Monday, 28 December 2015

వీక్షణం సాహితీ గవాక్షం-34 (June,14-2015)


వీక్షణం
సాహితీ గవాక్షం-34
- ‘విద్వాన్’ విజయాచార్య.
ఈ నెల 6-14-15 ఆదివారం వీక్షణం సాహితీ సమావేశం ప్రముఖ “కౌముది” పత్రిక సంపాదకులు, కవి, రచయిత, విమర్శకులు శ్రీ కిరణ్ ప్రభ గారి యింట్లో సకల జన మనో రంజకంగా, సహృదయ హృదయాహ్లాదజనకంగా జరిగింది. కిరణ్ ప్రభగారు తమ ఆహ్వానంతో సభని ప్రారంభించారు. నేటి సమావేశానికి ’విద్వాన్’ శ్రీ తిరుమల పెద్దింటి నరసింహాచార్యులు గారు అధ్యక్షులుగా సమయానుకూల సమన్వయంతో, సందర్భోచితవ్యాఖ్యలతో సభని చక్కగా నిర్వహించారు. ఈనాటి సమావేశంలో ప్రముఖ రచయిత్రి, కేంద్రసాహిత్యఅకాడమీపురస్కార గ్రహీత శీమతి కాత్యాయని విద్మహే గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధాన ప్రసంగం చేసారు. వారు పరిశోధన చేసిన బుచ్చిబాబు “చివరకుమిగిలేది” నవలపై సమగ్రంగా, సోదాహరణ పూర్వకంగా ఉపన్యసించారు.


“అస్తిత్త్వ చైతన్య” రీతిలో సాగిన చివరకు మిగిలేది నవలలో ‘దయానిధి’ పాత్రలోని హేతుబద్ధత, వ్యక్తిగత విముక్తిని వివరిస్తూ,ఆ నవలలో ‘ ఫ్రాయిడ్’ తెల్పిన ‘ఈడిపశ్ కాంప్లెక్స్,’ సిద్ధాంతాన్ని వివరించి, ఆరాట పోరాటాలని, నైతికవిలువల్ని, ప్రజా స్వామిక భావాలని, ప్రపంచీకరణవిధానాన్ని శ్రోతల కనుల ముందు ఆవిష్కరించారు.
తదుపరి శ్రీ వేమూరిగారు, కొంతమంది శ్రోతలు అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలను యిచ్చి ప్రసంగాన్ని ముగించారు.కె.గీత “చైతన్య స్రవంతి” శైలినిగూర్చి ప్రశ్నించగా. కాత్యాయని విద్మహే గారు సోదాహరణంగా వివరించారు. శ్రీ కిరణ్ ప్రభ గారు బుచ్చి బాబు గారి సతీమణి శ్రీమతి సుబ్బలక్ష్మిగారి గొప్పతనాన్ని సభకి వివరించారు.
తరువాత శ్రీ క్రాంతి శ్రీనివాసరావుగారి ‘6th ఎలిమెంట్' కవితా సంపుటిని, ఆ కవితలపై డా|| ఆవంత్స సోమసుందర్ గారు వ్రాసిన ‘క్రాంతి గీతాలు’ అనే రెండు గ్రంథాలని ముఖ్య అతిథి ఆవిష్కరించి, వివరించారు. పిదప శ్రీ క్రాంతిశ్రీనివాస్ గారు గ్రంథ రచనా నేపధ్యాన్ని సభకి వివరించారు.
విరామంలో కిరణ్ ప్రభగారి సతీమణి శ్రీమతి కాంతి గారు తయారు చేసిన పసందైనవిందు అందరూ ఆనందంగా ఆరగించేరు. తదుపరి కవితాగానం. ముందుగా శ్రీ వేణు ఆసూరి గారు "త్రిగుణం" అనే కవితను చదివి అందరిని అలరించేరు. పిదప కె.గీతగారు "ఆకాశం – పర్వతం, అతడు-నేను" అనేకవితలో ధీరగంభీరముద్ర, కంటి చివరిభాష్పం, దూది కంబళి వంటి పదాలను గుప్పించి శ్రోతల ప్రశంసలనందుకొన్నారు. క్రాంతి శ్రీనివాసు గారు-“ఆమెకథ” అనే కవితను చదివి సభాసదుల మన్ననలు పొందేరు.

తదుపరి కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమం ఎప్పటి వలే సభాసదులను ఉత్సాహపరచింది. ఇక్బాల్ గారి,అరబిక్ వ్యాకరణ బోధన, అధ్యక్షుల వారి మలిపలుకులు, గీతగారి వందన సమర్పణతో కార్యక్రమం విజయ వంతంగా ముగిసింది.

ఈ నాటి సభలో ప్రముఖ కథా రచయిత్రి కె.వరలక్ష్మి గారు, శ్రీమతి టి.పి.విజయలక్ష్మి గారు, శ్రీమతి గునుపూడి అపర్ణ, శ్రీ సుబ్బారావు, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి కె.శారద, శ్రీ శివచరణ్, శ్రీమతి ఉమా వేమూరి, శ్రీ సుభాష్, శ్రీ పిల్లలమర్రి కృష్ణ కుమార్ మొదలగు ప్రముఖులు పాల్గొని, సభకి నిండుదనాన్ని కలిగించేరు. స్వస్తి.
----------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july2015/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/july/july_2015_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం సాహితీ గవాక్షం-33( May17,2015)

