Saturday 2 February 2013

వీక్షణం సాహితీ సమావేశం- 4 (Dec9, 2012)




వీక్షణం నాలుగవ సమావేశం ఫ్రీ మౌంట్ లోని పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్ గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. సభకు వేమూరి వేంకటేశ్వర్రావు అధ్యక్షత వహించి, స్వాగతం పలికారు
ముందుగా కిరణ్ ప్రభ "సంపాదకుడు- కథల ఎంపిక"  అనే అంశం పై ప్రసంగించారు.
ఒకప్పుడు పత్రికా సంపాదకులు బాగా సాహిత్యాన్ని చదువుకున్న వారై ఉండేవారనీ, స్వయంగా రచనలు చేసిన ప్రతిభా వంతులనీ అందువల్ల ఉత్తమ మైన రచనల్ని ఎంపిక చేయగలిగే వారనీ అన్నారు. ఉదాహరణగా చందమామ సంపాదకులైన చక్రపాణి, నాగిరెడ్డి గార్లను గురించి చెప్తూ వారు ప్రచురించిన కథలలో కారణం, నీతి మొదలైన కొన్ని మౌలిక సూత్రాలు ఉండేవని అన్నారు. కథలు ఒకే రీతిగా, ఒకే శైలి లో, చిన్న వాక్యాలతో ఉండడానికి వీలుగా కథల్ని తిరగరాయించేవారని అన్నారు. అందుకు దోహద పడిన ఆ పత్రిక ఉప సంపాదకులు దాసరి సుబ్రహ్మణం గార్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఆయన 53 సంవత్సరాల పాటు ఒకే పత్రిక లో పని చేసిన ఒకే ఒక్క ఉప సంపాదకులనీ చెప్పారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి,  సిరి వెన్నెల సీతారామ శాస్త్రి చందమామ కథల వల్లే ప్రభావితమయ్యామని చెప్పడాన్ని గుర్తు చేసారు.


ఇక పత్రికా సంపాదకత్వం 1977 నుంచీ వ్యాపారాత్మకతకి శ్రీకారం  చుట్టిందనీ, అందులో ప్రతిభావంతమైన తొలి సంపాదకులుగా  ఆంధ్రభూమి కి సంపాదకత్వం వహించిన సికరాజు  గారిని పేర్కొన్నారు.  తర్వాత వచ్చిన పల్లకి, స్వాతి మొదలైనవి ఇదే పంథాను కొనసాగించాయని అన్నారు. పత్రికలో రచనల ఎంపిక ను గురించి మాట్లాడుతూ సాధారణంగా పత్రికల్లో రచనలు ముందుగా సబ్ ఎడిటర్ లు వడపోసిన తర్వాత, ఎడిటర్ కు చేరతాయనీ అందులో స్వంత అభిరుచులూ చోటు చేసుకుంటాయనీ అన్నారు.  అయితే పత్రికలకు ఉన్న కొన్ని నియమ నిబంధనలు కూడా రచనల ఎంపిక లో పెద్ద పీట వేస్తాయని చెబ్తూ అందులో స్వయంగా కౌముది సంపాదకుడి గా తన అనుభవాల్ని సభికులతో పంచుకున్నారు.

