Tuesday, 10 December 2024

వీక్షణం-147వ సాహితీ సమావేశం

 వీక్షణం-147వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-147

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 147వ అంతర్జాల సాహితీ సమావేశం నవంబర్ 15, 2024న  అత్యద్భుతంగా జరిగింది. ఆరోజు కార్తీక పౌర్ణమి కావడం విశేషం. ఈ కార్తీక పౌర్ణమి భవుని భక్తులకే కాదు, కవి భక్తులకు కూడా పండగే చేశారు డా.గీతామాధవి గారు. శివుని భక్తులు పుణ్యనదీ స్నానం చేస్తే, మా కవిత్వ భక్తులం సాహితీ తటాకాలలో మునిగి తేలాము.

వీక్షణం వ్యవస్థాపకురాలైన డా.కె .గీతగారు పుష్కర వత్సరాలకు పైబడి ప్రతినెలా ఈ అంతర్జాల సాహితీ సమావేశాలు అప్రతిహతంగా, నిరంతరాయంగా, శోభాయమానంగా జరుపుకోవడం అసాధ్యమే అయినా, సుసాధ్యం చేసి చూపుతున్నారు. ఆత్మశక్తి (Will power), సాహితీ ప్రియత్వం ఆమెను అకుంఠిత కార్యదీక్ష, పట్టుదలలతో అలా నడిపిస్తున్నవేమో!

ఇక ఈనాటి కార్యక్రమం గీతగారి స్వాగత వచనాలతో ప్రారంభమైంది. ముందుగా ముఖ్య అతిథి సినీ, బుల్లి తెర గేయ, మాటల రచయిత, శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారిని వేదికపైకి ఆహ్వానించి వారి ప్రతిభావిశేషాల గురించి వారందుకున్న ఎన్నో పురస్కారాలను గురించి ప్రస్తావించారు.

మౌనశ్రీ మల్లిక్ గారి పరిచయం:

మౌనశ్రీ మల్లిక్  గారు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జన్మించారు. వరంగల్ సీకేఎం కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ చదివారు. 1998 నుండి 2016 వరకు పాత్రికేయుడిగా పనిచేశారు. సుమారు 200 కవితల పోటీల్లో ప్రథమ బహుమతి అందుకున్నారు. దిగంబర, గరళం, తప్తస్పృహ, మంటల స్నానం వంటి కవిత సంపుటాలను ప్రచురించారు.

టెలివిజన్ గీత రచయితగా...కోయిలమ్మ, కృష్ణ తులసి, కేరాఫ్ అనసూయ, ఎదలోయల్లో ఇంద్రధనుస్సు, కలిసుందాం రా, అనుపల్లవి, అగ్నిసాక్షి, అగ్నిసాక్షి 2, బొమ్మరిల్లు వంటి అనేక సీరియళ్లలో 750 కి పైగా పాటలు రాశారు. సినీ గీత రచయితగా..నాలో తొలిసారిగా, చేతిలో చెయ్యేసి, థ్రిల్లింగ్, గుడ్ మార్నింగ్, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చెంబు చినసత్యం, పోరాటం, ఐపీసీ సెక్షన్ భార్య బంధు, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్, దేవినేని, జంక్షన్లో జయమాలిని, అన్నపూర్ణమ్మ గారి మనవడు, తెలంగాణ దేవుడు, జాతీయ రహదారి, లవ్ మాక్ టెయిల్ 2, కైనీడ, మధురవాణి, బెంగుళూరు 69, శరపంజరం, మూడో కన్ను (మాటల రచయితగా), ఇండియా ఫైల్స్ వంటి అనేక సినిమాలకు పాటలు, మాటలు రాశారు.

మౌనశ్రీ మల్లిక్ గారు అందుకున్న అవార్డులు, పురస్కారాలు- రంజని కుందుర్తి అవార్డు, యువసాహితీ అవార్డు (సిఎఓయు), ఎక్స్ రే అవార్డు, రాధేయ కవితా పురస్కారం, కలర్స్ అవార్డు (ఉత్తమ సినీ గీతరచయిత..(గుడ్ మార్నింగ్ సినిమా), జీవిఆర్ ఆరాధన 5 సార్లు ప్రథమ బహుమతి, అభ్యుదయ ఫౌండేషన్ అవార్డు, షీ ఫౌండేషన్ అవార్డు, ఆసరా అవార్డు, జనరంజక సహజకవి అవార్డు, పెన్నా అవార్డు, సృజన ఉగాది అవార్డు, సృజన సాహితీ సమితి, యంవి నర్సింహారెడ్డి సాహిత్య పురస్కారం, బోవేరా అవార్డు, కిన్నెర-ద్వానా అవార్డు, అస్తిత్వం అవార్డు, ఆర్వీ రమణమూర్తి సాహిత్య పురస్కారం, దాస్యం వెంకట స్వామి సమైఖ్యసాహితీ పురస్కారం, ఘంటసాల బంగారు తెలంగాణ పురస్కారం, భారతీయ సాహిత్య పరిషత్ జాతీయ పురస్కారం - 2018, అద్దేపల్లి సృజన పురస్కారం, విజయవాడ, ప్రతిభా పురస్కారం - తెలుగు సినీ రచయితల సంఘం, సినారె కవితా పురస్కారం - సాహితీ గౌతమి, కరీంనగర్, గిడుగు రామ్మూర్తి పురస్కారం, హైదరాబాద్, కాళోజీ కవితా పురస్కారం - తెలుగు సాహిత్య పీఠం, సిద్దిపేట, కాళోజీ కవితా పురస్కారం - తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, సినారె - వంశీ ఫిలిం అవార్డు, హరివిల్లు అవార్డు - గుంటూరు, జివిఆర్ ఆరాధన టీవీ అవార్డు (ఉత్తమ గేయ రచయిత కోయిలమ్మ సీరియల్), కళా వెంకట దీక్షితులు పురస్కారం - త్యాగరాయ గాన సభ, శంకరం వేదిక సంయుక్తంగా తేజ రాష్ట్రస్థాయి పురస్కారం - ఆలేరు, ఉత్తమ కవి పురస్కారం - భారతీయ నాటక కళా సమితి- వర్ధన్నపేట, ఉత్తమకవి పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం, సప్తపదిలో తోడు నీడ పురస్కారం, జివిఆర్ ఆరాధన హైదరాబాద్, రంజని కుందుర్తి అత్యుత్తమ కవితా అవార్డు, ఏ.జి. ఆఫీస్, హైదరాబాద్, ఆంధ్ర సారస్వత సమితి సాహిత్య పురస్కారం - మచిలీపట్నం, డాక్టర్ పట్టాభి కళాపీఠం సాహిత్య పురస్కారం - మచిలీపట్నం, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ పురస్కారం, సృజన కళల వేదిక విశిష్ట కవి ప్రతిభా పురస్కారం -2021, నాగార్జునసాగర్, పోతుగంటి రామకృష్ణయ్య గుప్త స్మారక జాతీయ సాహిత్య సేవా పురస్కారం-2022, సినీగేయ సవ్యసాచి వెన్నెల జాతీయ పురస్కారం-2022, అక్షరదీక్ష జాతీయ విశిష్ట సేవా పురస్కారం- 2022. సినారె సాహిత్య పురస్కారం - 2022, తేజస్విని కల్చరల్ అసోసియేషన్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి. విద్యాసాగర్ చేతుల మీదుగా "బుల్లితెర-సినీ గేయ కౌముది" బిరుదు స్వీకారం, తెలుగు సాహిత్య కళా పీఠం – 2022, కళావేదిక నేషనల్ ఫిలిం అవార్డు - 2022 ( సినిమా - జాతీయ రహదారి), 'తానా' ప్రపంచ కవితల పోటీల్లో ప్రథమ బహుమతి - 2020, కొలకలూరి ఇనాక్ సాహిత్య పురస్కారం -2023, తెలుగు సాహిత్య కళా పీఠం ఉత్తమ కవి పురస్కారం - 2023, వీరశైవ సాహిత్యరత్న పురస్కార్ -2023 (ప్రగతిశీల వీరశైవ సమాజం. పార్లమెంటు సభ్యులు శ్రీ బీబీ పాటిల్ పరి చేతుల మీదుగా), ఉత్తమ బుల్లితెర సినీగేయ కవి పురస్కారం - 2024. ఆలూరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్, హైదరాబాద్, జివిఆర్ ఆరాధన ఆత్మీయ పురస్కారం, ఉత్తమ గేయ రచయిత (కలిసుందాం రా సీరియల్, ఈటీవీ) - 2024, కవికోవిద కొటికలపూడి కూర్మనాథం 'వంశీ - తిరుమల బ్యాంక్ ఉగాది కామధేను పురస్కారం - 2024, అశ్వం అవార్డు, వే ఫౌండేషన్, తిరుపతి -2024, తెలుగు సినీ రచయితల సంఘం త్రిదశాబ్ది గౌరవ పురస్కారం -2024, సమరసత సాహితీ ప్రప్రథమ రాష్ట్రస్థాయి పురస్కారం -2024. సామాజిక సమరసత వేదిక, నల్గొండ విభాగ్,ఆలేరు. (గుర్రం జాషువా, బోయి భీమన్న, దున్న ఇద్దాసు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు జయంతులు సందర్భంగా..) మొ .నవి.

అనంతరం శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారి  ప్రసంగం ఒక జలపాతంలా సాగింది. 'సినిమా పాటల రచన, మెళుకువలు' అనే అంశంపై ఆయన తన సహజ గంభీరస్వరంతో, స్పష్టమైన ఉచ్చారణతో, అనర్గళంగా సుమారు 50 నిమిషాల పాటు ప్రసంగించారు. సినిమాలలో పాటలు వ్రాయాలనే ఔత్సాహికులకు వారి ప్రసంగం, సూచనలు పెద్దబాలశిక్ష అనే చెప్పాలి. ముఖ్యంగా "అవకాశాలు మనమే సృష్టించుకోవాలి, తాముగా ఎవరూ అవకాశం ఇవ్వరు" అనే మాట వేదవాక్కు. వారి సూచనలన్నీ వ్రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది.

వారి ప్రసంగంపై స్పందించిన వారిలో డా.గీతామాధవి, శ్రీ సాధనాల గారూ, శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారూ, నేనూ ఉన్నాము. ఈ సందర్భంగా మౌనశ్రీ గారు గీతగారి తొలి సినిమా రచనను పాడమని అడుగగా, గీతగారు "బట్టర్ ఫ్లైస్" సినిమాలో తానే వ్రాసి, పాడిన పాటను మధుర కంఠంతో పాడి వినిపించారు. అనంతరం మౌనశ్రీ గారు స్పందిస్తూ పాటలోని సాహిత్యాన్ని ఉటంకిస్తూ, "సినిమా పాటకు కావలిసినదిదే" అని కొనియాడారు.

తరువాత వరుసగా పాటల రచయితలు  తమ గీతాల్ని వినిపించారు. శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావు గారు "కుండపోత" అనే తన కవితను పాడి వినిపించారు. అవధానం అమృతవల్లిగారు మనసంటే అనే పాటను, శ్రీ చేకూరి నరసింహారావుగారు ఒక దేశభక్తి గీతాన్ని పాడి వినిపించారు. ఈ పాటల ప్రక్రియ సభకు క్రొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. అనంతరం శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన కవిసమ్మేళనం ప్రారంభమైంది.
మొదటగా శ్రీవాకాటి రాంరెడ్డి గారు వీక్షణంపై, గీతగారిని ప్రస్తావిస్తూ రచించిన పాట ఆసక్తిదాయకంగా ఉండినది. ఈ కవితపై సాధనాలవారు స్పందించారు. మండ వీరాస్వామిగౌడ్ ఇంటింటా దేవతలు అనే పాటను, ఊటుకూరి మహేష్ గారు కార్తీకమాసం పై పాటనూ,శ్రీ లింగుట్ల వెంకటేశ్వర్లు  ఒక పాటనూ, రాధశ్రీ  గారు మనజాతి తెలుగు అంటూ పద్యాన్నీ, శ్రీ సాధనాల గారు గోదావరిపై ఒక పాటనూ పాడి సభికులను ఆనంద పరిచారు. ములుముడి నారాయణ శాస్త్రి గారు మూడు తేటగీతి పద్యాలను పాడారు.

ప్రసాదరావు రామాయణం అనే నేను "నా మనసే నాకు శత్రువు" అనే కవితను వినిపించాను (పాడలేదండీ!) శ్రీ కేవీయస్ గౌరీపతి శాస్త్రి (వీరవతి ) గారు శివ విలాసం పాట పాడారు. డా.యం ఎన్ బృంద గారు "అష్ట లక్ష్మీ" అంటూ దేవిని స్వాగతిస్తూ ఆలపించారు. చిట్టాబత్తిన వీరరాఘవులు గారు "చందా మామా" అంటూ ఒక జానపద గీతాన్ని ఆలపించారు. కమరగారు "స్వాతి చినుకు" కవితను వినిపించారు. 'వద్దురా పెళ్లొద్దురా 'అనే హాస్య గీతాన్ని శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు చదివి నవ్వించారు. చివరిగా గీతగారు ఒక వేదనాత్మకమైన స్వీయ గీతాలాపన చేసి, మలిపలుకులు పలికారు. ఈసారి ఎందరో క్రొత్తవారికి స్థానం కల్పించడం చాలా సంతోషదాయకమైన విషయం.

ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉత్సాహంగా పాల్గొన్న ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-147/

https://www.koumudi.net/Monthly/2024/december/dec_2024_vyAsakoumudi_vikshanam.pdf

Monday, 11 November 2024

వీక్షణం-146వ సాహితీ సమావేశం

 వీక్షణం-146వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-146

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 146వ అంతర్జాల సాహితీ సభ అక్టోబర్ 18, 2024 అప్రత్యక్షమైతేనేం, అంతర్జాలమైతేనేం అత్యద్భుతంగా, అసాధారణ సాహితీసభగా, మరో 'భువనవిజయం' గా జరిగింది.

అల్లసాని వారు, ధూర్జటీ, రామకృషులు రాలేకపోయినా అంతటి మహనీయులు పాల్గొన్న గొప్ప సభ. సాహితీ స్రష్ఠ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి(స్పెషల్ డిప్యూటి కలెక్టర్, తెలంగాణా) వారొకవైపు, వివిధ రాష్ట్ర యూనివర్సిటీల తెలుగు శాఖాధిపతులొకవైపు, వివిధ సాహితీ సంస్థల అధ్యక్షులు మరో వైపు, ప్రాక్ పశ్చిమ తెలుగు కవులు కొలువు దీరిన ఈ మరో భువన విజయాన్ని చూసి తీరవలసిందే! ఇక వివరాల్లోకెళ్తే ......

తొలుత డా.గీతామాధవి గారి స్వాగత వచనాలతో సభ ఆరంభమైంది. ఈనాటి ప్రధాన ప్రాసంగికులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారిని, ప్రత్యేక ఆహ్వానితులైన వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల తెలుగు శాఖాధిపతులను, వివిధ సాహితీ సంఘాధ్యక్షులనూ వేదికపైకి ఆహ్వానించి సభకు వారిని పరిచయం చేశారు. తదనంతరం డాక్టర్ నరసింహారెడ్డి గారు "ఆధునిక కవిత్వం..అభివ్యక్తి" అనే అంశం మీద అనర్గళంగా, శివుని జటాఝూటం నుండి గంగ జాలువారినట్టు ప్రసంగించిన తీరు సభికులను ముగ్ధులను చేసింది. ప్రాచీనకవిత్వం నుండి ఆధునిక కవిత్వం, గేయ కవిత్వం, అత్యాధునిక కవిత్వం/ద్రవ కవిత్వం/వర్తమాన కవిత్వం వివిధ దశలలో ఎలా మార్పు చెందుతూ వచ్చిందో గురుజాడ గారిని, విశ్వనాథ వారిని, శ్రీశ్రీ, సినారెలను ఉటంకిస్తూ వివరించారు. కవితా వస్తు నిర్ణయం, శీర్షిక నిర్ణయం, ఎత్తుగడ, ముగింపులలో ఏయే జాగ్రత్తలు అవసరమో సోదాహరణంగా చెప్పిన తీరు అద్భుతం!

అలంకారాలైనా, ప్రాసపదాలైనా, భాషాపద విన్యాసమైనా సహజంగా అమిరి పోవాలేగాని, అందం కోసం అతికించినట్లు ఉండకూడదన్నారు. సాధ్యమైనంత వరకూ మనం నిత్యం సంభాషణలో వాడే పదాలు వాడుతూ చెప్పే విధానంలో నూతనత్వం చూపిస్తే కవితలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయన్నారు. 'ఒకపదం వాడితే సరిపోయే చోట రెండుపదాలు వాడకండి' అని సూచించారు. కవులందరూ తమ కవితలలో రెడ్డిగారు చెప్పిన ఏ కొన్ని అంశాలైనా ఉన్నాయా అని తడిమి చూసుకున్నారు. నాకైతే మాత్రం నా కవితా శైలిని మార్చుకోవలిసిన అవసరం ఉందని గుర్తించాను. ఇంతటి అద్భుతమైన ప్రసంగాన్ని ఇంతవరకూ నేను విని ఉండలేదు. వారికి నా కైమోడ్పులు.

డాక్టర్ నరసింహారెడ్డి గారి ప్రసంగాన్ని, వారి ఉదాహరణాలను అమెరికా యువకవి కమర గారు, సాలూరు కవి శ్రీ కిలపర్తి దాలినాయుడు గారు, పర్లాకిమిడి కవి ఉత్కల సాహిత్య వేదిక అధ్యక్షురాలు శ్రీమతి పండ్రంగి శారద గారు, శ్రీమతి వేలేటి శైలజ గారు కొనియాడారు.

తదుపరి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ప్రారంభమైంది. తొలుతగా డా.రామనాథం నాయుడు (తెలుగు శాఖాద్యక్షులు, కర్ణాటకరాష్ట్ర సార్వత్రిక విశ్వ విద్యాలయం, మైసూర్) గారు మైసూరు దసరా ఉత్సవాల రమ్యతను గురించి తన కవితలో అందంగా చెప్పారు. శ్రీ కొమర్రాజు ఉమామహేశ్వరరావుగారు (మా తెలుగుతల్లి- బెంగుళూరు) తమ సాహిత్య సేవగురించి వివరించారు. డా.కె.గీత గారు నేటి సాఫ్ట్ వేర్ ఉద్యోగులను కార్మికులంటూ వారి దుర్భర జీవితాన్ని తన కవిత 'కార్మికులారా వర్ధిల్లండి" లో వర్ణించిన వైనం ఆర్ద్రం అద్భుతం. ఆమె కవితలలో సహజ భావ విన్యాసం ప్రత్యేకం! అందరికీ అబ్బదు.

డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు "దేవతలు కూడా!" అంటూ దేవతలూ సమయానుకూలంగా మనలను ఏడిపిస్తారు, కన్నీరు పెట్టిస్తారు అంటూ చక్కని కవితను వినిపించారు. డా. మరింగంటి లక్ష్మణాచార్యులు గారు 'హరితహారం' అనే కవితలో వృక్షం యొక్క మనోభావాన్ని అద్భుతంగా చెప్పారు.

డా. పండ్రంగి శారద గారు (ఉత్కళ సాహిత్య వేదిక అధ్యక్షురాలు, పర్లాకమిడి) తన 'అజంతాసుందరి' అనే కవితలో తెలుగు భాషను అజంతా సుందరితో పోలుస్తూ కవిత చక్కగా చదివారు. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు కవిత ఎలా ఉండాలో అద్భుతంగా తన కవితలో వినిపించారు. అవధానం అమృతవల్లిగారు "గెలుపుతో స్నేహం చేద్దాం" అంటూ సుందరమైన కవితను వినిపించారు. శ్రీ వసీరా గారు బియ్యపు గింజ మీద ఇందిరా గాంధీని గీచాడట! అంటూ చదివిన కవిత అందరినీ అలరించింది.

శ్రీ గంటా మనోహర్ రెడ్డి గారు ఘంటారావం అనే కవితలో మనిషి మాయమవుతున్నాడు, మరమనిషి అవుతున్నాడు అంటూ ఆందోళన వెలిబుచ్చారు. శ్రీ లగిశెట్టి రాము గారు 'కూతురు' అనే తన కవితలో అమ్మాయి పాలపీకనుండి తాళి వరకూ తండ్రి భావాలు ఎలా ఉంటాయో ఆర్ద్రంగా చిత్రీకరించారు. నాకు అందరూ ఆడపిల్లలే కనుక ఆ ఆనందాన్నీ, వేదననూ భరించిన వాడిని కనుక ఒక్కసారి వెనుకకు తిరిగి చూచుకున్నాను. శ్రీ కమర గారి 'సొంతడబ్బా' కవిత నవ్వు పుట్టించింది. సరదాగా ఉంటాయి వారి కవితలన్నీ.

శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు గారు 'ప్రశ్న' అనే కవితలో ఒక అనుబంధం అనుమానాల మయమైనపుడు అది అనుబంధం ఎలా అవుతుంది అనంటూ ప్రశ్నల శరసంధానం చేశారు.

డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు 'మూడుముళ్ల బంధం' అనే కవితలో గడియారంలోని మూడు ముళ్లను కాలంతో పోలుస్తూ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పారు. కవయిత్రి శ్రీమతి అవధానం అమృతవల్లి గారు "గెలుపుతో స్నేహం చేద్దాం" అంటూ చుట్టూ ఉన్న అడ్డంకులను, అవరోధాలను అతిక్రమిద్దాం అని తమ కవితలో తెలియజేశారు.

నేను రామాయణం ప్రసాదరావును నా కవిత "అప్పుకావాలి నాకు" లో ఈనాడు మాయమవుతున్న అనురాగం, ప్రేమ సామరస్యం సౌహార్ద్రాలను ఎవరైనా నాకు అప్పు ఇస్తారా అంటూ అడిగాను. శ్రీ చిట్టాబత్తిన వీరరాఘవులు గారు 'కవిత్వం' అనే తన కవితలో కవిత్వ లక్షణాలు ఎలావుండాలో మనోహరంగా వినిపించారు.

"వాడు మారేదెప్పుడు" అని అయ్యల సోమయాజులు గారు తన కవితను చదివారు. మూర్ఖునికి మార్పు ఎలావస్తుంది? అని ప్రశ్నించారు. అట్లకాడ పై కవితను హాస్యస్ఫోరకంగా వినిపించారు శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు. మరోకవి శ్రీ ఉప్పలపాటి వెంకటరత్నం గారు శిథిలాలు అనే గుల్జార్ గారి హిందీ కవితకు తెలుగు సేతను వినిపించారు. శ్రీమతి వేలేటి శైలజ గారు గీతమాలిక మరియు తేటగీతి పద్యాలలో తెలుగు వైభవము/ సౌందర్యమును చక్కని స్వరంతో పాడి అందరినీ అలరించారు. శ్రీమతి కొలచన శ్రీసుధ గారు "నేను అమరను" అంటూ మాటలను మూటకట్టి కాలం గురించి కాలగర్భం గురించి చక్కని కవితను వినిపించారు. శ్రీమతి అమీనా కలందర్ గారు 'కల ఎంతో మంచిది' అని సూక్ష్మకవితను బాగా చదివి వినిపించారు. చివరిగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు తన సహజ గంభీర కంఠంతో కవుల కవితలు మధుశర్కరాలతో పోలుస్తూ చదివిన కవిత సభకు హైలైట్!

డా.గీతామాధవి గారి వందన సమర్పణలో సమావేశం ముగిసింది. సాహితీచరిత్రలో ఈ సమావేశం ఒక రంగుల పుటగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. 146 నెలలుగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి విరామం లేని ఈ సాహితీసభలను ఏర్పాటు చేస్తున్న గీత గారి కృషి, పట్టుదల అనన్యం, అసామాన్యం! ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-146/

https://www.koumudi.net/Monthly/2024/november/nov_2024_vyAsakoumudi_vikshanam.pdf

Saturday, 12 October 2024

అట్టహాసంగా కాలిఫోర్నియా "వీక్షణం" సాహితీ గవాక్షం 12వ వార్షికోత్సవం!

 అట్టహాసంగా కాలిఫోర్నియా "వీక్షణం" సాహితీ గవాక్షం 12వ వార్షికోత్సవం!

vikshanam-145

వీక్షణం 12 వ వార్షికోత్సవం అటు కాలిఫోర్నియాలోనూ, ఇటు అంతర్జాలంలోనూ సెప్టెంబరు 14, 20, 21వ తేదీల్లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా అమెరికాలోని ప్రముఖ కథారచయిత, భాషా నిపుణులు, వేమూరి నిఘంటు నిర్మాణ కర్త డా||వేమూరి వేంకటేశ్వర్రావు గారికి వీక్షణం "జీవన సాఫల్య పురస్కారాన్ని" అందజేసి ఘనంగా సత్కరించింది.

సెప్టెంబరు 14, 2024 తేదీన కాలిఫోర్నియాలోని ప్లెసంటన్ నగరంలో జరిగిన వీక్షణం 12వ వార్షికోత్సవాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.కె.గీత గారు నిర్వహించారు. ముందుగా ఈ వార్షికోత్సవ సందర్భంగా డా||వేమూరి వేంకటేశ్వర్రావు గారికి వీక్షణం "జీవన సాఫల్య పురస్కారాన్ని" అందజేసి ఘనంగా సత్కరించింది. ఈ సన్మాన కార్యక్రమం తరువాత వీక్షణం 12 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికల ఆవిష్కరణలు శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి కాంతి పాతూరి, డా.కె.గీత, శ్రీ వేణు ఆసూరి, శ్రీ తల్లాప్రగడ రావు, శ్రీ శ్రీధర్ రెడ్డిగార్ల చేతుల మీదుగా జరిగాయి. ముఖ్య అతిథిగా శ్రీ దేవినేని మధుసూదనరావు విచ్చేసి "తెలుగు- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" అనే అంశంమీద ప్రసంగించారు. తరువాత శ్రీ తల్లాప్రగడ రావు గారి నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనం యువకవి శ్రీ ఆది మోపినేని కవిత్వగానంతో ప్రారంభమైంది. స్థానిక ప్రముఖ కవులు డా.కె.గీత, శ్రీమతి షంషాద్, శ్రీ శ్రీధర్ రెడ్డి మొ.న వారు ఈ కవిసమ్మేళనంలో పాల్గొన్నారు.