కబుర్లు - వీక్షణం
సాహితీ గవాక్షం-33
- ‘విద్వాన్’ విజయాచార్య.
ఈ మాసం 5-17-15 ఆదివారం వీక్షణం సమావేశం ఫ్రీ మౌంట్ లో శ్రీమతి తాయిబా మన్సూర్ గారి యింట్లో సంగీత, సాహిత్య సంగమంగా, నవరస రాగ భరితంగా సాగింది. శ్రీ ఇక్బాల్ గారు సభాధ్యక్షులుగా ఉండి, కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. నేటి సమావేశానికి ముఖ్య వక్త సినీ, దూరదర్శన్ నటులు, బహుగ్రంథ కర్త, సంగీత,సాహిత్యాలలో మేటి ,నాటకాలలో, భువనవిజయాలలో నటించి ప్రేక్షకులను తమ సంగీత మాధుర్యంలో ఓలలాడించిన ప్రముఖ నటులు, కవి అయిన శ్రీ అక్కిరాజు.సుందర రామకృష్ణ గారు “ మణి ప్రవాళ “ శైలిలో ఉన్నపద్యాలను పాడి,ఆ పద్యాలలో ఉన్న సౌందర్యాన్ని సభకు వివరించి శ్రోతలను ఆనంద పరవశులను గావించేరు. రామకృష్ణ గారు “శారదా త్రిశతి” అనే అధిక్షేప కావ్యాన్ని రచించి, “అధిక్షేప కవితా చంద్ర” అనే బిరుదును పొందిన వైనాన్ని సభకుతెల్పేరు. ధూర్జటి, జాషువా కవుల పద్యాలను వినిపించి, వివిధ రకాల నవ్వులను వివరించి, పౌరాణిక నాటకాలలో ప్రసిద్ధి చెందిన “జండాపై కపిరాజు” పద్యంపాడి శ్రోతలను అలరించారు. తదుపరి సాయిబా గారు పసందైన విందును ఏర్పాటు చేసారు. .
తదుపరి ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి గారి ‘రిక్షా’ అనే కథను వారి కుమార్తె కె. గీతగారు భావయుక్తంగా చదివి వినిపించగా, రచయిత్రి కథా నేపధ్యాన్నివివరించారు.
తదుపరి దీనిపై సభ్యుల చర్చ జరిగింది. పిదప శ్రీ టి.పి.యన్. ఆచార్యులు గారు “శ్రీకాకుళం జిల్లా మాండలిక భాషలో” రచించిన ‘ స్వప్న సత్యం’ అనేకవితను చదివి శ్రోతల ప్రశంసలను అందుకొన్నారు. డా|| కె.గీతగారు ‘ప్రపంచం కన్నా పాపాయి గొప్పది’ కవితలో పాపాయి కి, తల్లికి ఉన్న అనుబంధాన్ని,పాపాయి బాల్య చేష్టలను కళ్ళకు కట్టినట్లు వర్ణించి సభికుల కరతాళ ధ్వనులనందుకొన్నారు.
పిదప శ్రీ వేణు ఆసూరిగారు ‘ త్రోవ తెలియని బాటసారి’ కవిత చదివి ఆహూతులను అలరించారు. ఈ సమావేశంలో బర్కిలీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతులైన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావుగారికి శ్రీమతి ఆకెళ్ళ జానకి గారు వారి తల్లిగారి ద్వారా మూడు వేల డాలర్ల చెక్కును తెలుగు శాఖాభి వృద్దికి వితరణగా అందించారు.
అటుపై శ్రీ కిరణ్ ప్రభగారు ప్రముఖ హాస్యనటుడు “ చార్లీ చాప్లిన్” అపూర్వమైన జీవిత విశేషాలను, ప్రముఖతెలుగు సినిమా హాస్య నటి ‘సూర్యకాంతం’ గారి జీవితం లోని వితరణ గుణాన్ని సభకు వివరించి, క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించిరి. చివరగా అధ్యక్షులవారి మలిపలుకులతోను, అరబిక్ వ్యాకరణంలోని అక్షరోత్పత్తి స్ధానాల వివరణతో, గీతగారి వందన సమర్పణతో నేటి సమావేశం దిగ్విజయంగా ముగిసింది.
ఈ సమావేశంలో శ్రీమతి గునుపూడి అపర్ణ, శ్రీ సుబ్బారావు, శ్రీమతి ఆకెళ్ల వరలక్ష్మి, శ్రీమతి ఇక్బాల్, శ్రీ లెనిన్, శ్రీ వేమూరి, శ్రీమతి ఉమా వేమూరి, శ్రీమతి కాంతి కిరణ్ తదితర సాహిత్యాభిలాషులు పాల్గొన్నారు.
--------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/june15/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/june/june_2015_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ గవాక్షం - 32 (Apr,19-2015)



వీక్షణం సాహితీ గవాక్షం - 32


-‘విద్వాన్’ విజయాచార్య

ఈ నెల 4-19-15 ఆదివారం ‘ వీక్షణం’ సమావేశం ప్రముఖ కథా రచయిత ‘ బి.పి. కరుణాకర్’ గారి అమ్మాయి గారి ఇంట్లో రస రమ్య భరితంగా, కథా కథన కుతూహలంగా జరిగింది. ఈ సమావేశానికి శ్రీ ‘విద్వాన్’ టి.పి. యన్. ఆచార్యులు గారు అధ్యక్ష స్థానాన్ని అలంకరించి, సభా కార్యక్రమాలు నిర్వహించారు.

ముందుగా శ్రీ కరుణాకర్ గారు వారి నాలుగు కథా సంపుటాలని సభకి పరిచయం చేసి, రచనా నేపధ్యాన్ని సోదాహరణంగా వివరించేరు. నేటి యాంత్రిక జీవితంలో పుస్తకం చదవడం గొప్ప ఉపశమనం అని తెలిపి “ రెల్లు” కథలోని ‘సరోజని, రాజ రత్నం ‘ పాత్రల చిత్రీకరణలో రచయిత తన అంతరంగ కథనాన్ని ,మానసిక విశ్లేషణల్నిశ్రోతలకి వివరించారు. శ్రీ కరుణాకర్ గారు ”రెల్లుపూల”ని జీవితానికి అన్వయింపజేసి, సమన్వయ పరచిన విధానం శ్రోతల్ని ఆలోచింప జేసింది. అట్లే ‘ అంబాలీస్' అనే ఆటని తమ కథల పుస్తకానికి పేరుగా పెట్టడం క్రొత్తగా ఉంది.
ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి వరలక్ష్మి గారు కరుణాకర్ గారి కథలలోని ఆర్ద్రత, శైలి గొప్పగా ఉంటుంది అని కొనియాడగా, కరుణాకర్ గారు వరలక్ష్మిగారి కథలు నూతనత్వం తో హృదయానికి హత్తుకొనే విధంగా ఉంటాయని తెలపడం నేటి సభలో ప్రత్యేకత. ఇంకా ‘కౌముది’ అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభగారు కరుణాకర్ గారి కథలలోని రచనా విన్యాసాలని సోదాహరణంగా వివరించారు. డా|| కె. గీతగారు కరుణాకర్ గారి ‘ఎదురు నీడ’ ‘పొగ’ కథలను చదివి సభికులను అలరించారు.

