Wednesday, 21 September 2022

వీక్షణం సాహితీ గవాక్షం - 110 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం - 110 వ సమావేశం

వరూధిని
vikshanam-110

వీక్షణం-110 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా అక్టోబర్ 10, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీమతి రాధికా నోరి గారు "సి నా రె - యుగళగీతాలు" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు.

రాధిక గారు ముందుగా సి. నారాయణరెడ్డి గారి గురించి, ఎన్నుకున్న ప్రసంగాంశం గురించి మాట్లాడుతూ "నారాయణరెడ్డి గారు గొప్ప కవి, రచయిత, నాటకకర్త, సంగీతకర్త, గాయకులు, సాహితీవేత్త, ప్రొఫెసరు, రాజ్యసభ మెంబరు, సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత, అంతేకాకుండా మన సాహిత్య ప్రపంచంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా. ఈవేళ నేను చలనచిత్రాల కోసం ఆయన రాసిన గీతాల గురించి మాట్లాడదాము అనుకొంటున్నాను. ఆయన మన చలనచిత్రాలలో సుమారుగా మూడు వేలకు పైగా పాటలు రాశారు. అన్ని జానర్స్ లోనూ రాశారు. వాటన్నిటి గురించి చెప్పటం కూడా సాధ్యం కాదు. అందుకని కేవలం ఆయన రాసిన కొన్ని యుగళగీతాల గురించి మాత్రం చెప్పదలచుకున్నాను. యుగళగీతాలు అంటే రెండు గళాలు వున్న పాటలన్నమాట. అసలు నారాయణరెడ్డి గారు చలనచిత్రాలలో తన ప్రవేశమే ఒక చక్కటి యుగళగీతంతో మొదలెట్టారు. 1962 నుంచి రాసిన యుగళగీతాలు ఇప్పటికీ నవనూతనాలే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు." అని ప్రారంభించారు.

రాధిక గారు తమ ప్రసంగం ఆద్యంతం గొప్ప గానమాధురిమతో అన్ని గీతాల్ని గొంతెత్తి రాగయుక్తంగా ఆలపిస్తూ సభలోని వారందరినీ అలరించారు. ముందుగా సి నా రె గారి యుగళగీతాల్లో శృంగార గీతాల గురించి ప్రస్తావిస్తూ

"నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని / పూలదండవోలె / కర్పూర కళికవోలె / ఎన్ని యుగాలైనా / ఇది ఇగిరిపోని గంధం"

"ఏమో ఏమో ఇది / నాకేమో ఏమో అయినది/ ఈ వేళలో / నా గుండెలో / ఏదో గుబులవుతున్నది"

"సొగసైన కనులేమో నాకున్నవి / చురుకైన మనసేమో నీకున్నది / కనులేమిటో / ఈ కథ ఏమిటో / శృతి మించి రాగాన పడనున్నది / పడుతున్నది"

"బుగ్గ గిల్లగానే సరిపోయిందా / గిలిగిలి గిలిగిలి నవ్వగానే అయిపోయిందా"

వంటి గీతాల్ని ఉదహరించారు.

"అటు సందర్భానికి తగ్గట్లుగా, ఇటు అందరికీ సులభంగా అర్థం అయ్యేలా, ఇంకోపక్క ప్రాస బాగాకుదిరేట్టుగా, ఇలా అన్ని విధాలా నప్పేట్లుగా రాయటం ఆయన ప్రత్యేకత. అలాగే ప్రేమ గురించి నారాయణరెడ్డిగారి పాటలు వింటూ వుంటే ఇదే కదా నిజమైన ప్రేమ అనిపిస్తుంది." అంటూ

"జడలోన మల్లెలు జారితే / నీ ఒడిలో ఉన్నాననుకున్నా.. / చిరుగాలిలో కురులూగితే / నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో / ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా..!! / హసీనా.. ఓ.. హసీనా.."

పాటని పాడి వినిపించారు.

చిన్నప్పుడు నారాయణరెడ్డిగారి చదువంతా ఉర్దూ మీడియం లో జరిగింది. అందుకని ఆయనకి ఆ భాష మీద చాలా గొప్ప ప్రావీణ్యత వుంది. అవసరమైనపుడు సందర్భానికి చక్కగా అతికేటట్లుగా ఆయన ఉర్దూ పదాలు వాడేవారు. అవి అన్యభాషా పదాలుగా కాకుండా ఆ పాటలో కలిసిపోయేవి. అలాంటిదే ఈ పాట. ఈ పాటలో సిపాయి, హసీనా అన్నవి ఉర్దూ పదాలు. కానీ అవి సందర్భానికి సమకూరాయి కాబట్టి, ఆపాట పాడేవారు ముస్లిములు కాబట్టి ఆ ఉర్దూ పదాలని ఆయన తెలివిగా అక్కడ వాడుకున్నారు.

మరికొన్ని ప్రేమపాటలకి ఉదాహరణలుగా

"నీ నడకలోన రాజహంస అడుగులున్నవి"

"తడిసీ తడియని నీలికురులలో / కురిసెను ముత్యాలూ" మొ.వి పేర్కొన్నారు.

సినారె గారి పదమాధుర్యాన్ని వివరిస్తూ -

"లలిత లలిత యువ పవన చలిత పల్లవ దళాలలోనా / రమణీయ కుసుమ రమణీరంజిత భ్రమరగీతిలోనా"

"కెరటానికి ఆరాటం / తీరం చేరాలని / తీరానికి వుబలాటం / ఆ కెరటం కావాలని"

ఈ పదాలు వింటేనే చాలు, మనం తేలికగా చెప్పెయ్యచ్చు, ఈ పాట నారాయణరెడ్డి గారు రాసారని. ఆయన ముద్ర అన్నమాట." అని అన్నారు.