తరువాత శ్రీమతి శారద కాశీవఝల ఆధ్వర్యంలో జరిగిన ఇష్టాగోష్టిలో శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ వేణు ఆసూరి, శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీ ప్రసాదరావు గోగినేని, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ గాంధీ ప్రసాద్, శ్రీ సత్యనారాయణ ప్రసాద్, శ్రీ వేమూరి శ్రీరామ్, శ్రీమతి జయశ్రీ మొ.నవారు పాల్గొన్నారు. ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశంలో కాలిఫోర్నియా స్థానిక కవులు, రచయితలు, సాహిత్యాభిలాషులు పాల్గొని సభను విజయవంతం చేసారు.

సెప్టెంబరు 20/21, 2024 తేదీలలో వీక్షణం 12 వ వార్షికోత్సవం అంతర్జాలంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, డా.కె. గీతామాధవి సభకు ఆహ్వానం పలికి ప్రారంభించారు. ఈ అంతర్జాల కార్యక్రమంలో ముందుగా వీక్షణం భారత దేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ వీక్షణం ప్రత్యేక సంచికలను ఆవిష్కరించారు. శ్రీ కందుకూరి శ్రీరాములు, శ్రీ వసీరా ఆత్మీయ వాక్యాలు పలికారు. శ్రీమతి సుధా కొలచన కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఇండియా, అమెరికా దేశాలనుండి కవులు పాల్గొన్న ఈ అంతర్జాల అంతర్జాతీయ కవి సమ్మేళనంలో కందుకూరి శ్రీరాములు, డా||కె.గీత, వ‌సీరా, కమర, శ్రీధర్ రెడ్డి బిల్లా, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, డాక్టర్ మోటూరి నారాయణరావు, కందూర్ చంద్ర ప్రకాశ్ గుప్తా, డాక్టర్ దేవులపల్లి పద్మజ, శ్రీసుధ కొలచన, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, మేడిశెట్టి యోగేశ్వరరావు, మామిళ్ల లోకనాథం, మల్కని విజయలక్ష్మి, ఎస్. రత్నలక్ష్మి, అమృతవల్లి అవధానం, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, డా. కందేపి రాణీప్రసాద్, లగిశెట్టి రాము, కె వి యస్ గౌరీపతి శాస్త్రి (వీరవతి), చిట్టాబత్తిన వీరరాఘవులు, అమీనా కలందర్, ప్రసాదరావు రామాయణం, డా. అరుణ కోదాటి, గుర్రం మల్లేశం, మనోహర్ రెడ్డి గంటా, రామకృష్ణ చంద్రమౌళి, ఉప్పలపాటి వెంకట రత్నం, డా. భోగెల. ఉమామహేశ్వరరావు (ఉమాకవి), శోభాదేశపాండే, జె.వి.కుమార్ చేపూరి మొదలగు వారు పాల్గొని కవితాగానం చేసారు.

ఎందరో సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్న ఈ వార్షికోత్సవ సందర్భంగా వీక్షణం అధ్యక్షులు డా.కె.గీతామాధవి కవులకు, కవితల పోటీ విజేతలకు ప్రశంసాపత్రాల్ని అందజేశారు.

గత పన్నెండేళ్లుగా "వీక్షణం" సాహితీ గవాక్షం అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియా లోనే కాక, గత రెండేళ్లుగా అంతర్జాతీయ అంతర్జాల సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని ప్రపంచమంతా చాటుతున్నది.

https://sirimalle.com/vikshanam-145/

https://www.koumudi.net/Monthly/2024/october/oct_2024_vyAsakoumudi_vikshanam.pdf

Monday, 9 September 2024

వీక్షణం-144 వ సాహితీ సమావేశం

 వీక్షణం-144 వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-144

వీక్షణం సాహితీ గవాక్షం 144వ అంతర్జాల సమావేశం ఆగస్టు20, 2024న ఆలస్యంగానైనా ఆసక్తిదాయకంగా జరిగింది. సుమారు పుష్కర కాలంగా ప్రతి నెలా నిరంతరాయంగా, నిర్విరామంగా జరుగుతున్న ఈ ప్రపంచ కవిసమ్మేళనం కోసం కవులందరూ ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. సాధారణంగా ప్రతినెలా రెండవ వారంలో జరగవలసిన ఈ సమావేశం రథసారథి డా.గీతామాధవి గారు భారత దేశ పర్యటనలో ఉండటం వలన మూడవ వారానికి వాయిదా పడ్డది.

ఈ సమావేశానికి డా.గీతామాధవి గారు అధ్యక్షత వహించగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ప్రధాన వక్తగా విచ్చేసి "వచనకవిత్వ రచనలో గుర్తించవలసిన అంశాలు" అనే అంశంపై అద్భుతంగా ప్రసంగించారు.

సేనాధిపతి గారు కరీంనగరవాసి. వివిధ సాహితీ ప్రక్రియలలో నిష్ణాతులు. కళాశాలలకు పర్యవేక్షణ అధికారిగా పనిచేసారు. వీరి విద్యార్హతలు: ఎం.కాం.,బి.ఇడీ. వృత్తి: ⁠రిటైర్డ్ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, శాతవాహన విశ్వ విద్యాలయం-కరీంనగర్, రిటైర్డ్ కామర్స్ విభాగాధిపతి, ప్రభుత్వ మహిళా డిగ్రీ,పి.జి. కళాశాల-కరీంనగర్, పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాశాల విద్యా కమీషనరేట్, అకడమిక్ అడ్వయిజర్, రిటైర్డ్ కో-ఆర్డినేటర్-ఇగ్నో, రిటైర్డ్ N.S.S. ప్రోగ్రాం అధికారి, పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల FAC ప్రిన్సిపల్ గా, NAAC కమిటీ కో-ఆర్డినేటర్ గా, పూర్వ రాష్ట్ర ప్రధాన పర్యవేక్షణ అధికారి, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆం.ప్ర. గా వివిధ రంగాల్లో పనిచేసారు.

రచనా వ్యాసంగం: వెలువరించిన గ్రంథాలు:16(వివిధ ప్రక్రియల్లో). చిటికెలు(నానీలు), సంవీక్ష(గ్రంథ సమీక్ష వ్యాసాలు), అక్షరం సాక్షిగా(కవిత్వం), శబ్దలయ(కవిత్వం), దర్శనం(గ్రంథ సమీక్షలు), వీక్షణ(గ్రంథ సమీక్షలు), ప్రతిభాస్వరాలు(గ్రంథ సమీక్షలు), సుహృల్లేఖ(లేఖా సంపుటి), పరిష్కారం(కథాసంపుటి), నానీ కవుల డైరెక్టరీ, అవలోకనం(గ్రంథ సమీక్షలు), మధురాక్షరి (వ్యాస సంపుటి), అంతర్వాహిని( సాహితీవేత్తల మనోగతాలు), వివేచనం(సాహిత్య విమర్శ), దిక్సూచి( వచన కవిత్వ కరదీపిక), ఇప్పుడిప్పుడే( కవితా సంపుటి). వీరికి  సాహితీ చంద్ర అనే బిరుదు లభించింది.

ఒక వేయికి పైగా సామాజిక అంశాలపై సంపాదక లేఖలు, పన్నెండు వందలకు పైగా గ్రంథ సమీక్షా వ్యాసాలు, యాభై వరకు కథలు, వందలాదికవితలు, వ్యాసాలు వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
ఎనిమిది పత్రికలలో కాలమిస్ట్ గా కాలమ్స్ రాసారు. 100 కు పైగా గ్రంథాలకు పీఠికలు రాసారు. 20వరకు గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. దాస్యం సమీక్షలపై గతంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో యం.ఎ. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయించారు.

సాహితీ సంస్థలతో అనుబంధం: తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర కోశాధికారి, తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పూర్వ అధ్యక్షులు( కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య) సాహితీ గౌతమి, పలు సాహితీ సంస్థలకు సలహాదారునిగా పనిచేసారు.

పురస్కారాలు: అమృతలత జీవన సాఫల్య పురస్కారం, ప్రజాభారతి విశిష్ట సాహితీ పురస్కారం, డాక్టర్ బొద్దుల వెంకటేశం అత్యున్నత విశిష్ట సాహితీ పురస్కారంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓ యాభై వరకు పురస్కారాలు, ప్రభుత్వం ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో పాటు సాహితీ, విద్యారంగాలలో ఓ యాభై వరకు పురస్కారాలు అందుకోవడం జరిగింది.

వీరి నాన్న గారి పేరున దాస్యం వెంకటస్వామి స్మారక రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం ప్రతి ఏటా పదేళ్ళుగా ఇవ్వడం జరుగుతోంది. సి.నా.రే. వాగ్భూషణ పురస్కారం గత నాలుగేళ్ళుగా ఇవ్వడం జరుగుతున్నది.
నేటి కవిత వాట్సాప్ సమూహంలో వేయికి పైగా కవితల సమీక్షలు చేయడం జరిగింది.

ఇక ఇవేళ్టి సభకు వస్తే, 'వచనకవిత్వ రచనలో గుర్తించవలసిన అంశాలు' అనే అంశంపై తీయని గొంతుకతో, స్పష్టమైన పద ఉచ్చారణతో, సెలయేటి గమనంలా ప్రసంగించి శ్రోతలను మెస్మరైజ్ చేశారు. వారు కవిత్వ పరిణామ క్రమాన్ని వివరిస్తూ త్రిపురనేని శ్రీనివాస్ గారి 'కవిత్వం కావాలి 'అనే కవితను చదివి వినిపించారు. కవిత్వం సామాజిక అవసరం అంటారు. ఎంచుకునే వస్తువు పాఠకుల హృదయాలను కదిలించేదిగా వుండాలంటారు. రసం, ధ్వని అలంకారాలూ మాత్రమే సరిపోవనీ, సామాజిక ప్రయోజనం వుండి తీరాలంటారు. కవితకు ముఖ్య ద్వారం శీర్షిక కనుక అది నాటకీయంగా ఉండాలి అంటారు. మీరు వ్రాసే కవిత ఒకరిద్దరినైనా మార్చ గలిగితే కవితాప్రయోజనం సిద్ధించినట్టేనని ఉద్ఘాటించారు. మొత్తానికి వర్తమాన కవులందరికీ వారి ప్రసంగం ఓ విలువైన పాఠం.

తరువాత గీత గారూ, మనోహరరెడ్డి గారూ వారి ప్రసంగాన్ని సమీక్షించి ధన్యవాదాలు సమర్పించారు. శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు సేనాపతి గారి గురించి ప్రసంగిస్తూ వారు లేఖలతో ప్రారంభించి, తదుపరి సమీక్షలూ, కథలూ, కవితలూ వ్రాస్తూ అత్యున్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. తదుపరి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో కవిసమ్మేళనం ప్రారంభమైంది. ఈసారి విశేషమేమంటే ప్రతి ఒక్కరి కవితనూ ఒకరిద్దరు సమీక్షించడం! కవిసమ్మేళన ప్రయోజనం సార్ధకతను సంతరించుకుంది.

తొలిగా గీతగారు తన 'వాన స్వాగతం' కవితలో వర్షమొచ్చేటప్పుడు ప్రకృతి వర్ణన దేవులపల్లి వారిని జ్ఞాపకం చేసింది. తడిసిన మట్టి ముద్దలను మనసు పరిమళంతో పోల్చడం ఎంత అందంగా వుందో!

గతనెలలోని కవితలలో ఉత్తమమైనదిగా పద్మశ్రీ చెన్నోజ్వల గారి 'వెనుకంజ ' ఉత్తమమైనదిగా గీతామాధవి గారు ప్రకటించి పద్మశ్రీ గారికి అభినందనలు తెలియజేసారు.

