Sunday, 10 August 2025

వీక్షణం-155వ సాహితీ సమావేశం

 వీక్షణం-155వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-155

వీక్షణం సాహితీ గవాక్షం కాలిఫోర్నియా 155వ ప్రపంచ సాహితీ సమావేశం జూలై 18, 2025 న అద్భుతంగా జరిగింది. కాలిఫోర్నియా కాలమానంలో సాయంత్రం 6.00కు ఈ సమావేశం గీతామాధవి గారి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. సహస్ర శీర్షా గీతాః సహస్రాక్షా సహస్రపాత్ అన్నట్లు ఆమెకు వేయి తలలూ, వేయి హస్తాలు వేయి మస్తిష్కాలూ! డా.గీతామాధవి గారు కవయిత్రి, రచయిత్రి, గాయని, నటి, అద్భుత ఉపన్యాసిని. అంతే కాదు దేశదేశాలు పర్యటించి సాహిత్యోపన్యాసాలు ఇస్తుంటారు. అమెరికాలో తెలుగు పాఠశాలల్లో పాఠ్యప్రణాళికాధికారిగా తెలుగు భాషోన్నతికి  కృషి చేస్తున్నారు. నెచ్చెలి పత్రికా సంపాదకురాలు కూడా! మరి, ఇన్ని పనులు ఏకకాలంలో నిర్వహించాలంటే అన్ని తలలు, చేతులు లేనిదే సాధ్యమా?

త్రయోదశాబ్దాలుగా వీక్షణం సాహితీ గవాక్షం నిరంతరాయంగా, నిరాటంకంగా ప్రతినెలా అంతర్జాల సాహితీ సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఎందరో విశిష్ట వ్యక్తుల ఉపన్యాసాలు వినిపిస్తూ, కవిసమ్మేళనలలో ఎందరో కవులను ప్రోత్సహించే ఇటువంటి సాహితీ సభ బహుశా ప్రపంచంలో మరొకటి లేదేమో!

ముందుగా గీతామాధవి గారు ఈనాటి ముఖ్య అతిథి ఆచార్య మాడభూషి సంపత్కుమార్ గారిని వేదికపై ఆహ్వానించి, వారిని సభకు పరిచయం చేశారు.

శ్రీ మాడభూషి సంపత్ కుమార్ గారు ఆధునిక తెలుగు కవుల్లో కవిగా, విమర్శకులుగా, అనువాదకులుగా సాహిత్యలోకంలో ప్రసిద్ధిచెందారు. వీరు 1959లో సెప్టెంబర్ 17వ తేదీన శ్రీనివాసాచార్యులు, పట్టమ్మ దంపతులకు చిత్తూరు జిల్లా దేవళంపేట, కమ్మపల్లె గ్రామంలో జన్మించారు. 1989 నుండి 12 సంవత్సరాల కాలం జర్నలిజంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం 2001వ సంవత్సరంలో మదరాసు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా చేరి, పదవీ విరమణ అనంతరం 2022 డిసెంబరు నుండి ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం, వెంకటాచలం, నెల్లూరు జిల్లాలో ఉన్న కేంద్రానికి సంచాలకులుగా తమ సేవలను అందిస్తున్నారు.

మాడభూషి సంపత్ కుమార్ బోడిదేవరపల్లెలో ప్రాథమిక విద్యను, కొత్తపల్లెమిట్టలో హైస్కూల్ విద్యను అభ్యసించారు.చిత్తూరు పి.సి,ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్, పి.వి.కె. ఎన్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసారు. ఆ తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు చదివి అక్కడే జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఎరుకల తమిళ బంధువాచకాలు- సామాజిక భాషాశాస్త్ర విశ్లేషణ అన్న అంశంపై 1986 లో ఎం.ఫిల్ డిగ్రీ పట్టభద్రులయ్యారు. ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ పర్యవేక్షణలో ఎరుకల భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రాసి మధురై కామరాజు విశ్వవిద్యాలయం నుంచి 1990లో డాక్టరేట్ పొందారు. అక్కడే మధుర రామనాథపురం జిల్లాలో తెలుగు భాషా, జానపద సాహిత్యంఅనే అంశంపై యూ.జి.సి.ప్రాజెక్టు కోసం పరిశోధన చేశారు. తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 2015లో అత్యాధునిక ఆధునిక తెలుగు కవితా దృక్పథాలు అన్న అంశంపై పరిశోధనచేసి డి.లిట్ పట్టాను పొందారు.

ఉద్యోగం ఆచార్యులే అయినా ఆయనలో ఉన్న కవితా పిపాస అడుగంటిపోలేదు. అదే ఆయన ప్రవృత్తి. సమాజంలో ఏ చిన్న విషయాన్ని చూసినా వెంటనే స్పందించి కాగితం మీద కలం పెట్టి అక్షరరూపం అమర్చేవారు. దేశ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై ఆలోచన మెండు. అందువల్లనే తనభావాలను కవితల రూపంలో వెలువరించేవారు. పేదల కష్టాలు, సామాన్యుల సమస్యలు, స్త్రీల దుఃఖాలు, సమాజంలో జరిగే దోపిడీలు, దేశభక్తి ఇలా చెప్పుకుంటూపోతే పలువిషయాలను కలంతో చెక్కేవారు. అలతి అలతి పదాలతో అనంత అర్థాలు వచ్చేవిధంగా చేసేవారు. బూదరాజు రాధాకృష్ణ, ఎ.బి.కె. ప్రసాద్, భద్రిరాజు కృష్ణమూర్తి తదితర భాషావేత్తల సాంగత్యం తెలుగు భాషను ఉన్నత శిఖరాలవైపు మరల్చేటట్లు చేసింది.

మాడభూషి వారి రచనలు సాహిత్యానికి, సమాజానికి కాకుండా భావి పరిశోధకులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. 2001 'గడ్డిపరకతో విప్లవం'తో మొదలుకొని 2023లో 60 శరత్తులు (వచన కవిత్వం) వరకు అనేక పుస్తకాలు, వందలకు పైగా వ్యాసాలను వివిధ కోణాల్లో వెలువరించారు.

అందుకున్న పురస్కారాలు:
ఆంధ్రభాషా విభూషణ - హైదరాబాద్ లయన్స్ క్లబ్, శిక్షక్ సింధు సమ్మాన్ - తమిళనాడు హిందీ అకాడమీ, విశ్వ హిందీ దీవస్,  తెలుగు వాఙ్మయ ప్రగతిరత్న - భాషా పరిరక్షణ సమితి, పుంగనూరు, కరుణ శ్రీ జాతీయ పురస్కారం - భారతీయ తెలుగు రచయితల సమాఖ్య - చిత్తూరు, కవికోకిల - యూనివర్సల్ ప్రిస్ క్రాస్ - చిత్తూరు జిల్లా, సాహిత్య రత్న అవార్డు - యూనివర్సల్ ప్రిస్ క్రాస్ - చిత్తూరు జిల్లా, జీవిత సాఫల్య పురస్కారం - కళాభారతి ఫౌండేషన్, రేవతి ఫౌండేషన్ - వి.కోట, శ్రీకృష్ణదేవరాయల జాతీయ పురస్కారం - లలిత కల సాగర్ - చిత్తూరు జిల్లా, శ్రీ నర్రా నరసయ్య కోటమ్మల స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం - కళామిత్ర మండలి - ఒంగోలు, తెలుగు వెలుగు అవార్డు - పెరంబూరు తెలుగు సాహితీ సమితి - చెన్నై, జీవిత కాల సాఫల్య పురస్కారం - ఆంధ్ర భాషా రంజని, తెలుగు శాఖ మద్రాస్ క్రైస్తవ కళాశాల - చెన్నై, తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారం-2019, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే "స్వర్ణ హంస" పురస్కారం మొ.నవెన్నో అందుకున్నారు.

మాడభూషి గారు ఆధునిక కవిత్వంపై అనర్గళంగా .50 నిమిషాలపాటు మాట్లాడారు. శ్రీ శ్రీగారి 'కవితా..ఓ కవితా ' అనే కవితను చదివితే ఆధునిక కవిత్వం ఎలా వ్రాయాలి అనే వారికి ఒక పాఠమే అన్నారు. వచన కవిత్వం ఒక ప్రజాస్వామ్యంలాంటిదేనన్నారు. కవులు వస్తువును ఎంచుకోవడంలో భాషాశైలిపై దృష్టి పెట్టాలన్నారు.కవిత్వ ప్రయోజనాలను వివరించారు. కవులందరూ వారి ఉపన్యాసాన్ని శ్రద్ధగా చెవులు రిక్కించి విన్నారు. వారి ఉపన్యాసంపై గీతగారు, సాధనాల వారూ, నేనూ, శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారూ స్పందించి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాము.

పిదప శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో కవిసమ్మేళనం ప్రారంభమైంది. తొలుతగా శ్రీ మాడభూషిగారు ' స్వర్గం ' అనే కవితను రసరమ్యంగా చదివి వినిపించారు. డా.గీతామాధవిగారు "మా పెరటి నారింజ చెట్టు తల్లైంది" అంటూ అద్భుతమైన భావుకతతో వినిపించిన "మా నారింజ చెట్టు"  కవిత అందరినీ ఆకట్టుకుంది. శ్రీ నాళేశ్వరం శంకరంగారు డాలర్ కాలం అనే సెటైరికల్ కవిత వర్తమానానికి అద్దం పట్టింది. చీదెళ్ల సీతాలక్ష్మి గారు ‘అంతం లేని వ్యధ’ అనే వారి కవితలో పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాక తలిదండ్రులు పడే వేదనను ఆర్ద్రంగా వినిపించారు. శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు కల్తీ అనే కవితలో సమాజంలోని అవినీతిని ఎండగట్టారు. శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడుగారు 'రిక్షావాలా 'అనే వారి కవితలో శ్రామికుల ప్రాధాన్యాన్ని వివరించారు. బుక్కపట్నం రమాదేవిగారు చిరుదరహాసం అనే కవితలో నవ్వు వైశిష్ట్యాన్ని అందంగా చెప్పారు.కొత్తూరు వెంకటరత్నం గారు  శ్రీనివాసునిపై భక్తి గీతాన్ని ఆలపించారు. బలుసాని వనజ గారు బోనాల పండుగపై శ్రావ్యంగా పాడారు. శ్రీ వెంకట రాజుగారు నాన్న గొప్పతనాన్ని తన కవితలో వినిపించారు. బూర దేవదానంగారు అమ్మపై చెప్పిన కవిత్వం బావుంది. శ్రీ అయ్యలరాజు సోమయాజుల ప్రసాద్ గారు భార్య మరణిస్తే "ఏదో తెలియని ఆవేదన" కవిత కన్నీరు తెప్పించింది. శ్రీ ఘంటా మనోహరం గారు ఆశాపరుల గురించి వ్యంగ్యంగా చెప్పారు. శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు ఆవకాయ గురించి చదివిన కవితకు అందరూ హాయిగా నవ్వారు. కందేపి రాణి ప్రసాద్ హస్తకళాకారుల గురించి చెప్పారు

సినీ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు తన విశ్వ శిఖరం అనే కవితలో మోసం చెయ్యడం మద్యం మూత తీసినంత సులభం అంటూ తన గంభీర స్వరంతో ఆవేశపూరితంగా చదివిన కవితకు చప్పట్లు మ్రోగాయి. అద్భుతం!, శ్రీ కందుకూరి శ్రీరాములు గారు మాట్లాడుకుందాం రా అంటూ మాటలు కనుమరుగౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదరావు రామాయణం అనే నేను "గంట నాటకం" అనే నా కవితలో ఈ జీవితం ఒక నాటకం. అందరూ అరువుగాళ్లే తెరపడగానే అందరూ రంగు తుడుచుకుని పోయే వాళ్ళే. ఈ మాత్రానికే ఇన్ని ఘోరాలు పాపాలు చెయ్యాలా అంటూ ప్రశ్నించాను.