రచనల ఎంపికలో కథాంశంలోని విభిన్నతని, మాములు కథైనా చెప్పే విధానం లోని కొత్తదనం, ఎత్తుగడ, ముగింపు వంటివాటిలో కొత్తదనం కోసం చూస్తాననీ అన్నారు. కొత్తదనం లేని కథాంశాలకు ఉదాహరణలు చెప్తూ ఆత్మహత్య సమస్యలు, తల్లిదండ్రులు- పిల్లల పెంపకం,  పిల్లలు తలిదండ్రుల్ని నిర్లక్ష్యం చెయ్యడం, , భార్యా భర్తలు విడిపోవాలనుకోవడం మొ.నవి చెప్పారు. రచయిత తన స్వీయ అనుభవం లోని చిన్న సంఘటనను తీసుకుని దాని చుట్టూ తనకున్న ప్రతిభతో కాల్పనికతని ఎలా అల్లుకుంటూ వెళ్తాడో ఉదాహరణగా గొల్లపూడి మారుతీ రావు గారి కథను గురించి చెప్పారు.
ఇక కొత్త రచయితలకు సంపాదకుడి గా సూచనలు చెప్తూ కథలో చెప్తున్న విషయానికి ఒక లక్ష్యం ఉండాలి అన్నారు.  అవసరం లేని సంభాషణలు, వాక్యాలు ఉండకూడదన్నారు. కథ లో కథకుడికి కథనం లో ఫోకస్ అవసరమనీ చెప్పి ముగించారు.
తర్వాత సభికులు వేసిన ప్రశ్నలకు సమాధానాలతో చర్చ బాగా ఆసక్తిదాయకంగా జరిగింది. పత్రికల్లో పెద్ద రచయితల రచనలు పేరు చూసి వేసుకుంటారా? నిజంగానే రచనలో ని గొప్పదనాన్ని చూసి వేస్తారా అన్న ప్రశ్నకు 95% రచన ఉత్తమమైన దైతే నే ప్రచురణకు స్వీకరిస్తామనీ, 5% మాత్రం ఒక్కోసారి పేరున్న రచయితల రచనపై ఉన్న  ఎక్స్ పెక్టేషన్స్ తో ప్రచరణకు స్వీకరిస్తామని చెప్పారు. కానీ పాఠకుల స్పందనని అనుసరించి పేలవమైన రచనలు పేరున్న రచయితలవైనా ఆపివేయడం జరుగుతుందనీ అన్నారు. ఇక కొత్త రచయితల రచనల ప్రచురణ స్వీకరణకు కొలమానాలు ఏంటి అన్న ప్రశ్నకు సమాధానంగా రచయితలు తాము రాయాలి కాబట్టి రాయడం కాకుండా లోపలి సృజనాత్మకతని నిజంగా పైకి తెచ్చే ప్రయత్నం చెయ్యాలనీ, బాగా రాయాలంటే విస్తృతంగా చదవాలనీ చెప్పారు. కథల్లోని టెక్నిక్స్ వసుంధర వంటి రచయితల రచనల్లో బాగా ప్రతిబింబిస్తాయని చెప్పారు.

తరవాత జరిగిన స్వీయ కవితా పఠనంలో కె. శారద  వివాహ వేదిక గురించి చదివిన హాస్య కవిత "హాం ఫట్ మాట్రి మోనీ" సభికుల్ని బాగా ఆకట్టుకుంది.   
 ఈ సారి వీక్షణం లో చిన్నారులు  కూడా పాల్గొనడం ప్రత్యేకత. వరూధిని హైకూల తోను, ఇందు చిన్న కథ తోను, విరించి ఏకాంకిక తోనూ  అందరినీ ఆకట్టుకున్నారు.  డా|| కె. గీత  కారు అమ్మినప్పటి బాధను గురించిన " నాలుగు కాళ్ల గది" అన్న కవితను వినిపించారు. 

పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్ గారు, శ్రీ చరణ్ గారు పద్య కవితలను  అద్భుత రీతిలో వినిపించారు. 
కాస్సేపు తేనీటి విరామం తర్వాత జరిగిన క్విజ్ కార్యక్రమం  లోని ప్రశ్నలు- ఏ సినిమాకు చలం గారు కథను రాసారు?, విశ్వనాథ సత్యనారాయణ గారు మాటలు రాసిన మొదటి సినిమా ఏది?, దేవుల పల్లి వారు రాసిన "మనసున మల్లెల మాలలూగెనే" పాట లో ప్రత్యేకత ఏమిటి? ప్రశ్నలకు సభికులు సమాధానాలుగా మాలపల్లి, ఆకాశ రాజు, పల్లవి చరణాలు ఉండకుండా  గేయంలాగా ఉండడం అనీ సమాధానాలు చెప్పారు. 

తరువాత జరిగిన "దాస విజయం" రూపకం లో బృహస్పతిగా పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్, ధూర్జటి గా శ్రీ చరణ్, అన్నమయ్యగా రావు తల్లాప్రగడ, రమేష్ కర్నూలు, రామదాసు గా దర్భా సుబ్రహ్మణ్యం, కవయిత్రి మొల్లగా డా. కె.గీత పద్యాల్ని పాడి వినిపించారు.  సంగీత ప్రధానమైన ఈ కార్యక్రమాన్ని సభికులు మంత్ర ముగ్ధులై  వీక్షించారు.  

 చివరగా కె.గీత సభకు ముగింపు పలుకుతూ వచ్చే నెల వీక్షణం కార్యక్రమం రావు తల్లా ప్రగడ గారి ఆతిధ్యంలో శానోజే లో  జరుగుతుందని తెలియ జేసారు.
.............................
 


No comments:

Post a Comment