శ్రీ గంటా మనోహర్ రెడ్డిగారు 'వెంకన్న స్వామిపై స్వామి ఇబ్బందులను హాస్యస్ఫోరకంగా, భక్తి భావం చిప్పిలేలా చదివారు. ఈ కవితను అయ్యల సోమయాజులు గారు సమీక్ష చెందారు. శ్రీ మోటూరి నారాయణరావు గారు 'బలిపీఠం 'అనే కవితలో కలకత్తా అత్యాచార ఉదంతాన్ని ఆర్ద్రం గా వివరించారు ఈ కవితను గీతగారూ, వెంకటరత్నం గారూ సమీక్షించారు. శ్రీ వెంకటరత్నం గారు 'తన సీతాయి బొట్టు ' అనే కవితలో తల్లి తనబిడ్డ పెంపకాన్ని గురించి వివరించారు. దిష్టి బొట్టుకూ సీతాయి బొట్టు అని కనుమరుగౌతున్న సాంప్రదాయ పదాన్ని తిరిగి వినిపించడం సంతోషం! ఈ కవితను శ్రీ గౌరీపతి శాస్త్రి గారు సమీక్షించారు. శ్రీ చిత్తాబత్తిన వీర రాఘవులు గారు 'ఎక్కడ నీ చిరునామా' అని మానవత్వాన్ని ప్రశ్నించగా, శ్రీ గౌరీపతి శాస్త్రి గారు 'భారతమ్మా చెప్పమ్మా'అంటూ అందంగా చెప్పారు వారణాసి భానుమూర్తిగారు సమీక్షించారు. శ్రీ అయ్యాలరాజు సోమయాజుల ప్రసాద్ గారూ,లగిశెట్టి రాము గారూ భానుమూర్తిగారూ కలకత్తా అత్యాచారాన్ని హృదయ విదారకంగా వివరిస్తూ మగాడి బాధ్యతలను గుర్తు చేశారు ఈ కవితలపై వారుసగా గీతగారు, సాధనాలగారూ సమీక్షించారు. శ్రీమతి దేశ్పాండే గారు ' చీపురు ' అనే తమ కవితలో చీపురును స్త్రీ తోనూ లక్ష్మీ దేవితోనూ పోలుస్తూ అది చేసే సేవను వర్ణిస్తూ హాస్యాన్ని పండించారు, గీత గారూ, నేనూ ఆ కవితను సమీక్షించాము. శ్రీమతి అవధానం అమృతవల్లిగారు స్టీ ఔన్నత్యాన్ని అందంగా చెప్పగా గీతగారు,శ్రీ సేనాపతి గారూ సమీక్షించారు. శ్రీ దాస్యం సేనాపతి గారు "లేడీ టీచర్ 'అనే తమ కవితలో టీచర్ యొక్క బాధ్యత, అవిశ్రాంత సేవ, వారి అంకితభావం గురించి విశిష్టమైన రీతిలో గానం చేశారు. గీతగారు సమీక్ష చేశారు. శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు గారు 'బాధ్యత లేని బాంధవ్యం’ అనే శీర్షికలో ఈనాటి యువత బాధ్యతా రాహిత్యం ఎలా విడాకులకు దారి తీస్తున్నదో బాధగా వివరించారు. శ్రీ శ్రీనివాస్ గారు మన 78 ఏళ్ల స్వాతంత్య్రం గురించి ఘంటసాలవారి కంచుకంఠంతో శ్రావ్యంగా పాడి వినిపించారు. శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు తెలుగుతల్లికి వందనం అంటూ భారతమాతకు కాళ్ళు కడిగి నెత్తిపై చల్లుకుని వారి భక్తిని ప్రకటించగా నేను సమీక్షించాను. శ్రీ అంబటి నారాయణ గారు 'ఆదిమానవులం' అంటూ మానవత్వం నశించిన మానవుడికన్న వారే మేలు అన్నారు. ప్రసాదరావు రామాయణం అనే నేను మనసమాజంలోని రుగ్మతలను చీపురుతో చిమ్మేస్తాను అంటూ 'నాకో చీపురు కావాలి' ఇస్తావా నేస్తం అంటూ విమర్శనాత్మక కవితను గానించాను. గీత గారు సమీక్షించారు. శ్రీ రఘునందన్ గారు 'నా బాల్యం నాకు కావాలిప్పుడు' అంటూ బాల్యంలోని మధురిమను చెబుతూ ఈనాటి వ్యవస్థలో బాల్యం కూడా అంగడి సరుకై అమ్మబడుతున్నదని విచారం వ్యక్తం చేశారు.గీత గారు సమీక్షించారు. శ్రీమతి సి.రమాదేవిగారూ,రాధికా శ్యామగారు కూడా తమ కవితలను వినిపించారు.

డా.గీతామాధవి గారు తమ ముగింపు ప్రసంగంలో వచ్చే సమావేశం వార్షిక సమావేశంగా అత్యంత సుందరంగా ఉండబోతుంది అంటూ తీయని కబురుని తెలిపారు. వచ్చేనెల సమావేశంలో విడుదల కానున్న వీక్షణం 12వ వార్షిక సంచిక కోసం రచనలకు ఆహ్వానం పలుకుతూ రచనలను వీక్షణం వాట్సాపు గ్రూపులో పోస్తూ చేయవలసినదిగా విజ్జప్తి చేశారు. రచనలు చేరవలసిన చివరి తేదీ సెప్టెంబరు 5, 2024.

మొత్తం మీద ఉద్దండులైన కవులతో ఆద్యంతం రసవత్తరంగా సాగింది ఈనాటి సభ. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశం గీతగారి వందన సమర్పణతో ముగిసింది. ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-144/

https://www.koumudi.net/Monthly/2024/september/sept_2024_vyAsakoumudi_vikshanam.pdf

Sunday, 11 August 2024

వీక్షణం-143 వ సాహితీ సమావేశం-- వరూధిని --

 వీక్షణం-143 వ సాహితీ సమావేశం

-- వరూధిని --
vikshanam-143

వీక్షణం సాహితీ గవాక్షం 143వ అంతర్జాల సమావేశం జూలై 12, 2024న అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశానికి శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల గారు అధ్యక్షత వహించగా, వీక్షణం అధ్యక్షులు  డా.గీతామాధవి గారి కథాపఠనం జరిగింది. తరువాత ప్రపంచ తెలుగు కవుల కవి సమ్మేళనం జరిగింది. అలాగే ఈ సమావేశంలో ఆత్మీయ ప్రసంగం చెయ్యడానికి శ్రీ కొప్పర్తి రాంబాబు ప్రత్యేకంగా విచ్చేసారు. ముందుగా సభాధ్యక్షులు మృత్యుంజయుడు గారు గీతగారిని, రాంబాబు గారిని సభకు పరిచయం చేసి, ఈవేళ గీతగారు చదవబోతున్న కథ గురించి తనకు తెలిసిన విశేషాలు తెలియజేసారు. ముఖ్యంగా "ఊరి గ్రంథాలయంలోకి వెళ్లాలంటే పెరట్లో జామచెట్టెక్కి దుమకాలి" అనేది తనకు బాగా నచ్చిన అంశమని పేర్కొన్నారు. పుస్తకాలకు అంత దగ్గరగా గడపడం వల్లనే గీతగారు అద్భుతంగా రచనలు చెయ్యగలుగుతారని అన్నారు.

ముందుగా అతిథుల్ని సభకు పరిచయం చేసారు.

గీతగారు అందరికీ తెలిసిన వ్యక్తి. అయినా సంక్షిప్త పరిచయం. అంటూ "గీతగారు కవయిత్రి, రచయిత్రి, గాయని, భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం ఉంటూ, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డులో "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషాశాస్త్రంలో పిహెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. పది సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు" పొందారు. ద్రవ భాష (2001), శీత సుమాలు (2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017), అసింట (2022)  కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా (2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల, At The Heart of Silicon Valley -Short stories (2023), Centenary Moonlight and Other Poems (2023) ప్రచురింపబడ్డాయి. "అపరాజిత"- గత ముప్ఫైయ్యేళ్ళ స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకత్వం వహించి ప్రచురించారు. కవిత్వంలో అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం మొ.న అవార్డులు, నవలకు తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ సాహితీ పురస్కారాల్ని పొందారు." అన్నారు.

ఇక కొప్పర్తి రాంబాబు గారు పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దుగ్గిరాల గ్రామంలో. పెరిగింది చదువుకున్నది ఆంధ్రా ప్యారిస్ తెనాలి. విద్యాభ్యాసం తెనాలి, కొల్లూరు గ్రామాల్లో. తెనాలిలో చలం, కొడవటి గంటి వంటి ప్రముఖ రచయితలు తిరుగాడిన వీథుల్లో తిరుగుతూ పెరిగారు. సాహిత్య సాంస్కృతిక కేంద్రమైన తెనాలిలోని వారి ఇంట్లో వారి నాన్నగారి ప్రోత్సాహం వల్ల, ఆయనకు గల సాహిత్య నేపథ్యం వల్ల రాంబాబు గారికి సాహిత్యం పట్ల ఆసక్తి మరింత పెరిగింది. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. నాలుగు దశాబ్దాల పాటు ఉద్యోగ జీవితంలో  ఎప్పుడూ పుస్తక పఠనం వదిలిపెట్టలేదు. "కొప్పర్తి కథావాహిని" వీరి ఆడియో కథల ఛానెల్. యూ ట్యూబ్ లో వీరి ప్రసంగాలు వినవచ్చు." అని పరిచయాలు ముగించి గీతగారిని కథాపఠనానికి ఆహ్వానించారు.

తరువాత గీత గారి కథపఠనం జరిగింది. ఇది లేఖా రూపంలో రాసిన కథ అని పేర్కొంటూ కథని ప్రారంభించారు గీత. కథ పేరు "మా ఊరు చూడాలని ఉందా?". కథలో అడుగడుగునా తమ ఊళ్ళో తన చిన్ననాటి ఊరిని కళ్ళకు కట్టినట్టు రాసారు. సభలోని వారు కథ యావత్తూ ఆసక్తిదాయకంగా విని ఆస్వాదించారు.

ఆ తరువాత ఈ కథలో పలు భాషా, సాహిత్య అంశాలను, విశేషాంశాలను ప్రస్తావిస్తూ రాంబాబు గారు చక్కని విశ్లేషణ చేసారు. "ఇందులో రచయిత్రి తన ఊరి సంగతులు చెప్తున్నట్లుగా అనిపించినా, ఈ కథ చదివి తమ ఊరిని గుర్తు తెచ్చుకొని వారుండరు" అంటూ "ఉదాహరణకి ఇక్కడ ఇస్తున్న వాక్యాల్ని చూడండి-

"నాకు తెలిసిన నా చిన్ననాటి అందమైన ఊరు ఇప్పుడు లేదు. అయినా నేను వెళ్లినపుడు చూడాలనుకునేవి నా చిన్నప్పుడు మేం నివసించిన ఇళ్ళు, వీథులు."

"బయటి నించి ఇట్టే తీసెయ్యగల చెక్క గెడ ద్వారం దాటి ఆవరణలో అడుగుపెడ్తే ఒక పక్కగా కాకులు, పిచుకలు సావాసం చేసే పెద్ద వేపచెట్టు. చెట్టు కింద వేప పళ్ళు విరగరాలి ఉండేవి. పిల్లలమైన మేం ఏవీ తోచనప్పుడు వాటిని కూడా వదిలేవాళ్ళం కాదు. గింజ తగలకుండా ఒక్క జుర్రుతో చప్పున జుమికి ఊసేస్తే చేదు మాయమై తియ్యగానే ఉండేవి."

"కార్తీక మాసం లో తప్ప పెద్దగా శోభ లేని, శ్రీ కాళముల నిలయమైన శివాలయం, వేదమంత్రాల ఘోష, వెలిగి పోతున్న రథం, పరుగెత్తే పూజారి గారితో బాటూ ఊరంతా గంటలో తిరిగొచ్చే దేవుడి పల్లకీ. ఎత్తైన ధ్వజస్తంభం, అభయమిచ్చే గరుత్మంతుడు, రాముడితో బాటూ మనకీ నమస్కరిస్తున్నట్టున్న ఆంజనేయుడూ.. సీతమ్మ వారి వైపు అందరిలో చూస్తే బావుండదని తనలో తాను మందస్మితం చేసే రాముల వారు…పూజారి గారి భార్య చివర్లో చేతిన వేసే చిట్టి చిట్టి బియ్యపు అప్పాల ప్రసాదం."

"నంది వీధిలో మా అమ్మమ్మ గారింట్లో ఉప్పునీటి బావి పళ్లాన్ని ఆనుకుని ఎర్ర జాంచెట్టు, ఇంటినల్లుకుని బ్రహాండమైన సువాసన వెదజల్లే రాధాకృష్ణ తీగె దాటితే, చిన్నవయసులో శివైక్యం చెందినా చెక్కుచెదరని మా తాతయ్య వెంకట రమణ గారి పందిరి మంచం, అమ్మమ్మకిష్టమైన రంగం పెట్టె, ఎప్పుడెళ్ళినా భోజనం సిద్ధంగా ఉండే వేణమ్మ అత్తయ్యగారిల్లు."

"ఒకే నీటికి నాలుగు రేవులెందుకో అర్థం కాని చెరువు గట్టున బుర్ర మీసాల చెరువు కాపరి. మాలపేట రేవు, శూద్రుల రేవు, బ్రాహ్మల రేవు, బ్రహ్మం గారి మఠం రేవు."