కరాదుల అరుణ కీర్తి ప్రతాప్ రెడ్డి గారు సంగీతపు ప్రాధాన్యత తెలుపుతూ శ్రావ్యంగా, హాయిగా పాడి వినిపించారు. చాలా బావుందని అందరూ ప్రశంసించారు. అవధానం అమృతవల్లిగారు "నీవే నేనుగా" అనే కవితలో నువ్వెందుకు నా వెంటబడుతున్నావు అంటూ చదివిన కవిత అందరి ప్రశంసలను అందుకుంది. మేడిశెట్టి యోగేశ్వరరావు గారు భక్తి గురించి వ్యంగ్యంగా వ్రాసిన కవిత బావుంది. ఉప్పలపాటి వెంకటరత్నం గారు రైతుయొక్క ప్రాశిశ్త్యాన్ని తన గజల్ లో కమ్మగా పాడి వినిపించారు. కోదాటి అరుణ గారు తన "మనసులోని భావాలు" అనే కవితలో కవితాలక్షణాలగురించి చక్కగా వినిపించారు. పరాంకుశం కృష్ణవేణిగారు మార్గదర్శనం అనే కవిత చాలా పసందుగావుంది. చదివిన తీరు రమ్యంగా వుంది. దేవులపల్లి పద్మజ గారు, ‘భవిత’ అనే కవితలో గురువు యొక్క లక్షణాలను, ప్రాధాన్యతను వివరించారు. శ్రీ శ్రీమన్నారాయణ గారి కవితాంశం రమణీయంగా వుంది. డా.బృందగారు ప్రశ్నల నామావళి అనే కవిత చదవగా శోభాదేశ్ పాండేగారు బోనాలు పండుగ గూర్చి శోభాయమానంగా చదివారు. శ్రీ ఉమామహేశ్వర రావుగారు వర్ణపతాకం అనే కవితలో శ్రీ పింగళి వెంకయ్యగారి గురించి చెప్పారు. ఆనం ఆశ్రితారెడ్డిగారి గానం అద్భుతంగా ఉంది. శ్రీ వీరరాఘవులు గారు అక్షరాల సమాహారమే కవిత్వం అన్నారు.

చివరిగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు "తెలుగు తడాఖా" అనే కవితను చిక్కని స్వరంతో, కవితార్థాన్ని అభినయిస్తూ చదివిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ కవిత పేపర్లో ప్రచురితమై విశేష ఆదరణ పొందింది.

గీతగారి వందన సమర్పణతో ఈనాటి సాహితీ సభ పూర్తయింది. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-155/

https://www.koumudi.net/Monthly/2025/august/august_2025_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం-154వ సాహితీ సమావేశం

 వీక్షణం-154వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-154

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా 154వ.ప్రపంచ సాహితీ సమావేశం జూన్ 20, 2025 న అద్భుతంగా జరిగింది. కాలిఫోర్నియా కాలమానంలో సాయంత్రం 6.00కు ఈ సమావేశం గీతామాధవి గారి స్వాగత వచనాలతో ప్రారంభమైంది. ఈనాటి ముఖ్య అతిథి డా. టి.గౌరీశంకర్ గారిని గీతామాధవి గారు సభకు పరిచయం చేశారు.

హైదరాబాద్ లో జన్మించిన గౌరీశంకర్ గారు ప్రముఖ విద్యావేత్త, సాహితీమూర్తి. తెలుగులో ఎమ్మే, ఎంఫిల్, పీ ఎచ్ డీ చేశారు. సీనియర్ తెలుగు ప్రొఫెసర్ గానూ, జర్నలిస్ట్ గానూ పేరు ప్రఖ్యాతులు గడించారు. సమాచార పౌరశాఖలో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్ర భాషా సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా పని చేశారు. పరిపాలనా రంగంలోనూ, బోధనారంగంలోనూ అపారమైన అనుభవాన్ని గడించారు.

డా. టి.గౌరీశంకర్ గారు "తెలుగు భాష ప్రాచీనత- విశిష్టత" అనే అంశమ్మీద ప్రసంగించారు. తమ ప్రసంగంలో భాషకు నిర్వచనం దగ్గరనుండి వివిధ భాషలు ఎలా ఏర్పడినాయి, వాటి చరిత్రను వివరించారు. మనదేశంలో 1600 భాషలు ఉన్నాయని, అందు గుర్తింపబడిన భాషలు 22 అని చెబుతూ మన తెలుగు భాష ద్వితీయ స్థానం నుండి చతుర్థ స్థానానికి పడిపోవడం బాధాకరమని అంటూ దానికి గల కారణాలను వివరించారు. తెలుగుభాష యొక్క ప్రాచీనత, ప్రత్యేకతలు, వైశిష్ట్యాన్ని గురించి వివరించారు. సుమారు 45 నీ.సెలయేటి ఝరిలా వారు ప్రసంగించిన తీరు అనన్యం!

కొందరి శ్రోతల స్పందన పిదప శ్రీ రాజేంద్రప్రసాద్ గారు, శ్రీమతి కోదాటి అరుణ గారి అధ్యక్షతన కవి సమ్మేళనం ప్రారంభమైనది. తొలిగా శ్రీ గౌరీశంకర్ గారు చిన్న కవిత "నల్లని పలకపై తెల్లని గీతలు" చదివి వినిపించారు.

తరువాత కె.గీతగారు 'మిస్డ్ లెటర్' అనే తమ కవితలో ఉత్తరాలు వ్రాసుకునే మధురమైన రోజులను గుర్తు చేశారు.అద్భుతం!,మాటలు తెగిపడిన అవయవాలయ్యాయని వాపోయారు. శ్రీ నాళేశ్వరం శంకర్ గారు మాతృభాషను తల్లి అనురాగంతో పోలుస్తూ చదివిన కవిత అందరినీ ఆకట్టుకుంది. సినీ గేయచయిత మౌనశ్రీ మల్లిక్ గారు తన శ్రావ్యమైన కంఠంతో "అంతర్ముఖీనం" అనే కవితలో చెట్టూ, పుట్టా శుకపికాలు కూడా మనతో మాట్లాడతాయి మాట్లాడే మనసు మనకుంటే అని చెప్పారు. ఎంత అందమైన కవితో! శ్రీ ఘంటా మనోహర్ రెడ్డిగారు తనదైన తాళ ధ్వనితో 'ఘంటారావం 'అనే కవిత శ్రోతలను ఆకర్షించింది. శ్రీమతి కోదాటి అరుణగారు వీక్షణం సమావేశాల గురించి హాయిగా పాడారు.శ్రీ అయ్యలరాజు సోమయాజులుగారు యోగాగురించి చెబుతూ కాదేదీ వయసుకనర్హం అన్నారు. శ్రీ వెంకటదాస్ గారు తెలుగుభాషా ఔన్నత్యం గురించి కవిత చదివారు. శ్రీ వెంకటేష్ గారు తన కవితలో విద్యార్థులు ఎలా తమ మేధను ఉపయోగించుకోవాలో చెప్పారు. ప్రసాదరావు రామాయణం అనే నేను "పారేసుకున్నాడు మనిషి ఎక్కడో మానవతకే వరమైన మందహాసం" అంటూ మందహాసం మాయం కావడానికి గల పరిస్థితులను వివరించాను. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు 'క్రొత్త ప్రపంచం' అనే తన కవితలో తెలుగు వ్రాయడంలోని ఇబ్బందులను తెలియచేశారు. అరుణగారు రైతు నేపథ్యాన్ని తీసుకుని కమ్మని పాటపాడారు. చీదెళ్ల సీతాలక్ష్మి గారు "జీవన సంజీవిని" అనే వారి కవితలో యోగా ప్రాధాన్యాన్ని వివరించారు.

అవధానం అమృతవల్లిగారి కవిత అందరినీ ఆకట్టుకుంది. వెంకట సత్యమూర్తిగారు విమాన ప్రమాదాన్ని గురించి కవిత వినిపించారు. పరాంకుశం కృష్ణవేణి గారు" చిరునవ్వుల చిరునామా అనే కవిత అద్భుతం! శ్రీ గుర్రం మల్లేశం గారు "వెలుగు జిలుగు" అని తొలకరిపై పద్యాలు చదివారు. శ్రీ కమర గారు పంచభూతాలకు ప్రాణాలు వచ్చాయి అంటూ ఒక్కొక్క అగ్గికి ఒక్కొక్క రూపం చూపారు. శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావుగారు జీవితం అనే తనకవిత నర్తనంలా ఉంది. ఆనం ఆశ్రితారెడ్డి గారు విమాన ప్రమాదాన్ని గురించి కవిత్వీకరించారు. బృందగారు 'హృదయ హారతి' అనే తమ కవితలో యోగా ప్రాధాన్యతను చెప్పారు. పవిత్రగారు ఆడపిల్లల కష్టాలగురించి ఆర్ద్రంగా కవిత వినిపించారు.సుధా కొలచన గారు తెలివి తెచ్చుకో అనే తన కవితను తెలంగాణా యాసలో చదివి ఆకట్టుకున్నారు.శోభా దేశ పాండే గారు విమాన ప్రమాదంపై కవిత వినిపించారు. వనజ గారు  విద్యార్థులు బాధ్యత అనే అంశంపై గానించారు.

చివరిగా శ్రీ రాజేంద్రప్రసాద్ గారు తన సహజమైన గంభీర స్వరంతో 'సాహిత్య సౌరభాలు' అనే కవితతో నిజంగానే సౌరభాలు వెదజల్లారు. చివరిగా గీతామాధవి గారి వందన సమర్పణతో ఈనాటి సమావేశం ముగిసింది.

అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-154/

https://www.koumudi.net/Monthly/2025/july/july_2025_vyAsakoumudi_vikshanam.pdf

Wednesday, 11 June 2025

వీక్షణం-153వ సాహితీ సమావేశం

 వీక్షణం-153వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-153

మే16, 2025 న కాలిఫోర్నియా వీక్షణం153 వ అంతర్జాల సాహితీ సమావేశం, కవిసమ్మేళనం అద్భుతంగా జరిగింది. వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతామాధవి గారి స్వాగతవచనాలతో సభ ప్రారంభమైంది. ముఖ్య అతిథి శ్రీ నారాయణస్వామి వెంకటయోగి గారిని వేదికపైకి ఆహ్వానించి వారిని సభకు పరిచయం చేశారు.

శ్రీ నారాయణస్వామి గారు సిద్దిపేటలో జన్మించారు. వారు గొప్ప కవి, రచయిత, అనువాదకుడు. చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్. జేఎన్‌టీయూ, ఓ.యూలలో ఇంజనీరింగ్, అమెరికాలోని స్టీవెన్స్ లో ఎం.బీ.యే చేసారు. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా పనిచేసారు. గత 27 సంవత్సరాలుగా అమెరికాలో పని చేస్తున్నారు. 14ఏళ్ల పాటు విరసం సభ్యులు కూడా కొనసాగారు. మూడు కవితా సంకలనాలు ‘కల్లోల కలల మేఘం‘, ‘సందుక’, ‘వానొస్తదా’?, ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు ‘నడిసొచ్చిన తొవ్వ’, 'పదబంధం' దేశ దేశాల అనువాద కవిత్వం – ఇప్పటిదాకా ప్రచురణలు. ‘ప్రజాకళ’, ‘ప్రాణహిత’ పత్రికలని నడిపారు.

శ్రీ నారాయణస్వామి వెంకటయోగి గారు 'లాటిన్ అమెరికన్ కవిత్వం' అనే అంశంపై గంటకు పైగా అనర్గళంగా ప్రసంగించారు.లాటిన్ అమెరికాలో ఏయే దేశాలు ఉన్నాయో, ఆ దేశ మూలవాసుల భాషలను పెత్తందారులు ఎలాగ అణగద్రొక్కారో నుండి ప్రారంభించి, పాబ్లో నేరుడా, మార్కోస్ (నోబెల్ బహుమతి గ్రహీత) డెల్మార్ ఆగస్టు (స్త్రీ వాద కవయిత్రి) కవితలను ఉదహరిస్తూ తను తెనిగించిన కవితలు చదువుతూ ఆద్యంతం ఆసక్తిదాయకం గాను, విజ్ఞానదాయకం గానూ ప్రసంగించారు. జేమ్స్ జాయిస్ - యులిసిస్, గాబ్రియెల్ మార్కెజ్ - వందేళ్ల ఏకాంతం, ఎడ్వార్డో గాలియార్నో - వందేళ్ల దోపిడీ, మార్టిన్ కార్టెనీ - మూన్, హోవర్డ్ జిన్ - పీపుల్స్ హిస్టరీ ఆఫ్ అమెరికా, రూబెన్ డరివో - అజుల్, సీజర్ వలేహో - బ్యాక్ హెరాల్డ్స్, ట్రిల్స్, స్పెయిన్: “టేక్ దిస్ కప్ ఫ్రం మీ” మొ .నవి ప్రస్తావించారు. నోబెల్ బహుమతి పొందిన గాబ్రియెలా మిస్ట్రాల్, గాబ్రియెల్ మార్కెజ్, పాబ్లో నెరూడా, ఆక్టేవియో పాజ్ లతో పాటూ ప్రపంచ ప్రఖ్యాతి నొందిన ఆగస్టో పినొచే, బోర్గెస్ లూయీ జార్జెస్, డిమీరా ఆగస్తిని, వాంగార్డ్, ఆథోరైన్ కాస్టిలో, అలెజాండ్రా పిజార్నిక్, నికానోర్ పార్రా మొ .న కవులని పరిచయం చేసారు. స్వీయ అనువాదాలతో బాటూ, శ్రీశ్రీ అనువాదాల్ని వినిపించారు.  హంగ్రీ థర్టీస్- పేదవాళ్ల ఆగ్రహం, ఎక్కడ సత్యం-మాస్ ((సీజర్ వలేహో కవిత), నెరూడా రాసిన  మాచు పిచ్చు పై కవిత, నికానోర్ పార్రా "రైట్ యాజ్ యు విల్” కవితలు మొ .నవి ఇందులో కొన్ని మచ్చుతునకలు. ఒక కవితలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి: లిబర్టీ విగ్రహమైపోయింది కాబట్టి నేను లిబర్టీని చూడాలని ఎందుకు అనుకోవాలి?" మొ.న కవితా వాక్యాల్ని సభికులందరూ శ్రద్ధతో విన్నారు. కరతాళ ధ్వనులతో నారాయణస్వామి గారిని అభినందించారు.

తదుపరి వీక్షణం భారతదేశ ప్రతినిధి, సమన్వయకర్త శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు, కవిసమ్మేళన ప్రవీణ డాక్టర్ రాధా కుసుమ గారు చక్కగా కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. మొదటిగా డాక్టర్ కె.గీత గారు 'శాంతిమంత్రం' అనే శీర్షికతో యుద్ధం, శాంతికి మధ్య ఒక సరళలేఖ మాత్రమే అంటూ "యుద్ధం ఎవడికోసంరా" అని అడిగారు. యుద్ధమంటే మరణాలు, ఆక్రందనలు మాత్రమే అని ముగించారు. అద్భుతమైన కవిత సభికులు మనసును హత్తుకుంది. నాళేశ్వరం శంకరం గారు కూడా యుద్ధంలో నేతల రాజకీయవిన్యాసాల గురించి 'ఉన్మాదకాలం' అనే శీర్షికతో చక్కని కవిత వినిపించారు.

డాక్టర్ కోదాటి అరుణ గారు 'సుందరకాశ్మీరం'లో ఈ రక్తపాతం ఏమిటీ అని తమ కవితలో వేదనను వెలిబుచ్చారు. ఘంటా మనోహరరెడ్డి గారు 'ఘంటారావం' అనే తన కవితలో ఆనాటి దంపతులు వెలుపటి దాపటి ఎద్దులు, ఈనాటి దంపతులు ఉత్తర దక్షిణ ధృవాలు అంటూ ఈనాటి దాంపత్యాలపై ఆందోళన వ్యక్తపరిచారు. ప్రఖ్యాత కవి కందుకూరి శ్రీరాములు గారు కూడా 'సంగ్రామరంగం' అనే కవితను వినిపించారు. సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు "యుద్ధం జరగాల్సిందే" అంటూ జీవితంలో ప్రతి ఘట్టం యుద్ధమే కదా! దానిని ఎదుర్కోవలసిందేనంటూ విభిన్నమైన రీతిలో చదివిన కవిత అందరినీ ఆకట్టుకుంది. కొత్తూరు వెంకట గారు మాతృదేవోభవ అనే కవితను పద్యాలను వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. పెద్దూరి వెంకటదాస్ గారు మనసత్తా అనే కవితలో మనదేశపు సత్తాను చాటిచెప్పారు. అవధానం అమృతవల్లిగారు 'భావమేమి' అనే కవితలో మనిషి వక్రబుద్ధులను వ్యంగ్యాత్మకంగా వివరించారు. ప్రసాదరావు రామాయణం గారు 'నా ప్రకృతి నిదురబోయింది' అనే కవితలో భార్యను అమితంగా ప్రేమించిన భర్త తన సతి మరణిస్తే కాటిలో ఆమెను దహనం చేసిన అనంతరం అక్కడే కూర్చుని తనలో కలిగిన భావజ్వాలను వినిపించారు. ఆచార్య అయ్యలరాజు సోమయాజులు గారు 'పరమాత్ముడిచ్చిన వరమే' అనే కవితలో అమ్మాయి పుట్టగా ఆమెను వదిలేస్తే ఎవరో పెంచి పెద్దచేసి చదివించి మంచిగొప్ప ఉద్యోగినిని చేసిన యదార్థ గాథను వినిపించారు. నారాయణస్వామి వెంకటయోగి గారు "యుద్ధం" అనే దీర్ఘ కవితను చదివారు. దేశాలు ఆయుధాలు అమ్ముకోటానికి చేసే వ్యాపారం యుద్ధాలకు కారణం అన్నారు. దేవులపల్లి పద్మజ గారు ఆంధ్ర రాజధాని అమరావతిపై కవిత చదివారు. శ్రీమతి రాధాకుసుమ గారు హృదయగానం అనే తన కవితలో చిన్నతనంలోని ఆనందాలను వర్ణిస్తూ తను ఒక్కసారి బాల్యానికి పోతే ఎంత బావుండు అని అందమైన కవితను చదివారు. మేడిశెట్టి యోగేశ్వరరావు గారు సింధూరం అనే కవితలో ఉగ్రదాడి దానిని దీటుగా ఎదుర్కున్న మనగురించి వినిపించారు. బృంద గారు నవసమాజ నిర్మాణం యువత బాధ్యత అనే అంశాన్ని ప్రబోధాత్మకంగా చెప్పారు. ఉప్పలపాటి వెంకటరత్నం గారు యుద్ధం అనివార్యమైతే తలపడు అని తన 'కురుక్షత్రం' అనే కవితలో సూచించారు. శ్రీమతి పరాంకుశం కృష్ణవేణి గారు త్యాగం అనే కవితలో ఒక సిపాయి భార్య తన భర్తను యుద్ధానికి పంపుతూ ఆమె భావోద్వేగాన్ని ఆర్ద్రంగా చదివారు. డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు సిగ్గు పడాల్సింది మనిషి అనే కవితలో వృక్షం గురించి కవిత చదివారు. విలువల వలువలు విప్పేది మానవుడే అన్నారు. పరిమి వెంకట సత్యమూర్తి గారు 'రుధిర కాశ్మీరం' అనే కవితలో పెహల్గాం ముష్కర ఘాతుకాలను వివరించారు.

సత్యవీణ మొండ్రేటి గారు జీవజలధి గంగ అనే కవితలో గంగానది పవిత్రతను వివరించారు. బుక్కపట్నం రమాదేవి గారు 'ఎదలోయల్లో ఇంద్రధనస్సు' అనే కవితను చదివి అందరికీ ప్రేమను పంచండి అని సూచించారు. యువ కవయిత్రి ఆనం ఆశ్రితారెడ్డి గారు అక్షరం అనే కవితలో అక్షరం యొక్క ప్రాధాన్యతను వివరించారు. దీపక్ న్యాతి గారు సంకల్పించు సంకల్పించు అని అంటూ తను సృష్టించిన లఘుకవిత దివిటీని చదివారు. చిట్టాబత్తిన వీరరాఘవులు గారు అర్ధయాని అనే కవితలో ఆడపిల్ల ప్రాధాన్యతను గురించి చెప్పారు. కీర్తి పతాకరెడ్డి గారు భక్తి గజల్ శ్రావ్యంగా పాడారు. శోభ దేశ పాండే గారు డయాబెటిస్ అనే హాస్య కవితను చదివి నవ్వులు జల్లులు కురిపించారు. జోరు పవిత్ర కీర్తికృష్ణ గారు 'జాగ్రత్త' అనే కవితలో పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చక్కగా చదివారు. చివరిగా రాజేంద్రప్రసాద్ గారు తన గంభీరమైన కంఠంతో ఎలాంటి పదాలైనా కవి కలంలో సుందరంగా తయారవుతాయి అంటూ అద్భుతంగా చదివారు.

