Wednesday, 17 January 2024

వీక్షణం సాహితీ గవాక్షం-127 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం-127 వ సమావేశం

-- వరూధిని --
vikshanam-127

వీక్షణం-127 వ సాహితీ సమావేశం మార్చి 11, 2023 న  ఆన్ లైనులో జూమ్ సమావేశంగా ఆద్యంతం వేడుకగా జరిగింది. ఇందులో అమెరికా, భారతదేశాల నుంచి అతిథులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి ప్రారంభోపన్యాసం చేసి, సభలోని వారందరికీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో రెండు ముఖ్యమైన ప్రధాన విశేషాలున్నాయి. మొదటిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాగా, రెండవది ఉగాది వేడుక. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కొండపల్లి నీహారిణి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెచ్చెలి ప్రచురణల "అపరాజిత" గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వ సంకలన పరిచయం చేసారు. సభను మృత్యుంజయుడు తాటిపాముల గారు నిర్వహించారు.

నీహారిణి గారు స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న'అపరాజిత' అంటూ ఉపన్యాసాన్ని ప్రారంభించి "కవిత్వం ఎమోషన్స్ ను, ఇమేజేనేషన్ ను, థాట్స్ ను అంతర్భాగంగా కలిసి ఉండడంతో పాఠకులలో భావోత్ప్తేరణ కలిగించడంలో సఫలీకృతం కావాలి. అదే గొప్ప కవిత్వం అవుతుంది. గొప్ప కవిత్వం అంటే ఆ కవిత చెప్పే సంవేదన ఏమిటి ? పాఠకులకు వస్తువు విశేషాలను సరిగ్గా చేరవేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. 'అపరాజిత' కవితా సంపుటిలో స్త్రీల సంవేదన అక్షరాక్షరంలో కనిపిస్తుంది. డాక్టర్ కె. గీత 'అపరాజిత' కవితల సంకలనాన్ని ప్రతిష్టాత్మకంగా ముద్రించి, ఆవిష్కరణ సభ నిర్వహించి సాహిత్య రంగంలో ఒక అలజడిని సృష్టించింది. ఒక హల్చల్ ని చేసింది. యస్! కచ్చితంగా ఇది అలజడే, కచ్చితంగా ఇది హల్చలే! స్త్రీవాదం ఎక్కడుంది పత్తా లేకుండా పోయింది అని ఒక అణచివేత స్వరంతో మాట్లాడిన వాళ్ళకి ఒక ధిక్కార స్వరం వినిపించింది.

స్త్రీవాదం అనగానే రకరకాల అభిప్రాయాలను రకరకాల అనుమానాలను రేకెత్తించి ఆ మాట ఎత్తడానికే భయపడేలా సాహిత్య విమర్శకులు కొందరు చేయడం వలన కవయిత్రులు కూడా అదే నిజమో ఏమో అని నమ్మే ఒక ఆపదలో పడిపోయారు. కానీ కవయిత్రులంతా కూడా సందర్భం వచ్చినప్పుడల్లా తమ గొంతుకను వినిపిస్తూనే ఉన్నారు! వాళ్ళు రాసే కవిత్వంలో ఉన్న తమ బాధనే స్త్రీవాద కవిత్వం అని అనుకోలేదు, అలా అనుకోకుండా చేశారు సాహిత్య విమర్శకులు! ఘాటైన పదాలతో రాస్తేనే స్త్రీవాదమేమో అనుకుని, పురుష అహంకారాన్ని, పితృస్వామ్యాన్ని చిన్న చిన్న భావాలలోఎత్తి చూపే కవిత్వమంతా స్త్రీవాద కవిత్వమే అని అనుకోలేదు.తాను కోల్పోతున్న జీవితంలోని అంశాలను చూపేదంతా స్త్రీవాద కవిత్వమే అని అనుకోలేని పరిస్థితిలో పడిపోయారు.

అపరాజిత సంకలనంలో చిత్రించిన కవిత్వం అంతా స్త్రీ జీవితమే! పాఠకులను తప్పకుండా ఆలోచనలో పడేసే కవిత్వమే. 1993 నుండి 2022 వరకు ఉన్న స్త్రీల కవిత్వం ఇందులో ఉన్నది. 93 మంది కవయిత్రులు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ సంకలనానికి తన అభిప్రాయాన్ని రాస్తూ, గీత "మౌనాన్ని బద్దలు కొట్టే అపరాజిత" అని అనడం ఎంతో సబబైన మాట!

శిలాలోలిత తన అభిప్రాయాన్ని కచ్చితంగా తెలియజేస్తూ, "అపజయం ఎరుగని అవిశ్రాంత గీతం" అనడం సత్య దూరమైంది కాదు. మానవ జీవన సౌందర్యాన్ని ఒడిసి పట్టుకున్న పిడికిళ్ల  సమూహం ఇది అని శిలాలోలిత చెప్పడం లో సామాజిక కోణమే కనిపిస్తుంది. స్త్రీవాదమంటే పురుష ద్వేషం కలిగించడం అని కాదు అనీ, ఒక సమయోచిత దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రాశారు. ఈ అపరాజితలో కవితలన్నీ అలాగే ఉన్నాయి.