"మా పెరటి గోడనానుకుని ఉన్న ఊరి గ్రంథాలయంలోకి వెళ్లాలంటే మా దొడ్లో జామచెట్టెక్కి దుమికితే సరి!"

"దాటితే మూలకి సాంబ్రాణి పొగ ఎగజిమ్మే గాజులమ్మ ఇల్లు. ఆవిడ భర్త బస్టాండులో ఎర్ర దుస్తుల కూలీ అయినా, పిల్లలందరం మొదటగా ఆమె గాజులకి దణ్ణం పెట్టుకుంటేనే పరీక్షల్లో ఫస్టు మార్కులొచ్చేది."

"ఈ పక్కన అయ్యరు గారి శాకాహార భోజనం హోటల్, నాలుగడుగుల్లో మాంసాహార మిలట్రీ హోటలు, ఎదురుగా ఎన్నాళ్లుగానో మేం ఎప్పుడెప్పుడు చదివి పెద్దవుదామా అని ఎదురు చూసే హైస్కూలు. గేటు బయట అమ్మే బఠానీలు, తేగలు, ఉప్పూ, కారం పెట్టిన పుల్ల నారింజ  చిప్పలు అమ్మే బుట్టల వాళ్ళు. "

"సరుకుల కోసం చిట్టీ పట్టుకొచ్చి గంటల తరబడి వేచి చూడాల్సిన కిరాణా దుకాణం. ఎంతసేపైతే ఏం? చివర్లో పిల్లకాయల చేతిన పుట్నాల పప్పో, బెల్లం ముక్కో కొసరుగా విసురుతారుగా మరి!"

"దార్లో కొనుక్కోమని ఇచ్చిన పావలాతో సేమ్యా, సబ్జా గింజల రంగుల నీళ్ల పాయసం కొనుక్కు తినాల్సిందే. ఇప్పట్లా దుమ్మూ, ధూళీ ఉంటాయని ఆరోగ్యసూత్రాలు ఏవీ ఉండేవీ కావు, ఉన్నా ఎవరి బుర్రలకీ ఎక్కేవీ కావు."

"ఊరంతా తిరగడానికి బయలుదేరే సంక్రాంతి సంబరాల బండ్ల కోలాహలాలు ఇక్కడే మొదలయ్యేవి. సంబరాల్లో తొలిగా వచ్చే గరగలకి దణ్ణం పెట్టుకుంటేనే అప్పట్లో ఊరంతా అలుముకునే ఆటలమ్మ, మశూచి వ్యాథులు తగ్గేది. తరువాత వరసగా పులివేషం, శక్తి వేషం, ఏసుక్రీస్తు, రామలక్ష్మణులు, హరిదాసు, ఎరుకుల సానులు, తప్పెటగుళ్లు, కోలాటం, చివరగా మొగుడూ, పెళ్ళాల హాస్యపు కీచులాట. "

"సెంటరులోకి నడిచొచ్చి హైవే దాటి ఇటొస్తే కొత్త ఊరు. ఒకప్పటి పంట పొలాల్ని ప్లాట్లు చేస్తే మొలిచిన శ్రీ రామ్ నగర్. మొదటి వీథిలో ఉన్న పోస్టాఫీసు, కొత్త సినిమా హాలుకి వెనకగా, రెండో వీథిలో చివర ఇల్లుగా,  అందంగా కనబడుతున్న తెల్ల సున్నపు కొత్త డాబాయే మా ఇల్లు.

సెంటర్లో తాజాగా తాపేశ్వరం కాజా దుకాణం, దేవరపల్లి వారి బెల్లం మిఠాయి, కొత్తగా పెట్టి ఊరిని ఊపేస్తున్న సేటు మిఠాయికొట్టు, పక్కనే రుచి చూసి తీరాల్సిన వల్లీబాబు గారి ద్రాక్ష జ్యూసు దుకాణం."

"డాబా మీదికి పాకిన సన్నజాజి పందిరి దాపున గూడు చేసుకుని ఎప్పుడు చూసినా తెల్ల కాగితాన్ని నలుపు చేసే బక్క పలుచని పదహారేళ్ల అమ్మాయినే నేను. గోధూళి వేళ వీథి చివర నించి మేకపిల్లల్ని మలుపు తిరిగే వరకూ చూస్తే అందమైన గులాబీలు పూయించే చిట్టచివరి ఇల్లు డ్రాయింగ్ మేష్టారి ఇల్లు. దాటితే చెరుకు తోటలు. ఆకతాయి కుర్ర ప్రేమ జంటలకి మేష్టారి కంటబడకుండా కాపలా కాసేది ఆ గట్టునే." అంటూ వాక్యాల్లో భావ గర్భితంగా దాక్కున్న అనేక స్థానిక అంశాల్ని తెలియజేసారు.

సభలో వున్న వారిలో గీతగారిని చిన్నప్పటి నించి ఎరిగున్న వారు, ఇతరులు ప్రశంసలు కురిపించారు. సాధనాల వెంకట స్వామి నాయుడు గారు అప్పటి జ్ఞాపకాల్ని కళ్ళ ముందుంచుతూ, ఈ కథ ఆనందభాష్పాలు తెప్పించిందని ఉద్వేగంగా మాట్లాడారు. కందుకూరి శ్రీరాములు గారు, ప్రసాదరావు గోగినేని గారు మున్నగువారు కథలోని అనేక అంశాలను ప్రశంసించారు.

తరువాత గీతగారు జూన్ మాసపు ఫేస్బుక్ కవితా విజేతని ప్రకటించి అభినందించారు. నాగిశెట్టి నాయుడు తమ నాగిశెట్టి నానీలకు గాను ఈ నెల విజేతగా నిలిచారు.

తరువాత శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీమతి రాధాకుసుమ గార్ల ఆధ్వర్యంలో కవిసమ్మేళనం ఉత్కంఠభరితంగా కొనసాగింది. మొదట డా||కె.గీతగారు తమ ఊరి విశేషాలతోనే తన కవిత్వ యాత్ర ప్రారంభమైందని గుర్తు చేసుకుంటూ తన మొదటి కవిత "ఓ రోజంతా" తో ప్రారంభించారు. ఆ తర్వాత దాలి వైశ్యరాజుగారు ఒక పేరడీ గీతాన్ని పాడి అలరించారు. ఆ తరువాత మోటూరు నారాయణ రావు, అరుణ కోదాటి, రాజేంద్రప్రసాద్, డా.రాధాకుసుమ, ప్రసాదరావు రామాయణం, పిళ్ళా వెంకట రమణ మూర్తి మల్కని విజయలక్ష్మి, అమృతవల్లి, రాధికాసూరి, శ్రీసుధ కొలచన, పద్మజ చెన్నోజ్వల, దామరాజు విశాలాక్షి, మేడిశెట్టి యోగేశ్వరరావు, మహా, మల్లాముల కనకయ్య, దేవులపల్లి పద్మజ, కృష్ణదాసు, తూముల శ్రీనివాస్, ఉప్పలపాటి వెంకట రత్నం గార్లు మొదలైన వారు తమ కవితాగానాన్ని వినిపించారు.

సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశం గీతగారి వందన సమర్పణతో ముగిసింది. ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-143/

https://www.koumudi.net/Monthly/2024/august/august_2024_vyAsakoumudi_vikshanam.pdf

Tuesday, 9 July 2024

వీక్షణం-142 వ సాహితీ సమావేశం-- ప్రసాదరావు రామాయణం --

 వీక్షణం-142 వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-142

వీక్షణం సాహితీ గవాక్షం 142వ అంతర్జాల సమావేశం జూన్,14 2024న ఆసక్తిదాయకంగా జరిగింది. వీక్షణం సాహితీ గవాక్షం రథసారథి డా.గీతామాధవి గారి ఆధ్వర్యాన ఈసారి శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా గారి 'ఆవలివైపు' కవితా సంపుటి ఆవిష్కరణ జరపడం నూతనత్వాన్ని సంతరించుకుంది. తరువాత ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనం జరిగింది.

ముందుగా గీతగారు వీక్షణం మిత్రులు, ప్రముఖ విద్యావేత్త, సాహిత్యకారులు, వక్త శ్రీ టి.పి.యన్ ఆచార్యులు గారికి నివాళులు అర్పిస్తూ, వారితో వీక్షణానికున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తరువాత వారి మృతికి సంతాపం తెలుపుతూ సభ ఓ నిమిషం మౌనం వహించింది.

తర్వాత గీతగారి స్వాగత వచనాలతో పుస్తక రచయిత శ్రీధర్ రెడ్డిగారినీ, ఆ కవితా సంపుటి ఆవిష్కరణ చేయవలసిందిగా శ్రీ దాలి వైశ్యరాజు గారినీ, పుస్తక సమీక్షకై శ్రీమతి స్వాతి శ్రీపాద గారినీ, ఆత్మీయ వాక్యాలు పలుకవలసిందిగా రామాయణం ప్రసాదరావు గారినీ వేదికపైకి ఆహ్వానించారు.

ముందుగా దాలి వైశ్యరాజు గారు ఆవిష్కరణ చేస్తూ శ్రీధర్ రెడ్డిగారితో తనకున్న ఆత్మీయతను వెలిబుచ్చారు. తామిద్దరూ కవిత్వాన్ని గురించి ప్రతిరోజూ చర్చించుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వెళ్లే సన్మిత్రులమని అన్నారు. శ్రీధర్ రెడ్డిగారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసారు.

తరువాత స్వాతి శ్రీపాదగారు 'ఆవలివైపు' కవితా సంపుటిలోని ప్రతి ఒక్క కవితను ఉటంకిస్తూ దానిలోని వైశిష్ట్యాన్ని తమ మధురమైన కంఠంతో వివరిస్తుంటే అందరూ మంత్రముగ్ధులై విన్నారు.

రామాయణం ప్రసాదరావు గారు మాట్లాడుతూ, తనకు మిత్రులూ, అత్యంత ఆత్మీయులూ అయిన శ్రీధర్ రెడ్డిగారి విశిష్ట గుణ గుణాలను వివరించారు. వారి రచనలు తపస్యాశ్రమంలోని మునికన్యకలా ఏ అలంకారాలూ, ఆభరణాలూ లేక సహజ సౌందర్యంతో ఉంటాయి. అలతి పదాలతో భావగంభీరతను కప్పుకుని ఎలా ఉంటాయో వివరించారు. కొన్ని అందమైన కోట్స్ ని చదివి వినిపించారు.

తదుపరి శ్రీ శ్రీధర్ రెడ్డిగారు తన ధన్యవాదపలుకులలో తన గ్రామీణ నేపథ్యాన్ని వివరిస్తూ అటు దక్షిణవాదాన్నీ, ఇటు వామ వాదాన్నీ తార్కికంగా ఆలోచించి తనదైన దృక్పథాన్ని తన కవితలలో చూపానని తన గంభీరమైన స్వరంతో ప్రసంగిస్తుంటే శ్రోతలు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన కవితాభ్యున్నతికి కారణమైన గీతగారికి, వీక్షణం వేదికకి కృతజ్ఞతలు తెలియజేసారు.

గీతగారు మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి తనకు “వీక్షణం” ప్రసాదించిన సహోదరుడని అంటూ, "గత దశాబ్ది కాలంగా కాలిఫోర్నియాలో కవిత్వ వ్యవసాయం చేస్తున్నవాడు, పాఠకుల మనస్సుల్లో ఆలోచనల విత్తనాలు జల్లి, అద్భుతమైన కవిత్వాన్ని పండిస్తున్నవాడు, అది వచనకవితైనా, పద్యమైనా అలవోకగా రాయడం అతనికి పరిపాటి." అన్నారు. శ్రీధర్ వీక్షణం ద్వారా కవిత్వానికి పరిచయమై కవిగా రెండు పుస్తకాలు వెలువరించడం ఎంతో ఆనందదాయకమని ఆనందాన్ని వెలిబుస్తూ, అభినందనలు తెలియజేసారు. శ్రీధర్ కవిత "రంగు రంగుల చిలక" ను సభకు చదివి వినిపించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి కవితలు కొన్ని ఇక్కడ చూద్దాం.

"నీకు సిరినిచ్చు కొను స్థాయి నాకు లేదు
నీ భుజబలము రూపింప నిమడలేను
కొంత కొఱతయో ‘వాణి’ నీ చెంతలేక,
పొత్త మిచ్చుచుంటిని తాత! పుచ్చుకొనుడు"

"పుడమిని చీల్చు కుంటూ
పాపాల మూట పైకి లేచింది
పశ్చాత్తాపదగ్ధ ఒక్క కన్నీటిబొట్టు
ఆ బరువును సమం చేసింది! "

“భళ్ళుమంటూ పగిలింది నీటికుండ
కనుల లోపల నున్న నీటికుండ!”