తదుపరి జరిగిన చర్చలో శ్రీ ఇక్బాల్ గారు, మురళి గారు, లెనిన్ గారు అడిగిన ప్రశ్నలకు రచయిత చక్కని సమాధానాలని చెప్పి ,’కన్నీటి నురుగు’ కథలోని రిక్షావాడు, సావిత్రి పాత్రల స్వభావాలని, కథముగింపు లోని కొస మెరుపుని చక్కగా వివరించారు. ఆపై అధ్యక్షులు ఆచార్యులు గారు “ నిత్య వ్యవహారంలో మనం ఉదహరించే సంస్కృత లోకోక్తులు” ఆలస్యం అమృతం విషం, ధనమూలమిదం జగత్, నభూతో న భవిష్యత్ వంటి వాక్యాల పూర్వాపరాలని అద్భుతంగా విశదీకరించి శ్రోతలని అలరింప జేసారు.
కొద్దిసేపు అల్పాహార విరామం తరువాత. కిరణ్ ప్రభగారు నిర్వహించిన ‘సాహీతీ క్విజ్ ‘ సభను రంజింప జేసింది.
తదుపరి గీతగారు చదివిన "పుట్ట గొడుగు మడి" కవిత -ప్రతీకాత్మ స్వరూపంగా,భావ గాంభీర్యంగా ఉండి శ్రోతల మన్ననలను పొందింది. ఇంకా ‘విద్వాన్’ విజయలక్ష్మిగారు ‘ఉగాది’ కవితలో త్రికాలాలని, త్రిగుణాలని, త్రిమూర్తి స్వరూపాన్ని, ప్రకృతి తత్వాలని విపులంగా వర్ణించి సభికులను ఆనందింప జేశారు. శ్రీ ఇక్బాల్ గారు అరబిక్, తెలుగు భాషల వ్యాకరణాన్ని సభకు క్లుప్తంగా పరిచయం చేసారు.
గీతగారి వందన సమర్పణతో నేటి సభ దిగ్విజయంగా ముగిసింది.
--------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2015/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/may/may_2015_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ సమావేశం-31(Mar,15-2015)



వీక్షణం సాహితీ సమావేశం-31

 

వీక్షణం 31 వ సాహితీ సమావేశం పాలో ఆల్టో లోని శ్రీమతి గునుపూడి అపర్ణ గారింట్లో జరిగింది.
వేమూరి వేంకటేశ్వరరావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశం లో ముందుగా రిటైర్డ్ జర్నలిస్టు శ్రీ పిల్లలమర్రి వేణుగోపాల స్వామి గారు జర్నలిజంలో తన అనుభవాల్ని, జ్ఞాపకాల్ని పంచుకున్నారు. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగినందు వల్ల ఇంజనీరింగు చదువుని మధ్యలోనే ఆపేసి, స్వస్థలమైన తెనాలిలో స్థిరపడ్డారు గోపాలస్వామి గారు. మిత్రుని వల్ల జర్నలిజంతో పరిచయం ఏర్పడిందనీ, మొదట్నించీ ఆంగ్లభాష పట్ల మక్కువ వల్ల జర్నలిజంలో అతి వేగంగా రాణించ గలిగానన్నారు. దాదాపు 40 సం||రాలు జర్నలిస్టుగా కొనసాగారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ కు అధ్యక్షులుగా 3 సార్లు ఎన్నికయ్యారు.
ఎమర్జన్సీ సమయంలో ఘాటుగా రాసిన ప్రభుత్వ వ్యతిరేక రిపోర్టు ఎన్నో మన్ననలు పొందిందని అన్నారు. ఆంధ్ర ఉద్యమ సమయంలో అంతటా బందు సమయంలో వార్తల సేకరణ ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. కొన్ని సార్లు అసలు వార్తలు మరుగున పడి, అసత్య వార్తలు ఎలా ప్రచారమవుతాయో వివరించారు. చుండూరు హత్య గురించి రిపోర్టు రాయలేని పరిస్థితుల్ని వివరించారు. జర్నలిజం మీద ఫ్యాక్షనిజం ప్రభావం గురించి చర్చించారు.
తర్వాత శ్రీమతి మద్దూరి లక్ష్మి 'కవన శర్మ" గారి సాహిత్య పరిచయం చేసారు. వారు రాసిన బ్రెయిన్ డ్రెయిన్, సంఘ పురాణం, సైన్స్ నడిచిన బాట వంటి రచనల్ని గురించి, బెంగుళూరులో తెలుగు విజ్ఞాన సమితి, మేలు కలయిక వంటి సంస్థల ద్వారా కవన శర్మ గారి సాహితీ సేవని వివరించారు.ఈ సందర్భంగా వేమూరి కవన శర్మ గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత గునుపూడి అపర్ణగారి తొలి కథా సంపుటి "ఘర్షణ" ఆవిష్కరణ ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి గారి చేతుల మీదుగా జరిగింది.
ఆ తర్వాత కథా పఠనంలో భాగంగా అపర్ణ గారు "జాతక చక్రం" కథను చదివి వినిపించారు.
పిల్లల పెంపకం విషయంలో ఎలా ప్లాన్ చేసినా చివరికి ఎలా జరగాలనుందో అదే జరుగుతుందనే విషయాన్ని చక్కగా వివరించిన కథ ఇది.
కథా ప్రారంభంలో ఫైనాన్షియల్ ప్లానింగుకి సంబంధించిన సంఘటనని వివరించడం రచయిత్రి కథా రచనా ప్రతిభ కు తార్కాణం.
తేనీటి విరామం తర్వాత ఇక్బాల్ గారి అరబిక్ వ్యాకరణ సిరీస్ లో భాగంగా అరబిక్ నామవాచకాలు, పదాల భేదాలు వివరించారు.
కవిసమ్మేళనంలో డా|| కె.గీత ఉగాది సందర్భంగా "ఉగాది జ్ఞాపకాలు" కవితను వినిపించారు.
శ్రీ వేణు ఆసూరి "శ్రీ శ్రీ కవిత్వంలో పదబంధాలు", "శివ దండకం లో పదబంధాలు" అనే విషయాలను చిన్న ఉపన్యాసంలో వివరించారు. శ్రీ శ్రీ కవిత్వంలో "నిలకడ గల క్రొక్కారు మెరుపు", "సదమన మదగజగమన" వంటివి, దండకంలో "జయత్పదభ్రవిభ్రమత్" వంటివి ఉదహరించారు.
ఆ తర్వాత రాయసం కృష్ణ కాంత్ చక్కని గాత్రంతో పాటలు ఫాడి అందరినీ అలరించారు.
సాహితీ క్విజ్ తో శ్రీ కిరణ ప్రభ సభను దిగ్విజయంగా ముగించారు.
----------------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/april15/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/april/april_2015_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సాహితీ సమావేశం-30 (Feb,15-2015)