ఇంకా స్త్రీవాదం గురించి చెప్పాల్సి వస్తోంది రాయాల్సిస్తోంది అని ఒక ఆలోచనలో పడేసే సందర్భంలో ఉన్నాం మనం. మానవత్వం మంట కలిసిపోతున్న రోజులు కదా తప్పదు! కాత్యాయని విద్మహే గారు అపరాజిత కవితా సంకలనానికి ఒక సుదీర్ఘమైన వ్యాసాన్ని రాశారు. ఈ పుస్తకానికి చివరలో ఉన్న "స్త్రీవాద కవిత్వ అడుగుజాడలు" అనే ఈ ఆర్టికల్ ఒక్కటి చాలు ఎక్కడెక్కడ ఏఏ రూపాలలో స్త్రీలు వివక్షకు గురి అవుతున్నారు ఎక్కడెక్కడ వివక్షలను కవయిత్రులు ఎండగట్టారు అనేది తెలుస్తుందని. దేశాలు జాతులు స్వతంత్రం అవుతున్న స్త్రీలు ఎందుకు స్వతంత్రులు కాలేరు అన్న ప్రశ్నతో అందుకు అవరోధంగా ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక కారణాల శోధనలో పితృస్వామ్యం ఒక బలమైన శక్తిగా అర్థమైన చోట స్త్రీవాదం పుట్టింది" అంటూ,"కుటుంబం కులం మతం రాజ్యం మొదలైన వ్యవస్థల ద్వారా స్త్రీ శరీరాన్ని చైతన్యాన్ని జీవితాన్ని నియంత్రిస్తూ ఉంటుంది." అంటూ "నాకు తెలిసినంతవరకు స్త్రీలందరి జీవితాలలో అడుగడుగునా ముళ్ళు సంకెళ్లే" అని చెప్పిన గీత, స్త్రీవాదం పని అయిపోలేదని కొత్త అస్త్రాన్ని ధరించి పోరాటంలో ముందుకు సాగుతూనే ఉందని తెలియజేయడానికి అపరాజిత ముందుకు వచ్చిందని అనడం వందకు వంద శాతం నిజం. తనదైన ధిక్కర స్వరంతో ఈ 'అపరాజిత' చరిత్రను సృష్టించింది అనడం అతిశయోక్తి కాదు. స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న ఈ అపరాజిత స్త్రీ అస్తిత్వ గ్రంథం." అంటూ ఉధృత ప్రవాహంలా ప్రసంగించి, ముగించారు.

ఆ తరువాత డా. మీరా సుబ్రహ్మణ్యం, ఇంద్రాణి పాలపర్తి, వసుధారాణి అపరాజిత పై ఆత్మీయవాక్యాలు తెలియజేసారు.

తరువాత డా కె.గీత వీక్షణం ఫేస్ బుక్ నెలవారీ కవిత్వ పోటీల్లో భాగంగా ఫిబ్రవరి నెలలో గెలుపొందిన కవి ప్రసాదరావు రామాయణం గారిని అభినందించి, అవార్డుని అందజేశారు.

ఆ తరువాత రావు తల్లాప్రగడ గారి అధ్యక్షతలో జరిగిన ఉగాది కవిసమ్మేళనంలో సీతారామరాజు, డా. మీరా సుబ్రహ్మణ్యం, ఇంద్రాణి పాలపర్తి, వసుధారాణి, డా. నీహారిణి కొండపల్లి, డా.కె.గీత, దాలిరాజు వైశ్యరాజు, ప్రసాదరావు రామాయణం, రాజేంద్ర ప్రసాద్ గుండ్లపల్లి, డా. అరుణ కోదాటి, కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, మారుతి తన్నీరు, తాటిపర్తి బాలకృష్ణారెడ్డి, లలితావర్మ, సూర్యకుమారి మానుకొండ, డా. కందేపి రాణీ ప్రసాద్, బంతికట్ల నాగేశ్వరరావు, భవాని ముప్పల, ఆచార్య అయల సోమయాజుల ప్రసాద్, శాస్త్రి కన్నేపల్లి, కుడికాల వంశీధర్, చీదెళ్ల సీతాలక్ష్మి, శారద కాశీవఝల, రాజశేఖర్ తదితరులు పాల్గొని తమ కవితల్ని  వినిపించారు. ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-127/

https://www.koumudi.net/Monthly/2023/april/april_2023_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం సాహితీ గవాక్షం-126 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం-126 వ సమావేశం

-- వరూధిని --
vikshanam-126

వీక్షణం-126 వ సమావేశం ఫిబ్రవరి 11, 2023 న  ఆన్ లైనులో జూమ్ సమావేశంగా ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. ఇందులో అమెరికాతో బాటూ, భారతదేశం నుంచి కూడా అతిథులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి ప్రారంభోపన్యాసం చేసి, సభలోని వారందరికీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె. సత్యవతి గారిని అధ్యక్షులు మృత్యుంజయుడు తాటిపామల వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానించారు.

