Monday, 2 January 2017

వీక్షణం - సాహితీ గవాక్షం-46 (Jun12, 2016)


వీక్షణం సాహితీ సమావేశం -46
పిల్లల మఱ్ఱి కృష్ణ కుమార్
వీక్షణం 46 వ సాహితీ సమావేశం ఫ్రీ మౌంట్ లోని శ్రీ పెద్దు సుభాష్, వందన గారింట్లో జూన్ 12 వ తారీఖున విజయవంతంగా జరిగింది. సుభాష్ గారు అందర్నీ ఆహ్వానిస్తూ రెండవసారి వారి ఇంట్లో ఈ సమావేశం జరగడం చాలా సంతోషకారణమని చెప్పారు. శ్రీ కూరపాటి భాస్కర్ గారు సభకి అధ్యక్షత వహించి, ముందుగా "కథా పఠనం" కార్యక్రమంలో శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారిని కథ వినిపించమని కోరారు.
రమాపతి రావు గారు శ్రోతల్ని కథకి పేరు సూచించమని కోరుతూ, కథా పఠనాన్ని కొనసాగించారు. అమెరికాలో ఉంటూ భారతదేశంలో ఉన్న తండ్రిని కోల్పోయిన వనిత కథ. ఆ ఉద్వేగంలో తనకి సహాయం చేసిన మిత్రుడే భాగస్వామి అయిన వైనం. ఆద్యంతం కథ అందరిని ఆసక్తిదాయకులను చేసింది.
ఆ తరువాత శ్రీమతి రాధిక గారు తన కథానిక "అలంకరణ" చదివి వినిపించారు. అమాయకంగా పెళ్ళికలలు కనే పిల్లని ఎలా సముదాయించాలో తెలియక సతమతమయ్యే తల్లి మనో ఘర్షణ చక్కగా చూపించిన కథ. ఇంతా చేసి పెళ్ళీడుకి వచ్చిన పిల్ల పెళ్లొద్దని అనడం, విముఖత చూపించడం తల్లికి తలకాయ నొప్పైంది. ఆ మార్పు ఎందుకో కూతురు తల్లికి జాబు ద్వారా వివరించడమే కథా సారాంశం.
ఆ తరువాత రాధిక ప్రతీ ఏడాది తన పేరుతో ఇచ్చే "రాధిక అవార్డు "ని ఈ సారి శ్రీమతి కొండేపూడి నిర్మల కి ఇస్తూ , ఇప్పటికి తొమ్మిదేళ్లుగా అవార్డు గ్రహీతల వివరాలను తెలిపారు.
తరువాత చిన్నారులు గ్రంథి శ్రీమయి, శ్రీ మైత్రి చక్కటి గాత్రంతో భాగవత పద్యాలు, మంచి పాటలు పాడి శ్రోతల్నిముగ్థులని చేసారు.
కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమం ప్రతీసారిలాగానే చాలా ఆసక్తికరంగా సాగింది. శ్రోతలందరూ ఉత్సాహంగా పాల్గొని రక్తి కట్టించారు. కిరణ్ ప్రభ గారు ఎంత పాప్యులరో మరోసారి ఋజువయ్యింది.
తెలుగు రచయిత వెబ్ సైటు గురించి కె.గీత, పెద్దు సుభాష్ గార్లు వివరిస్తూ తెలుగు రచయిత నిర్వహణ సహకారం అందిస్తున్న "గాటా" కు 501(సి) నమోదు వచ్చిందని, విరాళం ఇచ్చిన వారికి టాక్సు లాభం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఎవరైనా ఇచ్చే విరాళంతో వారి కంపెనీలు కూడా మేచ్ చేస్తాయని, సాహితీ మిత్రులు, సాహిత్యాభిమానులు ఇందుకు సహకారం ఇతోధికంగా అందించమని కోరారు. విరాళం ద్వారా తమకు నచ్చిన రచయిత పేజీని స్పాన్సర్ చేయవచ్చునని, వివరాలకు తెలుగురచయిత డాట్ ఆర్గ్ చూడవచ్చని తెలిపారు.
విరామంతర్వాత జరిగిన కవి సమ్మేళనంలో నూతక్కి రాఘవేంద్రరావు గారు తమ "నానో" లను చదివి వినిపించారు. కొండే పూడి నిర్మల కవిత రాయలేని స్థాయిని గురించిన కవితను, డా|| కె.గీత "తొలి పొద్దు పరిష్వంగం" ను, శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ అమెరికాలోని తెలుగు బడికెళ్తున్న మనవడి గురించి కవితను, శ్రీ రామానుజరావు పైసా మహిమల్ని గురించిన కవితలను వినిపించారు. ఆ తరువాత చక్కటి పద్య పఠనంతో శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, శ్రీ పాలడుగు శ్రీ చరణ్, శ్రీ పిల్లల మఱ్ఱి కృష్ణ కుమార్ వరుసగా సభను అలరించారు.
అక్కిరాజు వారు పెద్దు సుభాష్ గారి సూచన మేరకు పిల్లలకి పద్యం ఎలా పాడాలో నేర్పిస్తానని వాగ్దానం చేసారు.
యువ కవి దీక్షిత శేఖర్ ఆంగ్ల భాషలో తనదైన శైలిలో ఒక కవిత చదివి వినిపించారు. ఆ తరువాత శ్రీ రామానుజారావు, శ్రీమతి కె.గీత, శ్రీమతి విజయ గార్ల చక్కటి పాటల్తో సభ ముగిసింది.
ఇంకా ఈ సభలో శ్రీమతి విజయ ఆసూరి, వారి తల్లి గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి, శ్రీమతి భాస్కర్, శ్రీమతి భాస్కర్, శ్రీమతి ఉదయ లక్ష్మి, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి విజయ, శ్రీ తాటిపామల మృత్యుంజయుడు, శ్రీ కృష్ణబాబు, శ్రీ లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
http://www.koumudi.net/Monthly/2016/july/july_2016_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july2016/veekshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-45 (May8, 2016)

వీక్షణం సాహితీ సమావేశం- 45
-శ్రీ చరణ్ పాలడుగు
వీక్షణం 45 వ సాహితీ సమావేశం మే నెల 8 వ తారీఖున ఫ్రీ మౌంట్ లోని పిల్లల మఱ్ఱి కృష్ణ కుమార్ గారింట్లో ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. సభ శ్రీ సాయిబాబా "నమో వేంకటేశా" అనే కీబోర్డుతో ప్రార్థనా గీతంతో ప్రారంభమయ్యింది. సభాధ్యక్షులు శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు మాట్లాడుతూ ఆనాటి వక్తలు శ్రీమతి కొండేపూడి నిర్మల, శ్రీ రామానుజరావు గార్లను సభకు పరిచయం చేసారు. నిర్మల స్త్రీవాద కవయిత్రులలో మొదటి అయిదు స్థానాలలో నిలిచిన కవయిత్రి అనీ, అనువాదంలో చెయ్యితిరిగిన వారు రామానుజరావనీ అన్నారు.
ముందుగా నిర్మల తన కవితా నేపథ్యాన్ని గురించి మాట్లాడుతూ "వీక్షణం సభలకు రావడం అంటే మళ్లీ మాతృభూమికి వచ్చినంత ఆనందంగా ఉంది" అన్నారు. బాల్యంలో సాహిత్యాభిరుచి పెద్దగా లేదన్నారు. ఉమ్మడి కుటుంబం, నలుగురిలో ఒక అమ్మాయిగా పెరిగానన్నారు. చిన్నతనంలో నాన్న అమ్మ మీద చేసే పెత్తనం, తమ్ముడి పై చూపే ప్రత్యేక శ్రద్ధ ఒక వివక్షత భావన రేకెత్తించేది. చిన్నపిల్లవి, వినకూడదు, వెళ్లిపో వంటి పెద్ద వాళ్ళ మాటలు ఎందుకు? అనే ప్రశ్నని రేకెత్తించి బాగా ఆలోచనని కలిగించేవి.