వీక్షణం సాహితీ సమావేశం-30

-

ఈ నెల వీక్షణం సాహితీ సమావేశం తాటిపామల మృత్యంజయుడు గారింట్లో ఫిబ్రవరి 15న జరిగింది. ఈ సమావేశానికి మృత్యుంజయుడు గారే అధ్యక్షత వహిస్తూ అందరికీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి గారిని కథా రచన విశ్లేషణ, స్వీయ కథా పఠనం చేయమని అహ్వానించారు. కె. వరలక్ష్మి మాట్లాడుతూ తన కథల్లో పాత్రలన్నీ తను పుట్టి పెరిగిన ఊరులో చుట్టూ నిత్యం కనిపించేవే అన్నారు. మొదటి కథ "గాజు పళ్లెం" గురించి మాట్లాడుతూ ఆ కథ రంజని అవార్డు పొందిందని, అనేక సంకలనాల్లో చోటు చేసుకుందని చెప్పారు. ఇదొక పల్లెటూరి అమ్మాయి కథ.



ఆ తర్వాత నించి రాసిన అనేక కథలకు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయని చెప్తూ తన కథల్లోని కొన్నిటి ఇతివృత్తాలను, కథా సంవిధానాన్ని వివరించారు. మంత్రసాని కథ గురించి చెప్తూ ఒకప్పుడు పురుడు పోసే ఎరుకల సాని జీవన విధానాన్ని, అన్యాయాల్ని వివరించారు.

ఇటీవల రాసిన "ఆ నాటి వాన చినుకులు" కథలో ఎప్పుడో విడిపోయిన ప్రేమికుల కథ ద్వారా జ్ఞాపకాల్ని పదిల పరుచుకోవడమే ఆనందదాయకమనే విషయాన్ని చెప్పారు. కథలకు ముగింపు విషయాలు చెప్తూ ఒక్కోసారి ముగింపు ముందే తడుతుందని, ఒక్కోసారి ముగింపు కోసం చాలా రోజులు ఆలోచనల్లో గడపాల్సి వస్తుందని అన్నారు.


స్త్రీలకు సమాజం అంతా శత్రువే అన్నారు. చేరా తనని ఉద్దేశించి.. "స్త్రీల సమస్యల గురించి పట్టించుకోవడమే కాదు, ముఖ్యంగా గ్రామీణ స్త్రీల గురించి రాసిన ఏకైక స్త్రీ వాద కథా రచయిత్రి అని" పేర్కొన్నారని అన్నారు. అందుకు ఉదాహరణగా "సువాసినీ పూజ" కథను వివరించారు.

గ్రామీణ నేపథ్యంలో మట్టి, బంగారంతో సమానమయ్యే ఘటనల్ని వివరించే "మట్టి బంగారం' కథ, ఇప్పటి ప్రపంచంలో మనిషి ఇమడలేక పోవడాన్ని వివరించే "కలకానిది విలువైనది" కథలు అందరినీ ఆకట్టుకున్నాయి. చివరగా వారి కుమార్తె డా|| కె.గీత కథా చదివిన వరలక్ష్మి గారి కథ "శివంగి" అంతర్జాతీయ స్థాయి కథ అని సభలో అందరూ కొనియాడారు.


ఆ తర్వాత వరలక్ష్మి గారి నాలుగవ కథా సంపుటి "క్షతగాత్ర" పుస్తకాన్ని శ్రీమతి గునుపూడి అపర్ణ ఆవిష్కరించగా, శ్రీ మృత్యుంజయుడు కథా పరిచయం చేసారు.

చక్కని విందు భోజనపు విరామం తర్వాత కవి సమ్మేళనంలో శ్రీ వేణు ఆసూరి అంతర్జాతీయ సమస్యను సున్నిత బంధాలతో పోలుస్తూ కవితను చదవగా, డా|| కె.గీత " మా మధ్య వేలైంటైన్స్ డే " కవితను వినిపించారు.