తరువాత అపర్ణ తోట సత్యవతి గారిని పరిచయం చేసి ఆత్మీయ ఉపన్యాసం చేసారు. సత్యవతి గారు ఏ విషయంలోనైనా ఎంత నిరాడంబరంగా ఉంటారో సభకు తెలియజేసి కొనియాడారు. తరువాత సత్యవతి గారి రచనల గురించి, వ్యక్తిగతంగా వారితో ఉన్న అనుబంధాన్ని గురించి అన్వర్, కొండవీటి సత్యవతి, వసుధారాణి, కొండేపూడి నిర్మల తదితరులు సభతో పంచుకున్నారు.

ముఖ్య అతిథి కె. సత్యవతి గారు తను అనువాదం చేసిన "ఒక హిజ్రా ఆత్మకథ" ని గురించి మాత్రమే కాక, మొత్తం అనువాద ప్రక్రియలో తను నేర్చుకున్న అనేక అంశాల గురించి ప్రస్తావిస్తూ కొత్తగా అనువాదాలు చేసే వారికి మార్గదర్శకంగా మాట్లాడేరు. తన మొదటి అనువాదంగా ఇండియన్ లిటరేచర్ నించి తీసుకున్న "ఆయిల్ ప్రెస్" కథని  పేర్కొన్నారు. మొదటి నించి అనువాద ప్రక్రియలో భాగంగా తాను ఎవరెవరిని సంప్రదించారో, తెలియని పదబంధాలకు అర్థాలు ఎలా అడిగి రాసుకుంటూ వచ్చారో మొ.న విషయాలు ఎన్నో జ్ఞాపకం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా గీతా నంబియార్, ఖాదర్ మొహియుద్దీన్, వై. వి. సత్యనారాయణ, మాలతీ చందూర్, సురేష్ కొలిచాల, గీతా రామస్వామి, గౌరీ కృపానందన్ తదితరుల సహకారాల్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేసారు. "ఒక హిజ్రా ఆత్మకథ" ని చదువుతూ అందులో రేవతి అనుభవించిన కష్టాలకి కన్నీరు మున్నీరయ్యానని అన్నారు. ఈ నెల నెచ్చెలి అంతర్జాల మాస పత్రికలో ప్రచురించబడిన ఆ పుస్తక సమీక్షని గుర్తుచేసుకున్నారు. సమీక్షకులు వి. విజయకుమార్ గార్ని అభినందించారు. అనువాదాల ఆవశ్యకతని గురించి చెప్తూ, ప్రతి ఒక్కరూ కొత్తభాష ఏదైనా ఒకటి తప్పకుండా నేర్చుకోవాలి అని చెప్తూ నిత్య విద్యార్థిగా ఇప్పటికీ తను అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాననడం విశేషం.

తర్వాత జరిగిన చర్చ కార్యక్రమంలో హిజ్రా ఆత్మకథ అనువాదంలో సత్యవతి గారికి సహకరించిన గౌరీ కృపానందన్ ముందుగా తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఆ తర్వాత మృత్యుంజయుడు తాటిపామల, డా.కె.గీత, హిమబిందు, డా. కె.వి రమణారావు, సుభద్ర, కందుకూరి శ్రీరాములు, దేశరాజు, నీహారిణి కొండపల్లి, ఇంద్రాణి పాలపర్తి, దాలిరాజు వైశ్యరాజు, దాసరాజు రామారావు, ప్రసాదరావు గోగినేని , కోటి, డా. లక్ష్మీ నరసమ్మ మున్నగు వారు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు.

ఆ తరువాత జరిగిన 'సాహితీ కదంబం' కార్యక్రమంలో జరిగిన కవిసమ్మేళనంలో ఇంద్రాణి పాలపర్తి, నీహారిణి కొండపల్లి, డా.కె.గీత, కందుకూరి శ్రీరాములు, దేశరాజు, వసుధారాణి, శ్రీధర్ రెడ్డి బిల్లా, దాలిరాజు వైశ్యరాజు, ప్రసాదరావు రామాయణం, రాజేంద్ర ప్రసాద్ గుండ్లపల్లి, దాసరాజు రామారావు, విశ్వైక, డా. అరుణ కోదాటి, డా. పోలా సాయి జ్యోతి, డా పల్లా అన్నయ్య సరస్వతి, డా. సరికొండ రమాదేవి తదితరులు పాల్గొని తమ కవితల్ని వినిపించారు. ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-126/

https://www.koumudi.net/Monthly/2023/march/march_2023_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం సాహితీ గవాక్షం-125 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం-125 వ సమావేశం

-- వరూధిని --
vikshanam-125 photo

వీక్షణం-125 వ సమావేశం జనవరి 7, 2023 న ఆన్ లైనులో జూమ్ సమావేశంగా అట్టహాసంగా జరిగింది. ఈ వీక్షణం శతరజతోత్సవ సమావేశం, ఆస్ట్రేలియా అతిథుల ప్రత్యేక సమావేశం గా జరిగింది. ఇందులో ఆస్ట్రేలియాతో బాటూ అమెరికా, భారతదేశం నుంచి కూడా అతిథులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి మాట్లాడుతూ 2012 సెప్టెంబరులో మొదలుపెట్టిన వీక్షణం 125 సమావేశాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని, ఇన్ని నెలల పాటు సభ్యులందరి తోడ్పాటు వల్లనే వీక్షణం కొనసాగుతూ ఉందని అంటూ, అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు.