పెద్దవారికి వార్తాపత్రిక చదివి వినిపించినపుడు రేడియో వార్తలు చదివినట్లు ఉందని పెద్దలు ప్రశంసించేవారనీ, తరువాత ఆకాశవాణిలో అదే స్ఫూర్తితో యువవాణి కార్యక్రమాలు చేసానన్నారు. 18 సంవత్సరాల వయసులో చదువు కంటే కవిత్వమే ఎక్కువ ఆసక్తిదాయకంగా ఉండేదన్నారు. చదువుతో బాటూ జర్నలిజంలో ప్రవేశించేననీ, ఆంధ్రజ్యోతిలో చేరడం ఒక మలుపన్నారు. ఆంధ్రజ్యోతిలో నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గార్లతో పరిచయ భాగ్యం కలిగిందనీ, పురాణం వారి ప్రోత్సాహంతో బాపు బొమ్మలకు కథ వ్రాయడం మంచి అనుభవమనీ అన్నారు. వివాహం తర్వాత కరీంనగర్ లో డొమెస్టిక్ వయొలెన్స్ మీద విషయ సేకరణ, రచన చేసానన్నారు. 1992 లో ఉదయంలో చేరిన తర్వాత హాలీవుడ్ తారల జీవితాల్లో చీకటి కోణాల్ని ఆవిష్కరించాననీ, ట్రాన్స్లేషన్సు చేయడం వల్ల ఇంగ్లీషులో పట్టు దొరికిందనీ, తను రాసిన ఒక కవిత తో ఉద్యోగమొచ్చిందనీ, యూనిసెఫ్ లో పనిచేయడం వల్ల వస్తు వైవిధ్యం తో రచనలు చేయగలిగనన్నారు.మొదటి కథ "మువ్వ మూగబోయింది" తో రచన వృత్తిగా మారిందనీ, లేబర్ రూం కవిత స్త్రీవాదంలో కవిత్వంలో ఒక మలుపనీ, అప్పట్లో స్త్రీవాదం మీద జరిగిన తిరుగుబాటుల్ని ఎదుర్కొన్న మొదటి సిపాయినన్నారు. తన తర్వాత అప్పటికి చిన్నపిల్లగా ఉన్న కె.గీత లాంటివాళ్లు లేబర్ రూం కొనసాగింపు కవితలు రాసారని, చివరగా "లేబర్ రూం" కవితను సభకు చదివి వినిపించారు. ఆ తర్వాత సభలో ఈ కవిత మీద చాలా సేపు చర్చ జరిగింది. ప్రముఖ స్త్రీవాద కవయిత్రుల గురించి చెబుతూ విమల, జయప్రభ, రేవతీదేవి, కె.గీతలను పేర్కొన్నారు.
తర్వాత శ్రీ రామానుజరావు కథా నేపథ్యం చెప్తూ, తండ్రిగారి నుంచి చదవటం అలవాటు అయ్యింది. బందరు హిందూ కాలేజీ లో లెక్చరర్ లక్ష్మణ రావు గారి ప్రభావం తో శ్రీ శ్రీ అభిమానిగా మారానన్నారు. అన్నయ్య "విశ్వ భరత్" తో కలిసి వ్రాసిన కథ మొదటి కథ. ఆదివిష్ణు గారితో పరిచయం ఆయన ప్రభావంతో "దోమల బాధ" అని హాస్య కథ రాయడం జరిగిందన్నారు. 1989లో పుస్తకం అచ్చువేసేననీ, అప్పటి నుంచి అడపాదడపా రాస్తూనే ఉన్నాననీ అన్నారు. అనువాదాలు కూడా చేసానని అన్నారు. ప్రస్తుతం విహంగ పత్రికలో సీరియల్ రాస్తున్నానని చెప్పారు.
ఆ తర్వాత డా||కె.గీత తెలుగు రచయిత ప్రారంభించి నెల రోజులు గడిచిన సందర్భంగా 30 వ పేజీ ఆవిష్కరణ అధ్యక్షులు శ్రీ గంగిశెట్టి గారి చేతుల మీదుగా జరిపించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రచయితలు ఇతోధికంగా సహకరించి తెలుగు రచయిత ను ముందుకు తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి చేసారు. క్రమం తప్పకుండా రోజుకొక రచయిత పేజీ వెబ్ లో ప్రత్యక్షం కావడం చిన్నవిషయం కాదనీ మనందరం అభినందించవలసిన గొప్ప కార్యక్రమం "తెలుగు రచయిత" అని శ్రీ గంగిశెట్టి కొనియాడారు.
చక్కని విందు తో జరిగిన విరామం తర్వాత కిరణ్ ప్రభ గారి సాహితీ క్విజ్ అత్యంత ఆసక్తి దాయకంగా కొనసాగింది.
కవితా పఠనంలో కె.గీత "కనుపాప సవ్వడి" కవితను, సాయిబాబా "బ్లాండు కన్య పూర్ణమ్మ" హాస్య కవితను, శ్రీ చరణ్ "మదర్శ్ డే పద్యం, సోమవార స్తుతులు", నిర్మల "పద్యమైనా, చేపైనా అంటూ" వచన కవితను వినిపించారు. చివరగా వరకూరు గంగా ప్రసాద్ గారు రచించిన పాటను వారి అమ్మాయి ఈశా సభలో రాగయుక్తంగా ఆలపించింది.
ఈ సభలో శ్రీ లెనిన్, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి రాణి, శ్రీ చుక్కా శ్రీనివాస్, శ్రీతాటిపామల మృత్యుంజయుడు, వేమూరి సోదరులు, శ్రీ అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. వీక్షణం 45 సమావేశాలు జరుపుకోవడం అత్యంత ఆనందదాయకమని అంతా కొనియాడారు.