నారాయణరెడ్డిగారు సంభాషణ రూపం లో కూడా పాటలు రాశారు. 1963 లో అలాంటిదే ఈ పాట చాలా జనాదరణ పొందింది. ఇది ఇద్దరి ప్రేమికుల మధ్య పాటలాగా జరిగిన అతి సరళమైన, రాగయుక్తమైన సంభాషణ.

"మబ్బులో ఏముంది / నా మనసులో.. ఏముంది/
మబ్బులో..కన్నీరు / నీ మనసులో..పన్నీరు
నేనులో ఏముంది.. / నీవులో..ఏముంది
నేనులో..నీవుంది / నీవులో..నేనుంది"

వంటివి ఇందుకు ఉదాహరణలు.

నారాయణరెడ్డిగారి అత్యంత జనాదరణ పొందిన యుగళగీతాల్లో తోటలో నా రాజు పాట ఒకటి. విశ్వనాధగారి ఏకవీరను చలనచిత్రంగా తీసినప్పుడు నారాయణరెడ్డిగారు మొదటిసారిగా దానికి సంభాషణల తో పాటు కొన్ని పాటలు కూడా రాశారు.

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

నవ్వులా అవి కావు నవ పారిజాతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
అపరంజి కలలన్ని చిగురించునా

హీరో, హీరోయిన్ల ఉదాత్తమైన పాత్రలకి యుగళగీతాలు రాయటమే కాకుండా ఒక ప్రతినాయకునికి, అంటే, ఒక విలనుకి అన్నమాట, ఒక మంచి పాట రాసి అందరి మెప్పును పొందారు ఆయన. ఇప్పటిదాకా చలనచిత్ర చరిత్రలో దుర్యోధనుడి గురించి ఇంత అద్భుతమైన పాట రాసినవారు మరొకరు లేరు. హీరో, హీరోయిన్ల పాటలతో సమానమైన జనాదరణను పొందింది ఈ పాట.

మచ్చలేని నెలరాజువు నీవే
మనసులోని వల రాజువు నీవే

రాగభోగ సుర రాజువు నీవే

రాజులకే రారాజువు నీవే
ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా
స్వాగతం సుస్వాగతం

అంటే దుర్యోధనుడిలో  ఏవైనా కాస్త మంచి గుణాలు వుంటే వాటిని బయటికి వెలికి తీసి, అందరికీ తెలిసేలాగా వాటిని వర్ణించి, కాస్సేపు ఆయన దుర్గుణాలని మనందరం మర్చిపోయేలాగా చేసిన ఆ పాటని అంత జనాదరణ పాలు చేసిన ఘనత ఖచ్చితంగా నారాయణరెడ్డిగారికి చెందుతుంది.

ఇలా ఒకదాని మించి ఇంకొకటి ఎన్నో యుగళగీతాలు, ఎన్నో జానర్స్ లో నారాయణరెడ్డిగారు రాశారు. అన్నీ ఆణిముత్యాలే! అన్నీ జనరంజకాలే!

నారాయణరెడ్డి గారు రాసిన ఏ పాటైనా మన ఆత్మలను సంపూర్తిగా ఆకట్టుకుని వాటి చేత అనేక తీరుల పలికించాయి. అలాగే ఈ యుగళగీతాలు కూడా సున్నితంగా మన మనసులను తాకి వాటి భావాలు అక్కడ శాశ్వతంగా తిష్ఠ వేసేట్టు చేసాయి. చాలా సులభ రీతిలో, చాలా తేలికైన పదాలు వాడి, సందర్భానికి తగిన పాటలు, మనందరినీ సమ్మోహనపరిచే పాటలు రాసి నారాయణరెడ్డి గారు మన మనసులలో చెరగని ముద్రలు వేశారు." అని ముగించారు.

ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో డా||కె.గీత, శ్రీమతి భవాని, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ దాలిరాజు వైశ్యరాజు, శ్రీ టి. పి.ఎన్. ఆచార్యులు, శ్రీమతి రాధికా నోరి మొ.న కవులు పాల్గొన్నారు. ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొని సభను జయప్రదం చేశారు.

---------

https://sirimalle.com/vikshanam-110/

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-110-%e0%b0%b5/

https://www.koumudi.net/Monthly/2021/november/nov_2021_vyAsakoumudi_vikshanam.pdf


Monday, 19 September 2022

వీక్షణం సాహితీ గవాక్షం- నవమ వార్షికోత్సవం

 వీక్షణం సాహితీ గవాక్షం- నవమ వార్షికోత్సవం

వరూధిని
vikshanam-109

కాలిఫోర్నియాలో బే ఏరియాలోని వీక్షణం సాహితీ గవాక్షం 9వ వార్షిక సాహితీ సమావేశం సెప్టెంబరు 11, 2021 న ఆన్లైనులో జరిగింది. ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా||కె.గీత గారు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల  క్రితం ఒక చిన్న సమావేశంగా మొదలయ్యి ఇంతలోనే 9 సంవత్సరాలు అయ్యిందంటే ఆశ్చర్యంగా ఉందని అంటూ, తమలో సాహితీ స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ, ఉచిత, స్వచ్ఛంద వేదికగా సమావేశాల్ని జరపుకుంటూ వస్తున్న ఉన్నతమైన లక్ష్యానికి తనకు తోడ్పడుతున్న వీక్షణం సభ్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. వీక్షణం సభ్యులందరికీ వీక్షణమంటే కుటుంబజీవితం తర్వాత అతి ప్రధానంగా మారిన సాహితీ కుటుంబమని అన్నారు. పక్కా కార్యాచరణతో సమావేశాలు నెలనెలా క్రమం తప్పకుండా, ఆసక్తి కోల్పోకుండా నడపడం వెనక ఎడతెగని శ్రమ ఉన్నా అది చక్కని ఆనందాన్నిచ్చే శ్రమ అని,  గొప్ప బాధ్యత ఉన్నా అత్యంత ఆత్మీయమైన బాధ్యత అని అన్నారు. తర్వాత కిరణ్ ప్రభ గారు మాట్లాడుతూ వీక్షణం ఎప్పటికీ ఇలాగే ఒక ఆత్మీయ వేదికగా కొనసాగుతుందని, నిరంతర విజయానికి తోడ్పడుతున్న  మిత్రులందరికీ పేరుపేరునా అభివందనాలు తెలియజేసారు.  ఆ తరవాత వీక్షణం ప్రత్యేక సంచికల ఆవిష్కరణ  కిరణ్ ప్రభ, కాంతి కిరణ్  గార్ల  చేతుల మీదుగా జరిగింది. వీక్షణం ప్రత్యేక సంచికల పరిచయం వేణు ఆసూరి గారు చేశారు.