శ్రీ లెనిన్ మహా భారత తత్త్వ వివేచన మరో పది నిమిషాలు సాగిన తర్వాత, శ్రీ కిరణ్ ప్రభ జనరంజకంగా క్విజ్ నిర్వహించడమే కాకుండా, అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తూ శరత్ బాబు జీవితాన్ని గురించి అత్యంత ఆసక్తి దాయకంగా వివరించారు. అత్యంత కష్టాలతో గడిచిన శరత్ బాల్యం, యౌవనం, జీవితంలో అన్నీ కోల్పోయిన అభాగ్యుడిగా మిగిల్చిన విధి వంచన, తిరిగి కథా రచయితగా ఆయన నిలదొక్కుకోవడం,
అత్యంత స్ఫూర్తిదాయకమైన రచయితగా మహా నిష్క్రమణను వివరించారు.

ఈ సభకు శ్రీమతి శారద, శ్రీ నరసింహారావు, శ్రీమతి జయమాల, శ్రీమతి మృదుపాణి, శ్రీమతి స్వప్న, మొదలైన వారు హాజరై సభను జయప్రదం చేసారు.

చివరగా ఇటీవల దివంగతులైన ప్రసిద్ధ నవలా రచయిత శ్రీ కె. కేశవరెడ్డి గారికి నివాళి అర్పించి సభను ముగించారు. 
----------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/march15/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/march/march_2015_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం సమావేశం- 29(Jan,18-2015)

కబుర్లు

వీక్షణం – సమీక్షణం


వీక్షణం 29వ సాహితీ సమావేశం


-‘విద్వాన్’ విజయాచార్య.

వీక్షణం 29వ సాహితీ సమావేశం శ్రీ వేణు ఆసూరి గారి ఇంట్లో ఈ నెల 18న రస రాగ రంజితంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రఖ్యాత సినీ, నాటక, నవలా, కధారచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు విచ్చేశారు.

నేటి సమావేశానికి శ్రీ తాటిపాముల మృత్యుంజయడు గారు అధ్యక్షత వహించి సభని చక్కగా నడిపించేరు. ముందుగా శ్రోతలు అడిగిన సినిమా నాటక రంగాలకి సంబంధించిన ప్రశ్నలకి పార్థసారథిగారు యుక్తియుక్తంగా, సవివరంగా సమాధానాలు చెప్పి, సభని ఉత్కంఠభరితం గావించేరు. పూర్వ కాలం సినిమాలకి, ఇప్పటి సినిమాలకి గల తారతమ్యాలని, విలువలని, విపులంగా విశదీకరించేరు. రచయితకి నాటకరంగంలో ఉన్న తృప్తి, స్వేచ్ఛ సినిమారంగంలో ఉండదని తెల్పి, తమ అనుభవాలను,రచనా వ్యాసంగాన్ని, సభకి చక్కగా వివరించేరు.