http://www.koumudi.net/…/june_2016_vyAsakoumudi_vikshanam.p…
http://www.siliconandhra.org/…/suj…/june2016/veekshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-44 (Apr10, 2016)

వీక్షణం - సాహితీ గవాక్షం-44
- శ్రీ చరణ్ పాలడుగు
వీక్షణం-44 వ సాహితీ సమావేశం ఏప్రిల్ నెల 10 వ తారీఖున కిరణ్ ప్రభ గారింట్లో జరిగింది. శ్రీ వేణు ఆసూరి అధ్యక్షత వహించిన ఈ సభలో ముందుగా శ్రీ సుభాష్ పెద్దు "అనసూయమ్మ కబుర్లు" అనే అంశం పై ప్రసంగించారు. శ్రీమతి వింజమూరి అనసూయాదేవి సంగీత ప్రతిభాపాటవాలను వివరిస్తూ కొనసాగిన ఈ ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. దేవులపల్లి వారి మేనగోడలైన అనసూయా దేవి భావ సంగీతానికి, లలిత సంగీతానికి స్వరాలు కూర్చిన మొదటి స్త్రీ అని అన్నారు. ప్రజలు చిన్నచూపు చూసే జానపద సంగీతానికి సేకరణ, స్వరపరచడం ద్వారా గొప్ప ప్రాముఖ్యతని కల్పించారు ఆమె. ఇవేళ జానపద గేయాలు పీ.ఎచ్.డీ చేసే స్థాయికి ఎదిగాయంటే అది ఆవిడ చలవేనన్నారు. అనసూయాదేవి శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఆలిండియా రేడియో మద్రాసు వ్యస్థాపక గాయకుల్లో ఒకరు. వీరికి ప్రభుత్వం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. దేవులపల్లి వారి "జయ జయ ప్రియ భారత జనయిత్రీ" వంటి అనేక గీతాలకు స్వర కల్పన చేసారు. ఇప్పుడు 96 ఏళ్ళ వయసులో ఉన్న యువతి అని కొనియాడారు. అనసూయాదేవి గారి జీవిత విశేషాలను, ఇతరులకు తెలియనివెన్నో వివరాలను సేకరించానని, ప్రత్యేకించి తాను స్వయంగా రెండు సం. రాలపాటు ఆవిడ జీవితచరిత్రను చెప్తూండగా రాసి పుస్తకప్రచురణకు తోడ్పాటు చేసి ఆవిడ గీతాల పట్ల ఉన్న అభిమానానికి చిరు కానుకగా సమర్పించానని అన్నారు సుభాష్. ప్రసంగానికి ముక్తాయింపుగా వింజమూరి అనసూయాదేవి సేకరించిన జానపద గేయం "నోమి నోమన్నలాల"ను కె.గీత ఆలపించారు.
తర్వాత శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు కథా పఠనం లో భాగంగా "శిక్ష" కథను చదివి వినిపించారు. "సైన్స్ ఫిక్షనులో అందె వేసిన చేయి" వేమూరి అని సభాధ్యక్షులు వేణు ఆసూరి కొనియాడారు.
ఆ తర్వాత డా|| కె.గీత "తెలుగు రచయిత" వెబ్ సైటు తొలి రచయితల పేజీ "కందుకూరి వీరేశలింగం పంతులు" ను సభలో శ్రీ వేమూరి, కిరణ్ ప్రభ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసారు. నిర్వహణ బాధ్యతలను వివరిస్తూ అనేక ప్రయాసలకోర్చి రచయితలందరికీ ప్రత్యేక పేజీలను రూపొందిస్తున్నామని అన్నారు. ఇందుకు వేణు ఆసూరి, సుభాష్ లతో పాటూ తాను సంస్థాపించిన "గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు ఆథర్స్" విశేషంగా సహాయ సహకారాలను అందజేస్తూందని, రచయితలంతా తమ వంతు సహకారాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా శ్రీ అక్కిరాజు రమాపతి రావు తాను పీ.ఎచ్.డీ చేసిన కందుకూరి వారి గురించి ప్రసంగించారు. "ఆధునిక ఆంధ్రదేశం అఖండ గోదావరీ అయితే, నాసికాత్ర్యయంబకం కందుకూరి" అన్నారు. వెయ్యేళ్ల తెలుగు చరిత్రలో రెండే యుగాలున్నాయని, అవి నన్నయ యుగం, వీరేశలింగం యుగం అని కొనియాడారు. ఆయన తన 71 సం.వత్సరాల జీవితంలో 134 గ్రంథాలు రచించారని, కృష్ణశాస్త్రి అన్నట్లు "మరణించేవరకూ వీరేశలింగానికి మరణించే తీరిక లేదని " అన్నారు. తను స్వయంగా ప్రయాసలకోర్చి సాగించిన పరిశోధనల్ని గుర్తు చేసుకున్నారు.
వీరేశలింగం గారితో సమానంగా రచనల్ని చేసిన రమాపతిరావు గారిని "21 వ శతాబ్దపు వీరేశలింగం" గా గీత కొనియాడారు.
శ్రీ చరణ్ అప్పటి కప్పుడు ఆశువుగా అక్కిరాజు గారిపై పద్యం అల్లారు.
"శ్రీ కందుకూరి రసధి
ప్రాకట రాకేందు "రమాపతి"! మంజుశ్రీ
మాకీవే ఆంధ్ర కవన
లోకాంబుధి వారధి! వయ! రోచిస్సాంద్రా!"
తేనీటి విరామం తర్వాత జరిగిన సాహితీ క్విజ్ తో కిరణ్ ప్రభ సభలో అందరినీ ఉత్సాహితుల్ని చేసారు.
కవి సమ్మేళనంలో భాగంగా శ్రీచరణ్ "ఉగాది పద్యాలు", కె.గీత రాష్ట్ర విభజనని గురించిన "నేనెవ్వరిని?" కవితని, పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ "ఉగాది చంపక మాలలు" వినిపించారు.
చివరగా శ్రీ ఇక్బాల్ "ఐనా నేను ఓడిపోలేదు" శ్రీమతి జ్యోతిరెడ్డి స్ఫూర్తిదాయక ఆత్మకథను సభకు పరిచయం చేసారు.
ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో శ్రీ & శ్రీమతి ఉదయ, శ్రీమతి శాంత, శ్రీమతి ఉమ, శ్రీ శివచరణ్ మొ.లైన వారు పాల్గొన్నారు.
http://www.koumudi.net/…/may_2016_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/…/suja…/may2016/veekshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-43 (Mar13, 2016)

వీక్షణం - సాహితీ గవాక్షం-43
                                                                                                         - సుభాష్ పెద్దు

మార్చి నెల వీక్షణం సమావేశం 13 వ తారీఖున ఫ్రీ మౌంట్ లో వేణు ఆసూరి గారింట్లో జరిగింది. వేణు గారు సమావేశానికి ఆహ్వానం పలుకుతూ "వీక్షణం గురించి మొదట విన్నప్పుడు వీకెండ్ లో సమావేశమా?" అనుకున్నాను. కానీ ఒకసారి అటెండ్ అయ్యేక ఇక "ఎప్పుడెప్పుడా" అని ఎదురుచూపు మొదలయ్యింది అన్నారు. వీక్షణంలో రచయితల భాగస్వామ్యాన్ని కొనియాడుతూ, యువతని అధికంగా భాగస్వామ్యుల్ని చేసే ఆలోచన చేయాలని అన్నారు.
అక్కిరాజు రమాపతి రావు అధ్యక్షత వహిస్తూ భాస్కర శతకం నుంచి "పండితులైన వారు" పద్యంతో ప్రారంభించారు. రచయిత భాషను 'జీవభాష'గా మలచాలన్నారు. తిక్కన పద్యాలు ఈ కాలానికీ సులభ సాధ్యం కావడం ఇందుకు ఉదాహరణ అన్నారు.
సభలో ముందుగా పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ "ఫ్రీవిల్" గురించిన పరిశోధనాత్మక ప్రసంగం చేసారు. భారత దేశంలోను, పాశ్చాత్య దేశాలలోను "ఫ్రీవిల్" మూలాల్ని గురించిన ఆలోచనాత్మక ప్రసంగం ఇది. తర్వాత మహమ్మద్ ఇక్బాల్ "కావ్యాలలో పీఠికలు" అనే అంశాల పై ప్రసంగించారు. భారత అవతారికను ప్రధానంగా ఉదహరిస్తూ కావ్యాలలో పీఠికలు కవి కాలాదులు, అంకితం, జీవిత విశేషాలు మొదలైన విషయాలకు నిలయాలని చెప్పారు. పాల్కురికి సోమనాధుని, శ్రీనాధుని కావ్యాలలో అవతారికల విశేషాలను ఆసక్తి దాయకంగా వివరించారు. 'కవికి, పాఠకునికి మధ్య వారధి పీఠిక' అని ముగించారు.