చివరగా గీతామాధవి గారు అందరూ పాటించవలసిన ఒక సలహా ఇచ్చారు. కొందరు కేవలం వాక్యాలు రాసి కవితలు అంటున్నారని, కవితాత్మకంగా వ్రాసి పేరు ప్రఖ్యాతులు పొందాలని అన్నారు. సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్య అతిథి గారికి, కవులకు ధన్యవాదాలు చెప్పి సమావేశాన్ని ముగించారు.

అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-153/

https://www.koumudi.net/Monthly/2025/june/june_2025_vyAsakoumudi_vikshanam.pdf

Monday, 19 May 2025

వీక్షణం-152వ సాహితీ సమావేశం

 వీక్షణం-152వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-152

వీక్షణం152వ అంతర్జాల సాహితీ సమావేశం ఏప్రిల్ 18, 2025న అత్యంత ఆసక్తికరంగా సాగింది. అతిథులకు, కవిమిత్రులకు సమూహ అధ్యక్షురాలు డా.కె.గీతా మాధవి గారు, సాహితీ ప్రేమికులు శ్రీ మృత్యుంజయుడు తాటిపామలగారు, సమూహ భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు తొలుత స్వాగతం పలికారు. 152 నెలలుగా నిరంతరాయంగా జరుగుతున్న వీక్షణంలో ప్రతిసారీ ఒక ప్రముఖ వ్యక్తిని సభకు పరిచయం చేసి వారి ద్వారా ఎన్నో సాహితీ ప్రక్రియా విశేషాలను తెలియజేయడం ప్రత్యేకత. ఈరోజు ముఖ్య అతిథిగా విశ్వపుత్రిక డా.విజయలక్ష్మీ పండిట్ గారిని సభకు పరిచయం చేశారు.

డా.విజయలక్ష్మిపండిట్ గారు పూర్వ చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందినవారు. వారు PhD చేసి డాక్టరేట్ పొందారు. గజల్ ప్రక్రియలో నిష్ణాతులు కావడమే కాకుండా, అనేక సాహితీ ప్రక్రియలలో విశేషమైన కృషి చేశారు. రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువదించారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

డా.విజయలక్ష్మిగారు తమ ప్రధాన ప్రసంగంలో గజల్ పుట్టు పూర్వోత్తరాల నుండి నేటి గజల్ రచనాశైలి గురించి వివరించారు. మత్లా, ముక్తా, కాఫియా, రధీఫ్ పదాలను సోదాహరణంగా వివరించారు. ప్రధానంగా ప్రేమను వస్తువుగా తీసుకుని గజళ్ళు వ్రాస్తారనీ, చక్కగా కొన్ని గజళ్ళు వినిపించి ముగ్ధులను చేశారు. గతులను విధిగా పాటించాలని నియమేమీ లేదని, భావం ముఖ్యమని తెలిపారు. దాదాపు గంటకు పైగా వారి ఉపన్యాసం ఆసక్తిదాయకంగా సాగింది.

తరువాత శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యాన కవిసమ్మేళనం జరిగింది. గీత గారు 'ఒదిగిన మనసున' అనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతాన్ని, "ఆమని గీతం పాడనా" అనే స్వీయ గీతాన్ని శ్రావ్యంగా గానం చేశారు. వారి మధురమైన గాత్రానికి ప్రశంసల జల్లు కురిసింది. డాక్టర్ అరవా రవీంద్ర గారు తడిసి తడిసి ముద్దైతిని అనే గజల్ చక్కగా పాడి వినిపించారు. అరుణ కీర్తి పతాకరెడ్డి గారు మరో గజల్ ను పాడి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీ ఉప్పలపాటి వెంకట రత్నం గారు వెన్నెల రేయంతా అనే గజల్ చదివి వినిపించారు. శోభాదేశ్ పాండే గారు ద్విచక్ర వాహనం అనే కవితను హాస్యాస్పోరకంగా చదివారు. డాక్టర్ కోదాటి అరుణ గారు కొరుప్రోలు మాధవరావు గారి గజల్ పాడి వినిపించారు. రామాయణం ప్రసాదరావు గారు నేను "వెళ్ళిపోతాను"అనే కవితలో ఈ కుళ్లిన జనారణ్యం విడిచి ప్రకృతితో మమేకమై పోతాను అనే కవితను చదివారు.

కమర గారు చితిరవ్వలు అనే కవిత చదివి అందరిచేత కన్నీరు కార్పించారు. కొత్తూరు వెంకట్ గారు 'మా అమ్మాయి సీమంతం' అనే కవితను నీవుండేది ఆకొండపై శైలిలో పాడారు. శ్రీ సాధనాల వేంకటస్వామి నాయుడు గారు గాలిలో దీపం అనే కవితను వినిపించారు. శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు ఒయాసిసులు అనే కవితా చదివి వీక్షకులను మంచినీరు త్రాగించారు. డాక్టర్ మోటూరు నారాయణరావు గారు గోడగడియారం అనే కవితను చక్కగా ఆలపించారు. అవధానం అమృతవల్లి గారు మరో గజల్ పాడి వీనులకు విందునిచ్చారు. శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావుగారు ఆవకాయ కవితను పాడి అందరికి తెలుగు వారి పచ్చడి ఆవకాయ రుచి అందించారు. శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు ఒకే కొమ్మ పువ్వులం అనే కవితను చదివి అక్కలను గుర్తుకు తెచ్చారు. ఉప్పలపాటి వెంకటరత్నం గారు రెండు చిటికినవెళ్ళు అనే కవితను రెండోసారి చదివారు. పరాంకుశం కృష్ణవేణి గారు చదివిన 'వేకువ కిరణాలు' అనే కవిత సభికులను ఆకర్షించింది. డాక్టర్ చీదేళ్ల సీతాలక్ష్మి గారు సీతారాముల కల్యాణం అనే గజల్ పాడి అలరించారు. వి కె సుజాత గారు ఆలోచనకు అక్షరాలకు మధ్య అనే కవితను వినిపించారు. శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు మౌనరాగం అనే కవితలో మౌనం ఓ దివ్యాస్త్రం అన్నారు. డాక్టర్ ఎం.ఎన్. బృంద గారు రససింధూరం అనే కవితలో ఎండాకాలంలో నిప్పు ఎరుపు ఎలావుంటుందో వర్ణించారు. కట్టా శ్యామలాదేవి గారు యువతా మేలుకో అనే కవితను చదివారు. ఖమ్మంజిల్లా యువ కవయిత్రి ఆనం ఆశ్రితారెడ్డి గారు నేటి జీవితం అనే శీర్షికతో చక్కని కవిత చదివారు. జోరు పవిత్రక్రిష్ణ గారు డబ్బు అనే కవితను చదివారు. డాక్టర్ రవీంద్రబాబు గారు మౌనపు గదిలో అనే గజల్ ను శ్రావ్యంగా పాడారు.

చివరగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు కొత్తగా గజళ్ళు వ్రాయాలనుకునే వారు మొదట వివిధ గతులు నేర్చుకొని వ్రాయటం మొదలు పెట్టాలన్నారు. గజళ్ళు గానయోగ్యం అయినవి మరియు విన సొంపైనవి అన్నారు. వారు చూస్తున్నా అంటూ పాడిన గజల్ సమావేశానికి పరాకాష్టకు తీసుకెళ్ళింది.

డాక్టర్ గీతా మాధవి గారు అందరికీ ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు. కవితలన్నీ బాగున్నాయని, సమావేశం ఆద్యంతం అద్భుతంగా సాగిందని, వచ్చేనెల సమావేశం కొరకు ఎదురు చూస్తున్నామని కవులు సంతోషం వ్యక్తంజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉత్సాహంగా పాల్గొని, అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-152/

https://www.koumudi.net/Monthly/2025/april/index.html

Wednesday, 9 April 2025

వీక్షణం-151వ సాహితీ సమావేశం

 వీక్షణం-151వ సాహితీ సమావేశం

-- అవధానం అమృతవల్లి --
Vikshanam-151

వీక్షణం సాహితీ గవాక్షం 151వ అంతర్జాల సాహితీ సమావేశం మార్చి14, 2025న రసవత్తరంగా జరిగింది. అతిథులకు. కవిమిత్రులకు డా. కె.గీతామాధవి గారు, శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల గారు, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు తొలుత స్వాగతం పలికారు. ఈ సమావేశంలో 150 సమావేశాల సమీక్షలతో సంచికను తీసుకువచ్చామని, అలాగే విశ్వావసు నామ సంవత్సర ఉగాది కవిసమ్మేళనం నిర్వహించుకోవడం చాలా ప్రత్యేకం అని చెప్పారు. బే ఏరియాలో కొద్దిమందితో మొదలైన వీక్షణం ప్రపంచవ్యాప్తంగా ఎదగడం ఊహించని మార్పు అని శ్రీ ఎం.జె గారు చెప్పారు. సెప్టెంబర్ 9న 2012లో వేమూరి గారింట్లో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తదుపరి ప్రతినెలా కాలిఫోర్నియాలో సమావేశాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళమని, కరోనా తర్వాత జూమ్ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం, అందులోనూ భారతీయ సాహితీ ప్రియులు పాల్గొంటూ ఉండడం విశేషమని గీత గారు వివరించారు.

