Tuesday 2 July 2013

వీక్షణం సమావేశం -8 (Apr 14, 2013)

    

వీక్షణం ఎనిమిదవ సమావేశం శాన్ హోసే లో శ్రీ చరణ్ పాలడుగు గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ఈ సారి అతిథి సమయంలో ఉషశ్రీ గారి ప్రథమ పుత్రిక గాయత్రీ దేవి, అక్కిరాజు సుందర రామకృష్ణ, వింజమూరి అనసూయా దేవి పాల్గొన్నారు. రఘు మల్లాది అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ముందుగా శ్రీ చరణ్ ఆహ్వానంతో ప్రారంభమైంది. 
గాయత్రీ దేవి తమ తండ్రి గారైన ఉషశ్రీ జీవన కాలంలో చేసిన కృషిని గురించి చెబుతూ ఆలమూరు ట్రయో లో ఒకరిగా నిర్వహించిన "తరుణ సాహితి" కార్యక్రమాల గురించి, విశ్వనాథ సత్యన్నారాయణ గారి రచనలకే పరిమితంగా నడిపిన "విశ్వశ్రీ "పత్రిక గురించి సభికులకు తెలియజేసారు. వారి అసలు పేరు సూర్య ప్రకాశ దీక్షితులనీ, "పెళ్లి కొడుకులు", "పైడి కటకటాలు" మొదలైన ప్రఖ్యాతి చెందిన నాటకాలు రచించారనీ చెప్పారు. రేడియో లో ఆయన గొంతు వినని వారు ఆంధ్ర దేశం లో ఎవరూ ఉండి ఉండరని,  "ధర్మ సందేహాలు"రామాయణభారత కార్యక్రమాలతో ఆయన గొంతు చిరస్థాయిగా తెలుగు వారి హృదయాలలో నిలిచి పోయి ఉన్నదన్నారు. వారి కుమార్తెగా జన్మించడం తన అదృష్టమని పేర్కొంటూ ఇంట్లో నాన్నగా గొప్ప పాత్ర నిర్వహించేవారన్నారు.
 
తరువాత అక్కిరాజు సుందర రామకృష్ణ "పద్యం -నాటకం" అనే అంశం గురించి ప్రసంగించారు. నాటక రంగం లో స్వీయ అనుభవాన్ని తెలుపుతూ వినిపించిన పద్యాలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి.
ఒకప్పుడు పద్యమే నాటకంగా ఉండేదని, బళ్లారి రాఘవ, రాజమన్నార్ మొ. న వారి కృషి వల్ల గద్య నాటకాలు వచ్చినా పద్యం పౌరాణిక నాటకాలకు ఆయువుపట్టుగా నిలిచిందని అన్నారు. ఒకప్పుడు తిరుపతి వేంకట కవుల "చెలియో చెల్లకో", "జెండాపై కపిరాజు" పద్యాలు నోటికి రాని ఆంధ్రులు ఉండేవారు కారని అన్నారు. పాండవోద్యోగ విజయం, సత్య హరిశ్చంద్ర, కృష్ణ తులాభారం, చింతా మణి నాటకాలు నాలుగూ నాలుగు స్తంభాల వంటివనిఅప్పట్లో ఈ నాలుగు నాటకాలలో పద్యాలు రాని వారిని నటులుగా పరిగణించేవారుకారని పేర్కొన్నారు. మధ్య మధ్య హాస్య చమక్కులతో గొంతెత్తి శ్రావ్యంగా ఆయన ఆలపించిన పద్యాల్ని సభాసదులు మంత్రముగ్ధులై విన్నారు. చివరిగా కృష్ణ తులా భారంలోని "కస్తూరికా తిలకంబును పోనాడి" పాడి వినిపించారు. ఇప్పటి వరకు ఎన్నో సమావేశాలలో తను  పాలు పంచుకున్నా వీక్షణం వంటి ఆత్మీయ సమావేశం లో ఇప్పటి వరకు పాల్గొనలేదని సంతోషం వ్యక్తం చేసారు.
మధ్య తేనీటి విరామం తర్వాత వింజమూరి అనసూయా దేవి "బాలబంధు బి.వి నరసింహారావు" గురించి తాను రచిస్తున్న కొత్త పుస్తకం గురించి,ఆయన తో తమ కుటుంబానికున్న ఆత్మీయ అనుబంధం గురించి  ప్రసంగం చేసారు. ఈ సందర్భంగా సాహిత్య రంగానికి తను చేసిన కృషిని వివరిస్తూ తాను స్వయంగా ఆరు తరాలను చూసానన్నారు. జానపద గీతాలకు కర్ణాటక నొటేషన్ ఇస్తూ  10 పుస్తకాలు రచించానని  చెప్పారు. ఇక నరసింహరావు గారి గురించి మాట్లాడుతూ  చిన్నతనం లోనే ఆయనకు బాల సాహిత్యానికి పునాది వేసిందనీ చెప్పారు.  తమ ఇంట్లో చాలా చలాకీగా అందరినీ పలకరిస్తూ, నవ్విస్తూ కథలు చెప్తూ తిరిగే వాడని గుర్తు చేసుకున్నారు.
93 ఏళ్ల ప్రాయంలో పుస్తకం రచిస్తున్న అనసూయ గారి మొక్కవోని పట్టుదల సభలోని వారందరికీ  స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
తర్వాత స్థానిక వేద పండితులు వేంకట నాగ శాస్త్రి ఆశీర్వచన ప్రసంగం చేసారు. 
ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో క్రాంతి శ్రీనివాసరావు "లోపలి వ్యవసాయం"రావు తల్లాప్రగడ "అమ్మ" గురించిన గజల్ ను, డా||కె.గీత "కొండవాలు వానతీగ", రాఘవేంద్రరావు నూతక్కి "రెక్కలు" మినీకవితలు, కొన్ని హైకూలు, నాగరాజు రామస్వామి స్వీయకవితలు, అనువాద కవితను వినిపించారు. 
చివరిగా పిల్లలమర్రి కృష్ణ కుమార్, చుక్కా శ్రీనివాస్ లు మాట్లాడారు. ఎంతో కుతూహలంగా, ఆత్మీయంగా  సాగిన వీక్షణం సమావేశానికి వేమూరి, కిరణ్ ప్రభ, శివ, కోటరెడ్డి, శారద, యోగేంద్ర, దర్భా సుబ్రహ్మణ్యం మొదలైన వారు కూడా హాజరై ఆనందించారు.
వచ్చే సమావేశం క్యూపర్టినో లో శారద గారింట్లో జరుగుతుందని ప్రకటించారు.

1 comment:

  1. ఆత్మీయ స్పర్సతో కొనసాగిన సమావేశం శ్రీ అక్కిరాజు రామకృష్ణగారి గాత్ర ఝరి వినూత్న లోకం లో విరమింప జేస్తే స్వ.శ్రీ ఉషశ్రీ గారి తనయ డా.గాయత్రీ దేవి తండ్రితో తన అనుభవాలు,తొభై మూడేళ్ళ వయసులోనూ మూర్తీభవించి చైతన్యం శ్రీమతి వింజమూరి అనసూయాదేవి యువతకు మహత్తర స్ఫూర్తి.అనేక మంది ఇతర సాహితీ ప్రముఖులను,కళాకారులను కలిసే అవకాశమిచ్చిన శ్రీమతి గీతామాధవి,మరియు ఇతర నిర్వాహకులకు నా తరఫున నా భార్య మనోహరం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ...శ్రేయోభిలాషి ,...నూతక్కి రాఘవేంద్ర రావు.(కనకాంబరం).

    ReplyDelete