"ఏ రెక్కలూ లేకున్నా
ఏడేడు సాగరాలు ఎగిరెళ్ళి
ఊరిస్తున్న జ్ఞాపకాలతో
ఊరిలో వాలిపోయా”

“అగ్గిపెట్టుందా?
సిగరెట్టుందా ?
అలాగే ఓ తుపాకీ!”
...........
“ఈ తుపాకీ సంస్కృ తి
తన దేహన్నే దహించి వేస్తున్న క్యాన్సర్ కణితి”

“మనిషి?
ఉన్ననాడు క్యాపిటలిస్టు
లేనినాడు కమ్యూనిస్టు!”

“ఎన్ని ఘోరాలు విన్నా
నేనెన్నడూ ఏడవలేదు
సున్నితత్వం నశించిన
పాషాణ హృదయుడను కదా !
అందుకేనేమో.. నా బదులు
నా కలం సిరా కరిగి
వలవలా కన్నీరు కారుస్తోంది”

తదుపరి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీమతి రాధాకుసుమ గార్ల ఆధ్వర్యంలో కవిసమ్మేళనం ప్రారంభమై ఉద్దండులైన కవులతో ఉత్కంఠభరితంగా కొనసాగింది.

మొదట డా||కె.గీతగారు తన కవిత 'కలల కరపత్రం' తో ప్రారంభించారు. యుద్ధ రాజకీయ నేపథ్యంలో రాసిన వాడి, వేడైన కవిత ఇది. తరువాత శ్రీధర్ రెడ్డి గారు వాసన, కమురు వాసన, గంజాయి వాసన, కడుపులో బిడ్డ రాగలదా వచ్చి మనగలదా అంటూ అద్భుతమైన కవిత వినిపించారు. శ్రీ వసీరా గారు ప్రపంచాన్ని ఓ విత్తనంతో పోలుస్తూ అద్భుతమైన కవితను వినిపించారు.

రాణీ ప్రసాద్ గారు 'నమ్మకద్రోహి' అనే కవితను వినిపించగా దాలి వైశ్యరాజుగారు ఒక పేరడీ గీతాన్ని పాడి అలరించారు. మోటూరు నారాయణ రావు గారు ఆశల మొలక అమ్మంటూ పాడగా, అరుణ కోదాటిగారు పుస్తకం యొక్క ప్రాధాన్యతను వివరించారు. శ్రీ గుళ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు 'కలాలు కదిలితేనే' అంటూ తన శ్రావ్యమైన కంఠంతో కవితల ప్రాముఖ్యతను వినిపించారు. దేవీ గాయత్రి గారు నిరుద్యోగ గీతం బాధగా పాడగా డా.రాధాకుసుమ గారు తన 'దినచర్య' కవితలో ఆరోగ్య సూత్రాలు ఇంపుగా తన తీయని గాత్రంలో సొంపుగా చెప్పారు.

శ్రీ ఆళ్ల నాగేశ్వరరావు 'మా నాన్న' కవితలో తనకూ వారి నాన్నగారికి ఉన్న అనుబంధాన్ని కనులు చెమర్చేలా వినిపించారు. 'కవితా నా కవితా' అంటూ గుర్రం మల్లేశం గారు చక్కని సీసపద్యం పాడారు. కోసూరి జయసుధ గారు పెంపకం అనే తన కవితలో చక్కని అలంకారాలతో, కమ్మని భావుకతతో, అందమైన పదవిన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రసాదరావు రామాయణం అనే నేను 'అమ్మలూ నాన్నలూ జరజాగ్రత్త' అంటూ ఈనాటి యువత వక్రమార్గాలు పట్టడానికి తలిదంద్రుల బాధ్యత కూడా ఉన్నదంటూ కాస్త జాగ్రత్త అని హెచ్చరించాను.

శ్రీ ఆది మోపిదేవి 'నువ్వు చెయ్యలేని మోసం' అనే కవితలో భార్యచే మోసగించబడిన భర్త ఆవేదనను కాస్త ఆగ్రహాన్ని మిళితం చేసి వినిపించారు. ఇది అందరినీ ఆకట్టుకున్న కవిత.

ఆచార్య అయ్యలరాజు సోమయాజులు గారు ఓ మాతృమూర్తి ఆవేదనను వినిపించగా శ్రోతల కళ్ళు చెమరించాయి. పరిమి సత్యమూర్తి గారు దేశంలో లౌకిక వాదం ఎంత అవసరమో వివరించగా, డా. చీదెళ్ల సీతాలక్ష్మి గారు మెత్తని దిండు అవసరాన్ని హాస్యస్ఫోరకంగా తనకవితలో చదివి అందరినీ నవ్వించారు. శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తిగారు తన 'రంగస్థల విషాదం' కవితలో జీవిత సత్యాలను చెప్పారు. దేవులపల్లి పద్మజగారు 'నాన్న’ అనే అంశంపై చక్కని పద్యాలను చదివారు. అదే అంశంపై లలితా వర్మ గారు కూడా మంచి కవితను గానించారు. రేపాక రఘునందన్ గారు 'వృద్ధాశ్రమ గీతం' అంటూ చదివిన కవితలోని పదబంధం, భావుకత అందరినీ ఆకట్టుకున్నాయి. బ్రతుకు కమురు వాసన, జ్ఞాపకాలు తడిసిన మట్టి వాసన అనడం గొప్పగా అనిపించింది. వైరాగ్యం ప్రభాకర్ గారు 'ఇప్పటికీ నాకింకా గుర్తుంది', చిత్తాబత్తిన వీర రాఘవులు గారి 'ప్రశ్న' కవితలు బావున్నాయి. ఆలపాటి సత్యవతి గారి 'అక్షరాలు' కవితతో అలరించగా చెన్నోజ్వల గారి స్వరాంబుధి వీనుల విందుగావుండినది. భారతి రామచంద్రుని గారు జయము జయము అంటూ మన దేశ సౌందర్యాన్ని చక్కని భాషావిన్యాసంతో అందంగా వివరించారు. అద్భుతమైన కవిత. విశాలాక్షిగారు వర్తమాన సామాజిక పరిస్థితులను ఉటంకిస్తూ తస్మాత్ జాగ్రత అంటూ సూచనా కవితను వినిపించారు.

మేడిశెట్టి యోగేశ్వరరావుగారు మావూర్లో వాన వచ్చింది అనే అందమైన కవితను వినిపించగా, రాధాకుసుమ గారు మావూళ్లోనూ వాన వచ్చింది మమ్ము భ్రష్ఠు పట్టించిందీ అని నవ్వించారు.

మొండ్రెడ్డి సత్యవీణగారు తన 'అపార్ట్ మెంట్' కవితలో దేశాన్ని ఒక అపార్టుమెంటుతో పోలుస్తూ భిన్నత్వంలో ఏకత్వపు అవసరాన్ని నొక్కి చెప్పారు.

గతనెలలోని కవితలలో ఉత్తమ కవితగా మధు జెల్లా గారి 'నా పయనం' బహుమతి పొందింది. వారికి అభినందనలు. సుమారు మూడున్నర గంటల పాటు రసానుభూతి కలిగించిన ఈ సమావేశం గీతగారి తుది పలుకులతో ముగిసింది. ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-142/

https://www.koumudi.net/Monthly/2024/july/july_2024_vyAsakoumudi_vikshanam.pdf

Thursday, 20 June 2024

వీక్షణం-141 వ సాహితీ సమావేశం

 వీక్షణం-141 వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-141

వీక్షణం సాహితీ గవాక్షం 141వ అంతర్జాల సమావేశం మే 17వ తేదీ 2024న ఆసక్తిదాయకంగా జరిగింది. ద్వాదశ వర్షాలుగా అప్రతిహతంగా ప్రతినెలా సమావేశాలు జరపడమంటే ఎంతటి కష్టసాధ్యమో చెప్పనవసరం లేదు. డా.గీతామాధవి గారు తన అచంచల కృషి, పట్టుదలతో అది సుసాధ్యం చేసి చూపిస్తున్నారు.

ఇక ఈ నాటి 141వ సమావేశాన్ని రొటీనుకు భిన్నంగా ఇంతకు మునుపు పాల్గొనని క్రొత్త కవుల/ కవయిత్రుల గొంతుకలను ప్రపంచానికి పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యం కడు ముదావహం, ప్రశంసనీయం కూడా. పాత కవులందరమూ శ్రోతలమై పోయాము. కవిసమ్మేళనంలోని ప్రతి కవితపై కొంత చర్చ కూడా జరగడం వలన తమ, తమ కవితలను మెరుగు పరచుకునే అవకాశం రావడం ప్రాధాన్యత, ప్రయోజనం సంతరించుకుంది. ఈ వినూత్న ప్రక్రియకు జోహార్లు.

కార్యక్రమంలో ప్రథమంగా గీతగారు స్వాగత కుసుమాలను మాపై జల్లుతూ, ఈనాటి ముగ్గురు ప్రధాన వక్తలను సభకు పరిచయం చేశారు.

మొదటి వక్త రమేశ్ కార్తీక్ నాయక్(నునావత్ కార్తీక్) గోర్ బంజారాలకి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సాహిత్య సృజన చేస్తున్న కవి, కథకుడు. అతని ఆంగ్ల రచనలు Exchanges: Journal of Literary Translation - University of IOWA మరియు Poetry at Sangam, Outlook India, Indian periodical, Live Wire, Borderless journal, Nether Quarterly లాంటి జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. బల్దేర్ బండి(కవిత్వ సంపుటి) లోని ఓ కవిత 'జారేర్ బాటి' (జొన్న రొట్టెలు) SR & BGNR GOVT DEGREE ARTS AND SCIENCE COLLEGE, - ఖమ్మంలో పాఠ్యాంశంగా ఉంది. తాజాగా "బల్దేర్ బండి" కవిత్వ సంపుటిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, M.A తెలుగు రెండవ సంవత్సరం వారికి పాఠ్యాంశంగా చేర్చారు. బల్దేర్ బండి - కవిత్వం, ఢావ్లో గోర్ బంజారా కతలు : కథలు, కేసులా : గోర్ బంజారా కథల సంకలనం ఆచార్య సూర్యాధనంజయ్ గారితో కలిసి సహసంపాదకీయం, ఇద్దరు కలిసి గిరిజన ఆదివాసీ కథలు సేకరిస్తున్నారు. CHAKMAK (ఆంగ్ల కవిత్వ సంపుటి). ఇవి రమేశ్ ప్రచురించిన పుస్తకాలు. రావిశాస్త్రి కథా పురస్కారం, తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారం, కలహంస పురస్కారం, నవ స్వరాంజలి పురస్కారం తదితర పురస్కారాలెన్నో ఆయన గెలుచుకున్నారు. ప్రస్తుతం దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో అక్షరం అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

రెండవ వక్త పుప్పాల శ్రీరామ్ సాహితీ మిత్రులకందరికీ పరిచయం ఉన్న పేరే. కవి, విశ్లేషకులు. వర్తమాన వచన కవిత్వ రచన, విమర్శ ప్రస్తావనలో శ్రీరాం గారి పేరు ఉటంకించదగినది. 2018లో అద్వంద్వం అనే వచన కవితా సంపుటి ప్రచురించారు. 2023 లో 1818 అనే దీర్ఘ కవిత ప్రచురించారు. ప్రత్యేకించి వచన కవిత్వ విమర్శ రంగంలో శ్రీరాం పేరు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే అతను రస్తా ఆన్లైన్ పత్రిక లో కొన్నాళ్ళు మలిచూపు అనే శీర్షిక నిర్వహించారు. కవిసంగమం లో అనిల్ డ్యానీతో కలసి 'కవితా ఓ కవితా' ఐదేళ్ళ పాటు కాలం నిర్వహించారు. సారంగ లో 'ఇప్పుడు వీస్తున్న గాలి' పేరిట ఒక శీర్షిక నిర్వహిస్తున్నారు. విమర్శ కవిత్వం రెండింటిలోనూ శ్రీరాం కృషి చేస్తున్నారు.

మూడవ వక్త అనిల్ డ్యాని కవి, రచయిత. పదేళ్లనుంచి కవిత్వం లో ఉన్నారు. మూడు కవితా సంపుటాలు వెలువరించారు. ఎనిమిదో రంగు, స్పెల్లింగ్ మిస్టేక్, గాంధారి వాన అనే మూడు కవితా సంపుటాలను, మిత్రులతో కలిసి ' తీరందాటిన నాలుగు కెరటాలు' అనే పుస్తకాన్ని వెలువరించారు. వందకి పైగా సాహిత్య వ్యాసాలు రాశారు. పెన్నా రచయితల సంఘం, రొట్టమాకు రేవు , అద్దేపల్లి స్మారక పురస్కారం, అరుణ్ సాగర్ యువ పురస్కారం. పల్లా కృష్ణ జాతీయ అవార్డు, వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. రేడియో, దూరదర్శన్ లలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, సంగీతం, సాహిత్యం రెండు చాలా చాలా ఇష్టం. సాహిత్యాన్ని పిల్లల లోకి తీసుకు వెళ్లాలని ఆకాంక్ష.

