Friday 1 August 2014

వీక్షణం సాహితీ గవాక్షం -18 (Feb-9, 2014)

వీక్షణం సాహితీ గవాక్షం - 18

వీక్షణం 18 వ సాహితీ సమావేశం ఫ్రీ మౌంట్ లోని పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారింట్లో ఫిబ్రవరి 9 న జరిగింది.
వేమూరి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ అన్నమాచార్య కీర్తన "పూవు బోణుల కొలువే పుష్ప యాగం" గురించి ఆసక్తిదాయకమైన పరిశోధనా ప్రసంగం చేసారు. అన్నమయ్య కీర్తనలు భక్తి, శృంగారాలనే రెండు విధాలనీ, అందులో శృంగార కీర్తనలను అన్నమయ్య తనకు తానే గోపిక గా ఊహించుకుని రాసినవనీ అన్నారు. యజ్ఞం, యాగం అనే పదాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఉదాహరణ పూర్వకంగా వివరించారు. ప్రత్యేకించి ఈ కీర్తనలో యాగం అన్నమాట వాడడాన్ని గురించి చెప్తూ, ఈ కీర్తన వేంకటేశ్వరుణ్ణి కృష్ణుడిగా భావించి గోపికా వస్త్రాపహరణాన్ని గురించి రాసినదనీ అన్నారు. "పుష్ప యాగం" అన్న మాటని వాడడం వెనుక మనుషుల్లో ఉండే అహాన్ని, దానివల్ల కలిగే దుర్విచారాల్ని ఆహుతి చేయాలనేది అసలు తాత్పర్యం అని చెప్పారు. ఈ యాగం లో రగిల్చేది జ్ఞానాగ్నిని. ఇక వస్త్రాలనేవి అహానికి ప్రతీకలనీ వాటిని తొలగించడమే వస్త్రాపహరణంలోని తాత్వికార్థమనీ తెలియజేసారు. కీర్తన లోని పదాల్ని వివరిస్తూ అక్కడి స్త్రీల హృదయాలలో కలిగే పులకరింతలు, నవ్వులు, చివరగా బూటకపు తిట్లు అన్నీ పుష్పములనీ, పరిపూర్ణ అర్పణభావమే పుష్పయాగమనీ ముగించారు.
తర్వాట చిమటా శ్రీనివాస్ "వేటూరి పాటల్లో అలంకార వైభవం" గురించి ప్రసంగించారు. జయంతి చక్రవర్తి వేటూరి పాటల పై రాసిన పరిశోధనా గ్రంథం నుంచి సేకరించిన అంశాల్ని వివరించారు. ప్రసంగం లో ప్రతీ పాటకీ పల్లవినీ శ్రావ్యంగా పాడుతూ వివరించారు. వేటూరి పాటల్లో శబ్దాలంకారాలైన వృత్తి, లాట, అంత్యానుప్రాసలు, ముక్తపదగ్రస్తము, యమకాలంకారాల్ని సోదాహరణం గా వివరించారు. ఇక అర్థాలంకారాలైన ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష వంటివే గాక భ్రాంతిమతి, దృష్టాంతాలంకారాల వంటి అనేక అలంకారాల్ని సోదాహరణంగా, శ్రోతలకు వీనుల విందుగా వివరించారు.
చక్కని విందు తో కూడిన విరామం తర్వాత తెలుగులో అరబిక పదాల గురించిన ప్రసంగాల రెండో భాగంగా మహమ్మద్ ఇక్బాల్ కుర్చీ, కమీజు, తారీఖు, జల్సా వంటి పదాల ధాతు నిర్మాణాలు, వాడుక, అర్థ విపరిణామాల గురించి వివరించారు.

చివరగా కిరణ్ ప్రభ "ఆనందాబాయి జోషి" గురించి మాట్లాడుతూ 1880 లలో గొప్ప స్పూర్తి దాయక మహిళ అని చెప్పారు. యమునా బాయి ఆమె అసలు పేరనీ వివాహం తర్వాత ఆనందాబాయిగా మారిందనీ అన్నారు. భర్త గోపాలరావు గారి దగ్గరే ప్రాధమిక విద్యను అభ్యసించినా ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చి ఫిలడెల్ఫియాలో వైద్య విద్యను అభ్యసించిందనీ చెప్పారు. అప్పటికే కుమారుడు కలిగి మరణించినా వ్యక్తిగత సమస్యల్ని అధిగమించి సమాజానికి సేవ చెయ్యడం కోసం వైద్య విద్యాభిలాషి అయ్యిందనీ అన్నారు. అప్పటికాలంలో సముద్రాల్ని దాటి వెళ్లడం వెనుక సమాజ అభ్యంతరాల్ని ఆమె ఎదిరించిన తీరు, అమెరికా వెళ్లడం కోసం, వెళ్లిన తర్వాత స్వదేశ ధర్మాలు సక్రమంగా నెరవేర్చడం కోసం తపన పడ్డ విధానాన్ని కిరణ్ ప్రభ తన సహజ వాగ్ధాటితో శ్రోతలను కట్టిపడేసే విధంగా వివరించారు. 22 సం||రాల పిన్న వయసులో అనారోగ్యంతో ఆమె మరణించి ఉండకపోతే ప్రపంచానికి ఎంతో మేలు జరిగి ఉండేదని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ముగించారు.

పూర్తిగా మూడు గంటల సమయం హాయిగా ఉపన్యాసాలు వింటూ, అభిప్రాయాల్ని పంచుకుంటూ గడిపిన ఈ వీక్షణం సమావేశం ప్రత్యేకమైనదని అంతా సంతోషించారు. ఈ సమావేశానికి డా|| కె.గీత, ఉమా వేమూరి, లెనిన్, వంశీ ప్రఖ్యా మొ.న వారు కూడా హాజరయ్యారు..
-డా|| కె.గీత

No comments:

Post a Comment