వీక్షణం తొలినాళ్ళ నుండి ఇప్పటివరకు నిర్వహించిన సమావేశాల సమీక్షలతో కూడిన దాదాపు 400ల పేజీల ప్రత్యేక సంచికను శ్రీ రావు తల్లాప్రగడ గారు ఆవిష్కరించగా, కవి సమ్మేళనాన్ని శ్రీ మధు ప్రఖ్యా గారు, శ్రీ గుండ్ల పల్లి రాజేంద్రప్రసాద్ గారు నిర్వహించారు.ఈ సంచిక మొదటి సమావేశం నుండి మొదలుకొని 150 వ సమావేశం వరకు జరిగిన అన్ని సమావేశాల సమీక్షల సమాహార సంచిక. ఈ ప్రత్యేక సంచికకు అందమైన ముఖచిత్రాన్ని సమకూర్చిన శ్రీమతి కాంతి పాతూరి గారికి గీతగారు సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

కవి సమ్మేళనాలను, కవితలనూ గ్రంధస్తం చేసియుండవచ్చేమో కానీ ఇలా ప్రతి సమావేశంపై ఎవరెవరు పాల్గొన్నారో వాటి విశేషాలను, సమీక్షలను గ్రంధస్తం చేసిన వారెవరూ లేరని, ఉండబోరని, భవిష్యత్తులో ఇది సాహిత్యంపై ఎంఫిల్ చేసే వారికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదని మృత్యుంజయులు గారు చెప్పారు. శ్రీ మధు ప్రఖ్యా గారు ఒక ఆలోచన రూపుదాల్చి ఎదిగి నిరంతరం కొనసాగుతున్న పరిణితిని చూపుతోందని, వీక్షణం ప్రత్యేక పథం అని, ఇది ఒక చారిత్రక సంఘటన అని చెప్పారు. అంతేకాకుండా రానున్న ఒకానొక కాలంలో గీత గారిని గూర్చి పాఠ్య పుస్తకాల్లో చేర్చవచ్చని, ఆ క్షణాల్ని ఇప్పుడే వీక్షిస్తున్నామని చెప్పారు.

మొత్తం 33 మంది కవులు కవి సమ్మేళనంలో తమ కవితలు వినిపించారు. ముందుగా శ్రీ రావు తల్లాప్రగడ గారు గణేశస్తుతి కీర్తనను పాడి కవిసమ్మేళనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గీతగారు "అతని ప్రియురాలు" అనే కవితని చదివి కన్నీళ్లు తెప్పించారు. ఎందరి స్త్రీల గొంతుకలకో ఈమె గళం ప్రతినిధిగా నిలించిందని చెప్పక తప్పదు. కల్లోలాలని అంతరంగంలో దాచుకుని కెరటాలతో ఆడుతూ కన్నీళ్లను కలిపేసే స్థైర్యం ఆ కవితలో కనిపించింది. శ్రీధర్ బిల్లా గారు "పచ్చరాళ్లు" అనే కవితలో అగ్ర రాజ్య నిరంకుశత్వ ధోరణిని ఎండగట్టారు. ప్రకృతి సహజ సంపదే శాపంగా మారిన దౌర్భాగ్య స్థితిని ధిక్కార స్వరంతో వినిపించారు. ముప్పాళ్ళ భవానీ గారు "నా ఊహల్లో వసంతం" కవితని ఆలపించారు. మౌనశ్రీ మల్లిక్ గారు "కళ్ళజోడు" కవితలో జీవన సత్యావిష్కరణ చేసి కర్తవ్య బోధ జేశారు. సరిపల్లి మంజుల గారు "నీతి నీ గతి" అనే కవితను వినిపించారు. నేటి స్త్రీల పోకడలను పతనమౌతున్న నైతిక విలువలను సూటిగా వివరించారు. తాటిపర్తి బాలకృష్ణారెడ్డి గారు విశ్వావసు ఉగాది అమెరికా ఆంధ్రా కలయిక అనే కవితలో ప్రస్తుతస్థితి గతులను మనిషి జీవన శైలి అమెరికా ఆంధ్రా లో ఉన్న వైవిధ్యాన్ని చూపుతూ భారత సంస్కృతిని నిలపాలన్న ధ్యేయాన్ని వెలిబుచ్చారు. డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు "మనో నేత్రం విచ్చుకుంటే" అనే కవితలో నేటి సమస్యలు ఆవేదనతో పాటు అధిగమించే తీరును ఆశావహ దృక్పధంతో వివరించారు వారి కవితలో.

మోటూరి నారాయణరావు గారు "వేమన పద్యం మన జీవన సూత్రం" అనే కవితలో వేమన పద్యాల తీరును, సమాజమార్పుకై చేసినకృషిని వివరించారు. డా.పైడి నవనీత రవీందర్ గారు "కన్నీటి విలువ" అనే కవితలో స్వార్ధత నిస్వార్ధతల మధ్య అంతరాన్ని చక్కగా వివరించారు. రామకృష్ణ చంద్రమౌళి గారు "సోడా" కవితను చక్కగా పాడి అందరినీ ఆకట్టుకున్నారు. వంశీధర్ కుడికాల గారు "జ్వలనగానం" కవితలో వెలుగు అసత్యాల్ని పారద్రోలి సత్యాన్ని చూపుతుంది అని ఆవేదనతో కూడిన అగ్నిని పదాలపొందికలతో పటపట శబ్దాలని వినిపించారు. గౌడి సరిత గారు "నవవసంతాల ఉగాది సొబగులు" కవితలో ఉగాది ఆగమనాన్ని వివరించారు.

అద్భుతమైన రీతిలో వ్యాఖ్యానం చేస్తున్న మధు ప్రఖ్యా గారి గురించి మాట్లాడుతూ "ముఖే ముఖే సరస్వతి" అన్నట్లు కవిత్వం వారి నోట్లో నాట్యం చేస్తుందని, ఈ ఒక్కరోజుకై మిగిలిన 29 రోజులు ఎదురుచూస్తుంటానని కవిత్వమే శ్వాసగా జీవిస్తున్న తనకు ఈ రోజు చాలా సంతోషాన్ని ఇచ్చిందని గీతామాధవి గారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఆదిత్య మోపిదేవి (కమర) గారు "పునర్జన్మ ఉంటే బాగుండు"..అనే కవితలో ఒక్క సారి వెనక్కి వెళ్లి అవగాహనతో కూడిన ప్రవర్తన ఎలా ఉంటే బావుంటుందో ఆ జీవనం కోసం పునర్జన్మ ఉంటే బావుండు అని కోరుకున్నారు. రమాదేవి బుక్కపట్నం "నిన్నటి నేనుకై" అనే కవితలో ఉన్నకాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చక్కగా వివరించారు. అవధానం అమృతవల్లి గారు "సంయమన రథంపై శాంతి జెండా నెగరేస్తూ" అంటూ వసంతుని రాకకై ప్రకృతి ఆసాంతం ఎంత ఆశతో ఎదురుచూస్తూ ఎలా ముస్తాబయ్యిందో చదివి వినిపించారు.

మధు ప్రఖ్యా గారి సమీక్షకు స్పందించి గీత గారు కృష్ణ శాస్త్రి గారి 'మధూదయంలో మంచి ముహూర్తం మాధవి లతకు పెళ్ళీ పెళ్ళీ' అని పాటను గుర్తుచేసుకున్నారు. దేవులపల్లి పద్మజ గారు తెలుగు భాషపై చక్కని పద్యాలు చదివి వినిపించారు. పరాంకుశం కృష్ణవేణి గారు "పాడాలని ఉంది కోయిలనై" అంటూ చక్కని కవితను వినిపించారు.

పిమ్మట ఆచార్య అయ్యలరాజు సోమయాజులు ప్రసాద్ గారు "విశ్వావసు నీకు స్వాగతం" అంటూ ఉగాది సుఖశాంతులు తేవాలని స్వాగతం పలికారు. విశ్వ శాంతిని కోరారు తమ కవితలోడా.ఎన్.బృంద గారు జీవన రాగము కవితలో. మన దినచర్య గూర్చి సమయ విలువలను ఎలా పాటించాలో తెలిపారు.భోగెల ఉమామహేశ్వర రావు గారు ఉగాది గురించి చక్కని కవితను వినిపించారు. డా చీదేళ్ళ సీతాలక్ష్మి గారు "నవ వసంతం" గురించి చక్కటి పద్యాలను వినిపించారు. పరిమి వెంకటసత్యమూర్తి గారు "కళ్ళద్దాలు" గురించి హాస్య స్పూరకమైన కవితను చదివారు. డా.కోదాటి అరుణ గారు ఉగాది గూర్చి "వచ్చేనమ్మ వచ్చేను ఉగాది పండుగ వచ్చేను" అంటూ ఉగాది సంబరాలను వినిపించారు. బులసాని వనజ గారు "డ్రగ్స్" అంశంపై యువత పెడత్రోవపట్టడంపై ఆవేదన వ్యక్తం చేసే కవితను వినిపించారు. బోడిగం స్వాతి గారు "ఉగాది" ఉషస్సు అంటూ ఉగాదిని ఆహ్వానించారు. ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి గారు కవిని గాని నేను అంటూ ఆమె ఆశయాన్ని వెలువరించారు. ఉగాది గూర్చి ఆశావహ దృక్పధాన్ని ఆవిష్కరించారు.

చిట్టబత్తిన వీరరాఘవులు గారు "ఛిద్ర బ్రతుకు" అనే కవితలో రైతుల ఆవేదన వ్యక్తంచేశారు.మల్కాజి విజయలక్ష్మి గారు "ఆరిపోతున్న సూర్యుడు" అంటూ కవితలో సుఖదుఃఖాల్ని వివరించారు. ఆనం ఆశ్రీతరెడ్డి గారు "సాహిత్యంవైపు అడుగులు" అనే కవితలో కవిత్వం వైపు అడుగేయాలని సమాజ మార్పుకై కృషి చేయాలని చెప్పారు. మేడిశెట్టి యోగేశ్వరరావు గారు "ఆ మూర్ఖుడెవరు" అనే కవితలో యదార్ధ సంఘటనపై నాన్న పడ్డ శ్రమ, ఆవేదన అక్షరబద్ధంచేసి అద్భుతంగా వినిపించారు. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు చివరగా "ఉగాది ఊసులు" అనే కవితలో ఉగాది వస్తుంది, పలుకవితలకు నాంది పలుకుతుంది అని ఉగాది ఇచ్చే అనేక సంబరాలను, ముచ్చటలను వివరించారు.

చివరగా గీతామాధవి గారు ఇటీవల స్వర్గస్థులైన శ్రీ రామాయణం ప్రసాదరావు గారి సతీమణి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక నిమిషం సభలో మౌనం పాటింపజేసి, అందరికీ ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.

కవితలన్నీ బాగున్నాయని, కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా సాగిందని, వచ్చేనెల సమావేశం కొరకు ఎదురుచూస్తున్నామని కవులు సంతోషాన్ని వ్యక్తంజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉత్సాహంగా పాల్గొన్న ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-151/

https://www.koumudi.net/Monthly/2025/april/index.html

Thursday, 13 March 2025

వీక్షణం-150వ సాహితీ సమావేశం

 వీక్షణం-150వ సాహితీ సమావేశం

-- భవాని ముప్పాళ్ళ --
vikshanam-150

2012 సెప్టెంబర్ లో ప్రారంభమైన వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) అప్రతిహతంగా నెలనెలా కొనసాగుతూ, ఇప్పుడు 150వ సాహితీ మైలురాయికి చేరుకొని ఫిబ్రవరి 21, 2025న 150వ సాహితీ సమావేశాన్ని ఆన్లైన్ లో అతివైభవంగా జరుపుకుంది. ఈ సందర్భంగా జరిగిన వీక్షణం సమావేశంలో దాదాపు 50 మందికి పైగా కవులు, రచయితలు, సాహిత్యాభిలాషులు ఇటు అమెరికా నించి అటు భారతదేశం వరకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ 150వ వీక్షణం ప్రత్యేక సమావేశంలో 150 మంది కవులతో వచనకవిత్వ సంచిక ఆవిష్కరణ, పరిచయం వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా. కె.గీతామాధవి గారి ఆధ్వర్యంలో జరిగింది. హైదరాబాద్ కు చెందిన శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు వీక్షణం భారతీయ సమన్వయకర్తగా ఇతోధికంగా తోడ్పడ్డారు.