తర్వాతి కార్యక్రమం "తెలుగు రచయిత" వెబ్ సైటు హోం పేజీ ఆవిష్కరణ. "తెలుగు రచయిత" వెబ్ సైటు హోం పేజీ ఆవిష్కరణ డా||కె.గీత , శ్రీ వేణు ఆసూరి, శ్రీ సుభాష్ పెద్దు ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ ప్రభ చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా డా||కె.గీత మాట్లాడుతూ " వెయ్యి సంవత్సరాలకు పైబడి సాహిత్య చరిత్ర, ఏ ప్రపంచస్థాయి సాహిత్య ప్రమాణాలకూ తీసిపోని పరిపుష్ఠమైన సాహిత్య సృష్టీ, విశిష్టఆశుకవితా ప్రక్రియలూ, కాలంతో పాటే రూపురేఖలు మార్చుకున్న ఛందో రూపాలూ, ఒక్క శతాబ్దకాలంలోనే ఎన్నో సాహిత్యోద్యమాలూ చూసింది తెలుగు. భాషాపరిణామం, తత్త్వచింతన, ఇతిహాసం, పురాణం, జానపదసాహిత్యం, సంగీతం, నాటకం, నవల, కథ, కవిత, వ్యాసం, చరిత్ర, జీవిత చరిత్రలు, యాత్రా కథనాలు, రేడియో, టీ.వీ మాధ్యమాలకు అనుగుణంగా మలుచుకున్న సాహిత్యప్రక్రియలూ, వీటన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించిన గొప్ప గొప్ప రచయితలు మనకు ఉన్నారు." అన్నారు.
చరిత్రను, విలువైన చారిత్రక ఆధారాలను, గొప్ప సాహిత్యకారుల జీవిత, రచనా విశేషాలనూ, వారు నివసించిన గృహాలనూ, వినియోగించిన వస్తువులనూ జాతి సంపదగా భావించి పదిలపరచుకోవలసి ఉన్నదనీ, మన కళ్ళముందే జీవించి, సాహిత్యాన్నీ, జీవన విధానాన్నీ ప్రభావితం చేసిన వ్యక్తులు మన మధ్యనుండి కనుమరుగవగానే, వారి సాహిత్యం అదృశ్యం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనకున్నదనీ, తమ జీవితాన్ని భావితరాల అభివృద్ధికీ, అభ్యున్నతికీ ధారపోసిన వ్యక్తుల గురించిన సమాచారం చెదలు పట్టకుండా జాగ్రత్త పరచుకోవడం మన కనీస ధర్మమనీ' అన్నారు.
చరిత్ర లో నిలిచిపోయే ఈ వెబ్ సైటు ఆశయాలు కార్యరూపం దాల్చడానికి రచయితలందరూ సహకరించాలని కోరారు. వెబ్ సైటు పూర్తి రూపం దాల్చి మొదటి రచయితల పేజీ రాబోయే ఉగాది నాడు ప్రారంభించబడుతుందని చెప్పారు. వెబ్ సైటు సేకరణలో ఎంతో సహకరిస్తున్న శ్రీ నౌడూరి మూర్తిగారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రచయితలు తమ రచనలనూ, జీవిత విశేషాలనూ http://www.telugurachayita.org/ లేదా http://www.teluguwriter.org/ లో సమర్పించవచ్చని అన్నారు.
తెలుగు రచయిత వెబ్సైటు నిర్వహణకు తొలి మెట్టు గా "గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు ఆథర్స్" -గాటా (Global Association of Telugu Authors-GATA) నాన్ ప్రాఫిట్ సంస్థ కె.గీత, వేణు ఆసూరి, సుభాష్ పెద్దు ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. వేణు, సుభాష్ గార్లు మాట్లాడుతూ "గాటా" వివరాలు అందరికీ తెలియజేసారు.
సభను అత్యంత ఆసక్తిదాయకంగా మలిచే సాహితీ క్విజ్ కార్యక్రమం కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన పిదప విరామపు విందు జరిగింది.
విరామానంతరం కార్యక్రమంలో జరిగిన కవి సమ్మేళనంలో కె.గీత "వీక్షణ నిరీక్షణ" అనే కవితను, షంషాద్ "ఎలిజీ" అనే తనకు నచ్చిన భాస్కర భట్ల కవితను చదివి వినిపించారు. తర్వాత వేణు "యోగ నిద్ర" కవితను వినిపించారు.
చివరగా వీనుల వీందైన పాటల కార్యక్రమం లో శ్రీమతి విజయ సినిమా గీతాన్ని, శ్రీమతి అపర్ణ దైవ భక్తి గీతాన్ని, డా||కె.గీత దేవుల పల్లి రచించిన "మధూదయంలో " లలిత గీతాన్ని ఆలపించి సభను అలరించారు. ఈ పాట గురించి దేవులపల్లి మేనగోడలైన వింజమూరి అనసూయా దేవి గారు చెప్పిన విశేషాలను సుభాష్ సభతో పంచుకున్నారు.
ఎడతెరిపి లేని వాన కురుస్తున్నా సభకు విచ్చేసి ఆద్యంతం ఆసక్తిగా విన్న సభలోని వారికి, సభకు ఆతిథ్యమిచ్చిన వేణు, విజయ ఆసూరి దంపతులకు కృతజ్ఞతలతో సభ ముగిసింది.
ఈ సభలో శ్రీ కృష్ణబాబు, శ్రీ సుబ్బారావు, శ్రీమతి కాంతి, శ్రీమతి వందన, శ్రీమతి ఇక్బాల్, శ్రీమతి సుబ్బలక్ష్మి మొ.న వారు పాల్గొన్నారు.
http://www.koumudi.net/Monthly/2016/april/april_2016_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/april2016/veekshanam.html

వీక్షణం - సాహితీ గవాక్షం-42 (Feb14, 2016)

వీక్షణం - సాహితీ గవాక్షం-42
- సుభాష్ పెద్దు
వీక్షణం-42 వ సమావేశం ఫిబ్రవరి 14, 2016 తారీఖున, అనగా రథసప్తమి నాడు, క్యుపర్టీనో నగరములోని పాలడుగు శ్రీ చరణ్ గారి స్వగృహమున జరిగినది. ఈ సభకు ప్రముఖ రచయిత, వీరేశలింగంగారి జీవిత చరిత్ర పరిశోధన కర్త అయిన అక్కిరాజు రమాపతి గారు అధ్యక్షత వహించారు.
ఈ సభలో సరికొత్త ముఖ్యాంశం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు రచయితల పూర్తి వివరాలను, రచనలను, వారి శ్రవణ, దృశ్య మాలికలను పొందు పరిచేందుకు "తెలుగు రచయిత" అంతర్జాల స్థావరము (వెబ్ సైటు) ను డా॥ గీతా మాధవి గారు ప్రకటించారు. అధ్యక్షులు అక్కిరాజు రమాపతి గారిచే ఈ బృహత్ కార్యక్రమము ఆవిష్కరించబడినది. తెలుగు రచయితల గురించి సంపూర్ణ వివరములన్నీ భావి తరాలకు అందుబాటులో ఉండే విధంగా ఒక చోట భద్రపరచడం ధ్యేయంగా తనకు వచ్చిన ఆలోచనను ఒక ఉద్యమముగా రూపొందించడానికే ఈ ప్రయత్నము అని గీత గారు వివరించారు. అధ్యక్షులు రమాపతి గారు "తెలుగు రచయిత" ప్రణాళికనీ, ధ్యేయాన్ని అభినందిస్తూ "ఇది చాలా పెద్ద కార్యక్రమము. ఏ పెద్ద యూనివర్శిటీ వారో, సంస్థ వారో చేయవలసిన పనిని గీత చేస్తోంది. పైగా ఆడియో, వీడియో లను కూడా పెడుతున్నారు. ఈ ప్రయత్నము చాలా గొప్పది, దీనిని అందరూ ప్రోత్సహించ వలసినదే" అని తెలిపారు.