సభాధ్యక్షులు శ్రీ మధు ప్రఖ్యా గారు ప్రారంభోపన్యాసం చేసి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య ప్రముఖులు, “తెలుగుమల్లి.కాం” అంతర్జాల తెలుగు పత్రిక సంపాదకులు శ్రీ మల్లికేశ్వర్రావు కొంచాడ గారిని వేదిక మీదికి ఆహ్వానించారు. మల్లికేశ్వర్రావు గారు ఆస్ట్రేలియా తెలుగు వికాస చరిత్రని, కొనసాగుతున్న సాహిత్య, సాంస్కృతిక ప్రగతిని వివరించారు. ముఖ్యంగా సాహిత్య, కళా రంగాల్లో ఆక్కడి తెలుగువారి విశేష కృషిని సభకు పరిచయం చేసారు.

ఆ తరువాత "పద్యం-విశిష్టత" అనే అంశం మీద ఆస్ట్రేలియా నించి శ్రీ తూములూరి శాస్త్రి గారు ప్రధాన ప్రసంగం చేసారు. ముందుగా 'విశిష్టత' అనే పదం నించి మొదలుకుని అర్థవివరణ చేసారు. పద్య లక్షణాలతో పాటూ సోదాహరణంగా చక్కని ఛలోక్తులతో ఆద్యంతం అందరినీ అలరిస్తూ పద్య విశిష్టతని వివరించారు శాస్త్రి గారు.

ఆ తరువాత జరిగిన 'సాహితీ కదంబం' కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నించి శ్రీమతి విజయమాధవి గొల్లపూడి గారు గల్పికా పఠనం చేసారు. హాస్యస్ఫోరకమైన "పేరులో తికమకలు" అనే ఈ గల్పిక అందరినీ అలరించింది. శ్రీ శ్రీకృష్ణ రావిపాటి (ఆస్ట్రేలియా) తెలుగు సామెతలతో అల్లిన చక్కని కథని వినిపించి సభని అలరించారు.

తరువాత జరిగిన కవిసమ్మేళనంలో, చర్చా కార్యక్రమంలో శ్రీమతి ఉషా శ్రీదేవి శ్రీధర (ఆస్ట్రేలియా), శ్రీ వేణు రాజుపాలెం (ఆస్ట్రేలియా), శ్రీ తూములూరి శాస్త్రి (ఆస్ట్రేలియా), శ్రీ మృత్యుంజయుడు తాటిపామల (యుఎస్ఏ), శ్రీ రావు తల్లాప్రగడ (యుఎస్ఏ), శ్రీమతి అపర్ణ గునుపూడి (యుఎస్ఏ), డా.కె.గీత (యుఎస్ఏ), శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా (యుఎస్ఏ), శ్రీ రామ్ నేతి (యుఎస్ఏ), శ్రీ నాథ్ ఖండవల్లి (ఆస్ట్రేలియా), శ్రీమతి రాధిక (యుఎస్ఏ), డా. డి.లక్ష్మీ నరసమ్మ (యుఎస్ఏ), శ్రీ ప్రసాదరావు రామాయణం (ఇండియా), శ్రీ రాజేంద్ర ప్రసాద్ (ఇండియా), శ్రీమతి సూర్యకుమారి మానుకొండ (ఇండియా), శ్రీ బి.వెంకటేశ్వర్లు (ఇండియా), శ్రీ రాంబాబు (ఆస్ట్రేలియా), డా. వేణుగోపాల్ (ఆస్ట్రేలియా) తదితరులు పాల్గొన్నారు.

చివరిగా గీతామాధవి ధనుర్మాసం సందర్భంగా దేవులపల్లి వారు అనువదించిన తిరుప్పావై గీతాన్ని పాడి సభని విజయవంతంగా ముగించారు. ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-125/

https://www.koumudi.net/Monthly/2023/february/feb_2023_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం సాహితీ గవాక్షం-124 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం-124 వ సమావేశం

-- వరూధిని --
vikshanam-124

వీక్షణం-124వ సమావేశం డిసెంబరు 3, 2022 న  ఆన్ లైనులో జూమ్ సమావేశంగా జరిగింది. ఈ సమావేశంలో భారతదేశం నుంచి అతిథులు పాల్గొనడం విశేషం. ముందుగా అధ్యక్షులు శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గార్ని, ముఖ్య అతిథి శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారిని, ప్రధాన ప్రసంగ్రీకులు ప్రొ. పలివెల చిరంజీవి రావు గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తూ వీక్షణం సంస్థాపకులు డా కె.గీత గారు సభను ప్రారంభించారు. ఇంతవరకు అమెరికాకు పరిమితమైన వీక్షణం ఈ సమావేశం నుంచి విశ్వ వ్యాప్తం కానుందని ప్రకటన చేసారు.

