Friday 1 August 2014

వీక్షణం సాహితీ గవాక్షం -19 (Mar11, 2014)

వీక్షణం సాహితీ గవాక్షం - 19
(మాసం మాసం శ్రుత సాహిత్యం )

- రచన : నాగరాజు రామస్వామి

 మార్చ్ 9న సాహితీ గవాక్ష వీక్షణం మిల్పీటాస్ లోని అనిల్ రాయల్ గారి ఇంట్లోజరిగింది. అది ముమ్మాటికీ బే ఏరియా తెలుగు సాహితీ మిత్రుల సారస్వత ప్రభాస విభావరి!

సభ అనిల్ గారి కథతో ప్రారంభమయింది. ఆరోజు వీచిన గాలి ఒక కథావీచిక. అనిల్ వినిపించిన కథ 'శిక్ష' అతను అందించిన ఒక High Tea ! అతని మిత్రుడు శివ (యాజి) గారి 'పగడ మల్లెలు' ఒక కొత్త కథాసౌరభం! ఈ రెండు కథలూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితాలు. కథలు ఓహెన్రీ ని తలపించాయని శ్రోతలు అనడానికి కారణం వారి కథల కొసమెరుపులు, ఆసాంతం గుప్తాగుప్తంగా కథను నడిపించిన వారి కథన శిల్పం! చకితుడైన పాఠకునికి రెండవసారి చదువక తప్పని, వాక్యాల పొరలలో దాచబడిన ముడులను విప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కథలు కొత్తవి అనేకన్నా అవి కొత్త రకంగా చెప్పబడిన కథలు అనడం సబబు.

'శిక్ష' కథానాయకుడు బండరెడ్డి పన్నెండేళ్ళ బాలుడు. అతనిది అంత పిన్న వయస్సని కథాంతానికి గాని తెలియదు. వాడు ఒకటి రెండు సార్లు పోలీసులను బారి నుండి తప్పించుకున్న నేరస్తుడనే భావం మనలో ఏర్పడుతుంది. నేరస్తులను జైలుకు తరలిస్తున్న దృశ్యాలు, ఖాకీ దుస్తుల్లోని డ్రైవర్ కనపరుస్తున్న వైముఖ్య హావభావాలు, కథ పొడుగునా సాగిన అనుమానాస్పద నేపథ్యం ఆ భావాన్నే బలపరుస్తాయి. బండరెడ్డిని తీసుకెళ్తున్నబస్సు ఓ భవనం ముందు ఆగగానే అది జైలే అయివుంటుందని పాఠకహృదయం తొందర పడుతుంది. భవనం మీది భారీ హోర్డింగ్ మీద ఒక పేరుమోసిన కార్పోరేట్ స్కూల్ పేరూ, దాని కింద 'అంతర్జాతీయ కఠోర శిక్ష/ణ' అన్న వాక్యం ఉన్నదనడం కొసమెరుపు. బాలుని సున్నిత మైన మనోభావ ఆవిష్కరణే కథాంశమని, కార్పోరేట్ స్కూళ్లను కించపరచడం తన ఉద్దేశం కాదని రచయిత తర్వాత చెప్పుకొచ్చారు.

'పగడ మల్లెలు' శిల్ప పరంగా ఈ కోవకు చెందిన కథే. పూల రహస్యం తెలిసిన ఒక పడుపు స్త్రీ చెప్పుకున్న ఉదంతంలా సాగింది కథ. పాత్రలలో పంచ పాండవుల వ్యక్తిత్వాలు నిక్షిప్తపరచ బడి ఉన్నాయని రచయిత ఎత్తిచూపే దాకా తెలిసి రాని వ్యూహ రచన! ఒకటికి రెండు సార్లు( in-between- lines )చదివితే గాని కథాస్వరూపం మరింత విశదం కాదేమోనని నా వ్యక్తిగత అభిప్రాయం. కొత్త శైలీ శిల్ప నిర్మాణం లో నడచిన ఈ కథ సభికులను ఆకట్టుకుందనటం లో సందేహం లేదు.