తర్వాత సుభాష్ పెద్దు  గారు “ఆమె ఎవరు?” అంటూ రవివర్మ చిత్రాలకు ప్రేరణగా నిలిచిన యువతుల గురించి ప్రసంగించగా,  శ్రీచరణ్ పాలడుగు  గారు  “కిరాతార్జునీయం” గురించి సోదాహరణంగా సంగ్రహ ప్రసంగం చేసారు. మంజుల జొన్నలగడ్డ గారు “తెలుగు కళాత్మక సినిమా కథల” గురించి, వేమూరి వేంకటేశ్వరరావుగారు “అమెరికా ఆంధ్రులు తెలుగు తల్లికి చేసిన సేవ” గురించి, మధు ప్రఖ్యాగారు యండమూరి నవలలు కలిగించిన  స్ఫూర్తి  గురించి, టి.పి.ఎన్.ఆచార్యులుగారు “రామాయణ రహస్యాలు” అంటూ ఆసక్తిదాయక ప్రసంగాలు చేశారు.







ఆ తరవాత  శ్రీ రావు తల్లాప్రగడ అధ్యక్ష నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనంలో అమెరికా కవులే కాకుండా భారతదేశం నుండి కూడా పాల్గొన్నారు. కవిసమ్మేళనంలో పాల్గొన్నవారు: శ్రీచరణ్ పాలడుగు, డా||కె.గీత, శ్రీధర్ రెడ్డి, దాలిరాజు వైశ్యరాజు, డా|| బాలకృష్ణారెడ్డి తాటిపర్తి, మధు ప్రఖ్యా, వజ్రాల రాజగోపాల్, హరనాథ్, రావు తల్లాప్రగడ, మారుతి తన్నీరు, స్వాతి ఆచంట, వరూధిని, పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, టి. పి. ఎన్. ఆచార్యులు, డా|| గోపాల్ నేమన మొ.న వారు.


చివరగా జరిగిన సంగీత విభావరితో వీక్షణం 9వ వార్షిక సాహితీ సమావేశం ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిలాషులు విశేషంగా హాజరయ్యి సభని జయప్రదం చేశారు. వీక్షణం లైవ్ సమావేశాన్ని వీక్షణం యూట్యూబ్ ఛానెల్లో ఇక్కడ  https://youtu.be/DvDY3SxJxEk చూడవచ్చు.

------

https://sirimalle.com/vikshanam-109/

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-109/

https://www.koumudi.net/Monthly/2021/october/oct_2021_vyAsakoumudi_vikshanam.pdf

క్షణం సాహితీ గవాక్షం -108 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం -108 వ సమావేశం

వరూధిని
vikshanam-108

వీక్షణం-108 వ ఆన్ లైన్ సమావేశం ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఆగస్టు 8, 2021 న జరిగింది.

ఈ సమావేశంలో తెలుగుతల్లి కెనడా మాస పత్రిక ఎడిటర్, రచయిత్రి శ్రీమతి లక్ష్మీ రాయవరపు (ఎన్నెల) గారి కథాపఠనం, చర్చ, కవిసమ్మేళనం, సాహితీ క్విజ్ జరిగాయి. ముందుగా లక్ష్మీ రాయవరపు గారు తెలంగాణా మాండలికంలో రాసిన "ఓ పాలబుగ్గలా జీతగాడా" కథని చదివి వినిపించారు.

పసితనం వదలని పాల బుగ్గల వయసులో రాజాలు తండ్రి చనిపోవడం, తల్లి అనారోగ్యం...దాంతో తానే అన్నీ అయ్యి చదువు ఆపి కూలికి వెళ్ళడంతో మొదలవుతుంది కథ. తల్లికి ఆసరా అని చిన్న వయసులోనే వివాహం, వెనువెంటనే సంతానం. స్నేహితులు వెళుతున్నారని, గుడిసె తనఖా పెట్టి విదేశీ యానం. నిండా పదహారేళ్ళు లేవు.. వయసు ఎక్కువ వేయించడం.. కానీ అదేమంత పెద్ద విషయం కాదుగా!!

ఆ దేశంలో కొంత కాలం బానే ఉంది. స్నేహితులు అందరూ కలిసి ఇళ్ళకి వడ్డీలు ఖర్చులకి పంపడమూ, అప్పుడప్పుడు పెద్దమేస్త్రి సహాయంతో ఫోన్ చేసి ఇంటి దగ్గర జాగ్రత్తలు చెప్పడం చేస్తూ, రోజులు నడుస్తున్న తరుణంలో రాజాలు మూడవ అంతస్తు నించి జారి పడడంతో జీవితానికి కోలుకోలేని దెబ్బ. కొద్దికొద్దిగా కోలుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంటికి అంతో ఇంతో పంపిస్తూ ఉండగా తల్లి చనిపోయిన వార్త. ఉన్న ఊరిని, కన్న తల్లిని, భార్యా బిడ్డలను వదిలి వెళ్ళినందుకు ప్రయోజనముందా అని దుఃఖం. వెళితే అక్కడ ఏం చెయ్యాలో తెలియని అయోమయం. తీరా తల్లి చావుకి వెళ్ళినా, తిరిగి రావడమవుతుందా అని అనుమానం. అప్పు తీరిందా అని ఆందోళన. తల్లి అంత్యక్రియలకి డబ్బు సర్దుబాటు కాదని భయాల మధ్య... ప్రయాణం ఖర్చు పంపితే అంత్యక్రియలు జరిగిపోతాయి కాబట్టి.. తను వెళ్ళకుండా ఉండడమే సరియైనదనే కఠినమైన నిర్ణయం. పదహారేళ్ళ పిల్లల మీద ఊహించని బాధ్యతల సారాంశమే "ఓ పాలబుగ్గలా జీతగాడా".