అధ్యక్షులు అక్కిరాజు రమాపతి గారి ప్రారంభోపన్యాసము: "నేను వయసులో పెద్దవాడిని. ఇక్కడ ఉన్న వారిలో పాత తరము ప్రముఖ రచయితలతో పరిచయము కలిగిన వాడిని ప్రస్తుతము నేనేనేమో. నాకు ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులతో పరిచయము కలిగింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, మామిడిపూడి వెంకట రంగయ్య, కంభంపాటి రామ శాస్త్రి (హరిజన బాలికను పెండ్లి చేసుకున్న సంఘ సంస్కర్త), దామెర్ల వెంకట్రావు (దామెర్ల రామారావు గారి పిన తండ్రి కొడుకు), తారకం, వేముల కూర్మయ్య, అయ్యదేవర కాళేశ్వర రావు గారితో మంచి పరిచయముండేది. నేను బహుశా కలవని ఆనాటి ప్రముఖులు శ్రీ పాద సుబ్ర హ్మణ్య శాస్త్రి, అడివి బాపిరాజు గారు మాత్రమే.
రఘుపతి వెంకటరత్నము నాయుడు గారు నిజంగానే బ్రహ్మర్షి. ఒకసారి ఆయన బెజవాడ నుండి మద్రాసు ప్రయాణం చేస్తున్నప్పుడు పొన్నేరి రైల్వే స్టేషన్లో దిశ మొలలతో తిరుగుతున్న ఇద్దరు అనాధ బాలికలు కనిపించారు. వారు మద్రాసు చేరుకోగానే పట్టాభి సీతారామయ్యగారిని పంపించి ఆ ఇద్దరు బాలికలను తన దగ్గరకు తెప్పించి, చదువు చెప్పించి ప్రయోజకులను చేసారు. పట్టాభి గారిని పిల్లలు ఎత్తుకుపోతున్నారని ముందు పోలీసులు అడ్డగించారట. కానీ, తరువాత రఘుపతి వెంకటరత్నం గారు తీసుకురమ్మన్నారని తెలిసిన తరువాత అభ్యంతరం తెలుపలేక పోయారట.
నేటి తరం ఆనాటి మహనీయులను మరచిపోవటం నిస్పృహని కలిగిస్తున్నది.
తరువాత వెంకట నాగ సాయి గారు "అదిగో అల్లదివో --" అన్నమచార్య కీర్తనతో సభను అలరింప చేసారు.
మొదటి ప్రసంగం మహమద్ ఇక్బాల్ గారిది. వారు ఏనుగుల వీరాస్వామయ్య గారు 200 సంవత్సరముల క్రితము వ్రాసిన "కాశీ యాత్రా చరిత్రము" నుండి కృష్ణా, గోదావరి మధ్య దేశపు వివరాలను వివరించి, ఇక్బాల్ గారి చిన్నతనములో కర్నూల్ నుండి హైదరాబాద్ వరకూ వారు ప్రయాణించిన దారి సాపేక్షతను చూపారు. కాలం మారినా ఆ దారి, దారిలోను, హైదరాబాద్ నగరములోని అంగళ్లు నేటికి కూడా పెద్ద మార్పులు లేకుండా కనబడుతున్నాయని వివరించారు.
వీరాస్వామయ్య గారిని ట్రావెలాగ్ వ్రాయమని సి.పి. బ్రౌన్ గారు ప్రోత్సహించారని అధ్యక్షులువారు రమాపతి గారు తెలిపారు.
ఇక్బాల్ గారి ప్రసంగ విశేషాలు: ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్ర చరిత్రము తెలుగులో మొదటి ట్రావెలాగ్. వీరాస్వామయ్య గారు ఈ పుస్తకములో ఆనాటి దేశ, కాల, పర్యావరణ పరిస్థితులని విపులంగా వర్ణించారు. వీరాస్వామయ్య గారు మద్రాసులో అదాలత్ కోర్టులో మొదటి ద్విభాషా అధికారి. అనగా తెలుగు, ఆంగ్ల భాషలలో కోర్టు వ్యవహరాలను నడిపినవారు. ఆయన ఆ రోజులలో 5000 మందికి ఏకాదశి భోజన సంతర్పణ చేసేవారు.
ఆయన వ్రాసిన చరిత్రలో ఒంటిమిట్ట పోతన గారి విగ్రహము దగ్గరనుండి, దారిలో ఒక బండరాయి పైన ఇంకొక బండరాయి నిలబడడము దాక చక్కని వర్ణన. అవి అన్నీ నేటికీ కనబడతాయి. ఆయన జడచర్ల, శంసాబాదు, బేగంబజారు, కార్వాన్, చంద్రఘట్టం, శాలిభండ మొదలయినవి పేర్కొన్నారు. నేటి హైదరాబాద్ లోని ఇంగ్లీషు వారి దండు (Military Cantonment) గురించి, తురకల జపశాల (అనగా మక్కా మసీదు), ముర్గీ చౌక్, గుజ్రీ అంగడి, నిజాం దేవిడీ మొదలైనవి పేర్కొన్నారు. ప్రతి ప్రదేశము గురించి విపులంగా పేర్కొన్నారు. ఉదాహరణకి గుజ్రీ అంగడిలో 200 సంవత్సరముల క్రితము పాత సామాన్లు అమ్ముతున్నారని చెప్పారు. నేటికి కూడా గుజ్రీ అంగడిలో పాత సామాన్లు (పాత్రలు, బుత్తలు మొదలైనవి) అమ్మటము చూడవచ్చు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో ఆయుధాలే భూషణములుగా ధరించి తిరిగేవారిని పేర్కొంటూ, వారితో వ్యవహరించటానికి "వాక్ పౌరుష్యము" కావాలని చెప్పారు. నేటి టాంక్ బండ్ పై జాతులవారిని (తెల్లవారిని) తప్ప వేరెవరినీ ఎక్కనిచ్చే వారు కాదని పేర్కొన్నారు. ఇంకా గోలకొండ, నిజాము దేవిడి దగ్గరి బగీచా లో పైకి లేచే జలధారలు (Fountains) గురించి వర్ణించారు. నిజాము రాజ్యం కుంపిణీకి (East India Company) నెలకు 3 లక్షల రూపాయలు చెల్లించేదని వివరించారు.
రమాపతి గారు ఆనాటి విశేషాలు చెపుతూ, "ఒకసారి మంధురాంతకం రాజారావు గారిని ఒక పెద్దాయాన మీరు ఆరోగ్యం బాగా చూసుకోండి అని చెప్పేరట. అప్పటికి రాజారావు గారికి వయసు పైబడింది. రాజారావు గారు, "ఏమీ ఫర్వాలేదు, నా ఆఖరి రచన అయ్యేదాకా నా ఆరోగ్యానికి డోకా లేదు" అని చెప్పారు. వెంటనే మొదటి పెద్దమనిషి, "అయితే మీరు ఆఖరి రచన చెయ్యబాకండి" అని సలహా ఇచ్చాడట." అని అన్నారు.