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీ పలివెల చిరంజీవి రావు గారు "అమెరికా తెలుగు కథ - సామాజిక విశ్లేషణ" అనే అంశమ్మీద సోదాహరణంగా ఉపన్యసించారు. తన పీ.హెచ్.డీ పరిశోధనాంశమైన ఈ విషయాన్ని, అప్పటి కాలానికి పరిశీలనకు తీసుకున్న కథలకు మాత్రమే పరిమితం చేస్తూ సాగిన ఉపన్యాసం సభికులను బాగా ఆకట్టుకుంది.

1964లో వాహిని పత్రికలో వచ్చిన పులికండ్ల మల్లిఖార్జున రావు గారిని మొదలుకుని వంగూరి చిట్టెన్ రాజు, సత్యం మందపాటి, అపర్ణ గునుపూడి, పూడిపెద్ది శేషశర్మ, తాటిపాముల మృత్యుంజయుడు, ఆరి సీతారామయ్య మొదలైన ఎందరో కథకుల కథల్ని పేర్కొన్నారు. వారి కథల్లో నుంచి మచ్చుకొక కథను వివరించారు. ఈ డయాస్పోరా కథల్లో ప్రవాస జీవితాల్లో తెలుగు వారి కష్ట నష్టాల్ని, సంప్రదాయాల్ని, మాతృభూమి మీద మమకారాన్ని, నిత్య జీవనాన్ని, సమస్యలతో బాటూ పరిష్కారమార్గాల్ని తెలియజేసే విలక్షణమైన కథలు ఉన్నాయని పేర్కొంటూ ప్రసంగాన్ని ముగించారు.

తరువాత ముఖ్య అతిథి శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు చిరంజీవి రావు గారితో తన అనుబంధాన్ని, డయాస్పోరా కథల ప్రాముఖ్యతని గురించి ప్రసంగించారు.

ఆ తరువాత  శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన చర్చలో సభికులు విశేషంగా పాల్గొన్నారు. తరువాత జరిగిన సాహితీ కదంబం కార్యక్రమంలోని కవిసమ్మేళనానికి  శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అమెరికా కవులతో బాటూ భారత దేశవ్యాప్తంగా కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. శ్రీమతి శాంతి కృష్ణ (నెల్లూరు), శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ (పలమనేరు), శ్రీ పొత్తూరి సీతారామరాజు (కాకినాడ),  శ్రీ బి. వెంకటేశ్వర్లు (మైసూరు), శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ (హైదరాబాద్), శ్రీమతి అన్నపూర్ణ పాతూరి  (నెల్లూరు), శ్రీమతి టి.వి.యెల్. గాయత్రి (పూణే),  డా.కె.గీత  (యుఎస్ఏ), శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా (యుఎస్ఏ), శ్రీ పలివెల చిరంజీవి రావు (శ్రీకాకుళం) మొ.న వారు ఈ కార్యక్రమంలో కవితాగానం చేసారు.

ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ  సమావేశం విజయవంతంగా ముగిసింది.

ఈ సమావేశ వీడియోల్ని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-124/

https://www.koumudi.net/Monthly/2023/january/jan_2023_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం సాహితీ గవాక్షం-123 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం-123 వ సమావేశం

-- శ్రీధర్ రెడ్డి బిల్లా --
vikshanam-123

వీక్షణం-123వ సమావేశం నవంబరు 13, 2022 న కాలిఫోర్నియాలో మిల్పిటాస్ లోని శ్రీ  తాటిపాముల మృత్యుంజయుడు, శ్రీమతి జయ గార్ల ఇంట్లో వారి సాదర ఆహ్వాన వచనాలతో ప్రారంభమైంది. ఈ సమావేశంలో మూడు కథా పఠనాలు జరగటం విశేషం. ప్రముఖ రచయిత శ్రీ శ్రీధర ముఖ్యఅతిథిగా పాల్గొని కథాపఠనం చేసారు. శ్రీధర గారిని సభాధ్యక్షులు శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల సభకు పరిచయం చేసారు. ఆయన పేరొందిన కథా, నవలా రచయిత. చమత్కార భరితంగా రచనలు చెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఇటీవల అమెరికా జీవిత నేపథ్యంలో రాసిన "కలలకు రెక్కలొచ్చాయి" నవలని సభకు పరిచయం చేసారు.

మొదటగా శ్రీ శ్రీధర గారు “మాటవరసకెపుడైనా అన్నానా..” అనే వారి స్వీయ అముద్రిత కథను చదివారు. “నీ భర్త వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు..” అనే లేఖ నందుకున్న ఓ భార్య పయనాన్ని, సత్యాన్ని, ఆమె పరిశోధించిన క్రమాన్ని చక్కని ఉపమానాలతో, హాస్య వ్యంగ్య మేళవింపులతో వ్రాసిన నిజ జీవిత ఆధార కథ సభికులను విశేషంగా అలరించింది. తదనంతర కథా చర్చలో సభికులందరూ కథపై వారి వారి అభిప్రాయాలను వెల్లడించి శ్రీ శ్రీధర గారిని కొనియాడారు.

