడు తాను ఆ జ్యోతిర్ స్తంభ శిఖరాగ్రాన్ని చూచానని వాటితో సాక్షం చెప్పించుకు నేందుకు ఒప్పించుకుంటాడు. విష్ణుమూర్తి ఓటమిని ఒప్పుకుంటాడు. తప్పుడు సాక్షం ఇచ్చిన కేతకి దైవపూజకు అనర్హమని, గోపూజకు పృష్ఠభాగ పూజకే పరిమితమని ఉగ్రుడైన జఠాధరుడు శపిస్తాడు. బ్రహ్మదేవుని ఐదవ తలను ఖండించి చతుర్ముఖుణ్ణి చేస్తాడు.

      ఆ జ్యోతిస్ఫటిక ప్రత్యగాత్మ స్తంభ స్వరూపం శివాభిషేక అమృత పరిసేచనా సందర్భోచితమని  విప్రభావం!  ఇలా, శ్రీ చరణ్ గారి శుద్ధాత్మ ప్రవచనం పౌరాణ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది.
         ఆ పిదప, బర్క్లీ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగాన్ని చిరస్థాయిగా నిలిపి ఉంచేందుకు ఏళ్లుగా శ్రమిస్తున్న శ్రీ వేమూరి వెంకటేశ్వర రావు గారు మరో సారి దాతలను విజ్ఞప్తి చేశారు. ప్రవాస తీరంలో తెలుగును వెలిగించాలని వారు పడుతున్న నిరంతర ప్రయాస బహుధా ప్రశంసనీయం.
            ఈ విధంగా-సంతోష సందోహంగా, స్మృత్యర్హ చిహ్నంగా సాగిన ఈ సాహిత్య సమావేశం సభికుల మనసులలో చిరకాలం నిలిచిపోయేలా కొనసాగింది. ఈ సభలో శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి ఉమా వేమూరి , శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి విద్యుల్లత, శ్రీ ఆర్. శ్రీనివాస రావు, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్ మొ.న వారు పాల్గొన్నారు.
----------
http://www.koumudi.net/Monthly/2015/december/index.html

No comments:

Post a Comment