తరువాతి కార్యక్రమము "తెలుగు రచయిత" కు శంఖారావము. ఈ కార్యక్రమంలో తెలుగు రచయిత ప్రకటన పత్రం ఆవిష్కరణ అధ్యక్షులు రమాపతిరావు గారు, శ్రీ వేమూరి, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ వేణు ఆసూరి, శ్రీ సుభాష్, డా॥కె.గీత ల చేతుల మీదుగా జరిగింది. గీత గారి ప్రసంగం తర్వాత తెలుగు రచయిత కమిటీ సభ్యులు వేణు ఆసూరి, సుభాష్ గార్లు కార్యక్రమ ఇతర వివరాలు తెలియజేసారు. ఈ బృహత్ కార్యక్రమానికి తొలి ఆమోద ముద్ర "తానా" నించి రావడం ముదావహమని మొదటి చెక్కు ఇచ్చి ఆర్థిక సహకార ప్రారంభం చేసిన శ్రీ చరణ్ అన్నారు. ఇందులో మూడు విధాలుగా సహాయం చెయ్యవచ్చని గీత గారు ప్రకటించారు. 1) రచయితలు తమ పూర్తి సమా చారాన్ని అందజెయ్యవచ్చు. 2) రచయితలు తమకు తెలిసిన రచయితల సమాచారాన్ని లేదా గత రచయితల రచనలూ, వివరాలూ, ఫోటోలూ, ఆడియో, వీడియో టేపులూ వివరాలు తెలియజెయ్యవచ్చు. 3) ఆర్థిక సహాయం చెయ్యవచ్చు. 'రచయితల పరిచయ పత్రం' మొ.న వివరాలకు ఈ మెయిల్ telugurachayita@gmail.com ద్వారా సంప్రదించవచ్చని అన్నారు.
కవి సమ్మేళనం విశేషాలు:
1. రథసప్తమి సందర్భముగా వేణు ఆసూరి గారు శ్రీ కృష్ణార్జున యుద్ధం లో ఘంటశాల గారు పాడిన శ్లోకాన్ని, శ్రావ్యముగా పాడారు.
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
అక్కిరాజు సుందర రామకృష్ణ గారు పంపిన సందేశాన్ని, వారు వ్రాసిన ఈ కింది పద్యాన్ని కూడా చదివి వినిపించారు.
వర గుణు డైన"మారుతి"కె వ్యాకరణంబులు నేర్పినట్టి,స
ద్గురుడు,ప్రచండ తేజు డయి గొప్పగ దోచెడు పద్మ మిత్రుదౌ
గరిమను ,పండితా ళియు ఘనంబుగ మెచ్చ,వచించి నట్టిశ్రీ
చరణుని,"విశ్వ బంధు"నిగ సల్పును గావుత సర్వ దేవతల్!
అవని సురులకు గాయత్రి "అమ్మ" యనుట
"కల్పకం"బనుటలవి నిక్కంబు గాదు!
సత్య మరయంగ "గాయత్రి "సకలురకును
కన్న తల్లియే! ఒక్కింత మిన్న గూడ!
2. పాలడుగు శ్రీ చరణ్ గారు రథసప్తమి సందర్భముగా మయూరుని సూర్య శతకము గురించి చదివిన శ్లోకము, వివరణ:
శ్రీ చరణ్ గారు రధసప్తమి సందర్భముగా చేసిన ప్రసంగం:
మయూరుడు సూర్యాష్టకము, సూర్యశతకము రచించినాడు. మయూరిడికి కుష్ఠు వ్యాధి వచ్చినప్పుడు రోగ నివారణ కొరకు సూర్యుడిని స్తుతించుతూ ఈ సూర్య శతకము చెప్పినాడు. ఈ స్తుతితో సూర్యుడు ప్రత్యక్షమై మయూరిడికి రోగ విముక్తి కలిగించాడు. ఇది అత్యుత్తమమైన కవిత్వము. ఈ వర్ణన ఎంత గొప్పగా ఉన్నదంటే, శ్రీనాధుడు కాశీఖండములో సూర్య స్తుతి కోశము మయూరిడి శ్లోకాలని యథాతథముగా అనువదించాడు.
రాజశేఖరుడు అనే కవి మయూరిడి ప్రతిభ గురించి ఈ విధముగా వర్ణించాడు:
దర్పం కవి భుజంగానామ్ గతా శ్రవణగోచరమ్
విశ్వవిద్యేవ మయూరి మయూరి వాన్ నికృంతతి
దర్పముతో కూడిన నాగులకు (భుజంగములకు) మయూర శబ్దముతో గర్వము ఎలా నశించుతుందో
దర్పంతో కూడిన దుష్కవులకి మయూరుని పాండిత్యము వలన నాశనము కలుగుతుంది.
3. వెంకట నాగ సాయి గారు "బ్లాండు కన్య" అంటూ చక్కని హాస్యముతో కూడుకున్న పద్యాలని వినిపించి అందరినీ కడుపుబ్బ నవ్వించారు.
4. డా ॥ కె. గీత గారు అరుణ్ సాగర్ నివాళి గా రాసిన "మంత్ర పుప్పొడి" కవిత్వ పఠనం చేసారు.
కొన్ని పంక్తులు:- 
కవికి మరణం ఉందేమో కవిత్వానికి మరణం లేదు కదూ!
రచయిత కాల గర్భంలో కుంచించుకు పోతున్న
నీటి బొట్టు చివరి ఊపిరి చిత్రం నన్ను మెలకువలోనూ వెంటాడుతూంది.
అనుభవైక వేదననీ అనుభూతుల వెల్లువని
అనుక్షణం అక్షరీకరించే కవి హృదయాన్ని
ఇక సజీవీకరించవలసిందే-
5. కూరపాటి భాస్కర్ మాట్లాడుతూ తమ వంటి ఆరునెలల అతిథులకి వీక్షణం కార్యక్రమాలు ఉపిరినిస్తున్నాయని అన్నారు. కార్యక్రమాలకు కొన్ని సూచనలు ఇచ్చారు.
వీక్షణం కార్యక్రమములో అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ , ఆహ్లాదముగా పాల్గొనే కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమము ఎంతో ఆసక్తిగా కొనసాగింది. సభలో తెలుగు పండితులు, కవులు చాలా మంది ఉన్నారు. శ్రీమతి వందన, శ్రీమతి సాయిబాబా, శ్రీమతి భాస్కర్, శ్రీమతి & శ్రీ కొండారెడ్డి, శ్రీమతి లత వెంపటి, శ్రీమతి తాయిబా , శ్రీ మన్సూర్, శ్రీ ప్రసాద్ నల్లమోతు, శ్రీ లెనిన్, శ్రీ గోపాల స్వామి, శ్రీ చుక్కా శ్రీనివాస్ మొ.న పలువురు ఇందులో పాల్గొన్నారు.
http://www.koumudi.net/…/march_2016_vyAsakoumudi_vikshanam.…
http://www.siliconandhra.org/…/suja…/march16/veekshanam.html


వీక్షణం - సాహితీ గవాక్షం-41 (Jan10, 2016)

జనవరి 10, 2016 న ఫ్రీమౌంట్ లో తాయిబా మన్సూర్ గారింట్లో జరిగిన వీక్షణం 41 వ సమావేశం ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.