తన మొదటి సినిమా “ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం” గురించి చెబుతూ “విజయవాడ లో హాస్య నాటికల పోటీ లో ప్రదర్శించిన “పూజకు వేళాయెరా” నాటిక ను రేలంగి నరసింహారావు గారు చూసి, నాటికలోని సన్నివేశాలను “ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్“ కు తీసుకున్నారన్నారు. అంతే గాక ఆయన తీసిన తరువాతి సినిమా “ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం” కు డైలాగ్ రైటర్ గా అవకాశం ఇచ్చారన్నారు.
సినిమా కు కథ వేరు, స్క్రీన్ ప్లే వేరని చెప్పారు. సినిమా కథ రాయడం లో ఉన్న కొన్ని ఇబ్బందుల్ని చెప్తూ, సినిమా కథలకు ముందుగా హీరో ఇమేజ్ ను గుర్తుపెట్టుకోవలసిందని,
కామెడీ ఎప్పటికప్పుడు కొత్తగా, వైవిధ్యభరితంగా ఉండాలని అన్నారు. ఇక స్క్రీన్ ప్లే అనేది ఒక్కొక్క స్క్రీన్ ను పేర్చుకుంటూ వెళ్లడమని అన్నారు.
సినిమా కథలకు ఫార్ములా లు ఉండవని, డైరక్టర్ స్టైలు లు బట్టి మలచబడతాయని అన్నారు. అందుకు ఉదాహరణగా ఇద్దరు ముగ్గురు దర్శకుల పద్ధతులు హాస్య స్ఫోరకంగా చెప్పి అందర్నీ కడుపుబ్బ నవ్వించారు.ముందుగా తన సినిమారంగానుభావాల్ని క్లుప్తంగా వివరించి తరువాత సభలోని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలనిచ్చారు శంకరమంచి.
“నాటకాలలో చెయ్యి తిరిగిన రచయిత అయిన మీ నాటకానుభవం సినిమా రచనలో ఉపయోగపడిందా?” అనే ప్రశ్నకు “నాటక రచనకు, సినిమాకు చాలా దగ్గర సంబంధం ఉందని, ఏ పాత్ర ఎంత వరకు ఉండాలి అనే తూకం, సీన్ నిడివి, పాత్రత, ఔచిత్యం వంటివి, డైలాగులలో పదును నాటక రచనలో తెలుస్తాయన్నారు. ముఖ్యంగా కామెడీ నాటక రచయితగా తనకు సినిమా పెద్దగా కష్టమనిపించలేదన్నారు.”
“రచనలు చేయడానికి ప్రభావితమయిన ప్రాచీన, అర్వాచీన సాహిత్యం గురించి” అన్న ప్రశ్నలకు, “ రచనా ప్రస్థానాన్ని వివరించమన్న” ప్రశ్నకు“తనకు ప్రాచీన సాహిత్యం చాలా తక్కువ తెలుసనీ, కానీ ఆధునికుల్లో రావిశాస్త్రి, తిలక్, శ్రీపాద మొ||న వారి ప్రభావం ఉందన్నారు. చిన్న తనం నించి తనకున్న సినిమా అభిరుచి బాగా దోహదపడిందన్నారు.
ముఖ్యంగా “ఆదుర్తి సుబ్బారావు” గారి తో కలిసి పనిచేయాలని ఆకాంక్ష ఉండేదన్నారు. కానీ ఫామిలీ పరిస్థితుల దృష్ట్యా సెంట్రల్ గవర్న్ మెంట్ ఉద్యోగి అయ్యినా ఆకాంక్ష సినిమా మీదే ఉండేదన్నారు. ఆదివిష్ణు గారి పరిచయం ఒక మలుపు. ముందు నా ఆలోచనలని కాగితమ్మీద పెట్టమని సలహా ఇచ్చారు. అలా కథా రచయితనయ్యాను. అక్కణ్ణించి నవలలు, ఆ తర్వాత నాటక రచయిత గా మారానన్నారు.
“పూజకు వేళాయెరా“ నాటికకు ప్రథమ బహుమతి లభించిన సందర్భంలో నాటక ప్రదర్శనలో పాఠకుడికి, రచయితకు ఉన్న ప్రత్యక్ష సంబంధం బాగా నచ్చడం వల్ల నాటక రచయిత గా స్థిర పడ్డానన్నారు. కామెడీ నాటకాల ప్రయోగాల్లో భాగంగా రెండు గంటల పాటు తెర వేయకుండా, లైట్లు ఆర్పకుండా ప్రదర్శించిన “దొంగల బండి” నాటకం ఒక రికార్డు అన్నారు.
“నాటక రచయితగా మొత్తం నా రచన అని కలిగే సంతృప్తి, సినిమా రచయితగా కలుగుతుందా?” అనే ప్రశ్నకు
“తెలుగు లో ఒకప్పుడు లేదని తొంభైలలో ప్రారంభమయిందని, ఒక రచయిత కంటే ఎక్కువ మంది రచయితలు ఇలా ఒక సినిమాకు పనిచేసే సంప్రదాయాన్ని క్రమంగా తర్వాతి వారు అనుసరించి, ఇక అదే పధ్ధతి ని కొనసాగించారన్నారు. అయితే ఇందు వల్ల ఎవరికీ వారు గంగాళంలో పాలు పొయ్యమంటే అంతా నీళ్లు పోసిన చందమయ్యింది ఇప్పటి సినిమాకథ అన్నారు.”
ఇలా దాదాపు గంట పైనే అన్ని ప్రశ్నలకూ ఎంతో ఓపిగ్గా సమాధానాలనిచ్చారు.
తదుపరి వేణు, విజయా ఆసూరి దంపతులు ఏర్పాటు చేసిన, షడ్ రుచులతో కూడిన విందుని అందరూ స్వీకరించిన పిదప కవిసమ్మేళనం జరిగింది. ముందుగా వేణుఆసూరిగారు “గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు” పంపిన “సృష్టి” కవిత చదివి, పిదప స్వీయరచన ప్రకృతి , ప్రియురాలు వర్ణనలతోకూడిన కవిత చదివి వినిపించేరు. పిదప డా|| కె. గీత ఇరవై వసంతాల కుమారుడి పుట్టిన రోజున అతడి బాల్యాన్ని గుర్తు చేసుకొంటూ మాతృ మూర్తి మనస్సులో కలిగే భావవీచికల్ని విశదీకరించే అద్భుతమైన “అబ్బాయి ఇరవయ్యవ పుట్టిన రోజు” కవిత చదివి శ్రోతలని అలరింపచేసారు. తదుపరి వరకూరు గంగా ప్రసాద్ గారు తమ కవిత ‘వందేమాతరం’ ను పాటగా పాడి వినిపించేరు. శ్రీచరణ్ గారు పద్యాలలో అయ్యప్పని, సంక్రాంతిని కొనియాడేరు. ఆ పై ‘విద్వాన్’ విజయలక్ష్మిగారు సంక్రాంతి లక్ష్మిని సవివరంగా వర్ణిస్తూ చదివిన కవిత శ్రోతల్ని అలరించింది. అలాగే శ్రీ టి.పి.యన్. ఆచార్యులు గారు చదివిన ‘ప్రకృతి’ కవిత సభారంజకంగా సాగింది.కవి సమ్మేళనం తర్వాత శ్రీ ఇక్బాల్ గారు చదివిన “స్వర్గీయ యన్.టి. రామారావు గారు రచించిన రావణుని ప్రాముఖ్యతను వివరించే వ్యాసం” శ్రోతల్ని అలరించింది.


అధ్యక్షులవారి ప్రకటనతో శ్రీ కిరణ్ ప్రభ గారు “సినిమాక్విజ్” కార్యక్రమాన్ని చాకచక్యంగా నిర్వహించేరు. మల్టిపుల్ ఛాయిస్ లు క్విజ్ లో కొత్తగా ప్రవేశపెట్టడం వల్ల సభికులందరూ ఈ సినిమా క్విజ్ కార్యక్రమంలో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. చివరగా గీత గారి వందన సమర్పణతో నేటి సమావేశం దిగ్విజయంగా ముగిసింది. ఈ సభలో కె.శారద, సత్యనారాయణ దంపతులు, వంశీ, శంషాద్, అహ్మద్
మొ||న స్థానిక ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు.
--------
http://www.koumudi.net/Monthly/2015/february/feb_2015_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb15/veekshanam.html

Monday, 26 January 2015

వీక్షణం సమావేశం- 28(Dec,14-2014)

