Friday 1 August 2014

వీక్షణం సాహితీ గవాక్షం -21 (May11, 2014)

వీక్షణం సాహితీ గవాక్షం - 21

 

 ఈనెల 'వీక్షణం' సమావేశం 11 వ తేదీన ఫ్రీమాంట్ లోని శంషాద్ గారి ఇంట్లో జరిగింది.అబ్దుల్లా మహ్మద్ గారు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. శంషాద్ దంపతుల అతిథి సత్కారం, అక్కిరాజు రమాపతి రావు గారి సభాసారథ్యం , చక్కని సాహిత్య వాతావరణంలో సభ సక్రమంగా కొనసాగింది.
మొదట శంషాద్ గారు తన తండ్రి గారైన దిలావర్ గారి జీవన విశేషాలను స్థూలంగా వివరించారు. ఇవీ వారి జీవన రేఖలు. డా|| దిలావర్ మహ్మద్ గారు ఖమ్మం జిల్లా లోని కమలాపురం గ్రామంలో జూన్ 1942 లో జన్మించారు. హైస్కూల్ జీవితం డోర్నకల్లో. శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో కాలేజి చదువులు. ఆచార్య చేకూరి రామారావు పర్యవేక్షణలో దాశరథి కృష్ణమాచార్యుల పై సాహిత్య పరిశోధన చేసి
దాక్టరేట్ పుచ్చుకున్నారు. దీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు.కొన్నాళ్ళు విరసం కు సేవలందించారు. ప్రస్తుతం స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి అన్నమాటే గాని అవిశ్రాంతంగా సాహిత్య సృజన చేస్తూనే వున్నారు. ఆలస్యంగా సాహితీ వ్యయసాయం ప్రారంభించినా అనతి కాలం లోనే కవితలు, కథలు, నవలలు, సమీక్షలు -ఇలా వివిధ సాహిత్య ప్రక్రియలలో ప్రావీణ్యం
సంపాదించుకున్నారు. ఆనాటి జయశ్రీ మొదలు ప్రసిద్ధ సాహిత్య పత్రిక భారతి లాంటి పత్రికలలో వారి రచనలు ప్రచురించబడ్డాయి. వెలుగు పూలు, జీవనతీరాలు కవితా సంకలనాలు. "గ్రౌండ్ జీరో" పేరు తెచ్చిన దీర్ఘ కవిత. ' మట్టిబొమ్మ' కథా సంకలనం. 'తానా' వారి సంచికలలో కుడా వారి కథలు అచ్చయ్యాయి. 'ప్రణయాంజలి'వారి పద్య కావ్యం. ' ప్రహ్లాద చరిత్ర' నన్నయ ఎర్రనల కావ్యాల నేపథ్యంలో పరిశీలించబడిన విశ్లేషణ గ్రంధం. ' కర్బల' వారి మరో విశిష్ట రచన. ప్రస్తుతం దిలావర్ గారు 'సమాంతర రేఖలు' నవల , 'ట్రైబల్ స్టోరీస్' కథలు రాస్తున్నారు.

శంషాద్ తన తండ్రి ఎదురుకున్న ఆర్ధిక ఇబ్బందులను, తమ కుగ్రామంలో కొరవడిన వైద్య సౌకర్యాలను ఆర్తీ ఆత్మీయతా నిండిన జ్ఞాపకాలుగా తలచుకున్నారు. తన తండ్రికి వాత్సల్య ప్రోత్సాహం అందిస్తూ వచ్చిన ఆవంత్ససోమసుందరం గారికి కృతజ్ఞతలు తెలిపారు.

డా||దిలావర్,కవి జాషువ,డా||కొలకలూరి ఇనాక్ ల జీవితాలలో అనేక పోలిక లున్నవని, ముందు ముందు వారిని గురించిన సమగ్ర చర్చ జరుపుకోవాల్సిన అవసరం ఉందని కిరణ్ ప్రభ గారు అనడం విశేషం.

ఆ తరువాత, త్రిభాషా పండితుడైన విద్వాంసులు పెద్దిపర్తి రాజారావు గారి కుమార్తె, ప్రసిద్ధ అవధాని పెద్దిపర్తి పద్మాకర్ గారి చెల్లి, శ్రీమతి ఆంధ్ర లక్ష్మి, తొలిసారి వీక్షణం కు విచ్చేసి తమ సాహితీ వ్యాసంగం గురించి తెలిపారు. విపుల,సృజన లాంటి పత్రికలలో వారి కథలు ప్రచురించ బడినవి. తన తొలి నవల 'బాంధవి' టి.టి.డి ప్రచురించిందని, రెండవ నవల 'తమసోమా జ్యోతిర్గమయ' ఈమధ్యే
ప్రచురించుకున్నానని తెలుపుతూ నవలను సభికులకు అందించారు. జన్మనిచ్చిన తల్లి ఋణం, బ్రతుకు ఆసరా అయిన భూమాత ఋణం తీర్చుకునే నేపథ్య భూమిక ఈ నవల ఇతివృత్తం.