ఈ సమావేశానికి శ్రీ మహమ్మద్ ఇక్బాల్ గారు అధ్యక్షత వహించారు. సభకు తాయిబా, మన్సూర్ దంపతులు ఆహ్వానం పలికారు. ముందుగా శ్రీ నాగ సాయిబాబా కీబోర్డుతో బాటూ గానాన్ని మిళితం చేసి సభను అలరించారు. సభాధ్యక్షులు ఇక్బాల్ గారు రమణ గారి "కోతి కొమ్మచ్చి" లోంచి కొన్ని ఘట్టాల్ని అందరికీ చదివి వినిపించారు.
ఆత్మకథ రాయడానికి ప్రోత్సాహం కలిగించిన వేమూరి బలరాం గారి మాటలతో మొదలుకుని, బాల్యంలోని పేదరికపు అనుభవాలు, బాపూతో స్నేహం, సినీ ప్రస్థానంలో ఎదురైన చేదు అనుభవాల వరకు ప్రతీ సంఘటనా హాస్యంతో మిళితం చేసి, ఎక్కడా దాపరికం లేకుండా తన గురించి చెప్పుకున్నారు శ్రీ ముళ్లపూడి రమణ.
తరువాత శ్రీ భాస్కర్ "కందుకూరి శ్రీ రాములు కవిత్వ పరిచయం" చేసారు. మట్టి పరిమళం వేసే కవిత్వం శ్రీ రాములి కవిత్వం అనీ, కవిత్వం ఎంత స్వచ్ఛమైనదో అతని వ్యక్తిత్వమూ అంత స్వచ్ఛమైనదని కొనియాడారు. మిత్రులు "కంశ్రీ" గా పిల్చుకునే కందుకూరి తనకు చిరకాల "ద్వారకా" మిత్రుడని చెప్పుకొచ్చారు. పుస్తకంలోని కొన్ని కవితా పంక్తుల్ని ఉదహరిస్తూ అతని కవిత్వాన్ని పుస్తక రూపంలో పరిచయం చేసిన సౌభాగ్య కవిత్వాన్ని కూడా ఉదహరించారు. తేనీటి విరామం తర్వాత శ్రీమతి బండారి విజయ గారు భానుమతి పాడిన చక్కని సినీ గీతాల్ని ఆలపించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసారు. శ్రీ కిరణ్ ప్రభ అందరినీ ఆసక్తి దాయకుల్ని చేసి ఎప్పటిలా క్విజ్ కార్యక్రమంతో కట్టిపడెయ్యడమే కాకుండా సుభాష్ చంద్ర బోస్ జీవితం గురించి తనదైన చక్కని బాణీలో వివరించారు. సుభాష్ చంద్రబోస్ విభిన్నమైన, విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడని, భారత దేశ చరిత్రలో అంతటి ధైర్యమూ, తెగువ కలిగి, నిస్వార్థంగా పనిచేసిన నేత మరొకరు లేరని కొనియాడారు. ఆ రోజుల్లో అయ్యేఎస్ ఉత్తమ శ్రేణి లో సాధించినా స్వాతంత్రం కోసం ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసిన ఉత్తముడన్నారు. గాంధీకి ఎదురు నిలబడి జాతీయ కాంగ్రెస్ కు రెండు సార్లు అధ్యక్షుడిగా నిలిచారన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడ్తూ కూడా జర్మనీలో దేశ స్వాతంత్రం కోసం పాటుపడడం, "అజాద్ హింద్ ఫౌజ్" ను నడిపించడం వంటి గొప్ప బాధ్యతలను భుజస్కంధాల మీద మోసారన్నారు. ఆయనకు ప్రతీ అడుగులోనూ సహరించిన తెలుగు వారైన "అబీఊద్ హస్సన్", "దాట్ల సూర్య నారాయణ రాజు" మొ.న వారి నిస్వార్థ సేవను కూడా వివరించారు.

ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమం లో డా|| కె.గీత "సెలయేటి దివిటీ" కవితని "నువ్విక్కడ లేవు అయినా జ్ఞాపకాలవెన్నెల దివిటీతో దారి వెతుక్కుంటూ ఇక్కడిక్కడే తచ్చాడుతున్నాను- నీ క్షేత్రంలో మొలకెత్తిన పంటల మధ్య తిరుగుతున్నాను..." అంటూ వినిపించారు. శ్రీ సాయిబాబా కొన్ని సరదా "రుబాయతులు" తెలుగు ను, ఉర్దూను కలిపి వినిపించారు.

చివరగా శ్రీ లెనిన్ కథలు, కవిత్వంలో ఉండవలిసిన ముఖ్యాంశాల గురించి వివరించారు. ఆద్యంతం అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సాహిత్యాభిమానులు ఆసక్తి గా పాల్గొని సభను జయప్రదం చేసారు.
------

వీక్షణం - సాహితీ గవాక్షం-40 (Dec13, 2015)



వీక్షణం - సాహితీ గవాక్షం-40 
- నాగరాజు రామస్వామి
మబ్బు కమ్మిన మధ్యాన్నపు ఆకాశం. నేల రాలుతున్న వర్ష ధారలను చీల్చుతున్న ఈదురు గాలి. వెచ్చని కోటు వేసుకున్నా జివ్వు మంటూనే వుంది వొళ్లు. కాని, బెదిరే దెవ్వరు!? వలస నేల మీద తెలుగు పలుకుతూనే వుంది, మధుర సాహిత్య మధు కలశం తొణకుతూనే వుంది!
ఈ వాతావరణ నేపథ్యంలో, ఈ నెల 'వీక్షణం' సమావేశం అనిల్ రాయల్ గారి ఇంట్లో మిల్ పీటాస్, కాలిఫోర్నియాలో నిరాఘాటంగా జరిగింది. అధ్యక్షులు వేమూరి వేంకటేశ్వర రావు గారు. ముఖ్య అతిథులు చిర్రావూరి శ్యాం ( మెడికో శ్యాం ) గారు.
కిరణ్ ప్రభ గారు విలక్షణ కథకులైన శ్యాం గారిని పరిచయం చేస్తూ, వారు 70/80 దశకాలలో విజయనగరం ప్రాంతంలోని ప్రసిద్ధ కథకులలో ఒకరని, వంగూరిఫౌండే షన్ ద్వారా ప్రచురితమైన ఆయన కథా సంపుటి 'శాంయానా' ముందు మాటలో వంగూరి గారి ద్వారా కూడా ఈ విషయం ఉటంకించబడిందని తెలిపారు. ఉత్తరాంధ్ర కథకులతో వారికున్న అనుభవాన్ని, అనుబంధాన్ని పురస్కరించుకొని అలనాటి సాహిత్య వాతావరణం గురించి మాట్లాడవలసిందిగా శ్యాం గారిని కోరారు.
అందుకు స్పందిస్తూ శ్యాం గారు తన సాహిత్యానుభవ ఆకాశంలో అలవోకగా విహరిస్తూ శ్రోతలకు విహంగ వీక్షణం చేయించారు. సహజోల్లాస వాగ్ధోరిణిలో తన చిన్ననాటి ముచ్చట్లను గుర్తుచేసుకుంటూ కిరణ్ ప్రభగారు పోస్ట్ కార్డ్ ల పరంపరలతో ముంచెత్తే వాడనీ, అప్పట్లో విశాఖసాహితీ సమాఖ్య, విశాఖ రచయితల సంఘం( విరసం కాదు) అనే రెండు సాహిత్య సమాఖ్య లుండేవనీ, మెడికల్ విద్యార్థిగా ఉన్న రోజుల్లో 'తరుణ' పత్రికలో తన తొలి కవిత 'మెడికో ప్రేమ గీతం' ప్రచురించబడిన కారణంగా, తన పుస్తకం 'మెడికో శాం కథలు' మూలం గా తన పేరు 'మెడికో శ్యాం' గా మారి పోయిందని చెప్పుకొచ్చారు.