తర్వాత 'సృజనరంజని' సంపాదకులు తాటిపామల మృత్యుంజయుడు గత సంచికలో వచ్చిన శిరీష ఈడ్పుగంటి గారి 'తెలుగు పత్రికలు: మహిళా సంపాదకులు' వ్యాసాన్ని విశదీకరిస్తూ, ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం దృష్ట్యా సందర్భోచితం అన్నారు. వారి వివరణాత్మక ప్రసంగ సారభూత విషయ సంగ్రహం ఇలా వుంది :
భారతదేశ తొలి పత్రిక 'దిగ్దర్శన్' 1818 లో ,'తెలుగు జర్నల్' 1831 లో, 'కర్నాటిక్ క్రానికల్'1832 లో, 'సత్యదూత' 1835 లో, 'వృత్తాంతి' 1838 లో వెలువడ్డాయి. ఈ పత్రికల సంపాదకులు పురుషులు. స్త్రీ ప్రాధాన్యం గా వచ్చిన పత్రికలు 'తెలుగు జనానా'(1893) , 'హిందూసుందరి' (1902). స్త్రీల పత్రికకు స్త్రీలే సంపాదకత్వం వహించిన తొలి తెలుగు పత్రిక 'హిందూసుందరి' సంపాదకులు రమాబాయమ్మ, శాంతాబాయమ్మ గార్లు. 'సావిత్రి'1910 లో, 'అనసూయ' 1914 లో, 'సౌందర్యవల్లి' 1918 లో, 'ఆంధ్ర లక్ష్మి'1921 లో, 'ఆంధ్ర మహిళ' 1943 లో, 'తెలుగు తల్లి' 1943 లో, 'తెలుగుదేశం' 1950 లో,'వనిత' 1956 లో, 'నూతన' 1978 లో,'స్త్రీ స్వేచ్చ' 1988 లో, 'లోహిత' 1989 లో, 'మాతృక' 1992 లో, 'ఆహ్వానం' 1993 లో, 'భూమిక' 1993 లో, 'చైతన్య మానవి' 2002 లో స్త్రీల సంపాదకత్వం లో వెలువడిన తెలుగు పత్రికలు. ఐతే,1977 లో ముప్పాళ రంగనాయకమ్మ(విరసం) సంపాదకత్వంలో వెలువడిన ' ప్రజా సాహితి', కొండవీటి సత్యవతి గారు రెండు దశాబ్దాల నించి నిర్వహిస్తున్న 'భూమిక', ఈనాటి ఇ పత్రిక 'విహంగ' ప్రశంసనీయమైన పత్రికల్లో ప్రముఖం గా గుర్తించ వలసినవిగా శ్రోతలు అభిప్రాయ పడ్డారు. ప్రసంగం ఇలా విషయసాంద్రం గా వివరణాత్మకంగా సాగింది.

తర్వాత, కవిసమ్మేళనం. మొదట నాగరాజు రామస్వామి ఒక వచన కవితను, శంషాద్ రెండు కవితలను, వేణు రెండు కవితలను వినిపించారు. డా||కె.గీత 'మా పెరటి నారింజ చెట్టు' వచన కవిత వినిపించారు. అమ్మచెట్టును అలుముకున్న తన అనుబంధాన్ని అభివర్ణిస్తూ చివరగా చెప్పిన కవితా వాక్యం 'మా నారింజ చెట్టుకు నేనే తల్లినయ్యాను'!
తరువాత డా.లెనిన్ గారు తన spiritual journey కి సంబంధించిన అశేష శేష ప్రశ్నల పరంపరను సభ ముందుంచారు.

ప్రతి సమావేశంలోనూ ఆఖరి అంశం క్విజ్ . విజ్ఞానప్రదమైన సాహిత్య ప్రశ్నావళి తో సభను వినోదాత్మకంగా మార్చే విద్య కిరణ్ ప్రభ గారిది ! ఊహించిన విధంగానే ఆసక్తిగా సాగి అందరినీ ఆనంద పరచిన క్విజ్ కార్యక్రమం తో ఆనాటి 'వీక్షణం' సాహిత్య సభ ముగిసింది.
 
- రచన : నాగరాజు రామస్వామి

No comments:

Post a Comment