తరువాత జరిగిన చర్చా కార్యక్రమంలో శ్రీ శ్రీధర్ రెడ్డి , డా|| కె.గీత, శ్రీమతి ఉదయలక్ష్మి ముప్పలనేని, శ్రీమతి శారదా కాశీవఝల, శ్రీమతి భవాని ముప్పల, శ్రీ ప్రసాదరావు గోగినేని,  శ్రీ సాయి నిజాంపట్నం, శ్రీ రాజశేఖర్, శ్రీ ప్రసాద్ నల్లమోతు మొ.న వారు పాల్గొన్నారు. ఆశువుగా చెప్పినట్లున్న కథా సంవిధానం చాలా చక్కగా కుదిరిందని, కథని స్వగతంగా, మాండలికంలో చెప్పడం కథకి బలాన్నిచ్చిందని అన్నారు. అలాగే కథలో అరుదైన మాండలిక పదాలు ఎన్నో ఉన్నాయని కొనియాడారు.

ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో శ్రీమతి శారదా కాశీవఝల "తిరిగిరావా నేస్తం" కవితని, శ్రీ శ్రీధర్ రెడ్డి "త్రాసు" కవితని , డా|| కె.గీత "అసింట" అన్న కవితని చదివి వినిపించారు. ఆ తర్వాత శ్రీమతి శారదా కాశీవఝల ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ కార్యక్రమం అందరినీ అత్యంత అలరించింది.

ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిలాషులు పాల్గొని సభను జయప్రదం చేశారు. వీక్షణం-108 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు. 

https://youtu.be/TkFKjoWP8T4

------

https://sirimalle.com/vikshanam-108/

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-108-%e0%b0%b5/

https://www.koumudi.net/Monthly/2021/september/sept_2021_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ గవాక్షం -107 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం -107 వ సమావేశం

వరూధిని
vikshanam-107

వీక్షణం-107 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జూలై 11, 2021 న జరిగింది. ఈ సమావేశంలో  డా|| కె.గీత గారి కథాపఠనం, చర్చ, కవిసమ్మేళనం, శ్రీధర్ రెడ్డి గారి కవిత్వ సంపుటి "ప్రతిబింబం" ఆవిష్కరణ  జరిగాయి. ముందుగా డా|| కె.గీత గారు కాలిఫోర్నియాలోని వైల్డ్ ఫైర్స్ నేపథ్యంలో రాసిన కథ "ఇవేక్యుయేషన్" ను చదివి వినిపించారు. ఈ కథ జూలై 4న ఆంధ్రజ్యోతిలో అచ్చయింది.

ఈ కథలో ప్రధాన కథ ఒకపక్క విరుచుకుపడుతున్న విపత్తును గురించి తెలియజేస్తూ ఉన్నా, అంతర్లీనంగా కోవిడ్ కష్టకాలంలో భార్యా భర్తల మధ్య దూరమవుతున్న అనుబంధాన్ని చెప్పడం ప్రధాన ఉద్దేశ్యంగా కొనసాగింది. ఉద్యోగమే సర్వం అనుకునే భర్త, భర్తే సర్వమనుకునే భార్య. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంట అయినా జీవితాల్లోని ఒడుదుడుకులు ఎదురయినపుడు ఒకరినొకరు ఓదార్చుకోకుండా సమస్యని జటిలతరం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. ఇందులో భర్త శశాంక్ విపరీతమైన ఉద్యోగ వత్తిడి సతమతమవుతూ, ఇంట్లో వ్యక్తులను ప్రేమించడం మర్చిపోతూ, ఎమోషన్స్ లేకుండా తయారవుతున్న ఇప్పటి తరపు యువకులకు ప్రతీక. కథంతా భార్య పట్ల విసుగు, అసహనాలతో డాంబికాన్ని ప్రదర్శిస్తూ ఉన్నా చివర్లో దుఃఖ పడతాడు. ప్రతి మనిషిలోనూ లోపల్లోపలెక్కడో ఉన్న దుఃఖం బయటికి వచ్చే సమయం ఒకటుంటుంది అనే ముగింపుతో కథ ముగుస్తుంది. ఇందులో కథానాయిక రాగ సంయమనానికి ప్రతీక భార్య. హౌస్ వైఫ్ గా ఉంటూ మొక్కల సరక్షణలో ఆనందాన్ని పొందే మమూలు యువతి. కానీ భర్త బాధని సంయమనం తో అర్థం చేసుకోగలిగిన భార్య. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కథలో లేకున్నా పాఠకులు ఊహించుకోవడానికి తగిన స్పేస్ తో రాసిన ప్రయోగాత్మకమైన కథ ఇది. ఇక కార్చిచ్చుల నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పుడిప్పుడు అడవుల నుంచి, గడ్డిభూముల నుంచి ఊళ్ళకి రక్షణ కల్పించే మార్గాల గురించిన కూడా వివరణ ఇందులో కనిపిస్తుంది.