సమావేశంలో ముందుగా ‘వీక్షణం’ విజయసారథి, డా.కె.గీతామాధవి గారి తొలిపలుకులతో కార్యక్రమం మొదలైంది. వీక్షణం మొట్టమొదట పదమూడేళ్ల కిందట 2012లో ఎలా మొదలైందో, ఎన్నో కష్టనష్టాల కోర్చి, ఈ రోజు వెయ్యిమంది సభ్యులతో 150వ సమావేశాన్ని జరుపుకునే ఎత్తుకు ఎదిగిన తీరుని ఎంతో ఆత్మీయంగా వివరించారు. అది ఖచ్చితంగా గీతగారి సాహిత్య పిపాస వలన మాత్రమే అని మనకు అర్థమవుతుంది. కేవలం సాహిత్యం మీద వారికున్న ఆసక్తిని నలుగురితో పంచుకోవాలన్న తపన ఈ కృషికి నాంది పలికింది. అమెరికాకు, ఇండియాకు, ఆమె ఒక సారధిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె వీక్షణం కోసం కృషి చేసిన వారందరినీ పేరుపేరునా జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసారు.

తరువాత గుండ్ల రాజేంద్రప్రసాదుగారు కూడా ఆమెను ప్రశంసిస్తూ ఆవిడ పదిచేతుల్తో పనిచేస్తారన్నారు. అకుంఠిత దీక్షతో చేయబట్టే, వీక్షణం ఇంతటి విజయాన్ని సాధించిందన్నారు. "ఆయన తన కుడిచేయి" అని గీతగారు తన ప్రసంగంలో చెప్పారు. వీరిద్దరి సాహిత్య కృషి నిజంగా ప్రశంసనీయం.

తరువాత ‘వీక్షణం’ తొలి రోజుల నించీ సభ్యులైన మృత్యుంజయుడు తాటిపాముల గారు మాట్లాడారు. ఆయన వీక్షణంమొదటి సమావేశం కొద్దిమందితో వేమూరి గారింట్లో ఎలా ప్రారంభమైందో వివరించారు. గీత గారి కృషి వల్ల, ఈ 150 వ సాహితీ సమావేశ సందర్భంగా వెలువరించబడుతున్న 150 మందితో తీసుకువచ్చిన అద్భుత కవిత్వ సంకలనం గిన్నిస్ బుక్ గుర్తింపుకు రావాలి అన్నారు. ఇన్నినాళ్లుగా ఆమె ఎవరిదగ్గరా ఆర్థిక సహాయం ఆశించకుండా, తను స్వయంగా నిర్వహిస్తున్నందుకు ఆమె కృషిని ప్రశంసించాలి అన్నారు.

తరువాత చిమటా శ్రీనివాస్ గారు ప్రసంగించారు. గీతగార్ని "One woman army" అని ప్రశంసించారు. ఆరంభ శూరత్వంగా కాకుండా సంవత్సరాల తరబడి ఈమె కార్యక్రమాలు స్వయంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇటువంటి సాహితీ సేద్యం ఈమెకే సాధ్యం అన్నారు.

తరువాత ప్రఖ్యాత సినీ గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు ప్రసంగించారు. వీక్షణం ద్వారా ఎంతో సాహితీ మిత్రులను కలిశామన్నారు. తరువాత శ్రీ కందుకూరి శ్రీరాములు గారు మాట్లాడారు. గీతగార్ని ముప్పది మూడు సంవత్సరాలుగా ఎరిగిన మనిషిగా ఆమె ఎలా ఎదిగారో ఆయన వివరించారు. స్థాయీభేదం లేకుండా రచయితలందర్నీ ఆమె సమంగా ఆదరించారని, ఆయన ప్రశంసించారు. తరువాత ప్రసాదరావు రామాయణం గారు, గీత గారిపై చాలా చక్కని కవిత వినిపించి అభినందనలు తెలిపారు.

తరువాత ఈ వీక్షణం 150వ సాహితీ సమావేశ150 మంది కవుల, కవయిత్రుల ప్రత్యేక కవితా సంకలన ఆవిష్కరణ అత్యంత అద్భుతంగా, అపూర్వంగా కొనసాగింది. గీతగారు పుస్తకానికి అందమైన ముఖచిత్రాన్ని అందజేసిన శ్రీమతి కాంతి కిరణ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సంకలనం కోసం అహోరాత్రాలు తనతో కలిసి కృషి చేసిన రాజేంద్రప్రసాదు గారి శ్రమ మరువలేనిదన్నారు.

సుప్రసిద్ధ కవి, విమర్శకులు శ్రీ నాళేశ్వరం శంకరం గారు ఈ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రత్యేక సంచిక అద్భుతంగా ఉన్నదని, కవితలు చాలా గొప్పగా ఉన్నవని ప్రశంసించారు. 150 మంది కవులలో 53 మంది మహిళలు ఉండటం, 42 మంది కవులు అపార అనుభవము ప్రతిభ ఉన్న కవులు ఉండటం గర్వించదగ్గ విషయమని చెప్పారు. వీక్షణం స్థాపించి 13 సంవత్సరాల నుండి అప్రతిహతంగా సాగుతున్నదని,  వీక్షణం అధ్యక్షురాలు డా.గీతగారికి, అందుకు సహకరిస్తున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

పిమ్మట కవి, రచయిత, వ్యాసకర్త, ఉపన్యాసకుడు, వ్యాఖ్యాత, నటుడు, దర్శకుడు డాక్టర్ కె.జి.వేణు గారు పుస్తకంలోని పెక్కు కవితలపై చక్కని సమీక్ష చేసి అందరినీ అలరించారు. వివిధ కవుల కవితలను చదివి, విశ్లేషించి శ్రోతలను ఆకట్టుకున్నారు. కవిత్వమంటేనే సంస్కారమన్నారు. అన్ని కవితలు మంచి స్థాయిలో వున్నప్పటికీ, సమయం కారణంగా కొన్నిటిని ప్రసంగిస్తున్నానన్నారు. వేణు గారి ప్రసంగం నదీ ప్రవాహంలాగా, జలపాతంలాగా అరగంటపై సాగింది.

తరువాత మనోహర్ రెడ్డిగారు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ సంకలనాన్ని "సాహితీ మహా కుంభమేళ" అని ప్రశంసించారు. ముందు తరాలకు ఉపయోగపడ్తుందన్నారు. శ్రీధర్ బిర్లాగారు మాట్లాడ్తూ వీక్షణం వల్లనే కవినయ్యానని అభినందనలు తెలుపుతూ, ఇదొక ‘‘మహాయజ్ఞ"మన్నారు. వెంకట్ కొత్తూరు గారు మాట్లాడుతూ ఈ 150 వ సమావేశాన్ని 'పంచదశాధికశత' సమావేశం అంటూ తానూ ఈ మధ్య వీక్షణం లో భాగస్వామ్యమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మల్యాల మనోహర్ రావుగారు తమ కవితను ప్రచురించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మొత్తమ్మీద వీక్షణం 150వ సమావేశ ప్రత్యేక కవిత్వ సంచిక కవితలపై నాళేశ్వరంగారు, వేణు గార్ల విశ్లేషణలు, భోగెల ఉపమామహేశ్వర్రావు గారు చేసిన సమీక్షలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి:

ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షురాలు, కవయిత్రి, గాయని, నెచ్చెలి మాసపత్రిక నిర్వాహకురాలు అయిన డాక్టర్ కె.గీత గారు మొదటి కవితలో"కిటికీ మూసుకునేవరకు" కవితలో తెల్లవారి నిద్రలేవగానే తనను సైబర్ ప్రపంచంలోకి రివ్వున విసిరేసే జీవనవిధానం ఎలా ఉంటుందొ చక్కగా వర్ణించారు. తెల్లవారితే చరవాణిలో చాటింగ్ మొదలు మరల నిద్రించేవరకు అదే కిటికీ మూసుకునేవరకు కవిత కిక్ ఇచ్చిందని చెప్పవచ్చు . అదే విధంగా 'తదుపరి ప్రశ్న' అనేకవితలో - శ్రీధర్ రెడ్డి బిల్లా హక్కులు, చట్టాలు, ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వడాలు, ఆపై అక్రమ అరెస్టులు గురించి క్లుప్తంగా వర్ణించారు.

ఇంద్రధనస్సులు అనే కవితలో ఏనుగు నరసింహారెడ్డి గారు అతడికి, ఆమెకు ఉన్న బేధాభిప్రాయాలు, ఆమెలో ఇతనికి, ఇతనిలో ఆమెకు నచ్చని విషయాలు వర్ణించారు.

'నదులు వేరైన చోట' అనే కవితను డాక్టర్ గీత గారి తల్లి శ్రీమతి కె.వరలక్ష్మి ఎవరి జీవితం వారిదే అన్నట్టు జీవితాలు జీవిస్తున్నారని, నదులు ఏ విధంగా పొంతన లేకుండా ఉన్నాయో జీవితాలు కూడా అంతే అని  కవిత రూపంలో వర్ణించారు.

'విశ్వ నరుడు' అనే కవితలో జాషువా రచించిన గబ్బిలం నవలలో చెప్పినట్లు తెలుగు పలుకుబడులు అంటూ సాదనాల వేంకటస్వామి నాయుడు సమాజంలో రుగ్మతలు గురించి వర్ణించారు.'అశ్రువొక్కటి 'కవితలో వ‌సీరా మనుషులు మనుషులనే దోచుకునే విధానం కుంభమేళాలు, పక్షులు జంతువులను ప్రేమించాలంటూ జంతువులు హింసించే విధంగా జల్లికట్టు పండగలు జరిపే విధానాన్ని నిశితంగా విమర్శిస్తూ చేసిన వర్ణన బాగుంది.

సాహితీ సంద్రం కవితలో ఏదైనా ఒక సామాజిక అంశం, ఒక వస్తువుని తీసుకొని అక్షర రూపంలో కవిత లేదా కథ రాయవచ్చునో కందుకూరి శ్రీరాములు తెలిపారు.

