Sunday, 10 August 2025

వీక్షణం-155వ సాహితీ సమావేశం

 వీక్షణం-155వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-155

వీక్షణం సాహితీ గవాక్షం కాలిఫోర్నియా 155వ ప్రపంచ సాహితీ సమావేశం జూలై 18, 2025 న అద్భుతంగా జరిగింది. కాలిఫోర్నియా కాలమానంలో సాయంత్రం 6.00కు ఈ సమావేశం గీతామాధవి గారి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. సహస్ర శీర్షా గీతాః సహస్రాక్షా సహస్రపాత్ అన్నట్లు ఆమెకు వేయి తలలూ, వేయి హస్తాలు వేయి మస్తిష్కాలూ! డా.గీతామాధవి గారు కవయిత్రి, రచయిత్రి, గాయని, నటి, అద్భుత ఉపన్యాసిని. అంతే కాదు దేశదేశాలు పర్యటించి సాహిత్యోపన్యాసాలు ఇస్తుంటారు. అమెరికాలో తెలుగు పాఠశాలల్లో పాఠ్యప్రణాళికాధికారిగా తెలుగు భాషోన్నతికి  కృషి చేస్తున్నారు. నెచ్చెలి పత్రికా సంపాదకురాలు కూడా! మరి, ఇన్ని పనులు ఏకకాలంలో నిర్వహించాలంటే అన్ని తలలు, చేతులు లేనిదే సాధ్యమా?

త్రయోదశాబ్దాలుగా వీక్షణం సాహితీ గవాక్షం నిరంతరాయంగా, నిరాటంకంగా ప్రతినెలా అంతర్జాల సాహితీ సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఎందరో విశిష్ట వ్యక్తుల ఉపన్యాసాలు వినిపిస్తూ, కవిసమ్మేళనలలో ఎందరో కవులను ప్రోత్సహించే ఇటువంటి సాహితీ సభ బహుశా ప్రపంచంలో మరొకటి లేదేమో!

ముందుగా గీతామాధవి గారు ఈనాటి ముఖ్య అతిథి ఆచార్య మాడభూషి సంపత్కుమార్ గారిని వేదికపై ఆహ్వానించి, వారిని సభకు పరిచయం చేశారు.

శ్రీ మాడభూషి సంపత్ కుమార్ గారు ఆధునిక తెలుగు కవుల్లో కవిగా, విమర్శకులుగా, అనువాదకులుగా సాహిత్యలోకంలో ప్రసిద్ధిచెందారు. వీరు 1959లో సెప్టెంబర్ 17వ తేదీన శ్రీనివాసాచార్యులు, పట్టమ్మ దంపతులకు చిత్తూరు జిల్లా దేవళంపేట, కమ్మపల్లె గ్రామంలో జన్మించారు. 1989 నుండి 12 సంవత్సరాల కాలం జర్నలిజంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం 2001వ సంవత్సరంలో మదరాసు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా చేరి, పదవీ విరమణ అనంతరం 2022 డిసెంబరు నుండి ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం, వెంకటాచలం, నెల్లూరు జిల్లాలో ఉన్న కేంద్రానికి సంచాలకులుగా తమ సేవలను అందిస్తున్నారు.

మాడభూషి సంపత్ కుమార్ బోడిదేవరపల్లెలో ప్రాథమిక విద్యను, కొత్తపల్లెమిట్టలో హైస్కూల్ విద్యను అభ్యసించారు.చిత్తూరు పి.సి,ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్, పి.వి.కె. ఎన్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసారు. ఆ తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు చదివి అక్కడే జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఎరుకల తమిళ బంధువాచకాలు- సామాజిక భాషాశాస్త్ర విశ్లేషణ అన్న అంశంపై 1986 లో ఎం.ఫిల్ డిగ్రీ పట్టభద్రులయ్యారు. ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ పర్యవేక్షణలో ఎరుకల భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రాసి మధురై కామరాజు విశ్వవిద్యాలయం నుంచి 1990లో డాక్టరేట్ పొందారు. అక్కడే మధుర రామనాథపురం జిల్లాలో తెలుగు భాషా, జానపద సాహిత్యంఅనే అంశంపై యూ.జి.సి.ప్రాజెక్టు కోసం పరిశోధన చేశారు. తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 2015లో అత్యాధునిక ఆధునిక తెలుగు కవితా దృక్పథాలు అన్న అంశంపై పరిశోధనచేసి డి.లిట్ పట్టాను పొందారు.

