Monday 2 January 2017

వీక్షణం - సాహితీ గవాక్షం-52 (Dec11, 2016)

వీక్షణం సాహితీ సమావేశం- 52

- నాగరాజు రామస్వామి.

ఈ నెల వీక్షణం 52వ సమావేశం డిసెంబర్ 11న ఫ్రీమౌంట్ లోని శర్మీలాగారి ఇంట్లో జరిగింది. అతిథేయులు శ్రీమతి శర్మీలా గారు ఎంతో ఆత్మీయంగా అతిథులను ఆహ్వానించాక, సభ శ్రీ వేమూరి గారి అధ్యక్షతన మూడు గంటల పాటు అత్యంత ఉత్సాహంగా కొన సాగింది. సుమారు నాలుగేళ్ల క్రితం తమ ఇంట్లో మొదటి వీక్షణం జరిగిందని, ఇన్నాళ్లు నిరాఘాటంగా వీక్షణం సమావేశాలు కొనసాగుతుండడం హర్షణీయమని అధ్యక్షుల వారు కొనియాడారు.
కార్యక్రమంలోని మొదటి అంశం శ్రీమతి శర్మీలా గారి కథా పఠనం. వీరి వ్యాసాలు, కథలు  'వార్త' వంటి ప్రసిద్ధ సాహిత్య పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కూచిపూడి శాస్త్రీయ నాట్యాది లలిత కళలలో అభినివేశమున్న వీరు తమ కథలలో లలిత కోమల సంవేదనలను చిత్రిస్తారు. కథా శీర్షిక 'చిన్ని ఆశ '. పేరుకు తగట్టుగానే  కథలో సునుశిత పసి మనస్తత్వం ప్రస్ఫుటించింది. ఏలూరు తిరునాళ్లు, టమటమాల బండి, వెదురు గూళ్ల బళ్లు దర్శనమిచ్చాయి. పల్లె వాతావరణం లో సాగిన పసిప్రాయపు కథనం పూవుకు తావి అబ్బినట్టు సరళంగా సాగింది. చిన్ని చిన్ని వాక్యాలతో  ఉత్తమ పురుషలో నడచిన కథనరీతి పాఠకులను చిటికన వేలిని పట్టుకొని కథా చిత్రం కేసి నడిపిస్తున్నట్టు సహజ సుందరంగా వుందని కిరణ్ ప్రభ గారు కొనియాడారు.
తదనంతర కార్యక్రమం కిరణ్ ప్రభగారి కీలకోపన్యాసం. కవి సామ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ గారి పై 20 వారాలుగా కొన సాగుతున్న వారి 24 సంపుటాల రేడియో టాక్ షోకు పొడిగింపు ఈ ప్రసంగం. ఇంతవరకు ఉటంకించబడని కొన్ని విశిష్టాంశాల విషయ సంగ్రహం. గంటకు పైగా సాగిన వారి వాగ్ధార శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. తన షోలలో విశ్వనాథుని వృత్తాంతాన్ని ఆరు భాగాలుగా విభజించి విశ్లేషిస్తున్నానని తెలిపారు. జీవన రేఖలు, ఏకవీర, వేయి పడగలు, ఆత్మకథ, చిన్న కథలు, రామాయణ కల్పవృక్ష మహా కావ్యం - ఈ ఆరు భాగాలలో  ఆఖరుదైన కల్పవృక్షంపై ఇంకా సమగ్రంగా ప్రసంగించాల్సి వుందని, ఙ్జానపీఠ పురస్కార సందర్భంలో విశ్వనాథుల వారు సమర్పించిన ఆంగ్ల నివేదిక విశేషాలను, వాటి పూర్వపరాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నానని తెలిపారు. వారి అద్భుత ప్రసంగ సారాంశం ఇలాగుంది :
విశ్వనాథ వారికి 1971 లో లక్షరూపాయల ఙ్జానపీఠ పురస్కారం లభించింది. పాతిక సంవత్సరాల అకుంఠిత విశేష కృషి ఫలితంగా విశిష్ట 'రామాయణ కల్పవృక్షం' మహా కావ్యమై ప్రభవించింది. పురస్కార సందర్భంలో విశ్వనాథ గారు ఇంగ్లీషులో చదివిన ఎనిమిది పేజీల ఉపన్యాసం వారి జీవన సత్యాలను ప్రస్ఫుటించింది. జీవన గమనంలో తాను అనుభవించిన పేదరికాన్ని, తాను భరించిన వియోగ విషాదాన్ని, ఎదుర్కొన్న ప్రతిఘటనలను దాపరికంలేకుండా ఏకరువు పెట్టింది. ఆ ఉపన్యాసం ఒక ఉత్కృష్ట 'ధిషణుని' ఉదాత్తతను ప్రతిఫలించింది. A well-structured write-up ; a sheer caliber of  corporate world !
రాస్తే రామాయణమే రాయాలన్న తన తండ్రి గారి ఆదేశంతో కల్పవృక్ష రచనకు వారి 14వ ఏటనే బీజం పడింది. అందుకు కావలసిన సంసిద్ధత కోసం సత్యనారాయణ గారు పాతికేళ్లు పరిశ్రమించారు. రకరకాల రామాయణాలను అవపోసనం పట్టారు. సంస్కృతంలో నిష్ణాతుడు కానిదే రామాయణ ఆత్మను పట్టుకోలేమని గ్రహించి సంస్కృత భాషను కూలంకషంగా అధ్యయనం చేశారు. తన రామాయణ రచనలో  ఎవరూ వాడని వృత్తాలను పొందుపరచాలని, ఒక్కొక్క కాండలో 2000 చొప్పున పద్యాలు ఉండాలని  భావించి 1934 లో శ్రీకారం చుట్టిన రామయణ కల్పవృక్ష మహా కావ్యం పూర్తి అవడానికి 17 ఏళ్లు పట్టింది. ఒక్క బాలకాండ రచనకే 5 సంత్సరాల వ్యవధానం అవసరమయింది. డబ్బు లేమి కారణంగా రచనను ఆపేయాలనుకున్న తరుణంలో మళ్యాల యువరాజా వారు ఆర్థికంగా ఆదుకొని బాలకాండను ప్రచురించి పెట్టారు. తనచే ' రాముడు రాయించిన'  రామాయణం నిజానికి  సీతకథ అని విశ్వనాథులవారు నిర్ధారించారు.
డిగ్రీలు లేని తెలుగు పాండిత్యం అసమగ్రమేనని, ఆంగ్లంపై పట్టు సాధించాలని భావించి పాశ్చాత్య సాహిత్యాన్ని మథించారు. ఆంగ్ల సాహిత్య కళలను, లాటిన్ అనువాదాలను, ఇటాలియన్ నాటకాలను అధ్యయనం చేసి ఇంగ్లీషు భాష పై అధికారం సాధించారు. ఇలా నిరాఘాటంగా సాగిన కిరణ్ ప్రభ గారి ప్రసంగ ధారలో విశ్వనాథ ప్రశస్తి బహు ముఖంగా ప్రవహించింది.
ఈ సారి వేమూరి గారి వ్యంగ్యాస్త్రం పాక శాస్త్రం మీద పడింది. వెంకటేశ్వర్లు గారు 'మష్రూం కర్రీ' పేరున ఇదివరలో అచ్చైన తన స్కెచ్ ను చదివి వినిపించారు. తెలుగు కాని వంటింటి తెలుగులో నడచిన కథనం నవ్వులను పండించింది.
సాయిబాబా గారు 'రిగ్వేదం' పై పద్యం పాడారు. జగమంతా రిగ్గింగే అన్నంత ఇదిగా పాదాలు కదిలాయి.  "వీక్షణ గీతం" రెండవ భాగం లో 'వీక్షణాన్నీ',  'వీక్షణ సభ్య మండలినీ'  పేరుపేరున ప్రస్తుతిస్తూ - అమెరికా గర్వ కారణం, తెలుగు కళాతోరణం, సాంస్కృతిక సంరక్షణం, కిరణ్ ప్రభల ప్రశ్నోత్తరం, ఆసూరి రామాయణం, గీతా మాధవి కవనం అనర్ఘళం అంటూ అంత్య ప్రాసలతో అదరగొట్టేశారు. సటారికల్ గా సాగిన వారి హిలేరియస్ గాత్రం సభికులకు కితకితలు పెట్టింది.
ఈ రోజు హైటీబ్రేక్ తదనంతర కార్యక్రమం సరికొత్తది. విశేషమేమిటంటే ఈ దినం  'వీక్షణం' కర్త, కర్మ, క్రియ లాంటి గీతా మాధవి గారి జన్మదినం. కిరణ్ ప్రభ దంపతులు దిగ్విజయంగా నిర్వహిస్తున్న సాహిత్య పత్రిక ' కౌముది' కి  పదేళ్లు. యాదృచ్చికంగా అమరిన ఈ  రెండు పండుగులను ఏకకాలంలో నిర్వహించుకుని వీక్షణం సభ్యులు సంబరపడి పోయారు. కిరణ్ ప్రభ దంపతులు కేక్ కట్ చేసి గీతగారిని అభినందిస్తే, గీత గారు అభినందన కానుకనందించి కౌముదిని రంగుల బలూన్లతో ఎగిరేశారు.