పిదప నాగరాజు రామస్వామి చదివి వినిపించిన వ్యాసం సాహిత్య సంబంధి. వచన కవిత్వం, అనువాద వచన కవిత్వం, కథా సాహిత్యం తీరుతెన్నులను గుర్చిన వ్యాసం అది. నేటి యువతరం భాష పై శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత గురించి, వచన కవితా స్వరూపాన్ని నిర్దుష్టంగా రూపు కట్టించే దిశగా సాహితీ వేత్తలు కృషి చేయాలిన అవసరం గురించి, విదేశీయ సాహిత్యాన్ని అనువదించడం అగత్యమని, వచన
కవితాభివ్యక్తి కి భాషా గాఢత భావ నిగూఢత నిషిద్ధం కాదని, సంపూర్ణ సాహితీ దర్శనం కృషి తో కూడిన వ్యవసాయమేనని, పాఠకులు నిరంతర అధ్యయనం ద్వారా స్థాయిని పెంచుకోవాలని ఆ వ్యాస సారాంశం.

మహమ్మద్ ఇక్బాల్ గారు అరబ్బీ భాష సౌందర్య సామ్యాల ప్రసంగ పరంపరలో భాగంగా మరి కొంత సమాచారాన్ని అందించారు. అరబిక్ భాషలో 99 శాతం పదాలు మూడు ధాతువులు కలిగి ఉంటాయన్నారు. 'కతబ్' అనే పదం 'కితాబ్' గా, 'కబర్' 'కబుర్లు' గా, 'అల్జేబర్' 'ఆల్జెబ్రా' గా, 'కసర్' 'కొసరు' గా భారతీయ భాషలలోకి వచ్చిన అరబిక్ పదాలని తెలిపారు. అరబిక్ సంస్కృత భాషల వ్యాకరణ సంబంధాల సూత్రత గురించి వివరించారు.

ఆచార్య వి.యల్.యస్.భీమశంకరం గారు సభకు విచ్చేయడం ఒక ఆకర్షణ. వారు మాట్లాడుతూ కవిత్వ ప్రాప్తి దైవ దత్తమని, ఒక్క తెలుగు భాష లోనే వున్న పద్య ప్రక్రియ ముమ్మాటికీ చిరంజీవి అని సెలవిచ్చారు. యతి, ప్రాస, గణాదుల మూలంగా తెలుగు పద్య రచన సంస్కృత శ్లోక రచన కన్నా కష్టతరమయిందని తెలిపారు. కవిత్వం లో సహజాలంకార లక్షణ ఛందస్సులు రసిక రాజ విరాజమై అర్థసంపన్నమై మానస రాగమై శబ్దవర్ణ సువర్ణ విశిష్ట శిల్పాన్ని సంతరించి పెడుతాయని వాక్రుచ్చారు. హృదయానందాన్ని ప్రసాదించేదే కవిత్వమన్నారు. ఛందస్సులు లక్షల సంఖ్యలో ఉన్నాయని, ఆరు అక్షరాల గాయిత్రీ మంత్రానికి 256 ఛందస్సు లున్నవని వక్కాణించారు. రసస్రువు, శ్రీ దక్షారామ భీమేశ్వరోదాహరణ కావ్యం, "శ్రీ రామ! నీ నామ మేమి రుచిర!" ఇత్యాది స్వీయ రచనల పుస్తకాలను సభకు సమర్పించారు. రసస్రువు ఇదివరకు రాయని 56 ఛందస్సులను సంతరించుకున్న అపూర్వ పద్య గ్రంధం. భీమశంకరం గారు రసస్రువు నుండి ఒకటి రెండు పద్యాలను వినిపించారు.

ఆ పిదప కవి సమ్మేళనం. మొదట, శంషాద్ దిలావర్ గారు రాసిన 'రేష్మా!రేష్మా!' కవిత ను,'కిన్నెరసాని'స్వీయ కవితను వినిపించారు. డా||కె.గీత గారు చిరకాల మిత్రురాలిని చూసిన సంతోషాన్ని"చిన్నప్పటి స్నేహితురాల్ని చూసేక" కవితలో కవిత్వీకరించారు. ఈ కవితలో చిన్ననాటి తూనీగ రోజులు, కల్లాపి ముగ్గులు, ఇత్తడి జడగంటల శోభలు, చిక్కుడు పాల నెమిలీకల చిరు ప్రాయ ముచ్చట్లు లలితా మృదులంగా పారాడాయి. పిల్లలమర్రి కృష్ణకుమార్ గారు 'పాతుగాదికి కొత్తుగాదికి పొత్తుకుదరదు తమ్ముడా!'అంటూ పాత కొత్తల మేలు కలయికలతో పాట బాణీ లో పద్యాన్ని మేళవించి కదం తొక్కించారు. గంగా ప్రసాద్ "కుక్క" అనే ప్రతీకాత్మక కవిత వినిపించారు. నాగరాజు రామస్వామి చదివిన కవితలు 'రూఢ్యర్థాల అవల' & 'కృత్యాద్యవస్థ'. రాజు తదితరులు కూడా కవితలు చదివారు. శంషాద్ కూతురు రేష్మా 'అట జని కాంచె భూసురుడు 'మనుచరిత్ర లోని పద్యాన్ని శ్రావ్యంగా వినిపించింది.

చివరగా కిరణ్ ప్రభ గారు నిర్వహించిన క్విజ్ కార్యక్రమం హుషారుగా సాగి సభలో హుషారును పెంచింది. వచ్చే నెల సమావేశం కిరణ్ ప్రభ గారింట్లో డబ్లిన్ లో జరగనున్నట్లు ప్రకటించారు. మొత్తం పై ఆ సాయంత్రం సిసలైన సాహితీ సంధ్య గా రూపొందింది.
 
- రచన : నాగరాజు రామస్వామి

No comments:

Post a Comment