ఉద్యోగం ఆచార్యులే అయినా ఆయనలో ఉన్న కవితా పిపాస అడుగంటిపోలేదు. అదే ఆయన ప్రవృత్తి. సమాజంలో ఏ చిన్న విషయాన్ని చూసినా వెంటనే స్పందించి కాగితం మీద కలం పెట్టి అక్షరరూపం అమర్చేవారు. దేశ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై ఆలోచన మెండు. అందువల్లనే తనభావాలను కవితల రూపంలో వెలువరించేవారు. పేదల కష్టాలు, సామాన్యుల సమస్యలు, స్త్రీల దుఃఖాలు, సమాజంలో జరిగే దోపిడీలు, దేశభక్తి ఇలా చెప్పుకుంటూపోతే పలువిషయాలను కలంతో చెక్కేవారు. అలతి అలతి పదాలతో అనంత అర్థాలు వచ్చేవిధంగా చేసేవారు. బూదరాజు రాధాకృష్ణ, ఎ.బి.కె. ప్రసాద్, భద్రిరాజు కృష్ణమూర్తి తదితర భాషావేత్తల సాంగత్యం తెలుగు భాషను ఉన్నత శిఖరాలవైపు మరల్చేటట్లు చేసింది.

మాడభూషి వారి రచనలు సాహిత్యానికి, సమాజానికి కాకుండా భావి పరిశోధకులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. 2001 'గడ్డిపరకతో విప్లవం'తో మొదలుకొని 2023లో 60 శరత్తులు (వచన కవిత్వం) వరకు అనేక పుస్తకాలు, వందలకు పైగా వ్యాసాలను వివిధ కోణాల్లో వెలువరించారు.

అందుకున్న పురస్కారాలు:
ఆంధ్రభాషా విభూషణ - హైదరాబాద్ లయన్స్ క్లబ్, శిక్షక్ సింధు సమ్మాన్ - తమిళనాడు హిందీ అకాడమీ, విశ్వ హిందీ దీవస్,  తెలుగు వాఙ్మయ ప్రగతిరత్న - భాషా పరిరక్షణ సమితి, పుంగనూరు, కరుణ శ్రీ జాతీయ పురస్కారం - భారతీయ తెలుగు రచయితల సమాఖ్య - చిత్తూరు, కవికోకిల - యూనివర్సల్ ప్రిస్ క్రాస్ - చిత్తూరు జిల్లా, సాహిత్య రత్న అవార్డు - యూనివర్సల్ ప్రిస్ క్రాస్ - చిత్తూరు జిల్లా, జీవిత సాఫల్య పురస్కారం - కళాభారతి ఫౌండేషన్, రేవతి ఫౌండేషన్ - వి.కోట, శ్రీకృష్ణదేవరాయల జాతీయ పురస్కారం - లలిత కల సాగర్ - చిత్తూరు జిల్లా, శ్రీ నర్రా నరసయ్య కోటమ్మల స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం - కళామిత్ర మండలి - ఒంగోలు, తెలుగు వెలుగు అవార్డు - పెరంబూరు తెలుగు సాహితీ సమితి - చెన్నై, జీవిత కాల సాఫల్య పురస్కారం - ఆంధ్ర భాషా రంజని, తెలుగు శాఖ మద్రాస్ క్రైస్తవ కళాశాల - చెన్నై, తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారం-2019, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే "స్వర్ణ హంస" పురస్కారం మొ.నవెన్నో అందుకున్నారు.

మాడభూషి గారు ఆధునిక కవిత్వంపై అనర్గళంగా .50 నిమిషాలపాటు మాట్లాడారు. శ్రీ శ్రీగారి 'కవితా..ఓ కవితా ' అనే కవితను చదివితే ఆధునిక కవిత్వం ఎలా వ్రాయాలి అనే వారికి ఒక పాఠమే అన్నారు. వచన కవిత్వం ఒక ప్రజాస్వామ్యంలాంటిదేనన్నారు. కవులు వస్తువును ఎంచుకోవడంలో భాషాశైలిపై దృష్టి పెట్టాలన్నారు.కవిత్వ ప్రయోజనాలను వివరించారు. కవులందరూ వారి ఉపన్యాసాన్ని శ్రద్ధగా చెవులు రిక్కించి విన్నారు. వారి ఉపన్యాసంపై గీతగారు, సాధనాల వారూ, నేనూ, శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారూ స్పందించి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాము.