కథాపఠనం పూర్తి కాగానే జరిగిన విస్తృతమైన చర్చలో శ్రీ ఆరి సీతారామయ్య, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ బాలకృష్ణారెడ్డి, శ్రీ శ్రీధర్ రెడ్డి , శ్రీమతి కొండపల్లి నీహారిణి, శ్రీమతి షర్మిల, శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీమతి ఉదయలక్ష్మి మొదలైన వారు పాల్గొన్నారు. గీత గారు ఈ ప్రయోగాత్మక కథలో రెండు సమాంతర కథల మధ్య పాటించిన బాలెన్సుని కొనియాడారు. ఎన్నో రోజుల తరువాత ఒక గొప్ప కథను విన్న అనుభూతి కలిగిందన్నారు. కథావస్తువులో కొత్త డయాస్పోరా అంశాన్ని స్పృశించడమే కాకుండా, కథనంలోనూ కొత్తపుంతలు తొక్కించారని అన్నారు. తరువాత గీతగారు మాట్లాడుతూ కథా ముగింపు గురించి, కథనంలో పడ్డ కష్టం గురించి, ఆంధ్రజ్యోతి పాఠకుల ప్రశ్నల గురించి ప్రస్తావిస్తూ సభలోని వారి ప్రశ్నలతో కలిపి సమాధానాలు ఇచ్చారు.

ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో శ్రీ బాలకృష్ణారెడ్డి,  శ్రీ శ్రీధర్ రెడ్డి , డా|| కె.గీత తమ కవిత్వాన్ని చదివి వినిపించారు. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి గారి కవిత్వ సంపుటి "ప్రతిబింబం" ఆన్లైన్ ఆవిష్కరణ, పుస్తక పరిచయ కార్యక్రమం జరిగాయి. డా|| కె.గీత గారు "ప్రతిబింబం" పుస్తక పరిచయం చేస్తూ శ్రీధర్ రెడ్డి గారు పద్య, వచన కవిత్వ సమాహారంగా రచించిన ప్రతిబింబంలో వేటికవే ప్రత్యేకమైనవని, రాస్తున్న ప్రక్రియలో ఒదిగిపోయే శైలి, వస్తువులు శ్రీధర్ గారి సొంతమని అన్నారు. కవి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ వీక్షణం వల్లనే తాను రాయడం ప్రారంభించానని, ఇప్పుడిలా పుస్తక ఆవిష్కరణ వీక్షణంలోనే జరుపుకోవడం తనకు అత్యంత ఆనందకరంగా ఉందని పేర్కొన్నారు.

ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిలాషులు పాల్గొని సభను జయప్రదం చేశారు.

వీక్షణం-107 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు. 

https://youtu.be/TkFKjoWP8T4

-----------

https://sirimalle.com/vikshanam-107/

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-107-%e0%b0%b5/

https://www.koumudi.net/Monthly/2021/august/august_2021_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ గవాక్షం -106 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం -106 వ సమావేశం

వరూధిని
vikshanam-106

వీక్షణం-106 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆసక్తిదాయకంగా జూన్ 13, 2021 న జరిగింది. ఈ సమావేశంలో కా.రా. మాస్టారికి నివాళి గా "కాళీపట్నం రామారావు గారి కథలు" అనే అంశమ్మీద శ్రీమతి కొండపల్లి నీహారిణి గారి ప్రసంగం,  కవిసమ్మేళనం జరిగింది.

ముందుగా నీహారిణి గారు మాట్లాడుతూ కథానిలయం రూపకర్త, కథలకు చిరునామా కారా మాస్టారు గారి గురించి వీక్షణం లో మాట్లాడే అవకాశం కలగడం సంతోషదాయకమైన విషయం అని పేర్కొంటూ "ఎప్పుడో చదివిన కారా గారి కథలను మళ్ళీ ఇప్పుడు చదివి మరింత లోతుగా వారిని అర్థం చేసుకున్నాను" అన్నారు.

కాళీపట్నం రామారావుగారి కథల గురించి వివరిస్తూ "కవి క్రాంతదర్శి అనడం బహుశా: ఇటువంటి గొప్ప రచయితలు ఉంటారనే నిర్వచించి ఉంటారు మన పూర్వీకులు. ఇంతలా మనసుపెట్టి సమాజాన్ని పరిశీలించి, మంచి చెడులను కథలుగా మలిచిన కథా రచయితలు బహుతక్కువగా ఉన్నారు.