రమేష్ కార్తీక్ నాయక్ గారు గిరిజన సాహిత్యం, దాని ప్రాధాన్యత పై సమగ్రంగా ఉపన్యసించారు. అనాది నించీ గిరిజనుల పట్ల జరిగిన అన్యాయాల్ని పేర్కొంటూ, గిరిజన తెగల భాష, ఆచార వ్యవహారాల్ని అర్థం చేసుకోకుండా సినిమాలు వంటివి నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే గిరిజన సాహిత్యం అందరికీ అర్థం కాకపోవడానికి తగిన పదకోశాలు ఉండాలని ఉటంకించారు. శ్రీరామ్ పుప్పాల,అనిల్ డ్యాని గార్లు వర్తమాన కవిత్వంపై కొండలపైనుండి క్రిందికి దొర్లిన బండల్లా అనర్గళంగా ఇచ్చిన ఉపన్యాసాలు ఆసక్తిదాయకంగా సాగాయి. ఇప్పటి తరంలో బలంగా రాస్తున్న కవుల, కవయిత్రుల కవిత్వాన్ని తక్కువ చేసి చూడడం తప్పని, ప్రతి ఒక్కరూ చదవి తీరాల్సిన కవిత్వమంటూ, సోదాహరణంగా వివరించారు. ఓ చిన్న సైజు వర్తమానకవిగా నా సందేహానికి జవాబును వారి ఉపన్యాసంలో వెతుక్కున్నాను.

తదుపరి కవిసమ్మేళన కార్యక్రమానికి సీనియర్ కవులు శ్రీ వసీరా గారు, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గార్ల సంయుక్త సారధ్యంలో రమణీయంగా జరిగింది.

  1. అమూల్య గారు: వీరిమాతృభాష తెలుగు కాకపోయినా భాష నేర్చుకుని "కన్నుల్లోకి వెన్నుల్లోకి గన్నుల్లా దూసుకు పోయే కవిత్వం కావాలి "అంటూ ముద్దు ముద్దు మాటలతో ఆమె చదివిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు.
  2. హాతీరాంగారు తన కవితలో తలిదండ్రులు తమ బిజీ జీవితంలో చిన్నారులను పట్టించుకు పోవడం వల్ల పిల్లలు పడే ఆవేదనను కన్నులు చెమర్చేలా కవిత వినిపించారు. వేడుకలన్నీ ప్రేమకు వీడ్కోలు అంటూ ముగించారు.
  3. ఫణిమాధవి కన్నోజు గారు మానవుడు తన అత్యాశలతో వాతావరణాన్ని ఎలా పాడు చేసాడో తన కవిత 'ఈకో..ఎలిజీ' లో చెప్పారు.
  4. చిన్నాదేవి గారు వయసుకు వయసు వచ్చేసింది అంటూ తన 'వయసు ఒడిలో' అనే కవితలో బాల్యం నుండి మరణించేవరకు వ్యక్తుల భావాలను కడు రమ్యంగా వివరించారు.
  5. కాశిరాజుగారు తన కవితలో వాడిన 'వర్ర 'అనే క్రొత్త పదాన్ని వాడారు.
  6. చంద్రశేఖర్ గారు "హృదయ వీణ' అనే తన కవితలో కడు రమ్యమైన భావాలు మనలో ఎప్పుడు కలుగుతాయో వివరించారు.
  7. రావుల మల్లేశం గారు ఈనాటి యువతయొక్క భవితను గురించి చక్కగా తన కవితలో వినిపించారు.
  8. శ్రీమన్నారాయణగారు "జీవితంలో తాళయుక్త రవళి "అనే కవితను రమణీయంగా వినిపించారు.
  9. స్త్రీ ప్రస్థానం అనే కవితలో శైలజ గారు అమ్మ విశ్రాంతిలేని లేని జీవితాన్ని ఆర్ద్రంగా వివరించారు.
  10. రమాదేవిగారు మణిపూర్ ఘోరకలిని తమ కవితలో వివరించారు.
  11. షరీఫ్ గారు ప్లాస్టిక్ భూతాన్ని తమ పద్య కవితలలో చూపారు.
  12. కోసూరి జయసుధ గారు కుల జాడ్యాన్ని నిర్మూలించి అందరం ఒకే కుండలో నీరమై, ఒకే పక్షి రెక్కల క్రింద ఒదిగిపోదాం అంటూ చక్కని భావుకతతో కవితాగానం చేశారు.
  13. ఆది మోపిదేవి గారు ఏమనిషిని చూసినా ఏముంది గర్వకారణం అంటూ వర్తమాన రుగ్మతలను ఎత్తి చూపారు. అందరినీ ఆకట్టుకున్న కవిత. (తన కలం పేరు క.మ.ర అంటే కడుపు మండిన రచయితట. అందరం నవ్వుకున్నాం.)

మొత్తంమీద ఈ వినూత్న ప్రక్రియతో సభ విజవంతంగా ముగిసింది.

ఈ సభలో డా||కె.గీతామాధవి, కందుకూరి శ్రీరాములు, వసీరా, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భవాని ముప్పల, అవధానం అమృతవల్లి, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, రామాయణం ప్రసాదరావు, గౌరీపతి శాస్త్రి కె వి జి ఎస్, మోటూరి నారాయణరావు, డా.కె.శైలజ, జె.వి.కుమార్ చేపూరి, బిట్రవరం సత్యన్నారాయణ, గుర్రం మల్లేశం మొ.న సాహిత్యాభిలాషులు ఎందరో సభకు హాజరయ్యారు.

చివరగా గీతగారి మలిపలుకులతో సభ విజయవంతంగా ముగిసింది.

ఈ సమావేశంలో అమెరికా, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యాభిలాషులు అనేకులు ఆసక్తిగా పాల్గొన్నారు. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-141/

https://www.koumudi.net/Monthly/2024/may/may_2024_vyAsakoumudi_vikshanam.pdf

Friday, 10 May 2024

వీక్షణం-140 వ సాహితీ సమావేశం

 వీక్షణం-140 వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-140

వీక్షణం సాహితీ గవాక్షం 140వ అంతర్జాల సమావేశం ఏప్రిల్ 12వ తేదీ 2024న అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశం క్రోధి నామసంవత్సర ఉగాది కవిసమ్మేళన ప్రత్యేక సమావేశంగా జరిగింది. ఈ నాటి సమావేశానికి ముఖ్యఅతిథిగా అమెరికా మొట్టమొదటి ద్విశతావధాని శ్రీ శ్రీచరణ్ పాలడుగు గారు, కవిసమ్మేళనం అధ్యక్షులుగా శ్రీ మధు ప్రఖ్యా గారు, శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గార్లు విచ్చేశారు. తెలుగు వారికి వత్సరానికి ఒక్కసారి ఉగాది అయితే, మన వీక్షణం కవి కుటుంబానికి ప్రతి నెలా ఉగాదే! అంత సంబరం మనందరికీ వీక్షణం కవిసమ్మేళనమంటే! పన్నెండేళ్లుగా ఎన్నో కష్ట నష్టాలకోర్చి నిరంతరాయంగా ప్రతి నెలా సభలు జరుపుతున్న వేదిక ప్రపంచంలో బహుశా: మన వీక్షణం ఒక్కటే కావచ్చు. వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.గీతామాధవి గారి కృషి, పట్టుదల అనన్యం, అసమాన్యం, అపురూపం! నిత్య సాహితీ కార్మికురాలైన వారికి కవి లోకం జేజేలు పలుకుతుంది! దాదాపు 6 గం.లకు ప్రారంభమైన సభ ఉద్దండులైన కవుల/ కవయిత్రుల కవితాగానంతో సుమారు మూడున్నర గం. పాటు కొనసాగింది, సభికులు కవిత్వ ఆనందంతో మైమరచి పోయారు. అందరికీ మూడున్నర గంటలు అప్పుడే అయిపోయాయా అనిపించింది.

ముందుగా వీక్షణం రథసారథి డా.కె.గీతామాధవి గారు ఈనాటి ముఖ్య అతిధి శ్రీయుతులు పాలడుగు శ్రీ చరణ్ గారికి, కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించిన శ్రీ మధు ప్రఖ్యా, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గార్లకు స్వాగతం పలుకుతూ సభకు వారిని పరిచయం చేశారు.

ముందుగా శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గారు క్రోధి నామసంవత్సర ఉగాది విశేషాంశాల్ని పద్యగానంతో, చక్కగా వివరించారు.

తదుపరి కవిసమ్మేళనం ప్రారంభమైంది. అధ్యక్షులు శ్రీ మధు ప్రఖ్యాగారు ప్రతి కవితనూ విశ్లేషిస్తూ, తీయని వాచకంతో సభను నిర్వహించిన తీరు అందరి ప్రసంశలనూ అందుకుంది. గుండ్లపల్లి వారు కూడా తనదైన శైలిలో సభను అద్భుతంగా నడిపించారు.

ఇక అర్ధ శతంపై మరిద్దరు కవికోకిలలు గానించిన అన్ని కవితలూ అమృత గుళికలే! ఎవరిని ఉటంకించనూ? ఎవరిని విస్మరించనూ? ఉగాది అంటే కోకిల గానాలూ, మావిరెమ్మలూ, వేప పూతలూ, షడ్రుచులే కదా !

అందులో కొన్ని:-

మొదటిగా నాళేశ్వరం శంకరంగారి కవితాగానంలో, పాలడుగు వారు ఉగాదిని స్వాగతిస్తూ చేసిన పద్య గానంలో భావం, భాష అత్యుత్తమం. తదుపరి గీతామాధవి గారు" తెల్లారి నిద్ర లేవగానే కిటికీ తెరుచుకుంటుంది/ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్  అంతరిక్ష గవాక్షంలో నిలిచి పోతున్నా/కిటికీలు లేని ప్రపంచం ఉంటే ఎంత బావుణ్ణు" అంటూ భావుకతను గుప్పిస్తూ ఆమె మరోప్రపంచాన్ని ఆశించిన తీరు అద్భుతం. కందుకూరి శ్రీరాములు గారు "పుట్టుకతోనే క్రోధి అంటూ" ఉగాదిని ఆహ్వానించిన వైనం శ్రోతలను ఆకట్టుకుంది. నీహారిణి "తలపులకు తలుపులుండవు కదా క్రొత్త కోయిలను ఆహ్వానిద్దాం" అన్నారు. తల్లాప్రగడ రావుగారు శ్రీరాముని స్తుతిస్తూ అద్భుతంగా గజల్ గానం చేశారు.ఇక వసీరా గారి కవితలు పనసతొనలే. వేపచెట్టు లోని ప్రాకృతిక మార్పులను వచిస్తూ "నా జోలిలో అన్ని కవితలు పోసి వెళ్ళింది వేపచెట్టు" అంటూ ముగించారు. సాధనాల వెంకటస్వామి నాయుడు గారు "కరెంటు కోతలను మోసుకొచ్చి దోమలను మాపై తరుముతావెందుకు ఉగాదీ" అంటూ హాస్యస్ఫోరకమైన కవిత అందరినీ అలరించింది.

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు సహజ కవి. అలతి పదాలతో,కొండంత భావుకతో "నా గుప్పెట్లో రహస్యాలు లేవు" అంటూ గంభీర స్వరంతో గానించారు. తదుపరి మధు ప్రఖ్యాగారు "నిశ్శబ్దం మాట్లాడుతుంది" అని చదివిన కవిత ఒక స్వరఝరి. హిమాలయం పైనుండి జాలువారిన గంగా జలపాతం.! శ్యామసుందర్ గారు "పేరులో ఏముంది? ఎందరు శాంతలు గయ్యాళిలు కారు? అందరూ రాముళ్ళూ ఒకేలా ఉన్నారా" అంటూ క్రోధి అనగానే భయం అవసరంలేదు అంటూ అభయం యిచ్చారు. అరుణ కోదాటి గారు రామునిపై చక్కని జానపద పాట పాడారు. ప్రసాదరావు రామాయణం "అట్టడుగు మనిషిలో గూడుకట్టిన నైరాశ్యం అసహనమై, అంగారమై ఈ సామాజిక రాజకీయ వ్యవస్థలపైతిరుగుబాటును కోరుకుంటున్నారు" అంటూ అగ్నిని కురిపించారు.

సాయి జ్యోతిగారు "కారాదు మాతృభాష మృతభాష" అంటూ తల్లిభాషపై వారి మక్కువను చూపారు. మందా వీరాస్వామి గారు "వృద్దాప్యంలోని బాధలను వివరిస్తూ నాలాంటి వారికి కొన్ని సూచనలు కూడా చేశారు." ప్రభాకర్ గారు యువత ఎలా చెడిపోతూందో తన కవితలో వివరిస్తూ "గంజాయి వనంలో అడుగిడితే తులసీవనం ఎండిపోదా?" అని ఆలోచనా స్ఫోరకంగా అన్నారు. బాలాజీ గారు చెట్టుయొక్క ప్రాధాన్యతను తన కవితలో అందంగా చెప్పారు. కాదు శ్రావ్యంగా పాడారు.