పిదప శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో కవిసమ్మేళనం ప్రారంభమైంది. తొలుతగా శ్రీ మాడభూషిగారు ' స్వర్గం ' అనే కవితను రసరమ్యంగా చదివి వినిపించారు. డా.గీతామాధవిగారు "మా పెరటి నారింజ చెట్టు తల్లైంది" అంటూ అద్భుతమైన భావుకతతో వినిపించిన "మా నారింజ చెట్టు"  కవిత అందరినీ ఆకట్టుకుంది. శ్రీ నాళేశ్వరం శంకరంగారు డాలర్ కాలం అనే సెటైరికల్ కవిత వర్తమానానికి అద్దం పట్టింది. చీదెళ్ల సీతాలక్ష్మి గారు ‘అంతం లేని వ్యధ’ అనే వారి కవితలో పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాక తలిదండ్రులు పడే వేదనను ఆర్ద్రంగా వినిపించారు. శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు కల్తీ అనే కవితలో సమాజంలోని అవినీతిని ఎండగట్టారు. శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడుగారు 'రిక్షావాలా 'అనే వారి కవితలో శ్రామికుల ప్రాధాన్యాన్ని వివరించారు. బుక్కపట్నం రమాదేవిగారు చిరుదరహాసం అనే కవితలో నవ్వు వైశిష్ట్యాన్ని అందంగా చెప్పారు.కొత్తూరు వెంకటరత్నం గారు  శ్రీనివాసునిపై భక్తి గీతాన్ని ఆలపించారు. బలుసాని వనజ గారు బోనాల పండుగపై శ్రావ్యంగా పాడారు. శ్రీ వెంకట రాజుగారు నాన్న గొప్పతనాన్ని తన కవితలో వినిపించారు. బూర దేవదానంగారు అమ్మపై చెప్పిన కవిత్వం బావుంది. శ్రీ అయ్యలరాజు సోమయాజుల ప్రసాద్ గారు భార్య మరణిస్తే "ఏదో తెలియని ఆవేదన" కవిత కన్నీరు తెప్పించింది. శ్రీ ఘంటా మనోహరం గారు ఆశాపరుల గురించి వ్యంగ్యంగా చెప్పారు. శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు ఆవకాయ గురించి చదివిన కవితకు అందరూ హాయిగా నవ్వారు. కందేపి రాణి ప్రసాద్ హస్తకళాకారుల గురించి చెప్పారు

సినీ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు తన విశ్వ శిఖరం అనే కవితలో మోసం చెయ్యడం మద్యం మూత తీసినంత సులభం అంటూ తన గంభీర స్వరంతో ఆవేశపూరితంగా చదివిన కవితకు చప్పట్లు మ్రోగాయి. అద్భుతం!, శ్రీ కందుకూరి శ్రీరాములు గారు మాట్లాడుకుందాం రా అంటూ మాటలు కనుమరుగౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదరావు రామాయణం అనే నేను "గంట నాటకం" అనే నా కవితలో ఈ జీవితం ఒక నాటకం. అందరూ అరువుగాళ్లే తెరపడగానే అందరూ రంగు తుడుచుకుని పోయే వాళ్ళే. ఈ మాత్రానికే ఇన్ని ఘోరాలు పాపాలు చెయ్యాలా అంటూ ప్రశ్నించాను.

కరాదుల అరుణ కీర్తి ప్రతాప్ రెడ్డి గారు సంగీతపు ప్రాధాన్యత తెలుపుతూ శ్రావ్యంగా, హాయిగా పాడి వినిపించారు. చాలా బావుందని అందరూ ప్రశంసించారు. అవధానం అమృతవల్లిగారు "నీవే నేనుగా" అనే కవితలో నువ్వెందుకు నా వెంటబడుతున్నావు అంటూ చదివిన కవిత అందరి ప్రశంసలను అందుకుంది. మేడిశెట్టి యోగేశ్వరరావు గారు భక్తి గురించి వ్యంగ్యంగా వ్రాసిన కవిత బావుంది. ఉప్పలపాటి వెంకటరత్నం గారు రైతుయొక్క ప్రాశిశ్త్యాన్ని తన గజల్ లో కమ్మగా పాడి వినిపించారు. కోదాటి అరుణ గారు తన "మనసులోని భావాలు" అనే కవితలో కవితాలక్షణాలగురించి చక్కగా వినిపించారు. పరాంకుశం కృష్ణవేణిగారు మార్గదర్శనం అనే కవిత చాలా పసందుగావుంది. చదివిన తీరు రమ్యంగా వుంది. దేవులపల్లి పద్మజ గారు, ‘భవిత’ అనే కవితలో గురువు యొక్క లక్షణాలను, ప్రాధాన్యతను వివరించారు. శ్రీ శ్రీమన్నారాయణ గారి కవితాంశం రమణీయంగా వుంది. డా.బృందగారు ప్రశ్నల నామావళి అనే కవిత చదవగా శోభాదేశ్ పాండేగారు బోనాలు పండుగ గూర్చి శోభాయమానంగా చదివారు. శ్రీ ఉమామహేశ్వర రావుగారు వర్ణపతాకం అనే కవితలో శ్రీ పింగళి వెంకయ్యగారి గురించి చెప్పారు. ఆనం ఆశ్రితారెడ్డిగారి గానం అద్భుతంగా ఉంది. శ్రీ వీరరాఘవులు గారు అక్షరాల సమాహారమే కవిత్వం అన్నారు.

చివరిగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు "తెలుగు తడాఖా" అనే కవితను చిక్కని స్వరంతో, కవితార్థాన్ని అభినయిస్తూ చదివిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ కవిత పేపర్లో ప్రచురితమై విశేష ఆదరణ పొందింది.

గీతగారి వందన సమర్పణతో ఈనాటి సాహితీ సభ పూర్తయింది. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-155/

https://www.koumudi.net/Monthly/2025/august/august_2025_vyAsakoumudi_vikshanam.pdf

వీక్షణం-154వ సాహితీ సమావేశం

 వీక్షణం-154వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-154

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా 154వ.ప్రపంచ సాహితీ సమావేశం జూన్ 20, 2025 న అద్భుతంగా జరిగింది. కాలిఫోర్నియా కాలమానంలో సాయంత్రం 6.00కు ఈ సమావేశం గీతామాధవి గారి స్వాగత వచనాలతో ప్రారంభమైంది. ఈనాటి ముఖ్య అతిథి డా. టి.గౌరీశంకర్ గారిని గీతామాధవి గారు సభకు పరిచయం చేశారు.

హైదరాబాద్ లో జన్మించిన గౌరీశంకర్ గారు ప్రముఖ విద్యావేత్త, సాహితీమూర్తి. తెలుగులో ఎమ్మే, ఎంఫిల్, పీ ఎచ్ డీ చేశారు. సీనియర్ తెలుగు ప్రొఫెసర్ గానూ, జర్నలిస్ట్ గానూ పేరు ప్రఖ్యాతులు గడించారు. సమాచార పౌరశాఖలో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్ర భాషా సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా పని చేశారు. పరిపాలనా రంగంలోనూ, బోధనారంగంలోనూ అపారమైన అనుభవాన్ని గడించారు.

డా. టి.గౌరీశంకర్ గారు "తెలుగు భాష ప్రాచీనత- విశిష్టత" అనే అంశమ్మీద ప్రసంగించారు. తమ ప్రసంగంలో భాషకు నిర్వచనం దగ్గరనుండి వివిధ భాషలు ఎలా ఏర్పడినాయి, వాటి చరిత్రను వివరించారు. మనదేశంలో 1600 భాషలు ఉన్నాయని, అందు గుర్తింపబడిన భాషలు 22 అని చెబుతూ మన తెలుగు భాష ద్వితీయ స్థానం నుండి చతుర్థ స్థానానికి పడిపోవడం బాధాకరమని అంటూ దానికి గల కారణాలను వివరించారు. తెలుగుభాష యొక్క ప్రాచీనత, ప్రత్యేకతలు, వైశిష్ట్యాన్ని గురించి వివరించారు. సుమారు 45 నీ.సెలయేటి ఝరిలా వారు ప్రసంగించిన తీరు అనన్యం!

కొందరి శ్రోతల స్పందన పిదప శ్రీ రాజేంద్రప్రసాద్ గారు, శ్రీమతి కోదాటి అరుణ గారి అధ్యక్షతన కవి సమ్మేళనం ప్రారంభమైనది. తొలిగా శ్రీ గౌరీశంకర్ గారు చిన్న కవిత "నల్లని పలకపై తెల్లని గీతలు" చదివి వినిపించారు.