కాళీపట్నం రామారావుగారు కథలను అల్లలేదు. కథలలో జీవితాలను చూపించారు. మనుషుల అసలు నైజం ఎట్లా ఉంటుందో, అది ఎదుటి వారిపై ఏ విధంగా ప్రభావితం చేస్తుందో భూతద్దంలో చూపించారు. ఇది ఒక జాగరూకతను, ఒక తెలివిడి తనాన్ని నేర్పిస్తుంది. అందుకే వీరి కథలు చదవాలి. స్వార్థం, సంకుచితత్వం, దగాకోరుతనం, తొందరపాటుతనం కల మనుషులు ఎట్లా మనచుట్టూ ఉంటారో వీరి కథలు చెబుతాయి. ఇది హెచ్చరిక! ఇంతకన్న గొప్ప విధానమేమి ఉంటుంది బ్రతుకును సవరించుకో అని చెప్పడానికి? ఏఏ కాలానికి తగినట్టు ఆయా కథలున్నాయి. 40 వ దశకం లో అశిక్ష - అవిద్య, పెంపకపు మమకారం వంటి కుటుంబ సంబంధాల నేపథ్యం తో రాసిన కథలు గొప్ప కథలు. చిన్న చిన్న విషయాలనే పెద్దగా చేసి కుటుంబ కలహాలకు ఎట్లా దారి తీస్తారో చూపారు. అట్లే బయట ఎంగిలికి కక్కుర్తి పడితే ఎలా రోగాలపాలైతారో చూపారు. అరవైలలో ‘ఆదివారం’ కథ ఆలోచనాత్మకమైన కథ! తర్వాత కాలంలో రాసిన కథలు ఉన్నవారికి లేనివారికి మధ్యనున్న సన్నని గీత ఏదో పాఠకులకు చూపే కథలు. పీడితుల పక్షాన పిడికిలెత్తే కథకులౌతారు. తీర్పు, జీవధార, కుట్ర, చావు, ఆర్తి, చావు, యజ్ఞం వంటి కథలు ఈ కథలు. ఈ కథలలో సత్యాన్ని పేదల పక్షాన నిలబెట్టారు. ఈ సత్య నిరూపణ చేసే బాధ్యత మేధావులదే అన్నట్టు కొత్తదనంతో రాసారు. ఇదే తర్వాత తరం వారికి ఒక దిక్సూచి అనేంతగా గొప్ప భావనా బలంగా అయ్యింది.” అంటూ "కారా గారి కథలలో భౌగోళిక, విషయ విజ్ఞాన విశేషాలు ఉంటాయి. అట్లాగే రాజకీయ చారిత్రక ఆధారాలు ఉంటాయి. ప్రభుత్వాల పథకాలు, ఉద్యోగుల పనితీరు ఉంటుంది. గొప్పవాళ్ళ లో చాలా గొప్పవారు ఎలా ఉంటారో కడు పేదలు, నిరుపేదలు అట్లే ఉంటారు అని అంటారు. పూరి గుడిసెల, మాల వాడల వెలి జీవితాలను అత్యంత సహజంగా చిత్రించారు. ఆ ఇండ్లల్లోనే పుట్టి పెరిగిన వారేమో ఈ కథా రచయిత అని అనుకునేలా భాషను ప్రయోగించారు. ఎంతో ప్రేమ ఉండాలి ఆ బడుగు జీవులమీద. అప్పుడే అంత స్వచ్ఛందంగా రాయగలుగుతారు. పలుకుబళ్ళు, నుడికారపు సొగసుల పదాలు, సామెతలు కథలలో కనిపిస్తుంటాయి. పాత్ర చిత్రణ ఎంత హృద్యంగా ఉంటుందో సన్నివేశ కల్పనలు, సంభాషణా చాతుర్యమూ అంత హృద్యంగా ఉంటాయి. కథకు తగిన ముగింపు ఇవ్వడం తో కారా గారు మనసున్న పాఠకులను ఆలోచనల్లో పడవేస్తారు. “జీవితంలో సమస్యలను, ఆ సమస్యలకు కారణాలను తెలియజేసేదే మంచి కథ” అని గొప్ప నిర్వచనాన్ని ఇచ్చిన కాళీపట్నం రామారావు గారికి ఇది అక్షర నివాళులు." అని ముగించారు.

ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనం లో డా|| కె.గీత "అబ్బాయి ఇల్లు" కవితను, శ్రీమతి భవాని "మనవడా", శ్రీమతి నీహారిణి "సందేహ జీవనం" అనే కవితను,  శ్రీమతి గునుపూడి అపర్ణ "సద్గుణ సంపద" అనే కవితల్ని చదివి వినిపించారు.

ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో ఆసక్తి కలిగిన స్థానిక ప్రముఖులు పాల్గొని సభను జయప్రదం చేశారు.

వీక్షణం-106 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు. 

https://youtu.be/TkFKjoWP8T4

-----

https://sirimalle.com/vikshanam-106/

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-106-%e0%b0%b5/

https://www.koumudi.net/Monthly/2021/july/july_2021_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం సాహితీ గవాక్షం -105 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం -105 వ సమావేశం

వరూధిని
vikshanam-105

వీక్షణం-105 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆసక్తిదాయకంగా మే 9, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీమతి గునుపూడి అపర్ణ గార్ల కథా పఠనం, కవిసమ్మేళనం జరిగింది.

కథాపఠనంలో ముందుగా శ్రీధర్ రెడ్డి గారు "మాతృప్రేమ" కథను చదివి వినిపించారు.

“పండు పండు ముసలమ్మ! గింత ఫాస్టు రోడ్డు మీద కారు నడుపుకుంట పోతాందా?”, "వేడిగాలి ఏమంత పెద్దగ లేదు గని, ఎండ మాత్రం సుర్రుమంటాంది” వంటి సంభాషణలతో తెలంగాణా యాసలో రాసిన డయాస్పోరా కథ మాతృప్రేమ. ప్రపంచంలో ఎక్కడైనా తల్లి హృదయం ఒక్కటే అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ రాసిన చక్కని కథ. పాత్రలు సహజ సంభాషణలతో  కళ్ళ ముందు కదలాడినట్లు  ఉండడం ఈ కథలో విశేషం.

తర్వాత అపర్ణ గారి కథ "సంకర్షణ" పెళ్ళికి స్వస్తి పలికి, సింగిల్ పేరెంట్ గా కోరుకుని మరీ మారుతున్న యువత గురించిన ఆలోచింపచేసే విలక్షణమైన డయాస్పోరా కథ. కథలో ఆద్యంతం రెండు సంస్కృతుల మధ్య సంఘర్షణని స్పష్టం చేస్తూ ఇప్పటి తరాన్ని వారి ఇష్టాలకు వదిలివేయక తప్పదనే ముగింపుతో  కథకి బలాన్ని చేకూర్చారు రచయిత్రి.