'రవినై....శశినై....కవినై'.. కవితలో ప్రపంచంలో చెట్టు, సూర్యుడు, చంద్రుడు, మేఘం అంశాలను తీసుకుంటూ వాటి ధర్మం ఎలా అయితే నిర్వహిస్తున్నాయో మానవుడు కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నిర్వహించడం మంచిది అంటూ, తేనె లాగా తీపినందిస్తానంటూ కవిగా కవితల ద్వారా సామాజిక అంశాలపై కవితలు రాసి ధర్మం పాటిస్తానని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ చాలా చక్కగా రాశారు.

కవిత్వం కవితలో రాయాలని రాయడం, చెప్పాలనేది చెప్పడం కవికే సాధ్యమని మౌనశ్రీ మల్లిక్ కవితా రూపంలో తెలియజేశారు. 'క్షణ-క్షణ-వీక్షణం' కవితలో ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు ఎలా ఉంటానో క్షణం చిత్రం, క్షణం మాయ, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు అంటూ ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి తన కవితలో అక్షరాలను అలరించారు.

'గుండెల్లో భూగోళం' కవితలో నేటి సమాజంలో ఆడది పడుతున్న అగచాట్లు అంశంగా తీసుకొని కొండపల్లి నీహారిణి ఒక స్త్రీగా ఆవేదన వెల్లబుచ్చారు.

'ఏ మనిషి చరిత్ర చూసినా' కవితలో మనిషి మనిషికి ఒక చరిత్ర, సుఖదుఃఖాలు, పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు బాధలు బందీలు ఆది మోపిదేవి కవిత రూపంలో వర్ణించారు.

'కవన కళ' కవితలో చుట్టూ ఎదిగితే ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, చెట్టు చనిపోతే ఎలా ఉంటుందో చక్కగా నాళేశ్వరం శంకరం వర్ణించారు.

'నమ్మండి నేను అనాధను' కవితలో మనుషుల్లో ఉన్న ధ్యాస భావాలు, ప్రేమ తత్వం లేకపోవడం,, స్వార్ధాలు పైన డాక్టర్ కె.జి.వేణు చక్కగా కవిత రూపంలో వర్ణించారు.

'భలే  భలే బడిపంతులు' కవితలో పూర్వం బడిపంతులు డాక్టర్,యాక్టర్, పురోహితుడు అన్నింటతానై గ్రామాల్లో ఏ విధంగా వ్యవహరించువారు చక్కగా దాలి.వి అభివర్ణించారు.

'శంకరాలు' కవితలో మానవుడు సమస్యల్లో చిక్కుకోవడం, ప్రతిదానికి చాదస్తంగా శంకించడం ప్రశ్నలు వేయడం డాక్టర్ శంకర నారాయణ కవిత రూపంలో వర్ణించారు.

'స్నేహ బంధం' కవితలో సమస్యలు, జరుగుతున్న సంఘటనలను స్నేహ బంధాలు ఎలా ఉంటాయో దాస్యం సేనాధిపతి కవిత రూపంలో వర్ణించారు.

'సహనం' కవితలో ఆమె స్త్రీగా ఆడది ఆగచాట్లు,, బాధలు స్త్రీలు పడుతున్న ఇబ్బందులు ఆడది ఆత్మాభిమానం డాక్టర్ రాధా కుసుమ చక్కగా ఆవేదనగా వర్ణించారు.

'మరువలేని జ్ఞాపకాలు' గత సంవత్సరం జరిగిన సంఘటనలు, నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై నారాయణ మద్దిరాల అక్షర రూపంలో చక్కగా వర్ణించారు.

'సర్వజనహితం -సాహిత్యం' కవిత లో సాహిత్యంతో సమస్యలు పరిష్కరించవచ్చు,, సంస్కారాలను ఉద్ధరించవచ్చు అని బంధకవి శ్రీనివాస రామారావు చక్కగా వర్ణించారు.

'మౌన ప్రవాహం లోకి' కవిత లో చనిపోయిన మనిషి, చితి మంటలు దాకా వెళ్లే పరిస్థితిపై, శవానికి ఏమి తెలుసు అన్నట్టుగా నిర్జీవ శరీరం ఊహిస్తున్నట్టుగా పిళ్ళా వెంకట రమణమూర్తి ఊహ కవిత ఊగిసలాడింది.

'అయ్య లేని నులక మంచం' కవితలో తన నాన్న కాదు అందరి నాన్నలు కూడా నడక మంచం,ఉత కర్ర అరిగిపోయిన తోలు చెప్పులు  జీవన విధానంపై రాము కోలా చక్కగా జ్ఞాపకాలను రచించారు. 'అబద్ధమా!' కవిత లో ప్రస్తుతం సమాజంలో కోర్టులలో, కార్యాలయాలలో అబద్దాలతో నిత్య కృత్యమై ఎలా జీవిస్తున్నారు ప్రసాదరావు రామాయణం చక్కగా కవితా రూపంలో వర్ణించారు. అదేవిధంగా అనేక కవితలను కవులు బహు పసందుగా వ్రాసి అందరి మన్ననలను పొందారు.

సమయ పరిమితి కారణంగా, కొందరికి మాత్రం ప్రసంగించడానికి, మరి కొందరికి కవితలు చదవటానికి అవకాశం యివ్వబడింది. కవి సమ్మేళనం ఆద్యంతం రాజేంద్ర ప్రసాద్ గారి చక్కని వ్యాఖ్యానం కార్యక్రమాన్ని అలరించింది.

ఈ సమావేశంలో అమెరికా కవులు బిల్లా శ్రీధరరెడ్డి, ఆదిత్య మోపిదేవి, శ్రీనివాస్ చింతా, మృత్యుంజయుడు, వెంకట్ కొత్తూర్, గీతా మాధవి గారు చేస్తున్న సాహిత్యకృషిని అభినందించారు. భారతీయ కవులు కందుకూరి శ్రీరాములు, మౌనశ్రీ మల్లిక్, వసీరా, రామాయణం ప్రసాదరావు, గంటా మనోహర్ రెడ్డి, అయ్యల సోమయాజులప్రసాద్, ఆకుల మల్లేశ్వరరావు, రాధా కుసుమ, మల్యాల మనోహరరావు, యు.వెంకటరత్నం, అవధానం అమృతవల్లి, డాక్టర్ ఎం.ఎన్.బృంద, పరాంకుశం క్రిష్ణవేణి, రామక్రిష్ణ చంద్రమౌళి, డాక్టర్ సమ్మెట విజయ, డాక్తర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, సుబ్రహ్మణ్యం, భోగెల ఉమామహేశ్వరరావు, మేడిసెట్టి యోగేశ్వరరావు, రమాదేవి వీక్షణం చేస్తున్న సాహిత్య సేవలను కొనియాడుతూ, కొందరు కవితలను వినిపిస్తూ సభకు హుందాతనం ఇచ్చారు.

అత్యంత అద్భుతంగా, చారిత్రక సమావేశంగా ఈ 150వ కవితా సంకలన సమావేశం అందర్నీ ముగ్ధుల్ని చేసింది.

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మభాష అమృతం, మాతృభాష మరందం అంటు మాతృభాష ముచ్చట్లు చెప్తూ కవిసమ్మేళనానికి ముగింపు పలికారు. చివరిగా డాక్టర్ గీతా మాధవి గారు అతిథులకు, కవులకు ధన్యవాదాలు తెలిపి సమావేశాన్ని ముగించారు.

చక్కని సమావేశం ఏర్పాటుచేసినందుకు కవులు అందరూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇకపై నెలనెలా తప్పకుండా వీక్షణం సమావేశాలలో పాల్గొంటామని వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు.అంతేకాకుండా వెన్నెలకోసం ఎదురుచూస్తున్న చకోర పక్షుల్లాగా వీక్షణం మార్చినెల 151వ సమావేశానికి నిరీక్షిస్తున్నామని పలువురు కవులు తెలియజేసారు.

అత్యంత ఆత్మీయంగా, ఘనంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

వీక్షణం-150వ సమావేశ ప్రత్యేక వచన కవిత్వ సంచికని ఇక్కడ కింద యిచ్చిన లింకులో చూడవచ్చు.

https://drive.google.com/file/d/1RzUfBEmwpbYUS0tceRhg-GiSpEsNbdgm/view?usp=sharing

https://sirimalle.com/vikshanam-150/

https://www.koumudi.net/Monthly/2025/march/march_2025_vyAsakoumudi_vikshanam.pdf

Monday, 10 February 2025

వీక్షణం-149వ సాహితీ సమావేశం


వీక్షణం-149వ సాహితీ సమావేశం
-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-149

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 149వ అంతర్జాల సాహితీ సమావేశం జనవరి17, 2024న చమక్కులతో మెరిసింది.

కాలిఫోర్నియా లోని తన గీర్వాణీ సాహితీ మందిరపు గవాక్షం తెరిచి వినువీధిలోకి వీక్షిస్తుంటారు డా.గీతామాధవి గారు కవులకోసం. కవి కనిపించినదే తడవుగా వారిని ఆహ్వానించి సాహిత్య విందు చేసి, సత్కరించి కానీ విడువరు. అంతటి సాహిత్య కండూతి వారిది. స్వయానా గొప్ప అంతర్జాతీయ కవయిత్రియైనా, ఇతరులనుండి ఇంకా ఏదో నేర్చుకోవాలనే నిత్య విద్యార్థిని వారు.

సహజంగానే ప్రతిసారీ ఏదో ఒక క్రొత్తదనాన్ని అద్దుతూనే వుంటారు గీతగారు వీక్షణం సమావేశాలకు. అలాగే ఈసారి కళా సింధు డా.ఆలపాటి గారి ప్రసంగం ఓ ప్రత్యేకత! ఓ మెరుపు. ఓ చమక్కు.

ముందుగా గీత గారి స్వాగత వచనాలతో సభ ప్రారంభమైంది. ఈ నాటి ప్రత్యేక అతిధి డా.ఆలపాటిగారిని వేదికపైకి ఆహ్వానించి వారి వైశిష్ట్యాన్ని సభకు పరిచయం చేశారు.

శ్రీ ఆలపాటి గారికి టాగ్ లైన్ కింగ్ గానూ, కళా సింధుగానూ, గొప్ప అనువాదకులు గానూ ప్రఖ్యాతి చెందినవారు.

ఎనిమిది భాషలలో పండితులు,కవీ, రచయిత. వారికి మూడు గౌరవ డాక్టరేట్ లు ఉన్నాయి. అంతే కాక క్రియేటివ్ రచయితగా, మోటివేషనల్ ప్రాసంగికునిగా జాతీయ స్థాయి పురస్కారాలెన్నో పొందిన ఘనాపాటి. కవిత్వంలోని అన్నిరకాల ప్రక్రియలలో ప్రావీణ్యులు.