వీక్షణం సమావేశం- 28

ఈ నెల 14 న వీక్షణం సమావేశం పాలడుగు శ్రీచరణ్ గారి ఇంట్లో (సాన్ హోజే ) జరిగింది. సుమారు ముప్ఫై మంది తెలుగు సాహిత్యాభిలాషులు పాల్గొన్నారు. వేద గురువు శ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రి గారు తమ మంగళాచరణాలతో, వేదమాతాస్తవ శ్రావ్య శ్లోకాలతో కార్యక్రమానికి శుభారంభం చేశారు. సాహిత్యాభిలాషి ఐన శ్రీచరణ్ గారు స్వతహాగా సంస్కృత అభినివేశీ, ఆధ్యాత్మిక అనుశీలీ అవడం వల్ల వేదగురువుతో సభ ప్రారంభంకావడం ముదావహం.
శ్రీచరణ్ గారు ఇదివరలో రచించిన 'ఛందః పద్మములు' గ్రంథప్రాశస్త్యాన్ని వారు కొనియాడారు. కార్తీక మాసం లో మిల్పీటాస్ లోని వేద దేవాలయంలో శ్రీచరణ్ గారు 30 రోజులపాటు క్రమం తప్పకుండా విరచించి సమర్పించుకున్న శ్లోకాల సమాహారం "హరిః ఓమ్ కార్తీకే రుద్రాభికోత్సవే ధ్యానమ్ "గ్రంధాన్ని శ్రీ వెంకట నాగాశర్మ గారు ఆవిష్కరించారు. హరిహరాద్వైత ఛందస్పందము ఈ గ్రంథమని ప్రశంసించారు.
మాతృభాషకు మరణం లేదని, మననం వల్ల భాష చిరంజీవి అవుతుందని, అలాంటి ప్రయత్నపర్యవసానమే ఈ "వీక్షణం" అని వాక్రుచ్చారు.



శ్రీచరణ్ గారు ప్రథమ వక్త. శీర్షిక "వేదం లో సాహిత్య విశేషాలు". వేదాల గురించి మాట్లాడుతూ, అవి కేవలం ఆధ్యాత్మిక మత వాజ్మయాలుగానే పరిగణించబడుతూ వస్తున్నందున , సాహిత్య విలువలకు ప్రాధాన్యత ఇవ్వబడని కారణంగా కాలక్రమేణ అవి మనకు దూరమై పోతున్నవని వాపోయారు. ఇంకా ఇలా చెప్పుకు పోయారు. “వేద ప్రమాణం మారనిది. నిజానికి 'ప్రమాణం' అన్నపదాన్ని నిర్వచించింది వేదమే. వేదాలు శబ్దప్రధానాలు.స్వర నిబధ్ధాలు. శబ్దోచ్చారణ లోనూ, స్వరప్రకాశం లోనూ ఎలాంటి అస్పష్టత ఉండదు. వేదాలు సంహితలుగా, బ్రాహ్మణాలుగా, అరణ్యకాలుగా , ఉపనిషత్తులుగా విస్తృతి నొందినవి. ఆ తరువాత యజుర్వేదం కూడా కృష్ణ, శుక్ల యజుర్వేదాలుగా వృధ్ధి నొందినవి. వేదం అక్షర పరబ్రహ్మం.మహర్షులు ద్రష్టలు. వాళ్లు శబ్దాన్ని విన్నారనటం కన్నా శబ్దాన్ని చూచారనటం సమంజసం. వేదము నందలి స్వరవిశేషం ఉదాత్తంగా, అనుదాత్తంగా, స్వరితంగా విభజన చేయబడింది. ఇది ధాతువులలో, సమాసాలలో ఉక్తిదోషం లేకుండా చేసుకో వీలైన విధానం.స్వరం మారితే అర్థం మారే ప్రమాదముంది. ఉదాహరణకు "రాజపుత్ర" అనే పదబంధం సందర్భాన్నిబట్టి తత్పురుషగాను, బహువ్రీహి గాను, ద్వంద్వ,కర్మధారయ సమాసంగానూ వర్తింప చేసుకునే వీలుంది.




ఇంద్రుణ్ణి చంపడానికి యజ్ఞం చేస్తూ వాగ్దోషం వల్ల, తత్పురుష సమాసం బహువ్రీహి గా మారి , అర్థం తలకిందులై తానే మరణించిన ఉదంతం ఉంది. అలాంటి అస్పష్టతకు అవకాశం లేని స్వర సంవిధానం వేదంలో ఉన్నందునే అపౌరుషేయాలైన వేదాలు ఎలాంటి మార్పులకు లోనుగాకుండా నిలిచి ఉన్నవి. పరిశీలిస్తే వేదం లో కథాకధనమే గాక నాటకీయత కూడా చూడవచ్చు. స్థిరమైన సాహిత్య రీతులు సంగ్రహంగా పొందుపరచబడి ఉన్నవి. అలాంటి వేదాలకు మనం దూరం కావడం దురదృష్టకరం. ఇలా శ్రీచరణ్ గారు సాహిత్య దృక్కోణంలో వేదజ్ఞానాన్ని సభికులకు ఎరుకపరచారు.
తరువాత స్వీయకథాపఠనం లో భాగంగా తాటిపాముల మృత్యుంజయుడు గారు కథ వినిపించారు. కథ పేరు "ఆర్ యూ రెడీ? ". ఈ కథ 'ఈ మాట' లో 2010 లో ప్రచురింపబడింది. సమకాలీన ఇతివృత్తం. వాసూ, రోజీలు ఈ కాలం యువ జంట. ప్రేమలో పడతారు. వారి ప్రేమ సినిమా వీక్షణాలతోనూ, పబ్బుల్లోను వర్ధిల్లుతుంది. తరువాత వాసు దృష్టి మరో అమ్మయి లావణ్య మీదకు పోతుంది. లావణ్యను తనదాన్నిగా చేసుకునే నిర్ణయాన్ని తెలిపేందుకు అతను ఆమె వద్దకు పోతాడు. వాళ్లిద్దరూ బీచ్ లో నడచిపోతుంటారు. లావణ్య తెలివిగా ఈ కాలపు యువ ప్రేమ వ్యవహారాల కథ వినిపిస్తుంది. సున్నితంగా, భావనిశితంగా (sentimental) ఆమె వినిపించిన కథ అతని  ఆత్మసాక్షికి(conscience) ఎక్కడో తగిలి ఉంటుంది. అతను లావణ్యను శాశ్వతంగా తక్షణం విడచి వెళ్లేందుకు వెనుతిరుగుతాడు. లావణ్య ఎక్కడికి వెళుతూన్నావని కేక వేస్తుంది. 'రోజీ దగ్గరకు' అంటున్న వాసు మాటలు సముద్ర ఘోషలో లావణ్యకు వినిపించవు. ఇందులో ఉన్న కిటుకేమిటంటే లావణ్య, రోజీలు ఇద్దరు మిత్రులు. కావాలనే లావణ్య కథ నడుపుతుంది. ఈసంగతి వాసుకు గాని, పాఠకునికి గాని ముగింపు వరకు తెలియకపోవడం కొసమెరుపు. కథ నడిపిన తీరు బాగుంది.