తెలుగు సాహిత్య లోకంలో నాటికీ నేటికీ ఉన్న వ్యక్తిగత స్పర్థలను ఉటంకిస్తూ తాను అందుకే హోదాలకు దూరంగా తటస్థంగా ఉండేవాడినని, అంధ్రజ్యోతి సంపాదకులు తన కథను చదవకుండానే పేరును చూసి వేసుకొనేవారని వచ్చిన ఆక్షేపణలకు ప్రతిస్పందిస్తూ 'టి.శ్యాం', 'శై', 'శ్యాం' లాంటి మారుపేర్లతో పత్రికలకు పంపించాల్సి వచ్చేదని చురక లంటించారు. పనిగట్టుకొని వక్రీకరించే కుహనా సాహిత్యాభిలాషులు ఆరుద్ర గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర సమగ్రం కాదనీ, 'ఈ శతాబ్దం నాది' అన్న శ్రీశ్రీ నిజానికి అర్ధశతాబ్ధి కవి మాత్రమేనని అన్న సందర్భాలు ఉన్నాయనీ, శ్రీశ్రీ కి ఎక్కడ నోబెల్ బహుమతి వస్తుందోనని కమిటీకి ప్రతిఘటిస్తూ లేఖలు కూడా రాసారని తెలిపారు. అందుకే కీర్తి రావాలంటే అర్జంటుగా చావాల్సి ఉంటుందని, తాను Dead writer still living అని శ్రీశ్రీ ఛలోక్తి విసిరేవాడని చెప్పారు.
కథకునికి సాహిత్యం పైనే గాక మాండలికం పై కూడా సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. కొందరి కథలలో ఇతివృత్తం తో పాటు విమర్శనా ధోరిణి కలసి పోతున్నదని, అలాంటివారు వారు ప్రాథమికంగా తాము కథకులో, విమర్శకులో తేల్చుకోవలసిన అవసరం ఉంటుందని సలహా ఇచ్చారు. శ్రీశ్రీ కవితలను గాని, మాండలిక శైలిలో ఉన్న రావి శాస్త్రి వారి వంటి రచనలను గాని అనువదించడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. బుచ్చిబాబు గారి చైతన్య స్రవంతి కథ కన్నా, నవీన్ గారి అంపశయ్య చైతన్యస్రవంతి ప్రక్రియ తనకు నచ్చిందన్నారు. వారి ప్రసంగంలో పతంజలి, అరుణ్ కిరణ్, చాగంటి, నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యంశర్మ, మధురాంతకం రాజారావు, చలం, రజనీకాంతరావు, మునిపల్లెరాజు, వివినమూర్తి, గోపీచంద్ మొదలుకొని ఓహెన్రీ దాకా ఎందరో ప్రస్తావించ బడ్డారు. ఇలా లైవ్లీగా, జోవియల్ గా సాగిన వారి ప్రసంగం ' Don't meet the people, rather read the old books'- చణుకులతో ముగిసి అందరిని ఆకట్టుకుంది.
తదుపరి కార్యక్రమం అనిల్ రాయల్ గారి కథా పఠనం. వీరు ఇప్పటివరకు రాసినవి 9 కథలే అయినా, అన్నీ వాసికెక్కినవే. సైన్స్ ఫిక్షన్ కథలు రాయటం వీరి ప్రత్యేకత. టైం ట్రావెల్ కథాంశానికి చెందిన కథ 'నాగరికత' ఆ సంవత్సరం కథ సంపుటిలో చోటు చేసుకోవడం వీరి కథా రచన కౌశలానికి చక్కని నిదర్శనం. వీరి కథలలో విమర్శనాంశం అడపాదడపా తొంగిచూడడం విమర్శలకు దారి తీసినా, తనదైన శైలితో ఆత్మబలంతో పురోగమిస్తున్నారు. ఈ రోజు వీరు చదివిన కథ పేరు 'బ్రహ్మాండం'. ఇది Andy Weir రాసిన "The Egg" కు చక్కని అనువాదం. టైమ్-స్పేస్ భూమిక, థియరీ ఆఫ్ రిలెటివిటీ బాక్ డ్రాప్. ఫోర్త్ డైమెన్షన్ అయిన కాలం నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మికత కొనసాగించిన సైన్స్ ఫిక్షన్ కథా గమనం. యావత్ విశ్వాన్ని ఒక మహత్తర 'అండ' స్వరూపం గా దర్శించడం, స్వర్గనరకజన్మపరంపరలను ఆమోదించడం, అభావ అద్వైత భావనను సైన్స్ పరంగా అనుసంధించి కథను నడిపించడం కష్టసాధ్యమైన పని. సరైన నిర్దిష్ట కథాకథన రీతిని ఎంచుకొన్న అనువాదకుడు అభినందనీయుడు. కథా పఠనం ఆసక్తిగా సాగింది.
పిదప, శ్రీమతి విజయ కర్ర గారు "నన్ను మరచిన వేళ" కథను చదివి వినిపించారు. ఈనాటి ఎలక్త్రానిక్ యుగంలోని టివి, ఐఫోన్, ఐపాడ్లకు పాత్రోచిత ప్రాధాన్యత కల్పించి కథన కౌశలంతో 'మెటాలిక్ వాతావరణం' లో నడిపించిన చక్కని కథ ఇది. సంధ్య చీకటి కొండ మీది నుండి దూకిన ముగింపు అర్థవంతంగా వుండి కథ అందరిని ఆకర్షించింది.
స్వల్ప విరామం తరువాత కవి సమ్మేళనం. మొదట, శ్రీమతి గీత గారు 'నాలుగు పదుల తర్వాత' అనే వచన కవితను వినిపించారు. నాలుగు పదుల వయసు అబద్ధాల వయసున చాక్లెట్లు పుట్టిన రోజున జ్ఙాపకాల అలలై విస్తరిస్తాయి. నాలుగు పదుల పుట్టిన రోజు అంటే ఇప్పటి దుప్పటిలో పరకాయప్రవేశం చేయడమే అంటున్నారు గీత గారు. వెంటనే, పిల్లలమర్రి కృష్ణ కుమార్ గారు 'ఆరు పదుల జన్మదినం' అంటూ అశువుగా గొంతెత్తి అందరిని అలరించారు. నాగరాజు రామస్వామి 'నెమిలీకలు' అనే వచనకవితను, 'The Wrenched Rainbow' పోయెమ్ వినిపించారు. శ్రీ నాగసాయి బాబా గారు 'బారు అంటె బీరు కాదు' అంటూ ప్రారంభించి, ఆత్రేయ గారి సినీగీతం "అయినా మనసు మారలేదూ, ఆతని మమత తీరలేదూ" అంటూ పాడి నవ్వించారు.
ఆఖరున రసవత్తర ఘట్టం- కిరణ్ ప్రభ గారు నిర్వహించిన సాహిత్య క్విజ్. ఆసక్తిగా సాగింది. ప్రశ్నలు కఠినమైన వైనా, అవి ఎడ్యుకేటివ్ గా ఉన్నందున శ్రోతలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
శ్రీ లెనిన్, శ్రీ కూరపాటి భాస్కర్, శ్రీమతి లక్ష్మి , శ్రీమతి ఉమా వేమూరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశం అతిథేయులు అనిల్ దంపతుల అభినందనతో జయప్రదంగా ముగిసింది.
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan2016/veekshanam.html
-----