సృజనాత్మక ప్రస్థానాలు :

  • తొలి రచన-ఆంధ్ర ప్రభ-1971లో. అప్పటి నుంచి వేలాది రచనలు ( కథలు,కవితలు,గేయాలు, పద్యాలు,గజల్స్, నవలలు, వ్యాసాలు, సీరియల్స్,ఫీచర్లు Fiction/Non-fiction లలో దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ )
  • స్వాతి వీక్లీ కథల పోటీలో "ఫాదర్ సీరియస్" అనే కథకి బహుమతితో సహా, అనేక ఇతర అవార్డులు
  • "రాలిపోయిన చందమామ"నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణ నవలతో సహా ఎన్నో నవలలు
  • డజన్లకొద్దీ రేడియో నాటికలు
  • దూరదర్శన్ & ఇతర ఛానెల్స్ కార్యక్రమాలెన్నింటికో మాటలు-పాటలు-దర్శకత్వం-సమర్పణ
  • అనేక ఛానెల్స్ లో పలు ఇంటర్వ్యూలు
  • యూ-ట్యూబ్ ఛానెల్స్ లో వందలాది కార్యక్రమాలు
  • అనేక ప్రాంతాల్లో జరిగే వేలాది కార్యక్రమాల్లో వేదికని అలంకరించడం
  • డజన్ల కొద్దీ అత్యంత ప్రసిద్ధి గాంచిన ట్యాగ్ లైన్స్ ("ఓ ఐడియా - మీ జీవితాన్నే మార్చివేస్తుంది" మొ .వి)
  • దశాబ్దాలుగా కలం+గళంతో అడ్వర్టైజింగ్ తదితర బహుముఖీన రంగాలలో విశిష్ట స్థానం
  • Print/Audio/Video మీడియాల్లో Specializations కి దేశవ్యాప్తంగా గుర్తింపు

అరుదైన విశేషతలు:

  • Concept నుంచి Final Products వరకూ "All-under-one-roof" & "One-stop-Solution" గా రాణింపు
  • Print మీడియా products తో పాటు Ad-films, Documentaries & Audio & Video Ads creations
  • ప్రముఖ "తెలుగు వన్" ఛానెల్ ద్వారా ప్రతి మంగళవారం విడుదలయ్యే "ఆలపాటి చమక్కులు" సాప్తాహిక వీడియో కార్యక్రమం 226 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని అప్రతిహతంగా కొనసాగుతోంది.
  • ప్రసిద్ధ "టోరీ" రేడియోలో ప్రతి శుక్రవారం వస్తూ ప్రపంచవ్యాప్తంగా బహుళ జనాదరణ అందుకున్న "ఆలపాటి చమక్కులు లైవ్ షో" 213 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని అప్రతిహతంగా కొనసాగుతోంది.
  • మరో గ్లోబల్ కార్యక్రమం "ఆలపాటి రేడియో" Podcasts ద్వారా Spotify తదితర అనేక Platforms ద్వారా జీవితానికి సంబంధించిన అనేక విషయాలపై ప్రతిరోజూ జీవన-అవగాహన కార్యక్రమం జరుగుతోంది.

ఇంతటి గొప్ప వ్యక్తిని ఈ సభకు స్వాగతించిన గీతగారికీ, రాజేంద్రప్రసాద్ గారికి నమస్సులు.

డా.ఆలపాటిగారు తన గంభీర స్వరంతో, స్పష్టమైన ఉచ్చారణతో ' చమక్కులు వ్రాయడం ఎలా ' అనే అంశంపై సుమారు45 నిమిషాలు ప్రసంగించిన తీరు సభికులను నిశ్చేష్టులను గావించింది.

అవ్వయార్ గారి తమిళ సూక్తిని ఉటంకిస్తూ.. "నేర్చుకున్నది అరచేయి అంత, నేర్చుకోవలసింది అపార జలధి అంత " అని చెప్తూ వారి చమక్కులను సోదాహరణంగా వివరించారు.తమ వేటపాలెంలో తాము 7వతరగతి చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన వారిని కవిగాఎలా మార్చిందో అదే వొక చమక్కనీ, మెరుపును అందుకోవడం దాన్ని పంచుకోవడం అనే చమక్కు ప్రతి కవికి అవశ్యమని, లేనిచో పలక కవితలుగానే నిలిచిపోతాయన్నారు. పోయిన పిదపకూడా బ్రతికి ఉండడం ప్రతివాని ధ్యేయమై ఉండాలని వుద్భోదించారు.

వారి ప్రసంగాన్ని శ్లాఘిస్తూ అనేకమంది కవులు స్పందించారు. ధన్యవాదాలు తెలిపారు.

పిదప శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన కవి సమ్మేళనం ప్రారంభమైంది.

తొలుతగా డా.గీతామాధవిగారు "అచ్యుతం, కేశవం "అనే గీతాన్ని తెలుగులోకి అనువదించి తన శ్రావ్యమైన కంఠంతో పాడి సభికులను మంత్ర ముగ్ధులను చేశారు. తరువాత "పండగంటే" అనే కవితలో నిజమైన పండుగ ఏదో తమ సహజ శైలిలో చెప్పారు. అద్భుతమైన కవిత.

తరువాయిగా డా.ఆలపాటి గారు ఒకే కవితలో వివిధ భాషలుపయోగిస్తూ ఒక క్రొత్త ప్రక్రియను వినిపించారు. శ్రోతల చప్పట్లతో సభ దద్దరిల్లినది.

శ్రీ ఆదిత్య ( కమర ) గారు ' మనోభావాలు దెబ్బతిన్నాయి 'అనే తన కవితలో హాస్యాన్ని పండించారు..శ్రీ వెంకట కొత్తూరి గారు సంక్రాంతి శోభపై చక్కని పద్యాన్ని చదివి అలరించారు. శ్రీ ఘంటా మనోహరరెడ్డి గారు గతము చేసిన గాయాల జ్ఞాపకాలు ఎందుకో అంటూ పేరుకు తగ్గట్టుగానే మనోహరంగా పాడారు.

తేళ్ల అరుణ గారు తమ కవితలో అతడు ఆమెలను ప్రకృతి పురుషులతో పోలుస్తూ చక్కని కవిత వినిపించారు. శ్రీ అయ్యల సోమయాజులు గారు అమలాపురంలో బొమ్మల కొలువును అందంగా వర్ణించారు. శ్రీగౌరీపతి శాస్త్రిగారు తన ' వేకువ సూర్యుడు ' అనే కవితలో మధ్యతరగతి మానవుడి ఇడుమలను గురించి వేదనా భరితంగా వివరించారు.

శ్రీమతి దీకొండ చంద్రకళ గారు చిరునవ్వులను చెదరనీకుమా అనే సందేశాత్మక కవిత అందరినీ ఆకట్టుకొంది.

సుప్రసిద్ధ తబలా కళాకారులు స్వర్గీయ జకీర్ హుస్సేన్ గారిపై కవిత చదివారు శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు.శ్రీ మోటూరి నారాయణరావుగారి మరో పొద్దుపొడుపు అనే కవిత అద్భుతంగా ఉంది.డా.దేవులపల్లి పద్మజ ' ప్రేమ..భ్రమ " కవితలో ఆరెంటి భేదాన్ని అందంగా వివరిస్తూ చదివిన తీరు శ్లాఘనీయం.

శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావుగారు " మా అమ్మాయికి పెళ్లైపోయింది "అనే కవితలో అమ్మాయి తన జీవనయానం లో ఎలా సహజ రూపాంతరం చెందుతుందో చెప్పిన తీరు గురుతుండి పోతుంది.

శ్రీమతి పరాంకుశం కృష్ణవేణి గారు " హృదయ గవాక్షం "అనే తన కవిత శ్రుత్యంగమంగాఉండినది. అమీనా కలందర్ గారు ఎక్కడికో ఈ పరుగు ఎవరికోసమో అంటూ కవితాగానం చేశారు.

బుక్కాపట్నం రమాదేవి గారు ఎద లోయల్లో ఇంద్ర ధనస్సు అనే కవిత అందరినీ ఆకట్టుకొంది. శ్రీమతి కోదాటి అరుణ గారు వివిధ వయో దశల్లో నవ్వు ప్రాధాన్యత ను సుందరంగా వినిపించారు.

డా.బృంద గారు జీవికి నీరు ప్రాణాధారం అంటూ చక్కని సందేశాత్మక కవిత చదివారు. కవితలోని అంత్యప్రాసల సౌందర్యం చెప్పుకోదగ్గది. శ్రీమతి సుజాతా కోకిల గారు " నా పిల్లలే నా ఆధారం " అంటూ చదిన కవిత కోకిల గానం చేసినట్టే ఉంది. శ్రీ చిట్టాబట్టిన వీరరాఘవులు గారు తన నిప్పు కణికలు అనే కవితలో సత్యం యొక్క వైశిష్ట్యాన్ని వివరించారు.

శ్రీమతి మంజులగారి కవిత విన సొంపుగా ఉంది. శ్రీమతి చీదేళ్ల సీతాలక్ష్మి గారు ' తెలుగువారి గుండె చప్పుడు 'అనే తన కవితలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రాశస్త్యాన్ని వివరించారు. వారిదక్షిణ భాగం శ్రీ సత్యమూర్తి గారు కూడా యన్టీయార్ పై తమ ప్రేమాభిమానాలు వారి కవితలో వివరించారు. శ్రీ ఉప్పలపాటి వెంకట రత్నం గారు ' ఆత్మార్పణం అనే కవితలో ప్రేమకు అంత ఆకర్షణ ఏమిటి అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. ప్రసాదరావు రామాయణం అనే నేను నా కవితలో ప్రియురాలిచే మోసగింపబడి కన్నీటిలో మునకలెత్తుతున్న ఓ ప్రియుడు తన బాధా కాలకూటాన్ని త్రొక్కిపట్టి అందరినీ నవ్వులతో ఎలా అలరిస్తాడో విదారకంగా వినిపించాను. చివరిగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు చమక్కులపై తన కవితలో మెరుపులు మెరిపించారు. పిడుగులు దొర్లించారు.

తరువాత డిసెంబరు నెలలో ఫేస్బుక్ కవితల పోటీలో విజేతగా మల్యాల మనోహరరావు కవిత "జుగల్బందీ"ని ఎంపిక చేసారు.

వచ్చేనెలలో వీక్షణం 150వ సమావేశాన్ని జరుపుకోబోతున్న సందర్భంగా 150 మంది కవులతో ఈ-కవితా సంకలనాన్ని తీసుకురాబోతున్నట్లు గీతగారు ప్రకటించారు.

అత్యంత ఆనందంగా జరిగిన ఈ సభ గీత గారి తుది పలుకులతో విజయవంతంగా ముగిసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉత్సాహంగా పాల్గొన్న ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-149/

https://www.koumudi.net/Monthly/2025/february/feb_2025_vyAsakoumudi_vikshanam.pdf