ఈ సభలో నాళేశ్వరం శంకరం, డా||కె.గీతామాధవి, కందుకూరి శ్రీరాములు, నీహారిణి కొండపల్లి, తాటిపర్తి బాలకృష్ణారెడ్డి, వసీరా, రావు తల్లాప్రగడ, పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, సాధనాల వెంకటస్వామి నాయుడు, స్వాతి ఆచంట, సుమలత మాజేటి, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, శ్యామ్ సుందర్ పుల్లెల, భవాని ముప్పల, సంధ్యారాణి కొండబత్తిని, ఘంటా మనోహరరెడ్డి, కిలపర్తి దాలినాయుడు, దేవులపల్లి పద్మజ, సునీత పోతూరి, రామక్రిష్ణ చంద్రమౌళి, రాధా కుసుమ, మోటూరి నారాయణరావు, అవధానం అమృతవల్లి, కోదాటి అరుణ, లింగుంట్ల వెంకటేశ్వర్లు, వీరరాఘవులు చిట్టాబత్తిన, సావిత్రి రంజోల్కర్, ఎం ఎన్ బృందా, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, రామాయణం ప్రసాదరావు, గౌరీపతి శాస్త్రి కె వి జి ఎస్, కందెపి రాణిప్రసాద్, గంటి జానకి, యు వి రత్నం, నాగేంద్రమ్మ పరుచూరి, బంతికట్ల నాగేశ్వరరెడ్డి, చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి, రాము లగిశెట్టి, పద్మశ్రీ చెన్నోజ్వల, దేవి గాయత్రి, శ్యామరాధిక, మేడిసెట్టి యోగేశ్వరరావు, సాయి జ్యోతి, ఉష భాస్కర్, మంద వీరాస్వామి, నాయకంటి నరసింహశర్మ, వేము వందనం, మండికరి బాలాజీ, మన్నె లలిత, అరుణకుమారి మందపాక, ఆలపాటిగారి అమ్మాయి, రావినూతల జగదీశ్వరి, సత్యవీణ ముండ్రేటి, మల్కని విజయలక్ష్మి, ధనమ్మ పి, గుర్రం మల్లేశం, పొడిచేటి పద్మావతి, జె వి కుమార్, అర్వా రవీంద్రబాబు, రమాదేవి సరికొండ, గంటి జానకి, సావిత్రి ఎ, వైరాగ్యం ప్రభాకర్, ప్రభాకరరావు కె వి, రత్నలక్ష్మి. ఎస్, ఉమామహేశ్వరరావు భోగెల, కృష్ణ దాస్ మొ.న కవులు పాల్గొని కవితాగానం చేసారు. ఇంకా సుభాష్ పెద్దు గారు, ప్రసాద్ నల్లమోతు గారు మొ.న సాహిత్యాభిలాషులు ఎందరో సభకు హాజరయ్యారు.

చివరగా గీతగారి మలిపలుకులతో సభ విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో అమెరికా, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యాభిలాషులు , సాహిత్యకారులు అనేకులు ఆసక్తిగా పాల్గొన్నారు.

అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

https://sirimalle.com/vikshanam-140/

https://www.koumudi.net/Monthly/2024/may/may_2024_vyAsakoumudi_vikshanam.pdf

Tuesday, 9 April 2024

వీక్షణం-139 వ సాహితీ సమావేశం

 వీక్షణం-139 వ సాహితీ సమావేశం

-- పిళ్ళా వెంకట రమణమూర్తి --
vikshanam-139

వీక్షణం సాహితీ గవాక్షం 139వ అంతర్జాల సమావేశం తేదీ మార్చి14న ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో వీక్షణం వ్యవస్థాపకులు డా.గీతామాధవి గారు స్వాగత వచనాలు పలికి, ఈనాటి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆచార్య సి.హెచ్. సుశీలమ్మ గారిని పరిచయం చేసారు. వీరు 'నెచ్చెలి' మాస పత్రిక లో, ఆ'పాత'మధురాలు అనే శీర్షికను నిర్వహిస్తున్నారని, ఇవేళ 'అలనాటి రచయిత్రుల అభ్యుదయ భావాల కథలు' అనే అంశమ్మీద ప్రసంగించబోతున్నారని తెలియజేసారు. ఈ సమావేశానికి నిర్వహణ బాధ్యత వహించిన శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారు ఆత్మీయ వచనాలు పలికి, ముఖ్య వక్తను ప్రసంగం చేయమని ఆహ్వానించారు.

ప్రొ. సి.హెచ్. సుశీలమ్మ గారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనల పై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు. విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో “కవిసంధ్య” (శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు. అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష (పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు 'ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు. స్తీవాదం – పురుష రచయితలు, కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర, విమర్శనాలోకనం (విమర్శ వ్యాసాలు), విమర్శ వీక్షణం (విమర్శ వ్యాసాలు) మొ.న రచనలు చేసారు.

ఆచార్య సుశీలమ్మ గారు ప్రసంగిస్తూ స్వాతంత్ర్య సమర ఉద్యమాల సందర్భంగా పురుషులు కారాగారాలకు వెళ్తే, స్త్రీలు నిస్పృహ చెందకుండా కథల ద్వారా సాటి స్త్రీలకు చైతన్యం కలిగించే ప్రయత్నం చేసారని, స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు కౌటుంబిక వ్యవస్థలో స్త్రీ పాటించవలసిన ప్రముఖ పాత్రను కూడా తెలిపారని చెబుతూ, ఈ సందర్భంగా స్త్రీ రచయిత్రుల కథా కధనాలు ప్రస్తావిస్తూ, 1874 లో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించిన 'బండారు అచ్చమాంబ గారు' 1901 వ సంవత్సరంలో ప్రథమ అభ్యుదయ భావాల కథల సృష్టి కర్తగా గుర్తింపు పొందారని, వారి 'ధనత్రయోదశి' తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటి కథగా గుర్తింపు పొందిందని ఉటంకిస్తూ, అలనాటి కథ అంటే 1901 నుంచి కథారచయితలు బందరులో మహిళా సమాజ స్థాపన చేసి స్త్రీ విద్య ఆవశ్యకత గురించి కృషి చేసారని, భారతదేశానికి స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, కుటుంబంలో స్త్రీ స్వాతంత్ర్యం అంత అవసరం అని తెలిపారు. ఈ సందర్భంగా 1902లో అచ్చమాంబ గారి రచనయైన 'దంపతుల కలహం' అనే కథను సోదాహరణంగా వివరించారు. తరువాత 1892లో నెల్లూరు జిల్లాలో జన్మించిన 'పునకా కనకమ్మ గారు'  జాతి వివక్షత లేని బాలికా పాఠశాలను కస్తూర్బాయి పేరిట స్థాపించిన అభ్యుదయ భావాలు గల రచయిత్రుల కోవకు చెందుతారని, వీరు 'జమీన్ రైతు' అనే దినపత్రిక స్థాపించారని, అంతే కాకుండా 'నేను అభాగ్యుడిని', మరియు 'ఉరి' అనే శీర్షికతో రెండు కథలు వ్రాసారని తెలిపారు.

1931లో స్త్రీ హితైషిణీ మండలి స్థాపించిన కనపత్రి లక్ష్మి గారు కుటీర లక్ష్మి (రామలక్ష్మి) అనే స్త్రీ అభ్యుదయ భావాలను వ్యక్తం చేసే కథను సోదాహరణంగా వివరించారు. దుర్గా బాయ్ దేశ్ ముఖ్ గా ప్రసిద్ధి చెందిన గుమ్మిడిదల దుర్గాబాయ్ 1929లో (బాల వితంతు శారదాంబ ఆత్మ కథ) ను 'నేను ధన్యనైతిని' అనే శీర్షికతో కథను వివరించారు.

ప్రథమ దళిత వాద కథా రచయిత్రిగా గుర్తింపు పొందిన పులవర్తి కమలావతి గారి రచన 'మాదిగ' (1931 జూన్ మాసంలో వాసవి అనే పత్రికలో) ప్రచురితమై ఆనాటి కాలంలో దురాచారంగా ఉన్న అంటరానితనం కు బాసటగా నిలిచిన కథగా అభివర్ణించారు. అలాగే సి. హెచ్. రమణమ్మ గారు వర్గపోరాటం అనే అంశంపై వ్రాసిన 'ఆదర్శ ప్రాయురాలు- కమల'  పురుషాహంకారులకు కనువిప్పు కలిగేలా చేసిందని తెలిపారు.ఎల్లాప్రగడ సీతాకుమారి 'కులమా - ప్రేమా' అనే కథను, ఆచంట శారదాదేవి గారి *ఈ ఒక్కరోజు* అనే కథను, కూడా ప్రస్తావించారు. చివరగా గుడిపాటి వెంకటాచలం గారి తమ్ముని భార్య అయిన కొమ్మూరి పద్మావతి గారి 'శోభ' అనే కథను వివరించి తన పరిశోధనలో ఇప్పటికే 14 మంది అలనాటి అభ్యుదయ రచయిత్రులు వారు వ్రాసిన కథలు సేకరించి నెచ్చెలి మాస పత్రిక ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ముగించారు.

అనంతరం వీరి ఉపన్యాసం పై డా.గీతామాధవి గారు, డా నీహారిణి గారు, వసుధారాణి గారు, గాడేపల్లి మల్లికార్జునుడు గారు, అవధానం అమృతవల్లి గారు తమ స్పందనను తెలిపారు. తదుపరి డా.మామిళ్ళ లోకనాధం గారి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. మొదటగా డా గీతా మాధవి గారు లోకనాధం గారిని సభకు పరిచయం చేసారు.

ఈ కవి సమ్మేళనంలో వసుధారాణిగారు రెండు లఘు కవితలు చదువగా, డా. నీహారిణీ గారి కాలబింబం అనే కవిత, డా.కె.గీతామాధవి గారి కుట్ర అనే కవిత,గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారి నవశకం పిలుస్తోంది అనే కవిత, వసీరా గారి ప్రేమ సాగరసంగీతం కవిత, మేడిశెట్టియోగేశ్వరరావు గారి నీడలు మొలిచేచోట కవిత, సాధనాల వెంకట స్వామి నాయుడు గారి గాలిలో దీపం కవిత, ఉప్పలపాటి వెంకట రత్నం గారి తలవంచుకునే అనే కవిత, సూరి రాధిక గారి అసూర్య పశ్యను అనే కవిత, రామాయణం ప్రసాదరావు గారి మహా కవయిత్రి అనే కవిత సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కవి సమ్మేళనంలో డా. నీహారిణి కొండపల్లి, కందుకూరి శ్రీరాములు, వసీరా, డాక్టర్ కె.గీతామాధవి, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, రామాయణం ప్రసాదరావు, రాము లగిశెట్టి, శ్యామరాధిక, పద్మశ్రీ చెన్నోజ్వల, డాక్టర్ దేవులపల్లి పద్మజ, మోటూరి నారాయణ రావు, అవధానం అమృతవల్లి, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, పిళ్ళా వెంకట రమణమూర్తి, మేడిశెట్టి యోగేశ్వరరావు, గౌరీపతి శాస్త్రి కె. వి. ఎస్, లింగుట్ల వెంకటేశ్వర్లు, ఉప్పలపాటి వెంకటరత్నం, డాక్టర్ కోదాటి అరుణ, వీరరాఘవులు చిట్టాబత్తిన, దేవి గాయత్రి, బొమ్మిరెడ్డి వినోదరెడ్డి, డాక్టర్ వేము వందనం, బొమ్మిరెడ్డి వినోద్ రెడ్డి, నాగేంద్రమ్మ పరుచూరి, నాళం నరసమ్మ, మాసుంబి, సిరివరపు అన్నపూర్ణ, గాడేపల్లి మల్లికార్జునుడు, గంగారపు గోవిందరావు, మల్లాప్రగడ రామకృష్ణ, పానుగంటి శ్రీనివాస్ రెడ్డి మొ.న వారు సుమారు 32మంది కవిశ్రేష్ఠులు పాల్గొని కవి సమ్మేళనాన్ని సుసంపన్నం చేసారు. ఈ సందర్భంగా గత ఫిబ్రవరి 2024 వీక్షణం కవితా పురస్కార గ్రహీతగా డా.మామిళ్ళ లోకనాధం గారి పద్య శీర్షిక 'తెలుగు భాష-వెలుగు దివ్య తేజ' కి లభించింది అని తెలిపి, అనంతరం ముఖ్యవక్తగా విచ్చేసిన ఆచార్య సుశీలమ్మ గారికి, కవి సమ్మేళనం లో పాల్గొన్న కవిమిత్రులకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో చేసిన వందన సమర్పణానంతరం సభ ముగిసింది. ఈ సమావేశంలో అమెరికాతో బాటూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యాభిలాషులు అనేకులు ఆసక్తిగా పాల్గొన్నారు.

ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-139/

https://www.koumudi.net/Monthly/2024/april/april_2024_vyAsakoumudi_vikshanam.pdf