తదనంతరం శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారి కథా పఠనం జరిగింది. మాజీ ప్రభుత్వ ఉద్యోగ పింఛను అందుకుంటున్న ఎనభై ఐదేళ్ల వృద్ధుడి జీవన పయనంలో తారస పడిన స్త్రీ గురించి ఆసక్తి దాయకమైన కథను చదివారు. ఈ కథకు పేరు ఏం పెడితే బావుంటుందో అని అక్కిరాజు గారు అడినప్పుడు సభికులు వారి వారి అభిప్రాయాలు తెలియ జేశారు.

తదనంతరం డా కె.గీత గారు తాను వ్రాసి, ప్రతిష్టాత్మక వంగూరి ఫౌండేషన్ పోటీలో గెలుపొంది, విశేష ఆదరణ పొందిన “భూలోక స్వర్గం” అనే కథను చదివారు. హైతీ దేశంలోని ఓ మైనారిటీ వర్గానికి చెందిన కుటుంబం దక్షిణ అమెరికాదేశాలలోని దుర్గమ దారుల గుండా అమెరికాకు వలస వెళ్లాలనే తమ అకుంఠిత దీక్షను, వారి ప్రయాణంలో ఎదుర్కొన్న అనేక అనుభవాలను, కఠిన పరిస్థితులను ఎంతో ఉత్కంఠగా మలిచారు. వారి కథా పఠన తీరు, పాత్రల స్వభావాలు, కథనం సభికులను మంత్ర ముగ్ధులను చేశాయి. తదనంతర చర్చా కార్యక్రమంలో సభికులు వారి వారి అభిప్రాయాలు వెలిబుచ్చి శ్రీ గీత గారిని అభినందించారు. తర్వాత గీత గారు ఈ కథ వ్రాయడానికి కలిగిన ప్రేరణను, నేపథ్యాన్నీ సభికులకు వివరించారు.

తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో శ్రీ శ్రీధర్ రెడ్డి గారు “మృత్యుదేవి” అనే కవితను, శ్రీ దాలిరాజు గారు “తప్పు-ఒప్పు” అనే కవితను చదివారు. వీక్షణం నిర్వాహకురాలైన గీతగారు గారు వందన సమర్పణ గావించారు. తదనంతరం శ్రీ & శ్రీమతి మృత్యుంజయుడు గారి కమ్మని అల్పాహార విందుతో సమావేశం దిగ్విజయంగా ముగిసింది.

ఈ సమావేశ వీడియోల్ని ఇక్కడ చూడవచ్చు.

భాగం -1భాగం -2

____________________

https://sirimalle.com/vikshanam-123/

https://www.koumudi.net/Monthly/2022/december/dec_2022_vyAsakoumudi_vikshanam.pdf


Friday, 12 January 2024

వీక్షణం సాహితీ గవాక్షం-122 వ సమావేశం

 వీక్షణం సాహితీ గవాక్షం-122 వ సమావేశం

-- వరూధిని --
vikshanam-122

అక్టోబరు 9, 2022 న కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ లో జరిగిన వీక్షణం సాహితీ వేదిక 122 వ సమావేశంలో ప్రముఖ కవి కొప్పర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని "ఆధునిక కవిత్వ మార్గాలు- ఇస్మాయిల్ కవిత్వం" అనే అంశమ్మీద ప్రసంగించారు. అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియా లో "వీక్షణం" సాహితీ వేదిక గత పదేళ్ల నించి నెలనెలా సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని చాటుతున్నది.

ఈ కార్యక్రమాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి సభకు ఆహ్వానం పలికి ప్రారంభించారు. కొప్పర్తి గారిని సభాధ్యక్షులు డా.కే.వి.రమణారావు గారు సభకు పరిచయం చేసారు. కొప్పర్తి పూర్తి పేరు కొప్పర్తి వెంకటరమణ మూర్తి. విశ్రాంత చరిత్ర ఉపన్యాసకులు అయినప్పటికీ మొదట్నించీ కవిత్వం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. దాదాపు నలభై ఏళ్ల నించి కవిత్వం రాస్తున్నారు. పిట్టపాడే పాట, విషాదమోహనం, యాభైఏళ్ళవాన అనే మూడు కవితా సంపుటులు వెలువడ్డాయి.