ఈ కథలో తల్లి మానసిక వేదనని తేటతెల్లం చేస్తూ

"కొడుకులిద్దరూ పెరిగిపెద్దవాళ్లయి పెళ్లిళ్లు చేసుకుంటే కోడళ్ళు వస్తారుకదా అని ఎదురుచూస్తే, వీళ్ళకి పెళ్లీడు రావడం, అది మెల్లిగా దాటిపోవడం కూడా జరుగుతోంది. అది జరిగే ఆశ ఇప్పట్లో కనిపించడం లేదు. భర్తతో చెబుతే వాళ్లకి నచ్చినవాళ్ళని వాళ్ళే చూసుకుంటాం అన్నారు కదా, వాళ్ళ మానాన వాళ్ళని ఉండనీక మనం అందులో వేలు పెడితే ఏదైనా బెడిసికొట్టిందంటే మళ్ళీ మనమే బాధపడాలి అంటూ కొట్టి పారేస్తారు. కానీ పిల్లలు పెద్దవాళ్ళయ్యారంటే మనమూ అయ్యేముగా. ఇంకా ఎన్నాళ్ళు వేచి ఉండాలి? ఇదే ఇండియాలో అయితే ఈ పాటికి పిల్లలిద్దరికీ పెళ్ళిలై పిల్లలు కూడా పుట్టి ఉందురు. ఇక్కడ అమెరికాలో పిల్లల్తో పెళ్లి విషయం మాట్లాడడమే తప్పు." అని కొడుకు నిర్ణయం వెనక ఆలోచనారాహిత్యాన్ని ప్రశ్నించే తల్లి మాటల్ని “ఒక బాధ్యత గల వ్యక్తిగా తండ్రినవుతానని నిర్ణయించడానికి తగ్గ తాహతు శక్తి నీకు ఉన్నాయని మాకు తెలుసు. నీ నిర్ణయానికి అడ్డుపడే వాళ్ళం కాదని నీకు తెలుసు. కానీ శరత్, పిల్లలంటే నీ మనసులో ఇంత లేశభావం ఉన్నందుకు నాకెంతో సిగ్గుగా ఉంది. కనీసం పుట్టే పిల్లల పరంగా కొంచెమైనా ఆలోచించేవా? ఆ అమ్మాయో అబ్బాయో ఊహ తెలిసేక నాకు తల్లిని చూపించమంటే ఏమిటి నీ జవాబు? వారికి సంఘంలో ఎటువంటి గుర్తింపు ఉంటుంది. తోటి పిల్లలతో ఎటువంటి మాటలు ఎదుర్కోవాలి? వారు పడే క్షోభ, సంఘర్షణ, పూర్తిగా తల్లితండ్రులతో పెరిగిన నీకు అర్థం అవుతుందా?” అని తమలో తాము సర్దిచెప్పుకుంటూ భర్త భార్యతో "మనమేమీ తప్పు చేయలేదు. వాడూ ఏమీ తప్పు చేయలేదు. వాడు చేస్తానన్న పని దుర్మార్గం కాదు. కానీ వాడు ఎంచుకున్న మార్గం మనకి తోచదు, ఈ జన్మకి అర్థం కాదు. చూడు, భారతంలో బలరాముడు పుట్టుక ఒక విచిత్రం. దేవకీ వసుదేవుల శిశుకణాన్ని దేవకీ గర్భంలోంచి ఆకర్షించి బయటికి తీసి రోహిణి గర్భంలో పెడితే ఆవిడ తానే కన్నతల్లిననుకుని పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత గాని నిజం బయట పడలేదు. అందుకే అతనికి మరో పేరు సంకర్షణ. తెలిసింతర్వాత ఎవరూ అదొక పెద్ద విషయంగా భావించలేదు. ఎలా చేశారన్న ప్రశ్నలనవసరం. క్రమేణా అటువంటి పద్ధతులు పూర్తిగా తగ్గిపోయేయి. అందుకని మనకి ఇది వింతగా అనిపిస్తోంది." అన్న బలమైన సంభాషణలు చదువరులను ఆలోచింపజేస్తాయి.

యాదృచ్ఛికమే అయినా ఈ రెండు కథలు మే నెలలో మాతృదినోత్సవం, జూన్ నెలలో పితృదినోత్సవాలకు సరిగ్గా అమరినట్లు ఉండడం విశేషం. ఆ తర్వాత కవి సమ్మేళనం లో డా. కె.గీత "యుద్ధసమయం" కవితను, శ్రీమతి ఉదయలక్ష్మి "అవనీమాతకు అక్షరమాల" కవితను, శ్రీ శ్రీధర్ రెడ్డి "బిచ్చగాడు" అనే కవితను చదివి వినిపించారు.

ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో ఆసక్తి కలిగిన స్థానిక ప్రముఖులు పాల్గొని సభను జయప్రదం చేశారు. వీక్షణం-105 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో (https://youtu.be/40zNJK1mQIQ) ఇక్కడ చూడవచ్చు.

---------

https://sirimalle.com/vikshanam-105/

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-105-%e0%b0%b5/

https://www.koumudi.net/Monthly/2021/june/june_2021_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం సాహితీ గవాక్షం -104 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం -104 వ సమావేశం

వరూధిని
vikshanam-104

వీక్షణం-104 వ ఆన్ లైన్ సమావేశం, అత్యంత ఆసక్తిదాయకంగా ఏప్రిల్ 11, 2021 న జరిగింది.

ఈ సమావేశంలో శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా గారు "జాషువా కవిత్వం" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు.

"సుమారు 18వ శతాబ్దం వరకు ఛందోబద్దమైన సాహిత్యమంతా దైవ స్తుతుల్లోనో, పురాణేతిహాసాల్లోనో, రాజ మందిర చరిత్రలోనో, శృంగారవర్ణనల బాహుబంధాల్లోనో చిక్కుకుపోయిదని, అక్కడక్కడా వేమన పద్యాల్లోనో, శ్రీనాథుని చాటువుల్లోనో కనిపించినా వాటిని కావ్యాలుగా పరిగణించలేం" అని అన్నారు శ్రీధర్ రెడ్డి గారు.