తరువాత కె.గీతగారు 'మిస్డ్ లెటర్' అనే తమ కవితలో ఉత్తరాలు వ్రాసుకునే మధురమైన రోజులను గుర్తు చేశారు.అద్భుతం!,మాటలు తెగిపడిన అవయవాలయ్యాయని వాపోయారు. శ్రీ నాళేశ్వరం శంకర్ గారు మాతృభాషను తల్లి అనురాగంతో పోలుస్తూ చదివిన కవిత అందరినీ ఆకట్టుకుంది. సినీ గేయచయిత మౌనశ్రీ మల్లిక్ గారు తన శ్రావ్యమైన కంఠంతో "అంతర్ముఖీనం" అనే కవితలో చెట్టూ, పుట్టా శుకపికాలు కూడా మనతో మాట్లాడతాయి మాట్లాడే మనసు మనకుంటే అని చెప్పారు. ఎంత అందమైన కవితో! శ్రీ ఘంటా మనోహర్ రెడ్డిగారు తనదైన తాళ ధ్వనితో 'ఘంటారావం 'అనే కవిత శ్రోతలను ఆకర్షించింది. శ్రీమతి కోదాటి అరుణగారు వీక్షణం సమావేశాల గురించి హాయిగా పాడారు.శ్రీ అయ్యలరాజు సోమయాజులుగారు యోగాగురించి చెబుతూ కాదేదీ వయసుకనర్హం అన్నారు. శ్రీ వెంకటదాస్ గారు తెలుగుభాషా ఔన్నత్యం గురించి కవిత చదివారు. శ్రీ వెంకటేష్ గారు తన కవితలో విద్యార్థులు ఎలా తమ మేధను ఉపయోగించుకోవాలో చెప్పారు. ప్రసాదరావు రామాయణం అనే నేను "పారేసుకున్నాడు మనిషి ఎక్కడో మానవతకే వరమైన మందహాసం" అంటూ మందహాసం మాయం కావడానికి గల పరిస్థితులను వివరించాను. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు 'క్రొత్త ప్రపంచం' అనే తన కవితలో తెలుగు వ్రాయడంలోని ఇబ్బందులను తెలియచేశారు. అరుణగారు రైతు నేపథ్యాన్ని తీసుకుని కమ్మని పాటపాడారు. చీదెళ్ల సీతాలక్ష్మి గారు "జీవన సంజీవిని" అనే వారి కవితలో యోగా ప్రాధాన్యాన్ని వివరించారు.

అవధానం అమృతవల్లిగారి కవిత అందరినీ ఆకట్టుకుంది. వెంకట సత్యమూర్తిగారు విమాన ప్రమాదాన్ని గురించి కవిత వినిపించారు. పరాంకుశం కృష్ణవేణి గారు" చిరునవ్వుల చిరునామా అనే కవిత అద్భుతం! శ్రీ గుర్రం మల్లేశం గారు "వెలుగు జిలుగు" అని తొలకరిపై పద్యాలు చదివారు. శ్రీ కమర గారు పంచభూతాలకు ప్రాణాలు వచ్చాయి అంటూ ఒక్కొక్క అగ్గికి ఒక్కొక్క రూపం చూపారు. శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావుగారు జీవితం అనే తనకవిత నర్తనంలా ఉంది. ఆనం ఆశ్రితారెడ్డి గారు విమాన ప్రమాదాన్ని గురించి కవిత్వీకరించారు. బృందగారు 'హృదయ హారతి' అనే తమ కవితలో యోగా ప్రాధాన్యతను చెప్పారు. పవిత్రగారు ఆడపిల్లల కష్టాలగురించి ఆర్ద్రంగా కవిత వినిపించారు.సుధా కొలచన గారు తెలివి తెచ్చుకో అనే తన కవితను తెలంగాణా యాసలో చదివి ఆకట్టుకున్నారు.శోభా దేశ పాండే గారు విమాన ప్రమాదంపై కవిత వినిపించారు. వనజ గారు  విద్యార్థులు బాధ్యత అనే అంశంపై గానించారు.

చివరిగా శ్రీ రాజేంద్రప్రసాద్ గారు తన సహజమైన గంభీర స్వరంతో 'సాహిత్య సౌరభాలు' అనే కవితతో నిజంగానే సౌరభాలు వెదజల్లారు. చివరిగా గీతామాధవి గారి వందన సమర్పణతో ఈనాటి సమావేశం ముగిసింది.

అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-154/

https://www.koumudi.net/Monthly/2025/july/july_2025_vyAsakoumudi_vikshanam.pdf