కిరణ్ ప్రభ గారి సాహిత్య క్విజ్ ప్రశ్నోత్తరావళిలో సభ్యులందరూ పాలు పంచుకొని సభకు నూతనోత్సాహాన్ని చేకూర్చారు.
కవిసమ్మేళన కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణ గారు ఉమ్రలీషా గారి చింతనాత్మక కవితనూ, తన 'అక్షరాన్నీ' గానం చేసి సభికులను రంజింప జేశారు. గీత గారు ' వయసొచ్చిన పుట్టిన రోజు', లెనిన్ గారు 'నా పేరేమిటి', నాగరాజు రామస్వామి ' నవతరానికి నా స్వప్నం' కవితలను వినిపించారు. శ్రీ చరణ్ గారు గళర్షి బాలమురళీ కృష్ణకు నివాళిగా పద్య ప్రసూనాలను ప్రసాదిస్తే, సత్యనారాయణ గారు గానామృతంతో సత్కరించారు. శంషాద్ గారు 'శుక్రారం పుట్టిన రోజు' తెలంగాణ బాణీలో వచన కవితా కుసుమాన్ని అందించారు.
శ్రీమతి లక్ష్మి గారు తన మెక్సికో పర్యటానుభవ స్మృతులను జోడిస్తూ వీక్షణంపై తన కున్న మమకారాన్ని, నాస్టాలజియాను అత్యంత ఆప్త వాక్యాలలో అభివ్యక్తీకరించారు.
ఆశించిన విధంగానే, ఆహ్లాదకరంగా ఆత్మీయంగా సాగిన ఈ రోజు వీక్షణం కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan17/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2017/january/jan_2017_vyAsakoumudi_vikshanam.pdf
http://sirimalle.com/vikshanam.html


No comments:

Post a Comment