ఆ తరువాత గునుపూడి అపర్ణ గారు 'కాలచక్రం' అనే కథను వినిపించారు. ఈ కథ అపూర్వ చిత్ర (సినీ నిర్మాణ సంస్థ ) సహకారంతో కథల పోటీలో ఎంపికై "కౌముది" 2012 లో ప్రచురించబడింది. కథావస్తువు నేటి మధ్యతరగతి సభ్య కుటుంబంలో వంశపారంపర్యంగా సాగుతున్న జీవన సరళి. తరానికీ, తరానికీ మధ్య ఆలోచనా విధానం లో మార్పు వస్తున్నట్టు గానే కనిపించినా, మౌలిక మైన జీవన సంవేదనలు అవే. ఉత్తమ పురుష లో రాసిన కథ. తన చిన్నతనం లో తన తలితండ్రులు తన మాట వినేవారు కారు.ఇప్పుడు తన పిల్లలు వినటం లేదు. ఇది పిల్లల పెంపకంలో తలెత్తే సమస్య. కాలచక్రగమనంలో ఆమె డాక్టర్ అవుతుంది. తండ్రి పోతాడు. తల్లి వృద్ధాప్యంలో ఆమె ఇంట్లోనే వుంటుంది. పిల్లల పెంపకం లో తల్లి అనుభవించిన సమస్యలన్నీ ఇప్పుడు ఆమె అవగాహనలోకి వస్తున్నవి. తల్లి ఆరోగ్యం క్రమంగా క్షీణించిన సంగతి ఆలస్యం గా తెలిసి వస్తుంది. తల్లి మానసిక పరిస్థితి వికటించి చిన్నపిల్లలా మారాము చేస్తుంటుంది.ఇందరు పిల్లలను పెంచిన తల్లి ఈ రోజు పసిపిల్లగా మారడం సృష్టి లోని కాలచక్ర మహిమ. తల్లిని బుజ్జగిస్తూ హార్లిక్స్ తాగమని బతిమాలే దైన్య స్థితిలో కథ ముగుస్తుంది. సంఘటనల సమాహారం చక్కగా కుదిరడం వల్ల కథ రక్తి కట్టింది.

ఇక్బాల్ గారి అరబ్బీ భాషాశాస్త ప్రసంగ సిరీస్ లోని భాగంగా ఈ ఉపన్యాసం సాగింది. అరబ్బీ లిపి, వ్యాకరణ సంబంధమైన పలు విషయాలను వివరించారు. అరబ్బీ వర్ణమాలలో 28 అక్షరాలు ఉంటాయని, అవి సూర్య చంద్ర విభాగాలుగా పొందుపరచబడి ఉన్నాయని తెలిపారు. అరబ్బీ లోని మూడు షార్ట్ వోవెల్స్ అ , ఇ , ఉ లను మార్చి రాసే పద్దతిలో భాష ఎలా సంతరించుకున్నదో  వివరించారు. భాషా కుటుంబాలు వేరైనా ఉర్దూ, అరబ్బీ భాషల లిపి ఒకటేనని తెలిపారు. రానున్న సమావేశం లో మరింత లోతుగా చర్చిస్తానని చెప్పారు.
స్నాక్ బ్రేక్ తర్వాత కవిసమ్మేళనంతో కార్య క్రమం తిరిగి ప్రారంభమయింది. తొలుత నాగరాజు రామస్వామి చదివిన కవితలు 'అమెరికాలో ఆకురాలుకాలం' , 'సుప్రభాతం' . డా|| కె.గీత “వానంటే భయం లేదు” అనే చక్కని వచన కవితను వినిపించారు. విజయలక్ష్మి గారు "హుత్ హత్ తుఫాన్" కవిత చదివి విశాఖ లో ఈ మధ్య వచ్చిన తుఫాన్ భీభత్సాన్ని కళ్ళకు కట్టించారు. శంషాద్ గారి "నిన్నటి మీరు , రేపటి నేను" వచనకవిత అందరికీ నచ్చింది. శ్రీచరణ్ గారు ఆధ్యాత్మిక పద్య కవిత "పులిగోరు" చదివారు. వారి కవిత్వం లో వారు వాడిన "కండ సిరి ", "భస్మాంగ రాగమ్", "ఆకాశ వైతాళికం" "భూపుత్ర గేహం" వంటి పదబంధాలు కవితను ప్రౌఢ కవిత్వంగా మలచాయి.
ఆఖరున ఆసక్తి కరమైన సాహిత్య క్విజ్. శ్రీ కిరణ్ ప్రభ ( కౌముది సంపాదకులు) నిర్వహించిన క్విజ్ విజ్ఞాన దాయకంగా ఉండి అందరినీ ఆనంద పరిచింది.
సమావేశంలో - రచయితలూ, కవులు, అంతర్జాల సాహిత్య సంచికల సంపాదకులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, సాహిత్యాభిరుచి ఉన్నసాంకేతిక నిపుణులు- ఇలా భిన్న క్షేత్రాలలో అభినివేశం ఉన్న తెలుగు అభిమానులందరూ ఒక చోట చేరి సాహిత్య సమాలోచనంలో పాలుపంచు కోవడం అభినందించదగిన విషయం.
సుమారు మూడు గంటల పాటు ఆత్మీయంగా సాగిన సాహితీ సమావేశం డా.గీత గారి వందన సమర్పణతో విజయవంతంగా ముగిసింది.


- నాగరాజు రామస్వామి
http://www.koumudi.net/Monthly/2015/january/jan_2015_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan15/veekshanam.html