"సుమారు 17~18 శతాబ్దాలలో సాంఘిక, సామాజిక అంశాల పట్ల గురజాడ, కందుకూరి, విశ్వనాథ, దువ్వూరి, దాశరథి, చిలకమర్తి, జాషువా మొదలైన కవులు వ్రాయటం మొదలెట్టినా ఎక్కువమంది కవులు సాంఘిక అంశాలకు కథ, నాటక, నవలా రూపాల్ని ఎంచుకున్నారు. జాషువాగారు మాత్రం ప్రాచీన ఛందోబద్ధమైన శైలిలోనే కొనసాగించారు. జాషువా గారి రచనాశైలి ప్రాచీనం కానీ, వస్తువు తత్కాల సామాజిక అంశాలు" అంటూ వివరిస్తూ

"జాషువా రచించిన కావ్యాల్లో ప్రసిద్ధిగాంచినవి గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తుచరిత్ర, కాందిశీకుడు, మరెన్నో ఖండకావ్యాలు. కాళిదాసు మేఘసందేశంలో ఇరువురు ప్రేమికుల మధ్య మేఘం రాయబారం నడుపుతుంది. కానీ గబ్బిలంలో కథానాయకుడు ఒక నిరుపేద దళిత వర్గానికి చెందిన కార్మికుడు. తాను అనుభవిస్తున్న కులవివక్ష, అస్పృశ్యత, దేవాలయ ప్రవేశ నిషేధం, శ్రమదోపిడీ  గురించి మధనపడుతూ, తన ఇంట్లో తిరుగాడుతున్న ఒక గబ్బిలంతో తనబాధలు వర్ణిస్తూ కైలాస శిఖరాన ఉన్న పరమేశ్వరుని వద్దకు రాయబారం పంపుతాడు. సరళమైన పద్యాలు గల ఈ కావ్యంలో హైందవ సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అత్యంత హృద్యంగా వర్ణించారు జాషువా గారు.హైందవం నిరంతరం తనను తాను సంస్కరించుకుంటూ, లోపాల్ని సవరించుకుంటూ పరిణామం చెందుతుందంటే. దానికి కారణం జాషువా లాంటి కవిబ్రహ్మలే." అన్నారు.

"కావ్యారంభంలో ఆ నిరుపేద అణగారినవర్గ నిర్భాగ్యుణ్ణి వర్ణిస్తూ,
“వాని రెక్కల కష్టంబు లేనినాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనముబెట్టు వానికి భుక్తిలేదు”

“వాని నైవేద్యమున నంటు వడిన నాడు
మూడు మూర్తులకును గూడ కూడు లేదు”

“ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
ఇనుప గజ్జెల తల్లి జీవనము సేయు
కసరి బుసకొట్టునాతని గాలిసోక
“నాల్గు పడగల హైందవ నాగరాజు”

అతను శ్రమించి పొలంలో కష్టపడితేనే పండిన పంట. దానికి “అంటు” ఉన్నదంటే  త్రిమూర్తులకు కూడా నైవేద్యం ఉండబోదు కానీ, అతని శ్రమమీద నిర్మితమైన హైందవ సమాజం అతన్ని చూస్తేనే అంటరాని వాడని బుసకొట్టి వెలివేసిందని తత్కాల సమాజాన్ని వర్ణిస్తూ హృదయాన్ని ద్రవింపజేసారు జాషువాగారు.

“కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు
కర్మమననేమొ దానికీ కక్షయేమొ
ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మ!”

పూర్వజన్మ కర్మఫలం వల్లనే ఈ జీవితం ఇలా ఉంది అని అంటున్నారు, ఆవిషయం ఈశ్వరుని వద్ద నిగ్గుదేల్చమని గబ్బిలంతో అంటున్నాడు.

“నేను నాకను నహము ఖండింపలేక
పదియు నెనిమిది శాస్త్రాలు పదునులుడిగె”

అష్టాదశ అధ్యాయాలతో వర్ధిల్లుతున్న భగవద్గీతను చదవటం తప్ప పాటించట్లేదని ఆవేదన పడుతున్నాడు.

“ధర్మసంస్థాప నార్థంబు ధరణిమీద
నవతరించెద ననె నబ్జభవుని తండ్రి
మునుపు జన్మించి నెత్తి కెత్తినది లేదు
నేడు జన్మింపకున్న మునిగినది లేదు”

అద్భుతమైన నిందాస్తుతి పద్యమిది. మునుపు అవతారమెత్తి మమ్మల్ని ఉద్ధరించింది లేదు. ఇపుడు రాకున్నా మాకు పోయేది ఏమి లేదు అంటూ.. దేవదేవునిపై నిందాస్తుతి.

“సహగమనాచార దహనదేవతలెన్ని
చిగురుగొమ్మల బూదిచేసెనొక్కొ?
చదువుదాచెడి దురాచరణ మెందరి కళా
భ్యసన చాతురి గొంతు బిసికెనొక్కొ?”

నాటి సమాజంలో సతీసహగమనం పేరుతో మొక్కుబళ్ల పేరుతో ఎందరు ఆడకూతుర్లు బలయ్యారో అంటూ దురాచారాల్ని ఖండించారు జాషువాగారు" అని ముగించారు శ్రీధర్ రెడ్డి గారు.

ఆ తర్వాత జరిగిన ప్లవ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. కవిసమ్మేళనానికి శ్రీ రావు తల్లాప్రగడ అధ్యక్షత వహించగా శ్రీ కిరణ్ ప్రభ, డా||కె.గీత, శ్రీ మధు ప్రఖ్యా, శ్రీమతి శారద కాశీవఝల, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ దాలిరాజు వైశ్యరాజు, శ్రీ తాటిపర్తి బాలకృష్ణారెడ్డి, శ్రీ వికాస్ విన్నకోట, శ్రీమతి గునుపూడి అపర్ణ, శ్రీమతి షంషాద్, శ్రీ  వరకూరు  గంగా ప్రసాద్  మొ.న కవులు పాల్గొన్నారు. శ్రీ  వరకూరు ప్రసాద్ గారు రాసిన లలితగీతాన్ని వారి కుమార్తె కుమారి ఈశా అతి శ్రావ్యంగా పాడడం విశేషం.

తరువాత కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరినీ అమితంగా అలరించింది. ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు విశేషంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. వీక్షణం-104 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు. 

https://youtu.be/zfo-CeoAg44

------

https://sirimalle.com/vikshanam-104/

http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-104-%e0%b0%b5/

https://www.koumudi.net/Monthly/2021/may/may_2021_vyAsakoumudi_vikshanam.pdf