కొప్పర్తి 'ఆధునిక కవిత్వ మార్గాలు- ఇస్మాయిల్ కవిత్వం' అనే అంశమ్మీద మాట్లాడుతూ ప్రాచీన సాహిత్యానికి, ఆధునిక సాహిత్యానికి వస్తు పరంగా వచ్చిన భేదాల్ని ముందుగా వివరించారు. తరువాత గురజాడ, శ్రీశ్రీ, ఇస్మాయిల్ కవిత్వాల్లో ఉన్న విశేషాంశాల్ని వివరిస్తూ శ్రీశ్రీ తరువాత ఆధునిక కవిత్వాన్ని మలుపు తిప్పిన కవి ఇస్మాయిల్ అని కొనియాడారు. ఇస్మాయిల్ కవిత్వాన్ని స్వచ్ఛమైన నీటితో పోలుస్తూ దాహార్తికి నీరు ఎంత అవసరమో ఆధునిక కవులకు ఇస్మాయిల్ కవిత్వం అంత అవసరం అన్నారు. ఇస్మాయిల్ కవిత్వంలో వాహకం, వాహిక రెండూ కవిత్వమే అన్నారు. దేనినైనా మనందరం చూసే సాధారణ దృష్టితో కాక దివ్యనేత్రంతో కొత్తగా దర్శించి కవిత్వీకరించటమే ఇస్మాయిల్ గారి ప్రత్యేకత.

హైకూలను మొట్టమొదటగా పరిచయం చేసిన కవి ఇస్మాయిల్.
"తొలిసంజె నారింజని ఎవరు ఒలిచేరు, తెలిఎండ తొనలను ఎవరు పంచారు"
"బుద్ధిగా ప్రేమించుకోక యుద్ధమెందుకు చేస్తారో నాకర్ధం కాదు"
"ఏ కాకీ ఎగరని ఏకాకి ఆకాశం"
"తరుచాపము వీడిపోయి గురి మరచిన బాణంలా తిరుగుడును పిట్ట"
అంటూ ఇస్మాయిల్ తన కవిత్వంలో అలవోకగా, సరళంగా, అనితరసాధ్యంగా రాసిన అనేక విశేషాంశాల్ని సోదాహరణంగా సభకు అత్యంత ప్రతిభావంతంగా వివరించారు కొప్పర్తి.

ఒక్కొక్క కవిత ఒక్కొక్క ఆణిముత్యంగా భావించవచ్చని, ఇస్మాయిల్ కవిత్వం గురించి ఎంత సేపు చెప్పుకున్నా తరగనిదని అంటూ దాదాపు గంటసేపు ఉపన్యసించారు. ఆయన అనుయాయులుగా కవిత్వం రాస్తున్న కవులు "ఇస్మాయిల్ స్కూల్" కి చెందిన వారమని గర్వంగా చెప్పుకునే గొప్ప కవి ఇస్మాయిల్ అని ముగించారు.

ఆ తరువాత జరిగిన చర్చలో స్థానిక ప్రముఖులు డా. అక్కిరాజు రమాపతిరావు, కిరణ్ ప్రభ, కాంతి కిరణ్, డా.కె.గీత, సుభాష్ పెద్దు, వేణు ఆసూరి, డా.కే.వి.రమణారావు, శారద కాశీవఝల, శ్రీధర్ రెడ్డి, సుభద్ర ద్రోణంరాజు, మృత్యుంజయుడు తాటిపాముల మున్నగువారు పాల్గొన్నారు. కవిసమ్మేళనంలో కవులు చక్కని కవిత్వాన్ని వినిపించి అందరికీ అలరించారు.

ఈ సమావేశాన్ని యూట్యూబులో ఇక్కడ చూడవచ్చు.

https://youtu.be/AqDZFNunbiU

--------------

https://sirimalle.com/vikshanam-122/



"వీక్షణం" సాహితీ వేదిక 10వ వార్షికోత్సవం

 "వీక్షణం" సాహితీ వేదిక 10వ వార్షికోత్సవం

-- సుభద్ర ద్రోణంరాజు --
vikshanam-120

2012 నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియా లో నెలనెలా సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని చాటుతున్న "వీక్షణం" సాహితీ గవాక్షం సెప్టెంబరు 11, 2022 న ఉదయం 10 గం. నించి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం దశమ వార్షికోత్సవాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో మిల్పిటాస్ నగరంలోని స్వాగత్ హోటల్లో అట్టహాసంగా జరుపుకుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి సభకు ఆహ్వానం పలికి ప్రారంభించారు. ఉదయం కార్యక్రమానికి శ్రీ మధు ప్రఖ్యా అధ్యక్షత వహించారు. అధ్యక్ష ఉపన్యాసంలో భాగంగా తనకు వీక్షణం సాహితీ వేదికతో ఉన్న అనుబంధాన్ని, ఆగకుండా గత పదేళ్లుగా జరుగుతున్న వీక్షణం సభల వైనాన్ని సభకు తెలియజేసారు. తరువాత శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ సుభాష్ పెద్దుగార్లు వీక్షణం ఎందరికో స్ఫూర్తిని ఇచ్చిందని కొనియాడుతూ ప్రారంభ ఉపన్యాసాలు చేసారు. ఆ తరవాత శ్రీ హర్షుడు రాసిన నైషధ గ్రంథం మీద శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు వివరణాత్మకమైన ప్రసంగం చేసారు. నలుని చరిత్ర, శ్రీనాధుని వ్యక్తిత్వం, హంస రాయబారంలోని పద్య సౌరభం, దమయంతి వర్ణన, దశావతార స్తుతి మొదలైన అంశాల్ని సభకు వివరించారు.

వీక్షణం దశమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత అవధాని శ్రీ మేడసాని మోహన్ విచ్చేసి, అవధాన ప్రక్రియ-ప్రత్యేకత అనే అంశం మీద ప్రసంగించారు. ప్రముఖ రచయిత డా. అక్కిరాజు రమాపతిరావు గారు "వీక్షణం జీవన సాఫల్య పురస్కారాన్ని" శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ కోమటి జయరాం గార్ల చేతులమీదుగా అందుకున్నారు. డా. అక్కిరాజు రమాపతిరావు గారికి వీక్షణం "సాహితీ భీష్మ" బిరుదుని కూడా ఇచ్చి ఘనంగా సత్కరించింది.

ఆ తరవాత  శ్రీ మేడసాని మోహన్ వీక్షణం ప్రత్యేక సాహితీ సంచిక, గత పదేళ్ల సాహితీ సమావేశాల సంచికల ఆవిష్కరణ చేసారు. ఇందులో శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీమతి కాంతి పాతూరి, డా.కె.గీత, శ్రీ శ్రీచరణ్ పాలడుగు, శ్రీ రావు తల్లాప్రగడ, శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి మున్నగువారు పాల్గొన్నారు.

ఉదయం కార్యక్రమంలో చివరిగా వీక్షణం జీవన సాఫల్య పురస్కార గ్రహీత డా. అక్కిరాజు రమాపతిరావు గారు తన స్పందనని తెలియజేసారు.

భోజనవిరామానంతరం శ్రీ రావు తల్లాప్రగడ అధ్యక్షతని జరిగిన కవిసమ్మేళనంలో స్థానిక కవులు డా||కె.గీత, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి, శ్రీ శ్యామ్ సుందర్ పుల్లెల, శ్రీమల్లవరపు సాయికృష్ణ, శ్రీమతి ఆచంట స్వాతి, డా. ఏ.కే. ప్రభాకర్ మొ.న వారు కవితాగానం చేసారు. తరువాత "అపరాజిత" (గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం 1993-2022), అసింట (డా.కె.గీత కవిత్వం-పాటలు) పుస్తకావిష్కరణలు జరిగాయి. డా. ఏ.కే. ప్రభాకర్ "అపరాజిత" పుస్తక పరిచయం చెయ్యగా, డా.కే.వి.రమణారావు "అసింట" కవిత్వాన్ని పరిచయం చేసారు. ఇదే వేదిక మీద డా.కె.గీతగారికి ఇటీవల 'తెన్నేటి హేమలత- వంశీ సాహిత్య పురస్కారం' లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని గీతగారిని శ్రీమతి క్రాంతి పాతూరి సన్మానించారు.

ఆ తరవాత శ్రీ కిరణ్ ప్రభ "సాహితీ క్విజ్" ని నిర్వహించి సభని అలరించారు. తరవాత జరిగిన "కొత్తకథ దిశ- గమనం" అనే అంశంమీద శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల అధ్యక్షతన జరిగిన చర్చలో డా. ఏ.కే. ప్రభాకర్, డా.కే.వి.రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ శ్రీధర్ రెడ్డి, డా||కె.గీత, శ్రీ సుభాష్ పెద్దు, డా. అక్కిరాజు రమాపతిరావు మున్నగు వారు పాల్గొన్నారు.

ఆ తరవాత శ్రీమతి సుభద్ర, డా||కె.గీత, చిరంజీవి వరూధిని లలిత గీతాల్ని ఆలపించి సభని మైమరిపించారు. చివరిగా శ్రీ కిరణ్ ప్రభ సమాపనోపన్యాసం చేసి సభను ముగించారు.

ఆద్యంతం వైభవోపేతంగా జరిగిన ఈ సభలో శ్రీ & శ్రీమతి దేవరకొండ శ్రీనివాసరావు, శ్రీ నల్లమోతు ప్రసాద్, శ్రీమతి అక్కిరాజు అన్నపూర్ణ, శ్రీ అక్కిరాజు బిలహరి, శ్రీ రఘునాథ్ దెందుకూరి, శ్రీమతి జయమాల తాటిపాముల, శ్రీ వేణు ఆసూరి, శ్రీతులసి తుమ్మల, శ్రీమతి శారద కాశీవఝల, శ్రీమతి సుభద్ర ద్రోణంరాజు, శ్రీ వేణుగోపాల్, శ్రీమతి నిర్మల, శ్రీ చంద్ర రెంటచింతల, శ్రీ దేవేందర్ బాబు మొ.న స్థానిక సాహితీ వేత్తలు, సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబులో ఇక్కడ చూడవచ్చు.

https://youtu.be/rfX0rDQrur4

------

https://sirimalle.com/vikshanam-120/

https://www.koumudi.net/Monthly/2022/october/oct_2022_vyAsakoumudi_vikshanam.pdf